Wednesday, August 24, 2011

అవినీతిపై అన్నా ఉధ్యమం!

సూర్య తెలుగు దినపత్రిక

వెర్రితలలు వేస్తున్న ఆందోళన
రాజకీయం వద్దనడం కూడా రాజకీయమే!
ప్రభుత్వ లోక్‌పాల్‌ ముసాయిదా కంటితుడుపు చర్యే
ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలి
అవినీతి నిర్మూలనకు పటిష్ఠ వ్యవస్థ నెలకొల్పాలి


అవినీతిపై యుద్ధాన్ని సమర్ధించనివారు ఎవరు ఉంటారు? అన్నా హజారే నాయకత్వంలో సాగుతున్న ఉద్యమాన్ని స్థూలంగా అందరూ బలపరుస్తున్నారు. అవినీతి పరులు కూడా తాము ఇతరుల అవినీతి వల్ల నష్టపోయినప్పుడు ఉక్రోషంతో ఊగిపోతారు. అలాంటివారూ ఈ ఆందోళనలో ముందు వరుసలో ఉన్నారు. అసలు సమస్య- ఆ ఉద్యమ లక్ష్యం, లక్షణాలపై విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. జన్‌లోక్‌పాల్‌ సాధన పేరిట జరుగుతున్న ఆందోళన వెర్రితలలు వేస్తున్నదని చెప్పక తప్పదు.

కారణాలు: 1. ఈ ఉద్యమాన్ని రెండవ స్వాతంత్య్రోద్యమంగా అభివర్ణించడం. వలస దోపిడీ పాలనకు వ్యతిరేకంగా యావత్‌ జాతి అపార త్యాగాలతో పునీతమైన ఆ విముక్తి పోరాటంతో ఈ ఉద్యమాన్ని పోల్చడం హాస్యాస్పదం. సంపూర్ణ విప్లవం నినాదంతో జయప్రకాష్‌ నారాయణ్‌ 1970ల్లో నిర్వహించిన ఉద్యమం అంతిమంగా ఎటు ప్రయాణించిందో విదితమే. 2. హజారేను మహాత్మా గాంధీతో పోల్చడం, లాల్‌బహదూర్‌ శాస్రి రూపంలో ఉన్నారని ప్రచారం చేయడం దుస్సాహసం.

3. ‘అన్నానే ఇండియా, ఇండియానే అన్నా’ అని బృందగానం చేస్తూ వ్యక్తి ఆరాధనను పెంచే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. 4. అవినీతి- సంపన్నులు మొదలుకొని నిరుపేదలవరకూ అందరినీ వేధిస్తున్న సమస్య కాబట్టి రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఉద్యమాన్ని నడపాలని భావించడం సరైన దృక్పథమే. కానీ విరాజకీయాలతో (నాన్‌ పొలిటికల్‌) ఉద్యమించాలనే ఆలోచన సరైనది కాదు. రాజకీయాలపట్ల ఏహ్యభావాన్ని పెంచడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను అంటరానివిగా చూడడం, వాటితో సంబంధం లేనివారే ఉద్యమంలో పాల్గొనడానికి అర్హులని పేర్కొనడం కూడా ఒక రాజకీయమే, లేదా అవగాహనా రాహిత్యం అవుతుంది.

6. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చట్టసభలు ఆయువు పట్టు. అవి ప్రజలచేత ఎన్నికై, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అత్యున్నత వేదికలు. ప్రజావ్యతిరేక పాలన సాగించినా, అవినీతికి పాల్పడినా అటువంటి ప్రజా ప్రతినిధులను తదుపరి ఎన్నికల్లో ఓటు హక్కుతో శిక్షించే తిరుగులేని అధికారం ప్రజలకు ఉన్నది. కానీ కొంత మంది వ్యక్తులతో ప్రభుత్వం నియమించే ‘జన్‌ లోక్‌పాల్‌’ వంటి సంస్థకు పార్లమెంట్‌, అత్యున్నత న్యాయ వ్యవస్థపై పెత్తనం సాగించే సర్వాధికారాలను కట్టబెట్టాలనడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. రాజ్యాంగ బద్ధమైన అన్ని వ్యవస్థలను స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా పకడ్బందీ చట్టాలను రూపొందించాలి గాని ఒకే సంస్థకు సర్వాధికారాలు అప్పగించడం అత్యంత ప్రమాదకరం.

ప్రస్తుత వ్యవస్థలో అవినీతి రహిత రంగమేదో గుర్తించడం కష్టం. అలాంటి అవినీతిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్‌పాల్‌ బిల్లు కోరలు లేనిదే! అలా అని జన్‌లోక్‌పాల్‌ సర్వరోగ నివారిణి కాదన్నది వివాద రహితం. స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జిలు) ప్రధాన భూమిక పోషిస్తున్న ఈ ఆందోళనను మధ్యతరగతి ప్రజానీకం, ఆదర్శవంతమైన వ్యవస్థకోసం తపించే యువజన, విద్యార్థి లోకం, సాంకేతికంగా విజ్ఞానవంతులైన ఐటీ ఉద్యోగులు, ఓటు హక్కు వినియోగించుకోవాలనే ధ్యాసే లేని మధ్యతరగతి, సంపన్న వర్గాలు, సినీ రంగం మొదలు కార్పొరేట్‌ సంస్థల వారివరకూ అందరూ బలపరుస్తున్నారు.

సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, మహిళలు ప్రత్యక్షంగా పాల్గొని, తమ దైనందిన, మౌలిక సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాలను ఏమాత్రం పట్టించుకోని కార్పొరేట్‌ ప్రసార మాధ్యమాలు హజారే ఉద్యమాన్ని మాత్రం భుజాలకెత్తుకున్నాయి. దీనిని బట్టి ఈ ఆందోళన వెనుక ప్రతిబింబిస్తున్న వర్గస్వభావాన్ని పసిగట్టవచ్చు. అన్నా బృందం, ఆయన అనుచరులు చేస్తున్న ‘భారత్‌ మాతాకీ జై’ వంటి నినాదాలు ఉద్యమ దిశను చెప్పకనే చెబుతున్నాయి. అంతమాత్రాన జన్‌లోక్‌పాల్‌ చట్టం కోసం నిబద్ధతతో సాగుతున్న ఆందోళనను తక్కువ చేసి చూడడం తగదు. కేవలం ఈ ఉద్యమంలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపడం ద్వారా భ్రమల్లో తేలిపోకుండా వాస్తవ దృక్పథాన్ని కల్పించుకోవాలన్నదే అభిలాష!

అభివృద్ధికి అవరోధంగా తయారైన అవినీతిని తుదముట్టించాలనే వాంఛ సామాన్య ప్రజానీకంలో ఉన్నది. ఈ నేపథ్యంలో జన్‌లోక్‌పాల్‌ చట్టం కోసం సాగుతున్న ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి వీధుల్లో కదం తొక్కుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన చట్ట సభలు, కార్యనిర్వాహణ యంత్రాంగం, న్యాయ వ్యవస్థల పనితీరును, విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. అయితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మరో మెరుగైన ప్రత్యామ్నాయం మన ముందు ప్రస్తుతం లేదు. అవినీతికి మూలాలు నేటి వ్యవస్థలోనే ఉన్నాయనడంలో సందేహం లేదు.

రాజకీయాలంటేనే ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడింది. సామాజిక మార్పుకోసం చిత్తశుద్ధితో తపన పడే ప్రజలు, యువత రాజకీయాలకు దూరంగా జరిగిపోతున్నారు. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కాకుండా అవినీతి అంతం అసాధ్యం. రాజకీయ పార్టీల ఘోర వైఫల్యం కారణంగానే పౌర సమాజం అవినీతిపై కన్నెర్రజేసింది. ఒక విధంగా ఇది శుభ పరిణామం. ఫలితంగా, లోపభూయిష్టంగా తయారైన రాజకీయ వ్యవస్థను సంస్కరించగలగాలి. అంతేగాని, పౌర సమాజం పేరిట కొంత మంది వ్యక్తులో లేదా స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఆవిర్భవించలేవు.

కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వం పార్లమెంట్‌కు ప్రతిపాదించిన లోక్‌పాల్‌ బిల్లు స్థానే జన్‌లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజరే నేతృత్వంలో సాగుతున్న ఉద్యమానికి విస్తృతమైన అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ ఉద్యమం అవినీతి సమస్యతో బాటు, పౌరులు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే రాజ్యాంగబద్ధమైన హక్కును పాలకులు కాలరాస్తున్నారనే అంశాన్ని కూడా బలంగా ముందుకు తెచ్చింది. పాలకపార్టీ నాయకత్వం కుడితిలో పడ్డ ఎలుక లాగ తనను తాను సమర్ధించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నది. ప్రతిపక్ష పార్టీలు సహజంగానే అందివచ్చిన అవకాశాన్ని సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి రంగ ప్రవేశం చేశాయి.

మన ఆర్ధిక వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు అన్ని రంగాలకూ విస్తరించి ప్రజాస్వామ్య పాలనను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయి. చట్టబద్ధ దోపిడీని మన రాజ్యాంగమే అనుమతిస్తున్నది. చట్టం కళ్ళుగప్పి అడ్డదారిలో చేస్తున్న అక్రమ సంపాదనే అవినీతి సొమ్ము. చట్టప్రకారం అవినీతి నేరం. అయితే, ఆ చట్టం ముసుగులోనే భారీ ఆర్ధిక కుంభకోణాలకు రాజకీయ నాయకులు, అధికార గణం, పెట్టుబడిదారులు అపవిత్ర కూటమిగా ఏర్పడి జాతి సంపదను, ప్రజాధనాన్ని పీల్చివేస్తున్నారు. నేటి ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ, సరళీకృత ఆర్ధిక విధానాలు ‘గుడినీ, గుడిలో లింగాన్నీ మింగే’ అవినీతి సామ్రాట్టులను తయారు చేశాయి.

ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన రూ. 1,76, 000 కోట్ల ఆదాయానికి 2-జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం ద్వారా గండికొట్టిన మాజీ కేంద్రమంతి ఎ. రాజా, న్యాయస్థానం కొరడా ఝుళిపించడంతో నేడు తీహర్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. మరో పాత్రధారిణి, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా కటకటాల పాలైనారు. కాని ఈ భారీ కుంభకోణంతో లబ్ధి పొందిన టాటా, అనిల్‌ అంబానీ, ఆదిత్య బిర్లాల తోబాటు భూయా వడాఫోన్‌, ఎస్సార్‌, సునీల్‌ మిట్టల్‌, దూత్‌ కంపెనీ వగైరా కార్పొరేట్‌ సంస్థల అధిపతులు తప్పించుకు తిరుగుతున్నారు. దొరికితేనే దొంగ, దొరకకపోతే దొర అన్న నానుడిగా పరిస్థితి తయారైంది. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వారి గుప్పెటలోనే ఉన్నదనడానికి ఇంతకంటె నిదర్శనం ఏమికావాలి?

ట్వెంటీ ట్వెంటీ క్రికెట్‌ కుభకోణంతో మాజీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశిథరూర్‌ పదవీచ్యుతుడైనారు. కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణంలో ఎంపీ సురేష్‌ కల్మాడి జైలుపాలయ్యారు. ఇవన్నీ తాజా అవినీతి ఉదంతాలు. ఒకనాడు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, రెండేళ్ళ క్రితం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమ అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి సంతలో పశువుల్ని కొన్న రీతిలో ఎంపీలను కొన్న ఉదంతాలలో ప్రధాన మంత్రులపైనే వేలెత్తి చూపే హీనస్థితి ఏర్పడింది. కడకు పార్లమెంట్‌లో ప్రశ్నలడగడానికి బీజేపీ ఎంపీలు లంచాలు పుచ్చుకున్న హేయమైన ఘటన వంటి అనైతిక, అవినీతి కార్యకలాపాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పార్లమెంట్‌ విశ్వసనీయత ప్రశ్నార్ధకమయింది. పార్లమెంట్‌ ప్రతిష్ఠ క్రమేపీ పతనమవుతూ వస్తున్నది.

స్వాతంత్య్రానంతర కాలంలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న త్యాగధనులు, ప్రజాసేవకులు చట్టసభలకు ఎన్నికయ్యారు. అనంతరం గుత్తపెట్టుబడిదారులు, భూస్వాములు, పెత్తందారుల ప్రతినిధులే అత్యధికంగా చట్టసభలను ఆక్రమించారు. అటుపై తమ పనులను చక్కబెట్టుకోవడానికి పారిశ్రామిక, వ్యాపార వేత్తలే నేరుగా చట్ట సభల్లో ప్రవేశించారు. ఆ తర్వాత బూర్జువా రాజకీయ పార్టీలకు కండబలంగా మాత్రమే ఉపయోగపడుతూ, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే రౌడీలు, గూండాలు, నేరస్థులు నేరుగా చట్టసభలను అలంకరిస్తున్నారు. సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి వంటి సమస్యలపై పాలక, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో లాలూచీ కుస్తీ చేస్తున్నాయనే భావన ప్రజల్లో సర్వత్రా నెలకొన్నది.

మొత్తంమీద రాజకీయ వ్యవస్థే ఆత్మరక్షణలో పడి సమాధానం చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అవినీతి వ్యవస్థీకృతం కావడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నది అధికార గణంలో కీలక పాత్రధారులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. పవిత్ర న్యాయవ్యవస్థను అవినీతి చెదలు ఆవరించాయి. నేర పరిశోధనా శాఖలైన సీబీఐ, ఏసీబీల పనితీరు జుగుప్సాకరం. ప్రసార మాధ్యమాల సమాచారాన్ని బట్టి దాదాపు 2,300 కేసులు దశాబ్దాలుగా, వేయి కేసులు 15 సంవత్సరాలుగా, 380 కేసులు రెండు దశాబ్దాలుగా సీబీఐ విచారణలోనే మగ్గిపోతున్నాయి. పాలక పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించే స్థాయికి ఈ సంస్థ దిగజారిందనే సద్విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి.

సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే 2-జి శ్కామ్‌ విచారణకు కూడా అదే గతి పట్టేదని ప్రజలుభావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదించిన జన్‌లోక్‌పాల్‌ చట్టాన్ని సత్వరం తీసుకురావాలని, ఆర్ధిక నేరాలపై కేసులనమోదు, నేర పరిశోధన, పర్యవేక్షణ, శిక్షించేఅధికారం అన్నింటినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని అన్నా హజారే నేతృత్వంలోని ఉద్యమ కారుల బృందం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. ప్రధానమంత్రిని, న్యాయ వ్యవస్థను, సీబీఐ తదితర సంస్థలను జన్‌లోక్‌పాల్‌ చట్టం పరిధిలోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు హాస్యాస్పదంగా ఉన్నది. రాజకీయ సంకల్పంతో అవినీతిని తుదముట్టించే చట్టాన్ని రూపొందించాలని ప్రజలు కోరుతుంటే కంటితుడుపు చర్యగా నాసిరకం చట్టాన్ని తేవడానికి పూనుకున్నది.

ఈ పరిస్థితుల్లో కొన్ని చర్యలు అనివార్యం. అవి: 1. జవాబుదారీ తనంతో వ్యవహరించాల్సిన పార్లమెంట్‌ హుందాతనాన్ని, ఆధిపత్యాన్ని పరిరక్షించాలి. 2. చట్టం ముందు అందరూ సమానులే అనే మాటను ఆచరణలోకి తేవడానికి న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. 3. సీబీఐ వంటి నేర పరిశోధనా సంస్థలు స్వయం ప్రతిపత్తితో చట్టానికి మాత్రమే లోబడి సంపూర్ణమైన స్వేచ్ఛతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. 4. కాగ్‌ నివేదికలపై చట్ట సభల్లో చర్చలు జరిపి నిర్దిష్టమైన చర్యలు అమలు చేయాలి. 5. అవినీతి అంతానికి జన్‌లోక్‌పాల్‌ చట్టంతో బాటు అన్ని రాష్ట్రాలలో అదే తరహా లోకాయుక్తలను ఏర్పాటు చేయాలి.

స్థానిక సంస్థలను కూడా వాటి పరిధిలో చేర్చాలి. 6. ఎన్నికల్లో డబ్బు పాత్రను నిరోధించడానికి ఇంద్రజిత్‌ గుప్తా పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదికను అమలు చేయాలి. దామాషా ఎన్నికల విధానాన్ని అమలు చేయాలి. నేరచరితుల్ని ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి. విఫలమైన ప్రజాప్రతినిధుల్ని వెనక్కు రప్పించడానికి రీకాల్‌ హక్కును ఓటర్లకు కల్పించాలి. 7. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలి.

No comments:

Post a Comment