సూర్యా దినపత్రిక , ఏప్రిల్ ౧౯ ,2012
- హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు
- సామాజిక న్యాయానిి మొదటి మెట్టు విద్యే
- విద్యా హక్కును 10+2 వరకూ విస్తరించాలి
- ప్రభుత్వ విద్యారంగాన్నీ పటిష్ఠ పరచాలి
- జీడీపీలో 6 శాతం కేటాయింపు అవసరం
విద్యా హక్కు చట్టంపై, దాని అమలుపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి సహాయం పొందనప్పటికీ ప్రైవేటు రంగంలో నిర్వహిస్తున్న మైనారిటీయేతర పాఠశాలలలో వెనుకబడ్డ కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లను చట్టం ప్రకారం విధిగా కేటాయించాల్సిందే అన్న సుప్రీం కోర్టు తీర్పు పిల్లల హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు మాత్రమే. అయితే దీని అమలు విషయమే అనుమానాలు రేకెత్తిస్తోంది. పౌరులందరూ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని పొందడానికి ఉపకరించే శక్తివంతమైన సాధనం విద్య. విద్యను ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరచడానికే స్వాతంకత్య్రానంతరం అరవై ఏండ్లకు పైగా సమయం పట్టింది. ‘విద్య ప్రత్యేక సౌకర్యం కాదు, ప్రాథమిక హక్కు’ అనే నినాదంతో విద్యార్థి సంఘాలు, మేథావులు, పలు సంస్థలు దశాబ్దాలుగా వివిధ రూపాలలో చేసిన అలుపెరగని ఉద్యమాల ఫలితం. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పాక్షికంగా ఆమోదించడం వల్ల ‘విద్యా హక్కు చట్టం- 2009’ ఆవిష్కృతమైంది. 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది.
ప్రస్తుతం 6-14 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణ స్పష్టం చేస్తున్నది. 1- 8వ తరగతి వరకు మాత్రమే చట్టాన్ని పరిమితం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ అంటే ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించి మరీ చేర్చుకొంటున్నాయి. అలాంటి పాఠశాలల్లో పేద విద్యార్థులు నేరుగా 1వ తరగతిలో ప్రవేశించి నెగ్గుకురాగలరా? అలాగే రాజ్యాంగం మేరకు 18 సంవత్సరాల వయస్సు లోపు వారిని పిల్లలుగానే పరిగణిస్తున్నారు. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి ఎదుగుదల, అభివృద్ధి పట్ల సామాజిక బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలంటే కనీసం 10+2 విద్య కల్పించే వరకైనా ఈ హక్కును విస్తరించాలి. పన్నెండు సంవత్సరాల పాటు విద్య పిల్లల హక్కుగా అంతర్జాతీయ సమాజమే గుర్తించింది. ఆ పరిపూర్ణమైన దృష్టితో చట్టాన్ని రూపొందించ కుండా లోపభూయిష్టంగా తీసుకొచ్చారు. అమలు పట్ల కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. పర్యవసానంగా విద్య ఆచరణలో అందని ద్రాక్ష పండు లాగే అందరికీ అందుబాటులోకి రాలేదు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు బలైన రంగాలలో విద్యా రంగం మొదటి. ఒకనాడు ప్రభుత్వంతో పాటు ట్రస్టులు, సొసైటీలు అన్నింటికన్నా విద్యా దానం మిన్న అని భావించి విద్యా సంస్థలను నెలకొల్పి సామాజిక సేవలో అనిర్వచనీయమైన తృప్తి పొందేవి. అయితే ఆ చరిత్ర తిరగబడింది. విద్య అంగడి సరుకుగా మారిపోయింది. భారత రాజ్యాంగలోని 19(1) (జి) అధికరణ ప్రకారం ఏ వ్యాపారమైనా చేసేందుకు, నిర్వహించేందుకు పౌరులకు హక్కు ఏర్పడింది. దానిని ఉపయోగించుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘విద్యా హక్కు చట్టం’ అమలుకు తూట్లు పొడవాలని అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది.
అసలు మౌలికమై సమస్య- ‘రాజ్యాంగం లోని 19(1) (ఎ) నిబంధన ప్రకారం విద్యారంగాన్ని కూడా వ్యాపారరంగంగా భావించవచ్చా’ అన్న మౌలికమైన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉన్నది. పట్టణీకరణ పర్యవసానంగా జనాభాలో మూడో వంతుమంది పట్టణాలు, నగరాలలో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు విద్యా వ్యాపారుల నిలయాలుగా ఆవిర్భవించాయి. అధిక లాభాలకోసం భారీ పెట్టుబడులతో విద్యా సంస్థలను నెలకొల్పి వ్యాపారం చేస్తూ, ప్రైవేటు యాజమాన్యాలు సంపాదన బాగా రుచి మరిగాయి. సేవా భావంతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న వారు అసలే లేరని కాదుగానీ, అత్యధికులకు మాత్రం అది వ్యాపారమే.
పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ, ఆ బాధ్యతనుంచి తప్పించుకొనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ 80 శాతం ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ అవి మౌలిక వసతులు కరువై కునారిల్లి పోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో 27 శాతం మంది మాత్రమే విద్యనార్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలే శరణ్యం. 84 శాతం మంది పిల్లలు వాటిలోనే విద్యనార్జిస్తున్నారు. నాణ్యమైన విద్యను పౌరులందరికీ అందించేందుకు 6 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారీ మిషన్ మొదలుకొని విద్యా రంగంపై నివేదికలు సమర్పించిన పలు కమిషన్లు సిఫారసు చేశాయి. యూపీఏ 1 ప్రభుత్వం తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చినా దానిని గాలికి వదిలేసింది.
ప్రస్తుతం దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతానికి అటు ఇటుగా నిథులను కేటాయిస్తున్నారు.
చట్టంలో పొందుపరచిన పరిమితమైన లక్ష్యాన్ని సాధించడానికి కూడా నిథుల లేమి ప్రధాన అవరోధంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఆదాయపు పన్ను , కార్పొరేషన్ పన్ను, సేవా పన్ను , ఎక్సజ్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ వగైరా అన్ని రకాల పన్నుల చెల్లింపులపై అదనంగా ప్రజల నుండి 2 శాతం ప్రాథమిక విద్యా సెస్‌ను ( + మరొక ఒక శాతం ఉన్నత విద్యా సెస్) వసూలు చేస్తున్నది. ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిన 2004-05 నుండి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో లక్ష కోట్లకు పైగా ఆదాయం ఈ పద్దు క్రింద ప్రభుత్వ ఖజానాకు చేరిందని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెస్ ద్వారా ఆర్జిస్తున్న మొత్తానికి అదనంగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది 30-35 శాతానికి మించి ఉండడం లేదు.
విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి నిథుల కేటాయింపు పెంచాలని, 2011-12లో రూ. 35,659 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన అనిల్ బోర్డియా కమిటీ సిఫార్సు చేసినా, కేటాయించింది రూ.21,000 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు భరించాల్సిన నిష్పత్తి సొమ్ము వెచ్చించక పోవడంతో ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 2012-13 బడ్జెట్ లో రూ.25,555 కోట్లు కేటాయించారు. దేశంలోని పిల్లలందరికీ ఉచిత విద్య అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు కపిల్ సిబాల్ చేతులెత్తేశారు. ప్రైవేటు రంగం భుజం మోపాలని కోరారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా ఈ పని చేయాలని, మిగిలిన ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏవైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని పాఠశాలలున్నాయో వాటికి బోధనా ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఇక్కడ మన రాష్ట్ర అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.
వృత్తి విద్యా కోర్సులు అధ్యయనం చేస్తున్న బీసీ, ఓబీసీ విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ పథకం అమలు తీరుతెన్నుల బాగోతం చూస్తూనే ఉన్నాం. ఈ పథకాన్ని నమ్ముకొని కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఫీజులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం బోధనా రుసుం రూపంలోనే కాదు, వివిధ రకాల పద్దుల కింద అధిక ఫీజులు వసూలు చేసుకొంటున్నాయి. ఫీజులను నియంత్రించే యంత్రాంగమే లేదు. వాటిని ప్రభుత్వం చెల్లించదు. పేద విద్యార్థి తల్లిదండ్రులకు వాటిని చెల్లించే స్తోమత ఉండదు. అంటే, అలాంటి విద్యా సంస్థ గుమ్మం తొక్కే అర్హతే పేద పిల్లలకు లేదన్న మాట. సంపాదనే ధ్యేయంగా విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలు ప్రభుత్వ మొర ఆలకిస్తాయా అన్నది ప్రశ్న. మరొకవైపు రెసిడెన్షియల్ పాఠశాలలకు చట్టం వర్తించదని తేల్చేశారు.
ప్రభుత్వాల ఒత్తిడికి తలవొగ్గి ప్రైవేటు రంగంలోని చిన్న, మధ్య తరహా పాఠశాలల యాజమాన్యాలు కొంత వరకు అమలు చేయవచ్చు. ఆ మేరకు ఆదాయంలో వచ్చే తరుగుదలను భర్తీ చేసుకోవడానికి మిగిలిన 75 శాతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లల నుండి వసూలు చేసే ఫీజులను పెంచే ప్రమాదం ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ పేద పిల్లలకు తమ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను కేటాయించి ఉచిత విద్యను అందించే గురుతరమైన సామాజిక బాధ్యతను విద్యా రంగంలో బలంగా వేళ్ళూనుకొన్న కార్పొరేట్ సంస్థలు, విస్తారంగా బ్రాంచీలను నెలకొల్పి రెండు చేతులా కోట్ల రూపాయల ధనార్జన చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాయనుకోవడం ఒక భ్రమ.
మన దేశంలో ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యా రంగం వరకు ప్రైవేటు విద్యా సంస్థలు తమ కబంధ హస్తాల్లో ఇరికించుకోవడానికి మార్కెట్ ఆర్థిక విధానాలు చక్కగా చేయూత నిచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఏసీ గదుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మౌలిక సదుపాయాలతో నిర్వహిస్తున్న ఉన్నత శ్రేణి పాఠశాలలని ప్రచార హోరుతో సంపన్న వర్గాలను ఆకర్షించి, ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న ఒక్కొక్క విద్యార్థినుండి నాలుగైదు లక్షల రూపాయలను వార్షిక ఫీజుగా గుంజుకొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల్ని డిల్లీ తదితర మెట్రో పాలిటన్ నగరాలలో నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్ళు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి.
ఉన్నత విద్యా ప్రమాణాలు, విలాసవంతమైన సౌకర్యాలు, క్రీడా సదుపాయాలు, పోషకాహారం, జాతీయ- అంతర్జాతీయ స్టడీ టూర్లు వగైరా మాయ మాటలు చెప్పి విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ఈ తరహా కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ప్రవేశం కల్పించి, ఉచిత విద్యను అందిస్తాయా? ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని తెరవెనుక సీట్లు అమ్ముకొని, నల్ల ధనాన్ని చేతులు మార్చుకొని, పేద పిల్లలకు ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించడంలో ఆరితేరారు. అదే తంతు ఈవాళ ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్య కోటా అడ్మిషన్స్‌లో జరుగుతున్నది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే బహిరంగ ప్రకటన విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించి, మార్కుల ప్రాతిపదికపై మెరిట్ లిస్టు తయారు చేసి, ఆ ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలి. కానీ అలా జరగడం లేదు. ఆ సీట్ల గురించి ఎవరైనా విచారిస్తే అయిపోయాయన్న సమాధానం వెంటనే వస్తుంది. సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకంగా నిథులను సమకూర్చుకోవచ్చని కపిల్ సిబాల్ సలహా కూడా ఇచ్చారు. ఈ పేరుతో రాబోయే రోజుల్లో వారికి మరికొన్ని రాయితీలు కల్పించి, ఆర్థిక ప్రయోజనం కల్పించే ఆలోచన ఉన్నట్లు బోధడుతున్నది .
ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు నిర్వహించిన వీధి బడుల్లో చదువుకొన్నవారమని పెద్దలు కొందరు గర్వకారణంగా చెబుతుంటారు. నిజమే, నాడు విద్యార్జనకు అవే కేంద్రాలు. కాలం మారింది. ప్రభుత్వాల విధానాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంత భావజాలం అందలమెక్కింది. ప్రతిదీ సరకుగా మారింది. విద్యకూ మినహాయింపు లేదు. వృత్తి విద్య, ఉన్నత విద్యే కాదు, ప్రాథమిక విద్య కూడా లాభార్జనే ధ్యేయంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల కబంద హస్తాల్లో చేరింది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కుప్పకూలి, మౌలిక సదుపాయాల లేమితో, నాసిరకం విద్యాబోధనకు నిలయాలుగా అపవాదును కూడగట్టుకొన్నాయి.
నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ఈ పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబడ్డ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు లేవని కాదు. కేవలం కార్పొరేట్, ప్రైవేటు రంగంలోని పాఠశాలల్లోనే నాణ్యతా ప్రమాణాలతో కూడుకొన్న విద్య లభిస్తుందన్నది పాక్షిక సత్యమే . కానీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతున్నది. ప్రభుత్వ లోపభూ యిష్ఠ విధానాలతో ఈ రంగం సహజ మరణం బాటలో ప్రయాణిస్తున్నది. విద్యా రంగంలో వివక్ష బలంగా వేళ్ళూనుకొన్నది. సంపన్నులు, మధ్య తరగతి, పేదలు వారివారి ఆర్థిక స్థితిగతులను బట్టి, అంటే కొనుగోలు శక్తి ఆధారంగా విద్యను పొందవచ్చు.
ఈ పరిస్థితి మారాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పటిష్ఠమైన కార్యచరణతో విద్యాహక్కుచట్టం అమలుకు అంకితభావంతో పూను కోవాలి. ప్రైవేటురంగంలోని పాఠశాలలపైనే ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశా లల వ్యవస్థను విస్తరించడం, జీడీపీలో 6 శాతం నిధులను కేటాయించి, మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యాప్రమాణాలను మెరుగు పరచి నాణ్యమైన విద్యను 10+2 వరకు అందించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి.