Thursday, November 21, 2013

త్యాగాల గడ్డ ఎడారి కావలసిందేనా?




కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి ( జి. ఓ. యం.) టి.ఆర్.యస్. అధినేత సమర్పించిన విజ్ఞాపన పత్రంలో క్రిష్ణా పరివాహక ప్రాంతానికి బయట చట్ట విరుద్ధంగా నిర్మించబడుతున్న‌ తెలుగు-గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, వెలుగోడు, సోమశిల, కండలేరు, చిత్రావతి ఆనకట్ట మరియు లింగాల కాలువలకు నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తామనివిస్పష్టంగా పేర్కొన్నట్లు విలేకరులకు వివరించారు. ఇది అత్యంత‌ ప్రమాదకరమైనది, తీవ్ర అభ్యంతరకరమయినది, వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే దుర్చర్య. క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్న‌ రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లాను లేవని చెప్పడం దుస్సాహసమే. క్రిష్ణా నది మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం ఒక్క తెలంగాణాకే దక్కాలనే దురాశతోనే వివాదానికి తెరలేపారు. తద్వారా తెలుగు ప్రజల మధ్య మరింత‌ విద్వేషాలను రెచ్చగొట్టి, శాశ్వతంగా అగాధం సృష్టించి, త్యాగాలతో పునీతమైన కరవు సీమకు ద్రోహం చేయడానికి బరితెగించినట్లుగానే భావించాల్సి వస్తున్నది.
ఈ తరహాలోనే తెలంగాణా ఇంజనీర్స్ ఫోరం, తెలంగాణా అభివృద్ధి ఫోరం లాంటి సంస్థలు కూడా వినతిపత్రాలను సమర్పించినట్లు ప్రసారమాధ్యమాలలో వార్తలొచ్చాయి. అర్థసత్యాలు, అబద్దాలు, అభూతకల్పనలతో ప్రాంతీయ దురభిమానాన్నిబహిర్గతంగా వెల్లడించుకొన్నారు. "శ్రీశైలం జలాశయం నిల్వ సామర్థ్యం 263 టి.య‍ం.సి. ఉంటే  దానికి మించి 203 నుండి 364 టి.యం.సి.ల వరకు వరద/మిగులు జలాల పేరుతో దోచుకెళ్ళడానికి  ప్రాజెక్టులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయిన తరువాత మొత్తం క్రిష్ణా నదినే రాయలసీమ ప్రాంతానికి మళ్ళిస్తారు" అని తెలంగాణా ఇంజనీర్స్ ఫోరం తమ వినతి పత్రంలో పేర్కొన్నది. ఇది ఎంతటి హాస్యాస్పదమో! పామరుడికి కూడా బోధపడుతుంది. ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన సంస్థ చేసిన ఈ ఆరోపణ నిజంగానే 'మిలీనియం జోక్' గా చరిత్ర పుటల కెక్కుతుంది.
వాస్తవమేంటి. మొత్తం నికరజలాలు 69 టి.య‍.సి.లు (చెన్నయ్ నగరానికి 15, యస్.ఆర్.బి.సి.కి 19, కె.సి.కెనాల్ కు 10, తెలుగు గంగకు 29 (65% విశ్వసనీయత ఆధారంగా 25 + 5 టి.య‍.సి.లు మిగులు జలాలు), అలాగే మిగులు జలాలు లేదా వరద నీరు గాలేరు-నగరి పథకానికి 38 వెరసి 112 టి.యం.సి.ల నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తరలించడానికి వీలుగా నిర్మాణాన్ని విస్తరించడం జరుగుతున్నది. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కె.సి. కెనాల్ మినహాయించి, ముప్పయ్ యేళ్ళుగా యస్.ఆర్.బి.సి., తెలుగు గంగ నిర్మాణంలోనే ఉన్నాయి. రిజర్వాయర్లు, ప్రధాన కాలువల నిర్మాణం పూర్తైనా, పంట కాలువల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉన్నది. గాలేరు-నగరి పథకంలో అంతర్భాగమైన గండికోట జలాశయం నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన‌ నిర్మాణ పనులు అస్తవ్యస్థంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల క్రింద సాగే లేదు. కేవల‍ం కొన్ని చెరువులకు మాత్రమే కొంత కాలంగా నీళ్ళు విడుదల చేస్తున్నారు. నిజాలు నిప్పులాంటివి. ఎవరిని మోసగించడానికి తప్పుడు లెక్కలు చెబుతున్నారు? నీటిని కొల్లగొట్టి అక్రమంగా తీసుకెళ్ళి అనుభవిస్తున్నారని గగ్గోలుపెడుతున్నారు?  ఇహ హంద్రీ-నీవా 40 మరియు వెలుగొండ 43.5 టి.యం.సి.ల మిగులు జలాలపై ఆధారపడే నిర్మాణంలో ఉన్నాయి. వీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధమే లేదు. శ్రీశైలం జలాశయం మీద ఆధారపడిన రాయలసీమ మరియు ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు నికరజలాలు 54  +  మిగులుజలాలు 126.5 = 180.5 టి.యం.సి.లు మాత్రమే.
వాస్తవాలను వక్రీకరిస్తూ, తప్పుడు గణాంకాలతో వినతిపత్రాలను సమర్పించడంలోని పరమార్థమేంటో! విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. తెలుగు జాతి యావత్తూ ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన, జఠిలమైన‌ నీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలను చూపెట్టడానికి బదులు మరింత జఠిలం చేసే విధంగా చిక్కుడులు వేయడం రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు హానికరం. కేంద్ర ప్రభుత్వ‍ం వీటికి తలవొగ్గితే చరిత్ర క్షమించదు.
నియంత్రణ మండళ్ళు పరిష్కారమా ! ట్రిబ్యునల్స్ తీర్పులను తు.చా తప్పకుండా అమలు చేయడానికి  క్రిష్ణా, గోదావరి నదులకు సంయుక్తంగా లేదా వేరువేరుగా స్వయం ప్రతిపత్తి గల నియంత్రిత మండళ్ళను ఏర్పాటు చేస్తే నీటి సమస్య పరిష్కారమై పోతుందని వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు  ఉచిత సలహాలిస్తున్నాయి. కావేరి, తుంగభద్ర బోర్డుల నిర్వహణ చేదు అనుభవాలు చవి చూస్తూనే ఉన్నాం. పైపెచ్చు క్రిష్ణా నదిపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు మిగులు లేదా వరద జలాలపై ఆధారపడి నిర్మించబడుతున్నవనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా గానీ లేదా అవగాహనారాహిత్యంతో గానీ విస్మరిస్తున్నారు. ట్రిబ్యునల్స్ చేసిన నీటి కేటాయింపుల అమలకు అవరోధాలు కల్పిస్తే బోర్డులు నియంత్రించే అవకాశం కొంత వరకైనా ఉంటుంది. కానీ ఇక్కడ ట్రిబ్యునల్స్ చేత నీటి కేటాయింపులు లేని, కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర లేకుండా మిగులు జలాలను వినియోగించుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన‌ స్వేచ్ఛ ఆధారంగా నిర్మించబ‌డుతున్న ప్రాజెక్టులకు నీటి విడుదల అంశాన్ని బోర్డులు ఏ విధంగా నియంత్రి‍చగలవన్నదే మౌలికమైన ప్రశ్న.
మరొకవైపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా లెక్కగట్టి 285 టి.యం.సి.లుగా నిర్ధారించి, మహారాష్ట్రకు 35, కర్నాటకకు 105, ఆంధ్రప్రదేశ్ కు 145 టి.యం.సి.ల చొప్పున‌ వాటాలు కూడా వేసి, మన రాష్ట్రానికి కేటాయించిన మిగులు జలాలను శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాలలో 'కారీ ఓవర్' పద్దు క్రింద చేర్చింది. మిగులు జలాలను పంపిణీ చేయడం అశాస్త్రీయమని ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టడడం మూలంగా పునర్విచారణ జరుగుతున్న‌ నేపథ్యంలోనే మిగులు జలాలపై టి.ఆర్.యస్. చిచ్చు పెట్టింది. పర్యవసానంగా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలో మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరు దక్కదనే భయాందోళనలు పెల్లుబుకుతున్నాయి. 1950 దశకంలో క్రిష్ణా-పెన్నార్ పథకం ద్వారా నికర జలాలు తలుపుతట్టినా చేజేతులా వదులుకొన్న రాయలసీమకు ఇప్పుడు వరద నీటికి కూడా నోచుకోని దుస్థితి దాపురించింది.
దగాబడ్డ ప్రజలను నీటి దొంగలుగా చిత్రీకరిస్తారా ?: 1937, నవంబర్ 16న‌ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల కాంగ్రెస్ నాయకుల మధ్య కుదిరిన‌ 'శ్రీబాగ్ ఒడంబడిక' చెల్లని కాసుగా అటకెక్కింది. క్రిష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో రాయలసీమ అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆ ఒడంబడికలో లిఖిత పూర్వక హామీ ఇచ్చి మొడి చేయి చూపెట్టారు. అలాగే ఆరు దశాబ్దాల క్రితం తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం రాయలసీమవాసులు తృణప్రాయంగా త్యాగం చేసిన‌ క్రిష్ణా-పెన్నార్ ప్రాజెక్టు క్రింద పేర్కొన్న ఆయకట్టు ప్రాంతాల ప్రయోజనాలను కొంతైనా నెరవేర్చడానికి దోహదపడే సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలను నేడు తెలంగాణావాదులు వివాదాస్పదం చేస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం అంతర్భాగంగా ఉన్నకాలంలో నాటి ప్రభుత్వం 1951 లోనే క్రిష్ణా-పెన్నార్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, కేంద్ర‌ ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందింది. ఆ ప్రాజెక్టు ద్వారా ఏడు లక్షల ఎకరాలకు రాయలసీమ నాలుగు జిల్లాలలోను, నెల్లూరు జిల్లాకు పెద్ద ఎత్తున సాగునీరు, త్రాగునీరు అందించే ప్రతిపాదన ఉన్నా అత్యధిక నీటిని తమిళ ప్రాంతాలకు తరలించే దురుద్దేశం ఆ పథకంలో ఇమిడి ఉన్నదని, ఫలితంగా ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుందని ఆనాటి రాజకీయ నాయకత్వం చెవుల్లో జోరీగల్లా చేరి రాయలసీమ ప్రజలకు నూరిపోశారు. వాటిని చెవికెక్కించుకొన్న అమాయక ప్రజలు వీరావేశంతో ఊగిపోయారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలతో కూడిన‌ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగసిపడుతున్న పూర్వరంగంలో తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాలనే మిన్నగా ఎంచిన‌ రాయలసీమవాసులు, వెనుకబాటుతనంతో కునారిల్లి పోతున్న తమ ప్రాంత‌ సమగ్రాభివృద్ధికి బాటలు వేయగలిగిన క్రిష్ణా-పెన్నార్ పథకం ఇంటి తలుపు తట్టినా! తృణప్రాయంగా తలంచి, కాల్దన్నారు.
నాటి క్రిష్ణా-పెన్నార్ పథకంలో అంతర్భాగమైన సిద్ధేశ్వరం జలాశయాన్ని, గండికోట జలాశయాన్ని నిర్మించి, రాయలసీమకు న్యాయం చేస్తామని చేసిన వాగ్దానాలు గాలిలో కలిసి పోయాయి. సిద్ధేశ్వరం స్థానంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నెలకొల్పబడింది. నందికొండ అంటే నాగార్జునసాగర్ కోసం పోరుసాగించి సాధించుకొన్నారు. ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. కరవుకాటకాలు కరాళ నృత్యం చేస్తున్న రాయలసీమ ప్రాంతం గుక్కెడు నీళ్ళ కోసం ఆర్తనాథాలు చేస్తూనే ఉన్నది. వ‌రుణ దేవుడెప్పుడు కటాచ్చిస్తాడ‌ని ఆకాశం వైపు ఎదురుతెన్నులు చూస్తూ! కప్పల పెళ్ళిళ్ళు, రోళ్ళను ఊరేగించుకొంటూ పోయి గ్రామాల సరిహద్దుల్లో పడేసిరావడం లాంటి మూడనమ్మకాలతో జీవచ్చవాల్లా బ్రతుకు బండి లాగిస్తున్నారు. సగటు వర్ష ప్రాతం 600 మి.మీ. ఉంటే అనంతపురం జిల్లాలో అయితే 530 మి.మీ. అడవులు అంతరించి పోతున్నాయి. భూగర్భజలాలు శ‌రవేగంతో ఇంకిపోతున్నాయి. వెయ్యి అడుగులకుపైగా బోర్లు వేసినా తేమ కూడా కనిపించని ప్రాంతాలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజానీకానికి వ్యవసాయమే జీవనాధారం. పర్యావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, కరవు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం నిత్యకృత్యమై పోయింది. జీవన్మరణ పోరాటం చేస్తున్న కరవుసీమతో ప్రాంతీయ ఉన్మాదంతో రాజకీయ క్రీడ ఆడడం హేయమైన చర్య.
క్రిష్ణా నదీ జలాల సాధన కోసం రాయలసీమ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా సాగించిన అలుపెరగని పోరాటాల ఫలితంగానే నేడు తెలుగు-గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. 1951 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం చేత‌ ప్రతిపాదించబడిన క్రిష్ణా-పెన్నార్ పథకంలో పేర్కొన్న ఆయకట్టు ప్రాంతాల ప్రయోజనాలను కొంతైనా నెరవేర్చడానికే ఈ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. నాడైతే క్రిష్ణా నికరజలాలు నిండుగా లభించేవి. 1960 నాటికి ముందు నిర్మించబడి, నీటిని వినియోగించకొంటున్న‌ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి నికరజలాలను కేటాయించిన బచావత్ ట్రిబ్యునల్ ఆ నీటి వాడకాన్ని కూడా చట్టబద్దం చేసి ఉండేది. క్రిష్ణా డెల్టా రైతాంగం అనుభవిస్తున్నట్లు రాయలసీమ రైతులు కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉండేవారు. నేడేమో కరవుల్తో పోరాడుతున్న రాయలసీమవాసులకు క్రిష్ణా మిగులు లేదా వరద నీళ్ళకు కూడా అర్హత లేదని టి.ఆర్.యస్. కేంద్ర ప్రభుత్వం ముందు వివాదాన్ని లేవనెత్తింది. పర్యవసానంగా వేలాది కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణం చేస్తున్న ఈ ప్రాజెక్టులు నిరుపయోగంగా మూలనపడే ప్రమాదం మొంచుకొస్తున్నది.
1) బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% ప్రామాణికంగా లభిస్తాయని నిర్ధారించిన‌ నీటిలో తెలుగు-గంగకు 25 టి.య‍ం.సి. లను కేటాయిస్తూ తన ముసాయిదా తీర్పులో పేర్కొన్నది. తెలుగు-గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన‌ వెలుగోడు జలాశయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడమంటే ఈ నీటి కేటాయింపుని వ్యతిరేకిస్తున్నట్లే. 2) క్రిష్ణా నదీ పరివాహక మరియు కరవు పీడిత ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు మరియు ప్రకాశం జిల్లాల దప్పికను తీర్చడానికే తెలుగు-గంగ, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. 3) వెలుగోడు, కండలేరు ప్రాజెక్టులు కాదు. తెలుగు-గంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించబడిన‌ రిజర్వాయర్లు మాత్రమే. చెన్నయ్ నగరానికి 15 టి.యం.సి.లను త్రాగు నీటి నిమిత్తం సరఫరా చేయడానికి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించి తమిళనాడుతో ఒప్పందం చేసుకొన్నాయి. అందులో భాగంగానే కండలేరు నిర్మించబడింది. అలాగే కండలేరు నది ప్రవాహం మరియు పెన్నా నది వరద నీటిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 టి.యం.సి.లకు అనుగుణంగా నిర్మించారు. 4) సోమశిల ప్రాజెక్టు 68 టి.యంసి.ల సామర్థ్యంతో పెన్నా నది నీటి ఆధారంగా నిర్మించబడినది. 5) చిత్రావతి ఆనకట్ట పెన్నా నదికి ఉపనది అయిన చిత్రావతి నదిపై నిర్మించబడింది. ఈ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడడం వారికే చెల్లింది.  
75% విశ్వసనీతను ప్రామాణికంగా తీసుకొని క్రిష్ణా నదిలో 2060 శత కోటి ఘ‌నపుటడుగుల నీరు లభిస్తుందని బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించి, మహారాష్ట్రకు 560, కర్నాటకకు 700, ఆంధ్రప్రదేశ్ కు 800 టి.యం.సి.ల చొప్పున‌ పంపిణీ చేసింది. కొన్ని సంవత్సరాలలో అంతకుమించి నీటి ప్రవాహం ఉంటుంది. అలా 2060 టి.యం.సి.ల‌ నికర‌జలాలకు మించి లభించే నీటిని మిగులు జలాలుగా భావించి,  తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాలలో దిగువ రాష్ట్రామైన ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కాబట్టి వాటిని వినియోగించుకొనే స్వేచ్ఛను మన రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ దకలు పరచింది.  ప్రాజెక్టులు నిర్మించి కరవు ప్రాంతాల కడగండ్లు తీర్చమని ప్రజలు అనేక ఉద్యమాలు చేసినా పాలకుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం మూల‍ంగా ట్రిబ్యునల్ విధించిన‌ గడువు 2000 మే 31 ముగిసే లోపు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాం. ప్రస్తుతం మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న‌ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడానికి మహారాష్ట్ర, కర్నాటకలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వ్యతిరేకించాయి. పట్టుబట్టి మిగులు జలాల్లో కూడా వాటా సంపాదించుకొన్నాయి. గోరు చుట్టపై రోకటి పోటన్నట్లు టి.ఆర్.యస్. కూడా ఆ పల్లవిని అందుకొనడంతో ఈ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకమతున్నది.  
కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించబడుతున్న ప్రాజెక్టులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాతిపథికన నెట్టంపాడు, కల్వకుర్తి, యస్.యల్.బి.సి., మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కూడా అక్రమంగా నిర్మించబడుతున్న ప్రాజెక్టుల జాబితాలోకే వస్తాయి కదా! ఈ ప్రాజెక్టులు క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతం పరిథిలో ఉన్నాయని సమర్థించుకోవాలని చూస్తే! ఆ మాట కొస్తే తెలుగు-గంగ, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులు కూడా క్రిష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నవే.
శ్రీశైలం జలాశయం ఎవరి సొత్తు? : క్రిష్ణా నదిపై నిర్మించబడిన, నిర్మించబడుతున్న సాగునీటి పారుదల వ్యవస్థ మొత్తానికి శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది. ఈ జలాశయం వద్ద నీటి వినియోగంలో ఏ చిన్న తప్పు జరిగినా అది నీటి యుద్ధాలకు అనివార్యంగా దారితీస్తుంది. ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తకూడదనే లోతైన అధ్యయన‍ం తరువాత బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడి 1996 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నెం. 69 ని జారీ చేసింది. దాన్ని ఉల్లంఘిస్తే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. శ్రీశైలం జలాశయం నిర్మాణం వెనుక ఉన్న చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సిద్ధేశ్వరం వద్ద జలాశయాన్ని నిర్మించి రాయలసీమకు సాగు నీటిని అందిస్తామని వాగ్దానం చేసి, దగా చేశారు. సిద్ధేశ్వరానికి దిగువ భాగంలో శ్రీశైలం వద్ద కేవలం జల విద్యుదుత్పాదన నిమిత్తం జలాశయాన్ని నిర్మించారు. అటుపై ప్రజలు సాగించిన పోరాటాలకు తలవొగ్గి సాగునీటి అవసరాలను కూడా తీర్చడానికి వీలుగా దాని స్వభావాన్ని మార్చారు.
ఈ జలాశయం నిర్మాణంతో కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు పరిధిలో 32 గ్రామాలు, ఆత్మకూరు పరిధిలో 14 గ్రామాలు, కర్నూలు పరిధిలో 4 గ్రామాలు, మొత్తం 50 గ్రామాలు, 54,351 ఎకరాల భూమి  నీట మునిగాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పరిధిలో 27, అలంపూర్ పరిధిలో 29 గ్రామాలు, వనపర్తి పరిధిలో 11 గ్రామాలు, మొత్తం 67 గ్రామాలు, 52,427 ఎకరాల భూమి ముంపుకు గురయినాయి. మొత్తంగా 117 గ్రామాలు, 1,06,778 ఎకరాలు భూమి ముంపుకు గురయ్యాయి. ఈ చరిత్రను గౌరవించే వారెవరైనా శ్రీశైలం జలాశయంపై రాయలసీమ ప్రాంత ప్రజలకు హక్కు లేదని చెప్పే సాహసం చేయలేరు.
శ్రీశైలం జలాశయం నుండి 11 టి.యం.సి.లకు మించి ఒక్క చుక్క‌ నీటిని కూడా తరలించుకు పోయే హక్కు రాయలసీమకు లేదని కొందరు హుకుం జారీ చేస్తున్నారు. అంటే యస్.ఆర్.బి.సి.కి 11 టి.యం.సి.ల వరకే అర్హత ఉందని, అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిలం జలాశయానికి తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు కేటాయించిన 10 టి.యం.సి.లను మంజూరు చేస్తూ ప్రత్యామ్నాయంగా అంతే నీటిని శ్రీశైలం నుండి సర్దుబాటు చేస్తూ 2004లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.ను గుర్తించ నిరాకరించడం, తాజాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% విశ్వసనీయత ఆధారంగా 163 టి.యం.సి.లు లభిస్తాయని, వాటిలో 15 టి.యం.సి.లను కనీస నదీ ప్రవాహానికి వదిలిపెట్టి, మహారాష్ట్రకు 43, కర్నాటకకు 65 పోను మిగిలిన 39 టి.యం.సి.లను మన రాష్ట్ర‍ వాటాగా పేర్కొన్నది. అందులో తెలుగు గంగకు 25 మరియు జూరాలకు 9 పోను మిగిలిన 5 టి.యం.సి. లను శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల కారీ ఓవర్ పద్దులో చేర్చింది. తెలుగు గంగకు కేటాయించిన ఈ నీటికి కూడా మోకాలడ్డడానికి వీలుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును వెల్లడించకుండా ఆపాలని కోరుతున్నారు. అలాగే మిగులు జలాలను తెలంగాణా ప్రాంతానికి  మాత్రమే దఖలు పరచాలనే అసంబద్ద వాదనలను వినిపిస్తున్నారు.
అప్రస్తుతమైన అంశమైనప్పటికీ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఒకనాడు రాయలసీమలో అంతర్భాగమైన బళ్ళారిని తుంగభద్ర జలాశయంతో పాటు కర్నాటకలో కలిపి, ప్రత్యామ్నాయంగా తుంగభద్ర మరియు క్రిష్ణా నదుల మధ్య ఉన్న కర్నాటక హైదరాబాదు ప్రాంతంలోని రాయచూర్ జిల్లాలోని అలంపూర్ మరియు గద్వాల్ తాలూకాలను మహబూబ్ నగర్ జిల్లాలో కలిపారు. ఇప్పుడు ఈ ప్రాంతాలను అడ్డం పెట్టుకొని క్రిష్ణా నదీ జలాలపై ఆధిపత్యం చెలాయించడానికి పూనుకోవడం సమర్థనీయమా? నాడు తుంగభద్ర జలాశయం పోయింది. నేడు శ్రీశైలం జలాశయంపై హక్కు లేదంటే రాయలసీమ భవిష్యత్తేంటి?
జీవన్మరణ సమస్యగా పరిణమించిన నీటి సమస్యపై ప్రాంతాలకు అతీతంగా, ప్రజల విస్తృత ప్రయోజనాలు, మరీ ప్రత్యేకించి వెనుకబడ్డ మరియు నిత్య‌కరవు పీడిత ప్రాంతాల కడగండ్లను తీర్చే విశాలమైన దృక్పథంతో ఆలోచించి, శాశ్వత పరిష్కారానికై అన్వేషించాల్సిన బాధ్యత సాగునీటి రంగ నిపుణులపైన, రాజకీయ పార్టీల పైన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది.