2015
డిసెంబరు 5, 6 తేదీలలో కడప పట్టణంలోని శ్రీమతి కోటిరెడ్డి & శ్రీ కోటిరెడ్డి (యస్.కె.ఆర్.
& యస్.కె.ఆర్.) ప్రభుత్వ మహిళా కళాశాల, చరిత్ర విభాగం ఆధ్వర్యంలో " రాయలసీమ
అస్థిత్వం - అభివృద్ధి - రాజకీయాలు" అన్న అంశంపై ఐ.సి.హెచ్.ఆర్. తోడ్పాటుతో నిర్వహించబడిన
జాతీయ సెమినార్ లో నేను సమర్పించిన పత్రం.
రాయలసీమ అస్థిత్వం - అభివృద్ధి - రాజకీయాలు
సుదీర్ఘ
పోరాటాలు, అపారమైన త్యాగాలతో సముపార్జించుకొన్న ఆంధ్రప్రదేశ్ కుటిల రాజకీయాలకు బలైపోయింది.
తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి,
కలహాల కుంపటి రగిల్చారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు
కష్ట సుఖాలలో కలిసి మెలిసి జీవిస్తూ
హైదరాబాదు రాజథానీ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుకొన్న తదనంతరం అభివృద్ధి ఫలాలను అనుభవించే అవకాశం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలకు లేకుండా చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడినప్పుడు కర్నూలు
పట్టణాన్ని రాజథానిగా ఎంపిక చేసుకొన్న మీదటనే
1953 అక్టోబరు 1వ తేదీన ప్రప్రథమ
భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు
చేయడం జరిగింది. తద్బిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసి, మిగిలిన పదమూడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్నిపునర్యవస్థీకరించారు.
ఒకనాటి ఆంధ్ర రాష్ట్రమే స్థూలంగా
నేటి ఆంధ్రప్రదేశ్.
చరిత్ర
నుండి పాఠాలు నేర్చుకొని, చేదు అనుభవాలు పునరావృతం
కాని రీతిలో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన
బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. భావితరాల భవిష్యత్తును అందకారంలోకి నెట్టే లోపభూయిష్టమైన ఆర్థిక, పారిశ్రామిక విధానాలను, కేంద్రీకృత అభివృద్ధి నమూలకు స్వస్తి చెప్పి, అత్యంత బాధ్యతాయుతంగా, జవాబుదారితనంతో, పారదర్శకంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి.
బ్రిటీష్
సామ్రాజ్యవాదుల వలస పాలన నుండి
విముక్తి పొంది స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకొని
దాదాపు ఏడు దశాబ్ధాల కాలం
గడచిపోతున్నది. భారత
రాజ్యాంగం అమలులోకి వచ్చి ఆరు దశాబ్ధాలు
గడచిపోయాయి. 1951 నుండి పంచవర్ష ప్రణాళికల
అమలు మొదలైతే ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక(2012
-17) ముగింపు దశకు చేరుకొంటున్నాము. కానీ
వెనుకబడ్డ రాయలసీమ మరింత వెనుకబడి పోయింది.
కరవు కాటకాల మధ్య చిక్కి శల్యమైపోతున్నది.
ఆంధ్ర
రాష్ట్రం ఏర్పడిన 1953 నాటికి, నేటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలలో పెనుమార్పులు
సంబవించాయి. రాష్ట్ర విభజన మూలంగా తీవ్రమైన
ఆర్థిక సంక్షోభంలోకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బలవంతంగా నెట్టబడింది. దక్షిణ భారత దేశానికే మకుటాయమానంగా
అభివృద్ధి చెందిన మద్రాసు నగరాన్ని వదులుకోవడం నష్టదాయకమైనా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు నాడు ప్రత్యేక ఆంధ్ర
రాష్ట్రం కోసం పోరాడి సాధించుకొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నాడు
సాగిన ఉద్యమంలో పాలుపంచుకోవడానికి మొదట రాయలసీమ ప్రాంత
ప్రజలు ఆసక్తి కనబరచ లేదు. రాయలసీమ
ప్రజల మనోభావాలను ప్రభావితం చేసిన నాటి అంశాలే
నేడు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు
జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడడానికి రాయలసీమవాసులు
ముందు తటపటాయించడమే కాదు వ్యతిరేకించారు. దానికి
కారణం లేకపోలేదు.
కోస్తాంధ్ర
జిల్లాలలో పాశ్చాత్య విద్య అప్పటికే వ్యాపించడం,
ధనిక రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ఆవిర్భవించడం, సాంఘిక సంస్కరణాభిలాష పెరగటం వలన సామాజికాభివృద్ధిలో, ప్రజాజీవనంలో కోస్తాంధ్ర
ప్రాంతం వారు రాయలసీమ వారి
కంటే బాగా ముందడుగులో ఉండేవారు. పర్యవసానంగా వారిలో రాజకీయ చైతన్య స్థాయి కూడా ఎక్కువగా ఉండేది.
అయినా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకొనేవారు. ఉద్యోగస్తులలో
తెలుగువారి సంఖ్య నామమాత్రంగా ఉండేది.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండు తొలిదశలో మొగ్గతొడగడానికి అదొక ప్రధాన కారణమని
చెప్పవచ్చు. రాయలసీమ ప్రజలు మరీ వెనుకబడి ఉండేవారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోను, ఉద్యోగస్తులలో కోస్తాంధ్రుల ఆధిపత్యం నెలకొంటుందన్న భావనలు సీమవాసుల్లో తలెత్తడంతో ఆంధ్ర రాష్ట్ర సాధన
కోసం సాగిన ఉద్యమంలో పాల్గొనలేదు.
ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న లక్ష్యం సాకారం కావలంటే రాయలసీమ ప్రాంత ప్రజల భాగస్వామ్యం అనివార్యమని
కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. రాయలసీమవాసుల మనోగతాన్ని పసిగట్టి, చర్చలు సాగించి 1937 నవంబరు 16న "శ్రీబాగ్ ఒడంబడిక"గా పేరొందిన పెద్ద
మనుషుల ఒప్పందం ద్వారా రాయలసీమ ప్రజలకు భవిష్యత్తుపై బరోసా ఇచ్చి ఉద్యమంలో
అంతర్భాగం అయ్యేలా ఒప్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు
కోసం మద్రాసులో ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొని
58 రోజుల తదనంతరం 1952 డిసెంబరు 15న అమరులైనారు. దాంతో
రాష్ట్ర సాధన కోసం తెలుగు
జాతి ఒక్కటై ఉగ్రరూపందాల్చి, ఉద్యమించి లక్ష్యాన్ని సాధించుకొన్నది.
క్షామ
పీడిత రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలు,
విద్య, ఉపాథి, పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన
రంగాలలో అభివృద్ధికి ఉద్ధేశించబడిన శ్రీబాగ్ ఒడంబడిక బట్టదాఖలా చేయబడింది. తుంగభద్ర, కృష్ణా నదీ జలాల వినియోగంలో
రాయలసీమ ప్రాంతం, నెల్లూరు జిల్లాకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని
అందులో పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రమేర్పడింది. అటుపై 1956 నవంబరు
1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి.
కానీ రాయలసీమ ప్రజల దాహార్తి తీరలేదు.
కరవుల్లో పుట్టి, కరవుల్లో జీవచ్చవాల్లా బ్రతుకులు వెళ్ళదీసి, కరవుల్లో చచ్చిపోవలసిన దుస్థితి కొనసాగుతున్నది.
రాజకీయ
రంగాన్ని పరిశీలిస్తే సుదీర్ఘ కాలం పాటు వెనుకబడ్డ
రాయలసీమ ప్రాంతం నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ,
రాయలసీమ ప్రాంతాన్ని కరవుల బారి నుండి
విముక్తి చేయలేక పోయారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని సాధనంగా ఉపయోగించుకొని రాజకీయ నాయకత్వం ప్రయోజనం పొందిన చరిత్రే దర్శనమిస్తున్నది. అధికార రాజకీయాలు రాయలసీమ వెనుకబాటుతనాన్ని పారదోల లేదు. కీ.శే.
నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి,
వై.యస్.రాజశేఖరరెడ్డి, శ్రీ
నారా చంద్రబాబునాయుడు వరకు బలమైన నాయకులే
ముఖ్యమంత్రులయ్యారు. ఇతర ప్రాంతాల వారి
వత్తిడికి లొంగిపోయేంత బలహీనులు కాదు. అయినా రాయలసీమ
వెనుకబాటుతనానికి దోహదపడే సమగ్ర ప్రణాళికను అమలు
చేయలేదన్నది నిప్పులాంటి నిజం. వ్యవసాయక, పారిశ్రామిక
అభివృద్ధికే కాదు రక్షిత మంచి
నీటికి కూడా నోచుకోని అభాగ్యులుగా
రాయలసీమ ప్రజలు మిగిలిపోయారు. నేటి ఆంధ్రప్రదేశ్ లో
జనాభా 31%, విస్తీర్ణం 42%, స్థూల సాగు భూమి
38%, అటవీ భూమి 41% అభివృద్ధికి ఆమడ దూరంలోనే రాయలసీమ
ఉన్నది. వెయ్యి మందికి ఉపాథి కల్పిస్తున్న రేణిగుంట
రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ మినహా
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పబడలేదు.
రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని ఆల్విన్, సహకార రంగంలోని నూలు
మిల్లులు, చెక్కర కర్మాగారాలు, పాల పరిశ్రమలు మూసి
వేయబడ్డాయి. తలసరి ఆదాయంలో బాగా
వెనుకబడి ఉన్నది. రాష్ట్ర ఖజానాకు అమ్మకపు పన్నే ప్రధాన వనరు.
అమ్మకపు పన్నులో ఈ ప్రాంతం వాటా
20% లోపే. పెట్టుబడులు
పెట్టి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా
అభివృద్ధి చేయాలనే తలంపే కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు చేయలేదు.
తుంగభద్ర,
కృష్ణా నదీ జలాల వినియోగంలో
రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామన్న
శ్రీబాగ్ ఒప్పందంలోని వాగ్ధానాన్ని లేదా 1951లో
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా
పొందిన కృష్ణా _ పెన్నార్ పథకాన్ని అమలు చేసి ఉన్నావ్యవసాయాభివృద్ధిలో
ఈ ప్రాంతం డెల్టా ప్రాంతాలతో పోటీపడి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి మార్గాన్ని సుగమం చేస్తూ 1956లో
ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాధినేతలు కుదుర్చుకొన్న పెద్దమనుషుల ఒప్పందంలో, శ్రీబాగ్ ఒప్పందాన్నిఅంతర్భాగం చేసి ఉంటే రాయలసీమకు
కొంతైనా మేలు జరిగి ఉండేది.
నాటి రాజకీయ నాయకత్వం ఆపనీ చేయలేదు. 1985లో
నిర్మించబడిన శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థసాధక ప్రాజెక్టుగా కాకుండా జల విద్యుదుత్ఫాదనా కేంద్రంగా
నిర్మించడం ద్వారా మరో అన్యాయం చేశారు.
తరువాత దశలో శ్రీశైలం జలాశయం
నీటి వినియోగ స్వభావాన్ని మార్చినా రాయలసీమకు పెద్దగా మేలు జరగలేదు.
కృష్ణా
జలాల వివాద పరిష్కారానికై జస్టిస్
బచావత్ నేతృత్వంలో నియమించబడిన ప్రథమ ట్రిబ్యునల్ రాయలసీమకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చలేదు.
జస్టిస్ బ్రజేష్ కుమార్ నాయకత్వంలో నియమించబడిన రెండవ ట్రిబ్యునల్ ఏ
మాత్రం కరుణ చూపించలేదు. పర్యవసానంగా మిగులు
జలాల ఆధారంగా నిర్మించబడుతున్న హంద్రీ - నీవా, గాలేరు-నగరి, వెలుగొండ
ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైయ్యింది. తెలుగు గంగకు 25 టి.యం.సి.ల మిగులు జలాలను
కేటాయించినా పై రాష్ట్రంగా అవతరించిన
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తలపెట్టిన నీటి పారుదల పథకాల
నిర్మాణం తరువాత ఆ నీళ్ళైనా క్రిందికి
పారుతాయా! అన్న అనుమానాలు వస్తున్నాయి.
నదీ జలాల నీటి వినియోగానికి
సంబంధించి ట్రిబ్యునల్స్ తీర్పులే శిరోధార్యం. ట్రిబ్యునల్ తీర్పులకు లోబడి ఆయా రాష్ట్రాలకు
కేటాయించిన నీటి వినియోగంలో కొన్ని
సర్దుబాట్లు చేసుకొనే వెసులుబాటు మాత్రమే ఉన్నది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో
ప్రాధాన్యత ఇస్తామన్న వాగ్దానం కాలగర్భంలో కలిసిపోయింది. తుంగభద్ర జలాశయం చేజారిపోయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1951లో ప్రతిపాదించబడిన కృష్ణా-పెన్నార్
పథకాన్ని తెలుగు జాతి విస్తృత ప్రయోజనాల
పేరిట తిరస్కరించారు. అపారత్యాగాలు చేసిన
రాయలసీమ దగాకు గురైయ్యింది. రాష్ట్ర విభజనానంతరం రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టుల
భవిష్యత్తుపై
నీలినీడలు కమ్ముకొన్నాయి.
నీరే సమస్య:
నదీ జలాలను కేటాయించి, రాయితీలు ఇస్తే వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి
అనువైన పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా నదీ మిగులు జలాల
ఆధారంగా నిర్మించబడుతున్న తెలుగు గంగ, హంద్రీ-నీవా,
గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లభించే 45 టి.యం.సి.ల
నికర జలాలను కేటాయించాలి. దానికి తోడు దుమ్మగూడెం - నాగార్జున
సాగర్ టేయిల్ పాండు పథకాన్ని కూడా
కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి
సముద్రం పాలౌతున్న గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా కృష్ణా బేసిన్ లోకి తరలించి, ఆ
మేరకు కృష్ణా నదీ జలాలను ఆదా
చేసి, అటు దక్షిణ తెలంగాణకు,
ఇటు రాయలసీమకు మళ్ళించడ మొక్కటే నేడు నీటి సమస్యకు
శాశ్వత పరిష్కారంగా కనబడుతున్నది. గోదావరి – కృష్ణా - పెన్నా నదుల అనుసంధానంపై ప్రచార
ఆర్భాటాలు కాకుండా ఆచరణాత్మకమైన కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను
సమన్వయ పరిచి, సంక్లిష్టంగా పరిణమించిన నీటి సమస్యకు శాశ్వత
పరిష్కారాన్ని చూపెట్టాలి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేబట్టిన ప్రతి ప్రాజెక్టుకు నీటిని
కేటాయించాలి. కృష్ణా
నదీజలాల వినియోగ నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయమే కృష్ణా నదీ జలాల నిర్వహణ,
వినియోగంలో గుండెకాయ లాంటిది. తుంగభద్ర, జూరాల జలాశయాల వద్ద
నీటి నిల్వ, వినియోగాంశాలు కీలకమైనవి. అందువల్ల బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితం.
నైసర్గిక స్వరూపం:
చారిత్రకంగా, రాజకీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ నాలుగు ప్రాంతాలుగా వర్గీకరించబడి ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్రగాను, తూర్పు మరియు పశ్చిమ గోదావరి
జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు మధ్య కోస్తా లేదా
డెల్టా జిల్లాలుగాను, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు
దక్షిణ కోస్తాగాను, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు
జిల్లాలు రాయలసీమగా పరిగణించబడుతున్నాయి. ఈ ప్రాంతాల అభివృద్ధిలో
పెద్ద ఎత్తున వ్యత్యాసాలున్నాయి. శీతోష్ణస్థితి - వర్షపాతం విషయంలోనూ తేడాలున్నాయి. రాష్ట్ర సగటు వర్ష పాతం
940 మి.మీ. కోస్తాంధ్రలో సగటు
వర్షపాతం 1050 మి.మీ. పైగా
ఉన్నది. రాయలసీమ సగటు వర్షపాతం 714 మి.మీ. తూర్పు గోదావరి
జిల్లా 1217 మి.మీ., అతితక్కువ
వర్ష పాతం ఉన్న జిల్లా
అనంతపురం 552 మి.మీ. కర్నూలు
671, కడప 700, చిత్తూరు 934 మి.మీ. వర్షం రాక,
పోకలపై అనిశ్చితి నెలకొన్నది. భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. అడవులు అంతరించి పోతున్నాయి. పర్యావరణ మార్పులు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి.
గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టా ప్రాంతాలు విస్తరించి ఉన్న కోస్తాంధ్ర ధాన్యాగారంగా
ప్రసిద్ధికెక్కింది. సారవంతమైన భూములతో, పచ్చని పంట పొలాలతో అలరారుచున్నది.
బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలకు, వర్షపాతానికి దగ్గర చుట్టరికం ఉన్నది.
అందు వల్ల కోస్తాంధ్ర ఒక
విధంగా ప్రయోజనం పొందుతున్నది, మరొక విధంగా తరచూ
తుఫానుల బారినపడుతూ తీవ్రంగా నష్టపోతున్నది. అభివృద్ధి సాధించడానికి దోహదపడే అంశాలలో వాతావరణం కూడా ప్రధాన భూమిక
పోషిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంబవించిన దృష్ట్యా దూరం, కాలం తగ్గిపోయింది.
పాలనా వ్యవహారాల్లో ఇంటర్నెట్ పాత్ర గణనీయంగా పెరిగింది.
వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పాలన
సాగించే దశలో ఉన్నాము.
అభివృద్ధి ప్రణాళికేది?: నిరంతర క్షామ పీడిత, వెనుకబడ్డ
రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి
నిర్ధిష్టమైన ప్రణాళికను పొందుపరచలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు అభివృద్ధి ప్యాకేజీ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు
కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో
నెలకొల్పే ప్రతిపాదనను ప్రస్తావించారు. ఆచరణలో మొండి చేయి చూపిస్తున్నారు.
కోస్తాంధ్ర ప్రాంతానికి 974 కి.మీ. విస్తరించి
ఉన్న సముద్ర తీరం ప్రకృతి ప్రసాదించిన
వరం. సముద్రతీరం,
ఓడరేవులు, నీటి వనరులు, విద్యుదుత్పాదన
వగైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో
ఉన్నాయనే కారణాలను చూపెట్టి అభివృద్ధి ప్రణాళికలపై చర్చంతా పాశ్చిక దృష్టితో సాగుతున్నది. విశాఖ-నెల్లూరు మధ్య
ఉన్నప్రాంతంపైనే కేంద్రీకరించబడింది. వికేంద్రీకరణ జపం చేస్తూనే ఆచరణలో
కేంద్రీకృత అభివృద్ధి నమూనా మంత్రాన్ని ఆలాపిస్తున్నారు.
విధాన నిర్ణేతల ఆలోచనలన్నీఅభివృద్ధి చెందిన ప్రాంతాలపైనే కేంద్రీకరించబడి ఉన్నాయన్న భావన రాయలసీమ ప్రాంత
ప్రజల్లో బలంగా వేళ్ళూనుకొంటున్నది. విస్తారమైన భూ సంపద, ఖనిజ
మరియు అటవీ సంపద ఉన్నా
అభివృద్ధికి నోచుకోలేక పోతున్నామనే గుండె కోతకు గురౌతున్నారు.
ఉపాథి అవకాశాలు లేక లక్షల సంఖ్యలో
గల్ప్ దేశాలకు, దేశంలోని పట్టణ ప్రాంతాలకు వలసలు
వెళుతున్నారు. గత అనుభవాల ఆధారంగా
భవిష్యత్ పరిణామాలను ఊహించుకొంటున్నరాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నాలు, కార్యాచరణ ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. రాయలసీమ
వెనుకబాటుతనానికి వ్యవస్థీకృతమైన ఉన్న హత్యా రాజకీయాలు,
గ్రామ కక్షలు కూడా ఒక కారణమన్న
అంశo విస్మరించలేనిది.
రాయలసీమ
ప్రాంతం సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిథులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, అమలు చేయడం ద్వారా
మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. చెన్నయ్ నుండి కలకత్తా మధ్యలో
ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. విశాఖ, విజయవాడ
విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రాయలసీమకు మూడు వైపులా అందుబాటులో
అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కర్నూలుకు సమీపంలో హైదరాబాదు, అనంతపురంకు సమీపంలో బెంగుళూరు, తిరుపతి, కడపకు సమీపంలో చెన్నయ్
ఉన్నాయి. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రమంగా అభివృద్ధి చేస్తున్నారు. ముంబాయి - చెన్నయ్, హైదరాబాద్ - బెంగుళూరు రైలు మార్గాలు, జాతీయ
రహదారులు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత రైలు,
రోడ్డు మార్గాలను త్వరితగతిన పూర్తి చేయాలి. తద్వారా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో అనుసంధానించాలి. ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే
మెరుగైన, నాణ్యమైన రైల్వే, రహదారుల నిర్మాణం ద్వారా మాత్రమే ఈ కల సాకారమవుతుంది.
ఆర్థికాభివృద్ధికి
చోధక శక్తిగా పనిచేసే మౌలిక సదుపాయాలలో కీలకమైన
భూమిక పోషించేది విద్యుత్తు. ఆర్.టి.పి.పి. మరియు శ్రీశైలం
జల విద్యుదుత్ఫత్తి కేంద్రం, పి.ఎ.బి.ఆర్. మినీ జలవిద్యుత్
కేంద్రం, తుంగభద్ర జల విద్యుదుత్ఫత్తి కేంద్రం
ఉన్నా వాటి ద్వారా ఉత్ఫత్తి
అవుతున్న విద్యుత్తును రాయలసీమ అవసరాలకు మాత్రమే కేటాయించబడడం లేదు. గ్రిడ్ కు
అనుసంధానం చేసి రాష్ట్ర విభజనలో
భాగంగా ప్రస్తుత వినియోగం ప్రాతిపదికన పంపిణీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం
జరిగింది. అందులో భాగంగానే రాయలసీమకు అన్యాయం జరిగింది. ఈ ప్రాంతంలో సౌర
మరియు పవన విద్యుదుత్ఫాదనకు అపారమైన
అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యుదుత్ఫత్తిలో స్వయం పోషకత్వాన్ని సాధించడమే
కాకుండా యువతకు ఉపాధి కల్పన, ఉత్ఫత్తి
కేంద్రాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు.
ఈ అన్ని అంశాలతో సమగ్ర
అభివృద్ధి ప్రణాళికను సత్వరం ప్రకటించి, అమలు చేయాలి.
అస్థిత్వ
ఉద్యమాలకు సంబంధించి ఒక్క మాటే. సామాజిక,
ప్రాంతీయ అంశాలపై జరుగుతున్న అస్థిత్వ ఉద్యమాలను వివిధ కోణాలలో హేతుబద్ధంగా
విశ్లేషించుకోవలసి ఉన్నది. విస్తృత ప్రజాప్రయోజనాలు, మానవాభివృద్ధికి దోహదపడే అంశాలనే కొలబద్ధగా ఎంపిక చేసుకోవాలి.
నేడు
రాయలసీమ నాలుగు రోడ్ల కూడలిలో నిస్సహాయంగా
నిలబడి ఉన్నది. రాయలసీమ ప్రాంత ప్రజల భవిష్యత్తు పట్ల
చిత్తశుద్ధితో, అంకితభావంతో, సంకుచిత రాజకీయాలకు అతీతంగా మేధావులు, వివిధ వర్గాల ప్రజానీకం,
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు లోతైన
ఆలోచన చేయాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. "సమగ్ర
దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం" ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలనను ప్రజలు
కోరుకొంటున్నారు.
-
టి.లక్ష్మీనారాయణ
నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా
కేంద్రం,
పూర్వ
సంచాలకులు