Surya Daily May 15, 2012
ద్రవ్య నియంత్రణ చర్యల్లో భాగంగా భారత రిజర్వు బ్యాంకు తీసుకొన్న కఠినమైన నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థకు సత్ఫలితాలు ఒనగూడాయా, లేదా అన్న చర్చలు జరుగుతున్న పూర్వ రంగంలోనే ఏప్రిల్ 17న రేపో రేటును 0.50 శాతం తగ్గించింది. గృహ రుణాలు తీసుకొని, పెరిగిపోయిన వడ్డీ రేట్లతో కుదేలైన రుణ గ్రహీతలు 0.50 శాతం వడ్డీ రేటన్నా తగ్గుతుందని సంబరపడ్డారు. కానీ ఆచరణ ఎండమావిని తలపిస్తున్నది. ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయకపోతే దేశ ఆర్థికవ్యవస్థే ప్రమాదంలో పడుతుందని రిజర్వు బ్యాంకు 15 నెలలలో 13 సార్లు రెపో రేటు పెంచింది. పర్యవసానంగా 2010 పిబ్రవరిలో 4.75 శాతం ఉన్న రేపో రేటు 8.50 శాతంకు చేరుకొన్నది. రేపో రేటు పెరిగినప్పుడల్లా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను పెంచేసి, రుణ గ్రహీతలపై ఆర్థిక భారాన్ని వేసి, ముక్కుపిండి వసూలు చేశాయి.గృ రుణాలు మొదలుకొని అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 2.75శాతం కు పైగా పెరిగిపోయాయి.
ప్రజల చేతుల్లో డబ్బు లేకుండా చేస్తే వస్తువుల వినియోగం తగ్గి, డిమాండ్ తగ్గుతుందని తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న రిజర్వుబ్యాంకు అంచనాలు సత్ఫలితాలిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్య ప్రజలు మాత్రం నెల వారీ వాయిదాల మొత్తం పెరిగి, ఆర్థిక ఒడిదుడుకుల్లో పడాడ్డారు. మధ్య తరగతి ఉద్యోగులు తమ వేతనాల్లో 60-70 శాతం వాయిదాల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తున్నది .
ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు రేపో రేటును 0.50 శాతం తగ్గించింది. ఈ చర్యపై నయా ఉదారవాద ఆర్థిక వేత్తలు , పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. రేపో రేటు పెరిగిన మరుక్షణమే వడ్డీ రేట్లు పెంచి వినియోగదాలపై భారం మోపిన ఆర్థిక సంస్థలు ప్రస్తుతం తగ్గిన రేపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించక పోవడం దారుణం. ప్రభుత్వ రంగంలోని ఎల్.ఐ.సి. మొదలుకొని ప్రైవేట్ రంగంలోని హెచ్.డి.ఎఫ్.సి. వరకు అన్ని సంస్థలూ అదే కోవలో ఆలోచిస్తున్నట్లుంది. రిజర్వు బ్యాంకు నిర్ణయం వెలువడి నెల రోజులు గడుస్తున్నా వడ్డీరేట్లు తగ్గించాలనే ఆలోచనే చేయడం లేదు. ఒకటి రెండు బ్యాంకులు మాత్రం వడ్డీ రేటును 0.25 శాతం మేరకు తగ్గించడానికి చర్యలు చేపట్టాయి.
రేపో రేటు తగ్గింపు ప్రయోజనం ప్రజలకు అందేలా చర్యలు చేపట్టడంపై రిజర్వు బ్యాంకు గానీ, ప్రభుత్వం గానీ చర్యలు లేదు. ఆర్థిక సంస్థలు వడ్డీ తగ్గింపునకు ముందుకు రాకపోవడంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జనాభా గణనలో రూపొందించి గృహవసతి, ఇళ్ళలోని మౌలిక సదుపాయాలు, ఆస్తుల వివరాల నివేదికను కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ ఇటీవలే వెల్లడించింది. ఆ ప్రకారం సొంత ఇళ్ళున్న వారు గ్రామీణ ప్రాంతాలలో 94.7 శాతం, పట్టణ ప్రాంతాలలో 69.2 శాతం మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్ళల్లో నివశిస్తున్న వారు 27.5 శాతం ఉన్నారని ఆ నివేదిక తేల్చింది. సంపాదనలో గణనీయమైన భాగం అద్దెలు చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో ఆహారంపై చేసే ఖర్చు తగ్గిపోతున్నది.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభం నుండి ఆదుకోవాలని కార్పొరేట్ రంగానికి, బడా పారిశ్రామిక సంస్థలకు ఉద్ధీపన పథకాల పేరిట లక్షల కోట్ల రూపాయల రాయితీలను, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. కానీ, నిర్మాణ రంగంపట్ల సాచివేత వైఖరి ప్రదర్శిస్తున్నది. నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వ ఖజానాకు వివిధ రూపాలలో ఆదాయం సమకూరుతుంది. ఈ రంగంపై ఆధారపడ్డ కోట్లాది మంది అసంఘటిత కార్మికులకు ఉపాథి దొరుకుతుంది. గృహ రుణాలు తీసుకొన్న ఉద్యోగులకు వడ్డీ మొత్తంలో లక్షన్నర రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించింది.
నెలసరి వాయిదాల అసలు మొత్తాన్ని సేవింగ్స్ పద్దు క్రింద చేర్చింది. మొత్తం సేవింగ్స్‌పై లక్ష రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయించింది. ఇప్పుడు రేపో రేటును రిజర్వు బ్యాంకు తగ్గించినా ఫలితం మాత్రం గృహ రుణాలు తీసుకొన్న వినియోగ దారులకు దక్కలేదు. ఈ విధానాలు ఇలాగే కొనసాగితే నిర్మాణ రంగం మరింత సంక్షోభంలో పడుతుంది. రేపో రేటు తగ్గింపునకు అనుగుణంగా గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో కూడా రిజర్వు బ్యాంకు సత్వరం జోక్యం చేసుకొని గృహ రుణ గహ్రీతలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉన్నది.
No comments:
Post a Comment