Tuesday, June 19, 2012

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల "కుక్కమూతి పిందెలు"


Published in June 2012 Janabalam Telugu Monthly                  
                                             
ఆర్థిక కుంభకోణాలు , అవినీతి , అడ్డగోలు దోపిడి , సహజ‌వనరులను కొల్లగొట్టి అక్రమ సంపాదనతో కొంత మంది అమాంతం కుబేరులై పోతున్నారు . ప్రపంచంలోని కుబేరుల(బిలియనేర్స్ ) జాబితాలోకెక్కుతున్న భారతీయుల పేర్లలను చూసుకొని మురిసిపోతున్నాము . 2012 మార్చి నాటికి ప్రపంచంలో 1,226 మంది అమెరికన్ డాలర్ బిలియనీర్స్ ఉంటే వారిలో 48 మంది భారతీయులున్నారు . వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 22.36 బిలియన్ డాలర్స్ నికరమైన ఆస్తుల విలువతో దేశంలో ప్రధమ స్థానాన్ని ఆక్రమిస్తే , లక్ష్మీ మిట్టల్ 20.7 బిలియన్ డాలర్స్ ఆస్తితో ద్వితీయ స్థానంలో నిలిచారని పోర్బ్స్ సంస్థ ప్రకటించింది . కుబేరులుగా ఆవిర్భవించిన‌ వారి వద్ద అంత పెద్ద ఎత్తున‌ సంపద ఎలా పోగుబడ్డదన్న హేతుబద్దమైన ఆలోచన చేసే చైతన్యం ప్రజల్లో కొరవడింది . ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరకుండా వ్యక్తుల బొక్కశాలల‌కు చేరిపోతున్నాయనడానికి ఇది ప్రబల నిదర్శనం .
దోపిడీకి మూలాలు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి . గడచిన రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల పునాదులపై నిర్మించబడుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ దుష్పలితాలు నేడు జాతియావత్తునూ కలచివేస్తున్నాయి . కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెలుగులోకి తెచ్చిన లక్షాడెబ్బయ్ ఐదు వేల కోట్ల రూపాయల టెలికమ్యూనికేషన్స్ కుంభకోణం , దానికంటే పెద్దదైయిన‌ బొగ్గు గనుల కుంభకోణం , మన రాష్ట్రంలో  సి.బి.ఐ. విచారణలో ఉన్న "మేలుకు ప్రతి మేలు ( క్విడ్ ప్రొ కో)" రూపంలో ఆర్జించిన‌ అక్రమాస్తుల కేసు వగైరా అన్నీ ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ కుక్క మూతి పిందెలే! వీటికి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో కారణభూతులైన‌ పాలకులు , సరళీకృత ఆర్థిక విధానాల జ‍పం చేస్తున్న ఆర్థిక వేత్తలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు . పైపెచ్చు అభివృద్ధికి సంస్కకరణలే సోపానమని ఊదరకొడుతున్నారు . తద్వారా మన ఆర్థిక వ్యవస్థను , ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు . మార్కెట్ ఆర్థిక విధానాల క్రీడలో "దొరికితే దొంగ , దొరకక పోతే దొర" అన్న నానుడిగా పాలన సాగుతున్నది . రాజ్యాధికారంలో ఉన్న పాలక పార్టీ నాయకులు , వారి కనుసన్నల్లో మెలిగే అధికారగణం , పెట్టుబడిదారులు ( పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు , కాంట్రాక్టర్లు వగైరా ) అపవిత్ర కలయికలతో దుష్ట కూటములుగా ఏర్పడి దేశం మీద పడి అడ్డగోలుగా జాతి సంపదను దోచేస్తున్నారు . ప్రజల ఉపాథిని గొడ్డలిపెట్టుకు గురిచేస్తున్నారు , అక్రమ సంపాదనతో త్వరితగతిన కుబేరులుగా ఆవిర్భవిస్తున్నారు .
ఆర్థిక‌ సంస్కరణల అమలులో ప్రయోగశాలగా మారిన మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తే అవినీతి పెచ్చుమీరి పోవడానికి మూలాలెక్కడున్నాయో! స్పష్టంగా బోధపడుతుంది . గడచిన రెండు దశాబ్దాలుగా అమలు చేయబడుతున్న   ప్రయివేటీకరణ , సరళీకరణ విధానాల దుష్ఫలితాలు నేడు భౌతికంగా దృశ్య రూపంలో మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి . అధికార దుర్వినియోగంతో అక్రమార్జనకు పాల్పడిన రాజకీయ నాయకత్వం , అధికార చట్రంలో ఉన్నత శ్రేణి కుర్చీల్లో కూర్చొని పాలనా వ్యవహారాల నిర్వహణలో క్రియాశీల పాత్రదారులైన‌  ఐ.ఎ.యస్ . అధికారులు , పారిశ్రామికవేత్తలు కూడబలుక్కొని ఏ విధంగా ప్రజల ఉమ్మడి ఆస్తులను దోచుకొన్నారో! పామరులకు సహితం అర్థమయిపోయింది . కాకపోతే ప్రజల చైతన్యం ఒక దశ వరకే పరిమితమయినట్లు కనబడుతున్నది . ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రజల ఉమ్మడి ఆస్తులను ఎవరైనా దోచుకొంటే " మన ఆస్తులను దోచుకోలేదు కదా! " అన్న సాచివేత‌ మనస్థత్వంతో అత్యధిక ప్రజానీకం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. "దున్నే వానికి భూమి నినాదం" మరుగునపడి పారిశ్రామికీకరణ ముసుగులో ప్రభుత్వ భూములు , అసైన్డ్ భూములు, పట్టా భూములు, సాగుకు లాకీ కాని భూములా! సారవంతమైన సాగు భూములా! అన్న విసక్షణ లేకుండా లక్షలాది ఎకరాలు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు , థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కోస్టల్ కారిడార్ , సైన్స్ సిటీ వగైరా పేర్లతో పారిశ్రామికవేత్తలు , రియలెస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి చేరిపోయాయి . అభివృద్ధి , ఉపాథి కల్పనే ప్రధాన లక్ష్యమని నమ్మబలికి , ప్రజానీకాన్ని వంచించారు . క్రిష్ణా _ గోదావరి బేసిన్ లోని అపారమైన సహజ వాయువు నిక్షేపాలు మొదలుకొని బాక్సయిట్ , బెరైటీస్ , ఇనుప ఖనిజం గనులు , నదుల్లోని ఇసుక తిన్నెల వరకు దోపిడీకి నిలయాలుగా మారిపోయాయి . తొమ్మిది వందల కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉన్న సముద్రతీరాన్ని దోపిడీ శక్తులకు అప్పనంగా అప్పజెప్పే కుటిల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి .
ప్రయివేటు పెట్టుబడులకు అగ్రతాంభూలం , ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి.) పథకాల జపం చేస్తూ నిలువు దోపిడీకి పూనుకొన్నారు. అందులో ఒకటి వాన్ పిక్ ప్రాజెక్టు . గుంటూరు , ప్రకాశం జిల్లాలలో రెండు ఓడరేవులు , పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూమిని , తొంబై కిలోమీటర్లకు పైగా సముద్రతీరాన్ని వాన్ పిక్ సంస్థకు ప్రభుత్వం దారాదత్తం చేయడానికి తీసుకొన్న చర్యలు, ప్రభుత్వ ఉత్తర్వుల‌ గుట్టురట్టయ్యింది . నాడు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖా మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం సి.బి.ఐ. విచారణను ఎదుర్కొంటూ, అరెస్టు చేయబడి , జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు . రాజ్యాంగానికి లోబడి , చట్ట పరిథిలో జవాబుదారితనంతో , పారదర్శకంగా వ్యవహరిస్తానని మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ఆనాటి ముఖ్యమంత్రి డా: వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో వాన్ పిక్ సంస్థకు భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశానని అరెస్టు తరువాత విధి లేని పరిస్థితుల్లో చేసిన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు . దాన్ని స్వీకరించిన‌ ముఖ్యమంత్రి వాన్ పిక్ సంస్థకు భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ప్రాథమిక ఆధారాలున్నాయని రుజువైన తరువాత కూడా ఎందుకు ఆ ఉత్తర్వులను రద్దు చేసి , అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోలేదన్న సందేహాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది . మోపిదేవి వెంకటరమణను వెనకేసుకు రావడం , జగన్ అక్రమాస్తుల కేసులో కీలకమైన , వివాదాస్పదమైన‌ 26 జీ.వో . ల విడుదలకు బాధ్యత వహించాల్సిన మిగిలిన ఐదుగురు మంత్రులు సుప్రీం కోర్టు తాఖీదులందుకొన్న తరువాత కూడా వారిని ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగించడం , జీ.వో.లన్నీ సక్రమంగానే ఉన్నాయని బుకాయించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం తన విశ్వసనీయతను కోల్పోతున్నది . ఈ పూర్వరంగంలోనే మద్యం సిండికేట్ల అవినితి , అక్రమాల కేసుపై ఏ.సి.బి. చేస్తున్న విచారణను నీరుగార్చడానికి సంబంధిత విచారణాధికారులను ప్రమోషన్ల ముసుగులో బదిలీలు చేయడం ద్వారా ప్రభుత్వం అబాసుపాలైయ్యింది. ఒకనాడు వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై విచారణను ఎదుర్కొని , ఈనాడు బినామీ పేర్లతో మద్యం వ్యాపారం చేస్తూ అక్రమార్జనకు నిస్సిగ్గుగా పాల్పడిన బొత్సా సత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతూ అవినీతిపై నీతి వచనాలు వల్లిస్తుంటే ప్రజలకు అసహ్యం కలుగుతున్నది . అవినీతిపరులు అందలమెక్కి మాట్లాడుతుండ‌డంతో అవినీతి వ్యతిరేక పోరాటానికి కళంకం వస్తున్నది .
స్వయం ప్రతిపత్తి లేని సి.బి.ఐ.ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకొంటూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదన్న అపవాదుల మధ్య  రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం వై.యస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును సి.బి.ఐ. విచారిస్తున్నది . నిష్పక్షపాతంగా విచారణ జరపడమే కాదు , నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నదన్న భావన ప్రజలకు కలిగించడం ద్వారా విశ్వసనీయతను పెంచుకోవలసిన బాధ్యత కూడా సి.బి.ఐ. పై ఉన్నది . అప్పుడే సి.బి.ఐ. ప్రతిష్ట పెరుగుతుంది , ప్రజల మద్దతును పొందుతుంది . అక్రమార్జనకు ఊతమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిన మంత్ర్రుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేసి మిగిలిన వారిపై కఠినంగా వ్యవహరించక పోవడం, అరెస్టు చేయకపోవడం , అలాగే దాదాపు పదినెల్లుగా సాగదీస్తూ వచ్చి తీరా మధ్యంతర ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత హడావుడిగా వ్యవహరించడం జన సామాన్యానికి అంత రుచించలేదు . పది రోజులాగితే కొంపలారిపోయేదేం లేదు గదా! అన్న ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పలేని పరిస్థితిని కొనితెచ్చుకొన్నది. సాంకేతికంగా సమర్థించుకోవచ్చు , కానీ ప్రజల్లో కలిగిన అనుమానాలను నివృత్తి చేయడానికి అది సరిపోదు . తద్వారా అవినీతిని నిగ్గుదేల్చే అసలు లక్ష్యానికే అపచారం జరిగే ప్రమాదం ఉంది . దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చింది . సి.బి.ఐ. సాక్షి పత్రిక మరియు టెలివిజన్ చానల్ బ్యాంక్ అకౌంట్స్ ను దిగ్భందించిన మరుక్షణమే ఆగమేఘాలపై అడ్వర్టజ్ మెంట్స్ పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం , పాత్రికేయులు వీధికెక్కడం , హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయడం లాంటి పరిణామాలు అక్రమాస్తుల కేసు విచారణపై నీలినీడలు కమ్ముకోవడానికి కాస్తా అవకాశం కల్పించాయని చెప్పవచ్చు .
విచారణను నిష్పక్షపాతంగా , పారదర్శకతతో , రాగద్వేషాలకు , సంకుచిత రాజకీయ వత్తిళ్ళకు అతీతంగా త్వరితగతిన పూర్తి చేసి , నిజాన్ని నిగ్గు దేల్చాలని ప్రజలు కోరుకొంటున్నారు . అధికార దుర్వినియోగానికి , అవినీతికి పాల్పడి ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన వారందరూ అత్యమంగా కఠినంగా శిక్షించబడాలి . అక్రమార్జనపరుల పాలైన‌ భూములు , గనులు తదితర సహజ వనరులను ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకొని , ప్రజలకు సొంతం చేసి , నిజాయితీని రుజువు చేసుకోవాలి . అవినీతి అంతంకై సాగుతున్న ఉద్యమంలో ఈ కేసు ద్వారా వెలుగు చూసే వాస్తవాలు , నిర్ధారణలు , శిక్షలు ఒక ముందడుగు కావాలని ప్రజలు కోరుకొంటున్నారు . ప్రజల్లో అవినీతి వ్యతిరేక ఛైతన్యాన్ని మరింత రగుల్కొల్పి , ఈ లోపభూయిష్టమైన వ్యవస్థపై తిరగబడేలా చేసి, మార్పు వైపు నడిపించే శక్తివంతమైన ప్రజా ఉద్యమం తక్షణావసరం .