Sunday, March 2, 2014

కూడలిలో దేశ రాజకీయం





March 1, 2014 Surya daily
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తున్నది. నేడు డిల్లీ గద్దెపై ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి(యు.పి.ఎ.) పాలనకు చరమగీతం పాడి, ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా దుష్ట‌పాలన నుండి విముక్తి పొందాలని ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఈ మధ్య కాలంలోనే జరిగిన ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని స్పష్టమయ్యింది. దాంతో అధికార‌మార్పిడి అనివార్యమనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పాలనా పగ్గాలు ఎవరి చేతికి దక్కుతాయన్నదే ప్రజల మెదళ్ళను తొలుస్తున్న హిమాలయ పర్వతమంత ప్రశ్న. డిల్లీ గద్దె కోసం జరుగుతున్న పరుగు పందెంలో కాషాయధారణులు ఒకడుగు ముందున్నారనే వాతావరణం సృష్టించబడింది. మూడంకెల సంఖ్య(112)తో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం, సంఘ్ పరివార్ కూటమి అండదండలతో, మరీ ప్రత్యేకించి కార్పోరేట్ రంగంలోని దిగ్గజాలు నరేంద్ర మోడీకి వెన్నుదన్నుగా నిలవడంతో మొగ్గు ఉన్నట్లు ప్రసార మాధ్యమాలు ఊదరగొడుతున్నాయి. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే జాతీయ ప్రజాతంత్ర కూటమి(యన్.డి.ఎ.) లోక్ సభలో కావలసిన సాధారణ మెజారిటీ(272+) కి ఆమడ దూరంలోనే ఆగిపోతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
చీలికలు పేలికలుగా ఉన్న యు.పి.ఎ. మరియు యన్.డి.ఎ. యేతర పార్టీలు ఎన్నికలు తరుముకొస్తుండడంతో సర్దుబాటు తత్వాన్ని ప్రదర్శిస్తూ ఒకే వేదికపైకి వచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిగా ఏర్పడి, పదకొండు పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎన్నికల బరిలో దిగడానికి సన్నాహాలు మొదలు పెట్టాయి. యు.పి.ఎ. మరియు యన్.డి.ఎ. కూటములకు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బి.జె.పి.లు నాయకత్వం వహిస్తుంటే, తృతీయ‌ కూటమి బహుళ నాయకత్వం క్రింద పని చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది కొంత వరకు నాయకత్వ లేమిగానే కనబడుతున్నది. జాతీయ పార్టీలుగా ఉన్న సి‍.పి.ఐ.(యం), సి.పి.ఐ. మిగిలిన వామపక్ష పార్టీలైన ఆర్.యస్.పి. మరియు పార్వర్డ్ బ్లాక్ లతో కలిసి ఒక కూటమిగా చాలా కాలం నుంచి జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాయి. మూడు దశాబ్దాలకుపైగా పశ్చిమ బెంగాల్ లోను, అనేక సంవత్సరాల పాటు కేరళలోను, అధికారంలో ఉండి ప్రజానుకూల పాలనను అందించిన ఘనమైన చరిత్ర వామపక్షాలకున్నది. ప్రస్తుతం త్రిపురలో సి.పి.ఐ.(యం) నాయకత్వంలోని ప్రభుత్వం కొనసాగుతున్నది. వారికి సంకీర్ణ ప్రభుత్వాల నిర్వహణానుభవం ఉన్నది. పైపెచ్చు యు.పి.ఎ.-1 ప్రభుత్వానికి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా వెలుపలి నుండి మద్దతు ఇచ్చి, సమన్వయ కమిటీలో భాగస్వాములుగా ఉంటూ నాలుగేళ్ళకుపైగా కేంద్రంలో కలిసి పని చేసిన అనుభవమూ ఉన్నది. 14వ లోక్ సభలో 61 మంది సభ్యుల బలంతో ప్రభావశీలమైన పాత్రను పోషించాయి. భారత్, అమెరికా అణు ఒప్పందంపై విభేధించి, నాటి యు‍.పి.ఎ.-1 ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొన్నాయి. అటుపై 15వ లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాల బలం 24కు పడిపోవడం, కమ్యూనిస్టులకు కంచుకోటైన పశ్చిమ బెంగాల్ మరియు కేరళలో అధికారాన్ని కోల్పోవడంతో వామ‌పక్షాల ప్రాభవంపై కారుమబ్బులు కమ్ముకొన్నాయి. బలహీనపడ్డాయనే వాతావరణం నెలకొన్నది. అయినా ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన అలుపెరగని పోరుసల్పడంలో ముందు వరుసలోనే ఉన్నాయి. వామపక్షాలకు అధికార వ్యామోహం ఉన్నదని ప్రత్యర్థులు కూడా అనలేరు. 
తృతీయ కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే. సమాజవాది పార్టీ(22), జనతా దళ్(యునైటెడ్)(19), బిజూ జనతా దళ్(14), ఎ.ఐ.ఎ.డి.యం.కె.(9), జనతా దళ్(సెక్యూలర్)(1), అస్సాం గణ పరిషత్(1), జార్ఖండ్ వికాస్ మోర్చా(2), వీటన్నింటికీ కలిపి ప్రస్తుత లోక్ సభలో 68 మంది సభ్యులున్నారు. అంటే ప్రస్తుత‌ లోక్ సభలో తృతీయ కూటమిలోని 11 పార్టీల బలం 92. యు.పి.ఎ., యన్.డి.ఎ. ల తరువాత స్థానంలో ఈ కూటమి ఉన్నది. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సమాజవాది పార్టీ, జనతా దళ్(యు), బిజూ జనతా దళ్, ఎ.ఐ.ఎ.డి.యం.కె. లకు రాజకీయ‍ పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో 16వ లోక్ సభకు జరుగనున్న‌ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాలు తృతీయ కూటమికి ఆశాజనకమైన అంశం. ఆయా రాష్ట్రాలలో ఈ పార్టీలకు శక్తివంతమైన నాయకత్వం, విస్తృతమైన ప్రజా బలం, నిర్మాణ పటిష్టత‌ ఉండడంతో నిస్సందేహంగా యు.పి.ఎ. కూటమి కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకొనే మెరుగైన స్థితిలో ఈ కూటమి ఉన్నది. కానీ తనకు తానుగా అధికారంలోకి రాగలిగిన శక్తి సామర్థ్యాలు మాత్రం లేవనే చెప్పాలి. పైపెచ్చు ప్రధాన మంత్రి కావాలనే కోర్కెను ములాయం సింగ్ యాదవ్, జయలలితలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. అలాగే నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ లకు ఆ కోరిక లేదని చెప్పలేం. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం లేక పోవడం ఈ కూటమికున్న పెద్ద బలహీనత. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలమనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించడంలో వెనుకబడి ఉన్నది. స్థిరమైన, మెరుగైన పాలన ఈ కూటమి అందించగలదా! అన్న సంశయం ప్రజలకు రావడం సహజం.
యు.పి.ఎ., యన్.డి.ఎ. మరియు నూతనంగా ఆవిర్భవించిన తృతీయ కూటమి, ఈ మూడు కూటములకు వెలుపల ఉన్న మరికొన్ని బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కా‍గ్రెస్(19), ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజవాది పార్టీ(21), ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం(6), వై.యస్.ఆర్. కాంగ్రెస్(2), వీటన్నింటికీ ప్రస్తుత లోక్ సభలో 48 మంది సభ్యులున్నారు. అలాగే ఇటీవల డిల్లీ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో రెండవ పెద్ద పార్టీగా అవతరించి అధికార పీఠాన్నెక్కి దేశ ప్రజలను కాస్త ఆశ్చర్యానికి గురిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీలు ప్రస్తుతానికి ఏ కూటమితోనూ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈ పార్టీలు డెబ్బయ్ ఎనబై స్థానాల్లో గెలుపొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నికల తరువాత వీటి వైఖరి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మమతా బెనర్జీ ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో బి.జె.పి.కి సన్నిహితంగా వ్యవహరించిన టి.డి.పి. రాష్ట్ర విభజన విషయంలో బి.జె.పి. దగా చేసిందనే భావనతో మళ్ళీ దూరం జరిగినట్లు కనబడుతున్నది. యు.పి.ఎ.కు బయటి నుండి మద్దతిస్తున్న బి.యస్.పి. ఎన్నికల తరువాత ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందో ఊహించడం కష్టమే. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న నానుడిగా వామపక్షాలున్న కూటమిలో మమత, ములాయం ఉన్న చోట మాయావతి, చంద్రబాబున్న చోట జగన్, జయలలిత ఉన్న చోట కరుణానిథి ఇలా తీవ్రమైన‌ వైరుద్యాలతో ప్రత్యర్థులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, నాయకులు ఒకే గొడుగు క్రిందికి రావడం సాధ్యమా! అన్న సంకోచం ఎవరికైనా వస్తుంది. అలా అని అసాధ్యమని చెప్పలేము. యు.పి.ఎ.-2 ప్రభుత్వానికి బయట నుండి ములాయం, మాయావతి ఇద్దరూ వారి వారి అవసరాల కొద్దీ అంటకాగిన తాజా అనుభవం ఉంది కదా! అధికార పగ్గాలు చేతికందిన తరువాత ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడగలిగిన శక్తిశాలి సి.బి.ఐ. ఉండనే ఉంది. ప్రస్తుతానికి ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయ రంగంలో అనిచ్ఛిత పరిస్థితి నెలకొని ఉన్నది.
యు.పి.ఎ.కి గానీ, యన్.డి.ఎ.కి గానీ, తృతీయ కూటమికి గానీ 544 స్థానాలున్న లోక్ సభలో 272+ స్థానాలను సాధించుకొని అధికారంలోకి రాగల శక్తిసామర్థ్యాలు లేవన్నది సుస్పష్టం. అందుకే అధికారం కోసం సాగుతున్న‌ పెనుగులాటలో ఆధిక్యాన్ని సాధించాలనే తలంపుతో ప్రత్యర్థి పార్టీలను మిత్రులుగా మలచుకొని తమ పంచన చేర్చుకోవాలనే కుట్రలు కుతంత్రాలు, ప్రలోభాలతో కాంగ్రెస్, బి.జె.పి.లు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయి. అందులో భాగంగానే బీహార్ లో కాంగ్రెస్ వైపున్న‌ లోక్ జన శక్తి పార్టీని సీట్ల అయస్కాంతంతో బి.జె.పి. లాగేసుకొన్నది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత అధికారం కోసం జరిగే పోరులో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి. 
ప్రజల‌ ఆకాంక్ష‌ : 2004కు ముందు యన్.డి.ఎ. పాలనను ప్రజలు చవి చూశారు. వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బి.జె.పి., మరీ ప్రత్యేకించి కర్నాటక అవినీతి ప్రభుత్వాన్నీ చూశారు. ఆర్థిక విధానాల్లోను, అవినీతిలోను కాంగ్రెస్ కంటే ఏ మాత్రమూ బి.జె.పి. భిన్నమైన పార్టీ కాకపోగా వైవిద్యభరితమైన భారత దేశంలో మతోన్మాద రాజకీయాలతో లౌకిక వ్యవస్థ పునాదులను గొడ్డలి పెట్టుకు గురిచేస్తున్న పార్టీగా అపకీర్తిని మూటకట్టుకొన్నది. ఈ పూర్వరంగంలో మెరుగైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవిస్తే ఆదరించడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఇటీవల జరిగిన డిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. విధానాల ప్రాతిపదికగా మాత్రమే కాంగ్రెస్, బి.జె.పి.యేతర పార్టీలతో జట్టు కడతామని నిన్నమొన్నటి వరకు వామపక్షాలు చెబుతూ వచ్చాయి. ఎన్నికలు సమీపించడంతో ఆ ఆలోచనలకు స్వస్తి చెప్పి స్థూలంగా "ప్రజాస్వామ్య, లౌకిక మరియు సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ, ప్రజానుకూల విధానాల అమలు" అన్న అజెండాతో ఎన్నికల కూటమికి నడుంకట్టాయి.
భారీ కుంభకోణాలతో అవినీతి కూపంలో కూరుకపోయి, ప్రజావ్యతిరేక పాలనతో ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ దింపుడు కళ్ళం ఆశతో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోనే ప్రయత్నాల్లో భాగంగా ప్రజల దృష్టిని మళ్ళించడానికి రాష్ట్ర‌ విభజన అంశాన్ని ముందుకు తెచ్చి పార్లమెంటే జరగని పరిస్థితిని కల్పించింది. యు.పి.ఎ. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకొని అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని బి.జె.పి. ఉవ్విళ్ళూరుతున్నది. ఈ రెండు పార్టీల, కూటముల‌ ఆర్థిక విధానాల్లో ఇసుమంత తేడా లేదు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల ప్రధాన లబ్దిదారులు కార్పోరేట్ సంస్థలు. కాంగ్రెస్ గుర్రం బక్కచిక్కి పోయింది కాబట్టి కొత్త గుర్రమైన బి.జె.పి. పైకెక్కి స్వారిని కొనసాగించాలనే నిర్ణయానికి కార్పోరేట్ రంగం వచ్చింది. తమ దోపిడి నిర్విఘ్నంగా కొనసాగాలంటే మన్మోహన్ స్థానంలో మోడీని కూర్చోబెట్టాలనే నిర్ధారణకు కార్పోరేట్ దిగ్గజాలొచ్చినట్లు విస్పష్టంగా కనబడుతున్నది. తదనుగుణంగానే కార్పోరేట్ ఆధిపత్యంలోని ప్రసారమాధ్యమాలు బహుళ ప్రచారాన్ని చేస్తూ, ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డాయి.
కరడుగట్టిన హిందూ మతోన్మాద రాజకీయాలకు ప్రతినిథి అయిన నరేంద్ర మోడీ చేతికి పాలనా పగ్గాలు అప్పగిస్తే భారత దేశ ఐక్యతకు మూలస్థంభమైన లౌకిక వ్యవస్థ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని, తద్వారా ప్రజాస్వామ్యం వ్యవస్థ బీటలు వారుతుందని, కాంగ్రెస్ మరియు బి.జె.పి. లు ఒకే తానులోని ముక్కలు కాబట్టి ప్రజావ్యతిరేక, స్వదేశీ మరియు విదేశీ గుత్త పెట్టుబడిదారీ అనుకూల ఆర్థిక విధానాలే కొనసాగుతాయన్న వాదనలతో తృతీయ‌ కూటమి తెరపైకొచ్చింది. మోడి పేరు వింటేనే 2002లో గోద్రా ఘటనల తదనంతరం ముస్లిం మైనారిటీలపై జరిగిన‌ మారణహోమం దేశ ప్రజలకు గుర్తుకొస్తుంది. అలాగే నాలుగు వందల సంవత్సరాల చారిత్రక కట్టడమైన బాబ్రి మసీదును సంఘ్ పరివార్ కూటమి నేలమట్టం చేసిన దుర్ఘటన బి.జె.పి.ని వెన్నంటుతూనే ఉన్నది. పర్యవసానంగా కాంగ్రెస్, వామపక్షేతర పార్టీలు బి.జె.పి.తో మిత్రత్వం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొంటున్నాయి. ప్రత్యేకించి మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించగానే జనతాదళ్(యు) పార్టీ యన్.డి.ఎ. కూటమి నుండి తెగదంపులు చేసుకొన్నది. ఒకే భావజాలంతో ఉన్న శివసేన(11), అలాగే అకాళీదళ్(4) పార్టీలు మాత్రమే ఆ పార్టీకి మిత్రులుగా మిగిలారు. ప్రస్తుతo యన్.డి.ఎ. బలం 127 మంది సభ్యులు. కొత్తగా లోక్ సభలో ప్రాతినిథ్యం లేని లోక్ జనశక్తి దగ్గరికి చేరింది. కర్నాటకలో గతంలో గెలిచిన 19, జార్ఖండ్ లో 6 స్థానాలను నిలబెట్టుకొనే అవకాశమే కనబడడం లేదు. కాకపోతే రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో మెరుగైన పరిస్థితులున్నాయి. యాతావాతా 150 స్థానాలకు వరకు సాధించుకోగలదు. బి.జె.పి.కి బలమూ, గుదిబండ మోడీనే అన్న ప్రచారమూ జరుగుతున్నది. అందుకేనేమో! బి.జె.పి. అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ గతంలో జరిగిన తప్పులకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. మోడీ మాత్రం చెప్పలేదు సుమా!
ఈ నేపథ్యంలో యు.పి.ఎ.కి, యన్.డి.ఎ.కి ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఆవిర్భవించడం స్వాగతించదగిన పరిణామం. యు.పి.ఎ.-1 నుంచి వామపక్షాలు నిష్క్రమించాక బ్రేకులు వేసే అడ్డుతొలగడంతో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల అమలులో దూకుడు ప్రదర్శించి, ఆర్థిక సంస్కరణల అమలులో వేగం పెంచింది. జాతి సంపదైన సహజ వనరులను, శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలను కార్పోరేట్ రంగం అడ్డగోలుగా దోపిడి చేసుకొని సంపదను ఇబ్బడి ముబ్బడిగా పోగేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చింది. స్వాతంత్య్రానంతర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా బాసిల్లిన ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ద్వంసం చేసింది. నష్టాల పేరుతో చాలా సంస్థలను మూసివేసింది. లాభాలు గడిస్తున్న సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రయివేటు సంస్థలకు దారాదత్తం చేసింది. దేశ భద్రతను కూడా పణంగా పెట్టి వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. మన ఆర్థిక వ్యవస్థను బహుళ జాతి సంస్థల గుప్పెట్లోకి నెట్టివేసే అత్యంత హానికరమైన ఆర్థిక విధానాల అమలుకు పూనుకొన్నది. తదనుగుణంగా చట్టాలలో మార్పులు చేసింది.
కార్మికుల, ఉద్యోగుల జీవనోపాథిపై గొడ్డలి పెట్టు వేసింది. ప్రభుత్వ రంగంలో ఉపాథి కల్పన మృగ్యం. అధిక లాభార్జనే ధ్యేయంగా పెట్టుబడులు పెట్టే ప్రయివేటు రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ అత్యాధునిక యంత్రసామగ్రిని వినియోగించడం మూలంగా ఉపాథి కల్పన పరిమితంగా ఉన్నది. సేవా రంగమైన ఐ.టి. తదితర రంగాలలో మిన‌హాయిస్తే అసంఘటిత రంగంలోనే కాస్తా ఉపాథి అవకాశాలు ఉన్నాయి. ఈ తరగతి కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా తయారైనాయి. చమురు ఉత్పత్తులైన పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలపై ఉన్న ప్రభుత్వ‌ నియంత్రణను ఎత్తివేసి, మార్కెట్ శక్తులకు అప్పగించడంతో ప్రజలపై మోయలేని ఆర్థిక‌ భారం పడింది. నిరంతరం పెరుగుతున్న‌ నిత్యావసర వస్తువుల ధరల వల్ల సామాన్యుల జీవితాలు అతలాకుతలమైపోయాయి. నిజవేతనాలు దారుణంగా పడిపోయాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ఆర్థిక కుంభకోణాలు, అవినీతి ఏడాదికేడాది రికార్డులు బద్దలుకొడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గడచిన ఐదు సంవత్సరాలుగా ప్రజాకంఠక పాలన సాగింది. ఈ దుర్భర పరిస్థితుల నుండి త్వరితగతిన విముక్తి కావాలని సామాన్య ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ దుష్టపాలనకు సమాధి కట్టాలన్న కృతనిశ్చయానికి ప్రజలొచ్చారు. సరియైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. యు.పి.ఎ. ఆర్థిక విధానాలే యన్.డి.ఎ. విధానాలు. ఈ నేపథ్యంలో ప్రజానుకూల‌ ఆర్థిక విధానాలతో, జవాబుదారితనంతో, స్వ‌చ్ఛమైన, నీతివంతమైన, అవినీతిరహిత పాలన అందించే నిజమైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. 



No comments:

Post a Comment