ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం -2023
ఆ నాలుగు సెక్షన్లు ప్రమాదకరమైనవి
భూ "మాఫియా"లకు అనుకూలమైనవి
1. భూమి అత్యంత కీలకమైన ఉత్పత్తి సాధనం. సరళీకృత ఆర్థిక విధానాలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో భూమి విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. కార్పోరేట్ సంస్థలు, బడా కంపెనీల డేగ కళ్ళు భూములపై పడ్డాయి. భూ కబ్జాదారులు - మాఫియా ముఠాల నుండి గ్రామీణ - పట్టణ ప్రాంతాల్లో నిజమైన హక్కుదారులు తమ భూమిని - స్థిరాస్తులను, సమాజం యొక్క ఉమ్మడి ఆస్తి అయిన భూములు - సహజ వనరులను పరిరక్షించుకోడం పెద్ద సమస్యగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం-2023ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని పౌరులందరూ సమగ్రంగా అధ్యయనం చేయాలి.
2. మన రాజ్యాంగానికే దాదాపు 130 సవరణలు చేశారు. వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళన చేయకూడదని ఎవరూ అనరు. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలైన పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, సమానత్వం, సమాజం యొక్క విస్తృత ప్రయోజనాలను ప్రామాణికంగా తీసుకొని హేతుబద్ధంగా చట్టాలను రూపొందించాలి. కానీ, ఇప్పుడు జరుగుతున్నదేమిటి! పౌరులు అనుభవిస్తున్న హక్కులను కాలరాస్తూ చట్టాల రూపకల్పన జరుగుతున్నది. చట్ట సభల్లో సమగ్ర చర్చ లేకుండా, ప్రతిపక్ష సభ్యులను మూకుమ్మడిగా సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను ఆమోదించే అప్రజాస్వామికమైన ప్రక్రియ నేడు సర్వసాధారణంగా మారింది.
3. అటు మోడీ ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వినాశకర ఫలితాలకు దారితీసే చట్టాలను తీసుకొచ్చాయి. ఉదా: అపారమైన త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో శ్రామిక వర్గం హక్కులను కాలరాసే "లేబర్ కోడ్స్"ను మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. భూ సేకరణ - పునరావాస చట్టం -2013, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం వంటి ప్రగతిశీల చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రపూరిత విధానాలను అమలు చేస్తూనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని అంశం మొదలుకొని అనేక ప్రజా వ్యతిరేక చట్టాలును చేసింది. వాటిలో పలు చట్టాలు న్యాయ సమీక్షలో రద్దు లేదా ఉపసంహరణతో కాలగర్భంలో కలిసిపోయాయి.
4. తాజాగా, ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదట 2019 జూలై 29న శాసనసభ, శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టి, అదే రోజు ఆమోదింపచేయించుకున్నది. అటుపై దాన్ని ఉపసంహరించుకొని, మళ్ళీ 2020 డిసెంబరు 2న బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి, అటుపై మళ్ళీ ఉపసంహరించుకొన్నది. ఈ ఉపసంహరణలకు కారణం బహుశా కేంద్ర ప్రభుత్వం ఏమైనా సవరణలు సూచించిందేమో! 2022 సెప్టెంబరు 21న మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టి, అదే రోజు ఆమోదంపొందారు. దాన్ని గవర్నర్ అక్టోబరు 22న రాష్ట్రపతి ఆమోదానికి పంపితే 2023 సెప్టెంబరు 29న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
5. ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం -2023ను అధికారికంగా అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో ప్రచురించారు. అక్టోబరు 31 నుండి అమలులోకి తీసుకోస్తూ ప్రభుత్వం జీ.ఓ.నెం.512ను నవంబరు 1న జారీ చేసింది. చట్టంలోని సెక్షన్ 3కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ భూమి సాధికార సంస్థ (లాండ్ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ డిసెంబరు 29న జీ.ఓ.నెం.630ని జారీ చేసింది.
6. చట్టంలో పేర్కొన్న మేరకు ఛీప్ సెక్రటరీ/స్పెషల్ ఛీప్ సెక్రటరీ/ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారిని చైర్ పర్సన్ గాను, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారిని కమిషనర్ గాను నియమిస్తుంది. రోజు వారి నిర్వహణ బాధ్యతలు కమిషనరుపైనే ఉంటుంది. వారితో పాటు మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. సెక్షన్ 28(సి) ప్రకారం చైర్ పర్సన్ ను తొలగించే అధికారాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొన్నది. అంటే, స్వయం ప్రతిపత్తిలేని సంస్థ ఆంధ్రప్రదేశ్ భూమి సాధికార సంస్థ.
7. "టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(టిఆర్ఓ)"ను ఆంధ్రప్రదేశ్ భూమి సాధికార సంస్థ ఎవరినైనా వారి పేరు లేదా అధికారి హోదా ప్రస్తావనతో ఒక నోటిఫికేషన్ ద్వారా నియమిస్తుందట. పౌరుల భూమి - స్థిరాస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారాలన్నింటిపై ఆ టిఆర్ఓ సర్వాధికారి.
8. టిఆర్ఓ తన పరిధిలోకి వచ్చే స్థిరాస్తుల సమాచారాన్ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖల నుండి మరియు పాస్ పుస్తకాల ఆధారంగా సేకరించుకొని, క్రోడీకరించి, ముసాయిదా జాబితాను తయారు చేసి, బహిరంగ నోటిఫికేషన్ జారీ చేస్తారట. అందులో పొరపాట్లు, లోపాలుంటే హక్కుదారులు రెండు సం.ల లోపు అభ్యంతరాలు తెలియజేసుకోవచ్చట. ఒకవేళ చేసుకోకపోతే అపైన అవకాశం ఉండదట. తద్వారా వారికున్న హక్కును కోల్పోతారట.
9. వివాదరహితమైన స్థిరాస్తులను ఒక రిజిస్టరులోను, వివాదాలున్న స్థిరాస్తులను మరొక రిజిస్టరులోను, ఆరోపణలు మరియు ఒప్పందాలున్న ఆస్తుల వివరాలను ఇంకొక రిజిస్టరులోను టిఆర్ఓ నమోదు చేస్తారట. టిఆర్ఓ స్థాయిలో పరిష్కారంకాని వివాదాలను "లాండ్ టైట్లింగ్ అప్పెలెట్ ఆఫీసర్(ఎల్.టి.ఏ.ఓ.)" కు అప్పగిస్తారట. వివాదాల నమోదు రిజిస్టరులో చేర్చినట్లైతే సదరు భూమి - స్థిరాస్తికి సంబంధించి ఎలాంటి లావాదేవీలకు చట్టం అనుమతించదు.
10. "లాండ్ టైట్లింగ్ అప్పెలెట్ ఆఫీసర్ (ఎల్.టి.ఏ.ఓ.)"గా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి (ఉద్యోగంలో ఉన్న లేదా విశ్రాంతి అధికారి)ని రాష్ట్ర అథారిటీ నియమిస్తుందట. చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ అప్పీలేట్ అధికారి "సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908" ద్వారా నిర్దేశించబడిన విధానానికి కట్టుబడి ఉండకుండా, సహజ న్యాయాన్ని కొలబద్ధగా పెట్టుకొని తీర్పులు చెప్పాలని మార్గనిర్దేశం చేయబడింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిబంధన.
11. ఎల్.టి.ఏ.ఓ. ఇచ్చే తీర్పులపై హైకోర్టులో మాత్రమే సమీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చట. సెంటు మొదలుకొని రెండెకరాల లోపు భూమి, పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న నివాస గృహాలున్న పేద, మధ్యతరగతి ప్రజలే ఎనభై తొంభై శాతం వుంటారు. న్యాయం కూడా ఖరీదైన అంగడి సరుకుగా మారిన నేటి సమాజంలో న్యాయం కోసం ఎంత మంది హైకోర్టును ఆశ్రయించగలరు. అది కూడా టిఆర్ఓ నుండి సర్టిఫికేట్ తీసుకొన్న మీదటే దరఖాస్తు చేసుకోవాలట. హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినా టిఆర్ఓ దగ్గర 15 రోజుల్లో లేదా ఆపైన వారం రోజుల్లో అపరాధ రుసుం చెల్లించి నమోదు చేసుకొంటేనే అమల్లోకి వస్తుందట!
12. ఈ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం భూమి మరియు స్థిరాస్తుల వివాదాలను సివిల్ కోర్టుల అధికార పరిధి నుండి తొలగిస్తున్నట్లు విస్పష్టంగా పేర్కొనబడింది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ల్యాండ్ టైట్లింగ్ అప్పెలెట్ అధికారి మాత్రమే ఈ చట్టం పరిధిలో తీర్పులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టారు.
13. ఆంధ్రప్రదేశ్ భూమి సాధికార సంస్థ తన కార్యకలాపాల నిర్వహణ కోసం చట్టంలోని సెక్షన్ 30(2) ప్రకారం ప్రభుత్వం అందజేసే ఆర్థిక తోడ్పాటుతో పాటు ఏదైనా సంస్థ నుండి ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో, విరాళాలు, బహుమతులను స్వీకరించవచ్చని విస్పష్టంగా పేర్కొనబడింది. దీని అర్థమేంటో! పర్యవసానాలు ఎలా ఉంటాయో! ఇది నిజమైన హక్కుదారుల ఆస్తి హక్కును కాలరాయదా! కార్పోరేట్ మరియు బడా సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల ఆక్రమణదారులు, భూ మాఫియా ముఠాలు మాత్రమే విరాళాలు, బహుమతుల రూపంలో లంచాలిచ్చి, అవినీతి - అక్రమాలకు పాల్పడి, తమకు అనుకూలమైన తీర్పులను పొందడానికి ఈ నిబంధనను దుర్వినియోగం చేయడానికి అవకాశం కల్పించదా! అక్రమాలను చట్టబద్ధం చేసుకోవడానికి మాత్రమే ఈ నిబంధనను చట్టంలో పొందుపరిచారా! పౌరుల భూమి - స్థిరాస్తి హక్కులను పరిరక్షించాల్సిన ఆంధ్రప్రదేశ్ భూమి సాధికార సంస్థ స్వయం ప్రతిపత్తితో, రాజ్యాంగం - చట్టాలకు లోబడి, నిష్పాక్షికంగా విధులు నిర్వహించడానికి ప్రభుత్వమే వార్షిక బడ్జెట్ నుండి నిధులను కేటాయించాలి కదా!
14. రాష్ట్రంలో పట్టా భూములతో పాటు దేవాదాయ భూములు, భూదాన భూములు, ఇనాం భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ పరంబోకు భూములు, చెరువులు - కుంటలు - వాగులు - వంకలు - చిట్టడవులు, తదితర భూములు లక్షలాది ఎకరాలు ఉన్నాయి. విస్తారమైన భూముల్లో నిక్షిప్తమైన అమూల్యమైన ఖనిజ సంపద ఉన్నది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాన్ని అత్యంత లోపభూయిష్టంగా అమలు చేశారు. భూ హక్కు పత్రాల్లో (పాస్ బుక్స్) తప్పులు మరియు భూ రక్ష సర్వే రాళ్లు నాటడం, వాటిపై ముఖ్యమంత్రి ఫోటో, పేరు ముద్రించడం తీవ్ర అభ్యంతరకరం, అత్యంత గర్హనీయం.
15. ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం-2023, భూమి మరియు స్థిరాస్తి ఉన్న వారి హక్కుకు ప్రమాదపు ఘంటికలు మ్రోగించడమే కాదు, ప్రజలందరి ఉమ్మడి ఆస్తిగా ఉన్న భూములు, సహజ వనరులు మాఫియాల పరం కాకుండా పరిరక్షించుకోవాలంటే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, ప్రజలు ఈ సమస్యపై దృష్టి సారించాలి.
టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక