Tuesday, December 27, 2011

లోక్‌పాల్‌తో అవినీతి అంతమయ్యేనా?

published in Surya daily on December 28 ,2011

అవినీతిపై ప్రజలు కన్నెర్రజేశారు. అయినా అవినీతిపరులు భారీ ఆధిక్యతతో ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తూ చట్ట సభల్లోకి రాజఠీవితో అడుగు పెడుతున్నారు. ఏమిటీ వైచిత్య్రం! ప్రజలు అవినీతిని అసహ్యించుకొం టున్నా రన్నది ముమ్మాటికీ నిజం. కానీ దొంగ చేతికి తాళమిచ్చినట్టు, అవినీతి పరుల చేతుల్లోనే రాజ్యాధికారాన్ని పెడు తున్నారు. ప్రజా సమ స్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొంటే లంచగొండులని ముద్ర వేయడానికి అధారాలు కనిపిస్తాయి. ఈ వ్యవహారంలో లంచం ఇచ్చేవాడు బాధితుడు, తీసుకొనే వాడు లబ్ధిదారుడు. కల్తీ మద్యం లేదా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తే అక్రమార్జనఅని తెలిసిపోతుంది.


ప్రజాకర్షణ పథకాల అమలులో అధికార దుర్వినియోగానికి పాల్పడి, అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే అందులోని రాజకీయ స్వార్థం ప్రజలకు బోధపడుతుంది.
కానీ, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు లేదా సంస్థల వద్ద వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయల సంపద ఎలా పోగుబడుతున్నదో! ఏది నీతిగా సంపాదించిన సొమ్మో, ఏది నీతి బాహ్యంగా అవినీతికి పాల్పడి కూడబెట్టుకొన్నారో సామాన్యులకు అంతుచిక్కని అవినీతి మాయాజాలంగా మిగిలిపోతున్నది. ఇదీ నేడు అమలులో ఉన్న ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక నీతి, లక్షణం. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అలాగే బహిరంగ మార్కెట్‌ నుండి కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి అభివృద్ధి పనుల ముసుగులో కమీషన్లు, పర్సంటేజీలు, వాటాలు వేసుకొని ప్రజాధనాన్ని మింగేస్తున్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం పెరిగిపోతున్నది. అయినా కోపం రావడం లేదంటే కారణం ఆ సొమ్ము తమ సొమ్ముగా భావించే చైతన్యం ప్రజల్లో కొరవడిందని చెప్పవచ్చు.

అలాగే, సహజవనరులైన భూమి, భూగర్భంలో లభించే ఇనుము, బాకై్సట్‌, బెరైటీస్‌, గ్రానైట్స్‌, బొగ్గు, భూ ఉపరితలంపై దొరికే ఇసుక, కృష్ణ గోదావరి బేసిన్‌లోని సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న చమురు, సహజవాయు నిల్వలు, సముద్ర తీరంలో లభిస్తున్న బీచ్‌ శాన్డ్‌ వగైరా అమూల్యమైన ఖనిజ సంపద దొడ్డిదారిన తరలిపోతున్నది. ప్రభుత్వ రంగంలో సాధించిన శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్ళించి అక్రమార్జనపరుల బొక్కసాలకు చేరుతున్నాయి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం, ఉన్నతాధికార వర్గాలు, కార్పొరేట్‌ సంస్థలు, సంపన్న వర్గాలు అపవిత్ర కూటమిగా ఏర్పడి చట్టం కళ్ళుగప్పి జాతి సంపదను కొల్లగొడుతున్నాయి. ఈ అవినీతి కుంభకోణాల్లో ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు ఇద్దరూ లబ్ధిపొందుతున్నవారే. నష్టపోతున్నది దేశ ప్రజలు.

కానీ వ్యక్తులుగా ఎవరికీ తాము నష్టపోయామన్న భావన కలగడం లేదు. పర్యవసానంగా దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. దేశంలో మిలియనీర్లు, బిలియనీర్ల సంఖ్య ఏడాది కేడాదికి పెరిగిపోతున్నది. జలగల్లా జాతి సంపదకు కన్నం వేసి దోచుకొంటున్నా ప్రజల ఉమ్మడి ఆస్తి దోపిడీకి గురౌతున్నదనే స్పృహ కొరవడింది. నిరక్ష్యరాస్యులుగా ఉన్న 35 శాతం మంది అమాయక ప్రజలు ఈ ఆర్థిక నీతి లోని మోసాన్ని పసిగట్టలేక పోవచ్చు, కానీ అక్షరాస్యులైన మధ్య తరగతి ప్రజలు, బుద్ధి జీవులు కూడా ఈ విషయంలో చైతన్యయుతంగా స్పందించడం లేదు. కారణం ప్రత్యక్షంగా తమ సొమ్ముకు చిల్లు పడలేదు కాబట్టి ఈ ఆర్థిక దోపిడీ పట్ల నిరాసక్తత చూపెడుతున్నారా అనిపిస్తున్నది.

లక్షా డెబ్బయ్‌ ఆరు వేల కోట్ల రూపాయల 2- జి స్పెక్ట్రమ్‌ టెలికం కుంభకోణం, కృష్ణ గోదావరి బేసిన్‌లోని సజవాయువు నిక్షేపాల రిలయన్స్‌ కుంభకోణం, ఓబులాపురం అక్రమ లీజుల కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ భూ కుంభకోణం, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని బాకై్సట్‌ నిక్షేపాలు జిందాల్‌ కంపెనీకి కట్టబెట్టిన వైనం- వగైరా వగైరా కుంభకోణాల తాజా చరిత్ర ప్రజల కళ్ళ ముందు సాక్షత్కరిస్తున్నది. ఎలాంటి శషభిషలకు తావులేకుండా సీబీఐ విచారణలు వీటిని ధృవప రుస్తున్నాయి. అయితే దొరికిన వారు మాత్రమే దొంగలుగా ముద్రపడి జైళ్ళలో ఉన్నారు. దొరకని వారు- లేదా రాజ్యాధికారం అండ పుష్కలం గా ఉన్న వారు పెద్దమనుషులుగా సమాజంలో చెలామణి అయి పోతూ నేఉన్నారు.

దొంగలుగా దొరికిన వాళ్ళనన్నా సంఘ బహిష్కృతులుగా చూడడానికి బదులు, వారికి ఘనస్వాగతాలు పలికే అనుచరగణాలు పెద్దఎత్తున ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్ళొచ్చిన ఉద్యమ కారులకుకూడా అలాంటి గౌరవం లభించిందో, లేదో అనుమానమే. లోపమెక్కడుంది? వ్యవస్థలోనా,చట్టాల్లోనా, ప్రజల చైతన్యంలోనా?సమాజం మూలుగుల్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి చెదలకు మూలాలెక్కడున్నాయి, దాని నిర్మూలనకు మందేమిటి అన్నదే కీలకమైన సమస్య. అవినీతి అంతానికి చారిత్రాత్మకమైన లోక్‌పాల్‌ చట్టానికి- ఇదిగో, బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నామని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక పోజు పెట్టింది. నిప్పుల కొలిమిలో కర్రు పెట్టి, ఇహ సానపట్టండన్నట్లు ప్రతిపక్షాలకు సవాలు విసిరింది.

పరిపాలనానుభవంలో ఇతరుల కంటే రెండాకులు ఎగమేసిన కాంగ్రెస్‌ నాయకత్వం ప్రతిపాదిత బిల్లును- ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఆమోదం పొందకుండా ఉండడానికి వీలుగా అవసరమైన మెలికలు పెట్టి కూర్చున్నది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఆలోచనతో రిజర్వేషన్ల అంశాన్ని తెలివిగా తెర మీదకు తెచ్చింది. దెబ్బకు రెండు పిట్టలన్నట్లు, ఆ వివాదం చాటున- లోక్‌పాల్‌ బిల్లు ప్రస్తుత సమావేశాల్లో ఆమోదం పొందకుండానే వాయిదా పడుతుందా? ఎన్నికల ప్రకటన వెలువడింది కాబట్టి ఓటర్లను ప్రభావితంచేసే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవనిచెప్పి చేతులు దులిపేసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కొన్ని అసంబద్ధమైన, నిరుపయోగమైన, బలహీనమైన అంశాలను గుది గుచ్చి బిల్లులో పొందుపరిచారనిి పస్తోంది. తద్వారా వాటిని యథాతథంగా అంగీకరిస్తే- బిల్లు చట్టమైనా చట్టుబండగా మిగిలిపోయేలా రూపొందించారు.

మరొ వైపున- తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న చందంగా, తాము ప్రతిపాదించిన జన్‌ లోక్‌పాల్‌ బిల్లుకు ఎలాంటి సవరణలూ చేయకుండా వెంటనే పార్లమెంటు ఆమోద ముద్ర వేయాలని మంకుపట్టుతో, తమదైన శైలిలో అన్నా హజారే బృందం ఆందోళనకు ఉపక్రమిస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆందోళన చేసే హక్కు, స్వేచ్ఛ వారికున్నవి. వారి చిత్తశుద్ధిని శంకించాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సంకుచిత రాజకీయాలను ఆపాదించే కుసంస్కారుల మాటలకు విలువా లేదు. ప్రజా ఉద్యమాలున్నప్పుడే ప్రభుత్వాలలో కొంతైనా చలనం ఉంటుంది. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. దాన్ని గౌరవించడమే కాదు, పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మౌలిక సమస్యల పరిష్కారానికి మెరుగైన, పదునైన శాసనాల ఆవశ్యకత ఉన్నది.

వాటి సాధన కోసం ప్రజల భాగస్వామ్యంతో అలుపెరగని ఉద్యమాలు సాగించాల్సిందే. అందులో ఇసుమంత సందేహం లేదు. సమస్యల్లా- లోక్‌ పాల్‌ చట్ట మొక్కటే అవినీతి మహమ్మారిని తుదముట్టించే సర్వరోగ నివారిణి అన్న ఆలోచనే లోపభూయిష్టమైనది.
అవినీతికి మూలాలు ఈ రాజకీయ వ్యవస్థలోనే ఉన్నాయి. రాజకీయ రంగాన్ని- వ్యాపార రంగంగా రూపాంతరం చెందించారు. ఎన్నికల సంఘం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నా, ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతున్నది. ఎన్నికల్లో ధనప్రభావాన్ని నిరోధించకుండా అవినీతికి కళ్ళెం వేయడం అసాధ్యం. లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థి నలబైఐదు లక్షల రూపాయల వరకు ఎన్నికల వ్యయం చేయడానికి ఎన్నికల కమీషన్‌ అనుమతించింది. అంటే సంపన్నులు తప్ప సామాన్యులు, పేదవారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే లేదన్న మాట! అందుకే దామాషా ఎన్నికల విధానాన్ని అమలుచేయాలి. విధానాల ప్రాతిపదికపై రాజకీయ పార్టీలకు ఓట్లేసే చైతన్యాన్ని ప్రజలకు కల్పించాలి. ఎన్నికల సంస్కరణలపై ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ నివేదిక పార్లమెంటు లైబ్రరీలో పడిఉన్నది. దాని దుమ్ము దులిపి అమలుకు పూనుకోవాలి.

రాజకీయ వ్యవస్థ అవినీతి మయమైపోయింది కాబట్టి అవినీతిని ఫటాపంచలు చేయడానికి అన్నాహజారే కంకణబద్ధుడైనాడని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కార్పొరేట్‌ ప్రసార మాధ్యమాలు జడివానలా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అనూహ్యంగా లభించిన ప్రజాదరణ, ప్రచారంతో ఆయన మునగ చెట్టెక్కి కూర్చొన్నారు. బృందగానం చేసే వారు చేస్తూనే ఉన్నారు. వారిలో హేతుబద్ధత , విచక్షణ లోపించినట్లు కనపడుతున్నది. లోక్‌ పాల్‌ చట్టం ఒక ఆయుధం మాత్రమే. అందువల్ల వీలైనంత పటిష్ఠవంతమైన చట్టం రూపొందించే బాధ్యత పార్లమెంటుపై ఉన్నది. ముసాయిదా బిల్లు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించే రీతిలో ఉన్నదన్న సద్వివిమర్శలు వెల్లువెత్తాయి.

దేశ సరిహద్దులను, భద్రతను కంటికి రెప్పలా పరిరక్షించడానికి ఒకే వ్యవస్థ కాకుండా పదాతిదళం, వాయుసేన, నావికాదళం అని మూడు సైనిక విభాగాలను నెలకొల్పారు. కారణం ఒకే వ్యవస్థ కింద ఉంటే అధికారకేంద్రీకరణ పర్యవసానంగా దుష్పరిణామాలకు అవకాశం ఉంటుందని- కీడెంచి మేలెంచాలన్న దృక్పథంతో రాజ్యాంగ నిర్ణేతలు భావించి ఉండవచ్చు. అలాగే లోక్‌పాల్‌ ఛత్రం కిందికి కీలకమైన ఇతర వ్యవస్థలను తీసుకొచ్చి, అపరిమితమైన అధికారాలను కట్టబెడితే, ఎవరికీ జవాబుదారీ కాని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తే- ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర హాని జరుగుతుంది .

No comments:

Post a Comment