Tuesday, December 17, 2013

కరవు పీడితుల‌పై పిడుగు - ట్రిబ్యునల్‌ తీర్పు





కృష్ణా నది మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగించుకొనే స్వేచ్ఛను హరించి వేసి, నిత్య కరవు పీడిత ప్రాంత‌ ప్రజల ఆశలను ఆవిరి చేసిన‌ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు యావత్తు తెలుగు జాతికి అశనిపాతం లాంటిది. తీర్పును ఆమూలాగ్రం పరిశీలిస్తే తెలుగు జాతి భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. నికృష్టమైన‌ బ్రిటీష్ వలస పాలన రోజుల్లో సర్ ఆర్థర్ కాటన్ కృషి ఫలితంగా కృష్ణా నదిపై 1852-56 మధ్య‌ కాలంలో విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా కాలువలు మరియు గుంటూరు కాలువ‌కు, కృష్ణా నదికి ఉపనది అయిన తుంగభద్ర పై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టను కట్టి కర్నూలు కడప కాలువకు,  స్వాతంత్య్రం సముపార్జించుకొన్న‌ తొలినాళ్ళలోనే ఆధునిక దేవాలయంగా అభివర్ణించబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవ దశకు 1956లోను ప్రాణప్రతిష్ట‌ చేసుకోక‌పోయి ఉంటే నీటిపారుదల రంగంలో నేడు తెలుగు జాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల పున: పంపిణీ అంశంపై 1960 సెప్టంబరులో జరిగిన  అంతర్రాష్ట్ర మహాసభ సుధీర్ఘంగా చర్చించిన మీదట 1951 కి ముందు నిర్మించబడి నీటిని వినియోగించుకొంటున్న మరియు 1960 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో చట్టబద్దంగా నిర్మాణంలో ఉన్న‌ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి రక్షణ కల్పించాలని ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. నాటి ఆ నిర్ణయమే నేటికీ రక్షణ కవచంగా నిలిచి కృష్ణా నదిలో 75% విశ్వసనీయత ఆధారంగా లభిస్తున్న 2060 టి.యం.సి.లలో మన రాష్ట్ర వాటాగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టి.యం.సి.లు పరిరక్షించబడ్డాయి.  
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్న‌ నానుడి బాగా ప్రాచుర్యంలో ఉన్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగు జాతికి శరాఘాతంగా పరిణమించడానికి మూల కారణం మన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ ఘోరవైఫల్యమే. కాంగ్రెస్ పార్టీ , దాని నేతృత్వంలోని యు.పి.ఎ. -II ప్రభుత్వం విభజన రాజకీయాలతో వికృతమైన‌ రాచక్రీడ ఆడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది. సందట్లో సడేమియా అన్నట్లు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలు అందొచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని కృష్ణా జలాల పున: పంపకంలో తాము కోరుకొన్న రీతిలో తీర్పును బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ద‍ం చేసుకొనే ప్రయత్నంలో సఫలమయ్యాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విభజన రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తూ కాలం వెళ్ళబుచ్చి "చేతులు కాలిన తరువాత‌ ఆకులు పట్టుకొన్నట్లు" ట్రిబ్యునల్ తీర్పుపై  గుండెలు బాదుకొంటున్నాయి. గడచిన అర్థదశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకొనే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయింది. గాడితప్పిన‌ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో పొడిచి, రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక‌ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన రాజకీయ పార్టీలు సంకుచిత రాజకీయాల ఊబిలో కూరుకపోయాయి. పర్యవసానంగా ప్రజల భవిష్యత్తు గాలిలో దీపంగా కొట్టుమిట్టాడుతున్నది. దుష్పరిణామాలు కమ్ముకొస్తున్నాయి. ఆ కోవలోనిదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్నాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమ ప్రాంతంలోను, తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్ మరియు నల్లగొండ జిల్లాలలోనూ, కోస్తా ప్రాంతంలోని ప్రకాశం జిల్లాలో నిర్మించబడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతారాలను లేవదీస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు 2000 మే 31న‌ ట్రిబ్యునల్ గడువు ముగియగానే ఈ సమస్యపై వివాదాన్ని రేపి, ఉడుంపట్టు పట్టి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగించి విజయం సాధించాయి. నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న రాష్టం అనివార్యంగా ఎదుర్కొనే కష్ట నష్టాలను పరిగణలోకి తీసుకొన్న బచావత్ ట్రిబ్యునల్  మిగులు జలాల వినియోగానికి సంబంధించి న్యాయబద్దంగా కల్పించిన‌ స్వేచ్ఛను  కాపాడుకోవడంలో మనం చతికిలపడ్డాం. సంక్లిష్టమైన‌, జఠిలమైన అంతర్రాష్ట్ర నదీజలాల సమస్యను కేవలం న్యాయవాదుల సామర్థ్యానికే వదిపెట్టడం వల్ల కొంప మునిగింది. జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది.
నీటి లభ్యతను నిర్ధారించడానికి ట్రిబ్యునల్  ఎంచుకొన్న‌ ప్రామాణికం అసంబద్దమైనది, అశాస్త్రీయమైనది. కర్నాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటాయించడానికే అన్నట్లుగా కొలమానాలను అమలు చేసినట్లు స్పష్టమవుతున్నది. మూడు రాష్ట్రాలలో నిర్మించబడిన జలాశయాలలో స్థూలంగా 1919 టి.యం.సి.ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, 1518 టి.యం.సి.ల (మహారాష్ట్ర+కర్నాటక+ ఆంధ్రప్రదేశ్ : 483.24+479.35+555.84=1518.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని , గరిష్టంగా 2313 టి.యం.సి. (మహారాష్ట్రలో 551.65 టి.యం.సి.లు, కర్నాటకలో 695.97 టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్ లో 1065.44 టి.యం.సి.) నీటిని వినియోగించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసి, తదనుగుణంగా 65% విశ్వసనీయత ఆధారంగా 2293 టి.యం.సి.లు లభిస్తాయని నిర్ధారించి, పందారం చేసింది. 1518.43 టి.యం.సి.లలో శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాలలో 'క్యారీ ఓవర్' నిల్వకు అనుమతించిన 150 టి.యం.సి.లను మినహాయిస్తే 1368.43 టి.యం.సి. సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ _  వినియోగ‌ నిష్పత్తి 1:1.40 గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. ఇంకా నిర్మాణం పూర్తి కాని పులిచింతల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ మరియు తుంగభద్ర జలాశయాల్లో పూడిక‌ వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశ‍ం ఆనకట్ట వద్ద నుండి అనివార్యంగా సముద్రం పాలౌతున్న నీటినీ లెక్కలోకి తీసుకోలేదు.
హేతుబద్దం కాని కొలమానాలు - పంపకాలు: బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుండి 1971-72 వరకు అందుబాటులో ఉన్న78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణలోకి తీసుకొని 75% ప్రామాణికంగా 2060 టి.యం.సి. నికర జలాలు, 70 టి.యం.సి.ల పునరుత్పత్తి నీళ్ళు లభిస్తాయని నిర్ధారించి, ఆ మేరకు మహారాష్ట్రకు 585 (560 నికర జలాలు+25 పునరుత్పత్తి జలాలు) టి.యం.సి.లు, కర్నాటకకు 734(700+34) టి.యం.సి.లు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టి.యం.సి.లు కేటాయించింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 112 సం.ల నదీ ప్రవాహ గణాంకాలున్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 సంవత్సరాల నదీ  ప్రవాహ గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని 65% విశ్వసనీయత ఆధారంగా నికరజలాలు 2293 టి.యం.సి.లు లభిస్తాయని నిర్దారించింది. అలాగే  75% విశ్వసనీయతపై 2173 టి.యం.సి.లు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికరజలాలు 2060+ 70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టి.యం.సి.లకు ఇవి సరిసమానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే! బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికరజలాల కేటాయింపును యదాథదంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293-2130) టి.యం.సి.లను మూడు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారిగా కేటాయించింది.
నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యుదుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం విస్పష్టంగా పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా అభ్యంతారాలను బేఖాతరు చేసి ముంబాయ్ మరియు దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్తు ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టి.యం.సి.లతో పాటు మరో 25 టి.యం.సి.లను, సాగు నీటి ప్రాజెక్టులకు 18 టి.యం.సి. వెరశి మొత్తం 43 టి.యం.సి.లను మహారాష్ట్రకు కేటాయించింది. కర్నాటకకు 65 టి.యం.సి.లను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది.
అక్కడితో ఆగ కుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టి.యం.సి.లుగా నిర్ధారించి, 65% విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టి.యం.సి.లు పోను 285 టి.యం.సి. లు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టి.యం.సి., కర్నాటకకు 105 టి.య‍ం.సి.లను ప్రాజెక్టుల వారిగా కేటాయించడం ద్వారా కేంద్ర జల సంఘం నుండి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పైపెచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాము కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది.  ఇది చాలా ప్రమాదకరమైనది. మొత్తంగా మహారాష్ట్రకు  666 (585+43+35+3) టి.యం.సిలు, కర్నాటకకు 911(734+65+105+7) టి.యం.సి.ల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ! మన రాష్ట్రానికి నీళ్ళొచ్చే అవకాశాలు మృగ్యం.
ఆల్మట్టి ఎత్తు పెంపు - మన నెత్తిన కుంపటి: కర్నాటకకు అప్పర్ కృష్ణా ప్రాంతంలో 130 టి.యం.సి. మేరకు కేటాయింపులు పెంచి, వాటిని నిల్వ చేసుకొనే అవకాశం కూడా కల్పించాలని పేర్కొంటూ ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న173 టి.యం.సి. నుండి 303 టి.యం.సి. లకు పెంచుతూ ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసింది. గతంలో సుప్రీంకోర్టు అనుమతించిన 519.6 మీటర్ల ఎత్తుతోనే ఆల్మట్టి డ్యాం నిర్మాణం తరువాత మన రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు అనివార్యమైతే తప్ప, నీటిని విడుదల చేయలేదు. 2060 టి.యం.సి.ల నికరజలాలలో మహారాష్ట్రలోని 8,940 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంత‍ం నుండి 962.5(46.72%) టి.యం.సి.,  కర్నాటకలోని 6,113 చ.కి.మీ. పరివాహక ప్రాంత‍ం నుండి 760.9(36.94%) టి.యం.సి., ఆంధ్రప్రదేశ్లోని 1,929 చ.కి.మీ. పరివాహక ప్రాంత‍ం నుండి 336.6(16.34%) టి.యం.సి.లు లభిస్తున్నాయి. అంటే మన రాష్ట్రానికి కేటాయించిన 800 టి.యం.సి. లలో 336.6 టి.యం.సి.లను మినహాయించి మిగిలిన 463.4 టి.యం.సి. లు + మద్రాసుకు త్రాగు నీటి కోసం 10 టి.యం.సి.(మహారాష్ట్ర, కర్నాటక వాటా) + కనీస నదీ ప్రవాహం వెరసి దాదాపు 500 టి.యం.సి.ల నీరు ప్రతి ఏడాది కర్నాటక నుండి మన రాష్ట్రానికి అనివార్యంగా ప్రవహించాలి. కానీ, కర్నాటక రాష్ట్రం నుండి 2002-03 మరియు 2003-04 లో మన రాష్ట్రానికి ఒక్క టి.యం.సి. నీరు కూడా రాలేదు,  2000-01లో 317, 2001-02లో 140, 2004-05 లో 252 టి.యం.సి.లు మాత్రమే వచ్చాయి. మనకు కేటాయించిన నికర జలాలను కూడా పొందలేక పోయాం. నాడు నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా క్రింద కరువు పరిస్ధితులు నెలకొన్న చేదు అనుభవం ఉన్నది. ఇలాంటి స్ధితిలో తాజా తీర్పు వల్ల‌ భవిష్యత్తులో మరింత‌ దుష్పపరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.   .                                                                              
వివక్షతకు బలి: మన రాష్ట్రానికి వచ్చేటప్పటికీ ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. రాష్ట్రానికి 65% విశ్వసనీయత పద్దు క్రింద 43 టి.యం.సి. లను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టి.యం.సి.లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచని రాజోలి బండ మళ్ళింపు పథకం కుడి కాలువకు 4 టి.యం.సి.లను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశమేమంటే! 65% విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టి.యం.సి.లను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నపథకాలకు కేటాయించకుండా శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు క్రింద జమ చేసింది.  బచావత్ ట్రిబ్యునల్ 150 టి.యం.సి.ల మిగులు జలాలను క్యారీ ఓవర్  నిమిత్తం నిల్వ చేసుకోవడానికి  అనుమతించింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టి.యం.సి.లను మంజూరు చేసి, అందులో 120 టి.యం.సి. లను, వాటికి తోడు 65% విశ్వసనీత ఉన్న30 టి.యం.సి.లను వెరసి 150 టి.యం.సి.లను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో! రావో! తెలియని మిగులు జలాల నుండి 25 టి.యం.సి.లను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది వెనుకబడ్డ రాయలసీమ‌కు దగా చేయడం కాక మరేమౌతుంది? బచావత్ ట్రిబ్యునల్ 811 టి.య‍ం.సి. ల నికరజలాలకు తోడు కృష్ణా డెల్టా మరియు నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూన్, జూలై మాసాల్లోనే నీటిని అందించే నిమిత్తం 150 టి.యం.సి. లను మిగులు జలాల నుండి క్యారీ ఓవర్ పద్దు క్రింద మంజూరు చేస్తే! బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంకెల గారడీతో దగా చేసింది. పేరుకు 1005 టి.యం.సి.లను కేటాయించినట్లు పెర్కొన్నా, వాస్తవానికి 44 టి.యం.సి.లనే అదనంగా కేటాయించింది. అందులో నాలుగు టి.య‍ం.సి.లపై కర్నాటక వివాదాన్ని కొనసాగిస్తున్నది. నియంత్రణ మండలి ఉన్నా పై రాష్ట్రాలు ప్రాజెక్టులను నిర్మించుకొని నీటిని వినియోగించుకోవడం మొదలైన తరువాత ఇహ 75% లేదా 65% విశ్వసనీయతపై కేటాయించిన‌ నికరజలాలు లేదా మిగులు జలాలన్న విసక్షణ ఉండే అవకాశమే లేదు.
గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ట్రకు 99%, కర్నాటకకు 97% సఫలీకృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 68% ఉన్నదని మొరపెట్టుకొన్నా ట్రిబ్యునల్ చెవికెక్కించుకోక పోగా, 75% విశ్వసనీయత ఆధారంగా కేటాయించిన నీటి వినియోగానికి దరిదాపుల్లో సఫలీకృత నిష్పత్తి ఉన్నదని పేర్కొంటు తృణీకారభావంతో మన రాష్ట్ర వాదనను తిరస్కరించింది.
కరవు ప్రాంతాల మధ్య‌ వివక్షతెందుకు? కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీటర్లు, కర్నాటకలో 52,375 చ.కి.మీ., ఆంధ్రప్రదేశ్ లో 45,493 చ.కి.మీ. మేరకు కరవు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డి.పి.ఎ.పి. గణాంకాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65% విశ్వసనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టి.యం.సి.లు. మరియు మిగులు జలాలు 285 టి.యం.సి.లు, మొత్తం 448 టి.యం.సి.ల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. ఏ మాత్రం కనికరం చూపెట్టలేదు. నదీ పరివాహక ప్రాంత‍ం పరిథిలోకి రాని రాష్ట్రాలకు నీటిని తరలించడంపై పరిమితులు విధించిన ట్రిబ్యునల్, పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలను ఒక యూనిట్ గా భావించి నీటిని తరలించడాన్ని చట్టబద్ధమైన చర్యగానే విస్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆచరణలో నీటి కేటాయింపుకు వచ్చేసరికి పరివాహక ప్రాంతంలోని కరవు పీడిత ప్రాంతాలన్న పేరుతో మహారాష్ట్ర , కర్నాటకలకు పొడుగు చేతుల పందారం చేసింది.  పరివాహక ప్రాంతంలోనే ఉన్న మన రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల పట్ల వివక్షత ప్రదర్శించింది.
నదీ ప్రవాహన్ని సజీవంగా ఉంచడం ద్వారా పర్యావరణ, వన్య జంతువుల పరిరక్షణ, సిల్ట్ ను సముద్రం వరకు తీసుకెళ్ళడం కోసం 65% విశ్వసనీయత ఉన్న‌16 టి.యం.సిలను మాత్రమే ట్రిబ్యునల్‌ కేటాయించింది. దీని వల్ల కూడా మన రాష్ట్రానికి తీవ్ర హాని జరుగుతుంది. నదికి ఎగువ భాగంలో ఉన్న‌ మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాల్లో ఓండ్రు మట్టి, ఇసుక, ఉప్పు పోగుబడకుండా దిగువనున్న మన రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక పెరిగిపోతుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యం భాగా పడిపోయి దాదాపు వంద టి.యం.సి.ల మేరకు నష్టపోతున్నామని నిపుణులు అంచనా. నదీ ప్రవాహానికి ప్రస్తుతం చేసిన 16 టి.యం.సి.లు నామమాత్రమే. వాటిని రెండుమూడింతలు పెంచాల్సిన అవసరముంది. తీర్పును అధికారికంగా ప్రకటించి, కేంద్రం మరియు మూడు రాష్ట్రాల ప్రతినిధులతో '''కృష్ణా నదీ జలాల తీర్పు - అమలు మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ సిఫార్సు చేసింది. ‍తుంగభద్ర బోర్డు రద్దయిపోయి మొత్తం కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఒకే బోర్డు నియంత్రణలోకి వస్తుంది. తుంగభద్ర బోర్డు పని విధానానికి సంబందించిన చేదు అనుభవాలు మనకున్నాయి. ఈ తీర్పే చట్టబద్దమయితే మన రాష్ట్రానికి జరిగే నష్టం వర్ణనాతీతం.                                                                                                        
పిల్లికి చెలగాటం_ఎలుకకు ప్రాణ సంకటం: మరొక వైపున‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన‌ ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జల‌ మండలిని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నేతృత్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. నదీ జలాలు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి. అంటే విభజనంటూ జరిగితే నదీ జలాలపై కేంద్ర‍ం పెత్తనం చేస్తుందన్నమాట. ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాల అధికారాలను కబ్జా చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. తద్వారా తెలుగు నాట వివిధ ప్రాంతాల‌ మధ్య నెలకొన్నజఠిలమైన‌ నీటి సమస్యపై కోతి మద్దిస్తం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆయుష్సును పెంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మ‌ధ్య కృష్ణా నదీ జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. మిగులు జలాలపై మన రాష్ట్రానికి ఉన్న స్వేచ్ఛను కాలరాచి,  రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న హంద్రీ-నీవా, గాలేరు -నగరి, వెలుగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి, యస్.యల్.బి.సి. పథకాల  నిర్మాణాన్ని గుర్తించనిరాకరించి, నీటి కేటాయింపుల్లో మొడి చేయి చూపెట్టి, వాటి భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు వేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తెచ్చి కేటాయిస్తుంది? ఎవరిన్ని దగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నాటక మాడుతున్నది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65% విశ్వసనీయతను ప్రామాణికంగా ఎంచుకొని నికరజలాలను నిర్ధారించి, మిగులు జలాలతో సహా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేయడమే కాకుండా ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల మధ్య తంపులు పెట్టి, నీటి యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నది.

వాళ్లకు నీళ్లు... మనకు బీళ్లు

Sakshi  December 17, 2013
వాళ్లకు నీళ్లు... మనకు బీళ్లు
  రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య
 కృష్ణా జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం.


 కృష్ణ మిగులు జలాలను సంపూర్ణంగా విని యోగించుకునే స్వేచ్ఛను హరించి, కరవు పీడిత ప్రాంత ప్రజల ఆశలను ఆవిరి చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగుజాతి పాలిట అశనిపాతమే. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నదిపై 1852-56 మధ్య విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా, గుంటూరు కాలువల లోను, కృష్ణ ఉపనది తుంగభద్రపై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టతో కర్నూ లు- కడప కాలువలోను నీరు పారించాడు. నాగా ర్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవదశకు 1956లోను ప్రాణం పోశారు. ఇదే జరగకుంటే నేడు తెలుగుజాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించలేం!

 భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని 1960లో జరిగిన అంతర్రాష్ట్ర మహా సభ చర్చించింది. 1951కి ముందు నిర్మితమై నీటిని వినియోగించుకొంటున్న, 1950 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి రక్షణ కల్పించాలని ఆ సభ ఆమోదించింది. ఆ నిర్ణ యమే రక్షాకవచమై కృష్ణా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా లభి స్తున్న 2060 టీఎంసీలలో మన రాష్ట్ర వాటా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టీఎంసీలు సురక్షితంగా ఉన్నాయి.

 బ్రిజేశ్ తీర్పు అలా పరిణమించడానికి మూల కారణం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యమే. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఈ అవకాశాన్ని ఉప యోగించుకొని కృష్ణా జలాల పునః పంపకం తాము కోరుకొన్న రీతిలో ఉం డేటట్టు బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో సాధ్యం చేసుకున్నాయి. అర్థ దశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకునే తీరిక మన ప్రభుత్వానికి మాత్రం లేదు. అసలు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్ణాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమలో, మహబూబ్‌నగర్, నల్లగొండ (తెలంగాణ), ప్రకాశం (కోస్తా) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లపై అభ్యంతరాలు లేవదీస్తూనే ఉన్నాయి. 2000 మే 31న ట్రిబ్యునల్ గడువు ముగియగానే అవి ఈ సమస్యపై వివాదాన్ని రేపి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయో గించి విజయం సాధించాయి. మనకి మాత్రం జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలు వ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.

 ఇరుగు-పొరుగుకు అనుకూలంగా...
 నీటి లభ్యతను నిర్థారించడానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎంచుకొన్న ప్రమాణం అసంబద్ధమైనది. కర్ణాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటా యించడానికే కొలమానాలను ఎంచుకున్నట్టు భావించేటట్టుగా ఉంది. మూడు రాష్ట్రాల జలాశయాలలో స్థూలంగా 1919 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న దని, 1518 టీఎంసీల (మహారాష్ట్ర+కర్ణాటక+ఆంధ్రప్రదేశ్‌ః 483.24+479.35+ 555.84= 1618.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, గరిష్టంగా 2313 టీఎంసీ (మహారాష్ట్రలో 551.65 టీఎంసీలు, కర్ణాటకలో 695.97 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లో 1065.44 టీఎంసీల) నీటిని వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసింది. తదనుగుణంగా 65 శాతం విశ్వసనీయత ఆధారంగా 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించి, పం దారం చేసింది. 1518.43 టీఎంసీలలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయా లలో ‘క్వారీ ఓవర్’ నిల్వకు అనుమతించిన 150 టీఎంసీలను మినహాయిస్తే 1368.43 టీఎంసీ సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ - వినియోగ నిష్పత్తి 1:1.40గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. నిర్మాణం పూర్తి కాని పులిచిం తల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాల్లో పూడిక వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశం ఆనకట్ట వద్ద నుంచి అనివార్యంగా సముద్రం పాలవుతున్న నీటిని లెక్కలోకి తీసుకోలేదు.

 హేతుబద్ధం కాని కొలమానాలు
 బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుంచి 1971-72 వరకు అందుబాటులో ఉన్న 78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని 75 శాతం ప్రామాణికంగా 2060 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీల పునరుత్పత్తి నీళ్లు లభిస్తాయని నిర్ధారించింది. ఆ మేరకు మహారాష్ర్టకు 585 (560 నికర జలాలు+ 25 పునరుత్పత్తి జలాలు) టీఎంసీలు, కర్ణాటకకు 734 (700+34) టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టీఎంసీలు కేటాయించింది. కానీ 112 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలు ఉన్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలను మాత్రమే బ్రిజేశ్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొని 65 శాతం విశ్వసనీయత ఆధారంగా నికర జలాలు 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించింది. అలాగే 75 శాతం విశ్వసనీ యతపై 2173 టీఎంసీలు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికర జలాలు 2060+70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టీఎంసీలకు ఇవి సరిస మానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే, బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపును యథాతథంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293- 2130) టీఎంసీలను మూ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించింది.

 గంగలో కలిసిన జాతీయ విధానం
 నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యు దుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా ముంబై, దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టీఎంసీలతో పాటు మరో 25 టీఎంసీలను, సాగునీటి ప్రాజెక్టులకు 18 టీఎంసీలు, మొత్తం 43 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది. కర్ణాటకకు 65 టీఎంసీలను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది.
 అక్కడితో ఆగకుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టీఎంసీలుగా నిర్ధారించి, 65 శాతం విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టీఎంసీలు పోను 285 టీఎంసీలు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టీఎంసీ, కర్ణాటకకు 105 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించడం ద్వారా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మిం చుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పెపైచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది. ఇది చాలా ప్రమా దకరమైనది. మొత్తంగా మహా రాష్ట్రకు 666 (585+4+35+3) టీఎంసీలు, కర్ణాటకకు 911 (734+65+105+7) టీఎంసీల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ మన రాష్ట్రానికి నీళ్లు వచ్చే అవకాశాలు మృగ్యం.

 వాదనలు పట్టని ట్రిబ్యునల్
 మన రాష్ట్రం పట్ల ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. 65 శాతం విశ్వసనీ యత పద్దు కింద 43 టీఎంసీలను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టీఎంసీ లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచిన రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువకు 4 టీఎంసీలను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశం ఏమిటంటే 65 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టీఎంసీలను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పథకాలకు కేటాయిం చకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు కింద జమ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ 150 టీఎంసీల మిగులు జలాలను క్యారీ ఓవర్ నిమిత్తం నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టీఎంసీలను మంజూరు చేసి, అందులో 120 టీఎంసీలను, వాటికి తోడు 65 విశ్వసనీయత ఉన్న 30 టీఎంసీలను వెరసి 150 టీఎంసీలను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో, రావో తెలియని మిగులు జలాల నుంచి 25 టీఎంసీలను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది రాయలసీమను దగా చేయడమే. గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ర్టకు 99 శాతం, కర్ణాటకకు 97 శాతం సఫలీ కృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 68 శాతం ఉన్నదని మొరపెట్టుకున్నా ట్రిబ్యునల్ చెవికెక్కలేదు.

 కరవు ప్రాంతాలపై వివక్ష ఏల?
 కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీ టర్లు, కర్ణాటకలో 52,375 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 45,493 చదరపు కిలోమీటర్ల మేరకు కరువు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డీపీఏపీ గణాం కాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65 శాతం విశ్వనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 టీఎంసీలు, మొత్తం 448 టీఎంసీల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. మరొక వైపున రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదిం చిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జలమండలిని కేంద్ర జలవనరుల శాఖమంత్రి నేతృ త్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య కృష్ణా జలాల సమస్య పరి ష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం. 

Friday, December 13, 2013

వినూత్న శక్తులే విధాతలు

Sakshi  December 11, 2013
వినూత్న శక్తులే విధాతలు


 కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ పోరాటంగా పరిణమించిన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి చరమగీతం పాడాయి. దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో రేఖామాత్రంగా సూచించాయి. రాజ స్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం ఎన్నికలకు, ఢిల్లీ ఎన్నికలకు మౌలికమైన తేడా ఉన్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. ప్రజల ముంగిట మరో బల మైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో గుడ్డిలో మెల్ల మేలన్నట్టు ప్రజలు ఉన్న రెండు పార్టీల్లోనే ఏదో ఒక దాన్ని ఎన్నుకోక తప్పలేదు. కానీ ఢిల్లీ ఎన్నికల సమరం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.

అవినీతి, అధిక ధరల వ్యతిరేక పోరాటాల బాట నుంచి ఎన్నికల బరిలోకి దూకిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ కొత్త రక్తంతో, వినూత్నమైన ఎన్నికల ప్రచారంతో ఈ ఎన్నికల సమరాన్ని కొత్త పుంతలు తొక్కించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, ఎన్నికల నిధి వసూళ్లు, వ్యయాల వరకు పారదర్శకంగా వ్యవహరిం చింది. ప్రత్యేకించి గెలుపోటముల లెక్కలతో నిమిత్తం లేకుండా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై పోటీకి దిగి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు, పోరాట పటిమగల నేతగా గుర్తింపు పొందారు. ఈ అంశాలన్నీ కలిసి ఆ పార్టీని అనూహ్యమైన రీతిలో విజయపథాన నడిపించాయి. అన్నింటికీ మించి కేజ్రీవాల్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో ప్రసార మాధ్యమాలు నిర్వహించిన పాత్ర గణనీయమైనది.

 డబ్బు, కులం, మతం, ప్రాంతం, కండ బలం వగైరా దుష్టశక్తులు ఆధిపత్యం చలాయిస్తున్న ఎన్నికల వ్యవస్థతో విసిగివేసారి పోయిన ప్రజలకు ‘ఆమ్ ఆద్మీ’ విజయాలు గొప్ప ఊరటను కలిగించాయి. లోపభూయిష్టమైన సామాజిక ఆర్థిక వ్యవస్థను మార్చే సైద్ధాంతిక పునాది, పరిణతి, పటిష్టమైన నిర్మాణం ఆ పార్టీకి లేవనే వాదన సద్విమర్శే అయినా వాస్తవాలను నిష్పక్షపాతంగా పరిశీలించవలసి ఉన్నది. నందిని పందిని, పందిని నందిని చేయగల శక్తి డబ్బుకున్నది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగే కొద్దీ రాజకీయ అవినీతి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ధనబలం నిలవరించలేక పోవడం ప్రజాస్వామ్యానికి శుభసూచన. అంకితభావంతో, నిస్వార్థంగా, కష్టనష్టాలకు సిద్ధమై అంకితభావంతో పనిచేసిన యువ కార్యకర్తల భుజాలపైనే విజయబావుటా ఎగిరింది. ఆ పార్టీ మురికివాడల్లోకి చొచ్చుచుపోయి కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీసి ఓటు బ్యాంకులను కొల్లగొట్టింది. మరోవంక మధ్యతరగతి ప్రజల భాగస్వామ్యంతో బీజేపీని దీటుగా ఎదుర్కొన్నది.

 ప్రత్యర్థులుగా నిలిచిన కుబేరులను ఎందరినో మట్టి కరిపించింది. నిత్య అత్యాచారాల నగరమైన ఢిల్లీలో తిరుగుబాటు బాట పట్టిన మహిళా లోకం ఆ పార్టీ వైపే నిలిచింది. శాసనసభకు ఎన్నికైన ముగ్గురు మహిళలూ ఆమ్ ఆద్మీకి చెందిన వారే. నైరాశ్యం అలముకున్న నేటి పరిస్థితుల్లో సామాన్యులకు పరిమితమైన ప్రయోజనం కలిగించే ఇలాంటి విజయాలు సమాజ ప్రగతికి మార్గాన్ని సుగమం చేస్తాయి.

 అవినీతిపై కన్నెర్రజేసి, లోక్‌పాల్ చట్టం కోసం సాగించిన శక్తిమంతమైన ఉద్య మం నుంచి పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ... అవినీతి రహిత సుపరిపాలన, పాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించడం వంటి వాగ్దానాలతో బరిలోకి దిగింది. ఆ నినాదాలు యువతను, పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయి. ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాయి. అవినీతిపరులకు, ధన బలం ఉన్న వారికే రాజకీయాలన్న భావన నెలకొని ఉన్న తరుణంలో... సమాజంలోని కుళ్లును పారదోలడం రాజకీయాల ద్వారానే సాధ్యమనే చైతన్యాన్ని రగిల్చే నూతన శక్తుల రంగప్రవేశానికి ఆమ్ ఆద్మీ నాంది పలికింది. ప్రత్యేకించి యువత ఆదర్శవాదంతో ముందడుగు వేసింది. ఫలితంగా అధికారబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని, హిందూత్వ భావజాలం, నిర్మాణ బలమున్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీని సవాలు చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కేంద్ర స్థానమైన ఢిల్లీలో పాగా వేసింది. అధికారాంధకారంతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీని తేలికగా తీసిపారేస్తే, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ దాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే నామమాత్రపు పార్టీగా ఈసడించింది. కాంగ్రెస్‌పార్టీ 25 శాతం ఓట్లతో 8 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. నరేంద్రమోడీని ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టాలని కలలు కంటున్న బీజేపీ ఢిల్లీలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంఖ్యా బలాన్ని సాధించలేక చతికిలబడింది, 33 శాతం ఓట్లు, 32 స్థానాలతో మిగిలి అంతర్మథనంలో పడింది.

 ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంతగా గాండ్రించినా రాజకీయాల్లో పిల్ల కూన అయిన ఆమ్ ఆద్మీని నిలవ రించలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన 30 శాతం ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ‘ప్రతికూల ఓట్లు’గా భావించడం పొరపాటు అవుతుంది. అవి ఆ పార్టీ అనుసరించిన ప్రజానుకూల రాజకీయాంశాలకు లభించిన సానుకూలమైన ఓట్లుగా గుర్తిస్తేనే ప్రజాతీర్పును సక్రమంగా అర్థం చేసుకున్న వారమవుతాం. అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా వెనుకాడని రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న నేటి పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో 28 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి, అధికారాన్ని అందుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ప్రతిపక్షంలో కూర్చుం టామని ప్రకటించడం ద్వారా ఆమ్ ఆద్మీపై ఢిల్లీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అది వమ్ము చేయలేదనిపిస్తుంది.

 మధ్యప్రదేశ్‌లో బీజేపీ మూడవసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా గత  ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతాన్ని 38 నుంచి 46కు, శాసనసభా స్థానాలను 143 నుంచి 165కు పెంచుకోగలిగింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకోలేని దుస్థితి కాంగ్రెస్‌ది.

 అందుకే అది ఓట్లశాతాన్ని పెంచుకోగలిగినా 71 స్థానాల నుంచి 58 స్థానాలకు దిగజారింది. గతంలో ఏడు స్థానాలను గెలుచుకున్న బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఆపసోపాలు పడుతూ ఉన్న అధికారాన్ని నిలుపుకొన్నది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఇటీవలే మావోయిస్టు దాడిలో రాష్ట్ర నేతలను కోల్పోయిన సానుభూతి జతై అధికారం దక్కించుకోవచ్చనుకున్న కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇక రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ ఓటమి ఊహించినదే. ఈశాన్య భారత్‌లోని మిజోరాంలో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ఊరట కలిగించగలిగేది కాదు.

 ఎన్నికల బరిలో దిగి, సత్ఫలితాలను సాధించలేకపోయిన ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికల ఫలితాల నుంచి సరైన గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. బీఎస్పీ గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను, సీట్లను నిలబెట్టుకోలేకపోయింది. సమాజ్‌వాది పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ, వామపక్ష పార్టీలు ఫలితాలను లోతుగా విశ్లేషించుకోవడం అవసరం. కాంగ్రెస్, బీజేపీలకు దీటైన ప్రత్యామ్నాయం ఆవిర్భవించకపోవడానికున్న అవరోధాలు, కారణాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆమ్ ఆద్మీ ఢిల్లీ విజయంతో ఇదే వరవడిలో దేశంలోని మిగిలిన మహానగరాలకు కూడా ఆ పార్టీ విస్తరించే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో జాతీయ పార్టీలు వైఫల్యం చెందడం మూలంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. దశాబ్దాలుగా ఉన్న ప్రాంతీయ పార్టీల వైఫల్యం వల్ల కొత్త ప్రాంతీయ పార్టీలు మొగ్గ తొడుగుతున్నాయి.

 ఆమ్ ఆద్మీ లాంటి రాజకీయ పార్టీల మనుగడపై ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా... ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించుకొంటూ, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయకుంటే, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, ఆర్థిక అసమానతలను, సాంఘిక అసమానతలను పెంచిపోషిస్తూ పోతే రాజకీయరంగంలో ఇలాంటి పెను మార్పులు సంభవిస్తూనే ఉంటాయని గుర్తించక తప్పదు. కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో పాలన సాగిస్తూ, సామాన్య ప్రజల సంక్షేమాన్ని మరచిన కాంగ్రెస్ పార్టీని పెట్టా బేడా సర్దుకోమని ఈ ఎన్నికల ఫలితాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయని చెప్పవచ్చు. యూపీఏ2 ప్రభుత్వం ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, గృహరుణాల వడ్డీ రేట్ల పెరుగుదల, మహిళపై అఘాయిత్యాలు వగైరా అన్నింటా ఘోరాతి ఘోరంగా వైఫల్యం చెందడమే గాక అందుకు నిరసన తెలిపిన ప్రజలపై, ఉద్యమాలపై లాఠీలు, తూటాలతో, అరెస్టులు, నిర్బంధాలతో విరుచుకుపడింది. తాజా శాసనసభ ఎన్నికల ప్రజాతీర్పు దాని గూబ గుయ్యిమనిపించింది. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇలాగే ప్రవర్తిస్తే అదే శాస్తి తప్పదు
విశ్లేషణ
టి.లక్ష్మీనారాయణ, డెరైక్టర్, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం