భాతర దేశం యొక్క రాజ్యo స్వభావం సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్ వ్యవస్థ). భారత యూనియన్ లో అంతర్భాగమైన రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి
కలిగి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకున్న స్వయం ప్రతిపత్తిని, అధికారాలను
కాలక్రమంలో హరించివేస్తూ వస్తున్నది. సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించే విధంగా రాష్ట్రాల చట్ట సభల పట్ల కేంద్ర ప్రభుత్వం
వివక్షతతో వ్యవహరిస్తే ప్రమాదకర పరిణామాలు సంబవిస్తాయి. కాబట్టే రాజ్యాంగ సభలో ఈ
అంశంపై లోతైన చర్చ చేశారు. బ్రిటిష్ వలస పాలనలో ఉన్న ప్రావిన్సెస్ కు, భారత యూనియన్ లోని
రాష్ట్రాలకు మధ్య మౌలికమైన తేడా ఉన్నదని భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్
అంబేద్కర్ ఆర్టికల్ మూడుపై జరిగిన చర్చ సందర్భంలో విస్పష్టంగా పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం సమాఖ్య
వ్యవస్థ స్వరూపాన్ని గొడ్డలి పెట్టుకు గురిచేయడానికి బరితెగిస్తే ప్రతిఘటించాల్సిన
బాధ్యత భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ప్రతి పౌరుడిపైన ఉన్నది. ఈ అంశంపై
రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, స్పందించాల్సి ఉంది. లేనియడల దేశ ఐక్యతకు, సమగ్రతకే పెనుముప్పు
వాటిల్లే ప్రమాదమున్నది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ను దుర్వినియోగం చేసి ప్రజల చేత ఎన్నుకోబడిన
రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని కేంద్ర
ప్రభుత్వానికి మొట్టికాయలేసి, కట్టడి చేసిన దుష్టాంతాలున్నాయి. రాజ్యాంగానికి వక్రభాష్యాలు చెప్పి
అడ్డగోలుగా దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ వ్యవస్థ స్పందించ కుండా ఉండలేదు. ఏ
సమస్యనైనా రాజ్యాంగ పరిథిలో సామరస్యంగా పరిష్కరించుకోవలసిందే. మరో మార్గం లేదు.
రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందనుకొంటే దాన్ని మార్చుకోవాలి లేదా అందులో సవరణలు చేసుకోవాలి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక గడచిన ఆరు
దశాబ్దాల కాలంలో సంభవించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా 98 సార్లు
రాజ్యాంగానికి సవరణలు చేశారు. ఆ పంథాలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసుకోవాలి. సామాజికాభివృద్ధికి
అనుగుణంగా రాజ్యాంగంలో, చట్టాల్లో మార్పులు అనివార్యం.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై రాజ్యాంగం ఏం
చెబుతున్నది :
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పడం
వరకే గానీ ఆ అభిప్రాయాలకు ఎలాంటి విలువలేదంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం
చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనది. ఈ వాదనను సమర్థించే తీరులోనే ఒక ఆంగ్ల
దినపత్రికలో జనవరి 4న సుధీర్ క్రిష్ణస్వామిగారు వ్యాసం వ్రాశారు. సహజంగానే వీటి ప్రభావం సామాన్య ప్రజలతో పాటు
శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులపై పడినట్లు కనిపిస్తున్నది. భారత రాజ్యాంగంలో సమాఖ్య
వ్యవస్థ పరిరక్షణ అంశం అంత బలహీనంగా ఉన్నదా? అన్న అనుమానం వస్తున్నది. రాష్ట్ర విభజన ప్రక్రియ
రాష్ట్ర శాసనసభ తీర్మానంతోనే మొదలవుతుందని 2009లో నాటి హోం మంత్రి హోదాలో చిదంబరంగారు
ప్రకటించారు. ఆ తరువాత ఆయనే కేంద్ర ప్రభుత్వం తరుపున రాజ్యసభలో అదే విషయాన్ని
పునరుద్ఘాటించారు. శాసన సభ, శాసన మండలి అభిప్రాయాలకు విలువే లేకపోతే రాష్ట్రపతి
ముసాయిదా బిల్లును ఎందుకు పంపినట్లు? శాసన సభ, శాసన మండలి సభ్యులు కేవలం కంఠశోష
వినిపించుకోవడానికేనా? రాజ్యంగంలోని ఆర్టికల్ మూడు ఏం చెబుతున్నది. “Formation of
new States and alteration of areas, boundaries or names of existing States.-
Parliament may by law: Provided that no Bill for the purpose shall be
introduced in either House of Parliament except on the recommendation of the
President and unless, where the proposal contained in the Bill
affects the area, boundaries or
name of any of the States, the
Bill has
been referred by the
President to the Legislature of
that State for expressing its views thereon within such
period as may be specified in the reference or within such further period as
the President may allow and the period so specified or allowed has
expired". ఈ వాక్యాల
పరమార్థమేంటి? కేంద్ర ప్రభుత్వానిది దళారి పాత్ర మాత్రమే. తనకు తానుగా ఇష్టారాజ్యంగా
వ్యవహరించడానికి వీలు లేదని స్పష్టమవుతున్నది. ఒకవేళ అధికార దుర్వినియోగానికి
బరితెగిస్తే రాజ్యాంగ పరిరక్షణకు ఇతర రాజ్యాంగబద్దమైన వ్యవస్థలు రంగ ప్రవేశం
చేయక తప్పదు. ఈ ఆర్టికల్ రూపకల్పన పూర్వరంగాన్ని కూడా పరిశీలించాలి.
డా. అంబేద్కర్ సవరణల
సారామేంటి ?
రాజ్యాంగ సభలో ఆర్టికల్ 3 పై సుదీర్ఘ చర్చ జరిగింది. రాజ్యాంగ సభ సభ్యుల
మధ్య వాడివేడి వాదప్రతివాదనలు జరిగాయి. అంతిమంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్
ప్రతిపాదించిన సవరణలను రాజ్యాంగ సభ ఆమోదించింది. రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై
పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టే అధికారం రాష్ట్రపతికి దఖలు పరచబడింది. ముసాయిదా
రాజ్యాంగంలో మొదట ఈ హక్కును భారత ప్రభుత్వం ఖాతాలో చేర్చారు (“in original
draft the power to introduce the Bill was given exclusively to the Government
of India. No private Member of Parliament had the power"). అది పార్లమెంటు సభ్యుల హక్కులకు భంగం కలిగిస్తుందని
రాజ్యాంగ సభ సభ్యులు కొందరు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే (“Attention of the Drafting Committee was drawn to the fact that this
was a somewhat severe and unnecessary curtailment of the right of the members
of Parliament to move any motion they liked and in which they felt concerned”),
దానిపై మేథోమదనం తదనంతరం
ఆమోదించిన సవరణలు.
1) రాష్ట్రాల
సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై భారత ప్రభుత్వానికి అధికారాన్ని ధఖలు పరుస్తూ ముసాయిదాలో
చేసిన ప్రతిపాదనను తొలగించి, భారత ప్రభుత్వం బిల్లును రూపొందించినా లేదా
పార్లమెంటు సభ్యులు ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని విన్నవించినా రాష్ట్రపతి
సిఫార్సు లేకుండా పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి వీల్లేదు. (“Consequently
we deleted this provision giving the power exclusively to the Government of India,
and gave it to the President and stated that any such Bill whether it was
brought by the Government of India or by any private Member should have the
recommendation of the President”.)
2) రాష్ట్రపతి
అనుసరించే పద్ధతికి సంబంధించి కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి లేదా గవర్నర్
సంబంధిత శాసన సభ మరియు శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలి.
తద్వారా సంబంధిత రాష్ట్ర శాసన సభ నుండే ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన రావాలి
లేదా చొరవ ప్రదర్శించబడాలి. అంతే గానీ పార్లమెంటు తనకు తానుగా ప్రస్తావన చేయడానికి
వీలులేదు. ("The method of consulting, which the President will adopt, will
be to ask either the Prime Minister or the Governor to table a resolution which
may be discussed in the particular State legislature which may be affected, so
that ultimately the initiation will be by the total legislature and not by the
Parliament at all".)
3) భారత దేశంలోని
రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. రాష్ట్రాల సరిహద్దులు, పేర్ల మార్పు అంశంపై
సంబంధిత రాష్ట్రాల నుండి అనుమతి పొందాలి. బ్రిటిష్ కాలం నాటి ప్రావిన్సెస్ కు
స్వయం ప్రతిపత్తి లేదు కాబట్టి వాటి సరిహద్దులలో మార్పులు చేయడానికి అనుమతి
తీసుకోవలసిన అవసరం లేదు. భారత యూనియన్ లో అంతర్భాగంగా స్వయం ప్రతిపత్తి ఉన్న
రాష్ట్రాలకు, ప్రావిన్సెస్ కు మధ్య ఉన్న స్పష్టమైన మౌలిక వ్యత్యాసాన్ని, విభజన రేఖను డా.
అంబేద్కర్ గారు నొక్కి వక్కాణించారు. (“The States are
sovereign States and the provinces are not sovereign States. Consequently, the
Government need not be bound to require the consent of the provinces to change
their boundaries; while in the case of the Indian States, it is appropriate, in
view of the fact that sovereignty remains with them that their consent should
be obtained".)
పై అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం చేసే అభిప్రాయమేదైనా దానికి
విలువ ఉంటుందని సామాన్యులకు సహితం బోధపడుతుంది. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వ్యక్తం
చేసే అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్ట్రపతి తృణీకార భావంతో
తోసిపుచ్చలేరని కూడా అర్థవుతుంది. తెలంగాణ అంశంతో ముడిపెట్టకుండా నిష్పాక్షిక
దృష్టితో ఈ అంశాన్ని పరిశీలించాలి.
పారదర్శకతపైనే
చట్టసభల విశ్వసనీయత :
చట్ట సభలు అత్యంత జాగరూకతతో, బాధ్యతాయుతంగా, పారదర్శకoగా తమ పని విధానాన్ని మెరుగు పరచుకొంటూ సమాజ
ప్రగతికి బాటలు వేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం, పరమార్థం ఉంటుంది. వైవిద్యభరితమైన మన దేశంలో నిజమైన
ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొనడానికి సుదీర్ఘకాలం పట్టవచ్చు. అలాగే ప్రస్తుత రాజ్యాంగానికి
వర్గ స్వభావం ఉన్నది, తదనుగుణంగా అనేక పరిమితులు ఉన్నాయి. అందులో ఇమిడి
ఉన్న ప్రజాస్వామిక భావనలను పరిరక్షించుకొంటూ, వాటికి కార్యరూపం
సముపార్జించుకొంటూ, మెరుగైన రాజ్యాంగ వ్యవస్థ కోసం అడుగు ముందుకు
వేయాలి. బహుళ పార్టీ వ్యవస్థను పటిష్టవంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో చట్ట సభలు
పట్టాలు తప్పి నడకసాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం. వివక్షతకు, అశాంతికి, అభివృద్ధి
నిరోధానికి దారి తీసేలా చట్టసభలు ప్రవర్తిస్తే సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం
పోసినట్లవుతుంది.
తెలుగు నాట ఒక సున్నితమైన, సంక్లిష్టమైన, జఠిలమైన విభజన సమస్య దేశం ముందుకొచ్చింది. ఈ
సమస్యకు హేతుబద్దమైన, న్యాయబద్దమైన పరిష్కారానికై చిత్తశుద్ధితో అన్వేషణ
జరగాలి, పరిష్కరించబడాలి. అదే సందర్భంలో ఈ వివాద పరిష్కారం మరెన్నో సమస్యల
ఆవిర్భావానికి బీజం వేయకుండా రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి. ఈనాడు తెలుగు ప్రజల
మధ్య తలెత్తిన సమస్య పరిష్కారంలో కాంగ్రెసు పార్టీ, దాని నాయకత్వంలోని యు.పి.ఎ.- II ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందనడంలో
నిస్సందేహం. దాదాపు పది సంవత్సరాలుగా వారే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. నేడు రాష్ట్రపతిగా
ఉన్న ప్రణాబ్ ముఖర్జీ యు.పి.ఎ.-I ప్రభుత్వంలో
మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో కమిటీని ఏర్పాటు వేసినా నివేదికే ఇవ్వలేదు.
అటుపై శ్రీకృష్ణ కమిటీని నియమిస్తే ఏడాది పాటు ఈ సమస్యపై వివిధ వర్గాల వాద
ప్రతివాదనలను, సమాచారాన్నిసేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆంటోని
కమిటీని వేశారు. కేంద్ర మంత్రి మండలి ఉప సంఘాన్ని వేశారు. వారు నివేదిక ఇచ్చారు. ఆ
నివేదికలన్నింటినీ చట్ట సభల ముందుంచి పారదర్శకంగా చర్చించడానికి ప్రజాస్వామ్యంలో
అవకాశం కల్పించాలి. అప్పుడే అర్థవంతమైన, చర్చకు వీలుంటుందన్న వాదనలో బలం ఉంది. అలా కాకుండా కేవలం విభజనకు ఉద్దేశించిన
ముసాయిదా బిల్లుపైనే చర్చ అంటే అది అసమగ్రమైన, పాక్షికమైన చర్చగానే ఉంటుంది. పర్యవసానంగా
హేతుబద్ధమైన నిర్ణయానికి చట్టసభ రాలేదు. సుదీర్ఘకాలంగా చర్చించబడుతున్న సమస్యే కదా
! ఇంకా చర్చేంటి అని కొందరంటున్నారు. చట్ట సభలో విభజన అంశం అజెండాలోకొచ్చినప్పుడు
సమగ్ర చర్చ జరిపి, ఏ నిర్ణయమైనా తీసుకోవడం ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన
లక్షణం.
No comments:
Post a Comment