Sunday, February 23, 2014

విధానాలే అజెండా కావాలి!



కూటముల కోసం పార్టీల అన్వేషణ
కంటిలో నలుసులా ఆమ్‌ ఆద్మీ
20 మంది ఎంపీ అభ్యర్ధుల ప్రకటన
వాగ్దానాలు నెరవేర్చేందుకు అడుగులు
దుందుడుకు చర్యలంటూ విమర్శలు
చిన్న ప్రయత్నానై్ననా ప్రోత్సహించాలి
ఆమ్‌ ఆద్మీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి
కార్పొరేట్ల చేతుల్లో రెండూ పావులే!
ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురు చూపు


దేశంలో ఎన్నికల వేడి రాజుకొంటున్నది. రాజకీయ కూటముల ఏర్పాటులో రాజకీయ పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. అధికార పీఠాన్ని అధిష్ఠించి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. కూటమికి, ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్ళూరుతున్న బి.జె.పి. నాయకత్వంలోని యన్‌.డి.ఎ. కూటమికి- ఆమ్‌ ఆద్మి పార్టీ కంటిలో నలుసులా పరిణమించినట్లు భావించడం జరుగుతోంది. ఇటీవల జరిగిన దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల ఫలితాలతో ఈ భావనకు బలం చేకూరింది. ఢిల్లీలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ బి.జె.పి. ప్రభుత్వాన్ని నెలకొల్ప లేక పోయింది. రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తనదైన శైలిలో 48 రోజుల పాటు పరిపాలన సాగించారు. తన ఎన్నికల వాగ్దానమైన్‌ జన్‌ లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టడానికి శాసనసభ తిరస్కరించడంతో రాజీనామా చేసి, తిరిగి ప్రజా క్షేత్రంలోకి దూకారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే ఇరవై మంది అభ్యర్థుల పేర్లను అందరి కంటే ముందుగా ప్రకటించి ఎన్నికల యుద్ధభేరి మ్రోగించారు.

పార్టీ పేరు ఆమ్‌ ఆద్మీ. సిద్ధాంతపరంగా ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఉండాలి. అంటే, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. అవినీతిని తుదముట్టించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో కార్యాచరణ. సంక్షేమ రాజ్యంలో సామాన్యుల జీవితాలకు ఊరట కలిగించే రాయితీలను ఇవ్వడం ప్రభుత్వ విధి అని విశ్వసిస్తున్న పార్టీ. ఇదే స్థూలంగా కేజ్రీవాల్‌ కేంద్ర బిందువుగా నెలకొల్పిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సైద్ధాంతిక పునాదిగా కనబడుతున్నది. ఆ పార్టీ ఆచరణను పరిశీలించినా అందుకు అనుగుణంగానే అంకిత భావంతో పని చేస్తున్న అభిప్రాయం కలుగుతున్నది. ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టిన వెనువెంటనే పలు ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం మీటర్‌ల ఆధారంగా ప్రతి కుటుంబానికి రోజుకు 667 లీటర్ల ఉచిత నీటి సరఫరాను, నెలసరి 400 యూనిట్లకు లోపు విద్యుత్తును వినియోగించుకొనే కుటుంబాలకు చార్జీలలో 50 శాతం రాయితీ, విద్యుత్‌ బిల్లుల తయారీలో జరిగిన అవకతవకలను సరిదిద్దడంలో భాగంగా 24,000 మదిరకి బిల్లుల చెల్లింపులో 50 శాతం రాయితీ, నర్సరీ స్కూళ్ళ ప్రవేశాలలో అవినీతిని అరికట్టే ధ్యేయంతో సహాయ కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రతి పాఠశాలకు లక్ష రూపాయల మంజూరు, బడా పెట్టుబడిదారులకు చెందిన ప్రయివేటు విద్యుత్‌ సరఫరా సంస్థల గణాంకాలను బహిరంగ పరచాలని డిమాండ్‌ చేయడం, వి.ఐ.పి. సం„స్కృతికి చెల్లు చీటీ పలుకుతూ ప్రభుత్వ వాహనాలపై రెడ్‌ అండ్‌ బ్లూ బుగ్గల తొలగింపు,

పొలీసుల దుశ్చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే సామూహిక ధర్నా, 2010లో కామన్‌ వెల్‌‌త క్రీడల నిర్వహణలో వెలుగు చూసిన అక్రమాలపై నాటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసి విచారణ చేపట్టాలని, సహజ వాయువు ధరల పెంపు అంశంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రిలయన్‌‌స పరిశ్రమపైన, రిలయన్‌‌స పరిశ్రమ అధినేత ముఖేష్‌ అంబానితో- కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయి సహజ వాయువు ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచి, విద్యుత్తు చార్జీల పెరుగుదలకు దోహదపడ్డారని ఆరోపిస్తూ కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖామాత్యులు వీరప్ప మొయిలీ, మాజీ కేంద్ర మంత్రి మురలి దియోరా లపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని ఎ.సి.బి.ని ఆదేశిస్తూ ఉత్తర్వుల జారీ చేయడం ఈ కోవ క్రిందికే వస్తాయి.కేజ్రివాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యలన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి. వీటిపై కొన్ని తరగతుల నుండి విమర్శులు వెల్లువెత్తినా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకత్వం- అధికార దాహంతో పని చేసిందని ఎవరూ అనలేరు. అనాలోచితంగా రాయితీల పందారం చేసిందనో, దుందుడుకు చర్యలకు పూనుకొన్నదనో, ముఖ్యమంత్రిగా ఉంటూ ఆందోళనలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమేమిటి అనో- కొందరు ప్రశ్నించి ఉండవచ్చు. అంతే గానీ చేజిక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కారని విమర్శించే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు. భ్రష్ఠు పట్టిన రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేయడం అసాధ్యమనే నిరుత్సాహ వాతావరణం అలముకొని ఉన్న నేటి పరిస్థితుల్లో- ఒక చిరు ప్రయత్నం ఎవరు ఏ రూపంలో చేసినా శుభ పరిణామంగా భావించి, ప్రోత్సహిస్తే సమాజానికి కొంతైనా మేలు జరుగుతుందేమో! సమాజాన్ని నియంత్రిస్తూ, మౌలిక సమస్యలకు హేతుబద్ధమైన పరిష్కారాలను అన్వేషించి, అమలు చేస్తూ, ప్రగతికి బాటలు వేయవలసిన గురుతర బాధ్యత రాజకీయ వ్యవస్థపై ఉన్నది. సైద్ధాంతిక, రాజకీయ పరంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ పరిణతి చెందిన పార్టీ అని అభివర్ణించడం దుస్సాహసమే అవుతుంది. అపారమైన త్యాగాలతో సముపార్జించుకొన్న స్వాతంత్య్ర ఫలాలు సామాన్యుడికి అందని ద్రాక్ష పళ్ళుగానే మిగిలిపోయాయి.

దారిద్య్రం, నిరుద్యోగం, అధిక ధరలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అవినీతి అందలమెక్కి రాజ్యమేలు తున్నది. సమాజంలో అవినీతికి రాజకీయ అవినీతే మూలం. ధన బలం, కండ బలం ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నాయి. కడకు, మంద బలం ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పార్లమెంటులోకి చొచ్చుకుపోయి ప్రజాస్వామ్యాన్ని గొడ్డలివేటుకు గురిచేసిన తాజా „సంఘటనలను చవిచూశాం. రాజకీయ పార్టీలలో అవకాశవాదం తారా స్థాయికి చేరింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఢిల్లీ శాసన సభలో కాంగ్రెస్‌, బి.జె.పి. రెండూ ఏకమయ్యాయి. అవినీతిపై పోరు సాగించడానికి శక్తివంతమైన జన్‌ లోక్‌ పాల్‌ చట్టాన్ని తీసుకొస్తే ప్రజల చేతుల్లో ఆయుధంగా ఉంటుందని సర్వత్రా అంగీకరిస్తున్న అంశం. సాంకేతికపరమైన కారణాలను సాకుగా చూపెట్టి ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ అభ్యంతరం చెప్పడం, కాంగ్రెస్‌- బి.జె.పి. ఒక్కటై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడాన్ని బట్టి వాటి నిజస్వరూపం బట్టబయలైంది. తెలుగు జాతిని అడ్డగోలుగా రెండు ముక్కలు చేయడానికి పార్లమెంటు విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసే విధంగా ఆ రెండు పార్టీలు నిస్సిగ్గుగా ఏకమైనాయి. ఈ తాజా ఘటనలను పరిశీలించిన వారికెవరికైనా ఈ రెండు పార్టీలు ఒకే తానులోని ముక్కలేననే విషయం స్పష్టమవుతుంది. వీటి పట్ల విసుగు చెందిన ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారు.

రాజకీయ రంగంలో దినదినానికీ పతనమైపోతున్న నైతిక విలువలకు జీవం పోసే చిరు ప్రయత్నం ఎవరు చేసినా ఆధరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీకి లభించిన మద్దతే ప్రబల నిదర్శనం. అలాంటి ప్రయోగాలు విఫలమైతే ప్రజల్లో నిర్వేదం బలపడుతుంది. సుస్పష్టమైన సైద్ధాంతిక పునాది, సమకాలీన సమస్యలపై శాస్త్రీయమైన, హేతుబద్ధమైన చింతన లేకుండా వ్యక్తుల చుట్టూ పరిభ్రమించే రాజకీయ పార్టీల ప్రభావం సమాజంపై పరిమితంగానే ఉంటుంది. దీర్ఘకాలికంగా మనుగడ సాగించడమూ కష్టమే. అలాంటి పార్టీల్లో ప్రజాస్వామ్య పనివిధానానికి ఉండే అవకాశం తక్కువే. ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక వ్యవస్థ- కార్పొరేట్‌ రంగం గుప్పిటలోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్‌ రంగంలోని ముఖేష్‌ అంబానీ వంటి దిగ్గజాల కనుసన్నల్లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దేశ సహజ వనరులను కొల్లగొట్టి, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించి, సంపదను గుట్టలు గుట్టలుగా పోగేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాల వ్యతిరేకతను ఎన్నికల అజెండాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ మార్చడానికి చేస్తున్న ప్రయత్నం అభినందించతగినది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, అధికారం కోసం అర్రులు చాస్తున్న బి.జె.పి. రెండూ కూడా కార్పొరేట్‌ రంగం చేతుల్లో పావులే. కార్పొరేట్‌ రంగ దిగ్గజాలు అందించే డబ్బు సంచులతోనే ఎన్నికల ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చి, ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, మాఫియా ముఠాలు, చీకటి వ్యాపారాలలో అందెవేసిన వ్యక్తులు- డబ్బు సంచులతో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో- ధన ప్రభావం లేని రాజకీయాల కోసం అంకిత భావంతో ఎన్నికల బరిలో నీతి నిజాయితీ పరులను దించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రయత్నం స్వాగతించతగినది. కృష్ణా- గోదావరి బేసిన్‌ లో లభిస్తున్న సహజ వాయువును సొంతం చేసుకొని లక్షల కోట్ల రూపాయలు గడించడానికి రిలయన్‌‌స సంస్థకు కేంద్ర ప్రభుత్వం లైసెన్‌‌స ఇచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ ఒ.యన్‌.జి.సి.ని పక్కకు నెట్టి ముఖేష్‌ అంబానీకి అప్పగించింది. అమలులో ఉన్న ఒప్పందం మేరకు 2014 ఏప్రిల్‌ 1 వరకు సహజవాయువు ధరను ఒక మిలియన్‌ బ్రిటిష్‌ థెర్మల్‌ యూనిట్‌ కు రూ. 4.2 డాలర్లుగా నిర్ణయించారు. రిలయల్‌‌స సంస్థ అడుగులకు మడుగులొత్తే కేంద్ర ప్రభుత్వం- ఒప్పందం గడువు ముగియక ముందే యూనిట్‌ ధరను 8.4 డాలర్లకు పెంచుతూ నిర్ణయం చేసింది. తద్వారా ఏడాదికి రూ. 54,500 కోట్ల మేరకు ప్రజలపై భారం అడుతుంది.

అది చాలదన్నట్లు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు రిలయన్‌‌స సంస్థకు లబ్ధి చేకూర్చే విధంగా మరొక నిర్ణయం కూడా చేసింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజవాయువు అమ్మకపు ధరను రూపాయల్లో కాకుండా డాలర్లలో నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ డొల్లతనం బయటపడుతున్నది. పర్యవసానంగా రసాయనిక ఎరువుల ధరలు, విద్యుత్తు చార్జీలు, వంట గ్యాస్‌ ధరలు ఇంకా పెరిగి సామాన్యుడి వెన్ను విరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ అండదండలతో రిలయన్‌‌స సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ చేస్తున్న ఘరానా దోపిడీని, కృష్ణా - గోదావరి బేసిన్‌ మన రాష్ట్రంలో ఉన్నా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలవరించలేక పోయింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏకంగా ఈ అవినీతి కుంభకోణానికి బాధ్యులైన వారందరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం ద్వారా ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు బావుటాను ఎగరవేసింది. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాల వల్ల జరుగుతున్న దుష్ఫలితాలను, జాతికి జరుగుతున్న నష్టాన్ని ఎన్నికల అజెండాగా మార్చడం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రతిఘటనోద్యమానికి బాటలు వేయడం శుభƒ సూచికం. రానున్న ఎన్నికలు డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికగా కాకుండా ప్రజల నిజజీవితాలతో చెలగాటమాడుతున్న రాజకీయ, ఆర్థిక విధానాల ప్రాతిపదికగా జరగడానికి ఎవరు ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రజలు స్వాగతించవలసి ఉన్నది.