Saturday, August 15, 2015

పట్టిసీమ ప్రాజెక్టుపై హెచ్.యం.టి.వి.లో ఆగస్టు 13న‌ లెఫ్ట్ & రైట్ శీర్షికతో నిర్వహించబడిన చర్చా కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు, వై.యస్.ఆర్.సి.పి.నాయకులు డా. యం.వి.మైసూరారెడ్డి, మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. శైలజానాథ్, ఆంధ్ర మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్, టిడిపి శాసన సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరావు పాల్గొన్నారు.

 ఒక మాతృమూర్తికి ముగ్గురు ఆడ పిల్లలు
ముగ్గురు కూతుళ్ళకు పండంటి బిడ్డలు పుట్టారు
పెద్ద‌ కూతురుకు తన‌ బిడ్డ కడుపు నిండా పాలిచ్చాక కూడా తన పాలు బుగ్గి పాలైయ్యేంత సమృద్ధిగా ఉన్నాయి
ఒకే కాన్పులో అధిక సంతానానికి జన్మ‌నిచ్చిన రెండవ‌ కూతురు, బిడ్డలందరికీ సరిపడ పాలివ్వలేక తల్లడిల్లి పోతున్నది
పౌష్టికార లోపంతో స్థనాలెండి పోయిన మూడవ‌ కూతురు, తన‌ బిడ్డకు పాలివ్వలేని దుస్థితిలో వున్నది
ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తి హృదయ ఘోష వర్ణనాతీతం
పెద్ద కూతురి స్థనాల నుండి జాలు వారి బుగ్గి పాలౌతున్న పాలను గిన్నెలోకి పట్టుకొని
ఆకలితో మలమలలాడి పోతున్న‌ మ‌నవళ్ళు, మనమరాళ్ళ‌ కడుపు నింపాలని పరితపిస్తున్నది
గోదారమ్మ, కృష్ణమ్మ, పెన్నార్ తల్లి పేగు బంధాన్ని తెగనీయవద్దు!
నీరున్న చోటు నుండి నీరు లేని కరువు పీడిత ప్రాంతాలకు నీటిని తరలించాలి
నీటికి సంకుచిత‌ రాజకీయాల రంగులను పులమద్దు!
విమర్శల కోసం విమర్శలు అర్థరహితం, సద్విమర్శలు ఆహ్వానించతగ్గవి
నీటి వినియోగం మన ఇష్టాయిష్టాలపై ఆధారపడి లేదు, ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం
ప్రాజెక్టులకు అనుకూలం - అవినీతికి బద్ధ వ్యతిరేకం అన్న నినాదమే ప్రతిధ్వనించాలి
అన్నపూర్ణగా గణతికెక్కిన మాగాణి భూములు సిరులు పండించాలి
కరువుల్లో పుట్టి, కరువులతో జీవన్మరణ పోరు సల్పుతూ, మరణిస్తున్న అభాగ్యుల గొంతులు తడవాలి
పాలకుల వంచనకు, ప్రకృతి నిరాధరణకు బలైపోతున్న కరువు పీడితులకు త్రాగునీరు, సాగునీరు హక్కుగా లభించాలి
నా ఈ గుండె చప్పుడునే ఈ హెచ్.య‍ం.టీ.వి. లెప్ట్ & రైట్ చర్చలో వినిపించే ప్రయత్నం చేశాను.

https://www.youtube.com/watch?v=WhAbgC7OoMU&list=PLYbtwlhBDQlnmkf4665Ukpz4u5riSMapA

Monday, August 10, 2015

ప్రత్యేక హోదా నిష్ప్రయోజన‌మైనదా!



ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నిస్తూ శ్రీ వేమూరు రాధాకృష్ణ‌ గారు  హోదా గోదాలో...!  అన్న‌ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో మే 10న వ్యాసం వ్రాశారు. ప్రత్యేక హోదా అడుగుతున్న వారంతా 'ఎర్రిబాగులోళ్ళు' అన్న దోరణిలో వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, ఒక వేళ‌ కాస్తా ఉందనుకొన్నా కేవలం 20% అదనంగా నిథులను పొందే అవకాశం ఉంటుందని తెల్చేస్తూ, దాని కోసం ఆందోళనలు చేయడం తెలివి తక్కువ వాళ్ళు చేసే పనిగా వ్యాఖ్యానించడం ద్వారా ప్రజలను ప్రక్క దోవ పట్టి‍oచడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఈ వైఖరి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గానీ, కష్టాల కడలిలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ప్రజానీకానికి కానీ మేలు చేకూర్చదు. రాష్ట్ర విభజనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన రాజకీయ పార్టీలను ఎంతటి తీవ్ర పదజాలంతో తూర్పారబట్టినా, విమర్శించినా, దుర్భాషలాడినా, వాటన్నింటికీ అవి అర్హమైనవే. అలాంటి సద్విమర్శలకు ప్రజల మద్దతు లభిస్తుంది.
రాష్ట్రాన్ని దుర్మార్గంగా రెండు ముక్కలు చేసి, ప్రజల ఛీత్కారానికి గురై భూస్థాపితమైన‌ రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్నిఆయుధంగా చేసుకొని పునరుజ్జీవనం పొందడానికి పడరాని పాట్లు పడుతున్న మాట ముమ్మాటికీ వాస్తవం. వాటి రాజకీయ విన్యాసాలకు ప్రజల నుండి పెద్ద స్పందన లేక పోవడానికి కారణం ఒక్కటే, అవి చరిత్ర క్షమించని నేరానికి పాల్పడ్డాయి కాబట్టే. నేడు వీధికెక్కి న్యాయం చేయండని ఆ పార్టీలు అడగడం ఎలా ఉందంటే, తల్లిదండ్రులను అత్య‍ంత దారుణంగా హత్య చేసి, అనాదనై పోయాను కరుణ చూపండి, సహాయం చేయండని ఆర్థనాదాలు చేసే అమానుషమైన పిల్లల్లా గోచరిస్తున్నది.
అప్రజాస్వామ్యంగా రాష్ట్రాన్నివిభజించిన‌ కాంగ్రెస్ పార్టీ 'ప్రత్యేక హోదా' ఇవ్వాలని ఆందోళన చేసినంత మాత్రాన ఆ డిమాండు నిరుపయోగమైనదిగా మారిపోదు. దాని వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలు వనకూడుతాయన్న భావన అర్థరహితమైనదో, ఆధారరహితమైనదో కాదు. దాన్ని డిమాండ్ చేస్తున్న ఆంధ్ర మేధావులు బుర్ర త‌క్కువ వాళ్ళు అయిపోరు. ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ప్రత్యేక హోదా వల్ల వనగూడే ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి కాస్త అధ్యయనం చేసి ఆయన వ్యాసం వ్రాసినట్లుగా అనిపించలేదు.
ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలే లేవా! : కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్థిక వ్యవస్థను బలమైన పునాదులపై నిర్మించుకోవడానికి ప్రత్యేక తరగతి హోదా (స్పెషల్ క్యాటగరీ స్టేటస్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పిస్తామని నాటి ప్రధాన మ‍ంత్రి డా. మన్మోహన్ సింగ్ రాజ్య‌సభలో ప్రకటించారు. ఆర్థిక వేత్త‌గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆయన ప్రత్యేక హోదాతో వనగూడే ప్రయోజనాలపై అవగాహన లేకుండానే అలా మాట్లాడారని అనుకోవాలా? ఐదేళ్ళు కాదు పదేళ్ళిస్తే తప్ప పారిశ్రామిక వర్గాలు ముందుకొచ్చి, పరిశ్రమలకు అనుమతులు పొంది, పెట్టుబడులు పెట్టి పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టలేవని  వెంకయ్యనాయుడు అవగాహనారాహిత్యంతోనే నాడు మాట్లాడారా?
ప్రత్యేక హోదాకు, ప్రత్యేక తరగతి హోదాకు మధ్య తేడా ఉన్నది. పార్లమెంటులో 3/4 వ‍ంతు మెజారిటీతో ఆమోదించి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ & కాశ్మీర్ కు ప్రసాదించినది 'ప్రత్యేక హోదా'. అ‍oదు వల్లనే ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది. పార్లమెంటు చేసిన చట్టాలను ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తే తప్ప‌ యధాతథంగా అక్కడ అమలు కావు. ప్రత్యేక తరగతి హోదాను జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం మేరకు కొన్ని రాష్ట్రాలకు కల్పించబడింది. గాడ్గిల్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రణాళికా నిథులను రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానంలో భాగంగా కొన్ని కొలబద్ధల ప్రాతిపదికన మొట్టమొదట‌ 1969లో మూడు రాష్ట్రాలకు ప్రత్యేక తరగతి హోదా కల్పించబడింది. ఆ సౌకర్యాన్ని దశల వారిగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ & కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్, మొత్తం 11 రాష్ట్రాలకు విస్తరించారు.  ఆ రాష్ట్రాలు ప్రత్యేక హోదా వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను అనుభవిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థ క్రియాశీలతను పరిగణలోకి తీసుకొని ఈ విధానాన్ని పునర్నిర్వచించాలని  14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాల స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని వాటికి తగిన రీతిలో ఆర్థికంగా చేయూత నివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. ఆర్థిక సంఘం సిఫార్సులకు స్థూలంగా పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 'ప్రత్యేక తరగతి హోదా'ను కొన్ని రాష్ట్రాలకు కల్పించే విధానాన్ని కొనసాగించాలా! లేదా పునర్ వ్యవస్థీకరించాలా!, ఒక వేళ పునర్ వ్యవస్థీకరించాలనే నిర్ణయానికి వస్తే ఏ దృక్పథాన్ని అనుసరిస్తుందో భవిష్యత్తులో తేలుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన వైఖరి తీసుకొన్నాక, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి జాతీయ అభివృద్ధి మండలి ఆమోదానికి పెట్టాలి. ప్రధాన మ‍ంత్రి అధ్యక్షులుగా ఉన్న జాతీయ అభివృద్ధి మండలిలో కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉన్న ఆ సంస్థ సమగ్రంగా చర్చించి, ఒక విధాన నిర్ణయం చేసిన మీదటనే మార్పులు, చేర్పులు జరుగుతాయి. అంత వరకు నేడు అమలులో ఉన్న విధానమే కొన‌సాగుతు‍oది అన్న అంశాన్ని ముందు గమని‍oచాలి. ఒకవేళ ప్రస్తుత విధానం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఉన్న అడ్డంకులేమిటి? అధికారంలో ఉన్న బిజెపి, దాని మిత్రపక్షాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అంగీకరించిన తరువాత జాతీయ అభివృద్ధి మండలిలో ఆమోదం పొందడం ఎంత పని. అందుకని తప్పించుకొనే మాటలు ఎవరు మాట్లాడినా, అవి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే అన్నది సుస్పష్టం.
ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు వివిధ రూపాలలో లబ్ధి చేకూరుతున్నది. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతో అమలులో ఉన్న‌ గాడ్గిల్ ముఖర్జీ నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిథుల్లో 30% ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, 70% మిగిలిన రాష్ట్రాలకు మంజూరు చేయాల్సి ఉంటుంది. కేంద్రం చేసే ఆర్థిక సహాయంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సహాయం(యన్.సి.ఎ.) పద్దు క్రింద మంజూరు చేసే నిథుల్లో 90% గ్రాంటు, 10% రుణంగాను (మిగిలిన రాష్ట్రాలకు 30% గ్రాంటు, 70% రుణం) అందుతుంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు (సి.యస్.యస్.) ఉదా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, వగైరా పథకాల అమలుకు  మరియు ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఏ.-ప్రాజెక్టుల కోసం) 90% గ్రాంటు, 10% రుణంగా నిథులు అందుతాయి. ప్రత్యేక కేంద్ర సాయ‍ం ( ప్రాజెక్టులతో ముడి పడని) 100% గ్రాంటు క్రి‍oద లభిస్తాయి.  విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టబడే పథకాలకు (ఉదా: క్రిష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ ఆధునీకీకరణ‌ వగైరా) కేంద్రం అదనపు సహాయం(ఎ.సి.ఏ.-ఈ.ఏ.పి.) పద్దు క్రింద‌ 90% గ్రాంటు, 10% రుణంగా అందుతుంది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టబడే పథకాలకు మొత్తం రుణంగానే అందుతుంది. ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడడానికి కేంద్ర పన్నుల్లో(ఎక్సజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇవ్వాల్సి ఉ‍oటుంది.
ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఏ.- ప్రాజెక్టుల కోసం), ప్రత్యేక కేంద్ర సాయ‍ం (ప్రాజెక్టులతో ముడి పడని)కు సంబంధించి 2015-16 వార్షిక బడ్జెట్లో విస్పష్టంగా పొందుపరచని మాట వాస్తవమే. కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులకు సంబంధించి మార్పులు చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32% నుండి 42% పెంచిన కారణంగా కొన్ని పథకాలను కేంద్రం అమలు చేసే జాబితా నుండి తొలగించి, ఆయా రాష్ట్రాల స్థానిక అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించుకొని అమలు చేసుకోవాలని, వాటికి చేసే కేటాయింపుల్లో కూడా మార్పులు చేసి కేంద్రo చేతులు దులుపుకొన్నది. తద్వారా రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను కుడి చేత్తో పెంచి, కొన్ని పథకాలను రాష్ట్రాల నెత్తి మీదకు తోసేయడం ద్వారా ఎడమ చేత్తో రాష్ట్రాలకు జరిగే ఆర్థిక ప్రయోజనాలను కేంద్రం లాగేసుకొంది. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
మాట మార్చడానికి కారణమేంటి? : పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పి‍oచాలని రాజ్యసభలో విభజన బిల్లు ప్రవేశ పెట్టిన నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన శ్రీ యం. వెంకయ్యనాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రి  అయిన తరువాత‌ నాలుక మడత పెట్టి ప్రత్యేక హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్ కు అర్హత లేదన్నట్లు, దాని వల్ల పెద్దగా ఒగిగేదేమీ లేదన్నట్లు సంకేతాలిచ్చే విధంగా మాట్లాడడాన్ని ఏమనాలి? ప్రత్యేక హోదా కోసం ప్రయాసపడడ‍ం వృథా అని, మంత్రిత్వ శాఖల వారిగా పైరవీలు చేసుకొని నిథులను సంపాది‍oచుకోవాలని మిత్రపక్షమైన టిడిపికి  బహిరంగంగానే హితబోధ కూడా చేశారు. ఆ‍oధ్రప్రదేశ్ నుండి రాజ్య‌సభకు ఎన్నుకోబడిన, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలాశీతారామన్ మౌలిక సదుపాయాలు లేని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానే అభివృద్ధి జరిగిపోతుందా! ఈ రాష్ట్రానికిస్తే తమిడనాడు అభ్యంతరం చెబుతుంది కదా! అని తమిళులను పేచీ పెట్టండన్న రీతిలో ప్రొత్సహి‍oచేలా మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?  ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని మరో గుజరాత్ గా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానాలు గుప్పి‍oచిన‌ నరేంద్ర మోడీ గారు మాత్రం నోరు మెదపడం లేదు. తన మాటకు కట్టుబడి ఆ హామీని నెరవేర్చాలి కదా? మరికొంత కాలానికి శాసన సభ ఎన్నికలు జరగబోతున్న‌ బీహార్, పశ్చిమ బెంగాల్ పై కన్నేసి, వాటి సరసన ఆంధ్రప్రదేశ్ ను చేర్చి మూడు రాష్ట్రాల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని మరొక వైపు ప్రకటనలు చేశారు. ఈ వైఖరి అత్యంత‌ దారుణమైనది.
ప్రత్యేక హోదాకు అర్హతలేమిటి?: (1.) పర్వత ప్రాంతం, సంక్లిష్ట భూభాగం. (2.) జనసాంద్ర తక్కువగా ఉండడం, జనాభాలో గిరిజనులు గణనీయంగా ఉండడం. (3.) పొరుగు దేశాల సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రదేశంగా ఉండడం. (4.) ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉండడం. (5.) తలసరి ఆదాయం కాస్తా ఎక్కువగా ఉన్నా అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చ గలిగిన స్థితిలో వనరులు లేక పోవడం.
కాస్తా కుడి ఎడమగా ఈ అర్హతలన్నీ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. 960 కి.మీ. సముద్ర తీరం ఉన్నది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియాను అమెరికా సైనిక స్థావరంగా మార్చి‍oది. దేశ భద్రత దృష్ట్యా సముద్ర తీరం వెంట కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవలసిన అనివార్య పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నది అందరికీ విధితమే. అంతర్జాతీయ ఉగ్రవాద శక్తులు దేశంలోకి ప్రవేశించడానికి ఒక మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. వీటన్నింటికీ మించి ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్య, వైద్య అన్ని విధాల తలమానికమైన హైదరాబాదు నుండి వేరు చేసి, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇ‍oత కంటే ప్రత్యేక హోదా పొందడానికి మ‌రొక అర్హత కావాలా? ఆ కారణంగానే ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని ముక్క చెక్కలు చేసి కాంగ్రెస్ ద్రోహం చేసింది. దానికి నాడు సంపూర్ణంగా సహకరి‍oచిన బిజెపి నేడు అధికారంలోకి వచ్చింది. విభజన చట్టంలోని అంశాలను, రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయకు‍oడా దగా చేయాలని చూస్తే చరిత్ర క్షమించదు. విభజనతో సమస్యల సుడిగుండంలోకి నెట్టబడిన‌ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచి, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచడంలో ప్రసార మాధ్యమాలు తోడ్పడాలి. అంతే కానీ చట్టాన్ని, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా  ఆత్మరక్షణలో పడిన‌  బిజెపికి వత్తాసు పలికే రీతిలో ఎవరు వ్యవహరించినా ఆంద్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేసి వారు అవుతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోలేదు. రాష్ట్ర విభజన దుష్పలితాలు, ముడిపడి ఉన్న సంక్లిష్టమైన సమస్యలు, ఎదురయ్యే కష్టాలపై స్థూలమైన అవగాహన ఉన్నది కాబట్టే నాడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రాజకీయ పార్టీలు స్వార్థ‌ ప్రయోజనాల కోసం వికృత రాజకీయ క్రీడకు తెరలేపి, తెలుగు ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాష్ట్ర‌ విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు  కావలసింది హితబోధలు, ఎత్తిపొడుపులు కాదు. రాజకీయ నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించి ఆ రాష్ట్ర ప్రజలను వెయ్యి అడుగుల‌  గోతిలోకి నెట్టారు. ఆదాయం, విద్య, ఉపాథి అవకాశాలను  సమకూర్చే మౌలిక సదుపాయాలు, వనరులు లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో కొన్ని నిత్య కరువు పీడిత ప్రాంతాలైతే, మిగిలినవి నిరంతరం తుఫాను పీడిత ప్రాంతాలుగా ప్రకృతి వైపరీత్యాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజానీకాన్ని ఒడ్డున పడవేసే గురుతర బాధ్యత రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలపైనే ఉన్నది. అత్యంత బాధ్యతారాహిత్యంగా, లోపభూయిష్టంగా రూపొందించబడి, అప్రజాస్వామిక పద్ధతుల్లో పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదముద్ర వేయ‌బడిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన‌ చట్టం'లోని అంశాలను, రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి చేసిన వాగ్ధానాలనన్నా తూఛా తప్ప కుండా అమలు చేయడం ద్వారా ఆ మేర‌కైనా న్యాయం చేయమని కేంద్ర ప్రభుత్వానికి, విభజనలో భాగస్వాములైన రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేయడాన్ని తెలివి తక్కువ పనిగా అభివర్ణించడాన్ని ఏమనుకోవాలి?
ఏడాది అనుభవం ఏం చెబుతున్నది?: రాష్ట్ర విభజన జరిగి ఏడాది గడుస్తున్నది. మోడీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన త‌రువాత రెండు వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టబడ్డాయి. మొదటిది పూర్తి స్థాయి బడ్జెట్ కాదని సరిపుచ్చుకొన్నా, 2015-16 వార్షిక బడ్జెట్ లో కేటాయింపులను చూశాక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నదన్న భావన సర్వత్రా నెలకొన్నది. 'అపా‍యింటెడ్ డెట్' తరువాత, మొదటి రాష్ట్ర వార్షిక‌ బడ్జెట్ రెవెన్యూ లోటును పూర్తిగా కే‍oద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు.16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నదని కేంద్రానికి మొరపెట్టుకొన్నది. ఇచ్చిందెంత? పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం చేయడం వరకు బాధ్యతగానే వ్యవహరించారు. ఆ భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే నాలుగైదేళ్ళలో పూర్తి చేస్తామని ఊదర గొడుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారమే రు.16,500 కోట్లకుపైగా వ్యయమయ్యే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు ఖర్చు చేసిన రు.3,500 కోట్లు పోగా ఇంకా రు.13,000 కోట్లు ఖర్చు చేస్తే గానీ నిర్మాణం పూర్తి కాదు. పైపెచ్చు కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం హనుమంతుని తొకలాగా పెరుగుతూనే ఉ‍oటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న ఆ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించింది రు.100 కోట్లు. ప్రజల్లో నిరసన వెల్లువెత్తడంతో కేటాయి‍oపును మరికొంత పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేశారు. ఈ తరహా నిథుల కేటాయింపులతో ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో కేంద్ర‌ ప్రభుత్వలోని పెద్దలే చెప్పాలి? చట్టంలో ప్రతిపాది‍oచబడిన‌ ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పే ప్రక్రియకు సంబంధించి మాత్రం ప్రాథమిక చర్యలు చేబడుతున్నట్లు కొ‍oత హడావుడి చేస్తున్నారు.
అత్యంత వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్, కోరపుట్- బోలాంగిర్-కాలహండి(కెబికె) తరహాలో అభివృద్ధి ప్యాకేజీలను అమ‌లు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆచరణలో చేసిందేమిటి? ఈ ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు పెట్టే పెట్టుబడులపై 15%, నూతన యంత్రాల తరుగుదలపై అదనంగా 15% రాయితీ కల్పిస్తున్నట్లు, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ఏడు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు రు.50 చొప్పున, మొత్తం రు.350 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసి, చేతులు దులుపుకొన్నది. ఇదేనా! అభివృద్ధి ప్యాకేజీ? రాయలసీమకు నీటి సమస్యే జీవన్మరణ సమస్య. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని రాయలసీమకు తరలించి కరువు కాటకాల నుండి శాశ్వతంగా విముక్తి చేయాలి. నిర్మాణంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థిక సహకారాన్ని అందించాలి. పారిశ్రామికాభివృద్ధికి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ప్యాకేజిని రూపొందించి, అమలు చేసి, సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి.
రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర‌ రాజధానికి స‍బంధించిన మౌలిక సదుపాయాల కల్పన‌ తమదే పూర్తి బాధ్యత అని చట్టంలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రు. 1,000 కోట్లు అందించబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరహా నిథుల కేటాయింపులు, ప్రదర్శిస్తున్న వైఖరి, ఆచరణను గమనిస్తున్న వారికెవరికైనా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన మేరకైనా తన బాధ్యతగా అన్ని విధాల సహాయం చేస్తుందా! అన్న అనుమానం రాక మానదు. ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడడానికి కేంద్ర పన్నుల్లో(ఎక్సజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇస్తామని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న‌, రాజ్యసభలో ఇచ్చిన హామీలలో ఎలాంటి మినహాయింపులు లేకుండా వాటన్నింటినీ తూఛా తప్పకుండా అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని హక్కుగా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన‌ టిడిపి, బిజెపి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా అన్న డిమాండు సెంటిమెంట్ గా తయారయ్యిందని అభివర్ణించడం ద్వారా ఈ డిమాండు పట్ల వారి చిత్తశుద్ధి ఏ పాటిదో వెల్లడించుకొన్నారు. రాజకీయ పార్టీలు వక్రబుద్ధులు ప్రదర్శించినా, రాష్ట్ర‌ విభజనతో బాధితులుగా మిగిలి పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రసార మాధ్యమాలైనా నికార్సుగా నిలవాలని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి.