సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో పేదరికాన్ని తగ్గించడమ న్నది ప్రధాన వ్యూహమని
డాక్టర్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం పదేపదే వల్లె
వేస్తుంటుంది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం
మాత్రం 2011-12 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.9%
వృద్ధిరేటు నమోదు చేసుకొని ముందు వరు సలో పయనిస్తున్నది. కానీ 11వ పంచవర్ష
ప్రణాళికా (2007-12) కాలంలో 9 శాతం లక్ష్యంగా పెట్టుకొన్నా సగటున 8.2%
సాధించామని, 12వ పంచవర్ష ప్రణాళికా (2012-17) కాలంలోనైనా 9 శాతానికి
చేరుకోవాలంటే సంస్కరణల అమలులో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ద్వంద్వంగా
ప్రకటించింది.
సంపద వృద్ధి చెందితే ప్రజలందరికీ ఆనందమే. అయితే, ఆ
అభివృద్ధిలో పేదలకు వాటా దక్కకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. జీడీపీ
పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ప్రజల కొనుగోలుశక్తి,
జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో అడుగు ముందుకుపడాలి. అప్పుడే
‘అభివృద్ధికి’ అర్థం, పరమార్థం ఉంటుంది. అలా కాకుండా నయవంచనతో కూడిన
ఆర్థికాభివృద్ధి జపంచేస్తూ, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాలన్న రాజ్యాంగ
స్ఫూర్తికి తూట్లు పొడవటం అభివృద్ధి కాజాలదు.
నేడు వివిధ తరగతుల
ప్రజానీకానికి ఇస్తున్న రాయితీలను పథకం ప్రకారం తొలగించే పనిలో కేంద్ర
ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించాలనే
మాయమాటలతో స్థూల జాతీయోత్పత్తిలో సబ్సిడీల శాతాన్ని 2012-13 ఆర్థిక
సంవత్సరంలో రెండు శాతానికి, అటుపై 1.75 శాతానికి, అలా క్రమేపీ కుదించుకొంటూ
పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకున్నది. ఆహారం, చమురు ఉత్పత్తులు,
ఎరువులపై ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సిడీల భారాన్ని గణనీయంగా
తగ్గించుకోవాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం పావులు కదుపుతున్నది. ప్రథమ
చర్యగా దారిద్య్రరేఖ నిర్థారణకు అసంబద్ధమైన, అశాస్త్రీయమైన ప్రాతిపదికలను
వర్తింపజేస్తూ పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపెట్టే దుర్మార్గానికి
పాల్పడింది.
అందులో అంతర్భాగంగా కేంద్ర ప్రణాళికా సంఘం రూపొందించిన నివేదిక
నవ్వులపాలైంది. పట్టణ ప్రాంతాలలో రూ.32, గ్రామీణ ప్రాంతాలలో రూ.26ల
రోజువారీ ఆదాయం లోపు ఉన్నవారిని మాత్రమే దారిద్య్రరేఖ దిగువన
జీవిస్తున్నవారుగా పరిగణించాలని ఆ నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు. ఆ
గణాంకాలు చూసి సభ్యసమాజం ముక్కున వేలేసుకున్నది. దారిద్య్రరేఖ దిగువన
జీవిస్తున్న జనాభాను తగ్గించి చూపడం ద్వారా సబ్సిడీ భారాన్ని
తగ్గించుకోవాలనే కక్కుర్తి ఆలోచన తప్ప మరొకటి కాదు.
‘ఆమ్ ఆద్మీ’
పేరు చెప్పుకొని అధికార పీఠమెక్కి, పేదల బతుకులను ఛిద్రం చేసే ఆర్థిక
విధానాలను అమలుచేస్తున్నారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను
కనీసం నియంత్రించలేని చేతకాని ప్రభుత్వం, పతనమైపోతున్న ప్రజల
కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను, నిరుద్యోగాన్ని ఏమాత్రం పరిగణనలోకి
తీసుకోకుండా అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించడం ప్రజా ప్రభుత్వానికి తగునా?
మరొక వైపున ‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు’ ప్రజలపై పెనుభారాలు
మోపారు. రైల్వే బడ్జెట్ కంటే ముందే సరుకు రవాణా ఛార్జీలను ఇరవై మూడు శాతం
పెంచి, రూ.16,000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రభుత్వం
పూనుకొన్నది. అటుపై అన్ని తరగతుల రైల్వే ప్రయాణికుల ఛార్జీలను పెంచాలని
బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2012-2013 వార్షిక బడ్జెట్‌ను ప్రణబ్ ముఖర్జీ
పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్
(ఈపీఎఫ్) వడ్డీ రేటును 9.5 నుంచి 8.25 శాతానికి తగ్గించింది. ఐదు కోట్ల
మంది ఉద్యోగులు, కార్మికుల డిపాజిట్లపై ఇచ్చే సబ్సిడీలకు పెద్ద ఎత్తున
కత్తెరవేశారు. ఎరువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఎరువులపై ఇస్తున్న
సబ్సిడీలో ఇప్పటికే ఇరవై శాతానికిపైగా తగ్గించేశారు.
సబ్సిడీల
వ్యవస్థకు మంగళంపాడి, పేదల మెడలకు ఉరితాళ్లు బిగించాలని నిశ్చయించుకొన్నది.
ఈ పథకంలో అంతర్భాగంగా నందన్ నీలేకర్ నేతృత్వం లోని టాస్క్‌ఫోర్స్ చేసిన
సిఫార్సును ఆమోదించి తేనెబూసిన కత్తి లాంటి నగదు బదిలీ పథకాన్ని
అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఆధార్ కార్డు ఆధారంగా
అర్హులను నిర్ధారించింది. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకున్న కొన్ని
ప్రాంతాలు, రంగాలలో అమలుకు శ్రీకారం చుట్టింది, మూడు ప్రభుత్వరంగ ఆయిల్
కంపెనీల ఆధ్వర్యంలో వంటగ్యాస్‌ను మార్కెట్ ధరకు అంటే 14.5 కేజీల
సిలిండర్‌ను రూ.750లకు పైగా విక్రయించి, సబ్సిడీ మొత్తాన్ని నేరుగా
వినియోగదారులకు బ్యాంకు ఖాతాలలో జమచేసే ‘పెలైట్ ప్రాజెక్టు’ను మైసూర్‌లో
అమలుచేయడానికి పచ్చజెండా ఊపారు.
ఇదే తరహాలో కిరోసిన్ పథకాన్ని
రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో అమలుకు పూనుకొన్నారు. ప్రజాపంపిణీ
వ్యవస్థ ప్రక్షాళన పేరుతో ఆధార్‌కార్డుల ఆధారంగా రేషన్ కార్డులను కుదించే
ప్రయోగశాలగా మొదట జార్ఖండ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇలా మూడు
పెలైట్ ప్రాజెక్టులతో మొదలు పెట్టి దేశవ్యాప్తంగా వీటిని విస్తరించే
ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసుకొని కార్యాచరణకు దిగింది. దీనిని
బట్టి ‘ఆమ్ ఆద్మీ’ సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో
తేటతెల్లమైంది.
సామాజిక భద్రతను కొంత మేరకైనా కల్పించే
సదుద్దేశంతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నేటి ప్రభుత్వం ఎసరుపెట్టడానికే
కృత్రిమంగా పేదల సంఖ్యను తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది.
1993-1994 నుండి 2004-05 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఏడాదికి 0.74%
పేదరికం తగ్గుతూ వస్తే 1994-05 నుండి 2009-10 మధ్య యూపీఏ పాలనా కాలంలో
ఏడాదికి 1.5% చొప్పున తగ్గిందని పేర్కొన్నారు. 2005 మార్చి 1 జనాభా లెక్కల
ప్రాతిపదికన 2004 లో 37.2% ఉంటే 2010 మార్చి 1 నాటి జనాభా ఆధారంగా 29.8
శాతానికి దారిద్య్రరేఖ కింద జీవిస్తున్న జనాభా సంఖ్య తగ్గిందని
వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్నా దేశంలో దాదాపు 36 కోట్ల మంది
పేదరికంలో మగ్గుతున్నారు.
పేదరిక నిర్ధారణ శాస్త్రీయ పద్ధతుల్లో
నిర్వహించటం లేదు. తాజా నివేదికలను బట్టి దేశ జనాభాలో మూడింట రెండొంతుల
మంది చాలినంత ఆహారం తీసుకోవడం లేదు. 1993-94లో గ్రామీణ ప్రాంతాలలో ఒక
వ్యక్తి తీసుకున్న ఆహారం 2,153 క్యాలరీలు ఉండగా, 2009-10లో అది 2,020
క్యాలరీలకు, పట్టణ ప్రాంతాలలో 2,071 నుంచి 1,946 క్యాలరీలకు పడిపోయిందని
నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ తన 66వ అధ్యయన నివేదికలో పేర్కొంది.
ప్రొటీన్ ఆహారమైన మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాల వినియోగం గ్రామ సీమల్లో
60.2 గ్రాముల నుండి 55 గ్రాములకు, పట్టణాలలో 57.2 గ్రాముల నుండి 53.5
గ్రాములకు పడిపోయిందని చెప్పింది. 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సులో
ఉన్న సాధారణ పురుషులకు 2,320 క్యాలరీలు అవసరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
న్యూట్రిషన్ సంస్థ చెబుతున్నది.
కఠిన దారిద్య్రం పర్యవసానంగా ఆకలి
బాధలు అనుభవించే వారి సంఖ్య పెరుగుతున్నది. పౌష్టికాహారాన్ని అందించే
లక్ష్యంతో పలు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు
పలుకుతున్నా... పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి
సంఖ్య పెరుగుతున్నది. శిశు మరణాల సంఖ్య తగ్గడం లేదు. అదుపు చేయలేని
ద్రవ్యోల్బణం, ఒకానొక దశలో ఇరవై శాతానికి మించిన ఆహార ద్రవ్యోల్బణం, నిత్యం
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పతనమవుతున్న రూపాయి విలువ, ప్రజల
కొనుగోలుశక్తి, క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, బలంగా
వేళ్లూనుకొని ఉన్న బాల కార్మికవ్యవస్థ, విద్య, వైద్యం, నివాసం వగైరా కనీస
మానవ హక్కుల అమలు స్థితిగతులను గానీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.
పేదరిక నిర్మూలన పథకాలపైన, సబ్సిడీల రూపంలో చేస్తున్న ప్రభుత్వ వ్యయాన్ని
గణనీయంగా కుదించుకోవాలన్నదే దీని వెనకాల దాగి ఉన్న అసలు సిసలైన చిదంబర
రహస్యం. కానీ, పైకి మాత్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం,
విద్యా హక్కు చట్టం, రాబోయే ఆహార భద్రతా చట్టం దారిద్య్రరేఖ ప్రాతిపదికపైన
అమలు చేయడంలేదని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా బుకాయిస్తున్నారు. కానీ ఆచరణలో
తద్భిన్నంగా చర్యలు చేపడుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి,
ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో వేగంగా అడుగులు ముందుకు వేయాలన్న
కృతనిశ్చయంతో మన్మోహన్ బృందం ఉన్నట్లు దీన్ని బట్టి రూఢి అవుతున్నది. 12వ
పంచవర్ష ప్రణాళికలో మొదటి ఏడాది (2012-13) బడ్జెట్ దీనికి అద్దం
పడుతున్నది.
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే అధికారంలో
కొనసాగే అవకాశాలు మృగ్యమైపోయాయన్న నిర్ధారణకు కాంగ్రెస్ పార్టీ
వచ్చినట్లుంది. అందుకే కాబోలు, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం
ప్రజలపై కక్ష గట్టి, ముప్పేట దాడికి బరితెగించింది. అయాచితంగా లభించిన
ప్రధాన మంత్రి పదవిలో మన్మోహన్‌సింగ్ రికార్డుస్థాయిలో కొనసాగారు. మూడోసారి
గద్దెనెక్కే ముచ్చట లేదని తేలిపోయింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన
ఆర్థికవేత్తగా ఆయన్ను ఆ నోటా ఈ నోటా కొందరు ప్రశంసిస్తూ ఉంటారు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాల జపం చేస్తున్న ఆయన బృందంలోని ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షులు అహ్లూవాలియా, ప్రధానికి ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్
ఎన్.రంగరాజన్, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, మాజీ
ఆర్థికశాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ... ఆర్థిక సంస్కరణల ముసుగులో విదేశీ,
స్వదేశీ పెట్టుబడిదారులకు అత్యంత నమ్మిన బంట్లుగా సేవలందించడంలో
నిమగ్నమయ్యారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతానికి తన ప్రభుత్వాన్ని,
ప్రధానమంత్రి పదవిని కాపాడుకుంటూ తన మానసపుత్రిక అయిన నయా ఉదారవాద ఆర్థిక
సంస్కరణల అమలును సంపూర్ణంగా సాకారం చేసుకోవాలని మన్మోహన్‌సింగ్ పట్టుదలగా
పనిచేస్తున్నారు. ఆర్థికవేత్తగా దోపిడీశక్తుల పక్షాన నిలబడ్డ మన్మోహన్‌కు
రాజకీయ నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవని, ఆయనకు పేదసాదల సంక్షేమంపై శ్రద్ధ
లేదని నూటికి నూరుపాళ్లు రుజువైపోయింది.