Wednesday, April 30, 2014

శ్రమపై పెట్టుబడి ముప్పేట దాడి


Surya Daily, May 1, 2014

శ్రమ శక్తి సమరశీల పోరాటానికి ప్రతీక మే డే. ఎనిమిది గంటల పని దినం కోసం చికాగో నగర కార్మికులు 128 (1886 మే 1) సంవత్సరాల క్రితం చేసిన వీరోచిత సమ్మె ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో చేరింది. నాటి కార్మిక వర్గం చేసిన ప్రాణ త్యాగాలు, చిందించిన రక్తం నేటితరం కార్మిక వర్గానికి విప్లవ స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. ఇంత వరకు నడచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రేనని కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స, ఫ్రెడరిక్‌ ఎంగెల్‌‌స పేర్కొన్నారు. ఆ వర్గ పోరాటాల చరిత్ర కొనసాగింపులో నేడొక నూతన దశ ఆవిష్కృతమయ్యిందని భావించవచ్చు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరప్‌ లోని సోషలిస్టు దేశాలు కుప్పకూలిన తరువాత పెట్టుబడిదారీ వ్యవస్థకు మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న అమెరికా పెట్రేగిపోయింది. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ భావజాలాన్ని అంతర్జాతీయ సమాజంపై రుద్దింది. బూర్జువా వర్గం ఉత్పత్తి చేసే సరుకులకు నిత్యం విస్తరించే మార్కెట్‌ కావాలి గనుక, ఆ అవసరం ఆ వర్గాన్ని ప్రపంచపు నలుమూలలకు తరుముతోంది. ప్రపంచ మంతటినీ తన మార్కెట్‌ గా చేసుకోవడం ద్వారా బూర్జువావర్గం ప్రతి దేశంలోనూ సరుకుల ఉత్పత్తికీ, సరుకుల వినియోగానికీ జాతి అతీత స్వభావం కల్పించింది అన్న కమ్యూనిస్టు ప్రణాళికలోని అంశం అక్షర సత్యంగా నేటి ప్రపంచీకరణ విధానాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ప్రపంచీకరణ భావజాలంతో ఊపు మీదున్న పెట్టుబడిదారీ వ్యవస్థ తన సహజ లక్షణాలు ప్రకోపించడంతో సంక్షోభాల సుడిగుండంలోకి మునిగింది. అమెరికా పుట్టి ముంచిన ఆర్థిక సంక్షోభం మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్లతనం బహిర్గతమయ్యింది. సామ్రాజ్యవాదుల చేతుల్లో పనిముట్లుగా ఉన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య మండలి పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభం నుండి బయటపడవేయడానికి రంగంలోకి దిగాయి. అమెరికాకు, బహుళ జాతి సంస్థలకు కొమ్ముగాస్తూ వెనుకబడ్డ, వర్ధమాన దేశాల ప్రభుత్వాల నెత్తిన కూర్చొని నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలును వేగవంతం చేశాయి.

ఆర్థిక సంక్షోభాల నుండి ఉపశమనం పొంది, దోపిడీ వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రభుత్వాలు, యాజమాన్యాలు కార్మిక వర్గాన్ని బలిపశువుగా చేస్తున్నాయి. కార్మిక వర్గ హక్కులపై పథకం ప్రకారం బహుము దాడికి పూనుకొన్నాయి. సంఘం పెట్టుకొనే ప్రాథమిక హక్కును, సమ్మె హక్కును కాలరాయడానికి బరితెగించాయి. నిజ వేతనాల్లో కోత విధిస్తూ పని భారాన్ని పెంచేస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్‌ స్థానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. సామాజిక భద్రతా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య సాకుతో పెట్టుబడిదారులు శ్రమదోపిడీ నిష్పత్తిని పెంచుకొంటున్నారు. అసంఘటిత కార్మికులను, శ్రామిక మహిళలను, యువతను, బాలకార్మికులను అధికంగా దోపిడీకి గురిచేస్తున్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మికులు పోరుబాట పట్టారు. అమెరికాలో సహితం జరిగిన ఆక్యుపై వాల్‌ స్ట్రీట్‌ ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
మన దేశంలోని జాతీయ కార్మిక సంఘాలు రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా సార్వత్రిక సమ్మెలు చేశాయి.

అయినా కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే ప్రక్రియను యథేచ్చగా కొనసాగిస్తున్నది. పెట్టుబడిదారీవర్గం గరిష్ఠ లాభాలను ఆర్జించుకోవడానికి శాస్త్ర, సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొంటూ, కార్మికుల శారీరక, మేథో శ్రమలను దోచుకొంటున్నది. పెట్టుబడి ప్రవేశపెడుతున్న సరికొత్త దోపిడీ రూపాలను పసిగట్టడమే కార్మిక వర్గానికి దుర్లభంగా పరిణమించింది. దోపిడీ శక్తులు సాగిస్తున్న బహుముఖ దాడులను ఎదుర్కొంటూ కార్మికవర్గం మనుగడ సాగించడమే జీవన్మరణ సమస్యగా తయారయ్యింది. ఆత్మరక్షణలో పడిన కార్మిక వర్గం అపారత్యాగాలతో సముపార్జించుకొన్న చట్టాలు, హక్కుల పరిరక్షణ ఉద్యమాలకే అధిక ప్రాధాన్యత నివ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. సంస్కరణల అమలు మొదలైన1990 దశకం ప్రారంభం నుండి సంభవించిన దుష్పరిణామాలు కార్మిక వర్గానికి శరాఘాతంగా తగులుతున్నాయి. జాతీయ స్థూలఉత్పత్తి (జి.డి.పి.) పెరుగుదల, తరుగుదల గణాంకాలతో బూర్జువా ఆర్థికవేత్తలు అభివృద్ధి నిష్పత్తిపై మల్లగుల్లాలు పడుతున్నారు తప్ప, పతనమవుతున్న కార్మికుల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవడమే లేదు.

జాతి సంపద సృష్టికర్తలైన శ్రామిక ప్రజల సంక్షేమాన్ని విస్మరించడంతో పాటు, వారి మూలుగల్ని పీల్చి పిప్పిచేసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఉపాధి రహిత అభివృద్ధితో- శాశ్వత స్వభావంగల ఉద్యోగాలను కనుమరుగు చేస్తున్నారు. అసంఘటిత రంగంలోనే 2 శాతం ఉపాధి కల్పన ఉన్నదని ప్రభుత్వ కమిటీల నివేదికలు వెల్లడించాయి. అసంఘటిత రంగంలోని కార్మికు ఉపాధికి, వేతనాలకు, సామాజిక భద్రతకు రక్షణ లేదని, పనిపరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కూడా ఆ నివేదికలే పేర్కొన్నాయి. దేశంలో 45.95 కోట్ల శ్రామిక జనాభా ఉంటే వారిలో 2.65 కోట్లు (5.66శాతం) సంఘటిత రంగంలోను, 43.3 కోట్లు (94.34శాతం) మంది అసంఘటిత రంగంలోను పని చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ తన 2004-05 నివేదికలో వెల్లడించింది. ఆ తరువాత సంస్కరణల అమలు వేగం పెరగడంతో ఆ సంఖ్య మరింత పెరిగి అధ్వాన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సంఘటిత రంగంలోని అత్యధిక కార్మికులు, ఉద్యోగులు కేంద్ర కార్మిక సంఘాలలోనో లేదా పారిశ్రామిక, ఆయా సంస్థల కార్మిక సమాఖ్యలలోనో సభ్యులుగా చేరి సమష్ఠి బేరసారాలాడే శక్తిని ప్రదర్శిస్తూ కాస్తమెరుగైన వేతనాలు, ఉద్యోగభద్రత తదితర హక్కులను అనుభవిస్తు న్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో అత్యధికులు కార్మిక సంఘాల వెలుపల చెల్లా చెదురుగా విస్తరించిఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కార్మికుల కొనుగోలు శక్తిపై, జీవన ప్రమాణాలపై గొడ్డలి పెట్టుగా పరిణమించింది. కోట్ల మంది అసంఘటిత కార్మికులు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్నారు. అర్ధనిరుద్యోగులుగా పేదరికంలో, అర్థాకలితో బ్రతుకులీడుస్తున్న అసంఘటిత కార్మికులకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పిల్లలకు విద్యావసతులు అందు బాటులో లేవు. ఉమ్మడి బేరసారాలాడే శక్తిని బల హీనపరచడం, న్యాయబద్ధమైన కోర్కెలను తిరస్కరిస్తూ, శాంతియుతమైన నిరసనలను కూడా ప్రభుత్వాలు, యాజమాన్యాలు సహించలేని వాతావరణం నెలకొన్నది. పెద్ద సంఖ్యలో కార్మికులను, ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని పెంచేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వవిభాగాల్లో, కార్పొరేషన్లలో కాంట్రాక్టు కార్మికులు, క్యాజువల్‌ కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగుల నియామకం ద్వారా శాశ్వత ఉద్యోగాల స్వభావం కలిగిన పనులను చేయించుకొంటున్నారు.
సంఘటిత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులపైనా దాడికి పూనుకోవడంతో మొత్తం కార్మిక వర్గమే కష్టాలకడలిలో పడింది. ఒకరోజు సమ్మెకు మూడునుండి వారం రోజుల వేతనాన్ని ప్రభుత్వ సంస్థల్లో కోత పెడుతున్నారు.

ప్రయివేటు సంస్థలో ఉపాధి నుండి తొలగిస్తు న్నారు. ప్రయివేటు రంగంలోని అత్యధిక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, సేవా రంగం, అసంఘటిత రంగంలోని యాజమాన్యాలు కార్మికుల చేత 12 నుండి 14 గంటలు పని చేయించుకొంటున్నారు. కనీస వేతనాలు చెల్లించడం లేదు. హైర్‌ అండ్‌ ఫైర్‌ విధానాన్ని అమలు చేస్తూ పని భద్రత లేకుండా చేశారు. సామాజిక భద్రతా చట్టాల అమలు ఊసేఎత్తడం లేదు. కార్మిక శాఖ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చట్టాలు నిరుపయోగంగా తయారయ్యాయి. అసంఘటిత కార్మికుల్ని సంఘటితపరిచి వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను సంఘటిత కార్మిక వర్గం కొంత వరకు గుర్తించినట్లు కనబడినా ఆచరణలో ముందడుగు వేయలేకపోతున్నది. కార్మిక సంఘాలు చొరవచేసి నిరుద్యోగులను కార్మికోద్యమం వైపు ఆకర్షించి, సంఘటితపరచి నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా, అందరికీ ఉపాథికల్పించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలకు ఉపక్రమించక పోతే కార్మిక వర్గ అభ్యున్నతికి నిరుద్యోగ సమస్య పెద్ద అవరోధంగా నిలుస్తున్నది. పారిశ్రామిక విప్లవంతోపాటు కార్మికోద్యమం ఆవిర్భవించింది. అంతర్జాతీయ కార్మికోద్య మంలో అంతర్భాగంగా మన దేశంలో ప్రప్రథమంగా ఆలిండియా ట్రేడ్‌యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎ.ఐ.టి.యు.సి.) 1920 అక్టోబరు 31న బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల వలస పాలన కాలంలోనే ఉద్భవించింది. కార్మికశక్తిని సంఘటితపరచి స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించింది.

కార్మికుల హక్కుల కోసం వివిధ రూపాలలో కార్మికోద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో కార్మిక శాసనాలు రూపొందించబడలేదు. అవి కార్మిక వర్గం అపారమెన త్యాగాలు, పోరాటాలతో సాధించుకొన్నవే. వర్‌‌కమన్‌‌స కాంపెన్‌ జేషన్‌ చట్టం-1923 మొదలు ట్రేడ్‌ యూనియన్‌ చట్టం-1926, పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌ చట్టం- 1936, పారిశ్రామిక వివాదాల చట్టం- 1947, ఫ్యాక్టరీల చట్టం- 1948, కనీస వేతనాల చట్టం- 1948, ఇ.యస్‌.ఐ. చట్టం- 1948, ఇ.పి.ఎఫ్‌. చట్టం- 1952, మెటర్నిటీ బెనిఫిట్‌ చట్టం- 1961, బోనస్‌ చట్టం- 1965, కాంట్రాక్‌‌ట కార్మికుల (క్రమబద్ధీకరణ- నిషేధం) చట్టం- 1970, గ్యాట్యుటీ చట్టం- 1972, సమాన పనికి సమాన వేతన చట్టం- 1976 వగైరా అనేక కార్మిక చట్టాలను ఉద్యమాలద్వారా సాధించుకొన్న ఘనమైనచరిత్ర భారత కార్మికోద్యమానికి ఉన్నది. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ జపం చేస్తున్న ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో పెట్టుబడిదారులకు అనుకూలంగా మౌలికమైన మార్పులు, చేర్పులూ చేయాలని, కొన్నింటిని అటకెక్కించాలని శత విధాల ప్రయత్నిస్తున్నాయి. పెట్టుబడిదారి వ్యవస్థపై తిరుగబడి, తెగించి పోరాడితేతప్ప కార్మిక వర్గం మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

దేశాభివృద్ధి ఫలాలను పెట్టుబడిదారీవర్గం సొంతం చేసుకొని అనుభవిస్తున్నది. అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి దోపిడీ కనికట్టు మాయాజాలంగా తయారయ్యింది. సహజవనరుల్ని కొల్లగొడుతున్నారు. ఉత్పత్తి సాధనాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని, అతి తక్కువ వేతనాలతో శ్రమ శక్తిని దోపిడీ చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ఉత్పత్తులకు విశాలమైన మార్కెట్‌, ప్రసార మాధ్యమాలు, రాజకీయ రంగం, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలపై పట్టు సాధించుకొని స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్థలు, ప్రయివేటు సంస్థలు దోపిడీని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను కనుమరుగుచేస్తూ రాజ్యాంగంలో పొందుపరచుకొన్న సంక్షేమరాజ్యస్థాపన లక్ష్యంనుండి పాలకపార్టీలు ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణానికి కంకణబద్ధులైనాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం దోపిడీ శక్తులు, దోపిడీకి గురయ్యే శ్రామిక వర్గం మధ్య అనివార్యంగా వర్గ సంఘర్షణ ఉంటుంది. రెండింటి సైద్ధాంతిక దృక్పథాలు వేరు. వర్గ పోరాటాల వైపు సంఘటిత, అసంఘటిత కార్మికులను, నిరుద్యోగ యువతను నడిపించాల్సిన గురుతరబాధ్యత కార్మికోద్యమంపై ఉన్నది.

Thursday, April 24, 2014

"ప్రజాస్వామ్యం బలపడుతోందా? "

ఏప్రిల్ 25, 2014  సూర్యా దినపత్రిక

 ఎంపీల వర్గ పొందికలో మార్పులు
ప్రజలకు దూరమవుతున్న పార్లమెంట్‌
సంక్షోభంలో పార్టీలు- కార్యకర్తల సంబంధాలు
ఎన్నికల్లో ధనం, కులం ప్రభావం
కార్యకర్తలకు శూన్య హస్తాలు
కార్పొరేట్లకు, ధనికులకు దాసోహాలు
అనూహ్య స్థాయిలో ఫిరాయింపులు
అన్ని పార్టీల్లో అన్ని పార్టీల ఫిరాయింపుదార్లు
పాలక వ్యవస్థలో నేరస్థులు, అవినీతిపరులు


భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరు దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్నది. లోక్‌ సభగా పిలిచే ప్రజల సభ (హౌస్‌ ఆఫ్‌ పీపుల్‌)కు ప్రజా ప్రాతినిథ్య చట్టం- 1951 ప్రకారం ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. మొదటి లోక్‌సభకు 1951లో ఎన్నికలు జరిగాయి. నేడు 16వ లోక్‌ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాటికి నేటికి పరిస్థితుల్లో, లోక్‌సభ సభ్యుల వర్గ పొందికలో గుణాత్మకమైన మార్పులు సంభవించాయి. పర్యవసానంగా పార్లమెంటుకు ప్రజలకు మధ్య ఉండవలసిన సంబంధం క్రమేపీ బలహీనపడుతున్నదనే అభిప్రాయాలు నెలకొంటున్నాయి. మన ప్రజాస్వామ్య మెరుగైన పని విధానం బహుళ పార్టీ వ్యవస్థపై ఆధారపడి ఉన్నది. రాజకీయ పార్టీల నిర్మాణంలో కార్యకర్తలే పునాది రాళ్ళు. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే రాజకీయ పార్టీల నాయకత్వాలకు, కార్యకర్తలకు మధ్య ఉండవలసిన సంబంధాలు సంక్షోభంలో పడ్డట్లు కనబడుతున్నది. నిత్యం ప్రజా సంబంధాలతో, మంచికి- చెడుకు అందుబాటులోఉన్న కార్యకర్తలను- ఎన్నికలొచ్చేనాటికి రాజకీయపార్టీల అధినాయకత్వం విస్మరించి, ధనం, కులం వగైరా అంశాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొంటోంది. గెలుపు గుర్రాలను ఎంపిక చేశామంటూ బి ఫారం లిచ్చి అభ్యర్థులుగా రంగంలోకి దించుతున్నాయి. అధికారం కోసం పోటీ పడుతున్న ప్రధాన రాజకీయపార్టీలు సీట్లను కార్పొరేట్‌ రంగానికి కట్టబెడుతున్నాయి. బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులు టిక్కెట్లను తన్నుకు పోతున్నారు.

నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొని మంత్రులుగా, ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉంటూ ప్రజల కడగండ్లను పట్టించుకోనివారు రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించి వైకాపా, తెదేపా, తెరాస, భాజపా కండువాలు వేసుకొని అభ్యర్థులుగా దర్శనమిస్తుంటే, ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. ప్రజావ్యతిరేకపాలన సాగించడమే కాకుండా తెలుగు ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన కాంగ్రెస్‌ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కంకణబద్ధులై ఉన్న ఓటర్లకు ఆ పార్టీనేతలే ప్రత్యర్థిపార్టీల అభ్యర్థులుగా దర్శనమిస్తుంటే జుగుప్సకలుగుతున్నది. ఆయా పార్టీల్లోని ఆశావహులకు గుండెకోత మిగిలింది. రాజకీయ రంగాన్ని మంచి లాభసాటి వ్యాపార రంగంగా భావిస్తున్న స్వార్థపర శక్తులు, నేరస్థులు, దోపిడీదారులు ప్రజా ప్రతినిథులుగా ఎన్నికై చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. దేశ ప్రయోజనాలు, విస్తృత ప్రజాప్రయోజనాలను పరిగణలో ఉంచుకొని శాసనాలను రూపొందించి, అమలు చేయవలసిన చట్టసభల మౌలిక లక్షణమే గొడ్డలివేటుకు గురవుతున్నది. పార్లమెంటు విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్పుకొంటాం. ప్రజాస్వామ్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదని సంబరపడి పోతున్నాం. ఇవి పాక్షిక సత్యాలు మాత్రమే. పార్లమెంటును ఆధునిక దేవాలయంగా కొందరు అభివర్ణిస్తుంటారు. కాక పోతే ఆ ఆధునిక దేవాలయంలోకి అడుగుపెట్టే అర్హత పేదవాడికి, సామాన్యుడికి లేకుండా పోయింది.

లోక్‌సభ అభ్యర్థి ఎన్నికలవ్యయం గరిష్ఠంగా రూ.70 లక్షల వరకు ఉండవచ్చని ఎన్నికల సంఘమే నిర్ణయించింది. కుబేరులు నల్లధనంతో ఎన్నికల్లో పోటీ చేస్తూ నిర్దేశించిన ఎన్నికల వ్యయానికిమించి వందలరెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నా, అరికట్టగలిగిన స్థితిలో ఎన్నికల సంఘం లేదు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకొంటుంటే తద్భిన్నంగా వ్యవహారం నడుస్తున్నది. ఇక, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు ఆస్కారమెక్కడుంటుంది? జాతి సంపద కొందరికే సొంతమై, ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా అత్యధికులు దారిద్య్రంలో మగ్గిపోతూఉంటే, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సాంఘిక అసమానతలు వంటి మౌలికసమస్యలు, విషవలయంగా తయారైన ధరల పెరుగుదల సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తుంటే మనది పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడంలో అర్థముందా? ఈ పూర్వరంగంలో రాజకీయ రంగంలో చోటు చేసుకొంటున్న దుష్పరిణామాలు ప్రజాస్వామ్యవ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అవినీతిని తుదముట్టించే వజ్రాయుధంగా జన్‌ లోక్‌ పాల్‌ చట్టాన్ని తీసుకురావాలని పెద్ద ఎత్తున దేశ వ్యాపిత ఆందోళన జరిగినప్పుడు, అన్నాహజారే పార్లమెంటును తక్కువచేసి మాట్లాడారని, ఆదేశిస్తున్నట్లు అహంకారంతో వ్యవహరించారని పలువురు పార్లమెటేరియన్లు సద్విమర్శలు చేశారు.

కానీ 120 కోట్లమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాసనాలను రూపొందించి, అమలు చేయవలసిన పార్లమెంటు జాతి సంపదను కొల్లగొడుతున్న బడా కార్పొరేట్‌ సంస్థల అధిపతుల కనుసన్నల్లో పనిచేసే దుస్థితిలోపడి మన ప్రజాస్వామ్య వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. లోక్‌ సభలో ఉన్న మొత్తం 543 స్థానాలకు గాను 2009 ఎన్నికల్లో 315 మంది కోటీశ్వరులు ఎన్నికయ్యారంటే సభ్యుల వర్గ పొందికలో వచ్చిన మార్పును గమనించాలి. ఒక వైపు సంపన్నవర్గాల ప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది, మరొక వైపు శ్రామిక వరాల ప్రాతినిథ్యం కుచించుకు పోతున్నది. కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల హక్కుల కోసం, ప్రయోజనాలకోసం పాటుపడే ప్రతినిథులు చట్టసభల్లో అడుగుపెట్టలేక పోతున్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యవాదులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. చట్ట సభలు- మిలియనీర్లు, బిలియనీర్లతో నిండిపోతుంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయాణం ఎటువైపు సాగుతున్నదో ఇట్టే పసిగట్టవచ్చు.ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అందిపుచ్చుకొని అక్రమార్జనకు పాల్పడ్డ ధనాడ్యవర్గాలు డబ్బు సంచులతో ఎన్నికల సమరంలోకి దూకాయి. బడా కార్పొరేట్‌ సంస్థలు ప్రత్యేక ట్రస్టులు నెలకొల్పి వాటిద్వారా విరాళాలను రాజకీయపార్టీలకు ఇచ్చి ఆదాయపు పన్ను మినహాయింపు పొందతున్నాయి. తమకు అనుకూలమైన ఆర్థిక, పారిశ్రామిక విధానాలను అమలు చేసే రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని విరాళాలుగా ఇచ్చి వాటిని అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

కార్పొరేట్‌ దిగ్గజాలు మొదలుకొని చోటా మోటా కాంట్రాక్టర్ల వరకు రాజకీయ రంగంపై కన్నేశారంటే ప్రజలకు సేవ చేయడానికి కాదని, అక్రమ సంపాదనను కాపాడుకొంటూ మరింత సంపదను పెంచుకోవడానికే అన్నది సుస్పష్టం. వీరు విమానాలు, హెలికాప్టర్లు, విలాసవంతమైన కార్లు, ప్రత్యేక ప్రచార రథాల్లో ప్రచార ఆర్భాటాలకు, టివిల్లో, దినపత్రికల్లో అడ్వరై్టజ్‌ మెంట్‌‌స, పెయిడ్‌ న్యూస్‌ నిమిత్తం విచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తున్నారు. తమకు మద్దతుపలికే రాజకీయ దళారులకు పెద్ద మొత్తాలను ముట్టజెబుతున్నారు. అంతిమంగా డిమాండ్‌ను బట్టి ఓటుకు విలువ కట్టి సంతలో సరుకు కొన్నట్లు ఓటర్లను ధన బలంతో ప్రలోబపెట్టి కొనేస్తున్నారు. ఎక్కడ చూసినా డబ్బు మాటే వినిపిస్తున్నది. కోట్లు వెచ్చించే శక్తి లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం వృథా ప్రయాసేననే భావన సర్వత్రా వ్యాపించింది. దీన్ని బట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉందో బోధపడుతుంది.అవినీతి చెదలను తుదముట్టించడానికి శక్తిమంతమైన లోక్‌పాల్‌ చట్టాన్ని రూపొందించాలని దేశవ్యాపిత ప్రజాందోళన జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన బలమైన చట్టం కాక పోయినా లోక్‌పాల్‌ చట్టం వచ్చింది. అవినీతికి మూలం రాజకీయ అవినీతి. రాజకీయాలను వ్యాపారమయం చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నవారి కార్యకలాపాలను నిరోధించకుండా ఈ పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని సైతం పరిరక్షించుకోవడం అసాధ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికల వ్యవస్థ. ఐదేళ్ళకొకసారి ఎన్నికలను నిర్వహించుకోవడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి కొలమానం కాదు. స్వాతంత్య్ర ఫలాలు జన బాహుళ్యానికి అందాలి.

స్థూల జాతీయోత్ఫత్తి (జిడిపి) పెరుగుదలపై పాలకులు, ఆర్థికవేత్తలు గంభీరోపన్యాసాలు చేస్తుంటారు. జాతిసంపద వృద్ధిలో భాగస్వాములైన శ్రామిక ప్రజానీకానికి దక్కుతున్న వాటాఎంత? మానవాభివృద్ధి సూచికల ప్రకారం వారి జీవన ప్రమాణాలు ఏస్థాయిలో ఉన్నాయి? వారి కొనుగోలు శక్తి, ఆహార, ఆరోగ్య, పని భద్రతలు, నివాసం, వారి పిల్లల చదువు సంధ్యలు, ఉపాథి అవకాశాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నవే ప్రజాస్వామ్య వ్యవస్థ నాణ్యతను నిర్ధారిస్తాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పొడుగు చేతుల పందారంగా మారిపోయాయి. అవినీతిని అందలం ఎక్కించాయి. క్విడ్‌ ప్రోకో (నీకు అది, నాకు ఇది) అన్న ఒప్పందాలతో జాతిసంపదను కొల్లగొట్టుతున్నారు. విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్‌ సంస్థలు, గుత్త పెట్టుబడిదారులు, పారిశ్రామికా దిపతులు, కాంట్రాక్టర్లు, టోకు వ్యాపారులు, దళారులు ఒక వర్గంగా అధికారంలో ఉన్న రాజకీయ నేతలతో, ఉన్నతశ్రేణి అధికారులతో కూడబలుక్కొని దేశాన్ని దోచేస్తున్నారు. ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థగా పిలుస్తున్న ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం బలిపశువుగా మారిపోయింది. నూటికి తొంబై మంది ప్రజానీకం సమస్యల కుంపటిలోకి ఉన్నారు. ఎన్నికల జాతరలలో మాత్రం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అరచేతిలో స్వర్గం చూపెడుతూ, మతిపోయే వాగ్దానాలతో మభ్యపెడుతున్నారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.

జంటగా మతం- పెట్టుబడి:
రాజకీయ అధికారం కోసం భాజపా 1980వ దశకంలో రాముణ్ణి ఆశ్రయించింది. మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించడం ద్వారా లబ్ధి పొందింది. ఏడేళ్ళు అధికారాన్ని వెలగబెట్టి, దేశం వెలిగిపోతున్నదనే భ్రమల్లో జనాన్ని ముంచాలని ప్రయత్నించి తనే నిండామునిగిపోయింది. ఇప్పుడు మతానికి, కార్పొరేట్‌ పెట్టుబడికి విడదీయలేని బంధాన్ని నెలకొల్పి తద్వారా రాజ్యాధికారానికి ఎగబాకాలని కాషాయ దళం ఉబలాట పడుతున్నది. కార్పొరేట్‌ పెట్టుబడి లక్ష్యం అత్యధిక లాభార్జనే.

కాషాయ దళం లక్ష్యం- రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని హిందుత్వ భావజాలానికి కార్యరూపం ఇవ్వడం.
మన దేశంలో హిందూ మతంలో అంతర్భాగమైన కుల వ్యవస్థ సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీకి బలమైన పునాదులు వేసింది. ఈ ఎన్నికల్లో మతం, కార్పొరేట్‌ పెట్టుబడి కలిసి ఉమ్మడి లక్ష్యమైన రాజకీయఅధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏక పార్టీ పాలనకు నూకలు చెల్లిపోయాయి కాబట్టి భాజపా ప్రధానిఅభ్యరి నరేంద్ర మోడీని డిల్లీ పీఠంపై కూర్చోబెట్టాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో కార్పొరేట్‌ దిగ్గాజాలు నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తున్నది. భాజపా అభ్యర్థుల ఎంపికలో ఆర్‌యస్‌యస్‌ పాత్ర విస్పష్టంగానే వెల్లడవుతున్నది. ప్రధానిఅభ్యర్థి ఎవరో, పార్లమెంటు అభ్యర్థిగా ఎవరు పోటీచేయాలో నిర్ణయించేది ఆ అదృశ్యశక్తే. ఇంత కాలం మన్మోహన్‌ ప్రభుత్వాన్ని రిమోట్‌ కంట్రోల్‌తో నడిపినది సోనియా గాంధీనే అన్నది లోకవిదితం. ఆమెను కూడా వెనక ఉండి నడిపినది నయా ఉదారవాద ఆర్థిక విధానాల లబ్ధిదారులైన జాతీయ, అంతర్జాతీయ ముఠా అన్నది కూడా అంతే నిజం. అలాగే రేపు మోడీ వెనకాల ఉండి రిమోట్‌ కంట్రోల్‌ చేసేది ఆర్‌యస్‌యస్‌, బడా కార్పొరేట్‌ దిగ్గజాలతోకూడిన ముఠానే అన్నవిషయాన్ని కూడా దేశ ప్రజలు గమనంలో ఉంచుకోవాలి.

దేశ ఆర్థిక వ్యవస్థ పట్టు సాధించుకొన్న కార్పొరేట్‌ సంపన్నవర్గం రాజకీయ రంగాన్ని శాసించే స్థితికి చేరుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో పెట్టాలి అన్న అంశంపై బడా కార్పొరేట్‌ సంస్థల అధినేతలు మునుపెన్నడూ చూపనంత కేంద్రీకరణను నేటి ఎన్నికలపై చూపుతున్నారు. 2004, 2009 ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు మౌలికమైన తేడా కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. ఈ ఎన్నికలు, ఆశ్రీత పెట్టుబడిదారీ విధానాలకు- నిజమైన సంక్షేమ రాజ్యాన్ని కోరుకొంటున్న జన బాహుళ్యానికి మధ్య జరుగుతున్నాయని భావించాలి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అందిపుచ్చుకొన్న అక్రమ సంపాదనాపరులనే ప్రధాన రాజకీయపార్టీలు తమ అభ్యర్థులుగా రంగంలోకి దించాయి. మిలియనీర్లు, బిలియనీర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీ పడ్డారు. విస్తుపోయే సంఘటనలు తెలుగు నాట ఆవి „ష్కృతమైనాయి.ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు రాజ్యాధికారంలో వివిధ వర్గాల బలా బలాల పొందికలో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. ప్రజా ప్రాతినిథ్య చట్టానికి నిర్వచనమే మారిపోయింది. అస్తిత్వ ఫాసిస్టు రాజకీయాలు బలపడుతున్నాయి. ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కొన్ని ఉప ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచిపోషించడమే పనిగా పెట్టుకొన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ, బహుళజాతి సంస్థలు, దేశీయ బడా కార్పొరేట్‌ సంస్థల దళారులు ప్రభుత్వంలో విధాననిర్ణయాలు చేసే స్థానాలను ఆక్రమిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఎవరుంటే బాగుంటుందో అన్న అంశపై అప్పుడే బహిరంగంగానే చర్చించకు తెరలేపారు. నేటి ఎన్నికల తీరుతెన్నులను పరిశీలిస్తుంటే భారత ప్రజా స్వామ్యవ్యవస్థ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు అనిపిస్తున్నది.

Friday, April 18, 2014

చక్రం తిప్పనున్న ప్రాంతీయ పార్టీలు


 
ప్రాంతీయ పార్టీలపై తక్కువ అంచనాలు
యుపిఎ భవితవ్యం మాత్రం స్పష్టం
రేసులో మోడీది ముందువరసే!
మసకబారిన వామపక్షాల బలం
జాతీయ పార్టీల వరుస వైఫల్యాలు
ప్రాంతీయ పార్టీలకు అదే ఊపిరి


మూడో ప్రత్యామ్నాయం లేదా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊహాజనితమేనని, కాంగ్రెస్‌ సంఖ్య రెండం కెలు దాటదని, మోడీ జోరు మీదున్నారనీ- జరుగుతున్న ప్రచారంలోని వాస్తవికతపై సందేహాలు లేకపోలేదు. మోడీని భుజాలపైకెక్కించుకొన్న ప్రసారమా ధ్యమాలు, కార్పొరేట్‌ సంస్థల ధనబలంతో నమూనా అధ్యయనాలు (సర్వేలు) నిర్వహిస్తున్న సంస్థలు- బలంగా వేళ్ళూనికొని ఉన్న ప్రాంతీయ పార్టీల బలా బలాలను తక్కువగా అంచనా వేస్తూ, ఆ రాష్ట్రాలలో నిర్మాణపరంగా అత్యంత బలహీనంగా ఉన్న భాజపాకు కొన్నింటిలో కొత్తగా మిత్రులు దొరికినా, మరి కొన్నింటిలో అనివార్యంగా సొంతంగానే పోటీ చేస్తున్న ఆ పార్టీని మోడీ గాలి విజయపథాన నడిపిస్తుందనే భ్రమలను సృష్టించే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారనిపిస్తోంది. ఆ మైకంలో ఉన్నవారికి మే16న వెలువడనున్న ఎన్నికల ఫలితాలే కనువిప్పు కలిగిస్తా యనడంలో సందే హం లేదు.
వాస్తవాలను వాస్తవాలుగా పరి గణలోకి తీసుకొనే దృక్పథాన్ని అలవాటుచేసుకొని, నిష్పాక్షికంగా రాజకీయ పరిస్థితులను విశ్లేషించి, హేతు బద్ధమైన నిర్ధారణలకు రావడం ఉపయుక్తంగా ఉంటుంది. అప్పుడు వాటి విశ్వసనీయతా పెరుగుతుంది. అలాకాకుండా తమ మెదళ్ళలో తొలుస్తున్న పాక్షిఆలోచనలకు అనుగుణంగా ప్రజల మనోభావాలను మలచాలనిచేసే ప్రయత్నాలు నిరర్థకంగా మిగిలిపోయే ప్రమాదమూ ఉంటుంది. పదహారవ లోక్‌ సభ గడువు మే 31తో ముగుస్తుంది. జూన్‌ మొదటి వారంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. దేశ రాజకీయ ముఖచిత్రాన్నివాస్తవిక దృష్టితో పరిశీలిస్తే, ఎన్నికల తదనంతరం ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయంలో అస్పష్టత, గందరగోళ పరిస్థితి నెలకొనిఉన్నది. ప్రజాగ్రహానికి గురవుతున్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి.ఎ. కూటమి అధికారం నుంచి వైదొలగుతుందన్న విషయంలో మాత్రం ప్రజలకు స్పష్టత ఉన్నది.
ఎవరు అధికార పగ్గాలను అందిపుచ్చుకొంటారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జరుగుతున్న ఎన్నికల పరుగు పందెంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బి.జె.పి. ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ముందు వరసలో ఉన్నారనే అంశంపైన పెద్దగా వివాదం లేదు. కానీ బి.జె.పి.కి, ప్రత్యేకించి నరేంద్ర మోడీకి ప్రధాన మంత్రి పీఠం దక్కుతుందా- అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. బి.జె.పి. లేదా కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామ్యం లేదా వాటి మద్దతులేని ప్రభుత్వం ఏర్పడుతుందనే తెలివి తక్కువ ఆలోచనలూ ఎవరికీ లేవనేచెప్పవచ్చు. అలాగే ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం సమయానుకూలంగా పచ్చి అవకాశవాద వైఖరులను ప్రదర్శిస్తాయనడంలో కూడా ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. పైపెచ్చు అవినీతి కూపంలో కూరుకపోయిన ప్రాంతీయ పార్టీల నాయకులను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఢిల్లీ గద్దెపై ఆసీనులయ్యే వారి చేతుల్లో శక్తిమంతమైన ఆయుధం సి.బి.ఐ. ఉండనే ఉన్నది.
మన దేశం వైవిధ్యభరితమైనది. అంతే వైవిధ్యభరితంగా ప్రజల మనోభావాలు, రాజకీయ పార్టీల వైఖరులు ఉన్నాయి. మనది బహుళ పార్టీ వ్యవస్థ. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. వర్ణనాతీతమైన, సాహసోపేతమైన ప్రజా ఉద్యమాలు, అపారమైన త్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించింది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పరితపించిన త్యాగధనులు తొలినాళ్ళలో చట్ట సభలకు ఎన్నికై ఆ వేదికలకే వన్నెతెచ్చారు. 1980 దశకం తరువాత క్రమేపీ ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పింది. మనది పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థని బల్లగుద్ది వాదించుకొన్నా, కొన్ని పరిమితులకులోబడే అది పని చేస్తున్నదన్న విషయం వివాదరహితం. ధన బలం, కండ బలం, మద్యం, కులం, మతం, తెగలు, ప్రాంతం వగైరా అంశాలు ఎన్నికల వ్యవస్థను బలహీనపరచి, ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తున్నాయి.
వ్యవస్థీకృత నేరాలలో భాగస్వాములైన వారు యథేచ్ఛగా చట్ట సభల్లోకి రొమ్ము విరుచుకొని అడుగు పెడుతున్నారు. డబ్బులేని వాడికి రాజకీయమెందుకు అన్న పరిస్థితి బలంగా వేళ్ళూనుకొన్నది. రాజకీయ రంగం వ్యాపారమయమై పోయింది. ఎన్నికల సంస్కరణలను తీసుకొచ్చి ధన బలం ప్రభావాన్ని అరికట్టవలసిన ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని పెంచేసి, డబ్బున్న వాడికే పరోక్షంగా మద్దతు పలికింది. నీతి, నిజాయితీతో కూడిన ప్రజాసేవ- అంటే అర్థం లేని వెర్రిబాగుల మాటగా మారిపోయింది. నైతిక విలువలు కాలుష్య వాతావరణంలో కొట్టుకు పోతున్నాయి.మసకబారిన వామపక్షాల బలం: సామాజిక ప్రగతికి అలుపెరగని పోరుసల్పే కమ్యూని స్టులు, వామపక్షాలు బలహీనపడడంతో ఛాందసవాదులు, మతోన్మాదులు, రాజకీయ అవకాశ వాదులు లబ్ధిపొందుతున్నారు.
ప్రగతిశీల శక్తులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజా ఉద్యమాలను చట్ట సభల్లో ప్రతిబింబిస్తూ, సామాజిక ప్రగతికి దోహదపడే మెరుగైన శాసనాల కోసం చట్ట సభల్లో పోరుసలుపుతున్న వామపక్షాల బలం తరిగిపోతున్నది. ఇది శ్రామిక జనావళి భవిష్యత్తుకు హానికరమైనది, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు తీవ్రఆందోళన కలిగించే పరిణామం. స్వాతంత్య్రానంతరం మూడవ లోక్‌ సభ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉండి పాలక పార్టీ అయిన కాంగ్రెస్‌కి ఎదురొడ్డి నిలిచిన ఘనమైన చరిత్ర ఉంది. కమ్యూనిస్టు ఉద్యమానికి చీలిక గొడ్డలి పెట్టుగా పరిణమించింది. అయినా ఐదవ లోక్‌ సభ (1971-77)లో సి.పి.ఐ. (యం) ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది.
1989లో వి.పి.సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ్రఫంట్‌, 1996లో దేవెగౌడ- 1997లో ఐ.కె. గుజ్రాల్‌ నాయకత్వంలో యునైటెడ్‌ ప్రంట్‌, 2004లో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో యు.పి.ఎ. ప్రభుత్వాల ఏర్పాటులో వామపక్షాలు క్రియాశీలమైన భూమిక పోషించాయి. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, మూడు దశాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగిన పశ్చిమ బెంగాల్‌లో, కేరళ శాసనసభఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తరువాత వామపక్షాల ప్రాభవం తగ్గిపోయిందనే భావన సర్వత్రానెలకొన్నది. పర్యవసానంగా ఎన్నికల్లో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవడానికికూడా యు.పి.ఎ., యన్‌.డి.ఎ. కూటముల్లో భాగస్వాములు కాని బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలు విముఖత ప్రదర్శించారు. తామే సొంతంగా పోటీచేసి అత్యధిక స్థానాలను గెలుచుకొని, ప్రధాన మంత్రి అయిపోవాలన్న దురాశ వారిలో కలగడం కూడా ఒక కారణం కావచ్చు. గతంలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన వామపక్షాలను మౌనరోదన చేసే పరిస్థితికి నెట్టడం నిస్సందేహంగా దుష్పరిణామం.
వామపక్షాల బలాన్ని కేవలం ఓట్లు, సీట్ల కొలబద్దతో కొలవడం హేతుబద్దం కాదు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని ప్రకటించిన కమ్యూనిస్టుల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి చట్టసభల్లో ప్రాతినిథ్యాన్ని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొంటారు. పార్లమెంటరీ పెడధోరణులతో చట్టసభల్లో ప్రాతినిథ్యాన్ని పెంచుకొన్నా, అధికారానికొచ్చినా ఉద్యమం బలపడదు కానీ, వామపక్షాలు నిర్వహించిన ఉద్యమాలకు సరియైన ప్రాతినిథ్యం లభిస్తే అది సమాజానికి మేలు చేస్తుంది.ప్రాంతీయ పార్టీల బలం మిథ్య కాదు: జాతీయ పార్టీల వైఫల్యం పర్యవసానంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి, బలమైన పునాదులను ఏరాటు చేసుకొన్నాయి. ప్రాంతీయ పార్టీల వైఫల్యాల వల్ల ఉప ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పర్యవసానంగా దేశంలో ఏకపార్టీ పాలన అంతరించి, సంకీర్ణ ప్రభుత్వాల దశ నడుస్తుండడంతో జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల పాత్ర క్రియాశీలంగా మారింది. ఈ మార్పు దేశానికి మేలు చేస్తుందా- కీడు చేస్తుందా, సమాఖ్య వ్యవస్థ బలపడుతుందా- బలహీనపడుతుందా- అన్న అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెసుకు వంద స్థానాలకు మించి, బి.జె.పి.కి ఎక్కువలో ఎక్కువ 175 స్థానాలకు దాటి వచ్చే అవకాశాలే లేవన్నది సుస్పష్టం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా, మనుగడసాగించాలన్నా- ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నదన్న విషయం నిప్పులాంటి నిజం. అవి ప్రభుత్వంలో పాలుపంచుకొంటయా లేదా బయటి నుండి తోడ్పాటు అందిస్తాయా అన్నది వేరే విషయం. వాటిని విస్మరించలేని అనివార్య పరిస్థితులు మాత్రం నెలకొని ఉన్నాయి. అందుకే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ అయినా, భాజపా అయినా ప్రాంతీయ పార్టీల వెంటబడుతున్నాయి. ప్రస్తుతానికి యన్‌.సి.పి. ఆర్‌.జె.డి., ఆర్‌.యల్‌.డి., నేషనల్‌ కాన్పరెన్స్‌, కేరళ కాంగ్రెస్‌ వంటి పార్టీలు యు.పి.ఎ. కూటమిలో ఉంటే- అకాళిదళ్‌, శివసేన పార్టీలు గతం నుంచి యన్‌.డి.ఎ. కూటమిలో ఉన్నాయి. తాజాగా తెలుగు దేశం, లోక్‌ జన శక్తి, డి.యం.డి.కె., యం.డి.యం.కె., పి.యం.కె., కె.యం.డి.కె వగైరా పార్టీలు భాజపాతో జట్టు కట్టాయి. ఈ రెండు కూటములకు బయట ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలు స్వతంత్రంగా ఎన్నికల బరిలో ఉన్నాయి.
అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర్రపదేశ్‌ లో సమాజ్‌ వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, బీహార్‌లో జనతా దళ్‌ (యునైటెడ్‌), పశ్చిమ బెంగాల్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఒడిస్సాలో బిజూ జనతా దళ్‌, తమిళనాడులో ఎ.ఐ.ఎ.డి.యం.కె., డి.యం.కె., ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌, తెలంగాణలో టి.ఆర్‌.యస్‌., కర్ణాటకలో జనతా దళ్‌ (సెక్యులర్‌), అస్సాంలో అస్సాం గణ పరిషత్‌, అలాగే ఈశాన్య భారత దేశంలోని ఏడు రాష్ట్రాలలోని పలు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. కొద్ది మాసాల క్రితమే జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంలో పురుడుపోసుకొని, ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పడడంతో కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటుచేసి నెలరోజుల పాటు పాలన సాగించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. నేడు జాతీయ ప్రసారమాధ్యమాలలో బి.జె.పి., కాంగ్రెస్‌ పార్టీల తరువాత స్థానంలో అత్యధికంగా ప్రచారాన్ని పొందుతున్న పార్టీ- ఆమ్‌ ఆద్మీ పార్టీనే.
కేంద్ర ప్రభుత్వ అండదండలతో రిలయన్స్‌ సంస్థ కె.జి. బేసిన్‌ లోని సహజ వాయువు నిల్వలను కొల్లగొట్టి, అక్రమార్జనకు పూనుకొన్న అంశంపై వామపక్షాలు సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ఏనాడూ తగిన ప్రచారాన్ని ఇవ్వని ప్రసారమాధ్యమాలు, కేజ్రివాల్‌ ఆ అంశంపై మాట్లాడడం మొదలుపెట్టాక దాన్నొక ప్రధాన చర్చనీయంశంగా చేశాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ విధానాలు, పోకడలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండవచ్చు. అధికారం కోసం ఉవ్విళూరుతున్న మోడీకి సవాలుగా దేశ వ్యాపితంగా అభ్యర్థులను బరిలోకి దించింది. ఆ పార్టీ ఎన్నికల ఫలితాలను ఏదో ఒక మేరకు ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఎన్ని స్థానాల్లో విజయబావుటా ఎగరేస్తుందో వేచి చూడాలి. పది- పదిహేను గెలిచినా అవేమీ తక్కువ కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఒక్క లోక్‌ సభ సభ్యుడు ఉన్న పార్టీలకు కూడా ఎనలేని ప్రాధాన్యత వస్తుంటుంది.
మన రాష్ట్రంలో యం.ఐ.యం., కేరళలో ముస్లిం లీగ్‌ వంటి పార్టీలు ఈ కోవ క్రిందికే వస్తాయి. ఈ ధపా మన రాష్ట్రంలో లోక్‌ సత్తా, జై సమైక్యాంధ్రప్రదేశ్‌ పార్టీలు మొదటిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి ప్రవేశించాయి. ఎన్నికల సందర్భంలో ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుల్లా పుట్టుకొస్తుంటాయి. కొన్ని ఉనికిలోకే రావు. మరికొన్ని ఒకటి, అర స్థానాలను సంపాదించుకొని చట్ట సభల్లో అడుగుపెడుతుంటాయి.విశ్వసనీయత ప్రశ్నార్థకమే, కానీ?: ప్రాంతీయ పార్టీల నాయకత్వాలపై జాతీయ స్థాయిలో విశ్వసనీయత కొరవడిన మాట వాస్తవం. యు.పి.ఎ. ప్రభుత్వానికి బయటి నుండి మద్దతిచ్చిన ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి- అవినీతి కేసుల్లో ఇరుక్కొని సి.బి.ఐ. విచారణల నుండి బయటపడడం కోసం అనుసరించిన అవకాశవాద వైఖరుల వల్ల అప్రతిష్ఠ పాలైనారు. ముజఫర్‌ నగర్‌ జిల్లాలో జరిగిన మత ఘర్షణలతో- అధికారంలో ఉన్న సమాజ్‌ వాది పార్టీ ప్రతిష్ఠ మసకబారినప్పటికీ ములాయం సింగ్‌ బలహీనపడిపోయినట్లు భావించడం తొందరపాటే అవుతుంది.
ఒక వైపున ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడిందని, మాయావతి నాయకత్వంలోని బి.యస్‌.పి. ఇంకా కోలుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 10 స్థానాలకే పరిమితమై, అటుపై జరిగిన శాసన సభ ఎన్నికల్లో మూడో స్థానంతో తృప్తి పడవలసి వచ్చిన భాజపా ఒక్కసారిగా బలం పుంజుకొని మోడీ ప్రభంజనంతో రాష్ట్రంలోని 80 స్థానాల్లో 50 వరకు తన ఖాతాలో వేసుకొంటుందన్న ప్రసారమాధ్యమాల నమూనా అధ్యయనాల విశ్లేషణలలో పాక్షిక దృష్టి ఉన్నట్లుతోస్తున్నది.పశ్చిమబెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగిన వామపక్షాలను 2011 శాసనసభ ఎన్నికల్లో ఓడించి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ దేశ ప్రజల దృష్టిలో పడ్డారు. యు.పి.ఎ. భాగస్వామ్య పార్టీగా ఉండిన తృణమూల్‌- మన్మోహన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని ఒక కుదుపు కుదిపింది. రాష్ట్రంలో వామపక్షాల కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తూ బలహీనపరిచే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
తనకు వ్యతిరేకంగా రాస్తున్న విశ్వవిద్యాలయాల ఆచార్యులపైన, ప్రసారమాధ్యమాలపైన కన్నెర్రజేసి, కక్షపూరిత చర్యలకు పూనుకొన్నది. దుందుడుకుగా వ్యవహరిస్తూనే పంచాయితీ ఎన్నికల్లో తన స్థానాన్ని మరింత పదిలపరచుకొన్నది. ఆ రాష్ట్రం మొత్తంగా దాదాపు 20 శాతం, కొన్ని నియోజకవర్గాలలో 40 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడంలో చాలా వరకు సఫలీకృతమైనట్లే కనబడుతున్నది. అందుకే ఒకనాటి మిత్రపక్షమైన్‌ బి.జె.పి.ని, ప్రత్యేకించి నరేంద్ర మోడీపైన తీవ్ర స్థాయిలో విమర్శలు కొనసాగిస్తున్నది. తృణమూల్‌ 2009 లో 19స్థానాల్లో గెలుపొందిదింది. ఈదఫా ఆ సంఖ్యను పెంచుకొంటుందన్న వార్తలొస్తున్నాయి.ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పై ప్రజల్లో విశ్వాసం సడలలేదని, బిజూ జనతా దళ్‌ కే సానుకూల వాతావరణం ఉన్నదని చెబుతున్నారు.
గతం నుండి గుణపాఠాలు నేర్చుకొన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రజానుకూల పాలన సాగిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డి.యం.కె. కుటుంబ తగాదాలు, యు.పి.ఎ. ప్రభుత్వంలో జరిగిన టెలికం కుంభకోణంలో పీకల్లోతు కూరుకపోయి ఉన్న నేపథ్యంలో ఎ.ఐ.ఎ.డి.యం.కె. కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, అత్యధిక స్థానాలను సొంతం చేసుకొంటామనే భరోసా ఉండబట్టే జయలలిత ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కుదుర్చుకొన్న సీట్ల సర్దుబాట్ల ఒప్పందానికి తిలోదకాలిచ్చారని అంటున్నారు. తానే ప్రధాన మంత్రి కుర్చీలో ఎందుకు కూర్చోకూడదన్న ఆలోచన మెదడులో వచ్చి పుదుచ్చేరితో కలిపి రాష్ట్రంలో ఉన్న40 స్థానాల్లో అత్యధికం గెలవడానికి పట్టుదలతో చమటోడుస్తున్నారు. మోడీతోఉన్న స్నేహ బంధాన్ని ప్రక్కకు నెట్టి, మమతతో కలిసి కొత్త జట్టు కట్టడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నిన్న మొన్నటి వరకు యన్‌.డి.ఎ.లో భాగస్వామిగా ఉన్న జనతా దళ్‌(యు) బీహార్‌లో అధికారంలో కొనసాగుతున్నది. జనతా దళ్‌(యు) - సి.పి.ఐ., కాంగ్రెస్‌ - ఆర్‌.జె.డి., బి.జె.పి.- లోక్‌ జనశక్తి పార్టీలతో కూడిన మూడు కూటముల మధ్య ముక్కోణ పోటీ నెలకొన్నది. జనతాదళ్‌ పోయిన ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచింది. ఆ సంఖ్యను నిలబెట్టుకోలేక పోవచ్చనే అంచానాలు వేస్తున్నారు. ఒకటి రెండు తగ్గితే తగ్గవచ్చు.మొత్తం మీద జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్‌, నితీశ్‌ కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌, దేవెగౌడ, ప్రపుల్ల కుమార్‌ మహంతి, వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి, కె.సి.ఆర్‌.ల నేతృత్వాలలోని ప్రాంతీయ పార్టీలకు ప్రస్తుతం 114 మంది లోక్‌ సభ సభ్యులున్నారు. కొత్తగా కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగంలో కొచ్చింది. ఆయా రాష్ట్రాల్లోని నిర్ధిష్ఠ పరిస్థితులను, పార్టీల స్థితిగతులను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో ఈ పార్టీల బలం 150 నుంచి 175 వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వీటికి తోడు వామపక్షాలకు ప్రస్తుతమున్న 24 స్థానాలకు ఒకటి అటు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నది.ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో దేశ రాజకీయ రంగంలో సంభవించిన పెనుమార్పుల అంశాన్ని ఎవరూ గుర్తించ నిరాకరించలేరు. ప్రస్తుత లోక్‌ సభలో 38 పార్టీల ప్రాతినిథ్యం ఉన్నది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్రపదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఒడిశాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో 223 లోక్‌ సభ స్థానాలున్నాయి. కాకపోతే వీరిని వెంటాడుతున్న అతిపెద్ద సమస్య- నాయకత్వ కొరత. ములాయం, నితీశ్‌, నవీన్‌, జయలలిత, మమత, మాయావతి వీరందరూ ఎవరికి వారు ప్రధాన మంత్రి పీఠంపై కన్నేసి ఉన్నారు. వీరి మధ్య ఐక్యతను సాధించ గలిగిన సూత్రబద్ధమైన విధానాల ప్రాతిపథిక లేదు. అందుకు తోడు అహంభావం, వ్యక్తిగత పోకడలు, రాజకీయ నిబద్ధత- సమన్వయం- అంకితభావం లేకపోవడం, కొందరు ఒకే రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా మనుగడ సాగిస్తుండడం- కాంగ్రెసుకు, భాజపాకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక రూపకల్పనలో అవరోధంగా నిలిచాయి. ఎన్నికల తదనంతరం పరిస్థితులు తన్నుకొస్తే ఒకే వేదికపైకి రావచ్చు లేదా అవకాశవాదంతో సొంతదారులు చూసుకొని భాజపా పంచన చేరనూ వచ్చు!

Thursday, April 17, 2014

కమలనాథుల అంతర్మథనం

Surya Daily 8th April 2014

పని చేయని గాంధేయ సోషలిజం
రెండు సార్లే తోడ్పడిన రామజన్మభూమి
వికటించిన బదేశం వెలిగిపోతోంద్పి నినాదం
దశాబ్దం పాటు ప్రతిపక్షంలో...
దూరమైన భాగస్వామ్య పక్షాలు
పార్టీలో అంతర్గత నాయకత్వ పోరు
ఆర్ధిక విధానాలలో కాంగ్రెస్‌తో తేడా లేదు
బలమైన రాషా్టల్ల్రో ఎంపీ స్థానాలు పరిమితం
దక్షిణాది, ఈశాన్య రాషా్టల్రు కీలకం


మతతత్వ పార్టీగా ముద్రపడి, రాజకీయ అంటరానితరానికి గురై అధికారానికి చేరువ కాలేకపోతున్న భాజపా అంతర్మథనంలో పడింది. ఒకనాడు గాంధేయ సోషలిజం నినాదాన్ని చ్చినా ప్రయోజనం ఒనగూడలేదు. అయోథ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిర నిర్మాణమే కర్తవ్యంగా ప్రకటించి, హిందువు మనోభావాల ను సొమ్ముచేసుకొని, రెండు దఫాలు అతల్‌ బిహారీ వాజపాయి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిం ది. దేశం వెలిగి పోతున్నది- నినాదంతో2004లో ఘోరపరా జయాన్ని చవిచూసింది. దశా బ్దంపాటు ప్రతిపక్షంలో కూర్చున్నది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా, హిందుత్వ భావజాలంతో- అస్తిత్వ భావజాలాన్ని (కులం కార్డు) కలగలిపి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలని సంఘ్‌ పరివార్‌ కూటమి పథకం రచించింది. త్రివేణి సంగమంగా ప్రసిద్ధికెక్కిన వారణాసి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని మోడీ బరిలో దిగడంద్వారా కమలనాథుల మనోగతం వెల్లడయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లో రామ బాణాన్ని ప్రయోగించి 1991,1996,1998 సాధారణ ఎన్నికల్లో 85 స్థానాలకు గాను వరుసగా 51, 52, 57 చొప్పున తమ ఖాతాలో వేసుకోగలిగారు. 1984 ఎన్నికల్లో 7.74 శాతం ఓట్లతో 2 లోక్‌ సభ స్థానాలల్లో గెలుపొందిన భాజపా, 1989లో 85 (11.36 శాతం), 1991లో 120 (20.11శాతం), 1996లో161 (20.29 శాతం), 1998లో 182 (25.59 శాతం) స్థానాలన పెంచుకోగలిగింది. 1999లో 182 స్థానాలను నిలబెట్టుకొన్నా ఓట్లు 23.75 శాతానికి పడిపోయాయి. 2002లో గోద్రా ఘటనల అనంతరం మైనారిటీ మతస్థులపై మారణహోమం మోడీని, భాజపాను వెన్నాడుతూనే ఉన్నది. యన్‌డిఎ భాగస్వాములైన మిత్రపక్షాలు ఒక్కొక్కటే దూరమైనాయి. పర్యవసానంగా 2009 నాటికి 116 స్థానాలు, 18.8 శాతం ఓట్లకు పడిపోయింది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు డిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవలసిందేనన్న పట్టుదలతో కాషాయదళం పావులు కదుపుతున్నది. వాజ్‌ పాయ్‌ కాలంనాటికి నేటికి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి. అస్తిత్వ రాజకీయాలు ఉనికిలోకి వచ్చాయి. అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి- అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకొని, బ్రాహణ- వైశ్య- దళిత కులాల ఐక్యతా నినాదంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకొన్నారు. ఆ ఫార్ములాను తమ దృక్పథంతో అమలుచేసి రాజకీయ లబ్ధి పొందాలని సంఘ్‌ పరివార్‌ నిర్ధారణకు కొచ్చినట్లుంది. అందుకే రామమందిర నిర్మాణం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 తొలగింపు వంటి వివాదాస్పద అంశాలను కాస్త వెనక్కు నెట్టినట్లు కనబడుతున్నది. కొత్త మిత్రుల వేటలో నిమగ్నమయ్యింది. కొంత వరకు సత్ఫలితాలను పొందినట్లే కనబడుతున్నది. కానీ, దేశ రాజకీయాలు సంక్లిష్టంగా, అస్పష్టంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
ఒకే తానులోని ముక్కలు:
ఆర్థిక విధానాలు, అవినీతి అంశాల్లో కాంగ్రెస్‌- భాజపా ఒకే తాను ముక్కలని ప్రజలు నిర్ధారణకొచ్చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల పేరిట ఉభయులూ కార్పొరేట్‌ రంగానికి దాసోహం చేస్తున్నారు. మోడీ తాత్విక చింతన బడా వ్యాపార వర్గాలకు అనుకూలం, బిజినెస్‌ ఫ్రెండ్లీ అన్న భావన విస్తృతంగా ప్రచారంలో ఉన్నదే. వాజ్‌ పాయ్‌ కాలంలోనూ బహుళజాతి సంస్థలకు, అమెరికాకు అనుకూలమైన విధానాలనే అమలు చేసిన చరిత్రఉంది. కర్ణాటకలో అధికారంతో సాగించిన అవినీతి మరకలు మాసిపోలేదు. అందువల్ల కేవలం యుపిఎ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడితే లాభం లేదన్న ఆలోచన భాజపా చేసినట్లుంది. గుజరాత్‌ నమూనా అభివృద్ధి నినాదం, కుల, ప్రాంతీయ పార్టీలను ఆకర్షించుకోవడం, వీలైనన్ని ఎక్కువ స్థానాలతో లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించి, ఎన్నికల అనంతరం మరికొంత మందిని తమవైపుకు తిప్పుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని భాజపా నాయకత్వం ఉవ్విళ్ళూరుతున్నది. ఏడాది క్రితంనుంచే కుల సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతూ మోడీ చేసిన ప్రసంగాల సారాంశం, తాజాగా బడుగు, బలహీన తరగతులకు చెందిన కులాల ప్రాతిపదికపై మనుగడ సాగిస్తున్న పార్టీలతో ఎన్నికల ఒప్పందాలు చేసుకోవడాన్ని బట్టి భాజపా పోకడ తేటతెల్లమవుతున్నది. బీహార్‌లో రాంవిలాస్‌ పాశ్వాన్‌ (లోక్‌ జనశక్తి పార్టీ), మహారాష్ట్రలో రాందాస్‌ అథవాలె (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), హర్యానా జన్‌ హిత్‌ కాంగ్రెస్‌, ఇరవైవ శతాబ్దం ప్రారంభంనుండి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి కేంద్ర స్థానంగా నిలిచిన తమిళనాట సినీ నటుడు విజయకాంత్‌ పార్టీ అయిన డియండికె, డా యస్‌. రాందాస్‌కు చెందిన్‌ పియంకె, వి. గోపాలస్వామి (వైకో) పార్టీ యండియంకె, కెయండికె, ఐజెకె వంటి చిన్న చితకా పార్టీలతో కూటమిగా ఏర్పడి, సీట్ల ఒప్పందం కుదుర్చుకొన్నది. కేరళలో కూడా ఈ తరహా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
కాంగ్రెస్‌పీడ విరగడై ప్రజానుకూల ప్రభుత్వం రావాలని జనం కోరుకొంటున్నారు. అధికార పగ్గాలను చేజిక్కించుకొని కార్పొరేట్‌ సేవకు పునరంకితం కావాలని, హిందుత్వ భావజాల పునాదులను పటిష్ఠ పరచాలని మోడీ కలలు కంటున్నారు. నాడు భాజపాలో ఉదారవాదైన వాజ్‌ పాయ్‌ నాయకత్వం కింద కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలు యన్‌డిఎ కూటమిలో భాగస్వాములైనాయి. నేడు కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరుపడ్ద బిజెపి నాయకత్వాన్ని అంగీకరించి ఎంత మంది జై కొడతారో వేచి చూడవలసిందే! ఎన్నికల తదనంతర రాజకీయ పరిణామాలు, పార్టీల పునరేకీకరణాలు, ఆయా పార్టీలు గెలుపొందిన లోక్‌ సభ సభ్యుల సంఖ్యమీద ఆధారపడి కూడికలు, తీసివేతలే కేంద్రంలో అధికారంలోకి ఎవరొస్తారో తేలుస్తాయి. అయినా, తమ అభ్యర్ధే కాబోయే ప్రధాని అని భాజపా శ్రేణు లు ఊదరగొట్టేస్తున్నా యి. నిజానికి కాషాయ దళం మంచి ఊపుమీదుంది. ఆ పార్టీ ప్రచార హోరుతో ఊదరకొడుతున్నది. దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో బాగా కాంగ్రెస్‌ వెనుకబడిపోయింది. రాజకీయ సమీకరణాల ముఖ చిత్రాన్ని పరిశీంచే వారికి- పీఠం మోడీకి దక్కుతుందా అన్న అనుమానం రాకమానదు. భాజపాలో పలువురు సీనియర్‌ నేతలు పదవీ వ్యామోహంతో ఆధిపత్య పోరు కొనసాగిస్తున్న ఉదంతా లు వెలుగులోకి వచ్చాయి. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయం లో అలకలు, బుజ్జగిం పులు, ధిక్కా రధోరణులు కనబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మోడీ హవా నడుస్తున్నట్లు పైకి కనబ డుతున్నా, అవకాశం దొరికితే అంది పుచ్చుకోవడానికి కొందరు సీనియర్లు సిద్ధంగా ఉన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అధికారం- భావజాలం:
అద్వానీ, మోడీ- ఇద్దరూ హిందుత్వవాదులే. ఇద్దరి మధ్య గురు శిష్యుల బంధమే ఉన్నదని బాహ్యప్రపంచానికి వినిపిస్తూనే ఉంటారు. భాజపా అధికారంలోకి రావాలన్నది ఉభయుల కల. ఢిల్లీ గద్దె కోసం ప్రచ్ఛన్న యుద్ధం చేసుకొంటున్నారు. భాజపాలో సాగుతున్న ఈ రగడకు మరో కోణంకూడా లేకపోలేదనిపిస్తోంది. హిందుత్వవాద భావజాలానికి మూలస్థంభం వర్ణవ్యవస్థ. ఆ చట్రాన్ని బలహీనపరిచే నిర్ణయాలను జీర్ణించుకోలేని వారి మనోవేదనకూడా ఘర్షణ వెనుకదాగి ఉన్నదనిపిస్తోది. వైవిధ్యభరితమైన భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠవంతం చేసుకోవాలంటే లౌకిక వ్యవస్థ పదిలంగా ఉండాలని రాజ్యంగ నిర్మాతలు విశ్వసించి తదనుగుణంగా రాజ్యాంగ చట్రాన్ని రూపొందించారు. మతాన్ని రాజకీయాలలో చొప్పించడం రాజ్యాంగ వ్యతిరేకం. దేశ ఐక్యతకే పెనుముప్పు సంభవిస్తుంది. కాషాయ దళం నిజమైన దేశభక్తులమని చెప్పుకొంటూనే రాజకీయ ప్రయోజనాలకోసం మతానికి రాజకీయ రంగు పులిమింది.
రామజన్మభూమి విముక్తి పేరిట ఎల్‌.కె. ఆద్వానీ రథయాత్ర చేసి,400 సంవత్సరాల చరిత్రఉన్న బాబ్రి మసీదు నేలమట్టానికి కారణమై, ఆ మంటల వేడిలో రెండు స్థానాల (9వ లోక్‌ సభలో) నుండి 12వ లోక్‌ సభలో 182 స్థానాలకు ఎగబాకి అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు. ఈ మొత్తం రాజకీయోద్యమానికి నేతృత్వం వహించింది ఆద్వానీయే అయినా- హిందూ మతోన్మాది అన్న ముద్రను మూటగట్టుకొన్న ఆయనకు ప్రధాని పీఠం దక్కలేదు. ఆద్వానీని భుజాల మీద మోయడానికి లౌకిక, ప్రజాతంత్ర భావాలున్న బలమైన ప్రాంతీయ పార్టీలు నాడు ముందుకు రాలేదు. భాజపా నాయకుడైనా వాజ్‌పాయ్‌ ఉదారవాది అన్న భావనతో ఆయనను పల్లకీ ఎక్కించడానికి సుముఖత వ్యక్తం చేయడంతో- యన్‌డిఎ కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ కూటమి 2004 వరకు అధికారంలో కొనసాగింది. మాజీ ప్రధాని వాజ్‌ పాయ్‌ అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవలసి వచ్చింది. ఆద్వానీయే భాజపాకు పెద్ద దిక్కుగా మిగిలారు. ఆద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకొని 15వ లోక్‌ సభ ఎన్నికల్లో పోరు చేసినా ఫలితం దక్కలేదు.
2014 ఎన్నికల సందర్భానికి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం భ్రష్ఠుపట్టి పోయింది. అందువల్ల ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భాజపాకు కాస్త సానుకూల వాతావరణం కనిపించడం సహజం. దాన్ని అందిపుచ్చుకునేందుకు- హిందుత్వవాదాన్ని కులవాదంతో అనుసంధానించక పోతే అధికారాన్ని పొందడం అసాధ్యమన్న తాత్విక చింతనలో భాగంగానే నరేంద్రమోడీని భాజపా రంగం మీదికి తెచ్చింది. ఆయన విశ్వసనీయమైన, హిందుత్వ వాదిగా కాల పరీక్షలో నిగ్గుదేలిన, వెనుకబడ్ద కులానికి చెందినవారు కావడంతో ఆయనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటింపచేసి, ఎన్నికల సమరానికి శంఖారావం పూరించేలా సంఘ్‌ పరివార్‌ చేసిందన డంలో సందేహం లేదు. ఆద్వానీని ఒకసారి ప్రధాని అభ్యర్థిగా ముందు పెట్టుకొని ఎన్నికల్లో దిగినా ఫలితం దక్కలేదని, ఇప్పు డు వయసు మీదపడిందని వగైరా కబుర్లెన్ని పైకి చెప్పి నా అసలు తంతు వెనుక దాగిఉన్న చిదంబర రహస్యం వేరని అర్థమవు తూనే ఉన్నది. అంతిమంగా ఆద్వానీకి వలె మోడీకి కూడా ఢిల్లీ పీఠంపై కూర్చు నే భాగ్యం కలగకపోవచ్చనే సూచనలూ కనిపిస్తు న్నాయి. మోడీయే భాజపా కు బలం, బలహీనత- అన్న ప్రచారం కూడా సాగుతున్నది. నాటికీ నేటికీ మిత్రులసంఖ్య తగ్గిపో యింది. ఇరవైకి పైగా మిత్రపక్షాల భాగస్వా మ్యమున్న యన్‌డిఎ కూటమికి తిరుగులేని నాయకుడుగా వాజ్‌పేయ్‌ 1999లో ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేశారు. నేడు వివిధరాషా్టల్రలో ప్రాంతీయ పార్టీలు శక్తిమంతమైనవిగా ఆవిర్భవించాయి. వాటితో పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలుపొందడం గానీ, అధికార పీఠాన్ని అధిరోహించడం గానీ జరగని పని. వాటిలో కొన్నింటిని గడచిన దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ పార్టీ నయానో భయానో తనవెంట తీసుకెళ్ళ గలిగింది కాబట్టే అధికారంలో కొనసాగింది. కాంగ్రెస్‌కు కూడా చాలా పార్టీలు దూరమైనాయి.
అయితే ఇప్పుడు పాతమిత్రులు కానీ, కొత్త మిత్రులు కానీ భాజపా దరి చేరడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని బలమైన జనతా దళ్‌(యు) విడాకులిస్తే, పరిమిత బలమున్న రాం విలాస్‌ పాశ్వాన్‌ నాయకుడుగా ఉన్‌‌న లోక్‌ జనశక్తి దగ్గరకు చేరింది. యుపి, బీహార్‌లలో120 స్థానాలుంటే, పోయిన ఎన్నికల్లో కేవలం 22 గెలిచింది. అక్కడ బలం పుంజుకోకుండా డిల్లీలో చక్రం తిప్పుతామంటే కుదరదు. దక్షిణాదిన 121 స్థానాలుంటే ఒక్క కర్ణాటకలో 19 గెలిచారు. అటుపై అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన భాజపా ప్రతిష్ఠ దేశ వ్యాపితంగా మంటగలిసింది, యడ్డూరప్ప, శ్రీరాములు వంటి వారు బయటికెళ్ళి శాసనసభ ఎన్నికల్లో భజపాకి చావుదెబ్బ కొట్టి అధికారాన్ని కాంగ్రెసుకు అప్పజెప్పారు. అధికారమే పరమావధిగా భావించి మళ్ళీ వాళ్ళను బ్రతిమాలుకొని పార్టీలో చేర్చుకొన్నారు. అయినా గతంలో గెలిచిన స్థానాల సంఖ్య బాగా తగ్గే సూచనలే ఉన్నాయి. కేరళలో కొద్ది పాటి ఓట్లను రాబట్టుకొనే స్థితిలో ఉన్నదే కానీ, సీట్లను తెచ్చుకొనే స్థితిలో లేదు.
తమిళనాట వేళ్ళూనుకొని ఉన్న జయలలితతో మోడీకి మంచి స్నేహ సంబంధాలున్నాయని తలంచినా, ఆమె మెదడులో కూడా ప్రధాని కావాలనే తలంపు రావడంతో సీను తిరగబడింది. విజయకాంత్‌, వైకో, రాందాస్‌ పార్టీలతోబాటు మరో రెండు చిన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసుకొని, తమకందరికీ కలిపి, గత ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వగల శక్తిని సంతరించుకొన్నామని చెప్పుకొంటున్నారు. విజయకాంత్‌ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు, కడకు ఆయన సోదరుడు సైతం జయలలిత పంచన చేరిపోయారు. దక్షిణాదిన భాజపాకు అదనపు బలం చేకూరిన దాఖలాలు కనబడడం లేదు. బీహార్‌ మినహాయించి తూర్పు, ఈశాన్య భారత దేశంలో 102 స్థానాలుంటే 2009లో భాజపా గెలిచింది 14 మాత్రమే. వాటిలో 8 జార్ఖండ్‌, 4 అస్సాం, 1 గూర్ఖాలాండ్‌, మరొకటి అండమాన్‌ నికోబార్‌. ఈ సంఖ్యను నిలుపుకోవడానికే ఆపసోపాలు పడవలసి ఉన్నది. మోడీకి ఢిల్లీ పీఠంపై మోజు ఉండవచ్చు. కార్పొరేట్‌ దిగ్గజాల అండ పుష్కలంగా ఉండవచ్చు. కానీ ఆయన ఆశలకు అడ్డుకట్ట వేయడానికి ప్రధానంగా రెండు వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నాయని ధృవపడుతున్నది. ఒకటి- మోడీ అంటే గిట్టని ప్రాంతీయ పార్టీలు, భావజాల రీత్యా వర్గ శత్రువులై వామపక్షాలు. రెండు- భాజపా లోని మోడీ వ్యతిరేక శక్తులు.
ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపిక సందర్భంలో ఆద్వానీ వంటి సీనియర్‌ నాయకుల నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కోవలసివచ్చింది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో మోడీ వ్యతిరేకుల రాజకీయభవిష్యత్తుకు శుభంకార్డు వేయాలని మోడీ అంతర్గతంగా ప్రయత్నించినట్లు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. ఆద్వానీని రాజ్యసభకు పంపాలనే ప్రతిపాదన గుప్పుమనడం, మోడీ మీద విశ్వాసం సన్నగిల్లి గాంధీనగర్‌ నుండి కాకుండా భోపాల్‌ నుండి పోటీ చేస్తానని ఆద్వానీ పట్టుపట్టడం, మురళీ మనోహర్‌ జోషీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి ఆయన్ను తప్పించి మోడీయే స్వయంగా పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం, జస్వంత్‌ సింగ్‌ కోరికను తిరస్కరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసి, బహిష్కరణకు గురైన పరిణామాలు భాజపాలో ఆంతరంగికంగా కొనసాగుతున్న రగడకు నిదర్శనం. యన్‌డిఎలో నిన్నటి వరకు ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉండిన జనతా దళ్‌(యు) నేత, బీహార్‌ ముఖ్యమంత్రి- మోడీని తెగనాడుతూ, ఆద్వానీని పొగడడం చూస్తుంటే మోడీకి ఇంట- బయటా శత్రువులు అధికంగానే ఉన్నారనిపిస్తున్నది. మోడీ పనితీరు ఆయన పార్టీ సహచరులకే మింగుడుపడని పరిస్థితి ఉన్నా, అధికారానికి చేరువుగా ఉన్నామనే ఆశతో మింగలేక కక్కలేక ఉన్నారు. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినా మోడీని బలపరచడానికి కొత్త మిత్రులు ముందుకురాని పరిస్థితి ఎదురైనప్పుడు ఆంతరంగికంగాఉన్న మోడీ వ్యతిరేక శక్తులు గళం విప్పే అవకాశాలున్నాయి.
భాజపాకు 1999లో వచ్చిన 182 స్థానాలైనా వస్తాయా- అన్న సంశయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ రాషా్టల్రలో బలంగా ఉన్నమాట నిజం. కాకపోతే ఆ రాషా్టల్రలో ఉన్న లోక్‌ సభ స్థానాలెన్ని అన్నదే ప్రశ్న. మొత్తం 542 లోక్‌ సభ స్థానాలకు గాను 91 మాత్రమే ఆ రాషా్టల్ల్రో ఉన్నాయి. వాటిలో అత్యధికంగా భాజపా గెలుపొందే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కారణం- బలహీనంగాఉన్న కాంగ్రెస్‌తో భజపా ముఖాముఖి తలపడడమే. గత ఎన్నికల్లో 43 స్థానాల్లో గెలుపొందారు. రాజస్థాన్‌లో కూడా అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఆ నాలుగు రాషా్టల్ల్రో ఆ సంఖ్యను బాగా పెంచుకోవచ్చు. మోడీ ప్రభంజనం ఉన్నదని, రేపు అధికారంలోకి వచ్చేది తామేనని, తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలతో ఎక్కువ స్థానాలను పొందే ప్రయత్నాలు చేస్తున్నది. సిబిఐని కాంగ్రెస్‌ ఆయుధంగా వాడుకొన్నట్లే, భాజపా కూడా వాడుకొం టుందేమో అన్న భయం ఉన్నవారు లేకపోలేదు. ెఫెడరలిజాన్ని గొడ్డలి వేటుకు గురిచేయడంలో కూడా కాంగ్రెసుకు, భాజపాకు తేడాలేదు. అందువల్ల బలమైన ప్రాంతీయ పార్టీలు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లుంది.కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, అసోం మినహా ఈశాన్య రాషా్టల్రలో ఖాతా నే తెరవలేని స్థితిలో ఉన్న భాజాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు.