Tuesday, March 13, 2012

రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్య వాట ఎంత?

సూర్య దినపత్రిక మార్చి 14,2012

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ 2012-13 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ఉద్యుక్తులవుతున్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు, బడా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాల ఒత్తిళ్ళ మధ్య బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుందనడం జగమెరిగిన సత్యం. సంపన్నులకు రాయితీ లివ్వడంలో చూపే శ్రద్ధ దేశ సమగ్రాభివృద్ధికి, మానవనరుల అభివృద్ధికి ఉపకరించే విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం వగైరా పద్దులకు నిథుల కేటాయింపులపై కనబరచడం లేదు. విద్య మార్కెట్‌ సరకుగా మారిపోయాయి. దిగువ మధ్య తరగతి, పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండా పోయింది. 2010 విద్యారంగాన్ని మరింత లాభసాటి వ్యాపారానికి అనువైన రంగంగా మార్చివేస్తున్నారు. విద్య ఒక ప్రత్యేక సౌకర్యంగా కాక ఒక ప్రాథమిక హక్కుగా అందరికీ అందించాల్సిన రాజ్యాంగ బద్దమైన, సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

కాని నిథుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నది. పాఠశాల గడప తొక్కిన విద్యార్థుల్లో 15 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యావకాశాలను అందుకోగలుగుతున్నారు. విద్యపై భారత్‌- అమెరికాల మధ్య జరిగిన దౌత్యపర సమ్మేళనం అనంతర పరిణామాలను గమనిస్తే, విద్యా వ్యవస్థను మరింత భ్రష్ఠు పట్టించే వైపే కేంద్ర ప్రభుత్వం ప్రయాణిస్తున్నదన్న విషయం రూఢి అవుతున్నది. రానున్న దశాబ్ద కాలంలో దాదాపు వెయ్యి విదేశీ విశ్వవిద్యాలయాలను, యాబై వేలకు పైగా కళాశాలలను మన దేశంలో నెలకొల్పుకోవడానికి అనుమతించబోతున్నట్లు వస్తున్న వార్తలు తీవ్రఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దుష్పరిణామం మన విద్యా రంగానికి అత్యంత ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది . ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ముసుగులో విద్యారంగాన్ని గంప గుత్తగా ప్రయివేటీకరించే దురాలోచనతో ప్రభుత్వం ప్రయాణాన్ని సాగిస్తున్నది.

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఐ.సి.హెచ్‌.ఆర్‌., ఐ.సి.యస్‌.ఆర్‌. తదితర ప్రభుత్వ సంస్థల నిథులతో, మౌలిక సదుపాయాలతో, ఉచితంగా లేదా నామమాత్ర ధరలకు వందల ఎకరాల భూములను సమకూర్చిన విద్యా సంస్థలను ఈరంగంలో మాఫియాలుగా ఆవిర్భవించిన దుష్ట శక్తులకు పథకం ప్రకారం ధారాదత్తం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్లు కనబడుతున్నది.18 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ప్రాథమిక హక్కుగా నిర్బంధ- ఉచిత విద్యను ప్రభుత్వం విధిగా అందించాలి. శాస్త్ర, సాంకేతిక విద్య- నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. దాన్ని సాఫల్యం చేసే దృష్టితో వార్షిక బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండాలి.18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 1.46 కోట్ల మంది యువతీ యువకులు ప్రస్తుతం దేశ వ్యాపితంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విద్యనార్జిస్తున్నారు. మన దేశ అవసరాలకు అనుగుణంగా వివిధ రంగాలకు కావలసిన విద్యాధిక నిపుణులను ఈ ఉన్నత విద్యా సంస్థల నుండే సముపార్జించుకోవాలి .

గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థల నాణ్యత క్షీణిస్తూవస్తున్నది. దీనికి నిథుల లేమి ఒక ముఖ్యమైన కారణం. పర్యవసానంగా ఈ కళాశాలల నుండి డిగ్రీ , పోస్టు గ్రాడ్యువేట్‌ పట్టభద్రులై వస్తున్న యువతలో నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమతున్నది. అలాగే కొత్తగా బి.ఇ./ బి.టెక్‌., యం.బి.ఎ. వగైరా పట్టబద్రులైన వారిని ఉద్యోగాల్లో నియమించుకొన్న సంస్థలు అధిక మొత్తంలో నిథులు వెచ్చించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, తమకు కావలసిన రీతిలో తీర్చిదిద్దుకొంటున్నాయి. పట్టభద్రులవుతున్న యువతలో 20-25 శాతానికి మించి ఉపాథి లభించడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అదనంగా కోటి మందికి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించాలన్న లక్ష్యాన్ని వ్యూహ పత్రాల్లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా మౌలిక వసతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామకం జరగాలి. తదనుగుణంగా నిథుల కేటాయింపు పెంచాలి.

స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో 6 శాతం నిథులను విద్యా రంగానికి కేటాయిస్తామని యు.పి.ఎ-2 ప్రభుత్వం చేసిన వాగ్దానం, వాగ్దానంగానే మిగిలిపోయింది. మొత్తం విద్యా రంగానికి 3 శాతానికి మించి నిథులు మంజూరు చేయడం లేదు. అందులో ఉన్నత విద్యపై 1.12 శాతం నిథులు వెచ్చిస్తున్నారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పైనాన్స్‌ బ్యాంకు (యన్‌.ఇ.ఎఫ్‌.బి.) ను నెలకొల్పి తక్కువ వడ్డీతో విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించినా ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. అధిక వడ్డీ రేటు, కఠిన నిబంధనల కారణంగా అర్హులైన విద్యార్థులు రుణాలు పొందలేక పోతున్నారు. ప్రస్తుతం 1.5 శాతం మంది మాత్రమే రుణాలు తీసుకొని, ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పూర్వరంగంలో రానున్న బడ్జెట్లో కేటాయింపులపై ఆధారపడి ఉన్నత విద్యారంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

మన రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు, కళాశాలల ఆర్థిక పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీత భత్యాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలో 32 విశ్వవిద్యాలయాలుంటే, వాటిలో 15 విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుండి సహాయం పొందే అర్హత లభించ లేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపైనే అవి ఆర్థికంగా ఆధారపడి మనుగడ సాగించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిరాదరణతో అవఇభివృద్ధికి నోచుకోవడం లేదు. మరొకవైపు యు.జి.సి. సహాయం అందుకొంటున్న ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలూ నిథుల కొరతతో సంక్షోభంలో కొట్టుమిట్టాడ్డుతున్నాయి.ఇదే తరహాలో దేశవ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాల యాలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఆర్థిక వనరుల లేమితో కునారిల్లిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 44 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 285 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వంద దాకా స్వయం ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఇవిగాక 107 ప్రయివేటు విశ్వ విద్యాలయాలున్నాయి. 16,000కు పైగా కళాశాలలున్నాయి. విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థలోకి అడుగిడుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆ బాధ్యతను గుర్తెరిగి కేంద్ర బడ్జెట్లో నిథుల కేటాయింపు జరపాలి.

Tuesday, March 6, 2012

నడిబజారులో ‘నవరత్నాలు’

సూర్య దినపత్రిక, మార్చి ౭,2012

- మార్కెట్‌ విధానాలతో ముప్పు
- ఉపసంహరణలతో కోట్ల రాబడి
- ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం
- కళ తప్పిన మహా రత్న, నవ రత్నాలు
- స్వావలంబన పునాదులపై వేటు
- ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక పీఎస్‌సీలే
- ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణే కర్తవ్యం


మిశ్రమ ఆర్థిక విధానాలకు చెల్లుచీటీ రాసేసి, మార్కెట్‌ ఆర్థిక విధానాలకు దాసోహం పలికిన కేంద్ర ప్రభుత్వం, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వరంగ సంస్థలను నడి బజారులో వేలంవేసి అమ్మకానికి పెట్టింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2010-11లో రు. 22,500 కోట్లు ఆర్జించి ఖజానా నింపుకొన్నది. 2011-12లో రు.40,000 కోట్లు పోగేసుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం అన్ని అడ్డదారులూ తొక్కుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలలోని ప్రభుత్వ వాటాలను ఆయా ప్రభుత్వ రంగ సంస్థలే తిరిగి కొనుగోలు చేసే (బైబ్యాక్‌) విధానానికి, ప్రభుత్వ రంగంలోని ఆర్థిక సంస్థలు ప్రభుత్వ షేర్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వకమిటీ- కేంద్ర మంత్రివర్గం తాజాగా అమోదముద్ర వేసింది.

దేశ ఆర్థిక, పారిశ్రామిక, సామాజికాభివృద్ధిలో ప్రభుత్వరంగ సంస్థలు ముఖ్య భూమిక పోషించాయి, పోషిస్తున్నాయి. జాతి సంపదను పెంపొందించడానికి, సామాజిక, అర్థిక అసమానతలను తొలగించడానికి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఉఫాథి కల్పన తదితర బహుముఖ లక్ష్యాలతో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ- సహకార రంగాలలో పరిశ్రమలను, సంస్థలను నెలకొల్పి ప్రోత్సహించింది. ఒకనాడు వ్యవసాయం తరువాత పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యతఇచ్చి వార్షిక బడ్జెట్లలో నిథుల కేటాయింపు చేసేవారు.

స్వాతంత్య్రానంతరం మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలు ప్రభుత్వరంగ సంస్థలకు అగ్రపీఠం వేశారు. 1980 దశకం వరకు ఈ ఒరవడి కొనసాగింది. వలస దోపిడీలో మగ్గిపోయిన మన దేశ ఆర్థిక స్వావలంబనకు బలమైన పునాదులు వేసి పారిశ్రామికాభివృద్ధిలో, సంపదను సృష్టించడంలో అగ్రభాగాన నిలబడ్డాయి. 1990 దశకం ప్రారంభం నుండి సరళీకృత ఆర్థిక విధానాల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు.

ప్రభుత్వ రంగానికి గర్వకారణమైన మహారత్నాలు, నవరత్నాలు ఆయా రంగాలలోని అంతర్జాతీయ సంస్థలకు దీటుగా పోటీ పడుతున్నాయి. 1951 నాటికి కేవలం రూ. 30 కోట్ల పెట్టుబడులతో ఐదు సంస్థలుంటే నేడు 249 ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి వాటి ఆస్తుల నికర విలువ రూ. 6,60,245 కోట్లుగా అంచనా వేశారు. 12.42 శాతం వృద్ధి రేటుతో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ( జి.డి.పి.) పెరుగుదలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయి.

ఎక్సజ్‌ డ్యూటి, కస్టమ్స్‌ డూటి, కార్పొరేట్‌ ట్యాక్స్‌, ఆదాయపు పన్ను, రుణాలపై వడ్డీలు, పెట్టుబడులపై డివిడెండ్లు- ఇతర పన్నుల రూపేణా 2009-10లో రూ. 1,39,830 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు రూ.1,08,435 కోట్ల నికరలాభాలు గడించాయి. దాదాపు రూ.35,000 కోట్లు డివిడెండ్లు ప్రకటించాయి. అది చాలదన్నట్లు లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని వార్తలొస్తున్నాయి. రూ. 77,745 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టాయి.

నగదు నిల్వలు, మిగులు రు.6,05,648 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంస్కరణల అమలు ప్రారంభం నాటికి 23,00,000 మంది కార్మికులు, ఉద్యోగులుంటే ఆ సంఖ్య 2009-10కి 14,91,000 కుదించుకుపోయింది. ఒక వైపు పర్మినెంట్‌ వర్కర్ల సంఖ్యను తగ్గిస్తూ మరొకవైపు కాంట్రాక్ట్‌ వర్కర్లను నియమించుకొంటున్నారు. వారికి కనీస వేతనాలు గాని, సామాజిక భద్రత గానీ కల్పించకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు.

జాతికి గర్వకారణంగా నిలిచి , ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న బంగారు గుడ్లు పెట్టే బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలనే దుర్నీతిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ విధానం దేశ ఆర్థిక స్వావలంబనకే గొడ్డలి పెట్టు. మహారత్న, నవరత్నాలుగా పిలిచే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల ఇప్పటికే ప్రభుత్వ వాటాలు గణనీయంగా తగ్గిపోయాయి. హెచ్‌.పి.సి.యల్‌. లో 51.11, బి.పి.సి. యల్‌. లో 54.93, గెల్‌ లో 57.34 , బి.హెచ్‌.ఇ.యల్‌. లో 67.72 , ఒ.యన్‌.జి.సి.లో 69.14 , బెల్‌ లో 75.86 , ఐ.ఒ.సి . లో 78.92 , యన్‌.టి.పి.సి.లో 84.5, సెయిల్‌ లో 85.82, కోల్‌ ఇండియాలో 90 శాతాలకు తగ్గిపోయాయి.

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ , పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ , యన్‌.టి.పి.సి. లిమిటెడ్‌ , ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, నేషనల్‌ మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ , సట్లజ్‌ జల్‌ విద్యుత్‌ నిగం, ఈ.ఐ.యల్‌., యన్‌.యం.డి.సి. వగైరా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 22,500 కోట్లు సేకరించుకొన్న కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓ.యన్‌ .జి.సి., సెయిల్‌, పి.ఎఫ్‌.సి., ఐ. ఒ.సి., యం.యం.టి.సి., ఆర్‌.ఐ.యం.యల్‌., యన్‌.బి.సి. సి., హిందుస్తాన్‌ కాపర్‌, బి.హెచ్‌.ఇ.యల్‌., హెచ్‌.ఎ.యల్‌. తదితర సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతంచేసి తద్వారా రూ.40,000 కోట్ల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రమంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఏడాది పొడవునా మార్కెట్‌ అననుకూలంగా ఉండడంతో ఇప్పటి వరకు రూ.1,145 కోట్లు మాత్రమే సేకరించుకోగలిగింది .

ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నది. అందులో భాగంగా నగదు నిలలున్న ప్రభుత్వరంగ సంస్థలను, ఆర్థిక సంస్థలను రంగ ప్రవేశం చేయించి, ప్రభుత్వ షేర్లను వాటికి అమ్మి సొమ్ము చేసుకోవాలన్న కార్యాచరణను అమలు చేసింది. ఒ.యన్‌.జి.సి.లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా షేర్లను బహిరంగ వేలం వేసి, యల్‌.ఐ.సి.ని 95 శాతం షేర్లను కొనుగోలు చేసేలా పథకం ప్రకారం ఒత్తిడి చేసి రూ.12,500 కోట్లు రాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖజానా నింపుకొంటున్నది.

ప్రభుత్వ రంగ సంస్థలు తమవద్ద ఉన్న నగదు నిల్వలు, మిగులును ఆయా సంస్థల విస్తరణకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు పెట్టి వాటిని గాడిలోకెక్కించి, అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాలకు వెచ్చించమని ప్రోత్సహించడానికి బదులు, ఆ నిథులను ఖజానాకు ఎలా మళ్ళించుకోవాలని ఆలోచించడం జాతి ప్రయోజనాలకు హానికరం.

కోట్లాది ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ, మదుపుదార్లకు సామాజిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వ రంగంలోని ఆర్థిక సంస్థ యల్‌.ఐ.సి.ని బలోపేతం చేసి సమాజానికి మరింత మేలైన సేవలందించేలా ప్రోత్సహించడానికి బదులు, ఆ సంస్థను పావుగా వాడుకోవడం తీవ్ర అభ్యంతరకరం.దేశ ఆర్థికాభివృద్ధిలో, సామాజికాభివృద్ధిలో ఛోదక శక్తిలా పని చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి. వాటిని పరిరక్షించుకోవడం దేశభక్తులందరి కర్తవ్యం.