Friday, October 4, 2013

జలవనరులు – సమస్యలు - పరిష్కారాలు



                                                                                                                                                                                    
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున‌ వాదోపవాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర భారీ మరియు మధ్యతరహా శాఖామాత్యులు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు సాగు నీటి రంగంలో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు రెండు మూడు దఫాలుగా సమావేశమై నీటి సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి చర్చించినట్లు ప్రసార మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డి గారు సంక్లిష్ట‌మైన నీటి సమస్య లోతుల్లోకెళ్ళి విశ్లేషించి, పరిష్కార మార్గాలపై మాట్లాడడానికి సాహసించలేక, తప్పుదోవ పట్టించే విధంగా పత్రికా ముఖంగా సమస్యను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు.  కేంద్ర జల సంఘంలో పని చేసిన విశ్రాంత సాగు నీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు గారు సాక్షి దినపత్రికలో అక్టోబరు 3న వ్రాసిన వ్యాసంలో దౌర్జన్యంగా ఇతర ప్రాంతాల నీటిని తరలించడం, మిగులుజలాల పేరిట నికరజలాలను తరలించడం వంటి వికృత చేష్టలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ రావడం ఇప్పటి దాకా జరిగింది అని విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వ్రాశారు. తద్వారా కరవు కాటకాలతో జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంత  ప్రజలపై తీవ్రమైన‌ నింద మోపారు. వాస్తవాలను ప్రతిబింబిస్తున్నట్లే కనబడుతూ, అర్థ సత్యాలను వల్లిస్తూ, కొన్ని చారిత్రక సత్యాల‌ను మరుగునపడేసే ప్రయత్నం చేయడం ద్వారా రాయలసీమకు తీరని ద్రోహం తలపెట్టారని భావించాల్సి వస్తున్నది. "తెలంగాణను, కోస్తాంధ్రను సాటి తెలుగువాడికి కొంత నీటిని త్యాగం చేయమని అర్థించడం " ఒక్కటే మార్గమని హేళన చేస్తూ రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచే రీతిలో చిల్లర రాతలు వ్రాయడం గర్హనీయం.
నీటి సమస్య అత్యంత జఠిలమైన, జీవన్మరణ సమస్య. నీటి సమస్యను సంకుచిత, స్వార్థపూరితమైన రాజకీయ కోణం నుంచి కాకుండా తెలుగు ప్రజల విశాల ప్రయోజనాలను పరిరక్షించాలనే దృక్పథంతో నిశితంగా పరిశీలించాలి. శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వం,  రాజకీయ పక్షాలు, సాగు నీటి రంగ నిపుణులపైన‌ ఉన్నది. నిత్యం కరవు కోరల్లో చిక్కి శల్యమతున్న వెనుకబడ్డ ప్రాంతాల సాగు మరియు త్రాగు నీటి సమస్య పరిష్కారానికి రాజకీయ సంకల్పంతో కృషి చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నీటి కోసం యుద్ధాలు చేసుకొనే దుస్థితిని సృష్టించి, తెలుగు నాట ఆరని చిచ్చు రేపితే చరిత్ర క్షమించదు.
రాష్ట్రంలో  ఉన్న నలబై  పైచిలుకు నదుల్లో గోదావరి, కృష్ణా, పెన్నా నదులు పెద్దవి. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్ళున్నాయి. పెన్నా నదిలో 75% విశ్వసనీయత ఆధారంగా 98 టి.యం.సి. ల  నీటి లభ్యత ఉంటుందని ఒకనాడు నీటిపారుదల రంగ నిపుణులు అంచనా వేశారు. కానీ నేడది ఒట్టి పోయి, నీటి లభ్యత‌ గణనీయంగా పడిపోయింది. కృష్ణా నదీ జలాలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతంల్లోనే అత్యంత కరవు పీడిత ప్రాంతాలున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 75% విశ్వసనీయత ఆధారంగా 2130 (2060+70 పునరుత్పత్తి జలాలు) శత కోటి ఘనపుటడుగుల(టి.యం.సి.) నికరజలాలు లభిస్తాయని నిర్ధారించి, మన రాష్ట్రానికి 811 (800 + 11 పునరుత్పత్తి జలాలు) టి.యం.సి. కేటాయించింది. అందులో 33 టి.యం.సి. లను జల విద్యుత్తు ప్రాజెక్టయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు క్రింద చేర్చి, మిగిలిన 767 టి.యం.సి. ల‌ను 1960 సెప్టంబరు నాటికి సాగు నీటిని వినియోగించుకొంటున్న మరియు నిర్మాణానికి అనుమతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి, వివిధ‌ ప్రాజెక్టులు మరియు చిన్న నీటి పారుదల పథకాలకు ట్రిబ్యునలే నిర్దిష్టమైన కేటాయింపులు చేసింది. నదీ పరివాహక ప్రాంతాల విస్తీర్ణాన్ని బట్టి కేటాయింపులు చేయలేదు. ఆ అంశాన్ని ఇప్పుడు ఎవరైనా వివాదాస్పదం చేసినా ప్రయోజనం లేదు. నికరజలాల కేటాయింపులపై ఇచ్చిన తీర్పును భవిష్యత్తులో జరిగే పున: సమీక్షల సందర్భంలో కూడా ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ విస్పష్టంగా తీర్పులో పేర్కొన్నది. ఈ విషయాన్నే నేడు కృష్ణా జలాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని రెండవ‌ ట్రిబ్యునల్ కూడా పునరుద్ఘాటించింది.  నీటి కేటాయింపులను ప్రాంతాల వారిగా పరిగణలోకి తీసుకొంటే తెలంగాణకు 266.86 టి.యం.సి., రాయలసీమకు 122.7 టి.యం.సి., కోస్తాకు 377.47 టి.యం.సి.లు దక్కాయి.
బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు 2000 మే 31 తో ముగియడంతో కృష్ణా నదీ జలాల పంపిణీపై పున: సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను నియమించింది. 75% విశ్వసనీయత ఆధారంగా నిర్ధారించిన 2130 టి.యం.సి.ల నికరజలాలను ముట్టుకోకుండా, మిగులు జలాలను పంచాలన్న కర్నాటక, మహారాష్ట్రల డిమాండుకు ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించింది. సాధారణ వర్ష పాతం కంటే తక్కువ వర్ష పాతం లభించే సంవత్సరాలలో దిగువ రాష్ట్రానికున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, మిగులు జలాలను వినియోగించుకొనే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి కల్పించింది. అయినా, తీర్పు అమలులో ఉన్న‌ 1976 నుండి 2000 సం. వరకు అధికారాన్ని వెలగబెట్టిన ప్రభుత్వాల అలసత్వం, సాచివేత వైఖరి మూలంగా ఆ సదవకాశాన్ని చేజేతులా కోల్పోయాము. మహబూబ్ నగర్, నల్లగొండ, రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలోని కరవు పీడితి ప్రాంతాల నీటి కష్టాలను తీర్చడానికి కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టుల నిర్మాణ‍ం తప్ప మరొక మార్గం లేదని కళ్ళు తెరిచి, ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకొని, గడచిన దశాబ్ద కాలంలో పదుల వేల కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించడం జరిగింది.
ఈ పూర్వరంగంలో మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు బలంగా వాదించి, విజయం సాధించాయి. ట్రిబ్యునల్ ముసాయిదా తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శరాఘాతంలా తగిలింది.
ఒకటి: ప్రపంచంలో ఎక్కడా పరిగణలోకి తీసుకోని 65% విశ్వసనీయతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రామాణికంగా తీసుకొని 2293 టి.యం.సి.లు లభిస్తాయని, అందులో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 2130 టి.యం.సి. నికర జలాలను మినహాయించి, మిగిలిన 163 టి.యం.సి.లను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. అందులో మన రాష్ట్రానికి 45 టి.యం.సి.ల వాటా దక్కింది. ఆ నీటిని కూడా ప్రాజెక్టుల వారిగా తెలుగు గంగకు 25 టి.యం.సి.లు, జూరాలకు 9 టి.యం.సి.లు, కనీస నదీ ప్రవాహం పద్దు క్రింద 6 టి.యం.సి.లు, మిగిలిన 5 టి.యం.సి.లను నాగార్జునసాగర్ జలాశయంలో 'కారీ ఓవర్' పద్దు క్రింద కేటాయించిన 150 టి.యం.సి.లలో కలిపేయడం జరిగింది.                                              రెండవది: ట్రిబ్యునల్ అక్కడితో ఆగకుండా ఇంకా 285 టి.యం.సి.ల మిగులు జలాలు లభిస్తాయని నిర్ధారించి, వాటిని కూడా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. వాటిలో మనకు 145 టి.యం.సి.లను మంజూరు చేసింది. ఇది అశాస్త్రీయమైన, అసంబద్ధమైన‌ చర్య.                                                                                                                                                               మూడవది: ఆల్మట్టి జలాశయం ఎత్తును 519.6 మీటర్లకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిస్తే , బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 524.256 మీటర్లకు పెంచుకోవడానికి ఆమోదముద్ర వేసింది. పర్యవసానంగా సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరాలలో మనకు కేటాయించిన నికర జలాలైనా లభిస్తాయో! లేదో! అన్న దుస్థితి నెలకొన్నది.   ముసాయిదా తీర్పుపై వ్యక్తం చేసిన‌ అభ్యంతరాలపై వాదప్రతివాదనల‌ ప్రక్రియ ముగిసింది. తుది తీర్పు త్వరలోనే     రాబోతున్నది. అది తెలుగు ప్రజల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఉండబోతుందన్నతీవ్ర‌ ఆందోళన నెలకొని ఉన్నది.
ముసాయిదా తీర్పే తుది తీర్పుగా వెలువడితే, అది ప్రత్యేకంగా రాయలసీమకు శరాఘాతంగా పరిణమించే ప్రమాదముంది. మన రాష్ట్రానికి కేటాయించిన నికరజలాలను పొందడానికే ఆపసోపాలు పడవలసిన దుస్థితి నెలకొంటుంది. కర్నాటక, మహారాష్ట్ర‌లు తమకు కేటాయించిన  నికరజలాలకు తోడు 65% ప్రామాణికంగాను మరియు మిగులు జలాలలో సాధించుకొన్న‌ కేటాయింపుల మేరకు నీటిని నిల్వ చేసుకొన్న‌  తరువాత ఆపైన వచ్చే వరద నీరే మన రాష్ట్రానికి ప్రవహించే అవకాశం ఉంటుంది. అదే తరహాలో మన రాష్ట్రంలోని పై ప్రాంతాలు మిగులు జలాలను వాడుకోగా క్రిందికి ప్రవహించే వరద నీరు అసలుంటుందా? అన్నది ప్రశ్నార్థకమే. మరి రాయలసీమ ప్రాంతంలో మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటి?
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్యులు సుదర్శనరెడ్డి గారు, అలాగే విద్యాసాగర్ రావు గారు మరొక‌ కొత్త వివాదానికి తెర లేపుతూ రాయలసీమకు నికరజలాలలో వాటా 144.7 టి.యం.సి.లేనని  సెలవిచ్చారు. ఇది కుట్రపూరితమైనదని చెప్పక తప్పదు. ఇందులో ఇమిడి ఉన్న గూడార్థాన్ని ఛేదించాల్సిన అవసరముంది.
1) జల విద్యుత్తు ప్రాజెక్టయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు క్రింద బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న 33 టి.యం.సి.లను నిష్పక్షపాతంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, మూడు ప్రాంతాల మధ్య సమానంగా విభజించి, 11 టి.యం.సి.లను రాయలసీమ పద్దుకు జమ చేశారు. మరొక వైపున‌ 19 టి.యం.సి.ల నికరజలాల కేటాయింపుతో, కేంద్ర జల సంఘం ఆమోదంతో నిర్మించబడుతున్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ(యస్.ఆర్.బి.సి.) కు 11 టి.యం.సి.లను శ్రీశైలం జలాశయం నుండి తీసుకోవడానికి మాత్రమే వీలుందని చెప్పకనే చెబుతూ, అలా సీమకు లభించిన నికరజలాలను 122.70+11+11= 144.70 టి.యం.సి.లుగా తేల్చేశారు. మరి మిగిలిన 8 టి.యం.సి. ల నీరెక్కడి నుంచి యస్.ఆర్.బి.సి.కి సరఫరా కావాలో! వారు పేర్కొనలేదు.                                                                                                                         2) వారి నైజం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన మరికొన్ని నీటి సర్దుబాట్లను కూడా ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. నిత్య కరవులతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా దాహార్తిని తీర్చడానికి, తుంగభద్ర జలాశయం నుండి కె.సి.కెనాల్ కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టి.యం.సి. నికర జలాలను పెన్నాఅహోబిలం రిజర్వాయరు ( పి.ఎ.బి.ఆర్.) కు ఇచ్చి, ఆ మేరకు శ్రీశైలం జలాశయం నుండి కె.సి.కెనాల్ కు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాతే పై నీటి సర్దుబాటు చేసింది. ఈ 10 టి.యం.సి. నికరజలాలు శ్రీశైలం జలాశయం నుండి కె.సి.కెనాల్ కు సరఫరా కావాలి. దాన్ని అడ్డుకొంటే, తత్ఫలితంగా తుంగభద్ర జలాశయం నుండి పెన్నా అహోబిలం రిజర్వాయరుకు  చేసిన నీటి సర్దుబాటు రద్దవుతుంది. మరి ఎడారి ఛాయలు పొడ చూపుతున్న‌, రాష్టంలోనే అత్యంత వెనుకబడ్డ అనంతపురం జిల్లా భవిష్యత్తు ఎలా ఉంటుందో? వారే చెప్పాలి.                                                                                                                                                         3) కృష్ణా డెల్టా ఆధునీకీకరణ ద్వారా ఆదా అయ్యే 20 టి.యం.సి.ల నికర జలాల‌ను మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భీమా ఎత్తి పోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయడం ద్వారా కేంద్ర జల సంఘం అనుమతి పొందింది. కానీ కృష్ణా డెల్టా ఆధునీకీకరణ మాత్రం జరగలేదు. ఈ విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
రాయలసీమ వాసులు తమకు అడుగడుగునా అన్యాయాలే జరిగినా, తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాల కోసం అపారమైన‌ త్యాగాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం సందర్భంలో 1937 సం.లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం  'శ్రీబాగ్ ఒడంబడిక‌' కాలగర్భంలో కలిసి పోయింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యత నిస్తామని అందులో లిఖిత పూర్వకంగా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన‌ కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే సువర్ణావకాశం తలుపు తట్టినా సీమవాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి సీమకు న్యాయం చేస్తామని చెప్పి కరవు కాటకాలకు నిలయంగా మార్చేశారు. సిద్ధేశ్వరం బదులు శ్రీశైలం జలాశయాన్ని జల విద్యుత్తు ప్రాజెక్టుగా నిర్మించి తీరని ద్రోహం చేశారు. తదనంతర కాలంలో ప్రజలు పోరాట ఫలితంగా దాన్ని సాగు నీటి ప్రాజెక్టుగా మార్చారు. భాషా ప్రయుక్త‌ రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడంతో రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న బళ్ళారితో పాటు తుంగభద్ర జలాశయాన్ని కోల్పోయారు. ఈ చరిత్ర తెలియని అజ్ఞానులూ ఉన్నారు. త్యాగాల చరిత్రను కనీసం గౌరవించాలనే సంస్కారం కూడా కొందరిలో లోపించింది. పైపెచ్చు రాయలసీమ ప్రజలను నీటి దొంగలుగా చిత్రీకరించే ఉన్మాదం కొందరిలో ప్రకోపించింది. కనీసం సాగు నీటి రంగ నిపుణులైనా సంకుచిత  భావాలకు బానిసలు కాకుండా నిత్యం కరవు బారిన పడుతున్న‌ ప్రాంతాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను సూచించాలే గానీ, ప్రాంతీయ దురభిమానంతో మాట్లాడడం సముచితం కాదు.
తెలుగు ప్రజల‌ దాహార్తి తీరడమెలా?
గోదావరి నదీ జలాలపైనే తెలుగు ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్న‌దన్న విషయం నిర్వివాదాంశం. బచావత్ ట్రిబ్యునల్ 1480 టి.యం.సి.ల నికర జలాలను మన రాష్ట్రానికి కేటాయించినా, ఇప్పటికీ 800 టి.యం.సి. లకు మించి వినియోగించుకోలేక పోతున్నాం. పర్యవసానంగా దాదాపు 700 టి.యం.సి. ల నికర జలాలతో పాటు ప్రతి ఏడాది దాదాపు 3,000 టి.యం.సి. లకు పైగా వరద నీరు వృథాగా సముద్రగర్భంలో కలిసి పోతున్నది. కరవు పీడిత మరియు వెనుకబడ్డ ప్రాంతాల దప్పిక తీరాలన్నా, ఆ ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలన్న గోదావరి నీటి తరలింపే శరణ్యం. గోదావరి కృష్ణా - పెన్నా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే తెలుగు జాతి నీటి అవసరాలను తీర్చవచ్చు. మరో మార్గం లేదు.
1) బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మించబడుతున్న‌ పోలవరంను త్వరిత గతిన నిర్మించి, పదిన్నర లక్షల ఎకరాల గోదావరి ఆయకట్టుకు స్థిరత్వం, అదనంగా 7.20 లక్షల ఎకరాలకు సాగు నీరు, 960 మెగా వాట్ల జల విద్యుదుత్పాదన‌, విశాఖ మహానగరానికి త్రాగు నీరు మరియు ఉక్కు కర్మాగారం అవసరాలకు 23.44 టి.యం.సి.ల నీటిని అందించడంతో పాటు కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి నీటిని సరఫరా చేయడం ద్వారా ఆదా అయ్యే 80 టి.యం.సి.ల కృష్ణా నికర‌ జలాలలో బచావత్ తీర్పు మేరకు మన రాష్ట్రానికి 45 టి.యం.సి.లు లభిస్తాయి.                                                                              2) దుమ్మగూడెం - నాగార్జునసాగర్ టెల్ పాండ్ పథకాన్ని అమలు చేస్తే దాదాపు 165 టి.యం.సి.ల గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్గ మధ్యంలో ఖమ్మం జిల్లా అవసరాలకు, సాగర్ ఎడమ కాలువ స్థిరీకరణకు 40 టి.యం.సి. లు వినియోగించగా ఇంకా 125 టి.యం.సి.లకు పైగా సాగర్ టేల్ పాండ్ వద్ద కృష్ణా నదిలోకి తరలించడం ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టుకు వినియోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.                                                                                                                                                                                 3) నాగార్జునసాగర్ క్రింద కృష్ణా నదిలో కలుస్తున్న వర్షపు నీరు ప్రకాశం ఆనకట్ట దగ్గర నిల్వ‌ చేసుకొనే అవకాశం లేదు కాబట్టి సముద్రం పాలవుతున్నది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 45.75 టి.యం.సి.ల నీటిని వినియోగించుకొనే అవకాశం వచ్చింది.
 పై మూడు ప్రాజెక్టుల ద్వారా లభించే దాదాపు 215 టి.యం.సి.ల నీటితో కృష్ణా డెల్టా ఆయకట్టుకు నికరంగా నీరందించ గలిగితే, ఆ మేరకు శ్రీశైలం జలాశయం మరియు దాని పై భాగంలో కృష్ణా నికరజలాలను ఆదా చేసుకొని మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్న ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చు. ఎప్పుడైనా కృష్ణా డెల్టాకు నీటి సమస్య తెలెత్తితే, అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 1996లో విడుదల చేసిన జి.ఓ.నెం.69 ప్రకారం కృష్ణా నికర‌జలాలను ప్రథమ ప్రాధాన్యతగా శ్రీశైలం జలాశయం నుండి పొందే హక్కుకు చట్టబద్దమైన హామీ కల్పించాలి. అలాగే నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునీకీకరణ ద్వారాను, ప్రస్తుత ఆయకట్టు క్రింద మెరుగైన‌ నీటి నిర్వహణ ద్వారా వృధాగా పోతున్న నీటిని ఆదా చేయడం, వీలైన మేరకు పంట మార్పిడి పద్ధతులను అమలు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడానికి పథకం ప్రకారం చర్యలు చేపట్టాలి. తద్వారా మాత్రమే కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న‌ నెట్టంపాడు(20 టి.యం.సి.), కల్వకుర్తి(25), యస్.యల్.బి.సి.(30), తెలుగు గంగ (29), హంద్రీ - నీవా (40), గాలేరు - నగరి (38), వెలుగొండ (43.5) ప్రాజెక్టులకు కావలసిన మొత్తం 225.5 టి.యం.సి.ల నీటి అవసరాలను తీర్చడానికి వీలవుతుంది.
నీటి సమస్యపై చిత్తశుద్ధితో, హేతుబద్దంగా ఆలోచించే వారెవరైనా బహుశా ఈ నిర్ధారణకే వస్తారు. ఇలాంటి శాశ్వత పరిష్కారం కోసం ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. అవి అడిఆశలు కాకూడదు. గోదావరి కృష్ణా - పెన్నా నదుల అనుసంధానంతోనే వెనుకబడ్డ ప్రాంతాల ప్రజల గొంతులు తడ‌పడానికి, మరు భూములను పంట పొలాలుగా మార్చడానికి మార్గం సుగమం అవుతుంది. తెలుగు జాతి ఐక్యంగా, శాంతియుతంగా సహజీవనం చేస్తూ, ఇచ్చిపుచ్చుకొనే మనస్తత్వంతో జీవించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం.




No comments:

Post a Comment