Tuesday, April 24, 2018
Monday, April 16, 2018
వైద్య విద్యా శాఖ - వింత పోకడలు:
నైర్యాశ్యంలో అధ్యాపకులు - సంక్షోభంలో వైద్య విద్య
నైర్యాశ్యంలో అధ్యాపకులు - సంక్షోభంలో వైద్య విద్య
1. మొదట తాజా సమస్యను ప్రస్తావిస్తా. ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు పదోన్నతులలో 2010 సం. నుండి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతామని ఉత్తర్వులు జారీ చేసి ఆరు మాసాలు గడచి పోతున్నా అమలు చేయకుండా జాప్యమెందుకు చేస్తున్నట్లని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అధ్యాపకులు ఆందోళన చేయడం సమర్థనీయం.
2. ప్రభుత్వం వైద్య విద్యను అంగడి సరుకుగా మార్చి, ప్రమాణాలకు పాతరేసింది. దాని దుష్పలితాలను సమాజం అనుభవిస్తున్నది.
3. ప్రభుత్వ వైద్య కళాశాలలు నైపుణ్యం ఉన్న అధ్యాపకుల లేమితో కునారిల్లి పోతున్నాయి. ఈ పరిస్థితికి ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన, బాధ్యతారహితమైన, అనాలోచిత విధానాలు, అవినీతే ప్రధాన కారణం.
4. గడచిన దశాబ్ధ కాలానికి సంబంధించిన అధ్యాపకుల పదోన్నతుల అంశాన్ని పరిశీలిస్తే వైద్య విద్యా శాఖ డొల్లతనం బోధపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును గుర్తించి, సరిదిద్దడానికి నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "Career Advancement Scheme(Time bound pay scales)" ను అమలు చేస్తామని 2017 అక్టోబర్ 16న జి.ఓ.నెం.163ని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నేటికీ అమలుకు నోచుకోలేదు. పర్యవసానంగా అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు.
5. సమస్య నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకుల ఆందోళన ఎంతటి న్యాయబద్ధమైనదో బోధపడుతుంది. ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకుల పదోన్నతుల విధానంపై పిల్లి మొగ్గలు వేయడం చూస్తుంటే ప్రభుత్వానికి ఒక స్థిరమైన, చట్టబద్ధమైన విధానాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి లోపించినట్లు భావించాల్సి వస్తున్నది.
6. యు.జి.సి. నిబంధనల మేరకు "Career
Advancement Scheme"ను అమలు చేయడానికి ఉద్ధేశించిన జి.ఓ.నెం.32ను 2010 ఫిబ్రవరి 2న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇంత కాలం దాన్ని అటకెక్కించి కూర్చున్నారు.
Advancement Scheme"ను అమలు చేయడానికి ఉద్ధేశించిన జి.ఓ.నెం.32ను 2010 ఫిబ్రవరి 2న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇంత కాలం దాన్ని అటకెక్కించి కూర్చున్నారు.
7. ఆయా విభాగాల్లో ఖాళీలు ఏర్పడితేనే పదోన్నతి కల్పించే అసంబద్ధమైన పదోన్నతుల విధానాన్నే కొనసాగించారు. పర్యవసానంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులైన వారు ఒక్క పదోన్నతికి కూడా నోచుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ గానే పదవీ విరమణ చేసిన వారి జాబితా పెద్దది. అలాగే, సర్వీసు మొత్తంలో ఒక్క పదోన్నతి పొంది అసోసియేట్ ప్రొఫెసర్ గానే పదవీ విరమణ చేసిన వారు ఉన్నారు. పదోన్నతులలో 'రోస్టర్ పాయింట్స్' అమలులో అవకతవకలకు పాల్పడడం, పైరవీకారుల ప్రలోభాలకు లొంగి అవినీతికి పాల్పడి అనర్హులకు పదోన్నతి ఇవ్వడం వంటి అక్రమాల వల్ల అర్హులైన వారికి నష్టం వాటిల్లిన ఉదంతాలూ ఉన్నాయి.
8. పదోన్నతులలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దమని 2010 ఫిబ్రవరి 2న జారీ చేసిన జి.ఓ.నెం.32ను అమలు చేయాలని అధ్యాపకులు దీర్ఘకాలికంగా చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 అక్టోబరు 16న జి.ఓ.నెం.163 ను విడుదల చేయడంతో అధ్యాపకులు కాస్తా సంబరపడ్డారు.
9. ఆ జి.ఓ. లో "The Career Advancement Scheme (CAS) shall be implemented with effect from 01.11.2006 and monetary benefit shall be given with effect from the date of issue of these orders" అని పేర్కొన్నారు. 2010 ఫిబ్రవరి 2న జారీ చేసిన జి.ఓ.నెం.32 ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పని చేసిన అధ్యాపకుల సర్వీసును లెక్కగట్టి, ఎం.సి.ఐ. నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తామని, తదనుగుణంగా 'స్కేల్స్' ను నిర్ధారించి, వేతనాల పెరుగుదలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాన్ని మాత్రం 2017 అక్టోబరు 16 నుండి వర్తింప చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతులు వస్తే చాల్లే అన్న సద్భావనతో అధ్యాపకులు సంతోషపడ్డారు.
10(a). 2017లో ఎం.సి.ఐ. జారీ చేసిన సవరణలతో కూడిన నిబంధనలకు లోబడి ప్రచురించబడిన అధ్యయన పత్రాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే పదోన్నతులు కల్పిస్తామని షరతు విధించారు. గతంలో పదోన్నతులు పొందిన వారికి ఈ షరతును సడలింపులతో అమలు చేస్తూ వచ్చారు.
(b) అధ్యయన పత్రాలకు సంబంధించి గతంలో 'పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్' అనే నిబంధన ఉండేది. ఇప్పుడు, 'పస్ట్ ఆథర్, కరస్పాండింగ్ ఆథర్' అన్న కొత్త నిబంధన మేరకు ప్రచురించబడిన అధ్యయన పత్రాలనే పరిగణలోకి తీసుకొంటామని పేచీకోరు నిబంధనొకటి ఉత్తర్వుల్లో పొందు పరిచారు.
(c) 'కరస్పాండింగ్ ఆథర్' అన్న 'కాన్సెప్ట్' ను ఎం.సి.ఐ. 2017 నుండి మాత్రమే అమలు చేస్తున్నది. ఆ షరతును ఈ జి.ఓ. అమలుతో ముడిపెట్టడం అర్థరహితం.
(c) 'కరస్పాండింగ్ ఆథర్' అన్న 'కాన్సెప్ట్' ను ఎం.సి.ఐ. 2017 నుండి మాత్రమే అమలు చేస్తున్నది. ఆ షరతును ఈ జి.ఓ. అమలుతో ముడిపెట్టడం అర్థరహితం.
(d) ఎవరైతే ప్రచురించబడిన అధ్యయన పత్రాలను సమర్పిస్తారో వారే పదోన్నతులకు అర్హులు అన్నంత వరకు సబబే. అంతే కానీ, 'పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్/ కరస్పాండింగ్ ఆథర్' అన్న పేచీ పెట్టి అర్హులైన అధ్యాపకులకు పదోన్నతులు నిరాకరించడమో! లేదా! జి.ఓ. మొత్తం అమలుకే ఎసరు పెట్టడం గర్హనీయం.
(e) ఈ వివాదానికి తెరదించుతూ ఎం.సి.ఐ. విస్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎం.సి.ఐ. నోటిఫికేషన్ జారీ చేసిన 2017 జూన్ 5కు ముందు "పస్ట్ ఆథర్, సెకండ్ ఆథర్" నిబంధన వర్తిస్తుందని, తరువాత మాత్రమే "పస్ట్ ఆథర్, కరస్పాండింగ్ ఆథర్" అన్న నిబంధన వర్తిస్తుందని అందులో పేర్కొన్నది. అయినా "Career Advancement Scheme Scales and grade pay" అమలుకు త్వరితగతిన చర్యలు చేపట్టక పోవడాన్ని ఏమనాలి?
11. అధ్యాపకులు నిరంతర విద్యార్థులుగా కొనసాగేలా ప్రోత్సహించడానికి దోహదపడే నిబంధన "పదోన్నతులు పొందడానికి పరిశోధనా పత్రాల ప్రచురణ నకళ్ళను సమర్పించాలి" అన్న నిబంధనను అమలు చేయడం సమంజసం, సమర్థనీయం, విధిగా అమలు చేయాల్సిన నిబంధన.
కానీ, ఈ నిబంధన అమలులో వైద్య విద్యా శాఖ పిల్లిమొగ్గలు వేయడం అత్యంత గర్హనీయం. ఒక్కొక్కసారి ఈ నిబంధనొకటి ఉన్నదనే అంశాన్ని విస్మరించి పదోన్నతులు కల్పించిన ఉదంతాలు కోకొల్లలు. సర్వీసుంటే చాలని పరిశోధనా పత్రాల నిబంధనను ప్రక్కన పెట్టి గతంలో పదోన్నతులు ఇచ్చారు. దాంతో అధ్యాపకుల్లో పరిశోధనల పట్ల అనాసక్తత నెలకొన్నది. అడపాదడపా వైద్య శాఖాధికారులు ఈ నిబంధనను అమలు చేయడానికి పూనుకొంటున్నారు కాబట్టి 'కట్ & పేస్ట్' తరహాలో పత్రాలను తయారు చేసి, ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అంతర్జాల పత్రికలలో ప్రచురింప చేయించుకొని, నకళ్ళు సమర్పించి, అడ్డదారులు తొక్కిన అధ్యాపకులు లేరని చెప్పలేం!
మొత్తం సర్వీసులో ఒక్క అధ్యయన/పరిశోధన పత్రాన్ని ప్రమాణాలున్న పత్రికలో ప్రచురించురింప చేసుకోని వారిలో పదోన్నతులు పొంది అధికారులుగా, అధ్యాపకులుగా ప్రస్తుతం ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్య విద్యా శాఖ అనుసరించిన, అమలు చేసిన అసంబద్ధ, అలసత్వంతో కూడిన విధానాలే కారణమని చెప్పక తప్పదు. నిబంధనలను నిస్పాక్షికంగా, విధిగా అమలు చేసి ఉంటే నేడు ఈ దుస్థితి దాపురించేది కాదు.
12. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు వెళ్ళి, డబ్బు సంపాదించుకొని కొన్ని సంవత్సరాల తరువాత తిరిగొచ్చి ఉద్యోగంలో చేరినా వారికి క్రమశిక్షణారాహిత్యం క్రింద చర్యలు తీసుకోక పోగా పదోన్నతులు కల్పించడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయో ఊహించవచ్చు.
13. వృత్తి ధర్మానికి అంకిత భావంతో కట్టుబడి, నూతన విజ్ఞానాన్ని సముపార్జించుకొంటూ, నాణ్యతా ప్రమాణాలతో వైద్య విద్యను బోధించాలన్న తృష్ణ, తపన పడుతున్న అధ్యాపకులు లేక పోలేదు.
14. ఒకేసారి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా సర్వీసులో చేరిన వారిలో కొందరు పదోన్నతికి నోచుకోక అదే స్థాయిలో పని చేస్తుంటే కొందరేమో అసోషియేట్ ప్రొఫెసర్లుగా, మరికొందరు ప్రొఫెసర్లుగా, శాఖాధిపతులుగా పదోన్నతి పొందారు. అలాగే తమ దగ్గర విద్యనార్జించి పట్టభద్రులైన విద్యార్థులు ప్రయివేటు వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రవేశించి, త్వరితగతిన పదోన్నతులు పొంది ప్రొఫెసర్లు అయ్యి 'ఎగ్జామినర్స్' గా, ఎం.సి.ఐ. పర్యవేక్షక అధికారులుగా వస్తున్నారనే న్యాయమైన మనోవేదన కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులకు ఉన్నది.
15. వైద్య విద్యా రంగంలో అధ్యయనాలను, పరిశోధనలను ప్రోత్సహించే వాతావరణం యన్.టి.ఆర్. వైద్య విశ్వవిద్యాలయంలో పూర్తిగా కొరవడింది. వైద్య విద్యా రంగంలోని వివిధ విభాగాలలో పరిశోధనలపై ఆసక్తి కనబరిచే విద్యార్థులకు ప్రవేశం కల్పించే విధానం లోపభూయిష్టంగా ఉన్నది, కళాశాలల్లో 'గైడ్స్' కొరత తీవ్రసమస్యగా ఉన్నది. ఈ సమస్యను అదిగమించాలన్న ద్యాసే విశ్వవిద్యాలయానికి లేదు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఈ దృక్పథమే లోపించింది.
16. ఎం.సి.ఐ. బృందాలు ప్రతి ఏడాది వైద్య కళాశాలలను సందర్శించి నిబంధనలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోషియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ అన్ని విభాగాల్లో ఉన్నారా! లేదా! అన్న వాస్తవాలను నిర్ధారించుకొన్న మీదటే 'గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్' ఉన్న సీట్ల సంఖ్యను కొనసాగించడం కానీ, పెంపుదలకు అనుమతించడం కానీ చేస్తుంటుంది. ఈ నిబంధనను అక్రమ మార్గాలలో అధిగమించడంలో ప్రయివేటు వైద్య కళాశాలల యాజమన్యాలది అందె వేసిన చేయి.
ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలల్లో అన్ని స్థాయిల్లో అధ్యాపకుల కొరత లేకుండా నియమించి లేదా పదోన్నతులు కల్పించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకుండా ఎం.సి.ఐ. బృందాలు పర్యవేక్షణకు వచ్చినప్పుడు 'డెప్యూటేషన్స్' లేదా తప్పుడు రికార్డులను సృష్టించి చూపెట్టడం లాంటి తప్పుడు పద్ధతులను కూడా అనుసరిస్తున్నారనడంలో సందేహం లేదు.
17(a). ఏడవ వేతన సంఘం సిఫార్సులకు (యు.జి.సి. కమీషన్) అనుగుణంగా "Career Advancement Scheme Scales and grade pay" సవరించి అమలు చేయాలని కూడా జి.ఓ.లో పేర్కొన్నారు.
(b).7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా సవరించిన యు.జి.సి. వేతనాల చెల్లింపుకు సంబంధించిన జి.ఓ.ను కూడా విడుదల చేశారు. కానీ, దాన్ని అమలు చేయలేదు.
18. ఇలాంటి అసంబద్ధ విధానాలతో నైపుణ్యం ఉన్న నిపుణులైన అధ్యాపకులను ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలు కోల్పోతున్నాయి. పని చేస్తున్న అధ్యాపకులను నిరుత్సాహానికి గురిచేసి వారిలో అలసత్వం పెరిగేలా ప్రభుత్వ చర్యలు దోహదపడుతున్నాయి.
19. జాప్యం చేయడం కానీ, జి.ఓ.నెం.163 ను అటకెక్కించాలని భావించినా వైద్య విద్యా రంగానికి తీవ్రహాని తలపెట్టిన వారౌతారు.
20. చివరలో ఒక్క మాట. ఎం.సి.ఐ. సంస్థే అవినీతి, అక్రమాలకు నెలవుగా మారిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కుంభకోణాలు వేలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై వైద్య విద్యా రంగ ప్రక్షాళనకు పూనుకోవాలి.
"వైద్య విద్యా ప్రమాణాలను పరిరక్షించాలి! సమాజానికి నైపుణ్యం గల వైద్యులను అందించాలి".
టి.లక్ష్మీనారాయణ
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు
రాజకీయ, సామాజికాంశాల విశ్లేషకులు
Subscribe to:
Posts (Atom)