Published in Surya Daily on 24th May 2012 and also Janabalam Monthly
జనాభా గణనలో అంతర్భాగంగా 2011 సంవత్సరం సేకరించిన గృహ వసతి, ఇళ్ళలోని మౌలిక సదుపాయాలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ వెల్లడించింది. ఆ గణాంకాలు స్థూలమైనవి అయినప్పటికీ రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రగతి నివేదికగా భావించవచ్చు. అయినా సంస్కరణల లక్ష్యం అభివృద్ధేనని ప్రభుత్వాధినేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు, ఈ ఆర్థిక విధానాలను సమర్థిస్తున్న ఆర్థికవేత్తలు ప్రజల చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి నినాదంలోని డొల్లతనాన్ని మాత్రం జనాభా గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయి. అమెరికాతో సహా ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా మన దేశం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 6.9శాతం ఆర్థిక వృద్ధి రేటుతో ముందు వరుసలో పయనిస్తున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త డా: మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నది.అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు చేరుతున్నాయని దగాకోరు మాటలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జనాభా గణన శాఖ క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన నివేదికను వాస్తవిక దృష్టితో విశ్లేషిస్తే ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో విస్పష్టంగా బోధపడుతుంది . మానవ నాగరికతకు, సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి అద్దం పట్టే కొన్ని అంశాలను పరిశీలిద్దాం.1) మరుగుదొడ్ల సౌకర్యం. 2) ఇళ్ళ నిర్మాణం. 3) రక్షిత మంచి నీటి సదుపాయం. 4) విద్యుత్తు వినియోగం. 5) వంట గ్యాసు వినియోగం. 6) గ్రామీణ- పట్టణ ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అంతరాలు. 2011 గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం ఆవాసాల సంఖ్య 24,66,92,667. గ్రామీణ ప్రాంతాలలో 16,78,26,730, పట్టణాలలో 7,88,65,937 ఉన్నాయి. మన రాష్ట్రంలో మొత్తం ఆవాసాల సంఖ్య 2,10,24,534. గ్రామాల్లో 1,42,46,309, పట్టణాల్లో 67,78,225 ఉన్నాయి.
దేశం మొత్తంగా చూస్తే గ్రామసీమల్లో ఆవాసాల పెరుగుదల 21.4 శాతం , పట్టణాలలో 46.9 శాతం ఉంటే మన రాష్ట్రంలో గ్రామాల్లో 12.4 శాతం, పట్టణాల్లో 62.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. జీవనాధారంగా ఉన్న వ్యవసాయం సంక్షోభంలో కూరుక పోవడం, చేతి వృ త్తులు కనుమరుగెై పోతుండడం , ఉపాథి అవకాశాలు తగ్గిపోవడం, నాణ్యమైన విద్య, వెైద్యం, విద్యు త్తు, రహదారులు వగెైరా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం- పర్యవసానంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలసల ప్రక్రియ కొనసాగుతున్నది.
దేశంలో 36.4 శాతం, రాష్ట్రంలో 43.1 శాతం మాత్రమే పక్కాగా పెైపుల ద్వారా నీటి సరఫరాతో పారిశుద్ధ్య సౌకర్యం కలిగిన మెరుగెైన మరుగుదొడ్లు ఉన్నాయి. దేశంలో 53.1 శాతం, రాష్ట్రంలో 50.4 శాతం ఆవాసాలకు అసలు మరుగుదొడ్ల సదుపాయాలే లేవు. జార్ఖండ్‌లో 76.6 శాతం, ఒడిషాలో 76.6 శాతం, బీహార్‌లో 75.8 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు.
వీరిలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నవారు లేదా సామాజికంగా వెనుకబడ్డవారే అన్నది వివాదరహితం. అంతర్జాతీయ సమాజం అనేకాంశాలను కనీసావసరాలుగా ప్రకటించింది. 2015 నాటికి ఆకలికి, పేదరికానికి ముగింపు పలకాలన్న లక్ష్యంతో పాటు 8 సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాల ముందు అజెండాగా ఉంచింది. అందుకు మన ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కూడు, గుడ్డ, ఇల్లు కనీసావరసరాలని అందరూ చెప్పే మాట. వాటిలో ఇళ్ళ సమస్యను పరిశీలిద్దాం. సొంతత ఇళ్ళున్న వారు గ్రామీణ ప్రాంతాలలో 9.7 శాతం మంది ఉండగా పట్టణ ప్రాంతాలలో 69.2 శాతం మాత్రమే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కల సాఫల్యం కాక, అద్దె ఇళ్ళల్లో నివసిస్తున్న వారు 27.5శాతంగా ఉన్నారు. సంపాదనలో గణనీయమైన భాగం అద్దెలు చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో ఆహారంపెై చేసే ఖర్చు తగ్గిపోతున్నదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ఇళ్ళ నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను బట్టి ప్రజల ఆర్థిక స్థోమతను అంచనా వేయవచ్చు. గడ్డి, బోద, ఎదురు బొంగులు వంటి సామాగ్రితో నిర్మించుకున్న ఇళ్ళు దేవంలో 9 శాతం ఉంటే గ్రామాల్లో 11.9 శాతం, పట్టణాల్లో 2.7 శాతం, మట్టి/కాల్చని ఇటుకలతో నిర్మించుకున్నవి దేశంలో 23.7 శాతం అయితే గ్రామాల్లో 30.5 శాతం, పట్టణాల్లో 9.3 శాతం ఉన్నాయి. కల్చిన ఇటుకులతో నిర్మించుకున్నవి దేశంలో 47.5 శాతం ఉంటే గ్రామాల్లో 40 శాతం, పట్టణాల్లో 63.5 శాతం ఉన్నాయి. కాంక్రీట్ నిర్మాణాలు దేశంలో 3.5 శాతం అయితే గ్రామాల్లో కేవలం 1.7 శాతం, పట్టణాల్లో 7.2 శాతం ఉన్నాయి. ఇళ్ళ లోపల మట్టి నేల ఉన్నవి గ్రామసీమల్లో 62.6 శాతం ఉంటే పట్టణాల్లో 12.2 శాతం, సిమెంటు నేల 24.2 శాతం, 45.8 శాతం, మొసాయిక్ లేదా టైల్ వేసినవి 3.7 శాతం, 25.8 శాతం చొప్పున నిర్మించినవి ఉన్నాయి. స్నానాల కోసం ప్రత్యేక గదుల సౌకర్యంలేని ఆవాసాలు గ్రామాల్లో 55 శాతం, పట్టణాల్లో 13 శాతం ఉన్నాయి.
ఇంటిబయటనే వంటావార్పూ చేసుకుంటున్న వారు గ్రామాల్లో 16.4 శాతం, పట్టణాల్లో 3.7 శాతం ఉన్నారు. కట్టెల మీదే ఆధారపడి వంట చేసుకుంటున్న వారి సంఖ్య గ్రామాల్లో 62.5 శాతం, పట్టణాల్లో 20.1 శాతం ఉన్నది. నాగరికతకు ప్రతిబింబంగా చూసే వంట గ్యాస్ వినియోగించుకుంటున్న వారు గ్రామాల్లో 11.4 శాతం మాత్రమే, పట్టణాల్లో కూడా 65 శాతం మందే ఉన్నారు. మురికి వాడల్లో జీవిస్తున్న పేదలకు, గ్రామాల నుండి వలస వచ్చిన పేదలకు వంట గ్యాస్ అందుబాటులో లేదు. కిరోసిన్‌ను వంట సరకుగా వాడుకుంటున్న వారు 7.5 శాతం మంది పట్టణాలలోనే ఉన్నారు. విద్యుత్ దీపాలకు నోచుకోని గ్రామీణ ప్రజలు 43.2 శాతం మంది ఉన్నారు. కిరోసిన్ దీపాల వెలుగుల్లో రాత్రిపూట కాలం గడుపుతున్నారు. కడకు పట్టణాల్లో కూడా 6.5 శాతం మందికి కిరోసిన్ దీపాలే దిక్కు. మురుగు నీటి కాలువల నిర్మాణంలేని గ్రామాలు 63.2 శాతం, అలాగే 18.2 శాతం పట్టణాలూ ఉన్నాయి. పట్టణాల్లో కేవలం 44.5 శాతం మాత్రమే భూమి లోపల లేదా మూసివేసిన మురుగు కాల్వల నిర్మాణాలున్నాయి. గ్రామాల్లో అయితే 5.7 శాతం మాత్రమే. మూసివేయని మురుగు కాలవల్లో గ్రామాల్లో 31 శాతం, పట్టణాల్లో 37.3 శాతం ఉన్నాయి.
ఆ ప్రాంతాల్లో ఆవాసాలున్న ప్రజలు దుర్గంధం, కాలుష్య వాతావరణం మధ్య తరచు అంటు వ్యాధుల బారిన పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు.పెైపుల ద్వారా రక్షిత త్రాగు నీటి సరఫరా లబ్ధిదారులు గ్రామాల్లో కేవలం 17.8 శాతం ఉండగా, పట్టణాల్లో 62 శాతంఉన్నారు. అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లో, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో నివసిస్తున్న 38 శాతం ప్రజలు రక్షిత త్రాగు నీటికి నోచుకోవడం లేదన్న మాట. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణం. శుద్ధి చేయని నీటిని పెైపుల ద్వారా పొందుతున్న వారు 13 శాతం, బావుల మీద 13.3 శాతం, బోరు బావుల మీద 8.3 శాతం ఆధారపడి ఉన్నారు. ఈ తరహా వనరుపెై ఆధారపడ్డ వారు తీవ్రమైన విద్యుత్ కొరతతో సతమతమవుతున్న మనలాంటి రాష్ట్రాలలో తాగు నీటికి కటకటలాడిపోయే దుస్థితి దాపురిస్తుంటుంది. అత్యధికంగా 43.6 శాతం మంది తాగు నీటి కోసం చేతి పంపుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. నిత్య కరవు పీడిత, మెట్ట ప్రాంతాలలోని భూగర్భ జలాలు తరగిపోతున్నాయి.
చేతి పంపులు వట్టిపోవడంతో గొంతులు తడారిపోతున్నాయి. బిందెడు తాగు నీటి కోసం గంటల తరబడి క్యూలెైన్లలో మహిళలు నిలబడ్డాలు, ఘర్షణలు, చిన్న పాటి యుద్ధాలను తలపించే దృశ్యాలు సర్వ సాధారణమైపోయాయి. తాగునీటి వ్యాపారం అత్యంత లాభదాయకమైనదిగా తయారెైంది. అనేక జబ్బులు కలుషిత తాగు నీటి నుండే సంక్రమిస్తాయి. అనేక ప్రాంతాల ప్రజలు ఫ్లోరెైడ్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ కనీసం రక్షిత తాగు నీరందించలేని ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం. నిజమే, దేశం ఆర్థికాభివృద్ధిలో వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నది. స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుత ధరల సూచిక ప్రకారం 2010-11లో 71.57, 412 కోట్లుగా కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా వేసింది. సంపద పెరుగుతున్నది.
కుబేరులు, సంపన్నుల సంఖ్య పెరిగిపోతున్నది. కానీ పెై అంశాలన్నింటినీ నిశితంగా శాస్ర్తీయ పద్ధతిలో విశ్లేషిస్తే గ్రామీణ, పట్టణ ప్రజానీకం, పట్టణాల్లోని మురికివాడల్లోని ఆవాసాల్లో నివసించే ప్రజలకు సంపన్నులకు మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలు, మౌలిక సదుపాయాల లేమి వంటి అత్యంత తీవ్రమైన సమస్యలను భారత జాతి ఎదుర్కొంటున్నదన్న అంశం నిర్వివాదం.పన్నెండవ పంచవర్ష (2012-17) కాలంలోనెైనా ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ దక్కేలా చేయాలంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలలో సమూలమైన మార్పులు అనివార్యంగా చేయాలి. కేవలం వంచనతో కూడిన నినాదాలతో పరిమితం కాకుండా సమ్మిళిత ఆర్థికాభివృద్ధి విధానాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం ద్వారా పెైన పేర్కొన్న రంగాలలో ప్రగతి సాధించి, ప్రజలందరికీ నాణ్యమైన జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపెై ఉన్నది.