Thursday, December 20, 2012


కమ్యూనిస్టు యువతకు మహోపాధ్యాయుడు నీలం రాజశేఖరరెడ్డి

Wed, 12 Dec 2012,  visalaandhra daily
కమ్యూనిస్టు యువతకు మహోపాధ్యాయుడు నీలం రాజశేఖరరెడ్డి
టి.లకీëనారాయణ, డైరెక్టర్‌, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం

భారత కమ్యూ నిస్టు పార్టీ అగ్ర నేతల్లో ఒకరుగా, మార్క్సిజం, లెని నిజం సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేసిన ఉద్యమకారు డుగా, దోపిడీ సమాజా న్ని కూకటి వేళ్ళతో పెకలించ కలిగిన మహ త్తర శక్తి మార్క్సిజానికి మాత్రమే ఉన్న దన్న పరిపూర్ణమైన విశ్వా సంతో యావత్‌ జీవితాన్ని కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాణా నికి అర్పించిన త్యాగశీలి కామ్రేడ్‌ నీలం రాజశేఖరరెడ్డి. సోషలిస్టు భావజాలంపై యువతకు శిక్షణిచ్చి, ఉత్త మపౌరులుగా తీర్చిదిద్ది, కమ్యూనిస్టు ఉద్య మానికి నాణ్యమైన కార్యకర్తలను సమకూర్చి పెట్టాలని నిరంతరం కృషి చేసిన గొప్ప ఉద్యమనేత. ఆయన అమ రుడై పద్దెనిమిది సంవత్సరాలు గడచిపోయాయి. 1938 డిసెంబరులో భారతకమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి, అంచలంచలుగా ఎదుగుతూ 1961 జూన్‌ 8-11 తేదీ లలో రాజమండ్రిలో జరిగిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనారు. సైద్ధాంతిక, రాజకీయాంశాలపై కమ్యూనిస్టు ఉద్యమంలో పొడచూపిన తీవ్రమైన విభేదాలపై చర్చోపచర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మహాసభ జరిగింది. అటుపై కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలిక పర్యవసానంగా సంభవించిన ఆటుపోట్ల మధ్య 1964 నవంబరు 18-23 తేదీలలో గుంటూరులో జరిగిన సి.పి.ఐ రాష్ట్ర మహాసభలో తిరిగి కార్యదర్శిగా ఎన్నికైనారు. విభజన దుష్ఫలితాల ప్రభావం నుండి ఉద్యమాన్ని పరిరక్షించుకోవడం పెనుసవాలుగా పరిణమించిన తరుణంలో ఆయన పార్టీ శ్రేణుల్లో విశ్వా సాన్ని పాదుకొల్పి, సమర్ధవంతమైన నాయకుడుగా ఉద్య మ నిర్మాణంలో క్రియాశీలమైన భూమిక పోషించారు. సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ రంగాలలో తనకున్న ప్రావీ ణ్యం, అనుభవంతో పార్టీని ముందుకు నడిపించడంలో అగ్రభాగాన నిలిచారు.
1971 సెప్టెంబరు 23-27 తేదీల మధ్య హైదరాబా దులో జరిగిన రాష్ట్ర మహాసభల తదనంతర కాలంలో పార్టీ జాతీయ సమితి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి దేశ నలుమూలలా విస్తరించి ఉన్న కమ్యూనిస్టు శ్రేణుల అభిమానాన్ని చూరగొన్న 'ఆణిముత్యం' కా.నీలం రాజ శేఖరరెడ్డి. సైద్ధాంతిక పునాది ఎంత పటిష్టంగా ఉంటే అంతపటిష్టంగా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం ఉంటుం దని బలంగా విశ్వసించిన సి.పి.ఐ. మాజీ ప్రధాన కార్య దర్శి చండ్రరాజేశ్వరరావు, నీలంరాజశేఖరరెడ్డి గార్లు, ఆ వరవడిలోనే ఉద్యమ నిర్మాణానికి జీవితాంతం కృషి చేశారు. పార్లమెంటరీ వేదికలకు వెళ్ళే అవకాశాలున్నా ఉద్యమ నిర్మాణ రంగంపైనే దృష్టి లగంచేసి లక్ష్య శుద్ధి తో పనిచేసి అమరులైనారు. 1994 డిసెంబరు 13న ఆఖరి శ్వాసవిడిచిన రాజశేఖరరెడ్డిగారు కమ్యూనిస్టు నైతిక విలువలతో విలక్షణమైన వ్యక్తిత్వం, సిద్ధాంత నిబద్ధతకు ప్రతీకగా నిలిచి భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. సమ కాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాంటి పరిణతి చెందిన కమ్యూనిస్టు నాయకుల ఆవశ్యకత సమాజానికి మెండుగా వున్నది. వారు లేని లోటును కమ్యూనిస్టు శ్రేణులు నేటికీ మననం చేసుకొంటున్నారు.
నిరాడంబర జీవితం, మనుష్యుల్ని ప్రేమించడం, మిత్ర త్వానికి ప్రతిరూపంగా నిలవడం, కమ్యూనిస్టు రాజకీయాల పట్ల నిబద్ధత రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన అం శాలు. అభిప్రాయాలు వెల్లడించడంలో నిర్మొహమాటంగా వ్యవహరించేవారు. మృదువైన భాషలోనే విమర్శనాస్త్రాలు సంధించేవారు. మాటల్లో కరుకుదనం ఉన్నా కపటం లేని మనస్తత్వం ఆయనది. సంక్లిష్టమైన సైద్ధాంతిక, రాజకీ యాంశాలను కూడా సులభశైలిలో విశ్లేషించి, విషయాన్ని పొడిపొడిమాటల్లో సూటిగా పామరులకు సహితంబోధ పడేలా విడమరచి వివరించేవారు. హావభావాలు, వ్యక్తి త్వంలో పెద్దరికం ఉట్టిపడేది. ఉద్యమంలో పనిచేస్తున్న యువతను ఆప్యాయంగా చేరదీసి భుజం తట్టి ప్రోత్స హించేవారు. తప్పుటడుగు లేస్తున్నారని భావిస్తే సరిదిద్ద డానికి అంతే కటువుగా వ్యవహరించేవారు. ఉద్యమంలో పూర్తికాలం పని చేస్తున్న కార్యకర్తల యోగక్షేమాల పట్ల శ్రద్ధ కనబరిచేవారు.
విద్యార్థిగా : వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలోని అత్యంత కరవుపీడిత అనం తపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో 1918 జూలై 2న రాజశేఖరరెడ్డి జన్మిం చారు. భూస్వామ్య కుటుం బంలో పుట్టి దోపిడీ శక్తు లకు వ్యతిరేకంగా ఉద్య మించి, శ్రామిక వర్గ అభ్యున్నతికి అలుపెరుగని పోరు సల్పి, ఉత్తమ శ్రేణి కమ్యూ నిస్టుగా నిండు జీవితాన్ని గడిపారు. విద్యార్థి దశలోనే మార్క్సి జంవైపు ఆకర్షితులై, జీవితాంతం శ్రామికవర్గ పక్షపాతిగా, కమ్యూనిస్టు
ఉద్యమ అగ్రనేతగా సమాజానికి ఎనలేని సేవ లందిం చారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయో ధులు కల్లూరి సుబ్బారావు గారు నీలం రాజశేఖర రెడ్డి, తరిమిల నాగిరెడ్డి (తరువాత కాలంలో సి.పి.ఐ. శాసన సభాపక్ష నాయకులుగా వున్నారు). లను 1938 సం.లో వెంట బెట్టుకొని బెనారస్‌ తీసుకెళ్ళి ప్రఖ్యాతిగాంచిన జాతీయ కళాశాలలో చేర్చి ఉత్తమ విద్యార్థు లుగా రాణించ మని ప్రోత్సహించారు. మార్గమధ్యలో గాంధీజీ దగ్గరకు కూడా తీసుకెళ్ళి వారి ఆశీస్సులకు పాత్రులను చేశారు. కానీ ఇరువురూ విప్లవబాట పట్టారు. జాతీయోద్యమా నికి, విప్లవో ద్యమానికి కేంద్రస్థానంగా భాసిల్లిన బెనారస్‌ జాతీయ కళాశాల విద్యార్థిగా ఉన్న కాలంలో రాజశేఖర రెడ్డి గారు కమ్యూ నిస్టు భావజాలం వైపు ఆకర్షితులై, బెనారస్‌ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిం చారు. ఆయన కార్యకలాపాలపై నిఘా వేసిన బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అక్కడి నుండి తప్పించు కొని రహ స్యంగా అనంతపురం చేరుకొన్నారు.తెల్లదొరల నిరంకుశ పాలన, ఫ్యూడల్‌ శక్తుల నికృష్టమైన దోపిడి మధ్య శ్రామిక ప్రజానీకం మగ్గిపోతున్న రోజుల్లో నీలం రాజశేఖరరెడ్డి గారు రహస్య జీవితం గడుపుతూ, అప్పటికే స్వాతంత్య్రో ద్యమంలో చురుకుగా పాల్గొంటూ కమ్యూనిస్టుగా పేరు పొందిన ఐదుకల్లు సదాశివన్‌ గారితో కలిసి అనంతపురం జిల్లాలో కమ్యూ నిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుంబి గించారు. ఆయన సోదరుడు నీలం సంజీవరెడ్డి (మాజీ ముఖ్యమంత్రి, మాజీ రాష్ట్రపతి) తదితరులతో కలిసి యువ జన సంఘాల నిర్మాణానికి కృషి చేశారు. మరొక వైపు కా.వి.కె. ఆదినారాయణరెడ్డి నేతృత్వంలో 1941 సం.లోనే అనంతపురంలో అఖిలభారత విద్యార్థిఫెడరేషన్‌ శాఖను ఏర్పాటు చేసుకొని క్రియాశీలంగా పనిచేస్తున్న కార్యకర్త లతో సంబంధాలు ఏర్పరచుకొని విద్యార్థి ఉద్యమాన్ని ప్రోత్సహించారు. స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థులను భాగస్వాములను చేయడం నాటి విద్యార్థి ఉద్యమ ప్రధాన లక్ష్యంగా ఉండేది. యువకులకు, యస్‌.ఎఫ్‌.కార్యకర్తలకు ''స్టడీసర్కిల్‌'' నిర్వహిస్తూ తరిమల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్‌, ఏటుకూరి బలరామమూర్తిగార్లతో కలిసి సైద్ధాంతిక రాజకీయాంశాలపై పాఠాలు బోధించేవారు. తద్వారా యువజన, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని రగుల్కొల్పి, సంఘటితం చేసే కార్యాచరణకు పూనుకొ న్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోను, దోపిడి రహిత సమాజ నిర్మాణంలోను విద్యార్థి, యువజనులు ముఖ్యమైన భూమిక పోషించగలరని ప్రగాఢంగా విశ్వసించి, ఆ రంగాలపై కేంద్రీకరించి పని చేశారు.
లేబొరేటరీ దహనం 'కుట్రకేసు' : రాజశేఖరరెడ్డి గారు రహస్య జీవితం నుండి బయటికొచ్చి విద్యను కొనసా గించడానికి తిరిగి బెనార స్‌కు వెళ్ళగానే అరెస్టు చేసి ఆగ్రా వగైరా జైళ్ళలో నిర్బంధించారు. 1942 ఆగస్టులో విడుదలై మళ్ళీ అనంత పురం తిరిగొచ్చిన ఆయన్ను అనంతపురం కళాశాల ''లేబొరేటరీ దహనం కుట్ర కేసు''లో ముద్దాయిగా ఇరికించి అరెస్టు చేశారు. గాంధీజీ పిలుపు మేరకు 1942 సం.లో దేశవ్యాపితంగా నిర్వహించబడిన ''ఆగస్టు ఉద్యమం'' ప్రభావంతో రెచ్చిపోయిన కొందరు యువకులు (ఆగంత కులు) ఒక రోజు అర్థరాత్రి పూట కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్‌కు నిప్పుపెట్టారు. పోలీసులు తప్పుడు సాక్ష్యా లు చెప్పించి ఆ నెపాన్ని విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థి ఫెడరేషన్‌ నాయ కులపైకి నెట్టి 1942 సెప్టెంబరు 10న అక్రమంగా కేసును బనా యించి, 12 మందిని అరెస్టు చేశారు. విద్యార్థి నాయకులైన వి.కె.ఆదినారా యణరెడ్డి తదితరులతో పాటు నీలం రాజశేఖరరెడ్డి, ఐదుకల్లు సదాశివన్‌లను కూడా కేసులో ఇరికించి అరెస్టు చేశారు. ఇది రాష్ట్ర విద్యార్థి ఉద్యమ చరిత్రలో ''లేబొరేటరీ దహనం కుట్ర కేసు''గా ప్రసిద్ధికెక్కింది. ఆ ఏడాది డిసెంబరు 14 నుండి విచారణను ప్రారంభించిన స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ ముద్దాయిలు నిరపరాధులుగా తీర్పిస్తూ డిసెంబరు 17న కేసు కొట్టి వేశారు. జైలులో నిర్బంధించబడ్డ కాలాన్ని ఉద్యమకారులు సాహిత్య అధ్యయనానికి సద్వినియోగం చేసుకొని ఇనుమడించిన ఉత్సాహంతో, లోతైన సైద్ధాంతిక అవగాహనతో తిరిగొచ్చి ఉద్యమ నిర్మాణానికి పునరంకితమయ్యారు.
కార్యకర్తల శిక్షణపై కేంద్రీకరణ : విద్యార్థి దశలోనే అధ్యయనంపై అమితాసక్తిని కనబరచిన రాజశేఖరరెడ్డి గారు జీవిత చరమాంకం వరకు అదే దృక్పథంతో నిరం తరం ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన సి.పి.ఐ. కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బాధ్యు లుగా ఉంటూ జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి శిక్షణా శిబిరాల నిర్వహణకు ప్రణాళికలను రూపొందించి, వాటి అమలు కోసం పట్టుదలతో కృషి చేసేవారు. ప్రత్యేకించి విద్యార్థి, యువజన రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా శిబిరాల నిర్వ హణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. మార్క్సిస్టు సిద్ధాంతం అధ్యయనం ద్వారానే కమ్యూనిస్టు ఉద్యమానికి మెరిక ల్లాంటి క్రియాశీలమైన, చైతన్యవంతులైన యువజన, విద్యార్థి కార్యకర్తలు లభిస్తారని ఉద్బోధించేవారు. శాశ్వత ప్రాతిపదికన రాజకీయ శిక్షణా శిబిరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో విశేషమైన కృషి చేసి దేశ రాజధాని ఢిల్లీకి అతిసమీపంలో ఉన్న ఫరీదాబాద్‌లో ఐదెకరాల భూమిని పార్టీకి సేకరించి పెట్టారు. భావజాల ప్రాప్తితోనే నాణ్యమైన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం, విస్తరణ సాధ్యమవుతుందని రాజ శేఖరరెడ్డిగారు బలంగా విశ్వసించేవారు.
మార్క్సిజం వెలుగులో రాజకీయ, ఆర్థిక, సామాజికాం శాలపై పరిశోధనలను, అధ్యయనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ''చండ్ర రాజేశ్వరరావు పౌండేషన్‌'' ఆధ్వర్యంలో ''నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం నెలకొల్పబ డింది. కమ్యూనిస్టు సిద్ధాంతం అధ్యయనం, శిక్షణ, ఆచరణ పట్ల ఆయన కనబరచిన మక్కువకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ కేంద్రం నిర్వహించబడుతున్నది.
చెరగనిముద్ర : నాలాంటి వేలాది మంది కార్యకర్తలను ప్రభావితం చేసిన విలక్షణమైన జీవనశైలి రాజశేఖరరెడ్డి గారిది. 1973 సం. ప్రారంభంలో వారిని మొదటి సారి చూశాను. అప్పుడు నేను పదవతరగతి చదువుతూ, మా స్కూల్‌ ''పీపుల్‌ లీడర్‌'' గా ఉండేవాడిని . మా హెడ్‌మాస్టర్‌ కీ.శే. యం.సి.ఆంజనేయులుగారి ప్రోత్సాహంతో అప్పటికే ఎ.ఐ.యస్‌.ఎఫ్‌.లో చేరి పని చేస్తున్నాను. ముల్కి సమస్యపై చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ''జై ఆంధ్రా'' నినాదంతో విచ్ఛిన్నకర ఉద్యమంగా రూపుదా ల్చింది. విద్యార్థులు అందులో భాగస్వాములైనారు. పార్టీ వైఖరిని శ్రేణులకు తెలియజేయడంలో జాప్యం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టిన తరువాత మేము సమ్మెలో పాల్గొన్నాం. నేను 48 గంటల నిరాహారదీక్ష చేశాను. ఆ పూర్వరంగంలో ఆనాటి యస్‌.ఎఫ్‌. రాష్ట్ర నాయకుల్లో ఒకరైన ఐదుకల్లు రవీంద్రనాథ్‌ గారు మావూరికొచ్చి గుత్తిలో జరిగిన పార్టీ సమావేశానికి నన్ను వెంటబెట్టుకొని తీసుకెళ్ళారు. ఆ సమావేశంలోనే ప్రప్రథమంగా రాజశేఖర రెడ్డిగారి ఉపన్యాసాన్ని విన్నాను. అది నాపై చెరగని ముద్ర వేసింది. తిరిగి వెళ్ళాక ఆందోళన విరమించి, పాఠశాలను నిర్విఘ్నంగా కొనసాగించుకొన్నాము. ఉపాధ్యాయుల్లో ఒక వర్గం, బయటి నుంచి రాజకీయ నాయకుల వత్తిళ్ళు తీవ్ర స్థాయిలో వచ్చినా ఖాతరు చేయలేదు. ఇంటర్‌ మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాశాక, నాకు విషయం చెప్పకుండానే మా హెడ్‌ మాస్టర్‌ నన్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అశోక్‌ నగర్‌లో అప్పుడు నివాసముంటున్న కా. రాజశేఖరరెడ్డి గారిని కలిసి ఉన్నత చదువు కోసం సోవియట్‌ యూనియన్‌కు పంపమని విజ్ఞప్తి చేశారు. ఆ ఏడాదికి సంబంధించి దరఖాస్తు చేయడానికి సమయం మించిపోయిందని తరువాత ప్రయత్నిద్దామని వారు సలహా యిచ్చి పంపారు. అలా రెండవసారి ఆయన్ను కలుసు కొన్నాను. అటుపై తిరుపతిలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎ.ఐ.యస్‌.ఎఫ్‌.మరియు ఎ.ఐ.వై.ఎఫ్‌.ల ఆధ్వర్యంలో రాయలసీమ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ విద్యార్థి, యువ జన సదస్సును నిర్వహించి కా.రాజశేఖరరెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. తరువాత దశలో ఎ.ఐ.యస్‌. ఎఫ్‌.రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించిన రోజుల్లో వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన గైడెన్స్‌లో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో విద్యార్థి కార్యకర్తలకు జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ పాఠశాలలను ఇరవై రోజుల నుండి నెల రోజులపాటు, అలాగే జిల్లా స్థాయి శిక్షణా శిబిరాలను విధిగా నిర్వహించేవారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి గారి తాత్విక చింతనను, నిరాడంబరమైన జీవన శైలిని, నడవ డికను, నిగర్విమనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆస్వాదిస్తూ, కమ్యూనిస్టుగా ఎదగడానికి నాకెంతో దోహదపడింది.
కమ్యూనిస్టు కుటుంబంలో బాధ్యతనెరిగిన పెద్దమనిషిగా కార్యకర్తలపట్ల ప్రేమానురాగాలను కనబరుస్తూ ఆయన ప్రోత్సహించిన తీరు ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచేది. విద్యార్థి, యువజన కార్యకర్తలు ఉద్యమంలో ''మిలి టెంటు''గా పనిచేస్తూ విజయాలు సాధిస్తూ, మన్ననలను పొందుతూ, పై పై కెదుగుతుంటే అమితానందం పొందేవారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న యువజన, విద్యార్థి కార్యకర్తలకు అదనపు బాధ్యతలను అప్పగించడం ద్వారా సముచిత స్థానం కల్పించడం గూర్చి, వారి శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా విప్లవోద్యమానికి ఉపయో గించుకోవాలని నిరంతర ఉద్బోధించే వారు. శ్రమించే యువ కార్యకర్తలు అవగాహనారాహిత్యంతో ఒకటి రెండు తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఒకవైపున సర్దిచెబుతూనే మరొక వైపున సరిదిద్దడా నికి ఉత్తమ సలహాలిచ్చేవారు. కాకపోతే సమాచార అంతరం పర్యవసానంగా అప్పుడప్పుడూ చిరు కోపం, మౌనం ప్రదర్శిస్తూ కటువుగా వ్యవహరిస్తూండే వారు. వాస్తవం తెలియగానే మళ్ళీ అంతే అభిమానంతో చేరదీసి, వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. అలాంటి చేదు అనుభవాన్ని, అందులోని తియ్యదనాన్ని నేనూ ఒకసారి ఆస్వాదించాను.
(సి.ఆర్‌. ఫౌండేషన్‌ (కొండాపూర్‌, హైదరాబాద్‌)లోని నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రంలో ఆయన విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ వ్యాసం ప్రచురితం.) 

Sunday, July 15, 2012

ముసుగు తొలగిన మన్మోహన్!

Published in Sakshi daily on 12th July 2012
విశ్లేషణ
సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో పేదరికాన్ని తగ్గించడమ న్నది ప్రధాన వ్యూహమని డాక్టర్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం పదేపదే వల్లె వేస్తుంటుంది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం మాత్రం 2011-12 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.9% వృద్ధిరేటు నమోదు చేసుకొని ముందు వరు సలో పయనిస్తున్నది. కానీ 11వ పంచవర్ష ప్రణాళికా (2007-12) కాలంలో 9 శాతం లక్ష్యంగా పెట్టుకొన్నా సగటున 8.2% సాధించామని, 12వ పంచవర్ష ప్రణాళికా (2012-17) కాలంలోనైనా 9 శాతానికి చేరుకోవాలంటే సంస్కరణల అమలులో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ద్వంద్వంగా ప్రకటించింది.

సంపద వృద్ధి చెందితే ప్రజలందరికీ ఆనందమే. అయితే, ఆ అభివృద్ధిలో పేదలకు వాటా దక్కకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. జీడీపీ పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ప్రజల కొనుగోలుశక్తి, జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో అడుగు ముందుకుపడాలి. అప్పుడే ‘అభివృద్ధికి’ అర్థం, పరమార్థం ఉంటుంది. అలా కాకుండా నయవంచనతో కూడిన ఆర్థికాభివృద్ధి జపంచేస్తూ, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవటం అభివృద్ధి కాజాలదు.

నేడు వివిధ తరగతుల ప్రజానీకానికి ఇస్తున్న రాయితీలను పథకం ప్రకారం తొలగించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించాలనే మాయమాటలతో స్థూల జాతీయోత్పత్తిలో సబ్సిడీల శాతాన్ని 2012-13 ఆర్థిక సంవత్సరంలో రెండు శాతానికి, అటుపై 1.75 శాతానికి, అలా క్రమేపీ కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకున్నది. ఆహారం, చమురు ఉత్పత్తులు, ఎరువులపై ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సిడీల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలనే దుర్బుద్ధితో పథకం ప్రకారం పావులు కదుపుతున్నది. ప్రథమ చర్యగా దారిద్య్రరేఖ నిర్థారణకు అసంబద్ధమైన, అశాస్త్రీయమైన ప్రాతిపదికలను వర్తింపజేస్తూ పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపెట్టే దుర్మార్గానికి పాల్పడింది.

అందులో అంతర్భాగంగా కేంద్ర ప్రణాళికా సంఘం రూపొందించిన నివేదిక నవ్వులపాలైంది. పట్టణ ప్రాంతాలలో రూ.32, గ్రామీణ ప్రాంతాలలో రూ.26ల రోజువారీ ఆదాయం లోపు ఉన్నవారిని మాత్రమే దారిద్య్రరేఖ దిగువన జీవిస్తున్నవారుగా పరిగణించాలని ఆ నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు. ఆ గణాంకాలు చూసి సభ్యసమాజం ముక్కున వేలేసుకున్నది. దారిద్య్రరేఖ దిగువన జీవిస్తున్న జనాభాను తగ్గించి చూపడం ద్వారా సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలనే కక్కుర్తి ఆలోచన తప్ప మరొకటి కాదు.

‘ఆమ్ ఆద్మీ’ పేరు చెప్పుకొని అధికార పీఠమెక్కి, పేదల బతుకులను ఛిద్రం చేసే ఆర్థిక విధానాలను అమలుచేస్తున్నారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కనీసం నియంత్రించలేని చేతకాని ప్రభుత్వం, పతనమైపోతున్న ప్రజల కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను, నిరుద్యోగాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించడం ప్రజా ప్రభుత్వానికి తగునా?

మరొక వైపున ‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు’ ప్రజలపై పెనుభారాలు మోపారు. రైల్వే బడ్జెట్ కంటే ముందే సరుకు రవాణా ఛార్జీలను ఇరవై మూడు శాతం పెంచి, రూ.16,000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి ప్రభుత్వం పూనుకొన్నది. అటుపై అన్ని తరగతుల రైల్వే ప్రయాణికుల ఛార్జీలను పెంచాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2012-2013 వార్షిక బడ్జెట్‌ను ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును 9.5 నుంచి 8.25 శాతానికి తగ్గించింది. ఐదు కోట్ల మంది ఉద్యోగులు, కార్మికుల డిపాజిట్లపై ఇచ్చే సబ్సిడీలకు పెద్ద ఎత్తున కత్తెరవేశారు. ఎరువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలో ఇప్పటికే ఇరవై శాతానికిపైగా తగ్గించేశారు.

సబ్సిడీల వ్యవస్థకు మంగళంపాడి, పేదల మెడలకు ఉరితాళ్లు బిగించాలని నిశ్చయించుకొన్నది. ఈ పథకంలో అంతర్భాగంగా నందన్ నీలేకర్ నేతృత్వం లోని టాస్క్‌ఫోర్స్ చేసిన సిఫార్సును ఆమోదించి తేనెబూసిన కత్తి లాంటి నగదు బదిలీ పథకాన్ని అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఆధార్ కార్డు ఆధారంగా అర్హులను నిర్ధారించింది. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాలు, రంగాలలో అమలుకు శ్రీకారం చుట్టింది, మూడు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో వంటగ్యాస్‌ను మార్కెట్ ధరకు అంటే 14.5 కేజీల సిలిండర్‌ను రూ.750లకు పైగా విక్రయించి, సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారులకు బ్యాంకు ఖాతాలలో జమచేసే ‘పెలైట్ ప్రాజెక్టు’ను మైసూర్‌లో అమలుచేయడానికి పచ్చజెండా ఊపారు.

ఇదే తరహాలో కిరోసిన్ పథకాన్ని రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో అమలుకు పూనుకొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో ఆధార్‌కార్డుల ఆధారంగా రేషన్ కార్డులను కుదించే ప్రయోగశాలగా మొదట జార్ఖండ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇలా మూడు పెలైట్ ప్రాజెక్టులతో మొదలు పెట్టి దేశవ్యాప్తంగా వీటిని విస్తరించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసుకొని కార్యాచరణకు దిగింది. దీనిని బట్టి ‘ఆమ్ ఆద్మీ’ సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తేటతెల్లమైంది.

సామాజిక భద్రతను కొంత మేరకైనా కల్పించే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు నేటి ప్రభుత్వం ఎసరుపెట్టడానికే కృత్రిమంగా పేదల సంఖ్యను తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. 1993-1994 నుండి 2004-05 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఏడాదికి 0.74% పేదరికం తగ్గుతూ వస్తే 1994-05 నుండి 2009-10 మధ్య యూపీఏ పాలనా కాలంలో ఏడాదికి 1.5% చొప్పున తగ్గిందని పేర్కొన్నారు. 2005 మార్చి 1 జనాభా లెక్కల ప్రాతిపదికన 2004 లో 37.2% ఉంటే 2010 మార్చి 1 నాటి జనాభా ఆధారంగా 29.8 శాతానికి దారిద్య్రరేఖ కింద జీవిస్తున్న జనాభా సంఖ్య తగ్గిందని వెల్లడించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్నా దేశంలో దాదాపు 36 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు.

పేదరిక నిర్ధారణ శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించటం లేదు. తాజా నివేదికలను బట్టి దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది చాలినంత ఆహారం తీసుకోవడం లేదు. 1993-94లో గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి తీసుకున్న ఆహారం 2,153 క్యాలరీలు ఉండగా, 2009-10లో అది 2,020 క్యాలరీలకు, పట్టణ ప్రాంతాలలో 2,071 నుంచి 1,946 క్యాలరీలకు పడిపోయిందని నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ తన 66వ అధ్యయన నివేదికలో పేర్కొంది. ప్రొటీన్ ఆహారమైన మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాల వినియోగం గ్రామ సీమల్లో 60.2 గ్రాముల నుండి 55 గ్రాములకు, పట్టణాలలో 57.2 గ్రాముల నుండి 53.5 గ్రాములకు పడిపోయిందని చెప్పింది. 18 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న సాధారణ పురుషులకు 2,320 క్యాలరీలు అవసరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ చెబుతున్నది.

కఠిన దారిద్య్రం పర్యవసానంగా ఆకలి బాధలు అనుభవించే వారి సంఖ్య పెరుగుతున్నది. పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో పలు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు పలుకుతున్నా... పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. శిశు మరణాల సంఖ్య తగ్గడం లేదు. అదుపు చేయలేని ద్రవ్యోల్బణం, ఒకానొక దశలో ఇరవై శాతానికి మించిన ఆహార ద్రవ్యోల్బణం, నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పతనమవుతున్న రూపాయి విలువ, ప్రజల కొనుగోలుశక్తి, క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, బలంగా వేళ్లూనుకొని ఉన్న బాల కార్మికవ్యవస్థ, విద్య, వైద్యం, నివాసం వగైరా కనీస మానవ హక్కుల అమలు స్థితిగతులను గానీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.

పేదరిక నిర్మూలన పథకాలపైన, సబ్సిడీల రూపంలో చేస్తున్న ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా కుదించుకోవాలన్నదే దీని వెనకాల దాగి ఉన్న అసలు సిసలైన చిదంబర రహస్యం. కానీ, పైకి మాత్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం, రాబోయే ఆహార భద్రతా చట్టం దారిద్య్రరేఖ ప్రాతిపదికపైన అమలు చేయడంలేదని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా బుకాయిస్తున్నారు. కానీ ఆచరణలో తద్భిన్నంగా చర్యలు చేపడుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని పణంగా పెట్టి, ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో వేగంగా అడుగులు ముందుకు వేయాలన్న కృతనిశ్చయంతో మన్మోహన్ బృందం ఉన్నట్లు దీన్ని బట్టి రూఢి అవుతున్నది. 12వ పంచవర్ష ప్రణాళికలో మొదటి ఏడాది (2012-13) బడ్జెట్ దీనికి అద్దం పడుతున్నది.

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే అధికారంలో కొనసాగే అవకాశాలు మృగ్యమైపోయాయన్న నిర్ధారణకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుంది. అందుకే కాబోలు, ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజలపై కక్ష గట్టి, ముప్పేట దాడికి బరితెగించింది. అయాచితంగా లభించిన ప్రధాన మంత్రి పదవిలో మన్మోహన్‌సింగ్ రికార్డుస్థాయిలో కొనసాగారు. మూడోసారి గద్దెనెక్కే ముచ్చట లేదని తేలిపోయింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆర్థికవేత్తగా ఆయన్ను ఆ నోటా ఈ నోటా కొందరు ప్రశంసిస్తూ ఉంటారు.

నయా ఉదారవాద ఆర్థిక విధానాల జపం చేస్తున్న ఆయన బృందంలోని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు అహ్లూవాలియా, ప్రధానికి ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ ఎన్.రంగరాజన్, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, మాజీ ఆర్థికశాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీ... ఆర్థిక సంస్కరణల ముసుగులో విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు అత్యంత నమ్మిన బంట్లుగా సేవలందించడంలో నిమగ్నమయ్యారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతానికి తన ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని కాపాడుకుంటూ తన మానసపుత్రిక అయిన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల అమలును సంపూర్ణంగా సాకారం చేసుకోవాలని మన్మోహన్‌సింగ్ పట్టుదలగా పనిచేస్తున్నారు. ఆర్థికవేత్తగా దోపిడీశక్తుల పక్షాన నిలబడ్డ మన్మోహన్‌కు రాజకీయ నాయకత్వ లక్షణాలు ఏమాత్రం లేవని, ఆయనకు పేదసాదల సంక్షేమంపై శ్రద్ధ లేదని నూటికి నూరుపాళ్లు రుజువైపోయింది.
  

Tuesday, June 19, 2012

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల "కుక్కమూతి పిందెలు"


Published in June 2012 Janabalam Telugu Monthly                  
                                             
ఆర్థిక కుంభకోణాలు , అవినీతి , అడ్డగోలు దోపిడి , సహజ‌వనరులను కొల్లగొట్టి అక్రమ సంపాదనతో కొంత మంది అమాంతం కుబేరులై పోతున్నారు . ప్రపంచంలోని కుబేరుల(బిలియనేర్స్ ) జాబితాలోకెక్కుతున్న భారతీయుల పేర్లలను చూసుకొని మురిసిపోతున్నాము . 2012 మార్చి నాటికి ప్రపంచంలో 1,226 మంది అమెరికన్ డాలర్ బిలియనీర్స్ ఉంటే వారిలో 48 మంది భారతీయులున్నారు . వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 22.36 బిలియన్ డాలర్స్ నికరమైన ఆస్తుల విలువతో దేశంలో ప్రధమ స్థానాన్ని ఆక్రమిస్తే , లక్ష్మీ మిట్టల్ 20.7 బిలియన్ డాలర్స్ ఆస్తితో ద్వితీయ స్థానంలో నిలిచారని పోర్బ్స్ సంస్థ ప్రకటించింది . కుబేరులుగా ఆవిర్భవించిన‌ వారి వద్ద అంత పెద్ద ఎత్తున‌ సంపద ఎలా పోగుబడ్డదన్న హేతుబద్దమైన ఆలోచన చేసే చైతన్యం ప్రజల్లో కొరవడింది . ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరకుండా వ్యక్తుల బొక్కశాలల‌కు చేరిపోతున్నాయనడానికి ఇది ప్రబల నిదర్శనం .
దోపిడీకి మూలాలు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి . గడచిన రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల పునాదులపై నిర్మించబడుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ దుష్పలితాలు నేడు జాతియావత్తునూ కలచివేస్తున్నాయి . కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెలుగులోకి తెచ్చిన లక్షాడెబ్బయ్ ఐదు వేల కోట్ల రూపాయల టెలికమ్యూనికేషన్స్ కుంభకోణం , దానికంటే పెద్దదైయిన‌ బొగ్గు గనుల కుంభకోణం , మన రాష్ట్రంలో  సి.బి.ఐ. విచారణలో ఉన్న "మేలుకు ప్రతి మేలు ( క్విడ్ ప్రొ కో)" రూపంలో ఆర్జించిన‌ అక్రమాస్తుల కేసు వగైరా అన్నీ ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ కుక్క మూతి పిందెలే! వీటికి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో కారణభూతులైన‌ పాలకులు , సరళీకృత ఆర్థిక విధానాల జ‍పం చేస్తున్న ఆర్థిక వేత్తలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు . పైపెచ్చు అభివృద్ధికి సంస్కకరణలే సోపానమని ఊదరకొడుతున్నారు . తద్వారా మన ఆర్థిక వ్యవస్థను , ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు . మార్కెట్ ఆర్థిక విధానాల క్రీడలో "దొరికితే దొంగ , దొరకక పోతే దొర" అన్న నానుడిగా పాలన సాగుతున్నది . రాజ్యాధికారంలో ఉన్న పాలక పార్టీ నాయకులు , వారి కనుసన్నల్లో మెలిగే అధికారగణం , పెట్టుబడిదారులు ( పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు , కాంట్రాక్టర్లు వగైరా ) అపవిత్ర కలయికలతో దుష్ట కూటములుగా ఏర్పడి దేశం మీద పడి అడ్డగోలుగా జాతి సంపదను దోచేస్తున్నారు . ప్రజల ఉపాథిని గొడ్డలిపెట్టుకు గురిచేస్తున్నారు , అక్రమ సంపాదనతో త్వరితగతిన కుబేరులుగా ఆవిర్భవిస్తున్నారు .
ఆర్థిక‌ సంస్కరణల అమలులో ప్రయోగశాలగా మారిన మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తే అవినీతి పెచ్చుమీరి పోవడానికి మూలాలెక్కడున్నాయో! స్పష్టంగా బోధపడుతుంది . గడచిన రెండు దశాబ్దాలుగా అమలు చేయబడుతున్న   ప్రయివేటీకరణ , సరళీకరణ విధానాల దుష్ఫలితాలు నేడు భౌతికంగా దృశ్య రూపంలో మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి . అధికార దుర్వినియోగంతో అక్రమార్జనకు పాల్పడిన రాజకీయ నాయకత్వం , అధికార చట్రంలో ఉన్నత శ్రేణి కుర్చీల్లో కూర్చొని పాలనా వ్యవహారాల నిర్వహణలో క్రియాశీల పాత్రదారులైన‌  ఐ.ఎ.యస్ . అధికారులు , పారిశ్రామికవేత్తలు కూడబలుక్కొని ఏ విధంగా ప్రజల ఉమ్మడి ఆస్తులను దోచుకొన్నారో! పామరులకు సహితం అర్థమయిపోయింది . కాకపోతే ప్రజల చైతన్యం ఒక దశ వరకే పరిమితమయినట్లు కనబడుతున్నది . ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రజల ఉమ్మడి ఆస్తులను ఎవరైనా దోచుకొంటే " మన ఆస్తులను దోచుకోలేదు కదా! " అన్న సాచివేత‌ మనస్థత్వంతో అత్యధిక ప్రజానీకం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. "దున్నే వానికి భూమి నినాదం" మరుగునపడి పారిశ్రామికీకరణ ముసుగులో ప్రభుత్వ భూములు , అసైన్డ్ భూములు, పట్టా భూములు, సాగుకు లాకీ కాని భూములా! సారవంతమైన సాగు భూములా! అన్న విసక్షణ లేకుండా లక్షలాది ఎకరాలు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు , థర్మల్ విద్యుత్ కేంద్రాలు, కోస్టల్ కారిడార్ , సైన్స్ సిటీ వగైరా పేర్లతో పారిశ్రామికవేత్తలు , రియలెస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి చేరిపోయాయి . అభివృద్ధి , ఉపాథి కల్పనే ప్రధాన లక్ష్యమని నమ్మబలికి , ప్రజానీకాన్ని వంచించారు . క్రిష్ణా _ గోదావరి బేసిన్ లోని అపారమైన సహజ వాయువు నిక్షేపాలు మొదలుకొని బాక్సయిట్ , బెరైటీస్ , ఇనుప ఖనిజం గనులు , నదుల్లోని ఇసుక తిన్నెల వరకు దోపిడీకి నిలయాలుగా మారిపోయాయి . తొమ్మిది వందల కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉన్న సముద్రతీరాన్ని దోపిడీ శక్తులకు అప్పనంగా అప్పజెప్పే కుటిల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి .
ప్రయివేటు పెట్టుబడులకు అగ్రతాంభూలం , ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి.) పథకాల జపం చేస్తూ నిలువు దోపిడీకి పూనుకొన్నారు. అందులో ఒకటి వాన్ పిక్ ప్రాజెక్టు . గుంటూరు , ప్రకాశం జిల్లాలలో రెండు ఓడరేవులు , పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పేరుతో ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూమిని , తొంబై కిలోమీటర్లకు పైగా సముద్రతీరాన్ని వాన్ పిక్ సంస్థకు ప్రభుత్వం దారాదత్తం చేయడానికి తీసుకొన్న చర్యలు, ప్రభుత్వ ఉత్తర్వుల‌ గుట్టురట్టయ్యింది . నాడు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖా మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం సి.బి.ఐ. విచారణను ఎదుర్కొంటూ, అరెస్టు చేయబడి , జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు . రాజ్యాంగానికి లోబడి , చట్ట పరిథిలో జవాబుదారితనంతో , పారదర్శకంగా వ్యవహరిస్తానని మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ఆనాటి ముఖ్యమంత్రి డా: వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో వాన్ పిక్ సంస్థకు భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశానని అరెస్టు తరువాత విధి లేని పరిస్థితుల్లో చేసిన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు . దాన్ని స్వీకరించిన‌ ముఖ్యమంత్రి వాన్ పిక్ సంస్థకు భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ప్రాథమిక ఆధారాలున్నాయని రుజువైన తరువాత కూడా ఎందుకు ఆ ఉత్తర్వులను రద్దు చేసి , అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోలేదన్న సందేహాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది . మోపిదేవి వెంకటరమణను వెనకేసుకు రావడం , జగన్ అక్రమాస్తుల కేసులో కీలకమైన , వివాదాస్పదమైన‌ 26 జీ.వో . ల విడుదలకు బాధ్యత వహించాల్సిన మిగిలిన ఐదుగురు మంత్రులు సుప్రీం కోర్టు తాఖీదులందుకొన్న తరువాత కూడా వారిని ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగించడం , జీ.వో.లన్నీ సక్రమంగానే ఉన్నాయని బుకాయించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం తన విశ్వసనీయతను కోల్పోతున్నది . ఈ పూర్వరంగంలోనే మద్యం సిండికేట్ల అవినితి , అక్రమాల కేసుపై ఏ.సి.బి. చేస్తున్న విచారణను నీరుగార్చడానికి సంబంధిత విచారణాధికారులను ప్రమోషన్ల ముసుగులో బదిలీలు చేయడం ద్వారా ప్రభుత్వం అబాసుపాలైయ్యింది. ఒకనాడు వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై విచారణను ఎదుర్కొని , ఈనాడు బినామీ పేర్లతో మద్యం వ్యాపారం చేస్తూ అక్రమార్జనకు నిస్సిగ్గుగా పాల్పడిన బొత్సా సత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతూ అవినీతిపై నీతి వచనాలు వల్లిస్తుంటే ప్రజలకు అసహ్యం కలుగుతున్నది . అవినీతిపరులు అందలమెక్కి మాట్లాడుతుండ‌డంతో అవినీతి వ్యతిరేక పోరాటానికి కళంకం వస్తున్నది .
స్వయం ప్రతిపత్తి లేని సి.బి.ఐ.ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకొంటూ, అధికార దుర్వినియోగం చేస్తున్నదన్న అపవాదుల మధ్య  రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం వై.యస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును సి.బి.ఐ. విచారిస్తున్నది . నిష్పక్షపాతంగా విచారణ జరపడమే కాదు , నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నదన్న భావన ప్రజలకు కలిగించడం ద్వారా విశ్వసనీయతను పెంచుకోవలసిన బాధ్యత కూడా సి.బి.ఐ. పై ఉన్నది . అప్పుడే సి.బి.ఐ. ప్రతిష్ట పెరుగుతుంది , ప్రజల మద్దతును పొందుతుంది . అక్రమార్జనకు ఊతమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసిన మంత్ర్రుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేసి మిగిలిన వారిపై కఠినంగా వ్యవహరించక పోవడం, అరెస్టు చేయకపోవడం , అలాగే దాదాపు పదినెల్లుగా సాగదీస్తూ వచ్చి తీరా మధ్యంతర ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత హడావుడిగా వ్యవహరించడం జన సామాన్యానికి అంత రుచించలేదు . పది రోజులాగితే కొంపలారిపోయేదేం లేదు గదా! అన్న ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పలేని పరిస్థితిని కొనితెచ్చుకొన్నది. సాంకేతికంగా సమర్థించుకోవచ్చు , కానీ ప్రజల్లో కలిగిన అనుమానాలను నివృత్తి చేయడానికి అది సరిపోదు . తద్వారా అవినీతిని నిగ్గుదేల్చే అసలు లక్ష్యానికే అపచారం జరిగే ప్రమాదం ఉంది . దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇచ్చింది . సి.బి.ఐ. సాక్షి పత్రిక మరియు టెలివిజన్ చానల్ బ్యాంక్ అకౌంట్స్ ను దిగ్భందించిన మరుక్షణమే ఆగమేఘాలపై అడ్వర్టజ్ మెంట్స్ పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం , పాత్రికేయులు వీధికెక్కడం , హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయడం లాంటి పరిణామాలు అక్రమాస్తుల కేసు విచారణపై నీలినీడలు కమ్ముకోవడానికి కాస్తా అవకాశం కల్పించాయని చెప్పవచ్చు .
విచారణను నిష్పక్షపాతంగా , పారదర్శకతతో , రాగద్వేషాలకు , సంకుచిత రాజకీయ వత్తిళ్ళకు అతీతంగా త్వరితగతిన పూర్తి చేసి , నిజాన్ని నిగ్గు దేల్చాలని ప్రజలు కోరుకొంటున్నారు . అధికార దుర్వినియోగానికి , అవినీతికి పాల్పడి ప్రభుత్వ మరియు ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన వారందరూ అత్యమంగా కఠినంగా శిక్షించబడాలి . అక్రమార్జనపరుల పాలైన‌ భూములు , గనులు తదితర సహజ వనరులను ప్రభుత్వం తక్షణం స్వాధీనం చేసుకొని , ప్రజలకు సొంతం చేసి , నిజాయితీని రుజువు చేసుకోవాలి . అవినీతి అంతంకై సాగుతున్న ఉద్యమంలో ఈ కేసు ద్వారా వెలుగు చూసే వాస్తవాలు , నిర్ధారణలు , శిక్షలు ఒక ముందడుగు కావాలని ప్రజలు కోరుకొంటున్నారు . ప్రజల్లో అవినీతి వ్యతిరేక ఛైతన్యాన్ని మరింత రగుల్కొల్పి , ఈ లోపభూయిష్టమైన వ్యవస్థపై తిరగబడేలా చేసి, మార్పు వైపు నడిపించే శక్తివంతమైన ప్రజా ఉద్యమం తక్షణావసరం .

Thursday, May 24, 2012

సమ్మిళిత అభివృధ్ధి ఇదేనా?

Published in Surya Daily on 24th May 2012 and also Janabalam Monthly
జనాభా గణనలో అంతర్భాగంగా 2011 సంవత్సరం సేకరించిన గృహ వసతి, ఇళ్ళలోని మౌలిక సదుపాయాలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ వెల్లడించింది. ఆ గణాంకాలు స్థూలమైనవి అయినప్పటికీ రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రగతి నివేదికగా భావించవచ్చు. అయినా సంస్కరణల లక్ష్యం అభివృద్ధేనని ప్రభుత్వాధినేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు, ఈ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్న ఆర్థికవేత్తలు ప్రజల చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి నినాదంలోని డొల్లతనాన్ని మాత్రం జనాభా గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా మన దేశం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 6.9శాతం ఆర్థిక వృద్ధి రేటుతో ముందు వరుసలో పయనిస్తున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త డా: మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నది.

అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు చేరుతున్నాయని దగాకోరు మాటలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జనాభా గణన శాఖ క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన నివేదికను వాస్తవిక దృష్టితో విశ్లేషిస్తే ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో విస్పష్టంగా బోధపడుతుంది . మానవ నాగరికతకు, సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి అద్దం పట్టే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.1) మరుగుదొడ్ల సౌకర్యం. 2) ఇళ్ళ నిర్మాణం. 3) రక్షిత మంచి నీటి సదుపాయం. 4) విద్యుత్తు వినియోగం. 5) వంట గ్యాసు వినియోగం. 6) గ్రామీణ- పట్టణ ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అంతరాలు. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం ఆవాసాల సంఖ్య 24,66,92,667. గ్రామీణ ప్రాంతాలలో 16,78,26,730, పట్టణాలలో 7,88,65,937 ఉన్నాయి. మన రాష్ట్రంలో మొత్తం ఆవాసాల సంఖ్య 2,10,24,534. గ్రామాల్లో 1,42,46,309, పట్టణాల్లో 67,78,225 ఉన్నాయి.

దేశం మొత్తంగా చూస్తే గ్రామసీమల్లో ఆవాసాల పెరుగుదల 21.4 శాతం , పట్టణాలలో 46.9 శాతం ఉంటే మన రాష్ట్రంలో గ్రామాల్లో 12.4 శాతం, పట్టణాల్లో 62.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. జీవనాధారంగా ఉన్న వ్యవసాయం సంక్షోభంలో కూరుక పోవడం, చేతి వృ త్తులు కనుమరుగెై పోతుండడం , ఉపాథి అవకాశాలు తగ్గిపోవడం, నాణ్యమైన విద్య, వెైద్యం, విద్యు త్తు, రహదారులు వగెైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం- పర్యవసానంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసల ప్రక్రియ కొనసాగుతున్నది.
దేశంలో 36.4 శాతం, రాష్ట్రంలో 43.1 శాతం మాత్రమే పక్కాగా పెైపుల ద్వారా నీటి సరఫరాతో పారిశుద్ధ్య సౌకర్యం కలిగిన మెరుగెైన మరుగుదొడ్లు ఉన్నాయి. దేశంలో 53.1 శాతం, రాష్ట్రంలో 50.4 శాతం ఆవాసాలకు అసలు మరుగుదొడ్ల సదుపాయాలే లేవు. జార్ఖండ్‌లో 76.6 శాతం, ఒడిషాలో 76.6 శాతం, బీహార్‌లో 75.8 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు.

వీరిలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నవారు లేదా సామాజికంగా వెనుకబడ్డవారే అన్నది వివాదరహితం. అంతర్జాతీయ సమాజం అనేకాంశాలను కనీసావసరాలుగా ప్రకటించింది. 2015 నాటికి ఆకలికి, పేదరికానికి ముగింపు పలకాలన్న లక్ష్యంతో పాటు 8 సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాల ముందు అజెండాగా ఉంచింది. అందుకు మన ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కూడు, గుడ్డ, ఇల్లు కనీసావరసరాలని అందరూ చెప్పే మాట. వాటిలో ఇళ్ళ సమస్యను పరిశీలిద్దాం. సొంతత ఇళ్ళున్న వారు గ్రామీణ ప్రాంతాలలో 9.7 శాతం మంది ఉండగా పట్టణ ప్రాంతాలలో 69.2 శాతం మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాఫల్యం కాక, అద్దె ఇళ్ళల్లో నివసిస్తున్న వారు 27.5శాతంగా ఉన్నారు. సంపాదనలో గణనీయమైన భాగం అద్దెలు చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో ఆహారంపెై చేసే ఖర్చు తగ్గిపోతున్నదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

ఇళ్ళ నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను బట్టి ప్రజల ఆర్థిక స్థోమతను అంచనా వేయవచ్చు. గడ్డి, బోద, ఎదురు బొంగులు వంటి సామాగ్రితో నిర్మించుకున్న ఇళ్ళు దేవంలో 9 శాతం ఉంటే గ్రామాల్లో 11.9 శాతం, పట్టణాల్లో 2.7 శాతం, మట్టి/కాల్చని ఇటుకలతో నిర్మించుకున్నవి దేశంలో 23.7 శాతం అయితే గ్రామాల్లో 30.5 శాతం, పట్టణాల్లో 9.3 శాతం ఉన్నాయి. కల్చిన ఇటుకులతో నిర్మించుకున్నవి దేశంలో 47.5 శాతం ఉంటే గ్రామాల్లో 40 శాతం, పట్టణాల్లో 63.5 శాతం ఉన్నాయి. కాంక్రీట్‌ నిర్మాణాలు దేశంలో 3.5 శాతం అయితే గ్రామాల్లో కేవలం 1.7 శాతం, పట్టణాల్లో 7.2 శాతం ఉన్నాయి. ఇళ్ళ లోపల మట్టి నేల ఉన్నవి గ్రామసీమల్లో 62.6 శాతం ఉంటే పట్టణాల్లో 12.2 శాతం, సిమెంటు నేల 24.2 శాతం, 45.8 శాతం, మొసాయిక్‌ లేదా టైల్‌ వేసినవి 3.7 శాతం, 25.8 శాతం చొప్పున నిర్మించినవి ఉన్నాయి. స్నానాల కోసం ప్రత్యేక గదుల సౌకర్యంలేని ఆవాసాలు గ్రామాల్లో 55 శాతం, పట్టణాల్లో 13 శాతం ఉన్నాయి.

ఇంటిబయటనే వంటావార్పూ చేసుకుంటున్న వారు గ్రామాల్లో 16.4 శాతం, పట్టణాల్లో 3.7 శాతం ఉన్నారు. కట్టెల మీదే ఆధారపడి వంట చేసుకుంటున్న వారి సంఖ్య గ్రామాల్లో 62.5 శాతం, పట్టణాల్లో 20.1 శాతం ఉన్నది. నాగరికతకు ప్రతిబింబంగా చూసే వంట గ్యాస్‌ వినియోగించుకుంటున్న వారు గ్రామాల్లో 11.4 శాతం మాత్రమే, పట్టణాల్లో కూడా 65 శాతం మందే ఉన్నారు. మురికి వాడల్లో జీవిస్తున్న పేదలకు, గ్రామాల నుండి వలస వచ్చిన పేదలకు వంట గ్యాస్‌ అందుబాటులో లేదు. కిరోసిన్‌ను వంట సరకుగా వాడుకుంటున్న వారు 7.5 శాతం మంది పట్టణాలలోనే ఉన్నారు. విద్యుత్‌ దీపాలకు నోచుకోని గ్రామీణ ప్రజలు 43.2 శాతం మంది ఉన్నారు. కిరోసిన్‌ దీపాల వెలుగుల్లో రాత్రిపూట కాలం గడుపుతున్నారు. కడకు పట్టణాల్లో కూడా 6.5 శాతం మందికి కిరోసిన్‌ దీపాలే దిక్కు. మురుగు నీటి కాలువల నిర్మాణంలేని గ్రామాలు 63.2 శాతం, అలాగే 18.2 శాతం పట్టణాలూ ఉన్నాయి. పట్టణాల్లో కేవలం 44.5 శాతం మాత్రమే భూమి లోపల లేదా మూసివేసిన మురుగు కాల్వల నిర్మాణాలున్నాయి. గ్రామాల్లో అయితే 5.7 శాతం మాత్రమే. మూసివేయని మురుగు కాలవల్లో గ్రామాల్లో 31 శాతం, పట్టణాల్లో 37.3 శాతం ఉన్నాయి.

ఆ ప్రాంతాల్లో ఆవాసాలున్న ప్రజలు దుర్గంధం, కాలుష్య వాతావరణం మధ్య తరచు అంటు వ్యాధుల బారిన పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు.పెైపుల ద్వారా రక్షిత త్రాగు నీటి సరఫరా లబ్ధిదారులు గ్రామాల్లో కేవలం 17.8 శాతం ఉండగా, పట్టణాల్లో 62 శాతంఉన్నారు. అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లో, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో నివసిస్తున్న 38 శాతం ప్రజలు రక్షిత త్రాగు నీటికి నోచుకోవడం లేదన్న మాట. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణం. శుద్ధి చేయని నీటిని పెైపుల ద్వారా పొందుతున్న వారు 13 శాతం, బావుల మీద 13.3 శాతం, బోరు బావుల మీద 8.3 శాతం ఆధారపడి ఉన్నారు. ఈ తరహా వనరుపెై ఆధారపడ్డ వారు తీవ్రమైన విద్యుత్‌ కొరతతో సతమతమవుతున్న మనలాంటి రాష్ట్రాలలో తాగు నీటికి కటకటలాడిపోయే దుస్థితి దాపురిస్తుంటుంది. అత్యధికంగా 43.6 శాతం మంది తాగు నీటి కోసం చేతి పంపుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. నిత్య కరవు పీడిత, మెట్ట ప్రాంతాలలోని భూగర్భ జలాలు తరగిపోతున్నాయి.

చేతి పంపులు వట్టిపోవడంతో గొంతులు తడారిపోతున్నాయి. బిందెడు తాగు నీటి కోసం గంటల తరబడి క్యూలెైన్లలో మహిళలు నిలబడ్డాలు, ఘర్షణలు, చిన్న పాటి యుద్ధాలను తలపించే దృశ్యాలు సర్వ సాధారణమైపోయాయి. తాగునీటి వ్యాపారం అత్యంత లాభదాయకమైనదిగా తయారెైంది. అనేక జబ్బులు కలుషిత తాగు నీటి నుండే సంక్రమిస్తాయి. అనేక ప్రాంతాల ప్రజలు ఫ్లోరెైడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. కానీ కనీసం రక్షిత తాగు నీరందించలేని ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. నిజమే, దేశం ఆర్థికాభివృద్ధిలో వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నది. స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల సూచిక ప్రకారం 2010-11లో 71.57, 412 కోట్లుగా కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. సంపద పెరుగుతున్నది.
కుబేరులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతున్నది. కానీ పెై అంశాలన్నింటినీ నిశితంగా శాస్ర్తీయ పద్ధతిలో విశ్లేషిస్తే గ్రామీణ, పట్టణ ప్రజానీకం, పట్టణాల్లోని మురికివాడల్లోని ఆవాసాల్లో నివసించే ప్రజలకు సంపన్నులకు మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు, మౌలిక సదుపాయాల లేమి వంటి అత్యంత తీవ్రమైన సమస్యలను భారత జాతి ఎదుర్కొంటున్నదన్న అంశం నిర్వివాదం.పన్నెండవ పంచవర్ష (2012-17) కాలంలోనెైనా ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ దక్కేలా చేయాలంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలలో సమూలమైన మార్పులు అనివార్యంగా చేయాలి. కేవలం వంచనతో కూడిన నినాదాలతో పరిమితం కాకుండా సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ద్వారా పెైన పేర్కొన్న రంగాలలో ప్రగతి సాధించి, ప్రజలందరికీ నాణ్యమైన జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపెై ఉన్నది.

పేదలపై ఆర్థిక సంస్కరణవాదుల దాడి


Published in Visalaandhra Daily on 19th May 2012            
                                     
సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో పేదరికాన్ని తగ్గించడమన్నది ప్రధాన వ్యూహమని డా: మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యు.పి.ఎ. 2 ప్రభుత్వం పదేపదే వల్లెవేస్తుంటుంది . ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం మాత్రం 2011_12 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) 6.9% వృద్ధి రేటు నమోదు చేసుకొని ముందు వరుసలో పయనిస్తున్నదని , కానీ 11వ పంచవర్ష ప్రణాళికా (2007_12) కాలంలో 9% లక్ష్యంగా పెట్టుకొన్నా సగటున 8.2 శాతాన్ని సాధించామని, 12వ పంచవర్ష ప్రణాళికా(2012_17) కాలంలోనైనా 9% చేరుకోవాలంటే సంస్కరణల అమలులో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ధ్వందంగా ప్రకటించింది . సంపద వృద్ధి చెందితే ప్రజల భవిష్యత్తుకు బరోసా లభిస్తుందని ఆశిస్తాం . ఆ జాతి సంపద‌లో పేదలకు వాటా దక్కకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు . జి.డి.పి. పెరుగుదలకు అనుగుణంగా ఉపాథి అవకాశాలు మెరుగుపడాలి , ప్రజల కొనుగోలు శక్తి మరియు జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో వేగంగా అడుగు ముందుకు పడాలి. ప్రజలందరికీ నివాసం , విద్య , వైద్యం వగైరా మానవ హక్కులను అనిభవించే భౌతిక పరిస్థితులు కల్పించబడాలి . అప్పుడే అభివృద్ధి అన్న పదానికి అర్థం , పరమార్థం ఉంటుంది . అలా కాకుండా నయవంచనతో కూడిన ఆర్థికాభివృద్ధి జపం చేస్తూ , సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాలన్న రాజ్యాంగ స్ఫూర్థికి తూట్లుపొడ‌డం అభివృద్ధి అని ఎలా అనిపించుకొంటుంది?

నేడు వివిధ తరగతుల ప్రజానీకానికి ఇస్తున్న సబ్సీడీలను పథకం ప్రకారం తొలగించే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించాలనే మాయ మాటలతో జి.డి.పి.లో సబ్సీడీల శాతాన్ని 2012_13 ఆర్థిక సంవత్సరంలో 2% నికి , అటుపై 1.75% నికి , అలా క్రమేఫీ కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకొన్నది. ఆహారం , చమురు ఉత్పత్తులు , ఎరువులపై  ప్రభుత్వం వెచ్చిస్తున్న సబ్సీడీల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని పథకం ప్రకారం పావులు కదుపుతున్నది . ప్రప్రథమ చర్యగా దారిద్ర రేఖ నిర్ధారణకు అసంబద్ధమైన , అశాస్త్రీయమైన ప్రాతిపదికలను వర్తింపజేస్తూ పేదల సంఖ్యను కృత్రిమంగా తగ్గించి చూపెట్టే దుర్మార్గానికి పాల్పడింది . అందులో అంతర్భాగంగా కేంద్ర ప్రణాళికా సంఘం రూపొందించిన నివేదిక నవ్వుల పాలైయ్యింది . పట్టణ ప్రాంతాలలో రు.32/‍.. , గ్రామీణ ప్రాంతాలలో రు.26/.. లు రోజువారి ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే దారిద్ర రేఖ ( బి.పి.యల్.) క్రింద జీవిస్తున్న వారుగా పరిగణించబడతారని ఆ నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు . ఆ గణాంకాలు చూసి సభ్య సమాజం ముక్కున వేలేసుకొన్నది .ఇంత కంటే దారుణమైన , కౄరమైన "జోక్" మరొకటి ఉంటుందా ? అన్న సందేహం పామరులకు సహితం కలిగింది . దారిద్య రేఖ క్రింద జీవిస్తున్న జనాభాను తగ్గించి చూపడం ద్వారా సబ్సీడీల భారాన్ని తగ్గించుకోవాలనే కక్కుర్తి ఆలోచన తప్ప మరొకటి కాదు ." ఆమ్ ఆద్మీ" పేరు చెప్పుకొని అధికార పీఠమెక్కి , పేదల బ్రతుకులను చిద్రం చేసే ఆర్థిక విధానాలను అమలు చేస్తున్నారు . ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కనీసం నియంత్రించలేని చేతకాని ప్రభుత్వం , పతనమైపోతున్న ప్రజల కొనుగోలు శక్తిని , జీవన ప్రమాణాలను, నిరుద్యోగాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడం ప్రజా ప్రభుత్వానికి తగునా ? మరొక వైపున "మూలిగే నక్క మీద‌ తాటిపండు పడ్డట్లు" ప్రజలపై పెనుభారాలు మోపుతూనే ఉన్నారు .

సబ్సీడీల వ్యవస్థకు మంగళం పాడి , పేదల మెడలకు ఉరితాళ్ళు బిగించాలని నిశ్చయించుకొన్నది . ఈ పథకంలో అంతర్భాగంగా నందన్ నీలేకర్ నేతృత్వంలోని " టాస్క్ పోర్స్ " చేసిన సిఫార్సును ఆమోదించి "తేనె బూసిన కత్తెలాంటి"  నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది . సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆహారం , చమురు ఉత్పత్తులు , ఎరువులపై ఇస్తున్న రాయితీలు దుర్వినియోగం , అవినీతిపరుల పాలు కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్న ముసుగేసుకొన్నది . ఆధార్ కార్డు ఆధారితంగా అర్హులను నిర్ధారించి , ప్రయోగాత్మకంగా ఎంపిక చేసుకొన్న కొన్ని ప్రాంతాలు , రంగాలలో అమలుకు శ్రీకారం చుట్టింది . మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో  వంట గ్యాస్ ను మార్కెట్ ధరకు అంటే 14.5 కే.జి.ల సిలెండర్ ను రు.750 లకు పైగా విక్రయించి , సబ్సీడీ మొత్తాన్నినేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేసే " పైలెట్ ప్రాజెక్టు "ను మైసూర్ లో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు . ఇదే తరహాలో కిరోసిన్ పథకాన్ని రాజస్తాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో అమలుకు పూనుకొన్నారు . ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో ఆధార్ కార్డుల ఆధారంగా రేషన్ కార్డులను కుదించే ప్రయోగశాలగా మొదట జార్కండ్ రాష్టాన్ని ఎంపిక చేసుకొన్నారు . ఇలా మూడు పైలెట్ ప్రాజెక్టులతో మొదలు పెట్టి దేశ వ్యాపితంగా వీటిని విస్తరించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసుకొని కార్యాచరణకు దిగింది . దీన్నిబట్టి "ఆమ్ ఆద్మీ" సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో! తేటతెల్లమయ్యింది . మన రాష్ట్రంలో "స్మాట్ కార్డ్ " రూపంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చౌక డిపోల్లో జరుగుతున్న అవకతవకల ప్రక్షాళన చేసే పేరిట‌ రంగారెడ్డి జిల్లా , చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోను ఒక పైలెట్ ప్రాజెక్టు అమలుకు సర్వే  చేశారు . కరీంనగర్ , తూర్పు గోదావరి జిల్లాలలో కూడా చేయబోతున్నారు . అత్యమంగా రాష్ట్రం మొత్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకొన్నది . ఆ డాలు ఎవరికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టారో! భవిష్యత్తులో తేలుతుంది . రాజకీయ లబ్ధి కోసం పొడుగు చేతుల పందేరం చేసి అనర్హులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వం తరువాత దశలో బోగస్ కార్డుల ఏరివేత పేరిట పేదల వద్ద ఉన్న రేషన్ కార్డులకు ఎసరు పెట్టటానికి బరితెగించిన ఉదంతాల అనుభవాలున్నాయి .

కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న కార్యాచరణలో అంతర్భాగంగానే దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న అభాగ్యుల గణాంకాల తయారీలో అంకెల గారడీకి పూనుకొన్నదని చెప్పక తప్పదు . బి.పి.యల్. పై సురేష్ టెండూల్కర్ కమిటీ రూపొందించిన నివేదికకు కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోద ముద్రవేసి మార్చి14, 2012న బహిరంగ ప్రకటన విడుదల చేసింది . దాని ప్రకారం 2009_10 సం. లో గ్రామీణ ప్రాంతంలో నెలకు రు. 672 . 80పై. ( రోజుకు రు.22 . 42 పై.), పట్టణ ప్రాంతాలలో రు.859 . 60పై. (రోజుకు రు.28 . 65పై.) లోపు సంపాదన ఉన్న వారు మాత్రమే దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న ప్రజానీకంగా గుర్తించబడతారు . మరొక ప్రకటనలో 2010_11లో గ్రామసీమల్లో  రు.26 , పట్టణ ప్రాంతాలలో రు.32 లకు లోపు సంపాదన ఉన్నవారు బి.పి.యల్. క్రింద ఉన్నట్లుగా పరిగణించబడతారని ముక్తాయింపు పలుకులు పలికారు . ఈ తరహా ఆదాయంతో ప్రస్తుత ధరల్లో ఏ కుటుంబమైనా అసలు మనుగడ సాగించ‌గలదా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న . తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఒక్కడుగు వెనక్కి వేసి మరొక‌ నిపుణుల కమిటీతో సమీక్షిస్తామని వాగ్దానం చేసి ప్రజాగ్రహాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసింది .

సామాజిక భద్రతను కొంత మేరకైనా కల్పించే సదుద్దేశంతో ప్రవేశ పెట్టబడిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత‌ ప్రభుత్వం ఎసరు పెట్టడానికే కృత్రిమంగా పేదల సంఖ్యను తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది .1993_1994 నుండి 2004_05 ఆర్థిక సంవత్సరాల‌ మధ్య కాలంలో ఏడాదికి 0.74% పేదరికం తగ్గుతూ వస్తే 2004_05 నుండి 2009_10 మధ్య యు.పి.ఎ. పాలనా కాల‍ంలో ఏడాదికి 1.5% చొప్పున తగ్గిందని పేర్కొన్నారు . 2005 మార్చి 1 జనాభా లెక్కల ప్రాతిపదికన 2004 లో 37.2% ఉంటే 2010 మార్చి 1 నాటి జనాభా ఆధారంగా 29.8% కి దారిద్య్ర రేఖ క్రింద జీవిస్తున్న జనాభా సంఖ్య తగ్గిందని వెల్లడించారు . దీన్ని పరిగణలోకి తీసుకొన్నా దేశంలో దాదాపు 36 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు .  సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలు సాధించిన సత్ఫలితం ఇదేనా? పేదరిక నిర్ధారణకు రోజు వారి వేతనాన్ని కాకుండా నెలసరి సంపాదనను ప్రాతిపదికగా తీసుకొన్నామని చెప్పారు . ఈ గణన చేయడానికి  వినియోగించిన కొలబద్ద , అనుసరించిన అసంబద్ధమైన వైఖరి వల్ల పేదరికం నిర్వచనంపైనే సహజంగా అనుమానాలు రేకెత్తించాయి . ఈ అశాస్త్రీయమైన గణాంకాలనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దృష్టికి కూడా ప్రణాళికా సంఘం తీసుకెళ్ళింది .  పేదరికాన్ని లెక్క గట్టడానికి శాస్త్రీయమైన కొలబద్దలను , ప్రామాణికాలను వినియోగించలేదు .పేదల ఆదాయ వ్యయాలను అంచనా వేసే యంత్రాంగమే లేని పరిస్థితి దేశంలో నెలకొని ఉన్నది .గడచిన ముప్పయ్ ఏడ్లుగా అనుసరిస్తున్న లోపభూయిష్టమైన పద్ధతులే కొనసాగుతున్నాయి.

పేదరిక నిర్ధారణ శాస్రీయ పద్ధతుల్లో నిర్వహించబడడం లేదన్న సద్విమర్శలున్నాయి . తాజా నివేదికలను బట్టి దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది అవసరానికి తక్కువగా ఆహారాన్ని తీసుకొంటున్నారు . ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నపూర్వరంగంలో ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం .  1993_94 లో గ్రామీణ ప్రాంతంలోని ఒక వ్యక్తి 2,153 క్యాల‌రీల ఆహారాన్ని తీసుకొంటే 2009_10 లో 2,020 క్యాలరీలకు , పట్టణ ప్రాంతాలలో 2,071 నుండి 1,946 క్యాలరీలకు పడిపోయిందని నేషనల్ శాంపుల్ సర్వేఆర్గనైజేషన్ (యన్.యస్.యస్.ఒ.) తన 66 వ అధ్యయన నివేదికలో పేర్కొంది . ప్రోటీన్ ఆహారమైన మాంసం , కోడి గుడ్లు , చేపలు మరియు పాల వినియోగం గ్రామసీమల్లో 60.2 నుండి 55 గ్రాములకు , పట్టణాలలో 57.2 నుండి 53.5 గ్రాములకు పడిపోయిందని చెప్పింది .గ్రామీణులు 2,400 , పట్టణవాసులు 2,100 క్యాలరీల మేరకు దినసరి ఆహారం తీసుకోలేక పోతున్నారన్న వాస్తవాన్ని టెండూల్కర్ కమిటీ కూడా విభేదించలేదు . 18 నుండి 29 సం.ల మధ్య వయస్సులో ఉన్న సాధారణ పురుషులకు 2,320 క్యాలరీలు అవసరమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ చెబుతున్నది .

కఠిక దారిద్య్రం పర్యవసానంగా ఆకలి బాధలు అనుభవించే వారి సంఖ్య పెరుగుతున్నది . పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో  పలు పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు పలుకుతున్నా పిల్లలు , మహిళల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది . శిశు మరణాల సంఖ్యను తగ్గించలేని దుస్థితి కొనసాగుతున్నది . అదుపు చేయలేని ద్రవ్యోల్భణం, ఒకానొక దశలో ఇరవై శాతానికి మించిన‌ ఆహార ద్రవ్యోల్భణం , నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు , పతనమవుతున్న రూపాయి విలువ , ప్రజల కొనుగోలు శక్తి , క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం , బలంగా వేళ్ళూనుకొని ఉన్న బాల కార్మిక వ్యవస్థ , విద్య , వైద్యం , నివాసం వగైరా కనీస మానవ హక్కుల అమలు స్థితిగతులను గానీ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు . పేదరిక నిర్మూలనా పథకాలపైన , సబ్సీడీల రూపంలొ చేస్తున్న ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా కుదించుకోవాలన్నదే దీని వెనకాల దాగి ఉన్నఅసలు సిసలైన‌ చిదంబర రహస్యమని స్పష్టమవుతున్నది  . కానీ పైకి మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం , విద్యా హక్కు చట్టం , రాబోయే ఆహార భద్రతా చట్టం బి.పి.యల్. ప్రాతిపదికపైన అమలు చేయడం లేదని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా మోసపూరిత ప్రకటనలు చేశారు . కానీ ఆచరణలో తద్భిన్నంగా పథకం ప్రకారం చర్యలు చేపడుతున్నారు . ప్రజా సంక్షేమాని కంటే ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో శర‌వేగంతో అడుగులు ముందుకు వేయాలన్న కృతనిశ్చయంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణవాదుల బృందం ఉన్నట్లు దీన్ని బట్టి రూడీ అవుతున్నది . 12వ‌ పంచవర్ష ప్రణాళికలో మొదటి ఏడాది అయిన‌ 2012_13 సం. వార్షిక బడ్జట్టే దీనికి ప్రబల నిదర్శనం.

 దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే అధికారంలో కొనసాగే అవకాశాలు మృగ్యమైపోయాయన్న నిర్ధారణకు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుంది . అందుకే కాబోలు, ఆ పార్టీ నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం ప్రజలపై కక్ష గట్టి , ముప్పేటా దాడికి పూనుకొన్నది . అయాచితంగా లభించిన ప్రధాన మంత్రి పదవిలో డా: మన్మోహన్ సింగ్ రికార్డు స్థాయిలో కొనసాగారు . మూడోసారి గద్దెనెక్కే ముచ్చట లేదని తేలిపోయింది . అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆర్థిక వేత్తగా ఆయన్ను ఆ నోటా ఈ నోటా కొందరు ప్రశంసిస్తూ ఉంటారు . నయా ఉదారవాద ఆర్థిక విధానాల జపం చేస్తున్న ఆయన బృందంలోని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా: మాంటెక్ సింగ్ అహ్లువాలియా , ప్రధానికి ప్రధాన ఆర్థిక సలహాదారు డా: యన్. రంగరాజన్ , రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డా: సుబ్బారావు , ఆర్థిక శాఖామాత్యులు ప్రణాబ్ ముఖర్జీ పోటీలు పడుతూ ఆర్థిక సంస్కరణల అమలులో వేగాన్ని పెంచ‌వలసిన ఆవశ్యకతను నొక్కివక్కాణిస్తున్నారు . వీరందరూ పేదసాదల బాగోగుల కంటే సంస్కరణల ముసుగులో విదేశీ , స్వదేశీ పెట్టుబడిదారులకు అత్యంత నమ్మిన బంట్లుగా సేవలందించడంలో తన్మయత్నం చెందుతున్నారంటే అతిశయోక్తి కాదు . ప్రస్తుతానికి తన ప్రభుత్వాన్ని , ప్రధాన మంత్రి పదవిని కాపాడుకొంటూ తన మానసిక పుత్రికైన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల అమలును సంపూర్ణంగా సాకారం చేసుకోవాలని మన్మోహన్ సింగ్ పట్టుదలగా పని చేస్తున్నారు . భాగస్వామ్య పార్టీల అధినేతలు , ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఎన్ని అవమానాలు చేసినా దిగమింగుతూ , మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నా తలవొగ్గి , గుంబనంగా పైకి కనపడుతూ , అంతా సజావుగా జరిగిపోతున్నట్లు ప్రవర్తిస్తున్నారు . దోపిడీ శక్తుల పక్షాన నికార్సుగా నిలబడ్డ మన్మోహన్ సింగ్ ప్రఖ్యాత బూర్జువా ఆర్థిక వేత్తగా చరిత్రకెక్కవచ్చేమో! గానీ , రాజకీయ నాయకత్వ లక్షణాలు లేని , పేదసాదల సంక్షేమం పట్ల శ్రద్ద ఏ మాత్రం లేని దేశ ప్రధాన మంత్రిగా నడుస్తున్న చరిత్ర నూటికి నూటాయాబై శాతం తేల్చేసింది .





Tuesday, May 15, 2012

వడ్డీ రేట్ల తగ్గింపు అమలు చేయని బ్యాంకులు

Surya Daily   May 15, 2012
ద్రవ్య నియంత్రణ చర్యల్లో భాగంగా భారత రిజర్వు బ్యాంకు తీసుకొన్న కఠినమైన నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థకు సత్ఫలితాలు ఒనగూడాయా, లేదా అన్న చర్చలు జరుగుతున్న పూర్వ రంగంలోనే ఏప్రిల్‌ 17న రేపో రేటును 0.50 శాతం తగ్గించింది. గృహ రుణాలు తీసుకొని, పెరిగిపోయిన వడ్డీ రేట్లతో కుదేలైన రుణ గ్రహీతలు 0.50 శాతం వడ్డీ రేటన్నా తగ్గుతుందని సంబరపడ్డారు. కానీ ఆచరణ ఎండమావిని తలపిస్తున్నది. ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయకపోతే దేశ ఆర్థికవ్యవస్థే ప్రమాదంలో పడుతుందని రిజర్వు బ్యాంకు 15 నెలలలో 13 సార్లు రెపో రేటు పెంచింది. పర్యవసానంగా 2010 పిబ్రవరిలో 4.75 శాతం ఉన్న రేపో రేటు 8.50 శాతంకు చేరుకొన్నది. రేపో రేటు పెరిగినప్పుడల్లా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను పెంచేసి, రుణ గ్రహీతలపై ఆర్థిక భారాన్ని వేసి, ముక్కుపిండి వసూలు చేశాయి.

గృ రుణాలు మొదలుకొని అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 2.75శాతం కు పైగా పెరిగిపోయాయి.
ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా చేస్తే వస్తువుల వినియోగం తగ్గి, డిమాండ్‌ తగ్గుతుందని తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న రిజర్వుబ్యాంకు అంచనాలు సత్ఫలితాలిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్య ప్రజలు మాత్రం నెల వారీ వాయిదాల మొత్తం పెరిగి, ఆర్థిక ఒడిదుడుకుల్లో పడాడ్డారు. మధ్య తరగతి ఉద్యోగులు తమ వేతనాల్లో 60-70 శాతం వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తున్నది .

ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు రేపో రేటును 0.50 శాతం తగ్గించింది. ఈ చర్యపై నయా ఉదారవాద ఆర్థిక వేత్తలు , పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. రేపో రేటు పెరిగిన మరుక్షణమే వడ్డీ రేట్లు పెంచి వినియోగదాలపై భారం మోపిన ఆర్థిక సంస్థలు ప్రస్తుతం తగ్గిన రేపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించక పోవడం దారుణం. ప్రభుత్వ రంగంలోని ఎల్‌.ఐ.సి. మొదలుకొని ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌.డి.ఎఫ్‌.సి. వరకు అన్ని సంస్థలూ అదే కోవలో ఆలోచిస్తున్నట్లుంది. రిజర్వు బ్యాంకు నిర్ణయం వెలువడి నెల రోజులు గడుస్తున్నా వడ్డీరేట్లు తగ్గించాలనే ఆలోచనే చేయడం లేదు. ఒకటి రెండు బ్యాంకులు మాత్రం వడ్డీ రేటును 0.25 శాతం మేరకు తగ్గించడానికి చర్యలు చేపట్టాయి.

రేపో రేటు తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందేలా చర్యలు చేపట్టడంపై రిజర్వు బ్యాంకు గానీ, ప్రభుత్వం గానీ చర్యలు లేదు. ఆర్థిక సంస్థలు వడ్డీ తగ్గింపునకు ముందుకు రాకపోవడంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జనాభా గణనలో రూపొందించి గృహవసతి, ఇళ్ళలోని మౌలిక సదుపాయాలు, ఆస్తుల వివరాల నివేదికను కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ ఇటీవలే వెల్లడించింది. ఆ ప్రకారం సొంత ఇళ్ళున్న వారు గ్రామీణ ప్రాంతాలలో 94.7 శాతం, పట్టణ ప్రాంతాలలో 69.2 శాతం మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్ళల్లో నివశిస్తున్న వారు 27.5 శాతం ఉన్నారని ఆ నివేదిక తేల్చింది. సంపాదనలో గణనీయమైన భాగం అద్దెలు చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో ఆహారంపై చేసే ఖర్చు తగ్గిపోతున్నది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోవాలని కార్పొరేట్‌ రంగానికి, బడా పారిశ్రామిక సంస్థలకు ఉద్ధీపన పథకాల పేరిట లక్షల కోట్ల రూపాయల రాయితీలను, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కానీ, నిర్మాణ రంగంపట్ల సాచివేత వైఖరి ప్రదర్శిస్తున్నది. నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వ ఖజానాకు వివిధ రూపాలలో ఆదాయం సమకూరుతుంది. ఈ రంగంపై ఆధారపడ్డ కోట్లాది మంది అసంఘటిత కార్మికులకు ఉపాథి దొరుకుతుంది. గృహ రుణాలు తీసుకొన్న ఉద్యోగులకు వడ్డీ మొత్తంలో లక్షన్నర రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించింది.
నెలసరి వాయిదాల అసలు మొత్తాన్ని సేవింగ్స్‌ పద్దు క్రింద చేర్చింది. మొత్తం సేవింగ్స్‌పై లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయించింది. ఇప్పుడు రేపో రేటును రిజర్వు బ్యాంకు తగ్గించినా ఫలితం మాత్రం గృహ రుణాలు తీసుకొన్న వినియోగ దారులకు దక్కలేదు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే నిర్మాణ రంగం మరింత సంక్షోభంలో పడుతుంది. రేపో రేటు తగ్గింపునకు అనుగుణంగా గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో కూడా రిజర్వు బ్యాంకు సత్వరం జోక్యం చేసుకొని గృహ రుణ గహ్రీతలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉన్నది.

Tuesday, May 1, 2012

శ్రమకు తగ్గ ఫలితం దక్కేదెన్నడు?

May 1st  2012  Surya Daily
విముక్తి కోసం శ్రమ శక్తి సాగిస్తున్న సమరశీల ఉద్యమాలకు ప్రతీక మే డే. నాడు (1886 మే 1) చికాగో నగరంలోని కార్మికు లు 8 గంటల పని దినం కోసం సమ్మె పోరాటం చేసి, రక్తం చిందించారు. 126 సంవత్సరాల అనంతరం నేడు కూడా 8 గంటల పని దినం కోసం, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధి, సామాజిక భద్రతల కోసం, అనేక రెట్లు పెరిగిపో యిన శ్రమ దోపిడీకి అంతం పలకాలని ప్రపంచ వ్యాపితంగా శ్రామిక వర్గం ఉద్యమాల నిర్వహణలో నూతన పుంతలు తొక్కుతున్నది. నాటి చారిత్రాత్మకమైన కార్మికోద్యమానికి నేతృత్వం వహించి అమరులైన కార్మిక నేతల త్యాగాలు ఆరని జ్యోతిలా కార్మిక వర్గానికి స్ఫూర్తి నింపుతున్నాయి . ప్రపంచ కార్మికవర్గాన్ని అజేయమైన శక్తిగా ఆనాటి వీరోచిత హే మార్కెట్‌ సంఘటన నిలబెట్టింది.

సంపన్నదేశాల కూటమికి నాయకత్వంవహిస్తున్న అమెరికాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వీధిన పడ్డ కార్మికులు, సామాన్య ప్రజలు ‘ఆక్యుపై వాల్‌ స్ట్రీట్‌’, ‘మేం 99 శాతం మీరు ఒక్క శాతం మాత్రమే’ నినాదాలతో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తడంతో దోపిడీ శక్తులకు ముచ్చెమ టలు పట్టాయి. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న ఈ తరహా పోరాటాల్లో పాల్గొం టున్న ఉద్యమకారులకు మార్స్కిజం లెనినిజం పట్ల స్పష్టమైన అవగాహన లేకపో యినా రాజకీయ, సైద్ధాంతిక అనుబంధాలకు అతీతంగా ఉద్యమాల్లో ఉరకలు వేస్తున్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను అమలు చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానే ప్రజానుకూల, సామాజిక న్యాయాన్ని అందించే ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఉద్యమాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. సక్రమమైన పంథాలో దిశానిర్దేశం చేసి ఆ పోరాటాలను నడిపించగల రాజకీయశక్తి లేని కారణంగా అనేక దేశాలలో విపరిణామాలు చోటు చేసుకొంటున్నాయి.

అధిక లాభాల వేటలో పడ్డ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తాను తవ్వుకొన్న గోతిలోనే పడి, సమస్యల వలయంలో చిక్కుకొన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థను ఆధునికీకరించుకోవడం ద్వారా సంక్షోభం నుండి బయట పడవచ్చని కొందరు ఆర్థికవేతలు కూనిరాగాలు తీస్తున్నారు. పాలక వర్గాలు ఆర్థిక సంక్షోభ దుష్ఫలితాలను శ్రామికవర్గం, సామాన్య ప్రజలపైకి నెట్టేస్తున్నారు. దోపిడీ వ్యవస్థను కాపాడుకొనే పనిలో పెట్టుబడిదారీ వర్గం నిమగ్నమై ఉన్నది. సహజవనరులు, ఉత్పత్తిసాధనాలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకొని, అతి తక్కువ వేతనాలతో శ్రమ శక్తిని ఉపయోగించుకొని లాభాల శాతాన్ని పెంచుకోవాలని, ఉత్పత్తులకు విశాలమైన మార్కెట్‌, ప్రసార మాధ్యమాలు, రాజకీయ రంగాలపై పటు ్టబిగించడం ద్వారా దోపిడీని నిర్విఘ్నంగా కొనసాగించాలని బహుళజాతి సంస్థలు పావులు కదుపుతున్నాయి.

మన దేశంలోని గుత్త సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు వాటితో జత కలిసి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చి పెడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగంపై, జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిలో క్రియాశీల భూమిక పోషిస్తున్న కార్మిక వర్గంపైన ముప్పేటా దాడి చేస్తున్నాయి.
ఆ దోపిడీ శక్తులకు వత్తాసు పలుకుతూ, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించాలంటే ప్రజాసంక్షేమాన్ని అటకెక్కించి, నయా ఉదారవాద ఆర్థికసంస్కర ణల అమలులో వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకొన్నది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మన దేశం 2011-12 లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకొన్నదని చెప్పుకొంటూనే, సంక్షోభం బారిన పడకుండా దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించి, ప్రభుత్వరంగ సంస్థలను మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో గొడ్డలి వేటుకు గురిచేస్తున్నది.

పెట్టుబడుల ఉపసంహరణతో మహారత్నాలు, నవరత్నాలుగా పేరొందినతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే జాతి వ్యతిరేక విధానాన్ని- జాతీయ కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో నిరసిస్తూ దేశ వ్యాపిత ఉద్యమాలు నిర్వహిస్తున్నా ఖాతరు చేయకుండా మన్మోహన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ పద్దు కింద 2011-12లో రూ.40,000 కోట్లతో ఖజానా నింపుకోవాలని ప్రయత్నించి రూ.14,000 కోట్లు పోగేసుకొన్నది. 2012-13 బడ్జెట్లో రూ.30,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. బ్యాంకింగ్‌ రంగంలో ప్రైవేటీకరణ చర్యలకు పదును పెడుతున్నది. బ్యాంకు చట్టాల సవరణ బిల్లు 2011, బీమా చట్టాల సవరణ బిల్లు 2008, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవెలెప్‌ మెంట్‌ అథారిటీ 2011- పార్లమెంటరీ స్థారుూ సంఘాల సిఫార్సులు అందాయని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడాన్ని బట్టి ప్రభుత్వరంగ, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. విదేశీ, స్వదేశీ కార్పోరేట్‌ సంస్థలకు, సంపన్నులకు ఊడిగం చేస్తూ జాతి సంపదను దోచిపెడుతున్నది.

జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి చేరుకోవాలంటే సంస్కరణల వేగాన్ని పెంచడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. జాతి సంపద వృద్ధి చెందాలనే ప్రజలందరూ కోరుకొంటారు. కానీ సమస్యల్లా, ఆ అభివృద్ధిలో శ్రామికులకు దక్కుతున్న వాటా ఎంవ అన్నదే. జీడీపీ వృద్ధి రేటుకు అనుగుణంగా ఉపాథి అవకాశాలు మెరుగుపడాలి. ప్రజల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరగాలి. పేదరిక నిర్మూలనలో అడుగు ముందుకు పడాలి. ప్రజలందరికీ నివాసం, నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను ప్రాథమిక హక్కుగా పొందగలిగిన పరిస్థితులు కల్పించాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. అభివృద్ధి అన్న పదానికి అర్థం, పరమార్థం ఉండదు.

స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాలనే మాయమాటలతో స్థూల జాతీయోత్పత్తిలో సబ్సీడీల శాతాన్ని 2012-13లో 2 శాతానికి, అటుపై 1.75 శాతానికి- అలా కుదించుకొంటూ పోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసుకొన్నది. ఆహారం, పెట్రోల్‌ ఉత్పత్తులు, ఎరువులపై ఇస్తున్న సబ్సీడీలను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. రెండంకెలకు అటు ఇటూ కదలాడుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోతే ఆర్థిక వ్యవస్థే తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని చెప్పి, రిజర్వు బ్యాంకు ద్రవ్యనియంత్రణకు పూనుకొన్నది. పర్యవసానంగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు- బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థల నుండి తీసుకొన్న గృహరుణాల వడ్డీ రేట్లు 13 సార్లు పెరిగాయి. నెలవారీ చెల్లింపులలో అత్యధిక భాగం వడ్డీ పద్దు కిందే జమైపోతుండడంతో రుణ విముక్తులు కాలేని దుస్థితి ఏర్పడుతున్నది. ఆహార ద్రవ్యోల్బణం 2010 ఫిబ్రవరిలో 20.2 శాతానికి ఎగబాకి క్రమేపీ తగ్గింది.

ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం తగ్గితే ధరలు తగ్గుతాయన్నది ఆర్థిక వేత్తల సూత్రీకరణ. కానీ ఆచరణలో పెరిగినధరలు తగ్గడం లేదు. పతనమవుతున్న రూపాయి మారకం విలువ, తరిగిపోతున్న కార్మికుల నిజవేతనాలు, ఖరీదై పోయిన విద్య, వైద్యం, ఇళ్ళ కిరాయి ప్రజల కొనుగోలు శక్తిని క్షీణింపచేశాయి. వేతనాల మీదే ఆధారపడి జీవిస్తున్న శ్రామిక ప్రజానీకానికి, అసంఘటిత కార్మికుల ఆహార భద్రతకు పెనుముప్పు సంభవిస్తున్నది. గడచిన రెండు దశాబ్దాలుగా సంస్కరణలను అమలు చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలు కనుమరుగై పోతున్నాయి. సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలన్నింటిలో కాంట్రాక్టు కార్మికులనే నియమించుకొంటున్నారు. క్యాజువల్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో కార్మికులను, ఉద్యోగులను నియమించుకొని నికృష్టమైన దోపిడీకి గురిచేస్తున్నారు .

అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నది. దేశ శ్రామిక జనాభా దాదాపు 46 కోట్లుంటే, అందులో 42.5 కోట్లు అసంఘటిత కార్మికులే.సాధించుకొన్న కార్మిక చట్టాలు చట్టుబండ లుగా మారిపోయాయి. పోషకార లోపంతో బాధపడే వారి సంఖ్య అధికమ వుతున్నది. కోటాను కోట్ల మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగుల, అర్థ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపో తున్నది. రవాణా, విద్యుత్తు వగైరా ఖరీదై పోయి అందుబాటులో లేకుండా పోయాయి. కార్మిక హక్కులు, మానవ హక్కులపై దాడి జరుగుతున్నది. ప్రైవేటీకరణ, వేతనాలు, పెన్షన్లలో కోతలు విధించడం, లేఆఫ్‌, సంఘం పెట్టుకొనే హక్కునే హరించివేయడం, ఉమ్మడి బేరసారాలాడే శక్తిని బలహీనపరచడం, న్యాయబద్ధమైన, శాంతియుతమైన నిరసనలను కూడా సహించ లేని వాతావరణం నెలకొన్నది.
ఆర్థిక సంక్షోభం పేరిట ఉద్దీపన పథకాల ద్వారా ప్రజాధనాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం పంచిపెట్టింది. లక్షల కోట్ల సంపద సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థల వద్ద పోగయ్యింది. దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నది. దీన్ని బట్టి కార్మిక వర్గం ఏ స్థాయిలో దోపిడీకి గురౌతున్నదో బోధడుతుంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి జపం చేస్తూ శ్రామిక ప్రజల సంక్షేమానికంటే ఆశ్రీత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి అడుగులు ముందుకు వేస్తున్న పాలక వర్గాల ఆటలు కట్టించాలంటే కార్మిక వర్గం మేడే స్ఫూర్తితో చైతన్యయుతంగా, సమైక్య ఉద్యమాలకు పదును పెట్టాలి.

(నేడు మే డే!)

Wednesday, April 18, 2012

విద్య హక్కే, కానీ అంగడి సరకే!

సూర్యా దినపత్రిక , ఏప్రిల్ ౧౯ ,2012

- హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు
- సామాజిక న్యాయానిి మొదటి మెట్టు విద్యే
- విద్యా హక్కును 10+2 వరకూ విస్తరించాలి
- ప్రభుత్వ విద్యారంగాన్నీ పటిష్ఠ పరచాలి
- జీడీపీలో 6 శాతం కేటాయింపు అవసరం


bc-hostel-studentsవిద్యా హక్కు చట్టంపై, దాని అమలుపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి సహాయం పొందనప్పటికీ ప్రైవేటు రంగంలో నిర్వహిస్తున్న మైనారిటీయేతర పాఠశాలలలో వెనుకబడ్డ కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లను చట్టం ప్రకారం విధిగా కేటాయించాల్సిందే అన్న సుప్రీం కోర్టు తీర్పు పిల్లల హక్కుల పరిరక్షణలో ఒక ముందడుగు మాత్రమే. అయితే దీని అమలు విషయమే అనుమానాలు రేకెత్తిస్తోంది. పౌరులందరూ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని పొందడానికి ఉపకరించే శక్తివంతమైన సాధనం విద్య. విద్యను ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరచడానికే స్వాతంకత్య్రానంతరం అరవై ఏండ్లకు పైగా సమయం పట్టింది. ‘విద్య ప్రత్యేక సౌకర్యం కాదు, ప్రాథమిక హక్కు’ అనే నినాదంతో విద్యార్థి సంఘాలు, మేథావులు, పలు సంస్థలు దశాబ్దాలుగా వివిధ రూపాలలో చేసిన అలుపెరగని ఉద్యమాల ఫలితం. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం పాక్షికంగా ఆమోదించడం వల్ల ‘విద్యా హక్కు చట్టం- 2009’ ఆవిష్కృతమైంది. 2010 ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చింది.

ప్రస్తుతం 6-14 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణ స్పష్టం చేస్తున్నది. 1- 8వ తరగతి వరకు మాత్రమే చట్టాన్ని పరిమితం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ అంటే ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే ప్రైవేట్‌ విద్యాసంస్థలు పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించి మరీ చేర్చుకొంటున్నాయి. అలాంటి పాఠశాలల్లో పేద విద్యార్థులు నేరుగా 1వ తరగతిలో ప్రవేశించి నెగ్గుకురాగలరా? అలాగే రాజ్యాంగం మేరకు 18 సంవత్సరాల వయస్సు లోపు వారిని పిల్లలుగానే పరిగణిస్తున్నారు. పిల్లల హక్కుల పరిరక్షణ, వారి ఎదుగుదల, అభివృద్ధి పట్ల సామాజిక బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలంటే కనీసం 10+2 విద్య కల్పించే వరకైనా ఈ హక్కును విస్తరించాలి. పన్నెండు సంవత్సరాల పాటు విద్య పిల్లల హక్కుగా అంతర్జాతీయ సమాజమే గుర్తించింది. ఆ పరిపూర్ణమైన దృష్టితో చట్టాన్ని రూపొందించ కుండా లోపభూయిష్టంగా తీసుకొచ్చారు. అమలు పట్ల కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. పర్యవసానంగా విద్య ఆచరణలో అందని ద్రాక్ష పండు లాగే అందరికీ అందుబాటులోకి రాలేదు.

నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు బలైన రంగాలలో విద్యా రంగం మొదటి. ఒకనాడు ప్రభుత్వంతో పాటు ట్రస్టులు, సొసైటీలు అన్నింటికన్నా విద్యా దానం మిన్న అని భావించి విద్యా సంస్థలను నెలకొల్పి సామాజిక సేవలో అనిర్వచనీయమైన తృప్తి పొందేవి. అయితే ఆ చరిత్ర తిరగబడింది. విద్య అంగడి సరుకుగా మారిపోయింది. భారత రాజ్యాంగలోని 19(1) (జి) అధికరణ ప్రకారం ఏ వ్యాపారమైనా చేసేందుకు, నిర్వహించేందుకు పౌరులకు హక్కు ఏర్పడింది. దానిని ఉపయోగించుకొని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘విద్యా హక్కు చట్టం’ అమలుకు తూట్లు పొడవాలని అత్యున్నత న్యాయస్థానం తలుపులు తట్టారు. తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది.

అసలు మౌలికమై సమస్య- ‘రాజ్యాంగం లోని 19(1) (ఎ) నిబంధన ప్రకారం విద్యారంగాన్ని కూడా వ్యాపారరంగంగా భావించవచ్చా’ అన్న మౌలికమైన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉన్నది. పట్టణీకరణ పర్యవసానంగా జనాభాలో మూడో వంతుమంది పట్టణాలు, నగరాలలో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు విద్యా వ్యాపారుల నిలయాలుగా ఆవిర్భవించాయి. అధిక లాభాలకోసం భారీ పెట్టుబడులతో విద్యా సంస్థలను నెలకొల్పి వ్యాపారం చేస్తూ, ప్రైవేటు యాజమాన్యాలు సంపాదన బాగా రుచి మరిగాయి. సేవా భావంతో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న వారు అసలే లేరని కాదుగానీ, అత్యధికులకు మాత్రం అది వ్యాపారమే.

పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ, ఆ బాధ్యతనుంచి తప్పించుకొనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ 80 శాతం ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. కానీ అవి మౌలిక వసతులు కరువై కునారిల్లి పోతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో 27 శాతం మంది మాత్రమే విద్యనార్జిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలే శరణ్యం. 84 శాతం మంది పిల్లలు వాటిలోనే విద్యనార్జిస్తున్నారు. నాణ్యమైన విద్యను పౌరులందరికీ అందించేందుకు 6 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని కొఠారీ మిషన్‌ మొదలుకొని విద్యా రంగంపై నివేదికలు సమర్పించిన పలు కమిషన్లు సిఫారసు చేశాయి. యూపీఏ 1 ప్రభుత్వం తన కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చినా దానిని గాలికి వదిలేసింది.

ప్రస్తుతం దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతానికి అటు ఇటుగా నిథులను కేటాయిస్తున్నారు.
చట్టంలో పొందుపరచిన పరిమితమైన లక్ష్యాన్ని సాధించడానికి కూడా నిథుల లేమి ప్రధాన అవరోధంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఆదాయపు పన్ను , కార్పొరేషన్‌ పన్ను, సేవా పన్ను , ఎక్సజ్‌ అండ్‌ కస్టమ్స్‌ డ్యూటీస్‌ వగైరా అన్ని రకాల పన్నుల చెల్లింపులపై అదనంగా ప్రజల నుండి 2 శాతం ప్రాథమిక విద్యా సెస్‌ను ( + మరొక ఒక శాతం ఉన్నత విద్యా సెస్‌) వసూలు చేస్తున్నది. ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిన 2004-05 నుండి 2011-12 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో లక్ష కోట్లకు పైగా ఆదాయం ఈ పద్దు క్రింద ప్రభుత్వ ఖజానాకు చేరిందని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెస్‌ ద్వారా ఆర్జిస్తున్న మొత్తానికి అదనంగా ప్రభుత్వం వెచ్చిస్తున్నది 30-35 శాతానికి మించి ఉండడం లేదు.

విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి నిథుల కేటాయింపు పెంచాలని, 2011-12లో రూ. 35,659 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన అనిల్‌ బోర్డియా కమిటీ సిఫార్సు చేసినా, కేటాయించింది రూ.21,000 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు భరించాల్సిన నిష్పత్తి సొమ్ము వెచ్చించక పోవడంతో ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 2012-13 బడ్జెట్‌ లో రూ.25,555 కోట్లు కేటాయించారు. దేశంలోని పిల్లలందరికీ ఉచిత విద్య అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు కపిల్‌ సిబాల్‌ చేతులెత్తేశారు. ప్రైవేటు రంగం భుజం మోపాలని కోరారు. కార్పొరేట్‌ సంస్థలు సామాజిక బాధ్యతగా ఈ పని చేయాలని, మిగిలిన ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏవైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని పాఠశాలలున్నాయో వాటికి బోధనా ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఇక్కడ మన రాష్ట్ర అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి.

వృత్తి విద్యా కోర్సులు అధ్యయనం చేస్తున్న బీసీ, ఓబీసీ విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లించే రాష్ట్ర ప్రభుత్వ పథకం అమలు తీరుతెన్నుల బాగోతం చూస్తూనే ఉన్నాం. ఈ పథకాన్ని నమ్ముకొని కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఫీజులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ప్రైవేటు విద్యా సంస్థలు కేవలం బోధనా రుసుం రూపంలోనే కాదు, వివిధ రకాల పద్దుల కింద అధిక ఫీజులు వసూలు చేసుకొంటున్నాయి. ఫీజులను నియంత్రించే యంత్రాంగమే లేదు. వాటిని ప్రభుత్వం చెల్లించదు. పేద విద్యార్థి తల్లిదండ్రులకు వాటిని చెల్లించే స్తోమత ఉండదు. అంటే, అలాంటి విద్యా సంస్థ గుమ్మం తొక్కే అర్హతే పేద పిల్లలకు లేదన్న మాట. సంపాదనే ధ్యేయంగా విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థలు ప్రభుత్వ మొర ఆలకిస్తాయా అన్నది ప్రశ్న. మరొకవైపు రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చట్టం వర్తించదని తేల్చేశారు.

ప్రభుత్వాల ఒత్తిడికి తలవొగ్గి ప్రైవేటు రంగంలోని చిన్న, మధ్య తరహా పాఠశాలల యాజమాన్యాలు కొంత వరకు అమలు చేయవచ్చు. ఆ మేరకు ఆదాయంలో వచ్చే తరుగుదలను భర్తీ చేసుకోవడానికి మిగిలిన 75 శాతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లల నుండి వసూలు చేసే ఫీజులను పెంచే ప్రమాదం ఉన్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ పేద పిల్లలకు తమ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను కేటాయించి ఉచిత విద్యను అందించే గురుతరమైన సామాజిక బాధ్యతను విద్యా రంగంలో బలంగా వేళ్ళూనుకొన్న కార్పొరేట్‌ సంస్థలు, విస్తారంగా బ్రాంచీలను నెలకొల్పి రెండు చేతులా కోట్ల రూపాయల ధనార్జన చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాయనుకోవడం ఒక భ్రమ.

మన దేశంలో ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యా రంగం వరకు ప్రైవేటు విద్యా సంస్థలు తమ కబంధ హస్తాల్లో ఇరికించుకోవడానికి మార్కెట్‌ ఆర్థిక విధానాలు చక్కగా చేయూత నిచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఏసీ గదుల్లో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మౌలిక సదుపాయాలతో నిర్వహిస్తున్న ఉన్నత శ్రేణి పాఠశాలలని ప్రచార హోరుతో సంపన్న వర్గాలను ఆకర్షించి, ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న ఒక్కొక్క విద్యార్థినుండి నాలుగైదు లక్షల రూపాయలను వార్షిక ఫీజుగా గుంజుకొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల్ని డిల్లీ తదితర మెట్రో పాలిటన్‌ నగరాలలో నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ళు హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయి.

ఉన్నత విద్యా ప్రమాణాలు, విలాసవంతమైన సౌకర్యాలు, క్రీడా సదుపాయాలు, పోషకాహారం, జాతీయ- అంతర్జాతీయ స్టడీ టూర్లు వగైరా మాయ మాటలు చెప్పి విద్యా వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ఈ తరహా కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు 25 శాతం సీట్లలో పేద పిల్లలకు ప్రవేశం కల్పించి, ఉచిత విద్యను అందిస్తాయా? ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని తెరవెనుక సీట్లు అమ్ముకొని, నల్ల ధనాన్ని చేతులు మార్చుకొని, పేద పిల్లలకు ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించడంలో ఆరితేరారు. అదే తంతు ఈవాళ ప్రైవేటు మెడికల్‌ కళాశాలల యాజమాన్య కోటా అడ్మిషన్స్‌లో జరుగుతున్నది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమైతే బహిరంగ ప్రకటన విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించి, మార్కుల ప్రాతిపదికపై మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఆ ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలి. కానీ అలా జరగడం లేదు. ఆ సీట్ల గురించి ఎవరైనా విచారిస్తే అయిపోయాయన్న సమాధానం వెంటనే వస్తుంది. సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి కార్పొరేట్‌ సంస్థలు ప్రత్యేకంగా నిథులను సమకూర్చుకోవచ్చని కపిల్‌ సిబాల్‌ సలహా కూడా ఇచ్చారు. ఈ పేరుతో రాబోయే రోజుల్లో వారికి మరికొన్ని రాయితీలు కల్పించి, ఆర్థిక ప్రయోజనం కల్పించే ఆలోచన ఉన్నట్లు బోధడుతున్నది .

ప్రభుత్వం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు నిర్వహించిన వీధి బడుల్లో చదువుకొన్నవారమని పెద్దలు కొందరు గర్వకారణంగా చెబుతుంటారు. నిజమే, నాడు విద్యార్జనకు అవే కేంద్రాలు. కాలం మారింది. ప్రభుత్వాల విధానాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంత భావజాలం అందలమెక్కింది. ప్రతిదీ సరకుగా మారింది. విద్యకూ మినహాయింపు లేదు. వృత్తి విద్య, ఉన్నత విద్యే కాదు, ప్రాథమిక విద్య కూడా లాభార్జనే ధ్యేయంగా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల కబంద హస్తాల్లో చేరింది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు కుప్పకూలి, మౌలిక సదుపాయాల లేమితో, నాసిరకం విద్యాబోధనకు నిలయాలుగా అపవాదును కూడగట్టుకొన్నాయి.

నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ఈ పోటీ ప్రపంచంలో ధీటుగా నిలబడ్డ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు లేవని కాదు. కేవలం కార్పొరేట్‌, ప్రైవేటు రంగంలోని పాఠశాలల్లోనే నాణ్యతా ప్రమాణాలతో కూడుకొన్న విద్య లభిస్తుందన్నది పాక్షిక సత్యమే . కానీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థపై ముప్పేట దాడి జరుగుతున్నది. ప్రభుత్వ లోపభూ యిష్ఠ విధానాలతో ఈ రంగం సహజ మరణం బాటలో ప్రయాణిస్తున్నది. విద్యా రంగంలో వివక్ష బలంగా వేళ్ళూనుకొన్నది. సంపన్నులు, మధ్య తరగతి, పేదలు వారివారి ఆర్థిక స్థితిగతులను బట్టి, అంటే కొనుగోలు శక్తి ఆధారంగా విద్యను పొందవచ్చు.

ఈ పరిస్థితి మారాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పటిష్ఠమైన కార్యచరణతో విద్యాహక్కుచట్టం అమలుకు అంకితభావంతో పూను కోవాలి. ప్రైవేటురంగంలోని పాఠశాలలపైనే ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశా లల వ్యవస్థను విస్తరించడం, జీడీపీలో 6 శాతం నిధులను కేటాయించి, మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యాప్రమాణాలను మెరుగు పరచి నాణ్యమైన విద్యను 10+2 వరకు అందించే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి.

Friday, April 13, 2012

ముడుపుల ముట్టడిలో రక్షణ!

సూర్యా దినపత్రిక, ఏప్రిల్ 10, 2012

ప్రధాన మంత్రికి పదాతిదళాల ప్రధానా ధికారి వి.కె.సింగ్‌ వ్రాసిన ఉత్తరం లీక్‌ కావడం, నాసిరకం సైనిక వాహనాల కొనుగోలుకు రు. 14 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు, ప్రస్తుతం సైన్యం వద్ద రెండు రోజులకు సరిపడేంత ఆయుధ సంపత్తి మాత్రమే ఉందని అందులో పేర్కొనడం లాంటి తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు బిహ ర్గతమయిన పూర్వరంగంలోనే వెలు గు చూసిన ఈ వార్త సహజంగానే రాజకీయ వ్యవస్థలో వేడి పుట్టించింది. దేశ ప్రతిష్టను, సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బదీసే ఘటనలుగా వీటిని పరిగణించాలి. భద్రతాపరంగా దేశం పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నది. ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు ఆరోగ్యకరంగా లేవు. కాశ్మీరు సమస్య రావణా సురుని కాష్ఠంలా రగులుతూనే ఉన్నది.

పాకిస్తాన్‌ శతృపూరిత వైఖరిలో మౌ లికమైన మార్పు గోచరించడం లేదు. పైపెచ్చు ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా ఆ దేశ సైన్యం శిఖండిలా అడ్డుపడుతున్నది. మనదేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నది. నిరంతరం సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సహజీ వనం గడపాల్సిన దుస్థితి నెల కొని ఉన్నది. ఐ.యస్‌.ఐ. తర్ఫీదు, ప్రోత్సాహం తో సీమాంతర ఉగ్రవాద శక్తులు మన దేశంపై కక్ష గట్టి, దొంగ దెబ్బలు కొడుతున్నాయి. మన రక్షణ వ్యవస్థల కన్నుగప్పి దేశంలో అక్రమంగా చొర బడి మారణహోమాలు సృష్టిస్తున్నారు. పార్లమెంటుపై ముష్కరుల దాడి, ఆర్థి క నగరంగా పేరుగాంచిన ముంబాయి మహానగరంపై బాంబులతో దాడి, పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో బాం బుపేలుళ్ళు, హైదరాబాదు మొదలుకొని దేశంలోని నలుమూలలా సంభవిం చిన బాంబు పేలుళ్ళ సంఘటనలు దేశ భద్రతకు గొడ్డలి పెట్టు లాంటివి. ప్రజ ల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి.

పోనీ మిగిలిన ఇరుగుపొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, నేపాల్‌, బాంగ్లా దేశ్‌, బర్మాలతో విశ్వసనీయమైన, నమ్మశక్యమైన దౌత్య సంబం ధాలున్నాయా అంటే అదీలేదు. అపనమ్మకాల మధ్యకాలం వెళ్ళబుచ్చు తున్నాము. ఈశాన్య ప్రాంతంలో చొరబాటుదారులు సమస్య పెద్ద తల నొప్పిగా మారింది. ఆంత రంగికంగా మతోన్మాద శక్తులు, అతివాద తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాలుగా నిలిచాయి. పర్యవసానంగా రక్షణ రంగా నికి మన వార్షిక బడ్జెట్స్‌లో సింహభాగం కేటాయిస్తున్నారు. 200506 ఆర్థిక సంవత్సరంలో రు.80,549 కోట్లు ఖర్చుచేస్తే 2012-13లో ఏకంగా రు.1,93,408 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక భాగం రక్షణ కొనుగోళ్ళకు వెచ్చిస్తున్నారు. ప్రణాళికేతర పద్దుక్రింద రు.1,13,829 కోట్లు. ప్రణా ళిేతర పెట్టుబడి వ్యయం పద్దు రు.79,579 కోట్లు ఉన్నది. అంటే ఆయుధసంపత్తి సేకరణ, ఆధునీకీకరణ, సైనికదళాల శిక్షణ వగైరా అవసరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది.

రక్షణ శాఖ జమా, ఖర్చులపై ఆడిట్‌ చేసే అధికారం కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సంస్థకు లేకపోవడంతో అడ్డగోలు వ్యవహారా లకు అడ్డాగా తయారయ్యింది. ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోనే ప్రక్రియ లో అంతర్భాగంగా చేసే కొనుగోళ్ళకు నిర్దిష్టమైన నియమనిబంధనలు పాటిం చకపోవడం, పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం అవినీతి రాజ్యమే లడానికి అవకాశం కల్పించింది. రక్షణ శాఖకు భారీ నిథుల కేటాయింపులు ఉండడంతో ఆయుధాలు, యుద్ధ విమానాలు తయారుచేసే బహుళజాతి సంస్థల డేగకన్ను మన రక్షణ రంగం పై దశాబ్దల క్రితమే పడింది. ఫలితంగా ఆయుధ సంపత్తి కొనుగోలు లావాదేవీ వ్యవహారాల్లో కత్రోచీ లాంటి దళారులు ప్రవేశించి, అవినీతిని ప్రోత్సహించి, రక్షణ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు.

బోఫర్స్‌ కుంభకోణం మొదలుకొని కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భౌతిక కాయాలను తరలించడానికి వినియో గించిన శవ పేటికల కొనుగోలు కుంభకోణం వరకు అవినీతి, అక్రమాల భాగోతాలు దేశ రక్షణ వ్యవస్థకే తలవంపులు తెచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన బోఫర్స్‌ శతఘు్నలు వగైరా ఆయుధ సంపత్తికి నేడు విడి భాగాలూ, మందు గుండు సామగ్రి లభించక పోవడంతో ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నామా? అన్న అనుమానాలు వస్తున్నాయి. దశాబ్దాల తదనంతరం కూడా మందు గుం డు సామగ్రిని, శవ పేటికలను కూడా తయారు చేసుకోలేనంత వెనుకబడి ఉన్నామా? స్వయంపోషకత్వాన్ని సాధించే వైపు ఎందుకు ప్రయాణం చేయ లేక పోతున్నాం ?

సైనిక దళాల ప్రధానాధికారి వి.కె.సింగ్‌ ఉత్తరంలో ప్రస్తావించినట్లు 600 నాసిరకం టెట్రా టెర్రాయిన్‌ సైనిక వాహనాలను (ట్రక్స్‌) 2010 సం.లో కొను గోలు చేయడానికి అనుమతిస్తే తనకు రు.14 కోట్లు లంచం ఇవ్వజూపిన విష యం వాస్తవమైతే అవినీతిచెదలు ఏ స్థాయిలో విస్తరించిందో స్పష్టమవుతున్న ది. ఉత్తరం ఎలా బహిర్గతమయ్యిందన్నది ఒక చిదంబర రహస్యమైతే, అసలు ఆ ఉత్తరంలోని అంశాలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురి చేశాయి. దానిపై ప్రధాన మంత్రిగానీ లేదా రక్షణశాఖా మంత్రిగానీ ఎందుకు తక్షణం స్పందించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో లేదో ! జాతికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ, అత్యంత ఉన్నతస్థానంలో ఉన్న తనకు లంచం ఇవ్వజూపిన దుష్టశక్తులపై ఎందుకు సైనిక దళాల ప్రధానాధికారి చర్యలు తీసుకోలేదో కూడా బహిర్గతం చేయాల్సి ఉంది.

ఏదైనా ఉపద్రవం జరిగి ఇప్పటికిప్పుడు యుద్ధమంటూ జరిగితే రెండు రోజులకు సరిపడ ఆయుధ సంపత్తి మాత్రమే ఉన్నదని సైనిక దళాల ప్రధానా ధికారి పేర్కొనడం వాస్తవమైతే తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. ఎందుచేత ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనేదే అసలు సమస్య. గడచిన కొన్ని దశాబ్దా లుగా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి సముపార్జించుకొన్న ఆయుధ సం పత్తి అంత నిరుపయోగంగా తయారయ్యిందా! దీనికి కారణం పాత సాం ేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలకు విడి భాగాలు లభించక పోవ డమేనా ? చైనా, పాకిస్తాన్‌ బూచి చూపెట్టి దారిద్య్రం, నిరుద్యోగం, పిల్లలు, గర్భిణీ మహిళల్లో పౌష్టికాహార లోపం లాంటి తీవ్రమైన సమస్యల పరిష్కా రానికి గానీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలులాంటి రంగాలకు అవసరమైన నిధులను కేటాయించకుండా, వార్షిక బడ్జెట్స్‌లో రక్షణ శాఖకు పుష్కలంగా నిథులను కేటాయిస్తున్నా ఈ దుస్థితి నెలకొనడానికి దారి దీసిన కారణా లేంటో! నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.

రక్షణ రంగంపై చైనా 16.1 శాతం మేరకు బడ్జెట్‌ నిథులను వ్యయం చేస్తుంటే మన ప్రభుత్వం 16.4 శాతం ఖర్చు చేస్తున్నది. స్థూల జాతీ యోత్ప త్తిలో చైనా 2.1 శాతం వ్యయం చేస్తుంటే మనం 2.7 శాతం వెచ్చిస్తున్నాం. కాకపోతే వారికీ, మనకు ఒక తేడా ఉన్నట్లు చెప్తున్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సంపాదించు కొని తదనంతర కాలంలో చైనా సొంతంగా ఆయుధాలను, విడి భాగాలను ఉత్పత్తి చేసుకొనే సామర్థ్యాన్ని సాధించుకొంటున్నది. కానీ స్వదేశంలో ఉత్ప త్తి చేసుకోగలిన ఆయుధాలను, వాహనాలను, విడిభాగాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవడానికే మన ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తున్నది. అలాగే ఎక్కువ ఖరీదు పెట్టి తక్కువ ఆయుధ సంపత్తిని పొందుతున్న దేశాల సరసన ఉన్నామని కూడా వార్తలు చెబుతున్నాయి.

టాటా కంపెనీ దేశీయంగానే నాణ్యమైన సైనిక వాహనాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినా రక్షణ శాఖ ఆసక్తి కనబరచ లేదన్న సమాచారాన్ని ఆ సంస్థ ప్రతినిథులే వెల్లడించారు. దాన్నిబట్టి కిక్‌ బాక్స్‌ స్వీకరించడానికి విదేశీ గడ్డ అన్ని విధాలా అనువైనదని దళారులు, ఉన్న తాధికారులు, రాజకీయ నాయకత్వం భావిస్తున్నట్లుంది. కారణం పుచ్చుకొన్న అవినీతి సొమ్మును స్విస్‌ బ్యాంకుల్లో పదిలంగా దాచుకొనే సౌలభ్యం ఉంది కాబట్టే. మన దేశానికి చెందిన ఘరానా పెద్ద మనుషుల స్విస్‌ బ్యాంకు ఖాతా ల్లో ఈ తరహా అవినీతి, పన్ను ఎగవేత ద్వారా ఆర్జించిన సొమ్ము దాదా పు రు.74,00,000 కోట్లు ( రు.24,00,000 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రే ప్రకటించారు) పోగుపడ్డదని కోడై కూస్తున్నది. ఆ నల్లధనాన్ని స్వదేశానికి రప్పించాలని, అవినీతిని కూకటి వేళ్ళతోపెకలించాలని పెద్ద ఎత్తున ఉద్యమా లు జరుగుతున్న నేపథ్యంలోనే మరొకసారి రక్షణరంగంలోని అవినీతి సమస్య గుప్పుమనడం కళంకం తెచ్చి పెట్టింది.

రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల లో భాగంగా రక్షణ రంగంలోకి కూడా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి.) ముసుగులో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ద్వారాలు తెరుస్తు న్నది. ఈ లోపభూయిష్టమైన విధానాల మూలంగా దేశ భద్రతకు, రక్షణ రం తగం సమాచారానికే రక్షణ కొరవడే ప్రమాదం ముంచుకొస్తున్నది. సరిహద్దు దేశాలతో దౌత్యపరమైన మైత్రి సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా రక్షణరంగంపై చేస్తున్న ఖర్చును తగ్గించుకోవడానికి, అవినీతిని అరికట్టి ప్రజా దనం దుర్వినియోగం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభు త్వం అమలు చేయాలి.
మన దేశంతో పాటు శ్రీలంక, బాంగ్లాదేశ్‌, నేపాల్‌, మాల్దీవ్స్‌ సరిహద్దుల్లో ప్రత్యేక సైనిక దళాలు తిష్టవేసిన నిప్పులాంటి నిజాన్ని అమె రికా పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ రోబెర్ట్‌ విల్లాడ్‌ యు.యస్‌.ఎ. కాం గ్రెషనల్‌ కమిటీకి ఈ ఏడాది మార్చిలో నివేదించిన విషయం వెల్లడయ్యింది. అయినా మన పాలకులు అది అవాస్తమని కొట్టిపారేస్తున్నారంటే అమెరికాతో కుదుర్చుకొన్న వ్యూహాత్మక ఒప్పందాల్లో ఇవన్నీ అంతర్భాగమేమోననిపి స్తుం ది. వాస్తవానికి విదేశాంగ విధానాలలో మన ప్రభుత్వ లొంగుబాటు వైఖరి పర్యవసానంగా దేశ రక్షణ వ్యవస్థ పెను సవాళ్ళును ఎదుర్కొంటున్నది. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి మౌలికమైన అంశాలపైన ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.