https://www.youtube.com/watch?v=KDbEbBQU4xw
Wednesday, September 30, 2015
Tuesday, September 29, 2015
ప్రహసనంగా మారిన రైతు రుణ మాఫీ పథకం
చిత్తూరు జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేశారు. ఆ రైతు ఆంధ్రా బ్యాంకు నుండి 2013 జనవరి 17న రు.95,000 పంట రుణం తీసున్నారు. ఆ రుణం వడ్డీతో కలిపి రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధేశించుకొన్న(కటాఫ్ డేట్) 2013 డిసెంబరు
31 నాటికి రు.1,05,111 అయ్యింది. రు.1,50,000 వరకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తునట్లు ప్రభుత్వం
అధికారిక ప్రకటన జారీ చేసింది. దాని ప్రకారం రు.50,000 లోపు రుణ మాఫీకి అర్హత ఉన్న రైతులకు ఒకే దఫా రద్దు
చేసింది. అంత కంటే ఎక్కువ రుణ భారం ఉన్న రైతులకు రు.1,50,000 వరకు ఐదు కంతుల్లో చెల్లిస్తామని ప్రకటించింది. రుణ మాఫీ నిబంధనల ప్రకారం ఆ రైతుకు రు.1,38,320 మాఫీకి అర్హత ఉన్నదని ప్రభుత్వం పేర్కొన్నది. ఫలితంగా ఉన్న మొత్తం రు.1,05,111(అసలు రు.95,000 + 10,111 వడ్డీ) రుణ మాఫీకి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం వెబ్ సైట్ లో కూడా పెట్టింది. అందులో
ఐదవ వంతు రు.21,142 లను మొదటి కంతు క్రింద బ్యాంకులో డిపాజిట్ కూడా చేసింది. మరో
నాలుగు కంతుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. ఇంత వరకు బాగానే
ఉన్నది.
పంట రుణాలపై 4% వడ్డీని మాత్రమే బ్యాంకులు వసూలు చేసుకోవాలి. కానీ, బ్యాంకులు అమలు చేస్తున్న విధి విధానాల ప్రకారం రైతు
తీసుకొన్న రుణం చెల్లింపు గడువు ముగిసిన నాటి నుండి 12% వడ్డీ వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందన్న
విశ్వాసంతో రైతులు తాము తీసుకొన్న రుణాన్ని గడువు లోపు చెల్లించలేదు. నేడు అమలు
చేస్తున్న అసమగ్రమైన రుణ మాఫీ పథకంతో బ్యాంకుల నుండి రైతులకు కొత్త చిక్కొచ్చి
పడింది. 'లోన్ రెన్యూ' చేసుకోమని బ్యాంకు సిబ్బంది రైతులపై వత్తిడి చేస్తున్నారు.
నాతో మాట్లాడిన రైతుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రు.21,142 లను బ్యాంకు వడ్డీ
క్రింద జమ చేసుకొన్నది. అసలు రుణం, అపరాధ వడ్డీ కలిపి ఇంకా రు.1,09,200 చెల్లించాలని, వెంటనే రు.9,200 చెల్లించి, మిగిలిన రు.1,00,000 రుణాన్ని, కొత్త రుణంగా మార్చుకోమని(లోన్ రెన్యూ) అంటే ‘బుక్ అడ్జస్ట్ మెంట్’ చేసుకోమని బ్యాంకు సిబ్బంది ఆ రైతు వెంట పడుతున్నారు.
బ్యాంకు సిబ్బంది వత్తిడికి తలవొగ్గి ఇప్పటికే చాలా మంది రైతులు వారు చెప్పినట్లు
'లోన్ రెన్యూ' చేసుకొన్నారు. రుణ మాఫీకి
అర్హత పొందిన మొత్తంపై బ్యాంకులు వసూలు చేస్తున్న 12% అపరాధ వడ్డీని కూడా
చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి కదా?
ప్రభుత్వం చెల్లించే ఐదు కంతుల రుణ మాఫీ మొత్తాలను ఇలా బ్యాంకులు వడ్డీ
క్రిందనే ఐదేళ్ళు జమ చేసుకొంటూ పోతే, ఇహ! రుణ మాఫీ పథకం వల్ల రైతుకు జరిగే మేలేంటి? అంత్యమంగా రైతు తీసుకొన్న
అసలు రుణం మొత్తాన్ని, అపరాధ వడ్డీతో కలిపి తానే చెల్లించుకొని, రుణ విముక్తుడు కావలసిన
విధిలేని దుస్థితి ఏర్పడుతుంది కదా? ఈ పథకం వల్ల యాతావాతా జరుగుతున్నదేమిటి? ప్రభుత్వం ప్రజాధనాన్ని
రైతు రుణ మాఫీ పథకం పేరిట బ్యాంకులకు రైతులు చెల్లించాల్సిన వడ్డీల మొత్తాన్ని
మాత్రమే చెల్లించే బాధ్యత తీసుకొన్నట్లవుతుంది. ఈ పథకం వల్ల కేవలం రు.50,000 లోపు రుణ భారం ఉన్న
రైతులకు మాత్రమే విముక్తి లభించిందన్న మాట. మిగిలిన రైతులను ప్రభుత్వం
గందరగోళంలోకి నెట్టి, మానసిక వత్తిడికి గురి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బ్యాంకు అధికారుల వత్తిడికి తలవొగ్గి "లోన్ ను రెన్యూ" చేసుకొంటే ఆ
రుణం కాస్తా కొత్త రుణంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న
రుణ మాఫీ పథకం అసలు వర్తిస్తుందో! లేదో!, మిగిలిన నాలుగు
కంతులను ప్రభుత్వం బ్యాంకుకు జమ చేస్తుందో! లేదో! అన్న అనుమానాలు
రేకెత్తుతున్నాయి. నా దృష్టికి వచ్చిన ఈ క్షేత్ర స్థాయి సమస్యను ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రణాళికా సంఘం, ఉపాధ్యక్షులు మరియు రుణ మాఫీ పథకం అమలు బాధ్యతలు
నిర్వర్తిస్తున్న శ్రీ సి.కుటుంబరావు దృష్టికి
తీసుకెళ్ళాలను. బ్యాంకుల వల్లనే ఈ సమస్య ఉత్ఫన్నమవుతున్నదని, 'లోన్ రెన్యూ' చేసుకొన్న రైతులకు
మిగిలిన నాలుగు కంతుల మొత్తాన్ని వారి రుణ ఖాతాలో జమ చేస్తామని, ఒక వేళ రైతే రుణం
మొత్తాన్ని బ్యాంకుకు చెల్లిస్తే, అలాంటి రైతుల వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ
చేస్తుందని వివరణ ఇచ్చారు. ఈ సమస్యతో రైతులు ప్రభుత్వం, బ్యాంకుల మధ్య నలిగి పోతున్నారు.
ప్రభుత్వం జవాబుదారీతనంతో, పారదర్శకంగా వ్యవహరించకుండా రుణ మాఫీ పథకాన్ని ఒక ప్రహసనంగా
మార్చి రైతాంగాన్ని అనిచ్ఛిత పరిస్థితుల్లోకి నెట్టేసింది. పర్యవసానంగా వడ్డీలు, అపరాధ వడ్డీల భారం రైతుల
మీద పడింది. వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని చెల్లించని రైతాంగానికి బ్యాంకులు
కొత్త రుణాలు ఇవ్వడం లేదు. బాధ్యత గలిగిన ప్రభుత్వం మాఫీ చేసిన మొత్తం మేరకు
బ్యాంకుకు బాండ్ల రూపంలో పూచీ ఇచ్చి, ఆ మొత్తాన్ని చెల్లించే బాధ్యతను తీసుకొని, రైతును ఆ రుణ భారం నుండి
విముక్తి చేసి, వ్యవసాయాన్ని కొనసాగించడానికి అవసరమైన కొత్త రుణాలు తీసుకోవడానికి రైతులను
అర్హులను చేయాలి. 'బుక్ అడ్జస్ట్ మెంట్స్' కాకుండా కొత్త రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఒప్పించాలి.
అప్పుడే రుణ మాఫీ పథకం అమలు వల్ల కొంత మేరకైనా అప్పుల ఊబిలో కూరుకపోయిన రైతాంగం
ఊరట పొంది, వ్యవసాయాన్ని కొనసాగించడానికి వీలుకలుగుతుంది.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని, ఆత్మహత్యల పాలౌతున్న రైతాంగాన్ని ఆదుకొనే సదాశయంతో అమలు
చేస్తున్న రుణ మాఫీ పథకం నిష్ప్రయోజనంగా మారడం గర్హనీయం. విభజనతో తీవ్ర ఆర్థిక
సంక్షోభంలోకి నెట్టబడిన రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకపోయి ఉన్నప్పటికీ రైతు రుణ మాఫీ
పథకాన్ని అమలు చేయడం సాహసోపేత చర్యే. కానీ, పథకాన్ని ఆచరణాత్మకమైనదిగా, న్యాయబద్ధంగా రూపొందించి, అర్హులైన రైతులందరికీ ఒకేసారి అమలు చేసి ఉంటే సత్ఫలితాలు
వచ్చేవి. దాదాపు యాభై లక్షల మంది రైతు కుటుంబాలకు, రు.24,500 కోట్ల రుణ మాఫీ చేశామని, ఇప్పటికే దాదాపు రు.7,500 కోట్లు బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో జమ చేశామని
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రచార చేసుకొంటున్నా రైతాంగానికి మాత్రం పూర్తి
స్థాయిలో ఊరట కలిగించలేదు. రుణ మాఫీకి అర్హులైన రైతులు అనర్హులుగానో, పాక్షిక లబ్ధిదారులుగానో
మిగిలిపోయి, దగా పడ్డామన్న భావనతో నిస్సహాయులుగా మిగిలి పోయారు. నకిలీ రైతులు, దళారీ రైతులు, అక్రమార్జన పరులు, చాలా మంది అనర్హులైన వారు
ఈ పథకం వల్ల లబ్ధి పొందిన ఘటనలు లేక పోలేదు. అనేక అక్రమాలను ప్రసార మాధ్యమాలు
వెలుగులోకి కూడా తీసుకొచ్చాయి.
కరువు పీడిత రైతులకు మొండి చేయి: రుణ మాఫీ పథకాన్ని అమలు చేయడానికి రూపొందించిన నిబంధనల
మూలంగా మెట్ట ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఉద్యానవన పంటలకు ఎకరాకు రు.10,000 వరకు మాత్రమే రుణ మాఫీ, బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణం తీసుకొని ఉంటే
అర్హతలేదని, వగైరా నిబంధనలు మెట్ట ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల రైతాంగంలో అత్యధికులకు రుణ మాఫీ పథకం
వర్తించకుండా పోయింది. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీతాలతో బతుకు పోరు సాగిస్తూ, ఆరుగాలం, పురుగు పుట్రా అనకుండా
శ్రమిస్తూ సమాజానికి వ్యవసాయోత్ఫత్తులను సరఫరా చేస్తున్ననిత్య కరువు పీడిత
రైతాంగంలో ఆశలు రేకెత్తించి, ఆచరణలో చెంపదెబ్బ, గోడ దెబ్బ అన్న నానుడిగా ప్రభుత్వం రైతాంగం నోళ్ళలో
మట్టికొట్టిందన్న భావన ఆ ప్రాంతాల రైతుల్లో సర్వత్రానెలకొన్నది. పదేళ్ళు మొదలు
ఇరవై ఏళ్ళ పాటు కంటికి రెప్పలాగా పెంచుకొంటూ, కాపాడుకొంటూ వచ్చిన మామిడి, నిమ్మ వగైరా పండ్ల చెట్లు నిత్య కరువులకు మలమల మాడిపోయాయి.
భూగర్భ జలాలు శర వేగంగా పతనమై పాతాళానికి చేరుకొంటున్నాయి. బోర్ల మీద ఆధారపడన
రైతులు ఒకటి కాదు మూడు నాలుగు బోర్లు వేసి అప్పుల పాలై ఆత్మహత్యలు
చేసుకొంటున్నారు. అయినా రుణ మాఫీ పథకం వారికి వర్తించదు. కడప జిల్లా చిట్వేలి
మండలానికి చెందిన రైతు ఒకరు ఫోన్ చేసి, మండలం మొత్తానికి ఏడు
మందికి మాత్రమే రుణ మాఫీ అయ్యిందని చెప్పారు. కానీ, ఎకరా కోట్లు ధర
పలుకుతున్న అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రం విశాల హృదయంతో రుణ మాఫీ
పథకం క్రింద ఒకే దఫా రు.1,50,000 ప్రభుత్వం చెల్లించింది. ఆ రైతులకు అలా న్యాయం చేయడాన్ని సమర్థించాల్సిందే. కానీ, రుణ మాఫీకి అసలు అర్హులైన మెట్ట ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల
రైతాంగానికి న్యాయం చేయడంలో వివక్ష చూపడం మాత్రం దారుణం. పైపెచ్చు రాయలసీమ
ప్రాంతాన్ని ఉద్యాన వన పంటలకు 'హబ్'గా తీర్చిదిద్దుతామన్న ప్రకటనలు గిప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వo కళ్ళు తెరిచి, రుణ మాఫీ పథకం అమలులో తలెత్తిన సమస్యలను తక్షణం
పరిష్కరించాలి. అప్పుల ఊబిలో పీకల్లోతు మునిగి, ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్న రైతాంగానికి ప్రభుత్వం, సమాజం అండగా నిలబడుతుందనే
విశ్వాసాన్ని పాదుకొల్పాలి. రైతాంగానికి రుణ విముక్తి కల్పించి, వారికి ఆర్థిక పరిపుష్టి
కలిగేలా వ్యవసాయోత్ఫత్తులకు లాభదాయకమైన ధరలు లభించేలా ప్రభుత్వాలు విధానాలు
రూపొందించి, రాజకీయ సంకల్పంతో అమలు చేయాలి. ఈ చర్యలు ఆహార భద్రతను కల్పించుకోవడం కోసమే
అన్న భావన సమాజంలో వెల్లివిరియాలి. అప్పుడు మాత్రమే యావత్తు సమాజం అభివృద్ధి
వైపు అడుగు ముందుకు వేయగలదు. దాదాపు 70% మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ, కునారిల్లి పోతుంటే! మిగిలిన సమాజం అభివృద్ధి చెందుతుందని
ఎవరైనా భావిస్తే, అది భ్రమగానే మిగిలిపోతుంది.
Wednesday, September 23, 2015
హోదాపై కేంద్రం కుప్పిగంతులు !
ప్రచురణ: సాక్షి దినపత్రిక, సెప్టంబరు 24, 2015. వ్యాసం శీర్షిక: హోదాపై కేంద్రం కుప్పిగంతులు
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/24092015/Details.aspx?id=2925353&boxid=25516402
ప్రత్యేక తరగతి హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని, అది సంజీవిని కాదని, హోదా వల్ల జరిగే మేలు కంటే మెరుగైన ఫ్యాకేజీ ఇచ్చే ఆలోచన కేంద్రం చేస్తున్నదని, హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారాయని, ఇరుగు పొరుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని, తమకు ప్రత్యేక తరగతి హోదా కల్పించాలని బీహార్, రాజస్తాన్, ఒడిశా వగైరా రాష్ట్రాలు కోరుతున్నాయని, అసలు ఆంధ్రప్రదేశ్ కు హోదా పొందే అర్హతలే లేవని, పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని, వగైరా వగైరా డొంక తిరుగుడు మాటలను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, అధికార పక్షాల నాయకులు తమ నాలుకలను మడత పెట్టి మాట్లాడుతున్నారు. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి, పదమూడు జిల్లాలతో కూడిన నేటి ఆంధ్రప్రదేశ్ ను సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి బలవంతంగా నెట్టిన రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆట లాడుకొనే హక్కు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యమేనా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో మినుకు మినుకు మంటున్న విశ్వాసాన్ని మరింత బలహీన పరచడానికి మోడీ ప్రభుత్వ వైఖరి దారి తీయదా?
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/24092015/Details.aspx?id=2925353&boxid=25516402
ప్రత్యేక తరగతి హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని, అది సంజీవిని కాదని, హోదా వల్ల జరిగే మేలు కంటే మెరుగైన ఫ్యాకేజీ ఇచ్చే ఆలోచన కేంద్రం చేస్తున్నదని, హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారాయని, ఇరుగు పొరుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని, తమకు ప్రత్యేక తరగతి హోదా కల్పించాలని బీహార్, రాజస్తాన్, ఒడిశా వగైరా రాష్ట్రాలు కోరుతున్నాయని, అసలు ఆంధ్రప్రదేశ్ కు హోదా పొందే అర్హతలే లేవని, పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని, వగైరా వగైరా డొంక తిరుగుడు మాటలను కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, అధికార పక్షాల నాయకులు తమ నాలుకలను మడత పెట్టి మాట్లాడుతున్నారు. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి, పదమూడు జిల్లాలతో కూడిన నేటి ఆంధ్రప్రదేశ్ ను సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి బలవంతంగా నెట్టిన రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆట లాడుకొనే హక్కు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యమేనా? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో మినుకు మినుకు మంటున్న విశ్వాసాన్ని మరింత బలహీన పరచడానికి మోడీ ప్రభుత్వ వైఖరి దారి తీయదా?
ఐదు కోట్ల ప్రజలపైన రాష్ట్ర విభజన బలవంతంగా రుద్దబడింది. లోక్ సభలో తలుపులు మూసేసి, మైకులు ఆపేసి, స్వపక్ష మరియు ప్రతిపక్ష
సభ్యులపై అమానుషంగా భౌతిక దాడులు చేసి, నోర్లు నొక్కి విభజన బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. రాజ్యసభలో ఆమోద ముద్ర వేయించుకొనే సందర్భంలో
కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆర్థిక వ్యవస్థను బలమైన పునాదులపై నిర్మించుకోవడానికి
ప్రత్యేక తరగతి హోదా (స్పెషల్ క్యాటగరీ స్టేటస్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
కల్పిస్తామని నాటి ప్రధాన మంత్రి డా. మన్మోహన్ సింగ్ వాగ్ధానం చేశారు. నాటి
ప్రతిపక్షం బిజెపినే నేటి పాలక పార్టీ, నాటి పాలక పార్టీ కాంగ్రెస్ నేటి ప్రతిపక్షం, ఈ రెండు పార్టీలు
కూడబలుక్కొని రాష్ట్రాన్ని ముక్కలు చేశాయి. పర్యవసానంగా సంక్షోభాన్ని
ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను
ఆదుకోవలసిన నైతిక బాధ్యత ఆ పార్టీలతో పాటు
నాడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్ర విభజన పాపంలో పాలు పంచుకొన్న రాజకీయ
పక్షాలన్నింటిపైన ఉన్నది. ఆ బాధ్యత నుండి తప్పించుకోవాలని ఎవరు ప్రయత్నించినా
చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
హోదాపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర సంక్షోభంలో
కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయడానికే
దోహదపడుతుంది. ఈ పూర్వరంగంలో చిత్తశుద్ధి, అంకిత భావం, రాజకీయ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదాను
హక్కుగా సాధించుకోవడానికి రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఉద్యమించాల్సిన తరుణం
ఆసన్నమయ్యింది. రాష్ట్ర విభజనతో గొడ్డలి పెట్టుకు గురైన ఆంద్రప్రదేశ్ సమాజం
ప్రత్యేక తరగతి హోదాతోనే సంక్షోభం నుండి బయట పడలేదన్న మాట ముమ్మాటికీ వాస్తవం.
కానీ, దాన్ని హక్కుగా
సాధించుకొని, పునర్విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడ్డ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు
సమగ్రాభివృద్ధి ఫ్యాకేజీలతో పాటు అన్ని అంశాలను సంపూర్ణంగా అమలు చేయించుకోవడం, ఆపైన ప్రత్యేక ఆర్థిక
ఫ్యాకేజీని కూడా సంపాదించుకోగలినప్పుడు మాత్రమే దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో
సరిసమానంగా అభివృద్ధిలో కాస్త పోటీ పడడానికి వీలవుతుంది.
వంచనే మీ విధానమా!: హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళిస్తే తప్ప పారిశ్రామిక వర్గాలు
ముందుకొచ్చి, పరిశ్రమలకు అనుమతులు పొంది, పెట్టుబడులు పెట్టి పారిశ్రామికాభివృద్ధికి చర్యలు
చేపట్టలేవని నాడు వెంకయ్యనాయుడు అవగాహనారాహిత్యంతోనే మాట్లాడారా? అని అడగడంలో తప్పు లేదు.
ప్రత్యేక హోదాకు, ప్రత్యేక తరగతి హోదాకు మధ్య తేడా ఉన్నది. పార్లమెంటులో 3/4 వంతు మెజారిటీతో
ఆమోదించి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ & కాశ్మీర్ కు ప్రసాదించినది 'ప్రత్యేక హోదా'. అoదు వల్లనే ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది.
పార్లమెంటు చేసిన చట్టాలను ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదిస్తే తప్ప యధాతథంగా అక్కడ అమలు
కావు. ప్రత్యేక తరగతి హోదాను జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం మేరకు కొన్ని
రాష్ట్రాలకు కల్పించబడింది. గాడ్గిల్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రణాళికా నిథులను
రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానంలో భాగంగా కొన్ని కొలబద్ధల ప్రాతిపదికన మొట్టమొదట 1969లో మూడు రాష్ట్రాలకు
ప్రత్యేక తరగతి హోదా కల్పించబడింది. ఆ సౌకర్యాన్ని దశల వారిగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ & కాశ్మీర్ తో పాటు హిమాచల్
ప్రదేశ్, ఉత్తరాఖాండ్, మొత్తం 11 రాష్ట్రాలకు
విస్తరించారు.
సమాఖ్య వ్యవస్థ క్రియాశీలతను పరిగణలోకి తీసుకొని ఈ విధానాన్ని
పునర్నిర్వచించాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు
చేసిన మాట వాస్తవం. ఆర్థిక సంఘం సిఫార్సులకు స్థూలంగా పార్లమెంటు ఆమోద ముద్ర
వేసినా, ప్రత్యేక తరగతి
హోదాను కొన్ని రాష్ట్రాలకు కల్పించే విధానాన్ని కొనసాగించాలా! లేదా పునర్
వ్యవస్థీకరించాలా!, ఒక వేళ పునర్ వ్యవస్థీకరించాలనే నిర్ణయానికి వస్తే ఏ రూపంలో
చేయాలి అన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం ముందు తేల్చుకోవాలి. ఒక నిర్ధిష్టమైన వైఖరి
తీసుకొన్నాక, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి జాతీయ అభివృద్ధి మండలి ఆమోదానికి
పెట్టాలి. ప్రధాన మంత్రి అధ్యక్షులుగా ఉన్న జాతీయ అభివృద్ధి మండలిలో కేంద్ర
మంత్రులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సభ్యులుగా ఉన్న ఆ సంస్థ సమగ్రంగా
చర్చించి, ఒక విధాన నిర్ణయం
చేసిన మీదటనే మార్పులు, చేర్పులు జరుగుతాయి. అంత వరకు నేడు అమలులో ఉన్న విధానమే కొనసాగుతుoది. ఒకవేళ ప్రస్తుత
విధానాన్నే కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా కల్పించడానికి ఉన్న
అడ్డంకులేమిటి? అధికారంలో ఉన్న బిజెపి, దాని మిత్రపక్షాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అంగీకరించిన తరువాత
జాతీయ అభివృద్ధి మండలిలో ఆమోదం పొందడం ఎంత పని. అందుకని తప్పించుకొనే మాటలు ఎవరు
మాట్లాడినా, అవి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే అన్నది సుస్పష్టం. పైపెచ్చు
రాష్ట్రాన్ని రాజకీయంగా విభజించారు. చట్టసభలో చేసిన వాగ్ధానాన్ని రాజకీయ
నిర్ణయంతోనే అమలు చేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. బిజెపి నేత ఎ.బి.వాజ్
పేయ్ నేతృత్వంలోని యన్.డి.ఎ.-1 ప్రభుత్వం ఉత్తరాకాండ్ కు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోనే
కల్పించి, అటుపై కేంద్ర
మంత్రి మండలి ఆమోదం పొందలేదా? రాజ్యసభలో ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక
హోదా కల్పించాలనే ప్రతిపాదనకు మార్చి 2014లోనే కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసి, ప్రణాళికా సంఘానికి కూడా
పంపారు కదా! లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మోడీ అధికార పగ్గాలు చేబట్టి
ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసి, దాని స్థానంలో నీతి అయోగ్ సంస్థను ఏర్పాటు చేశారు.
ప్రణాళికా సంఘం, నీతి అయోగ్, ఆర్థిక సంఘానికి, ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశానికి లంకె పెట్టి
మాట్లాడడమే అసంబద్ధమైనది.అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని బుకాయించడం
అర్థరహితమైనది.
హోదా వల్ల వనగూడే ప్రయోజనాలు: ప్రత్యేక తరగతి హోదా కల్పించబడిన రాష్ట్రాలకు వివిధ
రూపాలలో లబ్ధి చేకూరుతున్నది. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతో అమలులో ఉన్న
గాడ్గిల్ ముఖర్జీ నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిథుల్లో 30% ప్రత్యేక తరగతి హోదా
ఉన్న రాష్ట్రాలకు, 70% మిగిలిన రాష్ట్రాలకు మంజూరు చేయాల్సి ఉంటుంది. కేంద్రం
చేసే ఆర్థిక సహాయంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సాధారణ కేంద్ర
సహాయం(యన్.సి.ఎ.) పద్దు క్రింద మంజూరు చేసే నిథుల్లో 90% గ్రాంటు, 10% రుణంగాను (మిగిలిన రాష్ట్రాలకు 30% గ్రాంటు, 70% రుణం) అందుతుంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు
(సి.యస్.యస్.) ఉదా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, వగైరా పథకాల అమలుకు మరియు ప్రత్యేక ప్రణాళికా
సాయం(యస్.పి.ఏ.-ప్రాజెక్టుల కోసం) 90% గ్రాంటు, 10% రుణంగా నిథులు అందుతాయి. ప్రత్యేక కేంద్ర సాయం (
ప్రాజెక్టులతో ముడి పడని) 100% గ్రాంటు క్రిoద లభిస్తాయి.
విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టబడే పథకాలకు (ఉదా: క్రిష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ, పెన్నార్ డెల్టా వగైరా
ఆధునీకీకరణ పథకాలు) కేంద్రం అదనపు సహాయం(ఎ.సి.ఏ.-ఈ.ఏ.పి.) పద్దు క్రింద 90% గ్రాంటు, 10% రుణంగా అందుతుంది.
మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టబడే పథకాలకు మొత్తం
రుణంగానే అందుతుంది. ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి
దోహదపడడానికి కేంద్ర పన్నుల్లో(ఎక్సజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇవ్వాల్సి ఉoటుంది.
ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఏ.- ప్రాజెక్టుల కోసం), ప్రత్యేక కేంద్ర సాయం
(ప్రాజెక్టులతో ముడి పడని)కు సంబంధించి 2015-16 వార్షిక బడ్జెట్లో విస్పష్టంగా పొందుపరచని మాట వాస్తవమే.
కేంద్ర ప్రాయోజిత పథకాల కేటాయింపులకు సంబంధించి మార్పులు చేశారు. కేంద్ర పన్నుల్లో
రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32% నుండి 42% పెంచిన కారణంగా కొన్ని పథకాలను కేంద్రం అమలు చేసే జాబితా
నుండి తొలగించి, ఆయా రాష్ట్రాల స్థానిక అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించుకొని అమలు
చేసుకోవాలని, వాటికి చేసే కేటాయింపుల్లో కూడా మార్పులు చేసి కేంద్రo
చేతులు దులుపుకొన్నది. తద్వారా రాష్ట్రాలకు
ఇచ్చే పన్నుల వాటాను కుడి చేత్తో పెంచి, కొన్ని పథకాలను రాష్ట్రాల నెత్తి మీదకు తోసేయడం ద్వారా ఎడమ
చేత్తో రాష్ట్రాలకు జరిగే ఆర్థిక ప్రయోజనాలను కేంద్రం లాగేసుకొంది. అలాగే ప్రత్యేక
తరగతి హోదా ఉన్న రాష్ట్రాలకు కల్పిస్తున్న రాయితీల్లో కూడా కోతలు విధించారు. ఈ
పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
శాసన సభ ఎన్నికలు జరగబోతున్న బీహార్ కు రు.1,65,000 కోట్ల ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించారు. ఈ ఫ్యాకేజీని కేంద్ర
మంత్రి మండలి లేదా నీతి ఆయోగ్ లేదా జాతీయ అభివృద్ధి మండలిలొ నిర్ణయం తీసుకొన్నారా? లేదే. పశ్చిమ బెంగాల్ కు
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ_2 ప్రభుత్వం రు.50,000 కోట్ల ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు
ప్రత్యేక తరగతి హోదాపై చట్ట సభలో ఇచ్చిన హామీని అమలు చేయని అడుగుతుంటే రాష్ట్రాన్ని మరో గుజరాత్ గా అభివృద్ధి
చేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో వాగ్దానాలు గుప్పిoచిన నరేంద్ర మోడీ గారు మాత్రం నోరే మెదపడం లేదు. ఈ వైఖరి
అత్యంత దారుణమైనది. తన మాటకు కట్టుబడి ఆ హామీని నెరవేర్చాలి కదా?
ప్రత్యేక హోదాకు అర్హతలేమిటి?: (1.) పర్వత ప్రాంతం, సంక్లిష్ట భూభాగం. (2.) జనసాంద్ర తక్కువగా ఉండడం, జనాభాలో గిరిజనులు
గణనీయంగా ఉండడం. (3.) పొరుగు దేశాల సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రదేశంగా ఉండడం.
(4.) ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా
వెనుకబడి ఉండడం. (5.) తలసరి ఆదాయం కాస్తా ఎక్కువగా ఉన్నా అభివృద్ధికి అవసరమైన
ఆర్థిక వనరులను సమకూర్చ గలిగిన స్థితిలో వనరులు లేక పోవడం.
కాస్తా కుడి ఎడమగా ఈ అర్హతలన్నీ ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. 960 కి.మీ. సముద్ర తీరం
ఉన్నది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియాను అమెరికా సైనిక స్థావరంగా మార్చిoది. బాంగ్లాదేశ్ విముక్తి
ఉద్యమానికి భారత్ మద్దతు పలికిందని, దాడి చేయాలనే తలంపుతో అమెరికా సప్తమ నౌకాదళం హిందూ మహా
సముద్రంలోకి ప్రవేశించలేదా? ఇతర దేశాల నుండి కూడా నిరంతరం సముద్ర జలాల సరిహద్దుల వైపు
నుండి భద్రతా సవాళ్ళు ఎదురౌతున్నాయి. దేశ భద్రత దృష్ట్యా సముద్ర తీరం వెంట
కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవలసిన అనివార్య పరిస్థితులు నెలకొని
ఉన్నాయన్నది అందరికీ విధితమే. అంతర్జాతీయ ఉగ్రవాద శక్తులు దేశంలోకి
ప్రవేశించడానికి సముద్ర జల మార్గాలను ఎంచుకొన్న తాజా చేదు అనుభవాలున్నాయి కదా!
వీటన్నింటికీ మించి ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థికంగా, పారిశ్రామికంగా, విద్య, వైద్య అన్ని విధాల తలమానికమైన హైదరాబాదు నుండి వేరు చేసి, రాజధాని కూడా లేని
రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇoత కంటే ప్రత్యేక తరగతి హోదా పొందడానికి మరొక అర్హత కావాలా? ఆ కారణంగానే ప్రత్యేక
తరగతి హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు కదా! విభజన చట్టంలోని అంశాలను, రాజ్యసభలో ఇచ్చిన హామీలను
అమలు చేయకుoడా దగా చేయాలని చూస్తే చరిత్ర క్షమించదు.
ఆదాయం, విద్య, ఉపాథి అవకాశాలను సమకూర్చే మౌలిక
సదుపాయాలు, వనరులు లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో రాయలసీమలోని
నాలుగు మరియు ప్రకాశం జిల్లాలు నిత్య కరువు పీడిత ప్రాంతాలైతే, మిగిలినవి నిరంతరం తుఫాను
పీడిత ప్రాంతాలుగా ప్రకృతి వైపరీత్యాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. సమస్యల
వలయంలో చిక్కి విలవిల్లాడుతున్న ప్రజానీకాన్ని ఒడ్డున పడవేసే గురుతర బాధ్యత
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలపైనే ఉన్నది. అత్యంత బాధ్యతారాహిత్యంగా, లోపభూయిష్టంగా
రూపొందించబడి, అప్రజాస్వామిక పద్ధతుల్లో పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదముద్ర వేయబడిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన
చట్టం'లోని అంశాలను, రాజ్యసభలో నాటి ప్రధాన
మంత్రి చేసిన వాగ్ధానాలనన్నా తూఛా తప్ప కుండా అమలు చేయడం ద్వారా ఆ మేరకైనా న్యాయం
చేయమని కేంద్ర ప్రభుత్వానికి, విభజనలో భాగస్వాములైన రాజకీయ పార్టీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు
హక్కుగా డిమాండ్ చేస్తున్నారు.
ఏడాది అనుభవం ఏం చెబుతున్నది?: రాష్ట్ర విభజన జరిగి
ఏడాది గడుస్తున్నది. మోడీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన తరువాత రెండు
వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టబడ్డాయి. మొదటిది పూర్తి స్థాయి బడ్జెట్ కాదని
సరిపుచ్చుకొన్నా, 2015-16 వార్షిక బడ్జెట్ లో కేటాయింపులను చూశాక ఆర్థిక
సంక్షోభంలోకి నెట్టబడిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం
నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నదన్న భావన సర్వత్రా నెలకొన్నది. 'అపాయింటెడ్ డెట్' తరువాత, మొదటి రాష్ట్ర వార్షిక
బడ్జెట్ రెవెన్యూ లోటును పూర్తిగా కేoద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు.
దాదాపు రు.14,500 కోట్లు రెవెన్యూ లోటు ఉన్నదని కాగ్ నివేదిక ఇస్తే, కేంద్రం ఇచ్చింది ముష్టి రు.2,300 కోట్లు అంటున్నారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ
ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం చేయడం
వరకు బాధ్యతగానే వ్యవహరించారు. ఆ భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని
ఊదర గొడుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారమే రు.16,500 కోట్లకుపైగా వ్యయమయ్యే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి
వరకు ఖర్చు చేసిన రు.4,000 కోట్లు పోగా ఇంకా రు.12,500 కోట్లు ఖర్చు చేస్తే గానీ నిర్మాణం పూర్తి కాదు. పైపెచ్చు
కాలం గడిచే కొద్దీ నిర్మాణ వ్యయం హనుమంతుని తొకలాగా పెరుగుతూనే ఉoటుంది. అంతటి ప్రాధాన్యత
ఉన్న ఆ ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయించింది రు.100 కోట్లు. ప్రజల్లో నిరసన వెల్లువెత్తడంతో కేటాయిoపును రు.250 కోట్లకు పెంచుతున్నట్లు
ప్రకటన జారీ చేశారు. ఈ తరహా నిథుల కేటాయింపులతో ఆ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి
పూర్తవుతుందో కేంద్ర ప్రభుత్వమే సెలవియ్యాలి.
అత్యంత వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్, కోరపుట్-
బోలాంగిర్-కాలహండి(కెబికె) తరహాలో అభివృద్ధి ప్యాకేజీలను అమలు చేస్తామని చట్టంలో
పేర్కొన్నారు. ఆచరణలో చేసిందేమిటి? ఈ ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు పెట్టే
పెట్టుబడులపై 15%, నూతన యంత్రాల తరుగుదలపై అదనంగా 15% రాయితీ కల్పిస్తున్నట్లు, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ఏడు జిల్లాలలో అభివృద్ధి
కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు రు.50 చొప్పున, మొత్తం రు.350 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన
విడుదల చేసి, చేతులు దులుపుకొన్నది. ఇదేనా! అభివృద్ధి ప్యాకేజీ? రాయలసీమకు నీటి సమస్యే జీవన్మరణ సమస్య.
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని రాయలసీమకు
తరలించి కరువు కాటకాల నుండి శాశ్వతంగా విముక్తి చేయాలి. నిర్మాణంలో ఉన్న నీటి
పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థిక సహకారాన్ని
అందించాలి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతామని విభజన చట్టంలో
పేర్కొన్నారు. ఈ అన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ప్యాకేజిని రూపొందించి, అమలు చేసి, సమగ్రాభివృద్ధికి సంపూర్ణ
సహాయ సహకారాలు అందించాలి.
Subscribe to:
Posts (Atom)