ఆంధ్ర జ్యోతి దినపత్రిక july 27,2011
- టి. లక్ష్మీనారాయణ
ఒకనాడు పాలెగాళ్ళ రాజ్యంలో మగ్గిపోయిన రాయలసీమ మళ్ళీ ఆ దుస్థితికి నెట్టబడుతుందా అన్న ఆందోళనతో ప్రజాతంత్రవాదులు, సామాన్య ప్రజలు మనోవేదనకు గురౌతున్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బి.జె.పి. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెబుతుంటే, అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మేం వ్యతిరేకం కాదని పునరుద్ఘాటిస్తున్నది. చిన్న రాష్ట్రాలయితే విప్లవాల ద్వారా అధికారంలోకి రావడం సులభమని కొందరు, డాక్టర్ అంబేద్కర్‌ను అడ్డంపెట్టుకొని మరికొందరు సమర్ధిస్తున్నారు.
అవకాశవాదం, సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నవారూ, ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న వారూ కూడా చిన్న రాష్ట్రాలను బలపరుస్తున్నారు. నేడు దేశంలో అమలులో ఉన్న ప్రజాస్వామ్యం పరిపూర్ణమైనది కాదు. దోపిడీ వ్యవస్థను పరిరక్షించే బాధ్యతను తలకెత్తుకున్న రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్నది. ఈ వ్యవస్థకు సహజంగానే అనేక పరిమితులున్నాయి. అయినప్పటికీ, మానవ హక్కులు, ప్రజాతంత్ర హక్కుల సాధన, వెనుకబాటుతనం నుంచి కొంతైనా విముక్తి కావడానికి, ప్రజా ఉద్యమాల ద్వారా సమగ్రాభివృద్ధి వైపు ప్రయాణించడానికి ఈ వ్యవస్థలో అవకాశం ఉందని అత్యధిక ప్రజలు భావిస్తున్నారు.
రాష్ట్ర విభజనపై చర్చోపచర్చలు, ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. అభివృద్ధి, వెనుకబాటుతనం అంశాలపైన వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. గడచిన ఐదు దశాబ్దాలలో రాష్ట్రం అంచలంచలుగా అభివృద్ధి చెంది, దేశంలో నాలుగో (జి.డి.పి.లో) స్థానానికి ఎగబాకిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ వెనుకబడి పోయిందనే వాదాన్ని కొందరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చారిత్రకంగా పరిశీలిస్తే అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రాయలసీమ అత్యంత వెనుకబడి ఉన్నది. గడచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేసుకొంటూ వచ్చి ఈ దశకు చేరుకొన్నది.
పెట్టుబడిదారీ వ్యవస్థకున్న సహజ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి గమనం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1965-75 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.యల్., బి.హెచ్.ఇ.యల్., ఐ.డి.పి.యల్., హెచ్.యం.టి., మిధాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో బి.హెచ్.పి.వి., జెన్‌కో లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రయివేటు రంగంలోనూ నెలకొల్పడంతో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది.
ఈ భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా హైదరాబాద్, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలుగా పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి. మిగిలిన ప్రాంతాలలోని మరే నగరం గానీ, పట్టణం గానీ గడచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో లబ్దిపొందలేదు. పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు ఏ ఒక్క ప్రభుత్వమూ కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగానే, హైదరాబాద్ కేంద్రంగానే అత్యధికంగా అభివృద్ధంతా కేంద్రీకరించబడిందన్న అంశం వివాదరహితం. ఆ మేరకు సంఘటిత, అసఘటిత రంగాలలో ఉపాధి అవకాశాలు కూడా ఉన్నంతలో ఇక్కడే లభిస్తున్నాయి. ఈ అభివృద్ధి ఫలాల నుంచి రాష్ట్ర ఖజనాకు అత్యధికంగా ఆదాయం ఒనగూడుతున్నది. ఇది కాదనలేని సత్యం. ఎవరి రాజకీయావసరాలు వారికి ఉండవచ్చు. కానీ, వాస్తవాలను వక్రీకరించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
భౌతికంగా కంటి ముందున్న అభివృద్ధి కూడా కనబడకపోవడం దృష్టిలోపమో! లేదా చూడనిరాకరిస్తున్నారా! లేదా అడ్డగోలుగా వాదించాలని వాదిస్తున్నారో! అర్థం కావడం లేదు. వెనుకబాటుతనాన్నే ప్రాతిపదికగా తీసుకొంటే ప్రప్రథమంగా 'ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని' ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. వెనుకబాటుతనంతో పాటు పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా సమర్థించే వారు లేకపోలేదు. కానీ అది ఏ మాత్రం వాంఛనీయం కాదు. అదే జరిగితే ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతుంది. ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతం మనుగడే ప్రశ్నార్థకమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాగునీటికి, తాగునీటికి శాశ్వత కరువు తప్పదు. తాగడానికే నీళ్ళు లేనిచోట పారిశ్రామికాభివృద్ధి కలలోని మా ట. ఇది ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.
భవిష్యత్ పరిణామాలను అనుభవాల ఆధారంగా ఊహించు కొంటున్న వారు, మన బతుకేదో మనం బతికేద్దాం! అన్న నిరాశావాదంతో మాట్లాడే వారూ లేకపోలేదు. కారణం, భాషా ప్రాతిపదికపై తెలుగు జాతి మొత్తం ఒకే పాలనా గొడుగు కిందికి రావాలనే ప్రగాఢమైన వాంఛ మేరకు తొలి అడుగుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి 'ఆంధ్ర రాష్ట్రం' ఏర్పడింది. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా కర్నూలులో రాష్ట్ర రాజధానిని నెలకొల్పారు.
తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో హైదరాబాద్ రాజధాని నగరమై, తద్వారా ఒనగూడిన సానుకూలాంశాలను సద్వినియోగం చేసుకొని, బాగా అభివృద్ధి చెందిన 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు వెళ్ళగొడితే, మళ్ళీ సీమాంధ్రకు రాజధానిగా ఏ కోస్తా నగరానికో తరలి వెళ్ళి అక్కడ అభివృద్ధి చెందాక మరికొంత కాలానికి వాళ్ళు తన్ని వెళ్ళగొట్టరనే దానికి రాయలసీమవాసులకు గ్యారెంటీ ఏమిటి! 'మా ప్రాంత అభివృద్ధి ఫలాలను తామే అనుభవించాలనే' దుర్బుద్ధికి అంతం ఉండదు కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కేంద్ర బిందువుగా జరుగుతున్న అభివృద్ధి కనీసం కొంత వూరట కల్పించవచ్చునేమో! కానీ రాయలసీమ ప్రజలకు అలాంటి ఆశాకిరణమే కనిపించడం లేదు. పెద్ద మనుషులు చేసుకొన్న 'శ్రీబాగ్' ఒడంబడిక'లో పొందుపరచిన మేరకు కృష్ణా నదీ జలాల పంపిణీలో ప్రథమ వాటా కల్పిస్తామన్న మాట బుట్టదాఖలు చేయబడింది. బళ్ళారితో పాటు తుంగభద్ర నీటిని కోల్పోయారు. ఉన్న రాష్ట్ర రాజధానినీ వదులుకొన్నారు.
తెలుగు జాతి సమైక్యత కోసం వెనకాముందు ఆలోచించకుండా అన్ని త్యాగాలు చేసిన రాయలసీమ నేడు దిక్కుతోచని స్థితిలో పడింది. మహా నగరంగా ఎదిగిన హైదరాబాదు, తెలుగు జాతికి గర్వకారణమైన రాష్ట్ర రాజధాని. మన రాజధాని నగరం అనే భావనతో రాష్ట్ర నలమూలల నుంచి, కుగ్రామాల నుంచి కూడా చదువుకున్న వారు, నిరక్షరాస్యులు ఉపాధి కోసం, ఉన్నత విద్యావకాశాల కోసం వచ్చారు. అభివృద్ధి ఇక్కడే! అవకాశాలు ఇక్కడే! అయినప్పుడు ఈ పరిణామం సహజం.
ప్రపంచీకరణలో భాగంగా సరిహద్దులు లేని మార్కెట్ కోసం మార్కెట్ శక్తులు పరుగులు తీసినట్లే, ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో మనుగడ సాగిద్దామని యువత, శ్రామికులు పరుగు పందెంలో ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి తమ శక్తి యుక్తులను వినియోగిస్తున్న వారిని బతకడానికి వలస వచ్చిన వారని ద్వితీయ శ్రేణిపౌరులుగా చూస్తూ, నోటికొచ్చినట్లు దుర్భాషలాడడం లాంటి కుసంస్కారుల ప్రవర్తనలతో మనోవేదన చెందుతున్నారు. వాక్ స్వాతంత్య్రానికి, ప్రజాతంత్ర హక్కులకు, మానవ హక్కులకు, పౌరుల హుందాతనానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు.
ఈ అన్ని అంశాలపై రాజకీయ వ్యవస్థ నిజాయితీతో అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయాన్ని అందించడానికి బాధ్యతతో ఆలోచించాలా? లేదా? దేశవ్యాప్తంగా అనివార్యంగా ప్రభావం కల్పించే ఒక సంక్లిష్టమైన, జఠిలమైన, అత్యంత సున్నితమైన సమస్యను ఎదుర్కొన్నప్పుడు అన్ని ప్రాంతాలకు వర్తించేలా జాతీయ విధానాన్ని రూపొందించుకోవడం జాతీయ రాజకీయ పార్టీలకు విధ్యుక్త ధర్మం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధానాన్ని అనుసరించడం తగునా? ఇలాంటి ప్రశ్నలకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆ నిజాయితీ రాజకీయ నాయకత్వంలో కొరవడింది కాబట్టే రాజకీయాల పట్ల ప్రజానీకంలో విశ్వసనీయత ప్రశ్నార్థకమయింది. దేశ విస్తృత ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే గీటురాయిగా విధానాలను రూపొందించి అమలు చేయాలని ప్రజలు కోరుకోవడంలో తప్పు లేదు కదా? ప్రత్యేక తెలంగాణ సమస్యపై వివిధ పార్టీలు అనుసరిస్తున్న వైఖరులు భవిష్యత్తులో చాలా హానికరమైన పరిణామాలకు దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపప్రాంతీయ పార్టీలు తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి సంబంధించిన ఒకానొక సమస్యపై కేంద్రీకరించి దాన్ని సాధించుకోవడానికి అవసరమైన వ్యూహ, ప్రతి వ్యూహాలను రూపొందించుకుంటూ మనుగడ సాగిస్తాయి ఆ సమస్యకు ముగింపు లభించగానే ఈ తరహా పార్టీలు అంతర్దానం అయినా ఆశ్చర్యం లేదు.
విభిన్న జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, సంస్కృతులు, ఆచారాలతో 'భిన్నత్వంలో ఏకత్వం'గా జీవిస్తున్నాము. అనేక అంశాలతో పాటు జాతీయ పార్టీల వైఫల్యం కారణంగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. సమకాలీన రాజకీయాలలో వాటి పాత్రను విస్మరించలేం. విస్తృత ప్రయోజనాల పట్ల ప్రాంతీయ పార్టీలు కూడా తమకున్న బాధ్యతను విస్మరించజాలవు. కానీ జాతీయ పార్టీలు విశాల దృక్పథంతో, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా విధానాలను రూపొందించుకొని, అమలు చేయకపోతే దేశం మొత్తానికి హాని జరుగుతుంది.