sakshi 12th july 2011
చమురు కంపెనీలు నష్టాలలో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా మన దేశంలో చమురు ధరలను సర్దుబాటు చేసుకోకపోతే చమురు సరఫరాలో ఇబ్బంది ఏర్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నది. ప్రజలతో వ్యాపారం, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు. ఇదీ! ప్రభుత్వ దుష్టనీతి. జపించే మంత్రం మాత్రం ‘సంక్షేమ రాజ్యం’. చమురు ఉత్పత్తుల మార్కెట్‌పై నియంత్రణ కొనసాగించడం ద్వారా, ప్రత్యామ్నాయ ఇందన వనరులను అభివృద్ధి చేసి స్వయం పోషకత్వం సాధించడం ద్వారా సామాన్య ప్రజల ఇంధన కష్టాలను కొంతమేరనైనా తగ్గించడానికి కేంద్రం వెనువెంటనే పూనుకోకుంటే యూపీఏ-2 సర్కారుకు ఆయుక్షీణం తప్పదు.
పెట్రోల్ ధరలపై నియంత్రణను తొలగించిన విధంగానే డీజిల్ ధరలపై కూడా నియంత్రణను ఎత్తివేసి స్వేచ్ఛా మార్కెట్‌కు అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వంపై తాజాగా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నది. దీనికి ప్రభుత్వం తలొగ్గితే, ధరల పెరుగుదలతో ఇప్పటికే బతుకు పోరు చేస్తున్న పేద, మధ్య తరగతి ప్రజానీకానికి జీవనం పెను భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం తీరుతెన్నులను గమనిస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనిపిస్తున్నది.
[Image]
చమురు కంపెనీలు నష్టాలలో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకనుగుణంగా మన దేశంలో చమురు ధరలను సర్దుబాటు చేసుకోకపోతే చమురు సరఫరాలో ఇబ్బంది ఏర్పడవచ్చని కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. లేదా నమ్మబలుకుతున్నది. ఇందులో ఉన్న వాస్తవమెంత? అన్నదే అసలు సమస్య. నెల క్రితం పెట్రోల్, ఇప్పుడు డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచడం నిజంగా ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చడానికా? లేదా అధిక లాభాలను ఆర్జించిపెట్టటానికా? అన్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చమురు కంపెనీల ఆదాయ, వ్యయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు పెట్రోలియం రంగం నుండి సమకూరుతున్న ఆదాయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో నివేదికను రూపొందించి ప్రజల ముందుంచాలి. అప్పుడు అంకెల గారడీ, కనికట్టు మాయాజాలంతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారో లేదో బహిర్గతమవుతుంది.
దేశ ముడి చమురు అవసరాలలో 84 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను పెంచక తప్పడం లేదని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కి 110 డాలర్లు అంటే రూ.4,950. బ్యారెల్ అంటే దాదాపు 160 లీటర్లు. దాని ప్రకారం లీటరుకు (4,950/160 30.94) దాదాపు రూ.31లు పడుతుంది. చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ అమ్ముతున్న ధర రూ.71ల పైన ఉన్నది. దీన్ని బట్టి రూ.40లు (56 శాతంపైగా) అదనంగా వినియోగదారుడిపై భారం మోపుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగాన్ని అత్యంత ప్రధానమైన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, చమురు అభివృద్ధి పన్ను, రహదారుల పన్ను, విద్య పన్ను, చమురు కంపెనీలు ఆర్జించిన లాభాలపై ఆదాయపు పన్ను, అలాగే రాయల్టీ ద్వారా 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.71,767 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్ను (వ్యాట్) విధించి ఖజానాలను నింపుకొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చమురు ఉత్పత్తుల ధరలను పెంచినప్పుడల్లా మన రాష్ట్ర ప్రభుత్వానికి మహదానందం కలుగుతుంది. కారణం, పెట్రోల్‌పై దేశంలోకెల్లా అత్యధికంగా మన రాష్ట్రంలో 33 శాతం, అలాగే డీజిల్‌పై 22.5 శాతం, కిరోసిన్‌పై 4 శాతం, వంటగ్యాస్‌పై 4 శాతం అమ్మకం పన్నును విధించడం ద్వారా చెవులు పిండి ఖజానాను నింపుకొంటున్నారు.
దారిద్య్రరేఖ దిగువన ఉన్న వారికి నామమాత్రంగా కొంత మొత్తాన్ని సబ్సిడీగా నగదు బదిలీ పథకం ద్వారా అందించి, పెట్రోల్ లాగా వంట గ్యాస్ పైన ఉన్న నియంత్రణను కూడా తొలగించి రూ.750లకు పెంచాలనే దురాలో చనలో ఉన్నది కేంద్రం. తద్వారా చమురు రంగంలో సబ్సిడీల విధానానికి చరమగీతం పాడాలని భావిస్తున్నది. అలాగే, చమురు రంగంలో పనిచేస్తున్న కార్మికుల, ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున కుదించి, వేతనాలపై పెడుతున్న ఖర్చును తగ్గించుకొంటున్నారు. 2009, ఏప్రిల్ 1 నాటికి 1,38,973 మంది ఉంటే 2010, ఏప్రిల్ 1 నాటికి 1,29,988కి తగ్గించడం ద్వారా ఉన్న కార్మికులపై పని భారం పెంచారు.
కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ఆర్జించిన సొమ్మెంతో వెల్లడించలేదు. ఉదాహరణకు 2006-07 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.23,320 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. ఈ రంగం నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్జించిన మొత్తం రూ.6,51,000 కోట్లు అని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వమే 2009-10లో రూ.71,767 కోట్లు వివిధ పన్నుల ద్వారా ఆర్జించి, కేవలం రూ.14,954 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. దీన్ని బట్టి ఇస్తున్న సబ్సిడీల మొత్తంతో, ప్రభుత్వాలు ఆర్జిస్తున్న మొత్తమెంతో తేటతేల్లమవుతున్నది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఎలాంటి పన్నులను విధించకుండా లీటర్ పెట్రోల్‌ను కేవలం రూ.28లకే ప్రైవేట్ విమానయాన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రజలతో లాభార్జనతో కూడిన వ్యాపారం, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు. ఇదీ! ప్రభుత్వ దుష్టనీతి. జపించే మంత్రం మాత్రం ‘సంక్షేమ రాజ్యం’.
ముడి చమురుపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించి, 5 శాతం కస్టమ్స్ డ్యూటీని తొలగించడంతో పాటు పెట్రోల్, డీజిల్‌లపై ఉన్న 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.26,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, డీజిల్‌పై లీటర్‌కు రూ.4.60 పైసల చొప్పున ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని రూ.2లకు తగ్గించడంతో రూ.23,000 కోట్లు, మొత్తం రూ.49,000 కోట్ల ఆదాయాన్ని త్యాగం చేసినప్పటికీ ఇంకా రూ.1,22,000 కోట్లు చమురు కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చింది.
ఇది పచ్చి అబద్ధం. ఇవి నష్టాలు కావు. చమురు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా కట్టుకొన్న ఆదాయంలో తరుగుదల (అండర్ రికవరీ) మాత్రమే. ఈ తరహా అండర్ రివకరీ మొత్తం 2009-10లో రూ.34,391 కోట్లుగా కిరోసిన్, వంటగ్యాస్ పద్దు కింద ఉన్నాయని మాత్రమే అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2006-07 నుండి 2009-10 మధ్య నాలుగు సంవత్సరాల కాలంలో చమురు కంపెనీలు రూ.1,26,000 కోట్ల లాభాలను ఆర్జించాయని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ మాజీ మంత్రివర్యులు మురళీ దేవరా స్వయంగా ఒకానొక సందర్భంలో ప్రకటించారు. 2009-10లో ఆదాయపు పన్ను చెల్లింపు తరువాత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రూ.37,319 కోట్లు నికరలాభాలను ఆర్జించాయని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖ నివేదిక ద్వారా వెల్లడవుతున్నది. ఇవి ప్రబల నిదర్శనాలు.
‘నందిని పందిని, పందిని నందిని చేసినట్లు’ అన్న సామెతగా కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ మ్రాతం గతంలో పోగుబడ్డ రూ.1,80,000 కోట్లకు తోడు 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే రూ.78,000 కోట్ల మేర చమురు కంపెనీలు నష్టపోయాయన్న దగాకోరు ప్రకటన చేశారు.
మన దేశ వినియోగావసరాలలో 25 నుండి 30 శాతం వరకు కృష్ణా - గోదావరి బేసిన్, ముంబై, అసోం, గుజరాత్, చెన్నై తదితర ప్రాంతాలలో చమురు ఉత్పత్తి జరుగుతున్నది. దానికి కూడా అంతర్జాతీయ చమురు ధరలకు సమానంగా ధరలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఒకవైపున దేశీయంగా చమురు అవసరాలు పెరుగుతూ, తీవ్ర ఒత్తిడి ఉన్న పూర్వరంగం లోనే మన దేశం నుంచి రూ.1,44,037 కోట్ల విలువ చేసే 50,974 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ చమురు కంపెనీలకు లెసైన్సులు మంజూరు చేసి, అధిక లాభాలు గడించుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది.
నేడు సహజవాయువు అందరూ కోరుకొనే సహజసిద్ధమైన ప్రాధాన్యతా ఇంధనంగా అవతరించింది. సహజవాయువు ఇంధన భద్రతను కూడా పెంచు తుంది. ఇది చౌక ధరకు లభించే ప్రత్యామ్నాయ ఇంధనం. కాలుష్యరహితం. నేడు దేశ ఇంధనావసరాలలో 10 శాతం మాత్రమే సహజవాయువు తీర్చగలుగు తున్నది. దాదాపు 25 శాతం ఉన్న ప్రపంచ సరాసరి వినియోగానికి మన దేశం చాలా దూరంలో ఉన్నది. మన దేశంలోనూ పుష్కలంగా సహజవాయువు నిక్షేపాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బహిర్గతం చేసిన నివేదిక నుంచి గుణపాఠాలు నేర్చుకొని, రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా దోచిపెట్టే విధానాలకు స్వస్తి చెప్పి, సహజవాయువు నిక్షేపాలను ప్రణాళికాబద్దంగా వెలికితీసి, ప్రజా ప్రయోజ నాలే గీటురాయిగా, సక్రమంగా వినియోగించుకొనే రాజకీయ సంకల్పాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తే దేశ ఇంధన అవసరాలు గణనీయంగా తీరుతాయన డంలో ఎలాంటి సందేహం లేదు.
మన రాష్ట్రంలో దాదాపు ఒక కోటి ఇరవై ఏడున్నర లక్షల ఎల్‌పీజీ వినియోగదారులున్నారు. ఎల్‌పీజీకి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎల్‌పీజీ స్థానంలో పీఎన్‌జీ (పైప్ నేచురల్ గ్యాస్)ని వీలైనంత ఎక్కువగా వినియోగంలోకి తీసుకురాగలిగితే, చౌకగా వంట గ్యాస్‌ను వినియోగదారులకు అందించడమే కాకుండా ప్రభుత్వంపై సబ్సిడీల భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
అంతర్జాతీయ మార్కెట్‌ను తన చెప్పుచేతల్లో పెట్టుకొని, ఘరానా దోపిడీకి, అన్ని రకాల పెత్తనానికి బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదానికి కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చు. 2009-10 సంవత్సరంలో 15.93 కోట్ల టన్నుల ముడి చమురు, 1.47 కోట్ల చమురు ఉత్పత్తుల దిగుమతుల కోసం రూ.4,18,475 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాం. దాంట్లో కొంతైనా ఆదా చేసుకోవచ్చును. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడం ద్వారా చమురు రంగంలో ఒక మేర స్వయం పోషకత్వాన్ని సాధించే అవకాశమూ ఉంది.
ఇలాంటి చర్యలపైన దృష్టి సారించడానికి బదులు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలను, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.45,000 కోట్లు సమకూర్చుకోవాలని నిర్దేశించుకొన్న వ్యూహంలో భాగంగానే చమురు కంపెనీలను మంచి లాభాలు గడిస్తున్న సంస్థలుగా చూపెట్టి అంగడిలో అమ్మకానికి పెడుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్‌లే ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తున్నాయి.
సరళీకృత ఆర్థిక విధానాలే ఈ దుష్పరిణామాలకు మూలం. చమురు ఉత్పత్తుల మార్కెట్‌పై నియంత్రణ కొనసాగించడం ద్వారా, ప్రత్యామ్నాయ ఇందన వనరులను అభివృద్ధి చేసి స్వయం పోషకత్వం సాధించడం ద్వారా సామాన్య ప్రజల ఇంధన కష్టాలను కొంతమేరనైనా తగ్గించడానికి కేంద్రం వెనువెంటనే పూనుకోకుంటే యూపీఏ-2 సర్కారుకు ఆయుక్షీణం తప్పదు.
No comments:
Post a Comment