https://www.youtube.com/watch?v=2-Gt3Cf0rEk
Wednesday, December 31, 2014
Friday, December 19, 2014
Thursday, December 18, 2014
"మత మార్పిడులు" అంశంపై నేను పాల్గొన్న టీ.వి.5 చర్చా కార్యక్రమం వీడియో.
https://www.youtube.com/watch?v=97fEfQIMpuU
https://www.youtube.com/watch?v=vZHQHjbaz_Q
Tuesday, December 9, 2014
నా వ్యాసం: "మోడీ బ్రాండ్ ఇమేజ్" సూర్యా దినపత్రిక, డిసెంబరు 9,2014
మోడీ 'బ్రాండ్ ఇమేజ్'
నరేంద్ర మోడీ అత్యంత ప్రభావశీలుడని, దృఢచిత్తుడని సంపన్న వర్గాలు, కార్పోరేట్ సంస్థలు, సంఘ్ పరివార్ శ్రేణులు, కాంగ్రెస్ దుష్టపాలనతో
విసిగివేసారిపోయిన మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగ యువత పొగడ్తలతో ముంచెత్తారు. ఆ దోరణి ఇంకా
కొనసాగుతున్నది. మోడీని ఉపయోగించుకొని గరిష్టంగా లబ్ధి పొందాలని కార్పోరేట్
సంస్థలు వేగంగా పావులు కదుపుతున్నాయి. తమకు అనుకూలంగా చట్టాలను
మార్పించుకొంటున్నాయి. సరళీకృత విధానాల అమలులో వడివడిగా చర్యలు చేపట్టబడుతున్నాయి.
అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని హిందుత్వ భాజాలాన్ని చాపక్రింద నీరులా వ్యాపింపజేసి, బలమైన పునాదులు వేసుకొని భారత దేశంలో కాషాయ పాలన కొనసాగింపుకు అవసరమైన పునాదుల పటిష్టతకు సంఘ్ పరివార్
కూటమి ప్రణాళికను రూపొందించుకొని, ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై
ఉన్నది. దేశాధికారాన్ని చేజిక్కించుకోవడానికి మోడీకి ఈ రెండు శక్తులు చమటోడ్చి పని
చేశాయి. ఒకరివి ఆర్థిక ప్రయోజనాలైతే, మరొకరివి హిందుత్వ భావజాల ప్రయోజనాలు. ఉభయుల ప్రయోజనాల మధ్య సారూప్యత లేక
పోలేదు. ఒకటి దోపిడీ చేసే వర్గమైతే, ఇంకొకటి దోపిడీని బలపరిచే
శక్తి. మతానికి, పెట్టుబడికి ఎప్పుడూ అవినాభావ సంబంధం ఉండనే ఉన్నది. అంత మాత్రాన వీటి మధ్య వైరుధ్యాలు లేవని కాదు. వాటి మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక దానితో మరొకటి ఘర్షణపడే
పరిస్థితులు నెలకొనే వరకు సహకరించుకొంటాయి. ఆ పరిథి దాటిన తరువాత కార్పోరేట్
సంస్థలు తమ దారి తాము చూసుకొంటాయనడంలో నిస్సందేహం. డా.మన్మోహన్ సింగ్ ను కూడా
కార్పోరేట్ సంస్థలు తమ ప్రతినిథిగానే డిల్లీ గద్దెపై కూర్చోబెట్టడంలో తమవంతు పాత్ర
పోషించాయి. గరిష్టంగా వాడుకొని ఆ ప్రభుత్వం అప్రతిష్టపాలుకాగానే మోడీని అధికారంలో
కూర్చోబెట్టి తమ దోపిడీ నిరాఘాటంగా కొనసాగించుకొంటున్నాయి. ఇది నడుస్తున్న చరిత్ర.
ఎనిమిదవ లోక్ సభకు 1984లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు
కాంగ్రెస్ పార్టీని 404 స్థానాల్లో గెలిపిస్తే
రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. అటు తరువాత 1989 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాల పాలనే సాగింది. అస్థిరత్వం,
ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసిన కూటముల్లోని భాగస్వామ్య పార్టీలు, బయటి నుండి మద్దతిచ్చిన
పార్టీల వత్తిళ్ళు, బ్లాక్ మెయిల్ రాజకీయాల
దుష్ప్రభావాలను ప్రజలు అనుభవించారు. పదవ లోక్ సభలో కాంగ్రెసుకు 232 స్థానాలు వచ్చినా పి.వి.నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వం మిత్రపక్షాల మీద
ఆధారపడే మనుగడ సాగించింది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం గండం నుండి
గట్టేక్కడానికి లోక్ సభ సభ్యులను సూట్ కేసులతో కొనుగోలు చేసిన హేయమైన ఘటనలూ
జరిగాయి. ప్రభుత్వ స్థిరత్వాన్ని కోరుకొన్న పట్టణ ఓటర్లు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 206 స్థానాల్లో గెలిపించారు. ఆ
ఎన్నికల్లో పట్టణాలు, నగరాల్లోని అత్యధిక స్థానాలు
కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. పదహారవ లోక్ సభ ఎన్నికల నాటికి పట్టణ ఓటర్లతో పాటు
గ్రామీణ ఓటర్లు కూడా స్థిరత్వంతో పాటు సుపరిపాలనను కోరుకొని కాంగ్రెస్ పార్టీని
కేవలం 44 స్థానాలకే పరిమితం చేసి, భాజపాను 282 స్థానాల్లో గెలిపించారు. ఈ పరిణామాలన్నీ ప్రజల్లో వచ్చిన చైతన్యం మూలంగా
సంబవించాయన్న నిప్పులాంటి నిజాన్నిగుర్తించ నిరాకరిస్తూ ఈ విజయాన్ని మోడీ ఖాతాలోనే
వేసి తద్వారా తమ ప్రయోజనాలను
నెర్వేర్చుకోవడానికి కార్పోరేట్ మరియు కాషాయ దళం ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు ఈ
ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని ఉన్నారు. వాటిని అడిఆశలు చేస్తే ప్రజలు
చరిత్రను తిరగ రాస్తారని గుర్తుంచుకోవాలి.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి(యు.పి.ఎ.-2) ని ఇంటి దారి పట్టించి భాజపా
నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి(యన్.డి.ఎ.) కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన
తరువాత అధికార కేంద్రాలు మారాయి. గడచిన దశాబ్ద కాలంలో
డా. మన్మోహన్ సింగ్ దుష్టపాలన వల్ల నరేంద్ర మోడీ అత్యధికంగా ప్రయోజనం పొంది
అధికారానికి రాగలిగారన్న నిజాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధాన
మంత్రులుగా ఎన్నికైన వారిలో మన్మోహన్ సింగ్ లాగా నవ్వుల పాలైన వారు మరొకరు లేరు.
ఆయన ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కూడా అదుపులో పెట్టుకోలేని అసమర్థుడుగా
ముద్రవేయించుకొని నిష్క్రమించారు. యు.పి.ఎ. కాలంలో అధికార కేంద్రంగా ప్రధాన మంత్రి
కార్యాలయం కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలి నివాసం ఉండేదనే అపవాదు ఉండేది. ఈవాళ
ప్రధాన మంత్రి కార్యాలయమే అధికార కేంద్రంగా మారడం గుణాత్మకమైన మార్పుగానే
భావించాలి. నేడు మోడీ చుట్టే అధికారమంతా కేంద్ర్రీకృతమయ్యింది. అంతా తానై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతమైన
నాయకుడుగా కంటే ఆయన పట్ల భయం, భక్తి, వ్యామోహం కలిగించే వాతావరణం సృష్టించబడింది. ఒకనాడు దేవ్ కాంత్ బారువా 'ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా' అని పొగడ్తలతో కాంగ్రెస్ శ్రేణులతో ఎలా కేరింతలు కొట్టించారో! అదే రీతిలో ఇప్పుడు కొందరు మోడీ వీరాభిమానులు 'మోడీనే ఇండియా, ఇండియానే మోడీ' అని కేరింతలు కొడుతున్నారు. మోడీ
వ్యవహార శైలిని కొనియాడే వారూ ఉన్నారు, మింగుడుపడని వారూ ఉన్నారు, విమర్శలు గుప్పించే వారూ ఉన్నారు. ఆయన అనుసరిస్తున్న
విధానాలు, పద్ధతుల పట్ల కొందరు హేతుబద్ధమైన, విమర్శనాత్మక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రసార మాధ్యమాలు
కూడా ఈ రీతిలోనే విడిపోయి ఉన్నాయి. అసలు ప్రసారమాధ్యమాలను మోడీ పెద్దగా
పట్టించుకొన్న దాఖలాలు కూడా కనపడడం లేదు. ప్రధాన మంత్రిగా తనకొచ్చే ప్రచారం ఎలాగూ
వస్తుందనే ధీమాలో ఉన్నట్లుంది. ప్రభుత్వ, పార్టీ యంత్రాంగాలు తన చుట్టూనే పరిభ్రమించేలా మోడీ చేసుకొన్నారు. తాను
చెప్పిందే వేదంగా సహచర మంత్రులు, అధికార యంత్రాంగం భావించి అమలు చేయాలి. భిన్నాభిప్రాయానికి చోటు లేదు. ఇది
ఆయన దోరణిగా ప్రస్పుటంగా కనబడుతున్నది, వినబడుతున్నది.
'గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం' అని ఉద్భోదించిన మోడీ
స్వాతంత్య్ర దినోత్సవం నాటి ఉపన్యాసంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయబోతున్నట్లు
ఏకపక్షంగా ప్రకటించేసి, అమలులో పెట్టారు. అత్యున్నత
న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన
నిర్ధిష్ట ప్రతిపాదనలను రూపొదించే కొలీజియంను ఏకంగా పక్కన పెట్టేశారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్ల జాబితాను రాజకీయ కోణంలో
పరిశీలించిన మీదట ఒకరిని మినహాయించి జాబితాను రాష్ట్రపతి ఆమోద కోసం సిఫార్సు
చేశారు. గవర్నర్ల తొలగింపుపైన కఠిన వైఖరినే ప్రదర్శించారు. రాజ్యాంగబద్ధమైన
సంస్థలు, సాంప్రదాయాలు, ప్రజాస్వామ్య పద్ధతుల పట్ల
ఆయన అనుసరిస్తున్న వైఖరికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ చర్యలను ఆయన ధైర్య
సాహసాలకు, అంకితభావానికి ప్రతిబింబంగా కొనియాడే వారు లేకపోలేదు.
నాకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారు. నాకు తోచిన రీతిలో
పాలన సాగిస్తానన్న దోరణే ఆయన ఆలోచనల్లోనూ, చర్యల్లోనూ ప్రతిఫలిస్తున్నది. గత ప్రభుత్వాలు చట్టాలు చేయడాన్ని ఘనంగా
ప్రకటించుకొన్నాయి, నేను చట్టాలను రద్దు చేయడంలో
చరిత్ర సృష్టిస్తానని బహిరంగంగా ప్రకటించడాన్ని బట్టి మోడీ అహంభావం ఏ స్థాయిలో
ఉన్నది అర్థమవుతున్నది. నా భావజాల ఆలోచనలకు, విధానాలకు కార్యరూపం ఇచ్చి అమలు చేయడానికి నా మనుషులనే నియమించుకొంటాను. ప్రతిపక్షాలు కానీ, ప్రసారమాధ్యమాలు కానీ చేసే
విమర్శలను ఖాతరు చేయను. అదే నీతిని
ప్రభుత్వాన్ని, పార్టీని నడపడంలో పాటిస్తున్నారు. తదనుగుణంగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు, పార్టీ నాయకత్వ స్థానాల్లో
తన అనుచర గణాన్ని నియమించుకొన్నారు. ఇదీ పైకి కనబడుతున్న
దృశ్యం. కానీ నిశితంగా పరిశీలిస్తే ఆర్.యస్.యస్. కనుసన్నల్లోనే అన్నీ
నిర్వహించబడుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, గోవా ముఖ్యమంత్రుల నియామకం మొదలు గవర్నర్ల వరకు, కొన్ని కీలకమైన శాఖల మంత్రులను ఉత్సవ విగ్రహాలుగా పెట్టి నిబద్ధత కలిగిన
ఆర్.యస్.యస్. ఆర్గనైజర్లను రాజ్యాంగేతర శక్తులుగా నియమించడం ద్వారా తమ భావజాలానికి
అనుకూలంగా పనులను చక్కబెట్టుకొటున్నారన్న వార్తలు దాచాలనుకొన్నా దాగడం లేదు. గతంలో యన్.డి.ఎ. కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉండిన
భాజపా నేతగా అతల్ బిహారీ వాజ్ పేయ్ గారు సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.
నాడు మిత్రపక్షాల మీద ఆధారపడిన
ప్రభుత్వమది.
మోడీ ప్రభుత్వం లోక్ సభ వరకు మిత్రపక్షాల మీద ఆధారపడి లేదు.
రాజ్యసభలో తగిన సంఖ్యా బలం లేక పోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితినే
ఎదుర్కొంటున్నది. భాజపా నిర్మాణ స్వభావాన్ని పరిశీలించినా ఆ పార్టీ అధ్యక్షుడి నియామకం వరకు
ఆర్.యస్.యస్.కు విధిగా విశ్వసనీయమైన వ్యక్తి ఉండేలా చూసుకొనేది. నేడు పార్టీ
నిర్మాణ యంత్రాంగాన్నంతా ఆర్.యస్.యస్. తన గుప్పిట్లోకి
తీసుకొన్నట్లు కనబడుతున్నది. స్పష్టమైన ఆధిక్యతతో మోడీ అధికారంలోకి రావడంతో భాజపా
నిర్మాణంలోని బలాబలాల పొందికలో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా
మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.యస్.యస్.) పట్టును ప్రత్యక్షంగా పెంచుకొన్నది. భాజపా అధ్యక్షులు అమిత్ షా, ప్రధాన కార్యదర్శులుగా
నియమించబడిన ఆర్.యస్.యస్. ప్రచారక్ రామ్ మాధవ్ తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. సంఘ్ పరివార్
హిందుత్వ భావజాల లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం మరియు భాజపాలకు ఆర్.యస్.యస్.కు
మధ్య సమన్వయకర్తలుగా పని చేయడానికే వీరు
నియమించబడ్డారు. హార్డ్ కోర్ ఆర్.యస్.యస్. కార్యకర్తలనే కీలకమైన భాజపా నిర్మాణ
బాధ్యతల్లో నియమించుకొంటున్నారు. ఫలితంగా ఆర్.యస్.యస్. తో అనుబంధంలేని, ఇతర పార్టీల నుండి భాజపాలో
చేరిన నాయకుల, కార్యకర్తల ఎదుగుదలపై
నీలినీడలు కమ్ముకొన్నాయని భావించవచ్చు. అలాగే ప్రభుత్వంపైన, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఆర్.యస్.యస్. భావజాలం ప్రభావం, ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్
నియంత్రణ ఉందనడంలో నిస్సందేహం. ప్రభుత్వ నియంత్రణలో నిర్వహించబడుతున్న దూరదర్శన్
లో భగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడమే దీనికి ప్రబల నిదర్శనం.
సమస్యల పరిష్కారంలో ఏది
చొరవ: నరేంద్ర మోడీ అధికార పగ్గాలు చేబట్టిన తరువాత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం
కలిగించే దృక్పథంతో ఏమైనా నిర్ధిష్టమైన చర్యలు తీసుకోబడ్డాయా! లేదా! అన్న అంశాన్ని
పరిశీలించాలి. దేశానికి, ప్రజలకు సంబంధించిన
సంక్లిష్టమైన, మౌలికమైన సమస్యల
పరిష్కారంలో అడుగులు ముందుకుపడుతున్న
సూచనలు ఏ మాత్రం కనపడడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు గణనీయంగా పతనం కావడం మోడీకి కలిసి వచ్చిన
అంశం. మోడీ అధికారంలోకి వచ్చిన నాటికి బేరల్
ముడి చమురు ధర 105 డాలర్లుంటే డిసెంబరు 1 వ తేదీకి 68 డాలర్ల క్రిందికి
పడిపోయింది. ముడి చమురు ధరలు 35% తగ్గితే వినియోగదారులు చెల్లిస్తున్న రీటేల్
ధరల్లో కేవలం 12% మేరకే చమురు కంపెనీలు తగ్గించాయి. మరొక వైపు ప్రభుత్వ ఖజానాను
నింపుకోవడానికి దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం రెండు దఫాలు పెంచుకొన్నది. తద్వారా
వినియోగదారులకు చేరవలసిన ఆర్థిక లబ్ధికి కన్నం పెట్టి ప్రభుత్వ బొక్కసానికి
తరలించుకొన్నారు. అదును చూసి ప్రభుత్వం మరొక దెబ్బ కూడా వేసింది. గతంలో పెట్రోల్ పై మాత్రమే తొలగించబడిన ధరల నియంత్రణను
మోడీ ప్రభుత్వం డీజిల్ పై కూడా తొలగించింది. అంటే భవిష్యత్తులో వీటి ధరల పెరుగుదల, తరుగుదల అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ మీదనే
ఆధారపడి ఉంటుంది.
యు.పి.ఎ.-2 ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన 2జీ మరియు బొగ్గు కుంభకోణాలపై
సుప్రీంకోర్టు విచారణ పుణ్యమాని కొన్ని ఫలితాలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఆశ్రిత
పక్షపాతంతో కేటాయించిన బొగ్గు క్షేత్రాల లైసెన్సులు రద్దు చేయడం ద్వారా జాతి
సంపదను అడ్డగోలుగా కొల్లగొట్టడానికి వీలు లేకుండా కొంత వరకు అడ్డుకట్ట వేయడానికి
అత్యున్నత న్యాయస్థానం తీర్పు దోహదపడింది. నల్లకుబేరులు చట్టబద్ధంగా ప్రభుత్వానికి
చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టి స్విస్ బ్యాంకు తదితర విదేశీ బ్యాంకుల్లో
దాచిపెట్టిన నల్లధనాన్ని వంద రోజుల్లో స్వదేశానికి
తెప్పిస్తానని చేసిన వాగ్ధానం మాటలకే పరిమితమయ్యింది. ఇప్పుడేమో 470 బ్యాంకు ఖాతాలే ఉన్నట్లు సమాచారం లభ్యమయ్యిందని, వాటిలో సగానికిపైగా
ఖాతాదారులు వారికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేశారని, మిగిలిన వాటి వివరాలను సేకరించే పనిలో ఉన్నామని సన్నాయి నొక్కులు
నొక్కుతున్నారు. ఈ విషయంలో కూడా సుప్రీం కోర్టు వెంటపడుతుండడంతో విధిలేక చర్యలు
తీసుకొంటున్నట్లు నటిస్తున్నారు. షేర్ మార్కెట్
వృద్ధిని పరిశీలిస్తే దినదినాభివృద్ధి చెందుతూ 28,300 లకు చేరుకొన్నది. దాదాపు 25% కి పైగా పెరుగుదల ఉన్నది. ఫలితంగా బడా పారిశ్రామిక
సంస్థలు, దళారులకు ప్రయోజనం వనకూడింది. ద్రవ్యోల్భణాన్ని
నియంత్రించడానికి అమలు చేసిన చర్యలేమీ కనపడడం లేదు. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి
రేటు పెరుగుదలపై ప్రకటనలు వెలువడుతున్నాయే గానీ ఆ వైపున అడుగులు ముందుకు
పడుతున్నట్లు ఛాయలేమీ గోచరించడ లేదు. రిజర్వ్ బ్యాంకు
అంచనాల ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.5% మించి వృద్ధి రేటు సాధించే అవకాశాలు లేవని తేలిపోయింది.
ప్రతిష్ట పెంచుకోవడంపైనే
కన్ను: గోద్రా ఘటనల తదనంతరం
అంతర్జాతీయ సమాజం తనను అంటరాని వాడుగా చూస్తున్న వాతావరణాన్ని ఛేదించడానికి తన ప్రమాణ
స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ద్వారా మొదట దక్షిణాసియాలో తన
రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకొని, గౌరవాన్ని పొంది తదనంతరం
ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా మోడీ పలుకుబడిని
పెంచే వ్యూహంలో భాగంగా అమెరికా, ఆస్ట్రేలియా పర్యటనల
సందర్భంలో న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్
గార్డన్, సిడ్నీ లోని ఆల్ ఫోన్స్ ఎరేనాలో సభలు నిర్వహించబడ్డాయి. అట్టహాసంగా
నిర్వహించబడిన ఈ సభల విజయవంతానికి
ఆర్.యస్.యస్. మరియు కార్పోరేట్ సంస్థలు నిర్వహించిన పాత్రను గమనిస్తే మోడీ ‘బ్రాండ్ ఇమేజ్’ ను విదేశాలలో
పెంచడానికి జరిగిన, జరుగుతున్న కృషిని
గమనించవచ్చు.
తాజాగా కాట్మండులో జరిగిన 18వ సార్క్ సమావేశాలలో
పెద్దన్న పాత్ర పోషించేలా ప్రవర్తించారనే విమర్శలను నేపాల్ ప్రసారమాధ్యమాల నుండి
చవి చూశారు. ఇరుగు పొరుగు దేశాలతో మైత్రి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడానికి
బదులు కృత్రిమంగా హావభావాలు ప్రదర్శించడం వల్ల ఒరిగిదేముండదు. దేశీయంగా చూస్తే
తాను అత్యంత శక్తిమంతుడననే భావన ప్రజల్లో నాటుకునేలా మోడీ వ్యవహరిస్తున్నారు.
స్వాతంత్ర్యోద్యమ వారసత్వం లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆకాశానికెత్తడం, భారత దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూను తక్కువ చేసి
చూపెట్టడం, మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి
పొందాలని ఉబలాటపడుతున్నారు. వీరు నెత్తికెత్తుకొని మోస్తున్న సర్దార్ వల్లభాయ్
పటేల్ ఆర్.యస్.యస్. ను నిషేధించిన ఉదంతాన్ని, మహాత్మాగాంధీని వీరి భావజాల
వంశీకుడైన నాథూరాం గాడ్సే కాల్చి చంపిన అత్యంత
హేయమైన ఘటనను ప్రజలు మరచిపోయినట్లుగా భ్రమిస్తున్నారు. దీని వెనకాల గుజరాత్ జాతీయ
వాదం కాస్తా ఉందనిపిస్తోంది. బడా
పారిశ్రామికవేత్తలతో, ప్రత్యేకించి కార్పోరేట్
రంగం దిగ్గజాలుగా ఉన్న ముఖేష్ అంబానీ, గౌతం ఆదానీలతో వీరికున్న అనుబంధం బహిరంగ రహస్యమే. ప్రధాన మంత్రిగా ఉన్న మోడీని
రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని వీపు తట్టి, ఆలింగనం చేసుకొనేంత సుధృడంగా
వారి సంబంధాలు పెనవేసుకొని ఉన్నాయన్న సంగతి దేశ ప్రజలకు తెలియంది కాదు.
అపనమ్మకం, అభద్రతల మధ్య మైత్రి బంధం: ఈ ఏడాది సెప్టంబరులో జరిగిన ఉత్తర్ ప్రదేశ్,
మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలు మే లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లాగేనే ఉంటాయని అందరూ వూహించారు. కానీ ఓటర్లు
తద్భిన్నంగా భాజపాకు నిరాశ కలిగించారు. కానీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పదిహేనేళ్ళు, హర్యానాలో పదేంళ్ళ పాటు కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్న పూర్వరంగంలో జరిగిన
శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీయడంతో వాటిని భాజపా అనుకూలంగా మలచుకొని 122(288)
నియోజకవర్గాలలో
విజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. హిందుత్వ
భావజాల రీత్యా భాజపా, శివసేన ఒకే తానులోని ముక్కలే
అయినా అధికారం కోసం జరిగిన పోరులో 25 ఏళ్ళ బంధం తెగిపోయింది.
మరాఠీ జాతీయవాద పార్టీ అయిన శివసేనకు జాతీయ దృక్పథం లేకపోవడం, కుటుంబ రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండడం మూలంగా పారిశ్రామికంగా ముందు పీఠిన
ఉన్న మహారాష్ట్ర ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపారు. కానీ శాసనసభలో మూజువాణి ఓటింగ్
పద్ధతిలో విశ్వాస తీన్మానం నెగ్గినట్లు ప్రకటించుకోవడం ద్వారా పార్లమెంటరీ
ప్రజాస్వామ్యాన్ని భాజపా అపహాస్యం చేసింది. తాజాగా పాత మిత్రుడైన శివసేనను మచ్చిక చేసుకొని
గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నది. హర్యానా శాసనసభకు 2009లో జరిగిన ఎన్నికల్లో కేవలం
నాలుగు స్థానాల్లో గెలిచిన భాజపా ఈ ఎన్నికల్లో ఏకంగా 47(90)
స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
హర్యానాలోని చౌతాలా నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ అవినీతిలో కూరకపోయి ఉండడంతో గత
శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో
వెనకబడి రెండవ స్థానానికే పరిమితమయ్యింది. రెండు రాష్ట్రాలలో అధికారాన్ని వెలగబెట్టిన
కాంగ్రెస్ మూడవ స్థానానికి నెట్టివేయబడింది. ఈవాళ కాంగ్రెస్ నాయకత్వం
తీవ్రగందరగోళం మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న
జార్కండ్, జమ్మూ&కాశ్మీర్ లలో కూడా భాజపా పాగా
వేయాలని ఉవ్విళూరుతున్నది.
రానున్న కాలంలో బీహార్, పశ్చిమ్ బెంగాల్, దక్షిణాది రాష్ట్రాలపై
ప్రత్యేక దృష్టి సారించి, విస్తరించాలని పథకం ప్రకారం
పని చేస్తున్నది. కరుడుగట్టిన హిందుత్వవాద, జాతీయవాద, ప్రాంతీయ మరియు కుటుంబ పార్టీ అయిన శివసేనతో పెనవేసుక పోయిన మిత్రత్వాన్ని మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా
భాజపా తెగతెంపులు చేసుకొన్న తీరును గమనించిన మిత్రపక్షాల్లో మైత్రి పట్ల అభద్రతా
భావం నెలకొన్నది. రేపో మాపో మాతోనూ అలాగే
ప్రవర్తించే అవకాశముందని భావిస్తున్న అకాలీదళ్ కాస్తా రాజకీయ ముళ్ళు వేసే పనిలో
పడ్దట్టు ఉన్నది. చండిఘర్ ను పూర్తిగా పంజాబ్ రాష్ట్ర రాజధానిగా మారుస్తూ చట్టం
చేయాలని, ఇంత కాలం కాంగ్రెస్ చేసిన దగాకు ముగింపు పలకాలని కేద్ర ప్రభుత్వాన్ని డిమాండ్
చేస్తున్నది. హర్యానా ఎన్నికల్లో గెలుపొంది నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన
నేపథ్యంలోనే ఈ డిమాండు చేయడం ద్వారా భాజపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నది.
సైన్స్ అభివృద్ధిని తక్కువ
చేసి చూపెట్టే ప్రయత్నం: శాస్త్రీయ విజ్ఞానాన్ని
చిన్నబుచ్చే విధంగా ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలు భావజాల ఘర్షణకు తెరలేపాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన, సాధిస్తున్న విప్లవాత్మకమైన
విజయాలను (ప్లాస్టిక్ సర్జరీ మరియు
జెనిటిక్ సైన్స్), పురాణాలలోని కల్పితాలను(పుష్పక విమానాలు, వినాయకునికి ఏనుగు తలను
అతికించడం వగైరా) సరిపోల్చి మోడీ మాట్లాడడం అసంబద్ధమైనది. ఆధునిక ప్రపంచంలో
జీవిస్తూ, దేశ ప్రధాన మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదివిలో ఉంటూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా
వ్యాఖ్యానాలు చేయడంలోని ఆంతర్యమేమిటి? శాస్త్రీయ దృక్పథాన్ని, ఆలోచనలను పెంపొందించాల్సింది పోయి అశాస్త్రీయమైన భావాలను వెదజల్లడాన్ని ఈ
దేశంలోని శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో ఖండించక పోవడం భావదారిద్యానికి ప్రభల
నిదర్శనం. మంగల్యాన్ లాంటి ఉపగ్రహాల
ప్రయోగం, అంతరిక్ష పరిశోధనలను, శాస్త్ర సాంకేతిక రంగాలలో
నిర్వహించబడుతున్న పరిశోధనలు, నూతన విజ్ఞాన ఆవిష్కరణలను
నీరుగార్చడం, అవమానిచడంగానే భావించాలి. మరొక వైపు కేంద్రీయ పాఠశాలలు మరియు ఉన్నత విద్యాలయాల్లో బోధించే చరిత్ర పాఠ్యాంశాలను
హిందూ భావజాల కోణం నుండి పునర్ రచించే పనిలో మానవ వనరుల మంత్రిత్వశాఖ నిమగ్నమై
ఉన్నదని చెప్పబడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. లౌకిక వ్యవస్థ పునాదులను
పెకలించే చర్య.
భావవాదానికి, భౌతికవాదానికి నిరంతరాయంగా
ఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి,
దాని ఆలోచనా సరళికి, మతోన్మాద పిడివాదానికి మధ్య కొనసాగుతున్న వైరుధ్యంలో అంతర్భాగమే నరేంద్ర
మోడీ వ్యాఖ్యలు. "స్టెమ్ సెల్స్, సర్జికల్ ట్రాన్స్
ప్లాంటేషన్ ఆఫ్ గణేష్ ఎలిపెంట్ హెడ్ టు కంప్యూటర్స్, వేదిక్ మాథమాటిక్స్"
వరకు పురాతన భారత దేశం నుండే అనుభవంలో ఉన్నాయని, నేటి శాస్త్ర విజ్ఞాన ఫలితాలు
వాటి కొనసాగింపేనన్నట్లు మోడీ మాట్లాడడం దేనికి సంకేతం? పురాణాలకు, ఊహలకు, శాస్త్రీయ విజ్ఞానానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉన్నదనే
నిప్పులాంటి నిజాన్ని గుర్తించ నిరాకరించడంగానే భావించాల్సి వస్తున్నది.
పురాణాలలాగా కాకుండా శాస్త్రీయ విజ్ఞానం తర్కానికి, విశ్లేషణలకు, హేతుబద్ధమైన పరీక్షలకు, ప్రయోగానికి, ఆచరణకు నిలుస్తుంది. అంత మాత్రాన పురాతన కాలంలోని గొప్ప గణాంక శాస్త్రజ్ఞులైన
భాస్కర లేదా ఆర్యభట్ట లేదా శస్త్ర వైద్య నిపుణులు సుసృత లేదా చార్వాక లేదా హరప్పా
పట్టణ నిర్మాణానికి వినియోగించబడిన నిర్మాణ మరియు శిల్పశాస్త్రాన్ని ఎవరూ తృణీకార భావంతో చూడడం లేదు. పైపెచ్చు ప్రతి ఒక్కరూ
పురాతన కాలం నాటి విజ్ఞాన సంపదకు వారసులుగా గర్విస్తారు. నేటి శాస్త్ర సాంకేతిక
విప్లవ ఫలాలను పురాణాల్లోని కల్పితాలతో పోల్చి తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం
చేయడం దుస్సాహసమే అవుతుంది. నేడు అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తున్నాయి.
వాటిని ఊహించి తీస్తున్నారు. వాటిలో గ్రహాంతరవాసుల ఉనికి మీద చిత్రీకరించినవి కూడా
ఉన్నాయి. అందులో కొన్ని అంశాలు భవిష్యత్తులో వాస్తవ రూపం ధరించాయని మాట వరసకు
అనుకొందాం! అంత మాత్రాన ఆ అంశంపై పరిశోధన చేసి ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించిన
శాస్త్రవేత్తలకు కాకుండా ఆ ఖ్యాతిని ఊహించి సినిమా తీసిన దర్శకుడికో, రచయితకో, నిర్మాతకో ముట్టజెప్పడం సమంజసమా?
శాస్త్రీయ విజ్ఞానం నిరంతరాయంగా అభివృద్ధి చెందుతుంది.
పరిశోధనల ద్వారా నూతన విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. పురాణాల్లో పేర్కొనబడిన
అంశాలు అశాస్త్రీయమైనవి. మూఢత్వంతో కేవలం విశ్వాసంపై
ఆధారపడి మనుగడలో ఉన్నవి. మౌలికంగా ‘సైన్స్’ కు వ్యతిరేకంగా
మాట్లాడేవారు శాస్త్ర పరిశోధనలకు, అధ్యయనానికి నిథులను పెద్ద
ఎత్తున కేటాయించి ప్రోత్సహిస్తారనుకోవడం భ్రమగానే మిగిలిపోతుంది. శాస్త్ర సాంకేతికాభివృద్ధి నూతన పుంతలు తొక్కుతున్న వేళ మన
దేశం దాన్ని అందిపుచ్చుకొని, అభివృద్ధి ఫలాలు అందరికీ
అందేలా పాలన సాగించినప్పుడే మౌలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. 'మేక్ ఇన్ ఇండియా' అన్న నినాదంతో హోరెత్తిస్తూ, దానికి మోడీ 'బ్రాండ్ అంబేజిడర్' గా మారినంత మాత్రాన నిజమైన అభివృద్ధి సాధించబడదు. విదేశీ పెట్టుబడులు అధిక
లాభార్జన లక్ష్యంతోనే వస్తాయే కానీ మన ప్రజల అభివృద్ధికి ఉచిత సేవలు అందించడానికి
రావు. శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన అధ్యయనాలు, పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ విజ్ఞానంపై ప్రధానంగా ఆధారపడి మన
ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయ సంకల్పం, అంకిత భావంతో కృషి చేయాలి. అప్పుడే స్థిరమైన, స్వావలంబనతో కూడిన ప్రగతి సాధ్యమవుతుంది.
Subscribe to:
Posts (Atom)