Wednesday, August 27, 2014

వీరోచిత పోరాటానికి ప్రతిబింబం "బషీర్ బాగ్"





 స్వాతంత్య్రానంతర భారత దేశంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర నలుచెరుగుల నుండి సముద్ర కెరటాల్లా ఎగసిపడుతూ తరలివచ్చిన జన బాహుళ్యం 28 ఆగస్టు 2000 తేదీన సాగించిన‌ సమరశీల పోరాటానికి హైదరాబాదు మహానగరానికి నడిబొడ్డులో ఉన్న బషీర్ బాగ్ యుద్ధక్షేత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. నాటి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించాలన్న ప్రధానమైన డిమాండ్ తో పాటు విద్యుత్ రంగంలో తలపెట్టిన సంస్కరణలను ప్రతిఘటిస్తూ, విద్యుదుత్ఫాదన, సరఫరా మరియు పంపిణీ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఆర్థిక వ్యవస్థకు చోధక శక్తిగా పనిచేసే విద్యుత్తు రంగాన్ని మార్కెట్ శక్తులకు అప్పగించవద్దని, నిత్యావసర వస్తువుగా ఉన్న విద్యుత్తును ఖరీదైన అంగడి సరుకుగా మార్చి సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకొంటూ జనం సాగించిన వీరోచిత మహోద్యమమది.
వామపక్ష రాజకీయ పార్టీలు ఇచ్చిన "ఛలో అసెంబ్లీ" పోరాట‌ పిలుపుకు స్పందించి ఉరకలేసుకొంటూ వచ్చిన‌ యాభై వేల మందికిపైగా ఉద్యమకారులు పిడికిలి బిగించి, గళమెత్తి నినదిస్తూ, కందంతొక్కుతూ ఇందిరా పార్క్ నుండి బయలుదేరి లోయర్ టాంక్ బండ్, లిబర్టి, బషీర్ బాగ్ ప్లై ఓవర్ మీదుగా ప్రదర్శనగా శాసన సభ వైపుకు దూసుకు పోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఉద్యమకారులను నిలవరించడానికి పోలీసులు పలు అంచల భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేసుకొన్నారు. ముళ్ళ కంచెలు, వాటర్ క్యాన్స్ తో వాహనాలు, పైబర్ లాఠీలు చేతబూనిన పోలీసులు, అశ్విక దళాలు, స్టెన్ గన్ లతో సాయుధులైన స్పెషల్ పోలీసు దళాలు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇలా అంచెలoచలుగా బారులు తీరి ఉన్నాయి. వేల మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించి ఛలో అసెంబ్లీ ఆందోళనను ఎలాగైనా భగ్నం చేయాలన్న పథకాన్ని రూపొందించుకొని ప్రభుత్వం సర్వసన్నద్ధమయ్యింది. ఉద్యమకారులు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర మలుపు తీసుకొని బషీర్ బాగ్ కూడలికి చేరుకోగానే పోలీసు దళాలు విరుచుకుపడ్డాయి. నాడు జరిగిన ఆ పోరాటనికి నేను ప్రత్యక్ష సాక్షిని.
ఛలో అసెంబ్లీ పిలుపులో భాగంగా ఉద్యమకారులుగా మేము ముళ్ళ కంచెలను దాటుకొని అసెంబ్లీ వైపు వెళ్ళడానికి ప్రయత్నించాం. పైబర్ లాఠీలు, వాటర్ క్యాన్స్, అశ్విక దళాలు, బాష్పవాయువు తూటాలతో పోలీసు దళాలు ముప్పేటా దాడికి పూనుకొన్నాయి. నిరాయుధులైన ఉద్యమకారులకు, సాయుధులైన పోలీసు దళాలకు మధ్య హోరా హోరి పోరుసాగింది. వందలాది మంది తీవ్రంగా క్షతగాత్రులైనారు. కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల నాయకులు మరియు కార్యకర్తలైన 22 మందిని మిగిలిన ఉద్యకారుల నుండి వేరు చేసి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఆ 22 మందిలో నేనొకడ్ని. దెబ్బలు తింటూనే చలించని పట్టుదలతో నడిరోడ్డుపైన బైటాయించాం. మా చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడి బలవంతంగా అక్కడే సిద్ధంగా ఉంచుకొన్న పోలీసు బస్సులోకి మమ్మల్ని తరలించారు. శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి  వెళుతున్న‌ ప్రదర్శనకారులపై పోలీసులు దమనకాండకు పూనుకోవడంతో ఆందోళనకారులు పెట్రేగిపోయారు. ప్రాణాలను లెక్కచేయకుండా పోలీసు దళాలపై తిరగబడ్డారు. ఒక దశలో పోలీసులు పలాయనం చిత్తగించి, వ్యూహాత్మకంగా మమ్ములను నిర్భందించిన‌ పోలీసు ఎర్ర‌ బస్సు వెనకాల దాక్కొని ఎదురు దాడి చేయడానికి పూనుకొన్నారు. ఆందోళనకారులు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పోలిసు వాహనంలో మేమున్నామనే విషయం తెలియక దానిపై దాడికి దూసుకొస్తుంటే మా వద్ద ఉన్న కర్చీప్స్ ను చేతుల్లోకి తీసుకొని బయటికి ఊపుతూ నినాదాలు చేశాం. అది గమనించి వారు వెనక్కి తగ్గారు. మరొక వైపు మమ్ములను నిర్భందించిన ఎర్రబస్సుకు కొన్నిఅడుగుల దూరంలోనే ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఉన్నఒక పోలీసు జీపుకు ఎవరో నిప్పు పెట్టారు. ఈ దృశ్యాలు చూస్తుండగానే మేమున్న బస్సు వెనకాల నుంచి తుపాకీ తూటా పేలిన శబ్దం వచ్చింది. క్షణాల్లో మేము చూస్తుండగానే పెట్రోల్ బంక్ వైపున్న ఒక పోలీసు కానిస్టేబుల్ రక్తమోడుతూ కుప్పకూలిపోయాడు. సహచర పోలీసులు వెంటనే అతన్ని చేతుల మీద మోసుకెళ్ళి ఆసుపత్రికి తరలించారు. మరొక వైపు పోలీసు ఉన్నతాధికారుల అరుపులతో కూడిన ఆదేశాల జారీ, ఉద్యమకారులపైకి పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడం, పిట్టల్ని కాల్చినట్లు గురిచూసి కాల్చడం మొదలు పెట్టారు. ఇద్దరు యువకులు నేలకొరిగారు. విలవిల్లాడుతూ క్రింద పడిపోయిన ఆ ఇద్దరినీ సహచర ఉద్యమకారులు భుజాలపైకి ఎత్తుకొని ప్రక్కకు మోసుకెళ్ళారు. పోలీసు తుపాకి తూటాలకు బలై అమరులైన ఆ యువకిశోరాలే విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి. 
పోలీసు వ్యానులో నుండి ఈ హృదయ విదారకమైన దృశ్యాలను చూస్తూ నిస్సహాయకులుగా, ప్రత్యక్ష సాక్షులుగా మిగిలిపోయి, తీవ్రమైన గుండె కోతకు గురైనాము. పోలీసు తూటాలు శరీరాల్లో దూసుకపోయి నేలకొరిగిన వారు, తీవ్ర గాయాల పాలైన వారు, తృటిలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకొన్న వారు, తీవ్రమైన‌ లాఠీ చార్జీలో తలలు పగిలిన వాళ్ళు, కాళ్ళు, చేతులు విరిగిన వారు హాహాకారాలు చేస్తూనే ఎర్రజెండాలను పైకెత్తి నినదిస్తూ పోరు భూమిలో వెనకడుగు వేయకుండా ధీరోదాత్తులుగా ధైర్యసాహసాలను ప్రదర్శించారు. చెల్లాచెదరైన కార్యకర్తలు తిరిగి సమీకృతులై గుంపులు గుంపులుగా, అలలు అలలుగా ప్రతిఘటనను కొనసాగించారు. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.
ఉద్యమకారులపై హత్యా నేరం కేసు: పోలీసు కానిస్టేబుల్ ను పోలీసులే తుపాకితో లాల్చి దాన్ని సాకుగా చూపెట్టి ఉద్యమకారులపై కాల్పులు చేసి ఇద్దరు యువకులను పొట్టన పెట్టుకొన్నారు. పైపెచ్చు పోలీసుల చేతుల్లో నుంచి తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు చేశామని పోలీసు వ్యానులో నిర్భదింసచబడిన 22 మందిపై సెక్షన్ 147/148/183/332/307/435/ఆర్/డబ్లు/149/ఐపిసి మరియు సెక్షన్ 25 మరియు 27, ఐ.ఎ. య్యక్ట్, సెక్షన్ 3 మరియు 4 ఆఫ్ పిపిడి యాక్ట్ క్రింద‌ హత్యా ప్రయత్న‌ నేరం మోపి తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో భారత కమ్యూనిస్టు పార్టీ, జాతీయ సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి, సి.పి.ఐ. యం.యల్.(న్యూ డెమోక్రసీ) పార్టీ నాయకులు మరియు ఆనాడు శాసన సభ్యులుగా ఉన్నకామ్రేడ్ గుమ్మడి నరసయ్య లు మొదటి, రెండవ ముద్దయిలైతే నేను మూడవ ముద్దాయిని. అలాగే కామ్రేడ్స్ కొల్లి నాగేశ్వరరావు, మానం ఆంజనేయులు, పశ్యపద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, యం.వి.ప్రసాద్, వి.సంథ్య, జి. ఝాన్సీ, నెక్కంటి సుబ్బారావు, యం.శోభన్ బాబు, దశరథ్, ఇ.టి నరసింహ, ఎం.భిక్షపతి, యం.గాలన్న, యం. సంజీవకుమార్, ఎన్.నాగేశ్వరరావు, ఎం.శ్రీనివాస్, కె.వి.రమణయ్య, కె. అజయ్ బాబు, మురళీచౌదరి ముద్దాయిలుగా చేర్చబడ్డారు. ఆ రోజు పోలీసు స్టేషన్ లో నిర్భందించి మరుసటి రోజు నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. మాకు సంఘీభావంగా తరలివచ్చిన‌ న్యాయవాదులతో కోర్టు ప్రాంగణమంతా నిండిపోయింది. ఆ సమయంలో సురవరం సుధాకరరెడ్డి గారిని వైద్య పరిక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో నేనే దాదాపు అరగంట పాటు జరిగిన ఘటనలను సోదాహరణంగా మేజిస్ట్రేట్ ముందు వివరించాను. 
నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను బెయిల్ రాదని భావించాం. దానికి తోడు నేను పోలీసులకు వ్యతిరేకంగా బలమైన వాదనను వినిపించిన కారణంగా బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా సొంత పూచీకత్తుపై మాకు బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వు జారీ చేశారు. అటుపై శాసన సభలో ఈ అక్రమ కేసుపై ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే సురవరం సుధాకరరెడ్డి, గుమ్మడి నరసయ్యలను మాత్రమే కేసు నుండి మినహాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ హామీని నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సుదీర్ఘ కాలం నానబెట్టి తరువాత ఈ మధ్యనే ఆ కేసును ఉపసంహరించుకొంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వామపక్ష ఐక్యత - చేదు అనుభవం: విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో రాష్ట్ర వ్యాపితంగా మూడు నెలలకుపైగా సుదీర్ఘ పోరాటానంతనం ప్రభుత్వం మెడలు వంచడానికి "ఛలో అసెంబ్లీ" ఆందోళనా కార్యక్రమానికి తొమ్మిది వామపక్ష పార్టీలు పిలుపిచ్చాయి. ఇందిరా పార్క్ నుండి ప్రదర్శన ప్రారంభానికి ముందు జరిగిన‌ ఒక చిన్న ఘటన ఉద్యమ భాగస్వాముల మధ్య కాస్త అనైక్యతకు దారి తీయడ‍ం, పర్యవసానంగా రెండు ప్రదర్శనలుగా నిర్వహించబడడం దురదృష్టకరం. ప్రదర్శన ముందు భాగంలో ఒకే పార్టీకి చెందిన జెండాలు పట్టుకొని కార్యకర్తలు నిలబడి ఉండడంతో మిగిలిన పార్టీల కార్యకర్తలు కూడా కొంత మంది వారి జెండాలతో వెళ్ళి ముందు నిలబడ్డారు. అప్పటికే అగ్రభాగాన నిలబడి ఉన్నపార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేక మేము వేరుగా ప్రదర్శన నిర్వహిస్తామని వెనక్కివెళ్ళిపోయారు. తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు ప్రధాన బ్యానర్ పట్టుకొని ప్రదర్శనకు అగ్రభాగాన‌ నడుస్తారని, ఆ తరువాతే ప్రదర్శకులు పాల్గొంటారని నచ్చచెప్పడానికి మిగిలిన ఎనిమిది పార్టీల నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొద్ది పాటి తేడాతో రెండు ప్రదర్శనలూ ఒక దానివెంట మరొకటి నిర్వహించబడ్డాయి. మొదటి ప్రదర్శనలోని ఉద్యమ‌కారులు బషీర్ బాగ్ కూడలి చేరుకోగా, రెండవ ప్రదర్శనలో పాల్గొన్న వారు ప్రెస్ క్లబ్ దగ్గరలోని బాబు జగజ్జీవన్ రాం విగ్రహం వద్దకు చేరుకొన్నారు. అక్కడ జరిగిన తీవ్రమైన లాఠీ చార్జీలోనే రామక్రిష్ణ తీవ్రంగా గాయపడి అమరుడైనాడు. అనేక మంది క్షతగాత్రులైనారు. పీడిత ప్రజల పక్షాన నికార్సుగా నిలబడి త్యాగనిరతితో ఉద్యమ నిర్మాణానికి అంకితమైన వామపక్షాలు తాత్కాలిక ఆవేశాలకులోనైతే విశాల ఐక్యతకు ఏ విధంగా హాని జరుగుతుందో ఈ ఘటన తెలియజేసింది. 

No comments:

Post a Comment