Thursday, June 19, 2014

వెనుకబడ్డ ప్రాంతాలపై దృష్టిసారించండి





భాష ఒక్కటే. అయినా ప్రస్తుత‌ ఆంధ్రప్రదేశ్ వైవిద్యాలకు నిలయం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలను పరిశీలిస్తే ఈ విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఒడిస్సా రాష్ట్ర సరిహద్దుల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రా, గోదావరి నదికి అటు ఇటు ఉన్న తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా నదికి అటు ఇటు ఉన్న కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు, ఒకనాటి గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు జిల్లాల నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఏర్పాటు చేయబడిన‌ ప్రకాశం జిల్లా, ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని మరియు నేటి తమిళనాడు రాష్ట్ర రాజధానీ నగరం చెన్నయ్ కి సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లా, నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లిపోతున్న రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలలోని ప్రజానీకం వేరువేరు మాండలికాలు మాట్లాడుతారు. ఆ మాటకొస్తే ఒకే జిల్లాలో కూడా రెండు మూడు మాండలికాలున్నాయి. ఉదాహరణకు కడప జిల్లాలోని పడ‌మటి మండలాలు, తూర్పు మండలాల్లో నివసించే ప్రజలు మాట్లాడే మాండలికాల్లోని తేడాను విస్పష్టంగా గమనించవచ్చు. చిత్తూరు జిల్లాపైన తమిళనాడు, కొంత వరకు కర్నాటక‌ ప్రభావం ఉన్నది. అనంతపురం, కర్నూలు జిల్లాలపై కర్నాటక ప్రభావం ఉన్నది. సంస్కృతి, పండుగలు, పబ్బాలు నిర్వహించుకోవడంపై కూడా వాటి ప్రభావాన్ని గుర్తించవచ్చు. కోస్తాంధ్ర ప్రాంతానికి 974 కి.మీ. విస్తరించి ఉన్న సముద్ర తీరం ప్రకృతి ప్రసాదించిన వరం. కోస్తాంధ్రలో సగటు వర్షపాతం 1050 మి.మీ. పైగా ఉన్నది. రాయలసీమ సగటు వర్షపాతం 700 మి.మీ. లోపే, వర్షం రాక, పోకలపై అనిశ్చితి నెలకొన్నది. భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. అడవులు అంతరించి పోతున్నాయి. పర్యావరణ మార్పులు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి.
కాటన్ దొర పుణ్యమాని జీవ నదులుగా పరిగణించబడే కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ముందు పీఠిన నిలిచి వ్యవసాయాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న ప్రాంతం మధ్య కోస్తాంధ్ర. వ్యవసాయ రంగంలో ఆర్జించిన మిగులును పెట్టుబడులుగా మార్చి పారిశ్రామికాభివృద్ధికి, పట్టణీకరణకు ఆ ప్రాంతంలో ఆరేడు దశాబ్దాల క్రితమే పునాదులు వేయబడ్డాయి. బ్రిటీష్ వాళ్ళ పాలనా కాలంలోనే పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టబడిన విశాఖపట్నం నేటి నవ్యాంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఆవిర్భవించింది. వ్యవసాయక, పారిశ్రామికాభివృద్ధి పర్యవసానంగా కోస్తాంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతాని కంటే ఆర్థికంగా, సామాజికంగా బాగా ముందంజలో ఉన్నది. జిల్లాలుగా పరిగణలోకి తీసుకొంటే సగటు తలసరి ఆదాయం ప్రాతిపధిక మేరకు శ్రీకాకుళం, విజయనగరం అన్నింటి కంటే వెనుకబడి ఉన్నాయి. రాజకీయ రంగాన్ని పరిశీలిస్తే సుదీర్ఘ కాలం పాటు వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ, ఆ ప్రాంతాన్ని కరవుల బారి నుండి విముక్తి చేయలేక పోయారు. వ్యవసాయక, పారిశ్రామిక అభివృద్ధికే కాదు రక్షిత మంచి నీటికి కూడా నోచుకోని అభాగ్యులుగా రాయలసీమ ప్రజలు మిగిలిపోయారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక‌ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటంలో అంతర్భాగంగా కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెస్ నాయకులు చేసుకొన్న చారిత్రాత్మకమైన "శ్రీబాగ్ ఒడంబడిక" బుట్టదాఖలా చేయబడింది. కృష్ణా, తుంగభద్ర నదీజలాల వినియోగంలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని అందులో పేర్కొని మొండి చేయి చూపెట్టారు. నాడు విశ్వవిద్యాలయం కోసం పోరాడగా శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి అది కాస్తా దోహదపడింది. రాయలసీమ వెనుకబాటుతనానికి అక్కడ వ్యవస్థీకృతమైన ఉన్న హత్యా రాజకీయాలు, గ్రామ కక్షలే మూలకారణమని ప్ర‌జల దృష్టిని ప్రక్కదారి పట్టించే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అసలు సమస్య నీటి సమస్య. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపెడితే అపారమైన భూసంపదను, ఖనిజ సంపదను, మానవ వనరులను ఉపయోగించుకొని వ్యవసాయకంగా, పారిశ్రామికంగా సరవేగంతో అభివృద్ధి చెందడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న నానుడిగా ప్రాణాధారమైన నీటి వనరులు లేక ఆ ప్రాంతం తల్లడిల్లిపోతున్నది.
వెనుకబడ్డ‌ రాయలసీమ ప్రాంతాన్ని నవ్యాంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందిన ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలతో అనుసంధానించాలి. ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మెరుగైన, నాణ్యమైన రైల్వే, రహదారుల నిర్మాణం ద్వారా మాత్రమే ఈ కల సాకారమవుతుంది. రాయలసీమకు నడిబొడ్డుగా ఉన్న కడప, కోస్తాంధ్రకు నడిబొడ్డుగా ఉన్న విజయవాడకు మధ్య నేరుగా మెరుగైన‌ రైల్వే, రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాలనే తలంపే నేటి వరకు పాలకుల బుర్రలకు తట్టలేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళిక అమలులోనైనా దృష్టిసారించాలి. విజయవాడ - గుంటూరు - మార్కాపురం - కడప - మదనపల్లి - బెంగుళూరు నగరాన్ని కలుపుతూ నాలుగు లైన్ల జాతీయ రహదారిని నిర్మిస్తే విజయవాడ, బెంగుళూరు నగరాల మధ్య దూరం కూడా తగ్గే అవకాశం ఉన్నది. అలాగే మార్కాపురం - కర్నూల్ ల మధ్య నాలుగు లైన్ల రహదారిని నిర్మించడం ద్వారా హైదరాబాదు  -  బెంగుళూరు జాతీయ రహదారితో అనుసంధానం చేయాలి.
విజయవాడ, బెంగుళూరు నగరాల మధ్య కడప మీదుగా రైలు మార్గాన్నినిర్మించాలి. కడప - బెంగుళూరు మధ్య రైలు మార్గ నిర్మాణం పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రాథమికంగా చేపట్టబడ్డాయి. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నవ్యాంధ్రప్రదేశ్ ఆ పథకం అమలుకు తన వాటాను చెల్లించే స్థితిలో లేదు. పర్యవసానంగా ఆ నిర్మాణ పనులు మూలనపడే ప్రమాదమున్నది.  విజయవాడ - నంద్యాల - అనంతపురం - బెంగుళూరు మార్గంలోని గిద్దలూరు నుండి పోరుమామిళ్ళ, బద్వేలి, బాకరాపేట, కడపకు రైలు మార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో ఆమోద ముద్ర వేయించుకొని ఈ రైలు మార్గాన్ని త్వరితగతిన నిర్మిస్తే ఎంతో సౌలభ్యమైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గుంటూరు -  గుంతల్ మధ్య ఉన్న రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసి, విద్యుదీకరణ చేయాలి. ఎప్పటి నుంచో సర్వేకే పరిమితమై ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గాన్ని నిర్మిస్తే ట్రాఫిక్ వత్తిడిని తట్టుకోవడానికి మరియు తుఫాన్లు సంబవించిన సందర్భాలలో విజయవాడ - గూడూరు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడడమే కాకుండా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని మెట్ట ప్రాంతాల ప్రజానీకానికి లబ్ధి చేకూరుతుంది. కడప జిల్లాలోని ఓబులవారిపల్లి - క్రిష్ణపట్నం ఓడరేవుల మధ్య నిర్మాణ‍ంలో ఉన్న రైలు మార్గాన్ని సత్వరం పూర్తి చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతానికి వస్తు రవాణాకు,  రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు సరఫరాకు, కడప జిల్లాలో అర్థాంత‌రంగా ఆగిపోయిన బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్మాగారాన్ని నిర్మిస్తే ఉత్ఫత్తుల ఎగుమతికి, అలాగే ఖనిజ సంపద రవాణాకు చౌకైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ముంబాయి - చెన్నయ్ మహానగరాలను కలుపుతున్న రైలు మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని యుద్ధప్రాతిపదికపై పూర్తి చేసి, కొత్త రైళ్ళను ప్రవేశ పెట్టాలి.  రైల్వే వార్షిక బడ్జెట్ లో ప్రకటించిన మేరకు రు. 250 కోట్లతో ఐదు వేల మందికి ఉపాథి కల్పించే లక్ష్యంతో కర్నూలు పట్టణానికి సమీపంలో నెలకొల్ప తలపెట్టిన‌ రైల్వే వ్యాగన్ మిడ్ లైఫ్ రిహబిలిటేషన్ సెంటర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి. రేణిగుంట వ్యాగన్ రిపేర్ వర్క షాప్ సామర్థ్యాన్ని పెంచి, విస్తరించాలి. గుంతకల్ కేంద్రంగా రైల్వే జోన్ ను నెలకొల్పాలనే రాయలసీమ ప్రజల కోర్కెను సానుభూతితో పరిశీలిస్తే ఆ ప్రాంత అభివృద్ధికి ఉపకరిస్తుంది.  వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి పథకంలో అంతర్భాగంగా రైలు మార్గాలు, జాతీయ రహదారుల నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావాలి.
ఆర్థికాభివృద్ధికి చోధక శక్తిగా పనిచేసే మౌలిక సదుపాయాలలో కీలకమైన భూమిక పోషించేది విద్యుత్తు. ఆర్.టి.పి.పి. మరియు శ్రీశైలం జల విద్యుదుత్ఫత్తి కేంద్రం, పి.ఎ.బి.ఆర్. మినీ జలవిద్యుత్ కేంద్రం, తుంగభద్ర జల విద్యుదుత్ఫత్తి కేంద్రం ఉన్నా వాటి ద్వారా ఉత్ఫత్తి అవుతున్న విద్యుత్తును రాయలసీమ అవసరాలకు మాత్రమే కేటాయించబడ లేదు. గ్రిడ్ కు అనుసంధానం చేసి రాష్ట్ర విభజనలో భాగంగా ప్రస్తుత వినియోగం ప్రాతిపదికన పంపిణీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగింది. అందులో భాగంగానే రాయలసీమకు అన్యాయం జరిగింది. ఈ ప్రాంతంలో సౌర మరియు పవన విద్యుదుత్ఫాదనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యుదుత్ఫత్తిలో స్వయం పోషకత్వాన్ని సాధించడమే కాకుండా యువతకు ఉపాధి కల్పన, ఉత్ఫత్తి కేంద్రాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు. విద్యుత్ సబ్ స్టేషన్లకు అనుసంధానంగా సౌర విద్యుదుత్ఫత్తి కేంద్రాలను జెన్కో యాజమాన్యంలో నెలకొల్పాలి. సౌర విద్యుదుత్ఫాదన ద్వారా రైతులు పంప్ సెట్లను నిర్వహించుకొనే విధంగా ఆర్థిక సహకారాన్ని అందించి, ప్రోత్సహించాలి. తద్వారా విద్యుదుత్ఫాదన ప్రజాతంత్రీకరించబడుతుంది. విద్యుత్ సరఫరాలో సంబవిస్తున్న‌ నష్టాల బారి నుండి బయటపడవచ్చు. శ్రీకాకుళం జిల్లా మొదలు నెల్లూరు జిల్లా వరకు సముద్ర తీరంలో థర్మల్ విద్యుదుత్ఫత్తి కేంద్రాలను నెలకొల్పడం ద్వారా పర్యావరణాన్ని నాశనం చేసి, సారవంతమైన పంట పొలాలను సేకరించడం ద్వారా ఆహార భద్రతకు ప్రమాదం తెచ్చిపెట్టి, ఆ భూములపై ఆధారపడిన ప్రజలకు జీవనోపాథి లేకుండా చేయడం లాంటి దుష్ఫలితాలు లేకుండానే విద్యుత్తు అవసరాలను తీర్చుకోవడానికి సౌర మరియు పవన విద్యుదుత్ఫాదనకున్న అవకాశాలన్నింటినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. దీని కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలి. 
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనా రూపకల్పనలో దృష్టంతా విశాఖపట్నం, నెల్లూరు మధ్య విస్తరించిన ప్రాంతంపైనే కేంద్రీకరించకుండా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలపై కూడా దృష్టి సారించి సమతుల్యమైన, సమగ్రాభివృద్ధికి పథక రచన చేసి, దీర్ఘకాలిక దృష్టితో రాజకీయ సంకల్పంతో కృషి చేయాలి. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంతో ధాన్యాగారంగా పేరుగాంచిన కోస్తాంధ్ర ప్రాంతంలోని సారవంతమైన భూములను వాణిజ్య కార్యకలాపాలకు, పారిశ్రామికాభివృద్ధి పేరిట లక్షలాది ఎకరాలను బలవంతంగా సేకరించే అప్రజాస్వామిక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంటే ప్రజాప్రతిఘటనను చవిచూడవలసి వస్తుంది. ప్రారిశ్రామికవేత్తలకు, రియలెస్టేట్ వ్యాపారులకు మాత్రమే కాసులు రాల్చే నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు అనుగుణమైన ఉపాథిరహిత అభివృద్ధి నమూనా అమలు చేయడానికి పూనుకొంటే ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయి. నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణించి దుర్భర పరిస్థితులు నెలకొని, సామాజిక ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తాయి. అందువల్ల అత్యంత జాగరూకతతో, జవాబుదారితనంతో, పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి నమూనాను రూపొందించి, చిత్తశుద్ధితో అమలు చేయాలి.
పర్యావరణానికి హాని కలిగించకుండా స్థిరమైన అభివృద్ధికి నవ్యాంధ్రప్రదేశ్ లో బాటలు వేయాలి. భావితరాల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా పరిణమించని రీతిలో అభివృద్ధిని సాధించి నేటి తరం మౌలికావసరాలను తీర్చాలి. సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థలు ఒక దానిపై ఒకటి పరస్పరం ఆధారపడినవి. ఈ విషయాన్ని గుర్తించినప్పుడే స్థిరమైన అభివృద్ధి సాకల్యం అవుతుంది. అప్పుడే ప్రజల సాధికారంతో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమానత్వం కల్పించడానికి వీలవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడుతుంది. సంక్లిష్ట సమస్యల మధ్య అభివృద్ధికి ప్రణాళికలను రూపకల్పన చేసే బాధ్యతను స్వీకరించిన‌ ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్నివిధిగా పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి ఫలాలు కొందరికే సొంతమైతే దాన్ని అభివృద్ధి అనడం హాస్యాస్పదం. మానవాభివృద్ధి స్థాయిని నిర్ధారించే అంశాల ప్రాతిపథికపై ఆధారపడే అభివృద్ధిని అంచనా వేయాలి. ప్రజల మౌలికావసరాలైన రక్షిత త్రాగు నీరు, ఆహారం, నివాసం, విద్య, ఉపాథి, ఆరోగ్యం, నాణ్యమైన జీవన ప్రమాణాలు, రవాణా సౌకర్యాలు, సమాచార వ్యవస్థ, సామాజిక భద్రత, ప్రజల మధ్య శాంతియుత సహజీవనానికి అవసరమైన వాతావరణం త‌దితర అంశాల కొలబద్ధగా సామాజికాభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నదో నిర్ధారించబడుతుంది. ప్రకృతి సిద్ధమైన భూమి, సహజ వనరులను విసక్షిణారహితంగా వినియోగించకూడదు. అభివృద్ధి ముసుగులో పర్యావరణ సమతుల్యతను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. తీవ్ర సంక్షోభంలో ఉన్న‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించి, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి వలసలను నివారించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పట్టణీకరణకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా అనేక సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాథి కల్పనా పథకాలకు, అత్యధిక ప్రజానీకానికి జీవనోపాథి కల్పిస్తున్న వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రప్రథమ ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలి.
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి దిశానిర్ధేశం చేసి, రాష్ట్ర పునర్నిర్మాణ కర్తవ్యాన్ని రాజకీయ సంకల్పంతో నిర్వర్తించాలని నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలు బాధ్యతను అప్పగించారు. ఈ గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం  ఆయనకు పెను సవాలే. రాజధాని కూడా లేకుండా విసక్షణారహితంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకాన్ని కష్టాల కడలిలోకి బలవంతంగా నెట్టివేసింది. ఈ నేపథ్యంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కకు నెట్టి అన్ని రాజకీయ పక్షాలు ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కర్తవ్యోన్ముఖులు అవుతారని ఆశిద్ధాం!
                                                                                                                          
                                                                                                 



No comments:

Post a Comment