హ్యదయ విదారకమైన ఘటనపై హెచ్.యం.టీ.వి.లో జరిగిన చర్చలో నాతో పాటు టిడిపి శాసనమండలి సభ్యులు శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్, బిజెపి నాయకులు శ్రీ కుమార్, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ రాజయ్య యాదవ్, కొత్త చెరువు గ్రామ సర్చంచ్ శ్రీ మాణిక్యం బాబు పాల్గొన్నారు. ఘటన వివరాల్లోకి వెళితే కరువుకు ఆట పట్టు, అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా కొత్త చెరువు గ్రామంలో ఒక నిరుపేద తన తల్లి మరణించిందనే భావనతో చాప మీద పడుకోబెట్టి లాక్కొంటూ శ్మశానానికి తీసుకెళుతుంటే ఒక విలేకరి గమనించారు. ఏం జరిగిందని వివరాలు అడిగి తెలుసుకొనే సందర్భంలో ఆమె బ్రతికే ఉన్నట్లు గ్రహించి, వెంటనే వైద్యుడిని రప్పించి, పరీక్ష చేయించగా ఆ మాతృమూర్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది.
ఆమె కుమారుడు అవివాహితుడు. ఆ వూరి సత్రంలోనే నివాసం. రాళ్ళను తనకున్న నైపుణ్యంతో రోళ్ళుగా తయారు చేసి అమ్ముకొని తద్వారా వచ్చిన డబ్బుతో తాను పొట్టపోసుకొంటూ, తల్లిని పోషించుకొంటూ వస్తున్నాడు. తల్లి వృద్ధాప్యంలో అనారోగ్యంతో నరకయాతన పడుతున్నది. తన వయసు మీద పడుతున్నది. రాళ్ళను రోళ్ళుగా మలచగలిగిన సత్తువ నశించి పోయింది. ఇల్లు లేదు. రేషన్ కార్డు లేదు. వృద్ధాప్య పెన్షన్ లేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేదు. బ్రతుకే భారంగా తయారయ్యింది. ప్రభుత్వాధికారుల బాధ్యతారాహిత్యం, ప్రజాప్రతినిథుల నిరాధరణ ఫలితంగా ఒక వృత్తి నైపుణ్యం ఉన్న అసంఘటిత కార్మికుడు అనాధగా జీవచ్ఛవంగా బ్రతుకీడుస్తున్నాడు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నసామాజిక భద్రతా చట్టాలు, సంక్షేమ పథకాలేవీ ఆ తల్లీ, తనయుల దరిదాపుల్లోకి చేరలేదు. ఆహార భద్రతా చట్టం, అంత్యోదయ అన్న యోజన పథకం, రూపాయికి కేజీ బియ్యం పథకం, జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం, పేదలందరికీ శాశ్వత గృహ నిర్మాణం వగైరా వగైరా ప్రభుత్వ పథకాలేవీ ఆ అభాగ్యుల దరి చేరలేదు. పైపెచ్చు ఆ గ్రామం ఒక రాష్ట్ర మంత్రివర్యుల నియోజకవర్గం పరిథిలో రోడ్డు ప్రక్కనే ఉన్న గ్రామమది.
ఇదే! ఈనాటి హెచ్.యం.టీ.వి. వార్తల విశ్లేషణలో చర్చనీయాంశం. భూతద్దంతో నిశితంగా పరిశీలిస్తే గానీ ఒక దిన పత్రికలో ప్రచురించబడిన ఆ వార్తా కనిపించని ఒక హృదయ విదారకమైన ఘటనపై స్పందించిన హెచ్.యం.టీ.వి. ఛీప్ ఎడిటర్ దాన్నే చర్చనీయాంశం చేశారు. ఒక విలేకరి ఆ మాతృమూర్తి ప్రాణాలను కాపాడడంతో పాటు సభ్యసమాజం దృష్టికి ఆ ఘటనను తెచ్చారు. వారిరువురు అభినందనీయులు. ఈ ఉదంతంపై జరిగిన చర్చలో పాల్గొని నా గుండె చప్పుడును వినిపించాను. ఇతర మిత్రులు సానుకూలంగా స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను.