- శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర, జూరాల, పులిచింతల జలాశయాల్లో 330 టియంసిల నీరు వినియోగానికి అందుబాటులో ఉన్నదని, 2017 నవంబరు 4న హైదరాబాదులో సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ధారించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 66:34 నిష్పత్తిలో 217.8, 112.2 టియంసిల చొప్పున వినియోగించు కోవాలని నిర్ధేశించింది. ఆ నిర్ణయానికి లోబడి వివాదరహితంగా 2018 జూన్ వరకు త్రాగు నీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ నీటిని వినియోగించు కోవాలని ఆదేశించింది.
- నైరుతీ రుతుపవనాలు ప్రారంభంలో నిరాశ పరిచినా, ముగింపులో కాస్తా ఆనందాన్నినింపి నిష్క్రమించాయి. మంచి వర్షాలు పడ్డాయన్న భావన కలిగించి వీడ్కోలు తీసుకొన్నాయి. కొన్ని మినహాయింపులతో మొత్తం మీద వాగులు, వంకలు, చిన్న పెద్ద నదులు ప్రవహించాయి. అత్యధిక భాగం కుంటలు, చెరువులు నిండాయి. భూగర్భజలాలు కాస్తా పెరిగాయి. ఖరీప్ సాగుకు నీరు లభించక పోయినా ఏడాది పాటు నీటి కష్టలుండవన్న భావన నెలకొన్నది. నిత్య కరవులతో బాధపడుతున్న రాయలసీమ ప్రాంతంలో కూడా కురిసిన వర్షాల పట్ల ప్రజలు స్థూలంగా సంతృప్తితో ఉన్నారు. ఈశాన్య రుతుపవనాల వల్ల కూడా ప్రయోజనం వనకూడుతుందని ఆశిద్దాం.
- ఈ ఏడాది జూన్ 1 నుండి నవంబరు 9 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ వర్ష పాతం 775 మి.మీ. గాను 729 మి.మీ. నమోదయ్యింది. సాధారణ వర్షపాతం కంటే 6% తక్కువ. శ్రీకాకుళం మొదలు ప్రకాశం జిల్లా వరకు సాధారణ వర్ష పాతం కంటే తక్కువ నమోదైతే, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాలలో సాధారణ వర్షపాతం, అనంతపురం, కడప మరియు చిత్తూరు జిల్లాలలో 21% నుంచి 25% వరకు అధిక వర్షపాతం నమోదయ్యిందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర సగటు వర్షపాతం కంటే రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల సగటు వర్షపాతం తక్కువ. ఉదా: తూర్పు గోదావరి జిల్లాలో 1003 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 814 మి.మీ. నమోదయ్యింది. అనంతపురం జిల్లాలో 462 మి.మీ. సాధారణ వర్షపాతంకు గాను 559 మి.మీ. నమోదు కావడంతో 21% అధికంగా వర్షం పడ్డట్లు పేర్కొనబడింది. కడప జిల్లాలో 565% మి.మీ. సాధారాణ వర్షపాతానికి గాను 690 మి.మీ. నమోదైనా కోడూరు శాసనసభా నియోజకవర్గంలోని చెరువుల్లోకి పెద్దగా నీరు చేరలేదు. పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరు ప్రవహించినా, చెయ్యేరుకు ఉపనదిగా ఉన్న గుంజన ప్రవహించ లేదు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక సగటు వర్ష పాతం 852 మి.మీ. తూర్పు గోదావరి జిల్లా సగటు వర్షపాతం దాదాపు 1100 మి.మీ.గా ఉంటే అనంతపురం జిల్లా 550 మి.మీ. మాత్రమే. రాయలసీమ ప్రాంత సగటు వర్ష పాతం 645 మి.మీ. నైరుతీ రుతు పవనాల వల్ల లభించాల్సిన సగటు వర్షపాతం కంటే కాస్తా అధికంగా వర్షపాతం నమోదైనా రాయలసీమ ప్రాంతం సగటు వర్షపాతం తక్కువన్న వాస్తవాన్నిపరిగణలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నీటి వాడకంలో ఆ ప్రాంత నీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- నైరుతి రుతు పవనాల వల్ల జూన్ నుండి సెప్టంబరు వరకు కురిసే వర్షాల ద్వారానే 65% నీటి లభ్యత ఉంటుంది. గోదావరి నదీ జలాలు పుష్కలంగా లభించడంతో గోదావరి డెల్టా ఆయకట్టులోను, కృష్ణా జలాలపై ఆధారపడిన క్రిష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేయడం, వాటికి తోడు నాగార్జునసాగర్ క్రింది భాగంలో లభించిన వర్షపు నీటితో ఖరీప్ పంటను సాగు చేసుకొన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లోను, అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల క్రింది ఆయకట్టుకు ఖరీప్ పంట సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేయలేదు. రబీలో ఆరుతడి పంటలు పండించు కోకపోతే రైతాంగం నిలదొక్కుకోలేదు.
- కృష్ణా, పెన్నా నదుల పరివాహక ప్రాంతాల్లోని జలాశయాల్లోని తాజా నీటి నిల్వలను పరిశీలిద్దాం. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలోని జలాశయాలు నిండి పొంగి పొర్లిన తరువాతనే క్రిందికి నీరు వదిలి పెట్టబడింది. ఆల్మట్టి, నారాయణపూర్ దాటుకొని జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండు కుండలను తలపించేలా నీరు చేరింది. శ్రీశైలంలోకి ఆశాజనకంగా నీరు చేరిన మీదట నాగార్జునసాగర్ జలాశయానికి, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా ఎస్.ఆర్.బి.సి.కి మరియు తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు రిజర్వాయరుకు, హంద్రీ - నీవాకు, తెలంగాణలోని కల్వకుర్తికి నీటిని తరలించడం ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. నవంబరు 9వ తేదీ నాటి గణాంకాలను బట్టి శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం ఆగి పోయింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 216 లకు గాను 185 టియంసిలు ఉన్నాయి. నాగార్జునసాగర్ లో 312కు గాను 270 టియంసిలకు నిల్వ చేరింది. పులిచింతలలో 46కు గాను 9 టియంసిలే ఉన్నాయి. తెలుగు గంగలో అంతర్భాగమైన వెలుగోడు జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 17కు గాను 16 టియంసిల నిల్వ చేయబడింది. కానీ 18 టియంసిల సామర్థ్యమున్న బ్రహ్మంగారిమఠం జలాశయంలో రెండు, మూడు టియంసిల నీరు కూడా చేరలేదు. శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడ్డ ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగమైన గోరకల్లులో 12.5కు గాను 7, ఔక్ లో 4కు గాను 2 టియంసిలు ఉన్నాయి. గండికోటలో 28కి గాను 4, మైలవరం 10కి 2, అలగనూరులో 2.6 టియంసిల నీటి నిల్వలు ఉన్నాయి. తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టియంసిలకు గాను ప్రస్తుతం 75 టియంసి లున్నాయి. పిఎబిఆర్ లో 11కు గాను తుంగభద్ర జలాశయం మరియు హంద్రీ – నీవా ద్వారా వచ్చిన నీరు 3 టియంసిలు మాత్రమే చేరాయి. పెన్నా నదికి ఉపనదులైన కుందు, చెయ్యేరు, పాపాఘ్ని ప్రవాహంతో నెల్లూరు జిల్లాలోని సోమశిలలో 78కి గాను 50 టియంసిలు, కండలేరులో 68కు గాను 18 టియంసిలకు మాత్రమే నిల్వలు చేరాయి.
- మహారాష్ట్ర, కర్నాటక మరియు రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతగా చెన్నయ్ నగరానికి 15 టియంసిల త్రాగు నీటిని కండలేరు నుంచే సరఫరా చేయాల్సి ఉన్నది.
- రాయలసీమ ప్రాంతంలోని వెలుగోడు మినహాయిస్తే మిగిలిన జలాశయాలలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయి. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టానికిపైన నీటి నిల్వ ఉన్న కాలంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నయ్ నగరానికి 15 టియంసిలను త్రాగు నీటి కోసం సరఫరా చేయడానికి కండలేరులో నిల్వ చేయాలి, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.)కి 19 మరియు కె.సి.కెనాల్ కు 10, మొత్తం 44 టియంసిల నికరజలాలతో పాటు తెలుగు గంగకు 29, గాలేరు – నగరి సుజల స్రవంతి పథకానికి 38 కలిపి 67 టియంసిల వరద నీటితో కలిపి స్థూలంగా 112 టియంసిల నీటిని తరలించాల్సి ఉన్నది.
- కృష్ణా నదీ ప్రవాహ కాలం 30 రోజులకు మించి ఉండడం లేదన్న ఉద్ధేశ్యంతోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 నుండి 44,000 క్యూసెక్కుల తరలింపుకు వీలుగా విస్తరించడానికి 2005 డిసెంబరు 21న జరిగిన అఖిల పక్ష సమావేశం ఆమోదం తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పన్నెండేళ్ళు గడచి పోతున్నా హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మధ్య 16 కి.మీ. పొడవున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ పనులను పూర్తి చేస్తే తప్ప 44,000 క్యూసెక్కుల నీటిని తరలించడం సాధ్యం కాదు. ఈ ఏడాది 14,000 క్యూసెక్కులకు మించి నీటిని తీసుకెళ్ళ లేక పోయారంటే నిర్మాణ పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. పర్యవసానంగా బి.మఠానికి నీరు పెద్దగా చేరలేదు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జారీ చేసిన జి.ఓ.నెం.69 మేరకు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులుగా నిర్ధారించినా, గత ఏడాది 785 అడుగుల వరకు నీటిని తోడేశారు. పర్యవసానంగా ఈ ఏడాది 854 అడుగులకు నీరు చేరడానికే చాలా రోజులు పట్టాయి. ఇప్పుడు నదీ ప్రవాహం ఆగిపోయింది. నాగార్జునసాగర్ ఇంకా నిండలేదు. దాన్ని నింపడానికి శ్రీశైలం నుండి జలవిద్యుదుత్పాదన చేసుకొంటూ నీటిని క్రిందికి వదులుతున్నారు. పర్యవసానంగా శ్రీశైలంలో ఇప్పటికే 191 టియంసిలకు నిల్వ పడిపోయింది.
- ఎస్.ఆర్.బి.సి.లో అంతర్భాగంగా నిర్మించబడిన గోరకల్లు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 12.5 టియంసిలైతే నేడు 7 టియంసిలకు మించి నిల్వ చేయలేని దుస్థితి. నాసిరకం నిర్మాణం పర్యవసానంగా లీకేజీల సమస్య వెంటాడుతున్నది. 4 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడిన ఔక్ రిజర్వాయరులో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు అటవీ భూముల ముంపు సమస్య అపరిష్కృతంగా కొనసాగుతున్నది. ఫలితంగా 2 టియంసిలకు మించి నిల్వ చేసుకోలేని దుస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 1,95,000 ఎకరాల నిర్ధేశిత ఆయకట్టుకు నీరెలా అందిస్తారు?
- గండికోట జలాశయం నిల్వ సామర్థ్యం 27 టియంసిలు. పెన్నా నది వరద నీరు, ఔక్ నుండి విడుదల చేసిన కొద్దిపాటి కృష్ణా నదీ జలాలు కలిపి దాదాపు ఐదు టియంసిలు మాత్రమే చేరాయి. అందులో 10 టియంసిల సామర్థ్యమున్న మైలవరానికి 2 టియంసిలను, మరికొంత నీటిని పైడిపాళెంకు ఎత్తిపోతల ద్వారా తరలించారు. గండికోట జలాశయంలో నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ చేయాలంటే ముద్దనూరు, కొండాపురం మండలాల్లో ముంపుకు గురయ్యే 22 గ్రామాల ప్రజలకు నష్ట పరిహారాన్ని పూర్తిగా చెల్లించి, పునరావాసం కల్పించాలి. ముంపుకు గురౌతున్న రహదారి, రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉన్నది. జలాశయంలో నీరు చేరినా నిర్ధేశిత ఆయకట్టుకు నీరందించడానికి అవకాశమే లేదు. మొదటి దశలో 30,000 ఎకరాలకు సాగు నీరివ్వాలన్నా నిర్మాణ పనులను పూర్తి చేయలేదు. కాకపోతే వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తే కనీసం ఆ చుట్టు ప్రక్కల భూగర్భ జలాలన్నా పెరుగుతాయన్న ఆశ ప్రజల్లో ఉన్నది. రెండవ దశ నిర్మాణ పనులను ప్రభుత్వం అటకెక్కించి కూర్చొన్నది. చిత్రావతి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులు ‘ట్రయిల్ రన్’ కంటే ముందే పగిలి పోయాయన్న వార్తలొచ్చాయి.
- తెలుగు గంగలో అంతర్భాగంగా నిర్మించబడిన వెలుగోడుకు కృష్ణా నీటిని సామర్థ్యానికి అనుగుణంగా తరలించారు. అంత వరకు అభినందనీయం. కానీ, 18 టియంసిల సామర్థ్యమున్న బ్రహ్మంగారిమఠం రిజర్వాయరుకు ఇప్పటికీ రెండు, మూడు టియంసిల నీటిని కూడా చేర్చలేదు. ఆ రిజర్వాయరు క్రింద పంట కాల్వల వ్యవస్థ నిర్మాణం కూడా నత్తలతో పోటీ పడుతున్నది. గతంలో రిజర్వాయరులోకి నీరు చేరిన సందర్భాలలో పోరుమామిళ్ళ, బద్వేల్, తదితర చెరువుల ద్వారా సాగుకు నీరిచ్చారు. ఇప్పుడూ అలా చేయవచ్చు. అయితే, రిజర్వాయరులో నీళ్ళే లేని పరిస్థితి.
- కె.సి. కెనాల్ క్రింద సాగవుతున్న 2.78 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగభద్ర నదీ ప్రవాహం మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది. కేవలం 1.2 టియంసిల నిల్వ సామర్థ్యమున్న సుంకేసుల ఆనకట్ట, 3 టియంసిల సామర్థ్యమున్న అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు మాత్రమే ఉన్నాయి. తుంగభద్ర నుంచి కె.సి.కాలువకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టియంసిలను పిఎబిఆర్ కు కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కె.సి.కాలువకు శ్రీశైలం నుండి సర్దుబాటు చేస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు కృష్ణా జలాలను సరఫరా చేయాలి.
- ఈ పూర్వరంగంలో శ్రీశైలం జలాశయం నుండి ఆంధ్రప్రదేశ్ వినియోగించు కోవడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతించిన నీటి వినియోగంలో రాయలసీమ నీటి అవసరాలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి. తుంగభద్ర జలాశయం నీటి వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగకుండా న్యాయమైన వాటా సాధనకు ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి.
టి.లక్ష్మీనారాయణ