Tuesday, December 27, 2011

రాజకీయ చదరంగంలో " లోక్ పాల్ "

అవినీతిపై ఖడ్గం ఝుళిపించిన అన్నా హజారేకి , గనుల మాఫియా లీడర్ గాలి జనార్థనరెడ్డి అనుచరుడు శ్రీరాములుకు ప్రజలు ఏకకాలంలో జేజేలు పలికారు . " తాను ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు " అన్న" అన్నా హజారే మాట "ను అక్షరాలా నిజం చేస్తూ బళ్ళారి ప్రజలు ఇటీవల శాసన సభా స్థానానికి జరిగిన‌ మధ్యంతర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాములును గెలిపించారు . ఓబుళాపురం ఇనుప ఖనిజం గనులను మింగేశాడన్న సి . బి .ఐ . కేసులో అరెస్టయిన గాలి జనార్ధనరెడ్డి కొన్ని నెలలుగా చంచల్ గూడా జైలులో ఊచలు లెక్కబెడుతూ రోజులు గడుపుతున్నాడు . ఆయన నమ్మిన బంటు శ్రీరాములు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి , మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తే నలబై వేల ఓట్ల ఆధిక్యతతో గెలిపించి , ప్రజలు బ్రహ్మరథం పట్టారని ప్రసారమాధ్యమాలు వార్తలను ప్రసారం చేశాయి . కర్నాటక రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెడుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దరావత్తు కోల్పోయారు . దేశాన్నేలుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకొన్నది . దీన్ని బట్టి " ధనం మాట్లాడుతుంటే సత్యం మౌనం వహిస్తుంది " అన్న నానుడి గుర్తుకురావడం సహజం . చట్టాల కోసం పోరాటాలు చేయడంతో పాటు ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ఇతర అంశాలపై దృష్టి సారించి , ప్రజా చైతన్యానికి , ఎన్నికల సంస్కరణల కోసం ఉద్యమించాల్సిన అవశ్యకతను ఈ ఘటన నొక్కిచెబుతున్నది .

అవినీతిపై ప్రజలు కన్నెర్రజేశారు . అయితే , అవినీతిపరులు భారీ ఆధిక్యతతో ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తూ చట్ట సభల్లోకి రాజఠీవితో అడుగు పెడుతున్నారు . ఏమిటీ వైచిత్య్రం . ప్రజలు అవినీతిని అసహ్యించుకొంటున్నారన్నది ముమ్మాటికీ నిజం . కానీ దొంగ చేతికి తాళమిచ్చినట్టు , అవినీతిపరుల చేతుల్లోనే రాజ్యాధికారాన్ని పెడుతున్నారు . ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు , రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొంటే లంచగొండులని ముద్ర వేయడానికి అధారాలు కనిపిస్తాయి . ఈ వ్యవహారంలో లంచం ఇచ్చేవాడు బాధితుడు , తీసుకొనే వాడు లబ్ధిదారుడు . కల్తీ మద్యం లేదా యం . ఆర్ . పి . కంటే ఎక్కువ ధరకు మద్యాన్నిఅమ్మి డబ్బు సంపాదిస్తే అక్రమార్జన సొమ్మని తెలిసిపోతుంది . ప్రజాకర్షణ పథకాల అమలులో అధికార దుర్వినియోగానికి పాల్పడి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే అందులోని రాజకీయ స్వార్థం ప్రజలకు బోధపడుతుంది .

కానీ , మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా సంస్థల వద్ద వందలు , వేలు , లక్షల కోట్ల రూపాయల‌ విలువజేసే సంపద ఎలా పోగుబడుతున్నదో ! ఏది నీతిగా సంపాదించిన సొమ్మో ! ఏది నీతిబాహ్యంగా అవినీతికి పాలడికూడబెట్టుకొన్నారో !సామాన్యులకు అంతు చిక్కని అవినీతి మాయాజాలంగా మిగిలిపోతున్నది . ఇదీ నేడు అమలులో ఉన్న ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక నీతి , లక్షణం . ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్య నిథి సంస్థ , ఆసియా అభివృద్ధి బ్యాంకు , అలాగే బహిరంగ మార్కెట్ నుండి కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనుల ముసుగులో కమీషన్లు , పర్సంటేజీలు , వాటాలు వేసుకొని ప్రజాధనాన్ని మింగేస్తున్నారు . ప్రజల నెత్తిన అప్పుల భారం పెరిగిపోతున్నది . అయినా కోపం రావడం లేదంటే కారణం ఆ సొమ్ము తమ సొమ్ముగా భావించే చైతన్యం ప్రజల్లో కొరవడిందని చెప్పవచ్చు .

అలాగే , సహజవనరులైన‌ భూమి , భూగర్భంలో లభించే ఇనుము , బాక్సట్ , బెరైటీస్ , గ్రానైట్స్ , బొగ్గు , భూ ఉపరితలంపై దొరికే ఇసుక , కృష్ణా _ గోదావరి బేసిన్ లోని స‌ముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న చమురు , సహజవాయు నిల్వలు , సముద్ర తీరంలో లభి‍స్తున్న" బీచ్ శాన్డ్స్ " వగైరా అమూల్యమైన ఖనిజ సంపద దొడ్డిదారిన తరలిపోతున్నది . ప్రభుత్వ రంగంలో సాధించిన శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్ళించి అక్రమార్జనపరుల బొక్కశాలలకు చేరుతున్నాయి . అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు , పరిపాలనా యంత్రాంగంలో కీలక పాత్రదారులైన ఉన్నతాధికారులు , కార్పోరేట్ సంస్థలు మరియు సంపన్న వర్గాలు అపవిత్ర కూటమిగా ఏర్పడి చట్టం కళ్ళుగప్పి జాతి సంపదను కొల్లగొడుతున్నారు . ఈ అవినీతి కుంభకోణాల్లో ఇచ్చేవాడు , పుచ్చుకొనేవాడు ఇద్దరూ లబ్ధిపొందుతున్నవారే . నష్టపోతున్నది దేశ ప్రజలు , కానీ వ్యక్తులుగా ఎవ్వరూ తాము నష్టపోయామన్న భావన కలగడం లేదు . పర్యవసానంగా దోపిడి యదేచ్ఛగా కొనసాగుతున్నది . దేశంలో మిలియనేర్లు , బిలియనేర్లు ( కుబేర్లు ) సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతున్నది . జలగల్లా జాతి సంపదకు కన్నం వేసి దోచుకొంటున్నా ప్రజల‌ ఉమ్మడి ఆస్తి దోపిడీకి గురౌతున్నదనే స్పృహ కొరవడింది . నిరక్ష్యరాస్యులుగా ఉన్న 35 శాతం మంది అమాయక ప్రజలు ఈ ఆర్థిక నీతి లోని మోసాన్ని పసిగట్ట లేక పోవచ్చు , కానీ అక్షరాస్యులైన మధ్య తరగతి ప్రజలు , బుద్ధి జీవులు కూడా ఈ విషయంలో చైతన్యయుతంగా స్పందించడం లేదు . కారణం ప్రత్యక్షంగా తమ సొమ్ముకు చిల్లు పడలేదు కాబట్టి ఈ ఆర్థిక దోపిడి పట్ల నిరాసక్తత చూపెడుతున్నారా ! అనిపిస్తుంది .

లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయల‌ 2 జి స్పెక్ట్రం టెలికం కుంభకోణం , కృష్ణా _ గోదావరి బేసిన్ లోని సజవాయువు నిక్షేపాల రిలయన్స్ కుంభకోణం , ఓబులాపురం ఇనుప ఖనిజాన్ని గనుల మాఫియా లీడర్ గాలి జనార్థనరెడ్డి దొడ్డిలోకి చేర్చిన‌ అక్రమ లీజుల కుంభకోణం , ఎమ్మార్ ప్రాపర్టీస్ భూ కుంభకోణం , విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సట్ నిక్షేపాలు జిందాల్ కంపెనీకి కట్టబెట్టిన వైనం వగైరా వగైరా కుంభకోణాల తాజా చరిత్ర ప్రజల కళ్ళ ముందు సాక్షత్కరిస్తున్నది . ఎలాంటి శసబిష‌లకు తావులేకుండా సి‍. బి . ఐ . విచారణలు వీటిని దృవపరుస్తున్నాయి . అయితే అడ్డంగా దొరికిన వారు మాత్రమే దొంగలుగా ముద్రపడి జైళ్ళలో ఉన్నారు . దొరకని వారు లేదా రాజ్యాధికారం అండ పుష్కలంగా ఉన్న వారు ఘరానా పెద్ద మనుషులుగా సమాజంలో చెలామణి అయిపోతూనే ఉన్నారు . దొంగలుగా దొరికిన వాళ్ళనన్నా సంఘ బహిష్కృతులుగా చూడడానికి బదులు , వారికి ఘన స్వాగతాలు పలికే అనుచరగణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారాలపట్టి కనిమొళి తీహార్ జైలు నుండి బైయిలు పై విడుదలైతేనే ఆమెకు డిల్లీ , మద్రాసు మహానగరాలలో కటౌట్లతో , ప్లెక్సీ బ్యానర్లు , బజాబజంత్రీలు , మంది మార్బలంతో డి . య . కె . పార్టీ నాయకత్వం చేసిన హడావుడి , స్వాగత దృశ్యాలు తిలకించినప్పుడు సభ్య సమాజం తల దించుకొన్నది . స్వాతంత్రోద్యమంలో జైలుకెళ్ళొచ్చిన ఉద్యమకారులకు కూడా అలాంటి గౌరవం లభించిందో ! లేదో ! అనుమానమే . లోపమెక్కడుంది ? వ్యవస్థలోనా ! చట్టాల్లోనా ! ప్రజల చైతన్యంలోనా !

సమాజం మూలుగుల్నిపీల్చిపిప్పి చేస్తున్న అవినీతి చెదలుకు మూలాలెక్కడున్నాయి ? దాని నిర్మూలనకు మందేంటి ? అన్నదే కీలకమైన సమస్య . అవినీతి అంతానికి "చారిత్రాత్మకమైన‌ " లోక్ పాల్ చట్టానికి ఇదిగో ! బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నామని కాంగ్రెస్ నేతృత్వంలోని యు . పి . ఎ . ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోజు పెట్టింది . నిప్పుల కొలిమిలో కర్రును పెట్టి , ఇహ సాన పట్టండన్నట్లు ప్రతిపక్షాలకు సవాలు విసిరింది . ప‌రిపాలనానుభవంలో ఇతరుల కంటే రెండాకులు ఎగమేసిన కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదిత బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఆమోదం పొందకుండా ఉండడానికి వీలుగా అవసరమైన మెలికలు పెట్టి కూర్చున్నది . ఉత్తర‌ ప్రదేశ్ ఎన్నికల్లో లబ్దిపొందాలనే కుచ్చితత్వంతో రిజర్వేషన్ల అంశాన్ని తెలివిగా తెర మీదకు తెచ్చింది . దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఆ వివాదం చాటున లోక్ పాల్ బిల్లు ప్రస్తుత సమావేశాల్లో ఆమోదం పొందకుండానే వాయిదా పడతాయి . ఎన్నికల ప్రకటన వెలువడింది కాబట్టి ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పి చేతులు దులిపేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి .అలాగే కొన్ని అసంబద్దమైన , నిరుపయోగమైన , బలహీనమైన అంశాలను గుదిగుచ్చి బిల్లులో పొందుపరిచారనిపిస్తుంది . తద్వారా వాటిని యధాతదంగా అంగీకరిస్తే బిల్లు చట్టమైనా చట్టుబండగా మిగిలిపోయేలా రూపొందించారు .

మరొకవైపున " తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న" చందంగా తాము ప్రతిపాదించిన జన్ లోక్ పాల్ బిల్లుకు ఎలాంటి సవరణలూ చేయకుండా వెంటనే పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలని మంకుపట్టుతో తమ‌దైన శైలిలో అన్నా హజారే బృందం ఆందోళనకు ఉపక్రమిస్తున్నది . ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి ఆందోళన చేసే హక్కు , స్వేచ్ఛ వారికున్నది . వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన , ప్రశ్నించాల్సిన అవసరం లేదు . సంకుచిత రాజకీయాలను ఆపాదించే కుసంస్కారుల మాటలకు విలువా లేదు . ప్రజా ఉద్యమాలున్నప్పుడే ప్రభుత్వాలలో కొంతైనా చలనం ఉంటుంది . మన‍ం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం . దాన్ని గౌరవించడమే కాదు , పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది . మౌలిక సమస్యల పరిష్కారానికి మెరుగైన , పదునైన శాసనాల ఆవశ్యకత ఉన్నది . వాటి సాధన కోసం ప్రజల భాగస్వామ్యంతో అలుపెరగని ఉద్యమాలు సాగించాల్సిందే . అందులో ఇసుమంతు సందేహం లేదు . సమస్యల్లా ! లోక్ పాల్ చట్టమొక్కటే అవినీతి మహమ్మారిని తుదముట్టించే సర్వరోగ నివారిణి అన్న ఆలోచనే లోపభూయిష్టమైనది .

అవినీతికి మూలాలు ఈ రాజకీయ‌ వ్యవస్థలోనే ఉన్నాయి . రాజకీయ రంగాన్ని , వ్యాపార రంగంగా రూపాంతరం చెందించారు . ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకొన్నా , ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతున్నది . ఎన్నికల్లో ధనప్రభావాన్ని నిరోధించకుండా అవినీతికి కళ్ళెం వేయడం అసాధ్యం . లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థి నలబై ఐదు లక్షల రూపాయలు వరకు ఎన్నికల వ్యయానికి ఎన్నికల కమీషన్ అనుమతించింది . అంటే సంపన్నులు తప్ప సామాన్యులు , పేదవారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదన్న మాట . అందుకే దామాషా ఎన్నికల విధానాన్ని అమలుచేయాలి . విధానాల ప్రాతిపదికపై రాజకీయ పార్టీలకు ఓట్లేసే చైతన్యాన్ని ప్రజలకు కల్పించాలి . ఎన్నికల సంస్కరణలపై అమరజీవి ఇంద్రజిత్ గుప్తా కమిటీ సమర్పించిన నివేదిక పార్లమెంటు లైబ్రరీలో దిగాలుగా పడి ఉన్నది . దాని దుమ్ముదులిపి అమలుకు పూనుకోవాలి .

రాజకీయ వ్యవస్థ అవినీతిమయమైపోయింది కాబట్టి అవినీతిని ఫటాపంచల్ చేయడానికి అన్నాహజారే కంకణబద్దుడైనాడని , ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కార్పోరేట్ ప్రసారమాధ్యమాలు జడివానలా ప్రచారాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాయి . అనూహ్యంగా లభించిన ప్రజాదరణ , ప్రచారంతో ఆయన మునగ చెట్టెక్కి కూర్చొన్నాడు . బృందగానం చేసే వారూ చేస్తూనే ఉన్నారు . వారిలో హేతుబద్దత , విసక్షణ లోపించినట్లు కనపడుతున్నది . లోక్ పాల్ చట్టం ఒక ఆయుధం మాత్రమే . అందువల్ల వీలైనంత పటిష్టవంతమైన చట్టం రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉన్నది . ముసాయిదా బిల్లు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే రీతిలో ఉన్నదన్న సద్వివిమర్శలు వెల్లువెత్తాయి .

1)కేంద్ర నేర పరిశోధనా సంస్థ సి . బి . ఐ . ని లోక్ పాల్ పరిథిలోకి తీసుకురావాలా లేదా అన్న అంశంపై వివాదం నడుస్తున్నది . ఒకటి మాత్రం స్పష్టం . ఇప్పటి వరకు డిల్లీ గద్దెనెక్కిన ప్రతి రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి సి . బి . ఐ . సంస్థను నియంత్రిస్తూ వచ్చాయి . ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు ఆ సంస్థను ఆయుధంగా వాడుకొన్న ఉదంతాలు కోకొల్లలు . పర్యవసానంగా దాని విశ్వసనీయత దెబ్బతిన్నది . సి . బి . ఐ . కి రాజ్యాంగబద్దంగా స్వయంప్రతిపత్తి కల్పించి రాజకీయ జోక్యానికి ఏ మాత్రం తావులేకుండా చేయాలి . ప్రధాన మంత్రి , ప్రతిపక్ష నాయకుడు లేదా నాయకురాలు , సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన చేత నియమించబడిన ప్రతినిథితో కూడిన కమిటీ సి . బి . ఐ . డైరెక్టర్ ను ఎంపిక చేసే విధానాన్నితాజాగా ప్రతిపాదించారు . కానీ , ఆ సంస్థలో పని చేసే ఉద్యోగుల బదిలీలు , పదోన్నతుల అంశాన్ని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ అధీనంలోనే కొనసాగించడం ద్వారా పరిపాలనా నియంత్రణ పగ్గాలను ప్రభుత్వం చేతుల్లోనే అట్టిపెట్టుకొన్నది . అది చాలు పాలక‌ పార్టీ సి . బి . ఐ ని తన కనుసన్నల్లో ఉంచుకోవడానికి . ఈ పెడదోరణులకు స్వస్తి చెప్పి ఎన్నికల సంఘం తరహాలో స్వయంప్రతిపత్తితో పనిచేయడానికి వీలుగా చట్టంలో మార్పు చేయాలి .

2) ఛైర్మన్ తో కలిపి తొమ్మిది మంది సభ్యుల లోక్ పాల్ నియామకానికి ప్రధానమంత్రి , లోక్ సభ స్పీకర్ , ప్రతిపక్ష నాయకుడు లేదా నాయకురాలు , సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన చేత నియమించబడిన ప్రతినిథిలతో కూడిన ఐదు మంది ఎంపిక కమిటీని నెలకొల్పుతారు . వారిలో ఎవరినైనా తొలగించాల్సి వస్తే కనీసం వంద మంది పార్లమెంటు సభ్యుల వ్రాత పూర్వకమైన పిర్యాదు చేస్తేనే సాధ్యమవుతుంది .

3) లోక్ పాల్ తరహాలోనే రాష్ట్రాల్లో లోకాయుక్తలను నెలకొల్పాలి . మనది సమాఖ్య వ్యవస్థ కాబట్టి రాష్ట్రాల మీద బలవంతంగా రుద్ద కూడదనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు . ఇది అసంబద్ధమైన , పసలేని వాదన మాత్రమే .

4) ప్రభుత్వ ఉద్యోగుల్లోని ' ' ఎ ' మరియు ' బి ' గ్రేడ్ వారినే లోక్ పాల్ పరిథిలోకి తీసుకొచ్చారు . ' సి ' మరియు ' డి ' శ్రేణి ఉద్యోగులను కూడా చేర్చాలన్నది అంతసమంజసం కాదు . వీరు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ పరిథిలో ఉన్నారు . సి . వి . సి . సమర్థతను , పని విధానాన్ని మెరుగుపరచే చర్యలను చేపట్టాలని కోరడం హేతుబద్దంగా ఉంటుంది .

5) కొన్ని మినహాయింపులతో ప్రధాన మంత్రిని కూడా లోక్ పాల్ పరిథిలోకి తీసుకురావడం ఆ మేరకు శుభ పరిణామమే .

6) పిర్యాదు లేకుండా లోక్ పాల్ తనకు తానుగా ( సూమోటో ) కేసులను స్వీకరించి , చేపట్ట కూడదనే షరతు లోక్ పాల్ పని విధానానికి ముందరి కాళ్ళ బంధం వేయడమే అవుతుంది . అలాంటి నిబంధనలను తొలగించేలా ప్రతిపక్షాలు వత్తిడి చేయాలి .

7) స్థానిక సంస్థల్లో అవినీతిని అరికట్టే అంశాన్నిపరిగణలోకే తీసుకొన్నట్లు లేదు . లోకాయుక్త పరిథిలోకి స్థానిక సంస్థలను తీసుకురావాలి . తద్వారా ప్రజాజీవితంతో సంబంధం ఉన్న అన్ని రంగాలు , విభాగాలలో ని అవినీతి , అక్రమాలపై యుద్ధం ప్రకటించాలి .

8) జాతి సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ అవినీతి , అక్రమార్జనకు " పుల్ స్టాప్ " పెట్టే ఆలోచ‌నే ప్రభుత్వం చేయ‌లేదు . అవినీతి , అక్రమార్జన సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుకల్పిస్తూ చట్టంలో పొందుపరచాలి .

9) స్వేచ్ఛగా , నిస్పాక్షికంగా , రాగద్వేషాలకు అతీతంగా , పారదర్శికంగా , జవాబుదారీతనంతో అవినీతికి అడ్డుకట్ట వేయడమే ఏకైకలక్ష్యంగా పనిచేసే పటిష్టమైన లోక్ పాల్ కు రాజ్యాంగబద్దత కల్పించాలి.

10) భారత రాజ్యాంగ ముఖ పత్రంపై లిఖించిన జాతి లక్ష్యాల సాధన , పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న మరే ఇతర వ్యవస్థలనూ నిర్వీర్యం చేయడంగానీ , విచ్ఛిన్నం చేయడంగానీ దేశానికి క్షేమం కాదు .

దేశ సరిహద్దులను , భద్రతను కంటికి రెప్పలా పరిరక్షించడానికి ఒకే వ్యవస్థ కాకుండా పదాతిదళం , వాయుసేన , నావికాదళం అని మూడు సైనిక విభాగాలను నెలకొల్పారు . కారణం ఒకే వ్యవస్థ క్రింద ఉంటే అధికారకేంద్రీకరణ పర్యవసానంగా దుష్పరిణామాలకు అవకాశం ఉంటుందని కీడెంచి మేలెంచాలన్న దృక్పథంతో రాజ్యాంగ నిర్ణేతలు భావించి ఉండవచ్చు . అలాగే లోక్ పాల్ ఛత్రం క్రిందికి కీలకమైన ఇతర వ్యవస్థలను తీసుకొచ్చి , అపరిమితమైన అధికారాలను కట్టబెడితే , ఎవరికీ జవాబుదారీ కాని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర హాని జరుగుతుంది .

లోక్‌పాల్‌తో అవినీతి అంతమయ్యేనా?

published in Surya daily on December 28 ,2011

అవినీతిపై ప్రజలు కన్నెర్రజేశారు. అయినా అవినీతిపరులు భారీ ఆధిక్యతతో ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తూ చట్ట సభల్లోకి రాజఠీవితో అడుగు పెడుతున్నారు. ఏమిటీ వైచిత్య్రం! ప్రజలు అవినీతిని అసహ్యించుకొం టున్నా రన్నది ముమ్మాటికీ నిజం. కానీ దొంగ చేతికి తాళమిచ్చినట్టు, అవినీతి పరుల చేతుల్లోనే రాజ్యాధికారాన్ని పెడు తున్నారు. ప్రజా సమ స్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొంటే లంచగొండులని ముద్ర వేయడానికి అధారాలు కనిపిస్తాయి. ఈ వ్యవహారంలో లంచం ఇచ్చేవాడు బాధితుడు, తీసుకొనే వాడు లబ్ధిదారుడు. కల్తీ మద్యం లేదా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తే అక్రమార్జనఅని తెలిసిపోతుంది.


ప్రజాకర్షణ పథకాల అమలులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే అందులోని రాజకీయ స్వార్థం ప్రజలకు బోధపడుతుంది.
కానీ, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా సంస్థల వద్ద వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయల సంపద ఎలా పోగుబడుతున్నదో! ఏది నీతిగా సంపాదించిన సొమ్మో, ఏది నీతి బాహ్యంగా అవినీతికి పాల్పడి కూడబెట్టుకొన్నారో సామాన్యులకు అంతుచిక్కని అవినీతి మాయాజాలంగా మిగిలిపోతున్నది. ఇదీ నేడు అమలులో ఉన్న ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక నీతి, లక్షణం. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అలాగే బహిరంగ మార్కెట్‌ నుండి కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనుల ముసుగులో కమీషన్లు, పర్సంటేజీలు, వాటాలు వేసుకొని ప్రజాధనాన్ని మింగేస్తున్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం పెరిగిపోతున్నది. అయినా కోపం రావడం లేదంటే కారణం ఆ సొమ్ము తమ సొమ్ముగా భావించే చైతన్యం ప్రజల్లో కొరవడిందని చెప్పవచ్చు.

అలాగే, సహజవనరులైన భూమి, భూగర్భంలో లభించే ఇనుము, బాకై్సట్‌, బెరైటీస్‌, గ్రానైట్స్‌, బొగ్గు, భూ ఉపరితలంపై దొరికే ఇసుక, కృష్ణ గోదావరి బేసిన్‌లోని సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న చమురు, సహజవాయు నిల్వలు, సముద్ర తీరంలో లభిస్తున్న బీచ్‌ శాన్డ్‌ వగైరా అమూల్యమైన ఖనిజ సంపద దొడ్డిదారిన తరలిపోతున్నది. ప్రభుత్వ రంగంలో సాధించిన శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్ళించి అక్రమార్జనపరుల బొక్కసాలకు చేరుతున్నాయి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం, ఉన్నతాధికార వర్గాలు, కార్పొరేట్‌ సంస్థలు, సంపన్న వర్గాలు అపవిత్ర కూటమిగా ఏర్పడి చట్టం కళ్ళుగప్పి జాతి సంపదను కొల్లగొడుతున్నాయి. ఈ అవినీతి కుంభకోణాల్లో ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు ఇద్దరూ లబ్ధిపొందుతున్నవారే. నష్టపోతున్నది దేశ ప్రజలు.

కానీ వ్యక్తులుగా ఎవరికీ తాము నష్టపోయామన్న భావన కలగడం లేదు. పర్యవసానంగా దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. దేశంలో మిలియనీర్లు, బిలియనీర్ల సంఖ్య ఏడాది కేడాదికి పెరిగిపోతున్నది. జలగల్లా జాతి సంపదకు కన్నం వేసి దోచుకొంటున్నా ప్రజల ఉమ్మడి ఆస్తి దోపిడీకి గురౌతున్నదనే స్పృహ కొరవడింది. నిరక్ష్యరాస్యులుగా ఉన్న 35 శాతం మంది అమాయక ప్రజలు ఈ ఆర్థిక నీతి లోని మోసాన్ని పసిగట్టలేక పోవచ్చు, కానీ అక్షరాస్యులైన మధ్య తరగతి ప్రజలు, బుద్ధి జీవులు కూడా ఈ విషయంలో చైతన్యయుతంగా స్పందించడం లేదు. కారణం ప్రత్యక్షంగా తమ సొమ్ముకు చిల్లు పడలేదు కాబట్టి ఈ ఆర్థిక దోపిడీ పట్ల నిరాసక్తత చూపెడుతున్నారా అనిపిస్తున్నది.

లక్షా డెబ్బయ్‌ ఆరు వేల కోట్ల రూపాయల 2- జి స్పెక్ట్రమ్‌ టెలికం కుంభకోణం, కృష్ణ గోదావరి బేసిన్‌లోని సజవాయువు నిక్షేపాల రిలయన్స్‌ కుంభకోణం, ఓబులాపురం అక్రమ లీజుల కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ భూ కుంభకోణం, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని బాకై్సట్‌ నిక్షేపాలు జిందాల్‌ కంపెనీకి కట్టబెట్టిన వైనం- వగైరా వగైరా కుంభకోణాల తాజా చరిత్ర ప్రజల కళ్ళ ముందు సాక్షత్కరిస్తున్నది. ఎలాంటి శషభిషలకు తావులేకుండా సీబీఐ విచారణలు వీటిని ధృవప రుస్తున్నాయి. అయితే దొరికిన వారు మాత్రమే దొంగలుగా ముద్రపడి జైళ్ళలో ఉన్నారు. దొరకని వారు- లేదా రాజ్యాధికారం అండ పుష్కలం గా ఉన్న వారు పెద్దమనుషులుగా సమాజంలో చెలామణి అయి పోతూ నేఉన్నారు.

దొంగలుగా దొరికిన వాళ్ళనన్నా సంఘ బహిష్కృతులుగా చూడడానికి బదులు, వారికి ఘనస్వాగతాలు పలికే అనుచరగణాలు పెద్దఎత్తున ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్ళొచ్చిన ఉద్యమ కారులకుకూడా అలాంటి గౌరవం లభించిందో, లేదో అనుమానమే. లోపమెక్కడుంది? వ్యవస్థలోనా,చట్టాల్లోనా, ప్రజల చైతన్యంలోనా?సమాజం మూలుగుల్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి చెదలకు మూలాలెక్కడున్నాయి, దాని నిర్మూలనకు మందేమిటి అన్నదే కీలకమైన సమస్య. అవినీతి అంతానికి చారిత్రాత్మకమైన లోక్‌పాల్‌ చట్టానికి- ఇదిగో, బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నామని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోజు పెట్టింది. నిప్పుల కొలిమిలో కర్రు పెట్టి, ఇహ సానపట్టండన్నట్లు ప్రతిపక్షాలకు సవాలు విసిరింది.

పరిపాలనానుభవంలో ఇతరుల కంటే రెండాకులు ఎగమేసిన కాంగ్రెస్‌ నాయకత్వం ప్రతిపాదిత బిల్లును- ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఆమోదం పొందకుండా ఉండడానికి వీలుగా అవసరమైన మెలికలు పెట్టి కూర్చున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఆలోచనతో రిజర్వేషన్ల అంశాన్ని తెలివిగా తెర మీదకు తెచ్చింది. దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, ఆ వివాదం చాటున- లోక్‌పాల్‌ బిల్లు ప్రస్తుత సమావేశాల్లో ఆమోదం పొందకుండానే వాయిదా పడుతుందా? ఎన్నికల ప్రకటన వెలువడింది కాబట్టి ఓటర్లను ప్రభావితంచేసే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవనిచెప్పి చేతులు దులిపేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కొన్ని అసంబద్ధమైన, నిరుపయోగమైన, బలహీనమైన అంశాలను గుది గుచ్చి బిల్లులో పొందుపరిచారనిి పస్తోంది. తద్వారా వాటిని యథాతథంగా అంగీకరిస్తే- బిల్లు చట్టమైనా చట్టుబండగా మిగిలిపోయేలా రూపొందించారు.

మరొ వైపున- తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న చందంగా, తాము ప్రతిపాదించిన జన్‌ లోక్‌పాల్‌ బిల్లుకు ఎలాంటి సవరణలూ చేయకుండా వెంటనే పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలని మంకుపట్టుతో, తమదైన శైలిలో అన్నా హజారే బృందం ఆందోళనకు ఉపక్రమిస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆందోళన చేసే హక్కు, స్వేచ్ఛ వారికున్నవి. వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సంకుచిత రాజకీయాలను ఆపాదించే కుసంస్కారుల మాటలకు విలువా లేదు. ప్రజా ఉద్యమాలున్నప్పుడే ప్రభుత్వాలలో కొంతైనా చలనం ఉంటుంది. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. దాన్ని గౌరవించడమే కాదు, పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మౌలిక సమస్యల పరిష్కారానికి మెరుగైన, పదునైన శాసనాల ఆవశ్యకత ఉన్నది.

వాటి సాధన కోసం ప్రజల భాగస్వామ్యంతో అలుపెరగని ఉద్యమాలు సాగించాల్సిందే. అందులో ఇసుమంత సందేహం లేదు. సమస్యల్లా- లోక్‌ పాల్‌ చట్ట మొక్కటే అవినీతి మహమ్మారిని తుదముట్టించే సర్వరోగ నివారిణి అన్న ఆలోచనే లోపభూయిష్టమైనది.
అవినీతికి మూలాలు ఈ రాజకీయ వ్యవస్థలోనే ఉన్నాయి. రాజకీయ రంగాన్ని- వ్యాపార రంగంగా రూపాంతరం చెందించారు. ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నా, ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతున్నది. ఎన్నికల్లో ధనప్రభావాన్ని నిరోధించకుండా అవినీతికి కళ్ళెం వేయడం అసాధ్యం. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి నలబైఐదు లక్షల రూపాయల వరకు ఎన్నికల వ్యయం చేయడానికి ఎన్నికల కమీషన్‌ అనుమతించింది. అంటే సంపన్నులు తప్ప సామాన్యులు, పేదవారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదన్న మాట! అందుకే దామాషా ఎన్నికల విధానాన్ని అమలుచేయాలి. విధానాల ప్రాతిపదికపై రాజకీయ పార్టీలకు ఓట్లేసే చైతన్యాన్ని ప్రజలకు కల్పించాలి. ఎన్నికల సంస్కరణలపై ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ నివేదిక పార్లమెంటు లైబ్రరీలో పడిఉన్నది. దాని దుమ్ము దులిపి అమలుకు పూనుకోవాలి.

రాజకీయ వ్యవస్థ అవినీతి మయమైపోయింది కాబట్టి అవినీతిని ఫటాపంచలు చేయడానికి అన్నాహజారే కంకణబద్ధుడైనాడని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కార్పొరేట్‌ ప్రసార మాధ్యమాలు జడివానలా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అనూహ్యంగా లభించిన ప్రజాదరణ, ప్రచారంతో ఆయన మునగ చెట్టెక్కి కూర్చొన్నారు. బృందగానం చేసే వారు చేస్తూనే ఉన్నారు. వారిలో హేతుబద్ధత , విచక్షణ లోపించినట్లు కనపడుతున్నది. లోక్‌ పాల్‌ చట్టం ఒక ఆయుధం మాత్రమే. అందువల్ల వీలైనంత పటిష్ఠవంతమైన చట్టం రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉన్నది. ముసాయిదా బిల్లు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే రీతిలో ఉన్నదన్న సద్వివిమర్శలు వెల్లువెత్తాయి.

దేశ సరిహద్దులను, భద్రతను కంటికి రెప్పలా పరిరక్షించడానికి ఒకే వ్యవస్థ కాకుండా పదాతిదళం, వాయుసేన, నావికాదళం అని మూడు సైనిక విభాగాలను నెలకొల్పారు. కారణం ఒకే వ్యవస్థ కింద ఉంటే అధికారకేంద్రీకరణ పర్యవసానంగా దుష్పరిణామాలకు అవకాశం ఉంటుందని- కీడెంచి మేలెంచాలన్న దృక్పథంతో రాజ్యాంగ నిర్ణేతలు భావించి ఉండవచ్చు. అలాగే లోక్‌పాల్‌ ఛత్రం కిందికి కీలకమైన ఇతర వ్యవస్థలను తీసుకొచ్చి, అపరిమితమైన అధికారాలను కట్టబెడితే, ఎవరికీ జవాబుదారీ కాని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తే- ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర హాని జరుగుతుంది .

Tuesday, December 20, 2011

చౌరస్తాలో రష్యా

published in Surya Telugu daily on 21st December 2011

- పుతిన్‌ పార్టీకి బొటాబొటి ఆధిక్యత
- బలం పుంజుకున్న కమ్యూనిస్టులు
- పాలక పార్టీపట్ల వ్యతిరేకతే కారణం
- తాజా ఎన్నికలపై అక్రమాల ఆరోపణలు
- ఎన్నికల రద్దుకు ఆందోళనలు
- క్షీణించిన వృద్ధి రేటు
- పెరుగుతున్న నిరుద్యోగం

ప్రపంచ గమనాన్ని మార్చి, ప్రగతిశీల శక్తులకు స్ఫూర్తినిచ్చి, విప్లవోద్యమాలకు నూతనోత్సాహాన్ని కల్పిస్తూ వెన్నుదన్నుగా నిలిచిన నాటి యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ (యు.యస్‌.యస్‌.ఆర్‌.) కు గుండెకాయ లాంటి రష్యా నేడు నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి గమ్యమెటని తలపోస్తున్నది. రష్యన్‌ పార్లమెంటు ప్రతినిథుల సభ డ్యూమాకు డిసెంబరు 4 న జరిగిన ఎన్నికలు రిగ్గింగులు, అవకతవకలతో ఒక ప్రహసనంలా జరిగాయని ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఎన్నికల తీరుతెన్నులు, ఫలితాలు, రష్యా భవిష్యత్తుపై ప్రపంచ వ్యాపితంగా ఆసక్తికరమైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రష్యన్‌ ప్రజల ఆశాజ్యోతిగా, ఉక్కుమనిషిగా వారి ఆదరాభిమానాలను చూరగొన్న వ్లదిమిర్‌ పుతిన్‌ ఆధిపత్యాన్ని నేడు అదే ప్రజానీకం వీధుల్లో కొచ్చి సవాలు చేసే రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.

మొన్న జరిగిన ఎన్నికలను రద్దుచేసి అక్రమాలకు తావులేకుండా మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్‌ ఊపందుకొంటున్నది. ఆరోపణలను తిరస్కరిస్తూనే ప్రస్తుత దేశాధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్‌ విచారణకు ఆదేశించారు. మరొక వైపున దేశాధ్యక్షుని ఎన్నికకు రంగం సిద్ధమవుతున్నది. 2012 మార్చిలో జరిగే ఎన్నికల్లో వ్లదిమిర్‌ పుతిన్‌ భవిష్యత్తు తేలనున్నది. ప్రపంచ నేపథ్యం చూస్తే, ద్రవ్యదళారీ విధానాలతో చక్రం తిప్పుతూ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏక ఛత్రాధిపత్యం వహించాలని కలలు కన్న అమెరికా- ఆర్థిక సంక్షోభంలో పడింది. పారిశ్రామిక విప్లవానికి పురుడుపోసిన యూరప్‌ పారిశ్రామిక రంగంలో తలెత్తిన సంక్షోభం వల్ల తాజాగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఆర్తనాదాలు చేస్తున్నది.

ఒకనాడు విముక్తి ఉద్యమాలకు, స్వాతంత్రోద్యమాలకు, విప్లవోద్యమాలకు ఆపన్న హస్తం అందించిన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమై రెండు దశాబ్దాలు గడచిపోయాయి. అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతతో సమ్మిళితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకొంటూ వచ్చిన సోవియట్‌ యూనియన్‌ ప్రపంచ ప్రజల మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్వార్థపర శక్తులు పైచేయి సాధించి, మేడి పండు లాంటి పాశ్చాత్య దేశాల అభివృద్ధిని చూపెట్టి, జాతీయవాదం ముసుగులో తన పంథాను ఎంచుకొన్న రష్యా చతికిలబడింది. ఆంతరంగికంగా ఆర్థికాభివృద్ధిని సాధించడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలోపేతం చేయడంలో, మౌలిక సమస్యల పరిష్కారంలో ఘోరవైఫల్యం చెందింది. పర్యవసానంగా ఆ దేశంలో అరాచక శక్తులు పెట్రేగిపోతున్నాయి. సోషలిజం పంథాను విడనాడి మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వైపు పరుగులు తీస్తే, చివరికిఉనికే ప్రశ్నార్థకమయ్యింది.

మార్క్సిజం లెనినిజం భావజాలానికి ప్రయోగశాలగా భావించిన గడ్డపై రాజకీయ, ఆర్థిక సంస్కరణలు పెట్టుబడికి దాసోహం పలికాయి. ఫలితంగాసామాజిక అసమానతలు, ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆర్థిక గణాంకాలు, ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డ్యూమా ఎన్నికల్లో వాటి ప్రభావం ప్రతిబింబించినట్లు స్పష్టంగా కనపడుతున్నది. రష్యాలో దామాషా ఎన్నికల విధానం అమలులో ఉన్నది. గత ఎన్నికల్లో 64 శాతం ఓట్లు పొందిన పుతిన్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీ, తాజా ఎన్నికల్లో 49.32 శాతం ఓట్లు మాత్రమే పొందింది. తద్వారా డ్యూమాలోని మొత్తం 450 స్థానాల్లో గతంలో ఉన్న 315 నుండి 238కి దిగజారి, బొటాబొటి ఆధిక్యత సాధించింది. రాజ్యాంగ సవరణలు చేయాలంటే ప్రతిపక్షాల సహకారం అనివార్యం. 2008లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డ్మిట్రీ మెద్వెదేవ్‌ 71.25 శాతం ఓట్లు పొంది రికార్డు సృష్టించారు. ఆ చరిత్ర తిరగబడింది. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగితే 31 శాతానికి మించి పుతిన్‌ పార్టీకి రాకపోవచ్చని ఎన్నికలకు ముందు నిర్వహించిన కొన్ని సర్వేలు వెల్లడించాయి.

కమ్యూనిస్టు పార్టీకి 11.57 శాతం నుంచి 19.19 శాతానికి ఓట్లు పెరగడంతో 48 నుంచి 92 స్థానాలకు ఎగబాకి బలమైన ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. పుతిన్‌ పార్టీ యునైటెడ్‌ రష్యా పార్టీకి తప్ప మరెవరికైనా ఓటెయ్యండి అన్న నినాదం బాగా ప్రభావం చూపినట్లుంది. కాబట్టే కమ్యూనిస్టు పార్టీతో పాటు ఎ జస్ట్‌ రష్యా పార్టీ తన బలాన్ని 6.74 శాతం నుండి 13.24 శాతానికి పెంచుకొని 64 (26), లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ 8.14 శాతం నుండి 11.67 శాతానికి పెరిగి 56 (40) స్థానాలు సంపాదించుకొన్నాయి. కనీసం ఐదు శాతం ఓట్లురాని పార్టీలకు డ్యూమాలో ప్రాతినిథ్యం లభించదు. కానీ అలాంటి చిన్నాచితకా పార్టీలకు కూడా ఓట్ల శాతం పెరిగింది. పాలక పార్టీకి వ్యతిరేక ఓట్లుగానే వాటిని పరిగణించాలి తప్ప ప్రతిపక్షాలకు పడ్డ సానుకూల ఓట్లుగా చూడడం సరైనది కాకపోవచ్చు. మొత్తం 10,92,37,780 ఓట్లలో అసలు పోలింగే 60 శాతం. దీన్నిబట్టి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది.

అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెన్నడి జ్యుగనోవ్‌ ఉండబోతున్నారని, ఎ జస్ట్‌ రష్యా పార్టీ నాయకుడు సెర్గెయ్‌ మిరొనొవ్‌, లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత వ్లదిమిర్‌ జిరినోవ్‌స్కీలు పోటీలో ఉంటారని భావిస్తున్నారు. వీరు 2008 ఎన్నికల్లో యునైటెడ్‌ రష్యా పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్‌ పై పోటీ చేసి పరాజయం పొందినవారే. గడచిన రెండు దశాబ్దాల కాలంలో మధ్య తరగతి, సంపన్న వర్గం, కుబేరులు ఆవిర్భవించారు . పోర్బ్‌‌స పత్రిక సమాచారం మేరకు పద్దెనిమిది బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. లక్ష కోట్లు) సంపదతో రష్యాలోని కుబేరుల్లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన, అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుడైన మిఖాయిల్‌ ప్రొఖొరోవ్‌ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

ప్రజల్లో పలుకుబడి పెద్దగా లేకపోయినా ధన బలంతో మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకట్టుకొని రాజ్యాధికారాన్ని చేబట్టాలని ప్రొఖొరోవ్‌ ప్రయత్నిస్తున్నట్లుంది. డ్యూమాలో ప్రాతినిథ్యంలేని పార్టీల ప్రతినిథులు, స్వతంత్ర అభ్యర్థులు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే రష్యన్‌ రాజ్యాంగం మేరకు ముందుగా ఇరవై లక్షలమంది ఓటర్ల సంతకాలను దేశవ్యాపితంగా సేకరించి ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. అవి సక్రమంగా ఉన్నాయని కమిషన్‌ నిర్ధారిస్తేనే పోటీకి అర్హత లభిస్తుంది. మధ్య తరగతి ప్రజల ప్రయోజనాల పరిరక్షకుడుగా అవతారమెత్తిన ప్రొఖరోవ్‌ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు రష్యాలో చోటు చేసుకొంటు న్నాయి.మెద్వదేవ్‌తో తాను కుదుర్చుకొన్న పదవుల మార్పిడి ఒప్పందాన్ని పుతిన్‌ సెప్టెంబర్‌లో బహిరంగంగా వెల్లడించారు.

అప్పటినుంచి పుతిన్‌ పలుకుబడి పతనం కావడం మొదలయ్యిందని అంటున్నారు. దాని పర్యవసానమే డ్యూమా ఎన్నికల్లో యునైటెడ్ష్య్రా పార్టీకి గణనీయంగా ఓట్లశాతం దిగజారి, సీట్లు తగ్గిపో యాయనే ప్రచారాన్ని పశ్చిమ దేశాల ప్రసారమాధ్యమాలు ముందుకు తెచ్చాయి. వాస్తవానికి ప్రజలలోని మార్పుకు ఆ దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలే ప్రధాన కారణమనిపిస్తుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ 9.6 శాతం ద్రవ్యోల్బణంతో ఒడిదుడుకుల నెదుర్కొంటు న్నది. ఆర్థిక వృద్ధి రేటు చైనాలో 9.8శాతం, మన దేశంలో 7 శాతం ఉంటే, రష్యాలో 4 శాతం మాత్రమే. వ్యవసాయ వృద్ధి రేటు -12 శాతంగా ఉన్నది. రష్యా వార్షిక ఆదాయం పెరుగుదల, తరుగుదల- అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఆధారపడి ఉన్నది. కారణం చమురు, సహజవాయువు వంటి ఇంధన వనరుల ఎగుమతిపై ప్రధానంగా ఆధారపడి రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మను గడ సాగిస్తున్నది.

అంటే ముడి చమురు ధరలు పెరిగితే రష్యాకు ఆదాయం పెరుగుతుంది, మనలాంటి చమురు దిగుమతి దేశాలకు చిలుమూడుతుంది. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నది. 2007లో ఉపాథికల్పన వృద్ధి రేటు 0.03 శాతం ఉంటే, 6.1శాతం ఉన్న నిరుద్యోగ వృద్ధి రేటు 2011 జనవరికి 7.6 శాతానికి పెరిగింది. ఇది మాస్కోలో 1.4 శాతం ఉంటే ఇంగుసేటిన్‌ ప్రాంతంలో అత్యధికంగా 47.5శాతంగా ఉంది. మాస్కోకు సుదూరంగా ఉన్న ప్రాంతాలన్నిటి లోనూ కొద్దిగా అటూ ఇటూ ఉదే పరిస్థితి. కోటీ ఎనబై లక్షల మంది అంటే 12.7 శాతం జనాభా పేదరికంలో మగ్గిపోతున్నారు. ఆహార్రదవ్యోల్బణం 17.6 శాతా నికి పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు మన దేశంలో లాగే ఆకాశాన్నంటు తున్నాయి. ఉదా: గోధుమల ధర 120 శాతం, బంగాళా దుంపల ధర 104 శాతం పెరిగాయి. పర్యవసానంగా ఆర్థిక అసమానతలూ పెరిగాయి.

నాటి సోవియట్‌ యూనియన్‌లో నాణ్యమైన విద్య, ఉపాథి, ఆహారం, ఆరోగ్యం, నివాసం వగైరా పౌరులందరూ ప్రాథమిక హక్కుగా పొందేవారు. 1981-90 మధ్య మాస్కో మహానగరానికి నాలుగైదు దఫాలు, సోవియట్‌ యూనియన్‌లోని రెండు మూడు ఇతర ప్రాంతాలలో పర్యటనకు వెళ్ళిన సందర్భాలలో, అంతర్జాతీయ విద్యార్థి యువజన మహాసభలు, వేదికల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, కాంసొమోల్‌ (యువజన సంఘం), స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యు.యస్‌.యస్‌.ఆర్‌. నాయకత్వాలతో సంభాషణల సందర్భంలో- ఆ దేశ విద్యా వ్యవస్థ, ఉపాథి రంగం, యువత బహుముఖ రంగాలలో- అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నాడు ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలపై అధ్యయనం చేసే సదవకాశం లభించింది. ఉన్నత విద్య వరకు విద్యార్థులందరికీ ఉపకారవేతనాలిచ్చి ఉచిత విద్యనందించేవారు. రష్యన్‌ విద్యార్థులకే కాదు, దౌత్యసంబంధాలలో భాగంగా, సౌహార్ద సంబంధాలలో అంతర్భాగంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల తరపున పంపిన- వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న మన లాంటి దేశాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను ఉచితంగా అందించారు.

సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం గడచిన రెండు దశాబ్దాలుగా ఆర్థిక సంస్కరణలలో భాగంగా అమలు చేస్తున్న మార్కెట్‌ ఆర్థిక విధానాల మూలంగా ఇవన్నీ అంగడి సరుకులుగా మారిపోయాయి. సంస్థాగత సంస్కరణల పేరిట విద్య, ఆరోగ్య రంగాలకు నిథుల కేటాయింపు తగ్గించారు. విద్యార్థులకిచ్చేఉపకార వేతనాల్లో కోతపెట్టారు. వేతన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను కుదించే పనిని స్థానిక పరిపానా సంస్థలకు అప్పగించారు. పెన్షన్‌ పథకానికీ నిథుల్లో కోత పెట్టారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే, డ్యూమా ఎన్నికలలో పుతిన్‌, మెద్వదేవ్‌ల నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రజలు ఎందుకు చేదు ఫలితాల రుచి చూపించారో అర్థం అవుతుంది.

ఈ నేపథ్యంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎన్నికల అనంతరం గత గురువారం రష్యా ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ జాతీయభావాలు, స్వతంత్ర విదేశాంగవిధానం గురించి నొక్కివక్కాణించడం, అమెరికా పెత్తందారీ పోకడలపై ధ్వజమెత్తడం ద్వారా దేశ ప్రజలను మళ్ళీ తన వైపు తిప్పుకొనే ప్రయత్నంలో పడ్డట్టు కనపడుతున్నది. ఎన్నికల చెల్లుబాటును ప్రశ్నిస్తూ హిల్లరీ క్లింటన్‌ చేసిన విమర్శలను తిప్పికొడుతూ, రష్యాను అస్థిరపరచాలనే దురుద్దేశంతో అమెరికా పథకం ప్రకారం ప్రతిపక్షాలకు నిథులను అందజేస్తున్నదని విమర్శించారు. వీటన్నింటినీ గమనిస్తే డ్యూమా ఎన్ని కల ఫలితాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించి మార్చిలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధిపొందాలనే పనిలో పుతిన్‌ పడ్డట్లు గోచరిస్తున్నది.

Friday, December 16, 2011

సిబాల్‌ ఎందుకు శివాలెత్తారు ?

published in Surya Telugu daily on December 16,2011

ప్రపంచీకరణలో భాగంగా ఉన్నత విద్యా రంగంతో పాటు అన్ని వ్య వస్థలనూ అంతర్జాతీయ వ్యవస్థలతో అను సంధానిం చాలని, విదేశీ సంస్థలకు, పెట్టుబ డులకు తలుపులు బార్లా తెరవాలని ఉబలాట పడుతున్న కేంద్ర సమాచార, సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖామాత్యులు కపిల్‌ సిబాల్‌ సామాజిక మాధ్యమంపై మాత్రం ఆంక్షలను అమలు చేయాలని డిమాండ్‌ చేయడంలో మతలబు ఏమి టి? భావ ప్రకటనా స్వేచ్ఛపై అప్రకటిత నిషేధాన్ని విధించే ఆలోచనతో ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ చట్టాన్ని రూపొందించే పనిలో ఒకవైపు ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. ఈ నేపథ్యంలోనే సామాజిక అనుసంధాన వేదికల (సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌- ఎస్సెన్నెస్‌) పై కపిల్‌ సిబాల్‌ విరుచు కుపడ్డారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఒక వార్త యాహూ వెబ్‌ సైట్‌లో పెట్టారని కత్తిగట్టారు. తమ నాయకురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ శ్రేణులు భావి ప్రధానిగా కొనియాడుతున్న రాహుల్‌ గాంధీలకు వ్యతిరేకంగా ప్రచారం జరగకుండా నిలవరించడం కోసమే ఇదంతా అని కొందరు భావిస్తున్నారు.

ప్రసార మాధ్యమాలు, ప్రత్యేకించి ఇంటర్నెట్‌ ద్వారా జరుగుతున్న సమాచార ప్రవాహంలో అంతర్భాగంగా పాశ్చాత్య సంస్కృతి, అశ్లీల సాహిత్యం యువతను పక్కదోవ పట్టిస్తున్నదనే నిరసన భావం ప్రజానీకంలో వ్యక్తమవుతున్న మాట వాస్తవం. దాన్ని ఆసరాగా చేసుకొని సామాజిక మాధ్యమంపై వివాదాన్ని రగల్చడం ద్వారా ప్రజల దృష్టిని మళ్ళించి, అప్రతిష్ఠపాలైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపశమనం పొందాలనే దూ(దు)రాలోచన కపిల్‌ సిబాల్‌ బుర్రలో మెదినట్లున్నది. ఆమోదయోగ్యం కాని, మత ఘర్షణలకు దారితీసే ద్వేషపూరిత ప్రసంగాలను, విద్వేషాన్ని రెచ్చగొట్టే దృశ్యాలను, అశ్లీల రచనలను, చిత్రాలను, తిట్లు, బెదిరింపులు, వేధింపులు, దైవ దూషణ, అపఖ్యాతిపాలు చేసే, చట్ట వ్యతిరేకమైన వాటిని నిషేధించాలని అంతర్జాతీయ ఇంటర్నెట్‌ నిర్వాహక సంస్థలను డిమాండ్‌ చేస్తే, అవి నిర్ద్వందంగా తిరస్కరించాయని, ఆ వైఖరి ఆమోదయోగ్యం కాదని సిబాల్‌ వ్యాఖ్యానించారు. యాహూ, గూగుల్‌, ఫేస్‌ బుక్‌, మైక్రోసాప్ట్‌ తదితర సంస్థలతో చర్చించి తగు నిర్ణయం తీసుకొంటామని హెచ్చరించారు.

మన చట్టాలను ఉల్లంఘించి విదేశీ గడ్డపై నుండి ఇలాంటి రెచ్చగొట్టే సమాచారాన్ని ఇంటర్నెట్‌ లోకి చొప్పిస్తున్నారనీ, ఏ దేశ సరిహద్దుల్లో సమాచారాన్ని ఇంటర్నెట్‌ లో చొప్పిస్తున్నారో ఆ దేశ చట్టాలకు లోబడి- పశ్చిమ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని నెట్‌లో పెడుతున్నారు కానీ, ఆ వ్యక్తుల పేర్లను ఇవ్వడానికి ఇంటర్నెట్‌ సంస్థలు నిరాకరించాయని కూడా సిబాల్‌ సెలవిచ్చారు. అంటే మనమెంత కాకిగోల పెట్టినా ప్రయోజనం లేదని తేలిపోయాక కూడా, ఏం ఆశించి ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నారు?
భావితరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విద్యా విధానాన్ని అమలు చేయాలని ప్రగతిశీల శక్తులు ఉద్యమాలు చేస్తున్నా పెడచెవిన పెట్టి, పాశ్చాత్య సంస్కృతికి మన యువతరాన్ని బానిసలుగా చేసే సంస్కరణలను విద్యారంగంలో అమలు చేస్తూ- సామాజిక అనుసంధాన వేదికల్లో దర్శనమిస్తున్న అవాంఛనీయ సమాచారం, చిత్రాలపై గుడ్లురిమితే లాభమేమిటి?

అమూల్యమైన దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార అలవాట్లు, పర మత సహనం, సహజీవనం, లౌకిక భావాలు, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న జాతి ఔన్నత్యాన్ని బోధించే సామాజికశాస్త్రాల బోధనకు కాలం చెల్లిందని తీర్మానించిందెవరు? పబ్‌ కల్చర్‌ను ప్రోత్సహించిందెవరు? విద్యావిధానంలో శాస్ర్తీయమైన, మౌలికమైన మార్పులుచేసి ఏ దుర్లక్షణాల ఊబిలో యువతరం కూరుకుపోయిందని గుండెలు బాదుకొంటు న్నామో, దానికి పరిష్కారం కనుగొనాలి.సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌ విశ్వ వ్యాపితంగా విస్తరించి ఉన్నాయి. వాటిని మన దేశీయ చట్టాల చక్రబంధంలో ఇరికించ లేమని కపిల్‌ సిబాల్‌ చేతులెత్తేశారు కదా! పోనీ ఉన్నశాసనాలను అమలు చేయవద్దని ఎవరైనా ప్రభుత్వానికి అడ్డుపడ్డారా? కపిల్‌ సిబాల్‌ ప్రయత్నాలు ఫలించి అవాంఛనీయమైన సమాచారాన్ని సెన్సార్‌ లేదా వడపోతపట్టడానికి రూపుదిద్దుకొనే యంత్రాంగం ఎవరి కనుసన్నల్లో పనిచేస్తుంది? అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటే వారికి వత్తాసు పలికే దుస్థితి నెలకొనదనే హామీ లేదు. చరిత్రలో చాలా అనుభవాలున్నాయి.

అసలు సమాచార వ్యవస్థను భ్రష్ఠు పట్టించిందీ, ఊహాగానాలపై అధారపడి అవాస్తవాలు, అర్థసత్యాలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా దానిపై విశ్వాసం సన్నగిల్లేలా చేసిందీ ప్రభుత్వ గద్దెనెక్కిన పెద్దమనుషులే కదా? ఉదాహరణకు తెలంగాణ అంశమే తీసుకుంటే- ఈ అంశంపై కేంద్రంలోని మంత్రి పుంగవులు పూటకొక మాట, వ్యక్తికో మాట మాట్లాడి ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరి మాటను నమ్మాలో తేల్చుకోలేక రాష్ట్ర ప్రజానీకం కోలుకోలేని నష్టాన్ని ఎంతగా చవిచూస్తున్నదో అంచనా వేయడం ఎవరికీ సాధ్యంకాదు. దీనికి బాధ్యులెవరు? సామాజిక అనుసంధాన వేదికల (ఎస్‌ఎన్‌ఎస్‌) వల్ల జరిగే దుష్పరిణామాలపై కన్నెర్రజేసిన కపిల్‌ సిబాల్‌ ఇలాంటి అంశాలపై మంత్రివర్గ వేదికలపై ఎందుకు నోరు విప్పలేక పోతున్నారు?

ప్రజావ్యతిరేక విధానాలతో సామాన్య ప్రజానీకం విసిగిపోయి ఉన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల యూపీఏ ప్రభుత్వ అసమర్థతకు ప్రతిరూపంగా నిలిచాయి. అవినీతి కుంభకోణాలలో ప్రపంచరికార్డులన్నింటినీ బద్దలుకొట్టారు. 2- జి కుంభకోణం నుండి ఎలా బయట పడాలో దిక్కుతోచడం లేదు. ఇదంతా హోమ్‌ మంత్రి చిదంబరం మెడకు చుట్టుకొంటున్నదనే ఆందోళనలో ఉన్నారు. చిదంబరానికి ఏ పాపం తెలియదని సిబాల్‌ వకాల్తా పుచ్చుకొని వాదిస్తున్నారు. అవినీతిపై ప్రజలు కత్తిగట్టి, పటిష్ఠమైన లోక్‌పాల్‌ చట్టం కోసం పోరాడుతున్నారు. ఈ సమరంలో యువత ముఖ్యమైన భూమిక పోషిస్తోంది. సామాజిక అనుసంధాన వేదికలే యువతను చైతన్యపరిచాయి, సంఘటితపరిచాయి. కపిల్‌ సిబాల్‌ ఎస్‌ఎన్‌ఎస్‌ లపై ఆగ్రహంతో ఇప్పుడు ఊగిపోవడానికి అసలు కారణం ఇది కూడా కావచ్చు. వీరికి ఆత్మ బంధువైన అమెరికాలో ఉప్పెనలా లేచిన వాల్‌ స్ట్రీట్‌ ఉద్యమానికి శక్తియుక్తులను, జవసత్వాలను ఒనగూడ్చి పెట్టింది ‘సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌’ అన్న సంగతి కపిల్‌ సిబాల్‌ కు బాగా తలకెక్కింది.

సమాచార వ్యవస్థపై దాడి ఎక్కుపెట్టడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగం వగైరా సమస్యలపై నుండి ప్రజల దృష్టిని కొంత వరకైనా మళ్ళించాలనే పథకంలో కపిల్‌ సిబాల్‌ ఈ నాటకానికి తెరలేపారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రశ్నించడం ద్వారా కలకలాన్ని సృష్టించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే- సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంపై అధారపడి ఉన్నది. పౌరుల చేతుల్లో సమాచార హక్కు చట్టం ఆయుధంగా ఉన్నది. ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆవిర్భావంతో ప్రసార మాధ్యమాల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించి రూపు రేఖలే మారిపోయాయి.

కంప్యూటర్ల యుగంలో తంతి, తపాలా, టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, సినిమాలు, ఫ్యాక్స్‌, కరపత్రాలు, పుస్తకాలు వగైరా సమాచార ప్రసార మాధ్యమాల ప్రాధాన్యత తగ్గి, కాగితం- కలం అవసరంలేని అపారమైన సమాచారం నిక్షిప్తమై ఉన్న ఇంటర్నెట్‌ సమాచార వ్యవస్థ చౌకగా చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. 2000 నాటికి ఇంటర్నెట్‌ చందాదారులు యాబై లక్ష మంది ఉంటే, 2011 జూన్‌ 30 నాటికి పది కోట్ల మందికి పెరిగారు. ఆసియా ఖండంలో మొత్తం తొంబై కోట్ల మందికిపైగా ఉంటే వారిలో కేవలం 10.7 శాతం మంది మన దేశంలో ఉన్నారు. చైనాలో 36.3 శాతం మందిఉండడం విశేషం. సమాచారవిస్ఫోటనాన్ని ఉపయోగించుకోవడంలో చైనాకంటే చాలా వెనకబడి ఉన్నాం.

ఈ- మెయిల్స్‌ ద్వారా సమాచారాన్ని అందించుకోవడంతో పాటు, ముఖాముఖి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి ఇంటర్నెట్‌ను సంధానకర్తగా వాడుకొనే ఫేస్‌ బుక్‌ వినియోగంలోకి వచ్చింది. దేశంలో మూడు కోట్ల మంది సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా ఫేస్‌ బుక్‌ వినియోగదారులున్నారు. డెబైఐదు కోట్లకుపైగా మొబైల్‌ చందాదారులున్నారు. ఎస్సెమ్మెస్‌ల ద్వారా వార్తలను, సమాచారాన్ని వేగం గా చేరవేసే సౌలభ్యం ఒనగూడింది. వ్యక్తిగతంగా బ్లాగ్‌లను ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని ఇంటర్నెట్‌లో నిక్షిప్తం చేసి, అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. ఆధునిక ప్రపంచంలో పౌరులు అనుభవిస్తున్న ఈ సమాచార హక్కునుకాలరాసే ప్రయత్నాలకు స్వస్తిచెప్పి, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, విస్తరించ డానికి ప్రోత్సహించాలి.

దుర్వినియోగాన్ని ప్రస్తుత చట్టాల పరిథిలోనే అరికట్టడా నికి చర్యలు తీసుకోవాలి. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విభేదించే, చర్చించే, నిరసన తెలిపే, ఆందోళన చేసే హక్కుకు భంగం కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. వరంగల్‌లో జులాయిగా తిరిగే ఒక యువకుడు మృగంలా తయారై ఒక యువతిపై ప్రేమోన్మాదంతో యాసిడ్‌తో దాడిచేశాడు. పోలీసులు అత న్ని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆగ్రహంతో ఉన్న ప్రజలు, విద్యార్థులు పోలీసుల చర్యను కొనియాడారు.ఆవేశం, ఉద్రేకంతోకాకుండా ప్రశాంతంగా,విజ్ఞతతో, ప్రజాస్వామ్య కోణంలో వివేచనతో ఆలోచిస్తే- అది పరిష్కార మార్గమని సమర్థించగలమా?

Wednesday, December 14, 2011

డాలరు డాబు, రుబాబు!

published in Surya Telugu daily on 6th December 2011

- పెరుగుతున్న ధరలు
- ఉపాధికోసం పోరాటాలు
- దేశంలో దిగజారిన డాలర్‌ విలువ
- ఐనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఏలుతున్న వైనం

అమెరికా ఆర్థికసంక్షోభంలో తన్నుకొంట ున్నది. అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఆ దేశ స్థూలఉత్పత్తి (జీడీపీ) విలువ పద్నాలుగు ట్రిలియన్‌ డాలర్లు ఉంటే, దానికి సరి సమానంగా రుణభారంచేరుకొన్నది. గృహ రుణ గహ్రీతలు వాయిదాలు చెల్లించలేని దుస్థితితో పేరు మోసిన బ్యాంకులు దివాలా తీశాయి. బ్యాంకు సేవలు స్తంభించాయి. విమానయాన సంస్థలూ నష్టాలతో ఐపీ పెట్టాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఆర్థికలోటు (కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌) పెరుగుతూ పెద్ద రుణగహ్రీత దేశంగా దశాబ్దాలుగా కొనసాగుతున్నది. డాలర్లను ముద్రించే హక్కున్న ఫెడరల్‌ బ్యాంకు మార్కెట్లోకి డాలర్లను మోతాదుమించి విడుదల చేసింది. పర్యవసానంగా అమెరికాలో డాలర్‌ విలువ దిగజారింది.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల కొనుగోలుశక్తి సన్నగిల్లిపోతున్నది. ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. నిరుద్యోగ వృద్ధిరేటు 9 శాతాని కి చేరుకొన్నది. అమెరికా వాణిజ్యలావాదేవీలలో ప్రస్తుతం పెద్దలోటున్నది.ప్రపంచం మొత్తంగా జరిగే ఎగుమతుల్లో అమెరికా వాటా 12.3 శాతం ఉంటే, దిగుమతుల్లో 18.9 శాతం ఉన్నది. సంపన్నులకు, సామాన్యులకు మధ్య అగాథం పెరిగి పోతున్నది. నిరుద్యోగులు ఉపాథి కోసం, భృతి (అనెంప్లాయ్‌మెంట్‌ డోల్‌) కోసం వీధిపోరాటాలకు ఉపక్రమించారు. శ్రామికులు మెరుగైన వేతనాలకోసం రోడ్లకెక్కారు. సామాన్యప్రజలు సామాజిక భద్రత, ఆరోగ్యబీమా కోసం కన్నెర్రచేశారు. వాల్‌స్ట్రీట్‌ వార్తల్లోకెక్కింది. కానీ అమెరికా డాలర్‌ మాత్రం ప్రపంచ దేశాల్లో వెలిగిపోతున్నది, ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఏలుతున్నది! సరకుల తరహాలోనే విదేశీ మారక ద్రవ్యం (డాలర్‌) విలువ సప్లై, డిమాండ్‌ మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్‌ సిద్ధాంతకర్తలు సూత్రీకరిస్తున్నారు.

ఇదొక మిథ్యాఆర్థిక సిద్ధాంతం. దీన్ని ప్రబోధించే ఆర్థికవేత్తలు సప్లై, డిమాండ్‌లను నియత్రించే సామాజిక, రాజకీయాంశాలను మభ్యపెడుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ డాలరు చుట్టూ పరిభ్రమించేలా చక్రబంధంలో ఇరికించారు. ప్రపంచీకరణ ముసుగులో వాణిజ్య, వ్యాపార లావాదేవీలను, అంతర్జాతీయ రాజకీయాలను, దేశాల మధ్య దౌత్యసంబంధాలను కూడా డాలరు సామ్రాజ్యమే నియంత్రిస్తున్నది. సంపదను ఒకప్పుడు బంగారం రూపంలో నిల్వ చేసుకొనేవారు. తెల్లదొరల పాలన సాగినంతకాలం బంగారంతో పాటు బ్రిటిష్‌ పౌండ్‌ రూపంలోకూడా సంపదను నిల్వచేసుకొనే విధానం ఉండేది. 18 వ శతాబ్దం ప్రారంభం నుండి దాదాపు 150 సంవత్సరాల పాటు బ్రిటిష్‌ పౌండ్‌ వరల్డ్‌ రిజర్వ్‌కరెన్సీగా ఒక వెలుగువెలిగి ఆరిపోయింది. రెండవ ప్రపంచయుద్ధానంతరం అప్పుల ఊబిలో కూరుకు పోయిన బ్రిటిష్‌ సామ్రాజ్యం కుప్పకూలి, అమెరికా నూతన శక్తిగా ఆ స్థానాన్ని ఆక్రమించడంతో డాలర్‌ పెత్తనం మొదలయ్యింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో జరిగిన బ్రెటన్‌ ఉడ్స్‌ మహాసభ ఆమోదంతో పౌండ్‌ స్థానాన్ని డాలర్‌ ఆక్రమించింది.1971 తరువాత బంగారాన్ని అసలు కొలబద్దగా లేకుండా కనుమరుగుచేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే సంపూర్ణఆధిపత్యాన్ని డాలర్‌ కైవసం చేసుకొంటున్నట్లు నాటి అమెరికా అధ్యక్షుడు రిచ్ఛర్డ్‌ నిక్సన్‌ ఏకపక్షంగా ప్రకటించడంతో నాటినుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పెత్తనాన్ని కొనసాగిస్తున్నది. దశాబ్దం క్రితమే ప్రపంచ ద్రవ్యనిల్వలు 68శాతం డాలర్ల రూపంలో ఉండేవని అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు వెల్లడించారు. దాన్నిబట్టి డాలరుశక్తి ఎంత బలీయంగా ఉందో బోధపడుతుంది. డాలరు పెత్తనంతో అంతర్జాతీయ వాణిజ్యం అసమతుల్యంగా తయారయ్యింది. ఈ క్రీడలో అమెరికా డాలర్లను అచ్చువేస్తుంది, మిగిలిన ప్రపంచ దేశాలు సరుకులను ఉత్పత్తిచేస్తాయి, వాటికి డాలర్లలో ధరలు నిర్ణయించి, కొంటారు.

అంతర్జాతీయంగా అనుసంధానించిన ప్రస్తుత ఆర్థికవ్యవస్థలో వాణిజ్యం పరస్పర ప్రయోజనమే గీటురాయిగా జరగడం లేదు. ఏకధృవ ప్రపంచం కోణంలో సాగుతున్నది. విదేశీ రుణాలను చెల్లించడానికి, విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించడానికి, ఎగుమతి దిగుమతుల్లోని లోటును చెల్లించడానికి డాలర్లు అవసరం. మన రూపాయి మారకపు విలువ పడిపోకుండా స్థిరంగా ఉండేలా పరిరక్షించుకోవడానికి భారీగా డాలర్లను నిల్వచేసుకోవాలి, అందుకే ఎగుమతుల్లో పోటీపడి డాలర్లను ఆర్జించాలి. స్వేచ్ఛామార్కెట్‌ ముసుగులో కుట్రలు, కుతంత్రాలతో సాగించే స్పెక్యులేటివ్‌ అండ్‌ మానిపులేటివ్‌ వాణిజ్యంలో జరిగే దాడుల నుండి రూపాయి బలహీన పడకుండా, రిజర్వ్‌ బ్యాంకు సర్కులేషన్‌లో ఉన్న మన కరెన్సీకి సమానంగా డాలర్లను గుట్టలు గుట్టలుగా పోగేసుకోవాలి. ఈ ఏడాది జూలైలో 319 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిల్వలుంటే, నవంబరు 25 నాటికి 304 బిలియన్‌ డాలర్లకు పడిపోవడంతో ప్రభుత్వానికి కంపనం పుట్టుకొన్నది.

ప్రపంచీకరణ భావజాలమే ఆయుధంగా, వెనుకబడ్డ, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువలపై డాలరు ముప్పేటా దాడిచేస్తున్నది. అందులో భాగంగానే మన రూపాయి విలువ నవంబరు 23 నాటికి మునుపెన్నడూ లేని విధంగా కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఒక డాలరు కావాలంటే రూ.52.38 చెల్లించుకోవలసి వచ్చింది. ఈ పూర్వరంగంలో డాలర్ల ఆర్జన కోసం కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లుపడుతున్నది. దిగుమతి వ్యాపారంచేసే సంస్థలు, ముడి చమురును దిగుమతి చేసుకొనే ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు డాలర్లకోసం ఎగబడుతున్నాయి. డాలర్లకు కృత్రిమంగా గిరాకీ పెంచి, రూపాయి విలువను క్షీణింపజేశారు. ద్రవ్యోల్భణం విజృంభించి 2010 డిసెంబర్‌ నుంచి 10 శాతం అటు ఇటు చక్కర్లు కొడుతున్నది.

ధరల పెరుగుదలకు ఆజ్యం పోసి , ప్రజల కొనుగోలు శక్తిని గొడ్డలి పెట్టుకు గురి చేశారు. ప్రపంచదేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మనదేశం మాత్రం ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ కళ కళలాడిపో తున్నదని ఢీల్లీ పెద్దలు భుజాలు చరుచుకొన్నారు. అది కాస్తా పతనంవైపు ప్రయా ణిస్తున్నది. ద్రవ్యోల్బణాన్నఇదుపుచేసి, నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేసేందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చిల్లర వర్తకం, పింఛను రంగాల్లోకి ఆహ్వా నిస్తున్నామని సెలవిస్తున్నారు. మన విధాన నిర్ణేతలందరూ ఆర్థిక రంగంలో నిష్ణా తులైన వారే. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేథోసంపన్నుల కనుసన్నల్లో ఆర్థిక విధానాలు రూపొంది, అమలు జరుగుతున్నాయి. అయినా తిప్పలు తప్పడం లేదు.

స్వదేశంలో డాలరు విలువ పతనమైనా, అంతర్జాతీయ సంతలో విలువ పెంచుకోవడం ద్వారా ఆర్థికసంక్షోభంనుండి బయటపడాలని అమెరికా ఆడుతున్న రాచక్రీడలో మన రూపాయే కాదు, వివిధ దేశాల కరెన్సీల మారక విలువలు భారీగా పతనమైనాయి. ఆసియా ఖండంలో అందరికంటే మనమే ఎక్కువ నష్టపోయాము. మనం చేసుకొనే దిగుమతుల్లో ముడి చమురు కీలకమైనది. అలాగే రసాయనిక ఎరువులు, కెమికల్స్‌, స్టీల్‌ వగైరా దిగుమతుల మొత్తం విలువ దాదాపు పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు (357.7 బిలియన్‌ డాలర్లు)గా 2010లో అంచనా వేశారు. ఎగుమతులు దాదాపు పదకొండున్నర లక్షల కోట్లు (225.6 బిలియన్‌ డాలర్లు) గా అంచనా వేశారు. అంటే మన దేశ విదేశీ వాణిజ్యం లోటు దాదాపు రూ. ఏడు లక్షల కోట్లు (132.1 బిలియన్‌ డాలర్లు). 2011 జూన్‌ 30 నాటికి మన దేశం అప్పు రూ.

పదహారున్నర లక్షల కోట్లు (316.9 బిలియన్‌ డాలర్లు). ఆ మేరకు డాలర్లను సంపాదించుకొని చెల్లించాలి. లేదా విదేశీ రుణ భారం పెరిగిపోతుంటుంది. డాలర్లు కావాలంటే 1.ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ , ఆసియా అభివృద్ధి బ్యాంకు వగైరా సంస్థల నుండి అప్పులు చేయాలి. 2. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవాలి. బీమా రంగమా, రక్షణ రంగమా, చిల్లర వర్తక రంగమా , పెన్షన్‌ రంగమా, ఉన్నతవిద్యా రంగమా- ఏ రంగమన్న విచక్షణ లేకుండా బహుళజాతి సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించాలి. 3. మేథో వలసలను ప్రోత్సహించి, ప్రవాస భారతీయుల నుండి పెట్టుబడులను ఆకర్షించాలి. 4. మన ప్రజల అవసరాలు తీరకపోయినా పలురకాల నాణ్యమైన సరుకులను విదేశాలకు ఎగుమతిచేసి డాలర్లను ఆర్జించాలి.

అందు కోసం భారీ రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లినా పరవాలేదు, రైతులను ప్రోత్సహించి వాణిజ్య పంటలను సాగుచేయించి, ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి. ఇనుప ఖనిజం తదితర సహజ వనరులను ఎగుమతి చేసి డాలర్లు సంపాదించాలి. ఆ రాజకీయ తంత్రాన్నే నేడు మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమలు చేసున్నది. కార్మికులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులనే కొని అనుభవించలేని ఆర్థిక దుస్థితిలో ఉన్నారు. కార్మికుడు సృష్టించే అదనపువిలువను కాజేస్తున్న పెట్టుబడిదారులు సరుకులన్నిం టినీ వినియోగించుకోలేరు. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ ఉపాథి, మెరుగైన వేతనాలు కల్పించి, కొనుగోలు శక్తిని పెంచి, ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు. ఆర్థికవిధానాల రూపశిల్పులలో అలాంటి ఆలోచనే కొరవడింది. అమెరికాకు, బహుళ జాతి సంస్థలకు నమ్మిన బంట్లుగా సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలను శాసిస్తున్నది చమురే. ముడి చమురు నిల్వలను కబ్జా చేయడానికి అమెరికా ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుందని ఇరాక్‌ దురాక్రమణతో అర్థమైపోయింది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను తన గుప్పెట్లో బంధించింది. ముడి చమురు కొనుగోలు చేయాలంటే డాలర్లుంటేనే సాధ్యపడుతుంది. పెట్రో డాలర్‌తో ప్రపంచ దేశాలను అమెరికా కొల్లగొడుతున్నది. బలమైన డాలర్‌ విధానం అమెరికాకు బహుముఖ ప్రయోజనాలను కలిగిస్తున్నది. చౌకగా సరుకులను దిగుమతి చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసుకోవచ్చు. విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా ఆస్తులు ఖరీదైనవిగా మారతాయి. ఇతర దేశాలకంటే తక్కువ వడ్డీకి అమెరికా రుణాలను సేకరించుకొనే ప్రత్యేక సౌకర్యం కలిగిఉన్నది . డాలరు ప్రపంచంలో ఏకైక మారక ద్రవ్యంగా చలామణి కావడంతో ఇతర దేశాలకు పెద్ద ఎత్తున అప్పులిచ్చే దేశంగా అవతారమెత్తింది.

డాలరు పెత్తనానికి దూరంగా జరగాలనే ఆలోచనలు అంతర్జాతీయంగా ఊపందుకొని, బలపడుతున్నాయి. వివిధదేశాల జాతీయబ్యాంకులు డాలర్ల నిల్వలను తగ్గించుకొం టూ బంగారం లేదా యూరోనిల్వల్లోకి ఆస్తులను తరలించడం ప్రారంభించాయి. ఫలితంగా ఒకానొక దశలో ప్రపంచ నిల్వల్లో డాలర్ల నిల్వలు 63 శాతానికి పడిపోయాయి. యూరో కరెన్సీజోన్‌లోని దేశాలు ఒక్కొక్కటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. డాలరుకుపోటీగా ఎదగాలనే ఆకాంక్షతో ఆవిర్భవించిన యూరో విలువ మసకబారుతున్నది. పరిస్థితులను అనుకూలంగా మలచుకొని డాలరు అధిపత్యాన్ని కొనసాగిస్తూ లబ్ధిపొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.

1. ప్రపంచ విపణిలో బంగారం, చమురు ధరల నిర్ధారణలో డాలరును ఉపయో గించడం మానివేసిన రోజే డాలరు అధిపత్యానికి పుల్‌స్టాప్‌ పడ్డట్లు భావించాలి. డాలరుకు స్వస్తిచెప్పాలని ఇరాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు సౌదీ అరేబియా అడ్డుపడు తున్నది. 2. డాలరు ఏకఛత్రాథిపత్యానికి చరమగీతం పాడి బహుళ కరెన్సీ ల వినియోగానికి, లావాదేవీలకు వీలుకల్పించే విధంగా దేశాలమధ్య వాణిజ్య పర మైన దౌత్యఒప్పందాలు చేసుకోవాలి. సోవియట్‌ యూనియన్‌ మధ్య 1978లో డా లరు ప్రమేయం లేకుండా మన రూపాయి, వారి రూబుల్‌ల మధ్య మారకంతో వాణిజ్యఒప్పందం జరిగింది. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం 1991లో ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకొన్న రష్యా 2009లో అమెరికా ఆర్థికసంక్షోభం పూర్వరం గంలో మళ్ళీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధించుకోవాలని ప్రతిపాదించింది.

చైనా గత కొన్ని సంవత్సరాలుగా అర్జెంటైనా, ఇండొనేసియా, బెలారస్‌ తదితర దేశాలతో సొంత కరెన్సీ యువాన్‌ ప్రాతిపదికన వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్నది. ఈ ఒరవడి వివిధదేశాలు, ప్రాంతాలమధ్య పెరుగుతున్నది. 3. డాలర్లు ఆర్జించడమే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత ఎగుమతుల విధానాన్ని అమలు చేసినంతకాలం పరాధీనత తప్పదు. 4. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకోసం జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టే విధానాలకు స్వస్తి చెప్పి‚, దేశీయవనరులపై ఆధారపడే ఆర్థికవిధానాలపై దృష్టి సారించాలి.

మయన్మార్‌పై అమెరికా చూపు!

published in Surya Telugu daily on December 13,2011

- సూకీ ్రపజాస్వామ్య పోరాటానికి గుర్తింపేనా?
- వ్యూహాత్మక ప్రయోజనాల అమలుకా?
- చైనాకు చికాకులు సృష్టించడానికా
- ఆర్థిక సహకారానికీ మయన్మార్‌కు హామీలు
- ఒడిదుడుకులలో భారత్‌- మయన్మార్‌ బంధం

హిల్లరీ క్లింటన్‌ , ఆంగ్‌ సాన్‌ సూకీ మహదా నందంతో ఆలింగనం చేసుకొన్న దృశ్యం ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. ఈ మహిళలిద్దరూ ఒ కరు అమెరికా విదేశాంగ వ్యవహారాల అధినేత, మరొకరు మయన్మార్‌ (బర్మా)లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటానికి ప్రతీ కగా నిలిచి నోబెల్‌ బహుమతి గ్రహీత. మయన్మార్‌ సైనిక నియంతృత్వ ముఠా (మిలిటరీ జుంటా) ప్రభు త్వం వ్యక్తి స్వేచ్ఛను, మానవ హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి ఆంగ్‌ సాన్‌ సూకీకి గృహ నిర్బంధ శిక్ష విధించింది. ఏ గృహాన్నయితే ఉద్యమ కేంద్రంగా మలుచుకొన్నారో, అందులోనే దాదాపు రెండు దశాబ్దాల పాటు కఠినమైన శిక్షను ఆంగ్‌ సాన్‌ సూకీ అనుభవించింది. ఆ చారిత్రాత్మకమైన గృహంలోనే తొంబై నిమిషాల పాటు వారిరువురూ సమావేశమై చర్చలు జరపడం, రంగూన్‌ లోని అమెరికా దౌత్యాధికారి ఇంటిలో మరో మూడు గంటల పాటు చర్చలను (డిన్నర్‌ మీట్‌) కొనసాగించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. ప్రజాస్వామ్యం కోసం ఆంగ్‌ సాన్‌ సూకీ సాగిస్తున్న వీరోచిత పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపు గా కొందరు ఈ పరిణామాలను చూస్తున్నారు.

అమెరికా కన్ను మయన్మార్‌పై పడింది. మన పొరుగునున్న పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్ట కుండా సైనిక నియంతలకు వెన్నుదన్నుగా నిలిచింది అమెరికానే. అఫ్ఘానిస్థాన్‌ లో సామాజిక ప్రగతికి పునాదులు వేసిన నాటి నజీబుల్లా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ముస్లిం ఛాందసవాదులను పెంచిపోషించి, ఆ దేశాన్ని ప్రస్తుత దుస్థితికి దిగజార్చిన ఘనతా అమెరికాదే. అరబ్‌ దేశాలలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోవడానికి వీల్లేని విధంగా ప్యూడల్‌ శక్తులతో అంటకాగుతు న్నది. లాటిన్‌ అమెరికా దేశాలలో నియంతలను కుర్చీలపై కూర్చోబెట్టింది, వారికి రక్షణకవచంగా నిలబడిందీ అమెరికానే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో అస్థిరత్వాన్ని ప్రోత్సహించిందీ, నియంతలను, ఉగ్రవాద శక్తులను, అరాచక శక్తులను పెంచిపోషించిందీ అమెరికన్‌ సామ్రాజ్యవాదమే. అందుకే ఆంగ్‌ సాన్‌ సూకీ పైన, మయన్మార్‌ దేశంపైన బరాక్‌ ఒబామా, హిల్లరీ క్లిం టన్‌ కనబరుస్తున్న అత్యుత్సాహంపై కీడెంచి మేలెంచాలి అన్న నానుడి గుర్తొస్తుంది.

ఏడాది క్రితం అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత దేశ పర్యటనలో భాగంగా పార్లమెంటు ఉభయసభల నుద్దేశించి చేసిన ప్రసంగంలో మయన్మార్‌ పరిణామాలను ప్రస్తావించారు. మన దేశాధినేతలకు చురకలు కూడా అంటించా రు. శాంతియుతంగా సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను బర్మాలోలాగా అణ చివేస్తే, ప్రపంచలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రేక్షకపాత్ర వహించలేవు. దశాబ్దాల పాటు రాజకీయ ఖైదీలను జైళ్ళలో నిర్భందించడం, నిరసనలు వ్యక్తంచేసే పౌరుల ను కాల్చిచంపడం ఆమోదయోగ్యం కాదు. ఎన్నికల ఫలితాలను గౌరవించని మ యన్మార్‌ ప్రభుత్వ పోకడలను ప్రపంచం గమనిస్తున్నది. మానవ హక్కుల ఉల్లం ఘనలను అంతర్జాతీయ సమాజం, ప్రత్యేకంగా అమెరికా, భారత్‌ వంటి దే శాలు తీవ్రంగా ఖండించాలి. భారత్‌ ఇలాంటి అంశాలపై అంతర్జాతీయ వేదికలపై స్పం దించకుండా తరచు మౌనం ప్రదర్శిస్తున్నది.నిరసించినంత మాత్రాన ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొన్నట్లుకాదు.

విశ్వవ్యాపితంగా ఆమోదం పొందిన మానవ హక్కులకు నిజమైన అర్థం చెప్పిన వారమ వుతాము. నియంతృ త్వ వ్యవస్థలను- ప్రజాస్వామ్య వ్యవస్థలుగా పరివర్తన చెందించడం ద్వారా ఆసి యాలో, ప్రపంచవ్యాప్తంగా సాధించిన ప్రగతికి స్థిరత్వాన్ని కల్పించవచ్చు. పర్యవ సానంగా ప్రపంచంలో భద్రతను పెంపొందించవచ్చునని ఆ యన హితబోధ కూడా చేసి వెళ్ళారు. దీన్ని బట్టి దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తన ప్రా బల్యాన్ని పెంచుకోవడం, ఆర్థికంగా బలపడి, రాజకీయంగా పెనుసవాలుగా నిలి చిన చైనాకు చికాకులు సృష్టించడమే అమెరికా లక్ష్యంగా స్పష్టమవుతున్నది. ఆ వ్యూహంలో భారతదేశాన్ని కూడా ఇరికించాలనే దుష్టతలంపూ ఉన్నది.

ఆ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేయడానికి అమెరికా ఉపక్రమించింది.1955 లో జాన్‌ పోస్టర్‌ డూలెస్‌ పర్యటన తదనంతరం ప్రప్రథమంగా అ మెరికా విదేశాంగ కార్యదర్శి హోదాలో హిల్లరీ క్లిం టన్‌ దౌత్యపరంగా మూడు రోజులపాటు ఈ ఏడా ది చివరిలో మయన్మార్‌లో పర్యటించారు. సైనిక పాలకుల నుండి ఏడాది క్రితమే నూతనంగా పరి పాలనా బాధ్యతలను స్వీకరించిన మయన్మార్‌ పౌరప్రభుత్వ అధినేతలతో, ప్రజాస్వామ్య ఉద్యమ నేత, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీతోనూ సమాలోచనలు జరిపారు. మయన్మార్‌ ప్రభుత్వం నిర్బంధకాండకు స్వస్తి చెప్పాలని, రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, మైనారిటీ తెగల ప్రజానీకానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచా రాన్ని నిలిపివేయాలని మయన్మార్‌ ప్రభుత్వాన్ని హిల్లరీ క్లింటన్‌ కోరారు. ప్రజాస్వా మ్య సంస్కరణల అమలు తీరుతెన్నులపై అధారపడి ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని కొనసాగించడమే కాకుండా పెంచుతామని సెలవిచ్చారు. ఆంగ్‌ సాన్‌ సూకీతో సమావేశంలో- మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఉమ్మడిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞకూడా చేశారు.

అంతర్జాతీయ సమాజం నుండి వెలివేతకు గురై, ఆర్థిక ఆంక్షలకు, నిర్బంధానికి గురైన మయన్మార్‌లో ప్రజాస్వామ్య సంస్కరణలను కలిసి ప్రోత్సహిస్తామన్నారు. కలిసి ముందడుగు వేస్తే ప్రజాస్వామ్య సాధనలో వె నుదిరిగి చూసే ప్రసక్తే ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని ఆంగ్‌ సాన్‌ సూకీ వెల్లడించారు. సైన్యం కనుసన్నల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మయన్మార్‌ పౌర ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలపై ఉన్న ఆంక్షలను కాస్త సడలింపుచేసింది. ఆంగ్‌ సాన్‌ సూకీ తో పాటు రాజకీయ ఖైదీలలో కొంత మందిని విడుదల చేసింది. ఎన్నికల నిర్వహ ణ వంటి కొన్ని ప్రజాస్వామ్య సంస్కరణలను అమలు చేస్తున్నది. ఈ పూర్వ రంగం లో హిల్లరీ క్లింటన్‌ పర్యటన సాగింది. సైన్యం మద్దతున్న పార్టీకి భారీ ఆధి క్యాన్ని సాధించి పెట్టడానికి గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

రాజ్యాంగపరంగా దేశంపై సైన్యం ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నది. గత ఎన్నికలను ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ పార్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ బహిష్కరించింది. మయన్మార్‌ పై అమెరికా, యూరప్‌ ఆంక్షలు కొన సాగుతున్నాయి. తాజా పరిణామాల దృష్ట్యా వాటిని ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థలు సంకేతాలిస్తున్నాయి. మయన్మార్‌ ప్రభుత్వం గత కొంత కాలంగా చైనాతో సన్నిహితంగా ఉంటు న్న ట్లు బోధపడుతున్నది. మయన్మార్‌లోని సైనిక నియంతల ముఠా పాలనను ప్రపం చమంతా వెలివేసినా, తన వ్యూహంలో భాగంగా చైనా అంటకాగినమాట వాస్తవం. మయన్మార్‌లో, ఆగ్నేయాసియా ప్రాంతంలో చైనా పలుకుబడిని తగ్గించాలనే ప్రయత్నాలలో వాషింగ్టన్‌ ఉన్నదని, అందుకే ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నదని, ఆ వ్యూహంలో భాగంగానే హిల్లరీ క్లింటన్‌ పర్యటించారని విశ్లేష కులు భావిస్తున్నారు.

ఇటీవల ఎన్‌ఎల్‌డీ రాజకీయ పార్టీగా మళ్ళీ రిజిస్టర్‌ అయింది. సమీప భవిష్యత్తు లో పార్లమెంటుకు జరు గనున్న ఉపఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు చేస్తున్నారు. 1990లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ అధిక్యతతో గెలుపొందినా మిలిటరీ జుంటా ఎన్నికల ఫలితాలను గుర్తించ నిరాకరించి ఆంగ్‌ సా న్‌ సూకీని ఇరవై ఏండ్ల పాటు నిర్బంధంలో ఉంచిం ది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసింది.మయన్మార్‌తో భారత్‌ సంబంధాలు ఒడుదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బర్మా అధినేత యూనూ, మన దేశ ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఉన్న రోజుల్లో నెలకొన్న దౌత్యపరమైన సత్సంబంధాలు 1962 వరకు సాఫీగా ఉన్నాయి. అటుపై ఆ పాలనా పగ్గాలను సైన్యం చేజిక్కించుకోవడంతో నియంతృత్వ పాలన మొదలయ్యింది. నాటి నుంచి స్నేహ సంబంధాలు మసకబారుతూ వచ్చాయి.

1987లో నాటి ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ బర్మా పర్యటనతో దౌత్యసంబంధాల లో నూతన అధ్యాయం మొదలయ్యిందనుకొన్న నేపథ్యంలో 1988లో ప్రజాస్వా మ్యం కోసం పెల్లుబుకిన ఉద్యమాన్ని మిలిటరీ జుంటా కర్కశంగా అణచి వేయ డానికి పూనుకోవడంతో బెడిసికొట్టాయి. భారత దేశం ఉద్యమానికి సంపూర్ణ మ ద్దతు ప్రకటించడంతో మయన్మార్‌తో దౌత్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 1989లో బర్మా పేరు మార్చుకొని మయన్మార్‌గా ఆవిర్భవించింది. మళ్ళీ 1993 నుంచి దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి . భారత్‌, మయన్మార్‌ దౌత్య సంబంధాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నది. మయన్మార్‌ దేశ ఉత్పత్తులకు భారత్‌ పెద్ద మార్కెట్‌. మొత్తం ఎగుమతుల్లో 25 శాతం మన దేశానికే తరలివస్తున్నాయి. అలాగే దిగుమతులనూ అధికంగానే చేసు కొంటున్నది.

ధాయిలాండ్‌ , చైనా , సింగపూర్‌ తరువాత ఆ దేశానికి నాలుగవ పె ద్ద వాణిజ్య భాగస్వామి భారత్‌. 1994లో కుదుర్చుకొన్న సరిహద్దు వాణిజ్యాన్ని మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌ సరిహద్దుల్లో గుర్తించిన కేంద్రాల నుండి అభి వృద్ధి చేసుకోవడానికి ఆమోదించారు. 2001లో భారత సైనిక సరిహద్దు రహదారి సంస్థ నిర్మించిన రహదారిని భారత్‌ మయన్మార్‌ మైత్రీ రహదారిగా పిలుస్తున్నారు. 160 కి.మీ.గల ఈ రహదారితో ఈశాన్య రాష్ట్రాలకు దక్షిణాసియా, ఆగ్నేయాసి యాలతో రవాణా సంబంధాలు ఏర్పడ్డాయి. 1990 నుండి ఆగ్నేయాసియాలోని మయన్మార్‌తో సహా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహసం బంధాలను పునర్నిర్వ చించుకోవాలన్న తలంపు మన దేశాధినేతలకు వచ్చింది. భారత్‌కు, ఆగ్నేయాసి యాకు ఈశాన్యరాష్ట్రాలు గేట్‌వే టు సౌత్‌ ఈస్ట్‌ ఏసియాగా పిలచే సహజసిద్ధమైన ప్రాంతం.

ఆగ్నేయాసియాలోని దేశాలతో దౌత్య పరమైన సంబంధాలను, వాణిజ్య లావాదేవీలను పటిష్ఠం చేసుకొనే వైపు దృష్టి కేం ద్రీకరించలేదనే అపవాదు మన పాలకులపై ఉన్నది. ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలన్నీ అసోషియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ నేషన్స్‌ (ఏసియాన్‌)గా ఏర్పడ్డాయి. సహజంగానే చైనాకు ఆ కూటమిపై పట్టు పెరిగింది. మన దేశానికి సార్క్‌లో మాత్రమే సభ్యత్వం ఉన్నది. బే ఆఫ్‌ బెం గాల్‌ మల్టిసెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కో ఆపరేష న్‌ (బిమ్స్‌ టెక్‌) సంస్థను 1997లో భారత్‌, థాయిలాండ్‌, బాంగ్లాదేశ్‌, శ్రీలంక నెలకొల్పాయి. మయన్మార్‌, నేపాల్‌, భూటాన్‌ కూడా తరువాత అందులో చేరాయి. మన దేశానికి సరిహద్దు దే శం మయన్మార్‌. పర్యవసానంగా మన దేశం తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదు ర్కొంటున్నది. అక్రమంగా దేశంలోకి చొరబాట్లు జరుగుతున్నాయి.

ఆ కారణం వ ల్లే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, ఆ దేశంలో అధికారంలోఉన్న సైనిక నియంతలతో ఇచ్చిపుచ్చుకొనే మైత్రీ సంబంధాలు అవసరమని భావించి మెతక వైఖరిని అనుస రిస్తూ వస్తున్నది. కాబట్టే ఆంగ్‌ సాన్‌ సూకీ నాయకత్వంలో దశాబ్దాలుగా ప్రజాస్వా మ్యం కోసం పోరాడుతున్న ప్రగతి కాముక శక్తులకు మద్దతివ్వడానికి జంకే పరి స్థితుల్లో మన ప్రభుత్వం పడిపోయింది. అందుకే ఒబామా మన రాజకీయ నాయ కత్వాన్ని రెచ్చగొట్టడానికి డిల్లీ పర్యటన సందర్భంగా ప్రయత్నించారు. 20 11 అక్టోబరులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మయన్మార్‌ దేశాధ్యక్షుడు మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు కుదుర్చుకొన్న ఒడంబడికలోకూడా నర్మగర్భంగానే ఆ దేశ ఆంతరంగిక విషయాల ప్రస్తావన జరిగింది.

ఆ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణం వైపు చేపడుతున్న చర్యలను స్వాగతిస్తూ, ఆ ప్రక్రియకు తోడ్పా టును అందిస్తామని మాత్రమే పేర్కొన్నాం.ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌ అభ్యర్థిత్వానికి మయన్మార్‌ అధ్యక్షుడు మద్దతు ప్రటించారు. వాణిజ్య పరంగా, దౌత్యపరంగా, భద్రతా పరంగా, ప్రాంతీయంగా చూసినా, భౌగోళిక, రాజకీయాంశాలను పరిగణలోకి తీసుకొన్నా మయన్మార్‌తో మనదేశానికి వ్యూహాత్మక అవసరాలు, ఉభయ దేశాలకు బహుళ ప్రయోజనాలు ముడిబడి ఉన్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసు కొంటున్న తాజా పరిణామాల దృష్ట్యా అత్యంత జాగరూకతతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది.

Wednesday, December 7, 2011

ప్రపంచీకరణ ముసుగులో ' డాలరు ' పెత్తనం

అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడి విల విలా తన్నుకొంటున్నది . అప్పుల ఊబిలో కూరుకుపోయింది . ఆ దేశ స్థూల ఉత్పత్తి ( జి .డి .పి .) విలువ పద్నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఉంటే దానికి సరిసమానంగా పోటీ పడుతూ రుణ భారం చేరుకొన్నది . గృహ రుణగ్రహీతలు కంతులు చెల్లించలేని దుస్థితి ఏర్పడడంతో పేరుమోసిన బ్యాంకులు దివాలతీశాయి . బ్యాంకు సేవలు స్తంబించాయి . విమానయాన సంస్థలూ పీకల్లోతు నష్టాలతో ఐ.పి. పెట్టాయి . ద్రవ్యోల్భణం పెరిగిపోతున్నది . ప్రభుత్వ ఆర్థిక లోటు ( కరెంట్ అకౌంట్ డెపిసిట్ ) పెరుగుతూ పెద్ద రుణగ్రహీత దేశంగా దశాబ్దాలుగా కొనసాగుతున్నది . డాలర్లను ముద్రించే హక్కున్న పెడరల్ బ్యాంకు మార్కెట్లోకి డాలర్లను మోతాదుమించి విడుదల చేసింది . పర్యవసానంగా అమెరికాలో డాలర్ విలువ దిగజారింది . నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి . ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లిపోతున్నది . ఆర్థిక వృద్ధి రేటు మందగించింది . లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి . నిరుద్యోగ వృద్ధి రేటు పెరుగుతూ 9% కి చేరుకొన్నది . యువత ఆశలు అడియాశలౌతున్నాయి . అమెరికా వాణిజ్య లావాదేవీలలో ప్రస్తుతం పెద్ద లోటున్నది. ప్రపంచం మొత్తంగా జరిగే ఎగుమతుల్లో అమెరికా వాటా 12.3% ఉంటే దిగుమతుల్లో 18.9% ఉన్నది . " మేడి పండు చూడ మేలిమై ఉండు , పొట్టవిప్పి చూడ పురుగులుండు " అన్న చందంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తయారయ్యింది . సంపన్నులకు , సామాన్యులకు మధ్య అగాదం పెరిగి పోతున్నది . నిరుద్యోగులు ఉపాథి కోసం , భృతి ( అనెంప్లాయ్ మెంట్ డోల్ ) కోసం వీథి పోరాటాలకు ఉపక్రమించారు . శ్రామికులు మెరుగైన వేతనాల కోసం వీధికెక్కారు . సామాన్య ప్రజలు సామాజిక భద్రత , ఆరోగ్య భీమా కోసం కన్నెర్ర చేశారు . ఉద్యమాల సెగ మొదలైయ్యింది . వాల్ స్ట్రీట్ వార్తల్లోకెక్కింది . కానీ అమెరికా డాలర్ మాత్రం ప్రపంచ దేశాల్లో వెలిగిపోతున్నది . ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏలుతున్నది . ఎంతటి వైచిత్ర్యం .
సరుకుల తరహాలోనే విదేశీ మారక ద్రవ్యం ( డాలర్ ) విలువ " సప్లయ్ , డిమాండ్ " మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్ సిద్ధాంత కర్తలు సూత్రీకరిస్తున్నారు . ఇదొక " మిథ్యా" ఆర్థిక సిద్ధాంతం . దీన్ని ప్రభోదించే ఆర్థికవేత్తలు " సప్లయ్ , డిమాండ్ " ను నియత్రించే సామాజిక , రాజకీయాంశాలను తెలివిగా మభ్యపెడుతున్నారు . ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ డాలరు చుట్టూ పరిభ్రమించేలా చక్రబంధంలో ఇరికించారు . ప్రపంచీకరణ ముసుగులో వాణిజ్య మరియు వ్యాపార లావాదేవీలను , అంతర్జాతీయ రాజకీయాలను , దేశాల మధ్య దౌత్య సంబంధాలను కూడా " డాలరు సామ్రాజ్యమే " నియంత్రిస్తున్నది . సంపదను నిల్వ చేసుకోవాలంటే ఒకప్పుడు " బంగారం " రూపంలో నిల్వ చేసుకొనేవారు . రవి అస్తమించని సామ్రాజ్యంగా తెల్ల దొరల పాలన సాగినంత కాలం బంగారంతో పాటు " బ్రిటీష్ పౌండ్ " రూపంలో కూడా సంపదను నిల్వ చేసుకొనే విధానం అమలులో ఉండేది . 18 వ శతాబ్దం ప్రారంభం నుండి దాదాపు 150 సంవత్సరాల పాటు " బ్రిటీష్ పౌండ్ ", " వరల్డ్ రిజర్వ్ కరెన్సీ" గా ఒక వెలుగు వెలిగి ఆరిపోయింది . రెండవ ప్రపంచ యుద్దానంతరం అప్పుల ఊబిలో కూరుకపోయిన బ్రిటీష్ సామ్రాజ్యం కుప్పకూలి . అమెరికా నూతన శక్తిగా ఆవిర్భవించి , ఆ స్థానాన్ని ఆక్రమిండంతో " డాలర్ పెత్తనం " మొదలయ్యింది . రెండవ ప్రపంచ యుద్దం ముగింపు దశలో జరిగిన బ్రెటన్ వూడ్స్ మహాసభ ఆమోదంతో పౌండ్ స్థానాన్ని డాలర్ ఆక్రమించి‍ంది . 1971 సంవత్సరం తరువాత బంగారాన్ని అసలు కొలబద్దగా లేకుండా కనుమరుగు చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే సంపూర్ణ ఆధిపత్యాన్ని డాలర్ కైవసం చేసుకొంటున్నట్లు నాటి అమెరికా అధ్యక్షులు రిచ్ఛర్డ్ నిక్సన్ ఏకపక్షంగా ప్రకటించడంతో నాటి నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పెత్తనాన్ని కొనసాగిస్తున్నది .
దశాబ్దం క్రితమే ప్రపంచ ద్రవ్య నిల్వలు 68% డాలర్ల రూపంలో ఉండేవని అంతర్జాతీయ ఆర్థిక రంగ నిపుణులు వెల్లడించారు . దాన్ని బట్టి డాలరు శక్తి ఎంత బలీయంగా ఉందో ! బోధపడుతుంది . డాలరు పెత్తనంతో అంతర్జాతీయ వాణిజ్యం అసమతుల్యంగా తయారయ్యింది . ఈ క్రీడలో అమెరికా డాలర్లను అచ్చువేస్తుంది , మిగిలిన ప్రపంచ దేశాలు సరుకులను ఉత్పత్తి చేస్తాయి , వాటికి డాలర్లలోధరలు నిర్ణయించి , కొంటారు . అంతర్జాతీయంగా అనుసందానించబడిన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం పరస్పర ప్రయోజనమే గీటు రాయిగా జరగడం లేదు . ఏకదృవ ప్రపంచం కోణంలో సాగుతున్నది . విదేశీ రుణాలను చెల్లించడానికి , విదేశీ వాణిజ్యాన్ని కొనసాగించడానికి , ఎగుమతి దిగుమతుల్లోని లోటును చెల్లించడానికి డాలర్లు అవసరం . మన రూపాయి మారకపు విలువ పడిపోకుండా స్థిరంగా ఉండేలా పరిరక్షించుకోవడానికి భారీగా డాలర్లను నిల్వ చేసుకోవాలి , అందుకే ఎగుమతుల్లో పోటీ పడి డాలర్లను ఆర్జించాలి . స్వేచ్ఛా మార్కెట్ ముసుగులో కుట్రలు , కుతంత్రాలతో సాగించబడే "స్పెకులేటివ్ అండ్ మానిపులేటివ్ " వాణిజ్యంలో జరిగే దాడుల నుండి మన రూపాయి బలహీన పడకుండా జాగ్రత్త పడడానికి రిజర్వ్ బ్యాంకు సర్కులేషన్ లో ఉన్న మన కరెన్సీకి సమానంగా డాలర్లను గుట్టలు గుట్టలుగా పోగేసుకోవాలి . ఈ ఏడాది జూలైలో 319 బిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలుంటే నవంబరు 25 నాటికి 304 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో ప్రభుత్వానికి కంపనం పుట్టుకొన్నది .

ప్రపంచీకరణ భావజాలమే ఆయుధంగా " తడిగుడ్డతో గొంతులు కోసేవాడు " అన్న నానుడిగా వెనుకబడ్డ , అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువలపై డాలరు ముప్పేటా దాడి చేస్తున్నది . అందులో భాగంగానే మన రూపాయి విలువ నవంబరు 23 నాటికి మునుపెన్నడూ జరగని విధంగా కనిష్ఠ స్థాయికి పతనమై , బక్కచిక్కి ఒక డాలరు కావాలంటే రు .52.38 పైసలు చెల్లించుకోవలసి వచ్చింది . ఈ పూర్వరంగంలో డాలర్ల ఆర్జన కోసం మన కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లుపడుతున్నది . దిగుమతి వ్యాపారం చేసే సంస్థలు , ముడి చమురును దిగుమతి చేసుకొనే ప్రభుత్వ మరియు ప్రయివేటు రంగ సంస్థలు డాలర్ల కోసం ఎగబడుతున్నాయి . డాలర్లకు కృత్రిమంగా గిరాకీ పెంచి , రూపాయి విలువను క్షీణింపజేశారు . ద్రవ్యోల్భణం విజృంభించి 2010 డిశంబరు నుంచి 10% అటు ఇటు చక్కర్లు కొడుతున్నది . ధరల పెరుగుదలకు ఆజ్యం పోసి , ప్రజల కొనుగోలు శక్తిని గొడ్డలి పెట్టుకు గురి చేశారు . ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం మాత్రం ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తూ కళ కళలాడిపోతున్నదని డిల్లీ పెద్దలు చంకలు చరుచుకొన్నారు . అది కాస్తా పతనం వైపు ప్రయాణిస్తున్నది . " ఎందుకురా క్రింద పడ్డావ్ అంటే అదొక లగువులే " అన్నట్లు ద్రవ్యోల్భణాన్నిఅదుపు చేసి , నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేసేందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చిల్లర వర్తకం , ఫించను రంగాల్లోకి ఆహ్వానిస్తున్నామని నిస్సిగ్గుగా సెలవిస్తున్నారు . మన విధాన నిర్ణేతలందరూ ఆర్థిక రంగంలో నిష్ణాతులైన వారే . ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ వేదికలపై నుండి ఆర్థిక రంగానికి దిశా నిర్ధేశం చేస్తూ పుంకాను పుంకాలుగా ఉపదేశాలు చేస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు . డాక్టర్ రంగరాజన్ నేతృత్వంలోని ప్రధాని ఆర్థిక సలహా బృందం సభ్యులందరూ పేరెన్నికగన్న ఆర్థిక వేత్తలే . ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వెలగబెట్టి వచ్చిన మరో ఆర్థిక నిపుణుడు , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాన్టెక్ సింగ్ అహ్లువాలియా ఉండనే ఉన్నారు . రాజకీయ చాణిక్యుడగా మన్ననలందుకొంటున్న ప్రణాబ్ ముఖర్జీ ఆర్థిక శాఖామాత్యులుగా ఉన్నారు . రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డాక్టర్ సుబ్బారావు వగైరా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేథోసంపన్నుల కనుసన్నల్లో ఆర్థిక విధానాలు రూపొందించబడి , అమలు చేయబడుతున్నాయి . అయినా తిప్పలు తప్పడం లేదు . లోపమెక్కడుంది ?
స్వదేశంలో డాలరు విలువ పతనమైనా అంతర్జాతీయ సంతలో విలువను పెంచుకోవడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలని అమెరికా ఆడుతున్న రాచ క్రీడలో మన రూపాయే కాదు వివిధ దేశాల కరెన్సీల మారక విలువలు భారీగా పతనమైనాయి . ఆసియా ఖండంలో అందరికంటే మనమే ఎక్కువ నష్టపోయాము . మనం చేసుకొనే దిగుమతుల్లో ముడి చమురు కీలకమైనది . అలాగే రసాయనిక ఎరువులు , కెమికల్స్ , స్టీల్ వగైరా దిగుమతుల మొత్తం విలువ దాదాపు పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ( 357.7 బిలియన్ డాలర్లు) గా 2010 లో అంచనా వేశారు . ఎగుమతులు దాదాపు పదకొండున్నర లక్షల కోట్లు( 225.6 బిలియన్ డాలర్లు ) గా అంచనా వేశారు . అంటే మన దేశం యొక్క విదేశీ వాణిజ్యం లోటు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ( 132.1 బిలియన్ డాలర్లు ) . 2011 జూన్ 30 నాటికి మన దేశం అప్పు పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు ( 316.9 బిలియన్ డాలర్లు ) . ఆ మేరకు డాలర్లను సంపాదించుకొని చెల్లించాలి లేదా విదేశీ రుణ భారం పెరిగిపోతుంటుంది . డాలర్లు కావాలంటే 1) ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ , ఆసియా అభివృద్ధి బ్యాంకు వగైరా సంస్థల నుండి అప్పులు చేయాలి . 2) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవాలి . భీమా రంగమా , రక్షణ రంగమా , చిల్లర వర్తక రంగమా , పెన్షన్ రంగమా , ఉన్నత విద్యా రంగమా , ఏ రంగమన్న విసక్షణ లేకుండా బహుళ జాతి సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఆహ్వానించాలి . 3) మేథో వలసలను ప్రోత్సహించి , ప్రవాస భారతీయుల నుండి పెట్టుబడులను ఆకర్షించాలి . 4) మన ప్రజల అవసరాలు తీరక పోయినా పలు రకాల నాణ్యమైన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసి డాలర్లను ఆర్జించాలి . దాని కోసం భారీ రాయితీలను ఇచ్చి ప్రోత్సహించాలి . ఆహార భద్రతకు పెను ముప్పు వాటిల్లినా పరవాలేదు , రైతులను ప్రోత్సహించి వాణిజ్య పంటలను సాగు చేయించి , ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి . అమూల్యమైన ఇనుప ఖనిజం తదితర సహజ వనరులను కొల్లగొట్టి , పర్యావరణాన్ని ధ్వంసం చేసైనా ఎగుమతి చేసి డాలర్లను సంపాదించాలి . ఆ రాజకీయతంత్రాన్నేనేడు డా : మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు . పి . ఎ . ప్రభుత్వం జంకు బొంకు లేకుండా అమలు చేసున్నది . కార్మికులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులనే కొని అనుభవించలేని ఆర్థిక దుస్థితిలో ఉన్నారు . కార్మికుడు సృష్టించే అదనపు విలువను కాజేస్తున్న పెట్టుబడిదారులు సరుకులన్నింటినీ వినియోగించుకోలేరు . మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి అందరికీ ఉపాథి , మెరుగైన వేతనాలు కల్పించి , కొనుగోలు శక్తిని పెంచి , ఉత్పత్తుల వినియోగాన్నిపెంచడం ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు . ఆర్థిక విధానాల రూపశిల్పులలో అలాంటి ఆలోచనే పూర్తిగా కొరవడింది . అమెరికాకు , బహుళ జాతి సంస్థలకు మాత్రమే నమ్మిన బంట్లుగా సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు .
" డాలర్ పవర్ " ను అడ్డంపెట్టుకొని ప్రపంచంపై ఆధిపత్యాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని అమెరికన్ సామ్రాజ్యవాదం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది . ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి డాలర్ను పావుగా వాడుకొంటున్నది .
ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలను శాసిస్తున్నది చమురే . ముడి చమురు నిల్వలను కబ్జా చేయడానికి అమెరికన్ సామ్రాజ్యవాదం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుందన్న విషయం ఇరాక్ దురాక్రమణతో చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది . అంతర్జాతీయ చమురు మార్కెట్ ను తన గుప్పెట్లో బంధించింది . ముడి చమురును కొనుగోలు చేయాలంటే డాలర్లుంటేనే సాధ్యపడుతుంది . " పెట్రో డాలర్ " తో ప్రపంచ దేశాలను అమెరికా కొల్లగొడుతున్నది . ఒక దేశానికి సంబంధించిన కరెన్సీ ప్రపంచంపై గుత్తాధిపత్యం చెలాయిస్తే జరిగే విపరిణామాలు ఎలా ఉంటాయో మనం అనుభవిస్తున్నాము . కానీ బలమైన డాలర్ విధానం అమెరికాకు బహుముఖ ప్రయోజనాలను కలిగిస్తున్నది . చౌకగా సరుకులను దిగుమతి చేసుకోవచ్చు. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసుకోవచ్చు . విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా ఆస్తులు ఖరీదైనవిగా మారతాయి . ఇతర దేశాల కంటే తక్కువ వడ్డీకి అమెరికా రుణాలను సేకరించుకొనే ప్రత్యేక సౌకర్యం కలిగి ఉన్నది . డాలరు ప్రపంచంలో ఏకైక మారక ద్రవ్యంగా చలామణి కావడంతో ఇతర దేశాలకు పెద్ద ఎత్తున అప్పులిచ్చే దేశంగా అవతారమెత్తింది . అంతర్జాతీయ విపణిలో బంగారం , ముడి చమురు తదితర సరుకుల ధరలను డాలర్లలోనే నిర్ణయించడం పర్యవసానంగా డాలరు విలువ పతనమైనా అమెరికాకే లాభం , కారణం దిగుమతులు చౌకగా లభిస్తాయి . ప్రపంచ దేశాల జాతీయ బ్యాంకులు , విదేశీ ఆర్థిక సంస్థలు వారి ఆస్తులను అమెరికా డాలర్ల రూపంలోనే నిల్వ చేసుకోవాలి . విదేశీ వ్యాపార లావాదేవీలను డాలర్లలోనే పరిష్కరించుకోవాలి .
2007 సం. లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం అమెరికాను చావు దెబ్బకొట్టింది . ఆ ప్రకంపనలకు ప్రపంచ దేశాలూ కుప్పకూలాయి . చైనా , భారత్ లాంటి కొన్ని దేశాలు మాత్రమే బలమైన ప్రభుత్వ రంగ సంస్థల పుణ్యమాని కాస్త తట్టుకొని నిలబడగలిగాయి . ఆ చారిత్రాత్మకమైన అతిపెద్ద ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ భావజాలాన్నేప్రశ్నార్థకం చేసింది . ఆత్మరక్షణలో పడ్డ అమెరికా ఆర్థికవేత్తలు , నిపుణులు దుస్ఫలితాల విశ్లేషణలలో అంతర్భాగంగా " ప్రపంచ రిజర్వ్ కరెన్సీ" గా చెలామణిలో ఉన్న డాలరు పెత్తనం అంతానికి రోజులు దగ్గర పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు . డాలరు పెత్తనానికి చెల్లు చీటీ రాయాలని వివిధ దేశాలకు చెందిన మెథావులూ పిలుపిచ్చారు . ఇది ప్రస్తుతానికి హాస్యాస్పదంగా కనిపించినా అనివార్యం . తాజాగా అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడి కొటుమిట్టాడుతున్నది . డాలరు పెత్తనానికి దూరంగా జరగాలనే ఆలోచనలు అంతర్జాతీయంగా ఊపందుకొని , బలపడుతున్నాయి . వివిధ దేశాల జాతీయ బ్యాంకులు డాలర్ల నిల్వలను తగ్గించుకొంటూ బంగారం లేదా య్యూరో నిల్వల్లోకి ఆస్తులను తరలించడం ప్రారంభించాయి . ఫలితంగా ఒకానొక దశలో ప్రపంచ నిల్వల్లో డాలర్ల నిల్వలు 63% కు పడిపోయాయి . డాలరు పెత్తనం మొదలయ్యాక ఇదే కనిష్ఠ స్థాయి . దాంతో కంగుతిన్న అమెరికా తేరుకొని పథకం ప్రకారం ఇతర కరెన్సీలను దెబ్బగొట్టే పనిలో పడింది . " యూరో కరెన్సీ జోన్ " లోని దేశాలు ఒక్కొక్కటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి . డాలరుకు పోటీగా ఎదగాలని ఆకాంక్షతో ఆవిర్భవించిన " యూరో " విలువ మసక బారుతున్నది . పరిస్థితులను అనుకూలంగా మలచుకొని డాలరు అధిపత్యాన్నికొనసాగించుకొంటూ లభ్దిపొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నది . డాలరు పెత్తనాన్ని సవాలు చేసే భౌతిక పరిస్థితులు నేడు ప్రపంచంలో నెలకొని ఉన్నాయి . ఒకనాడు అలీనోద్యమానికి నాయకత్వం వహించిన చరిత్ర , తృతీయ ప్రపంచ దేశాలలో అతిముఖ్యమైన మన దేశం గళం విప్పాలి .
1) ప్రపంచ విపణిలో బంగారం , చమురు ధరల నిర్ధారణలో డాలరును ఉపయోగించడం మానివేసిన రోజే డాలరు అధిపత్యానికి "పుల్ స్టాప్" పడ్డట్లుగా భావించాలి . డాలరుకు స్వస్తి చెప్పాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు సౌది అరేబియా అడ్డుపడుతూవస్తున్నది . పరస్పర ఆధారిత ప్రపంచంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కటే ప్రయోజనం పొందడానికి మిగిలిన అన్ని దేశాల హక్కులను , ప్రయోజనాలను హరించి వేయడాన్నిఅనుమతించ కూడదు . ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి దారి తీస్తున్న డాలరు ఆధిపత్యానికి తెరపడాలి .
2) డాలరు యొక్క ఏకఛత్రాధిపత్యానికి సత్వరం చరమగీతం పాడి బహుళ కరెన్సీల వినియోగానికి , లావాదేవిలకు వీలుకల్పించే విధంగా దేశాల మధ్య వాణిజ్యపరమైన దౌత్య ఒప్పందాలు చేసుకోవాలి . తద్వారా పెద్ద ఎత్తున డాలర్లను ఆర్జించి , నిల్వ చేసుకోవలసిన అగత్యం ఉండదు . అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలలో అనూహ్యమైన సానుకూలమైన మార్పులు సంబవిస్తాయి . ఉభయ తారకంగా ఉండే వాణిజ్యం దేశాల మధ్య జరుగుతుంది . భారత దేశం , సోవియట్ యూనియన్ మధ్య 1978 సంవత్సరంలో డాలరు ప్రమేయం లేకుండా మన రూపాయి , వారి రూబుల్ ల మధ్య మారకంతో వాణిజ్య ఒప్పందం జరిగింది . సోవియట్ యూనియన్ పతనానంతరం 1991 లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొన్న రష్యా 2009 లో అమెరికా ఆర్థిక సంక్షోభం పూర్వరంగంలో మళ్ళీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధించుకోవాలని ప్రతిపాదించింది . చైనా గత కొన్ని సంవత్సరాలుగా అర్జెంటైనా , ఇండొనేషియా , బెలారస్ తదితర దేశాలతో సొంత కరెన్సీ యువాన్ ప్రాతిపదికన వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్నది . ఈ ఒరవడి వివిధ దేశాలు , ప్రాంతాల మధ్య పెరుగుతున్నది .
3) డాలరు ( అమెరికా) కు సేవలందించడం కోసం డాలర్లు ఆర్జించడమే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత ఎగుమతుల విధానం అమలు చేసినంత కాలం పరాధీనత తప్పదు . మన ఆర్థిక వ్యవస్థ బలహీనమైన పునాదులపైనే నిర్మించబడుతుంది . మన ఆర్థిక వ్యవస్థను మనమే విధ్వంసం చేసుకొన్నవారమవుతాము . డాలరు ( అమెరికా) చేతులో కీలు బొమ్మలా కొనసాగుతూ మనుగడ కోసం పాకులాడుతూనే జీవనం సాగించాలి . మిగిలిన దేశాలది మన లాంటి దుస్థితే .
4) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధానాలకు స్వస్థి చెప్పి , దేశీయ వనరులపై ప్రధానంగా ఆధారపడే ఆర్థిక విధానాలపై దృష్టి సారించాలి . మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను నిండా ముంచుతున్న డాలరు పెత్తనానికి అంతం పలకాలి .