నాలుకకు తేనె రాసుకొని తియ్యటి
మాటలు మాట్లాడుతూ రైతాంగం యొక్క చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య హక్కును కాలరాయడానికి
మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టం- 2013కు అత్యంత కీలకమైన సవరణలు
చేస్తూ అత్యవసర ఆదేశం(ఆర్డినెన్స్)ను డిసెంబరు 31,
2014న జారీ చేసింది. తద్వారా భూసేకరణ చట్టం యొక్క ఆయువు పట్టుపై గొడ్డలి పెట్టు
వేసింది. దేశాభివృద్ధి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, భూముల ధరలు పెరగడానికి, భూములు కోల్పోయే రైతాంగం మెరుగైన
నష్టపరిహారం పొందడానికే ఆర్డినెన్సును జారీ చేశామని నమ్మబలుకుతూ కేంద్ర ఆర్థిక
శాఖామాత్యులు అరుణ్ జైట్లీ ఒక సుదీర్ఘ వ్యాసం వ్రాసి భాజపా వెబ్ సైట్ లో పోస్ట్
చేశారు. అబద్దాలు చెప్పి నమ్మించడానికి కూడా ధైర్యమూ, వాదనా పటిమ ఉండాలి. నందిని పంది, పందిని నంది చేయగలిగిన నైపుణ్యాన్ని అరుణ్ జెట్లీ ఆ వ్యాసంలో బాగా
ప్రదర్శించారు.
బ్రిటీష్ కాలం నాటి, కాలం చెల్లిన, 1894 భూసేకరణ చట్టాన్ని వదిలించుకోవడానికి 120 సంవత్సరాలు పట్టింది. దాని స్థానంలో
స్వాతంత్ర్యానంతరం 66 సంవత్సరాలకు భూసేకరణలో సముచిత నష్టపరిహారం హక్కు మరియు పారదర్శకత, పునర్నివాసం, పునరావాసం చట్టం – 2013 (భూసేకరణ చట్టం)కు ఎట్టకేలకు
పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఆ నూతన చట్టం 2014 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. ఏడాది
గడవలేదు. క్షేత్ర స్థాయిలో ఇంకా పూర్తి
స్థాయిలో అమలుకు నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని
యు.పి.ఎ. ప్రభుత్వం గద్దెదిగి, భాజపా
నాయకత్వంలోని యన్.డి.ఎ. అధికారంలోకొచ్చింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా పాలనా
పగ్గాలు చేబట్టారు. భూసేకరణ చట్టం - 2013 దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిందని అభివర్ణిస్తూ చట్టాన్ని నిర్వీర్యం
చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నది. రైతాంగం దశాబ్ధాల పాటు సాగించిన
అలుపెరగని పోరాటాలు, త్యాగాలతో
సాధించుకొన్న చట్టాన్ని ఒక్క కలం పోటుతో మోడీ సర్కార్ నిర్వీర్యం చేసింది. భూసేకరణ
ప్రక్రియలో భూయజమానులైన రైతాంగం యొక్క ప్రాథమిక హక్కును నిరంకుశంగా లాగేసుకొంటూ
చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనార్థం
చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతులకు లాభం చేకూర్చడానికే
సవరణలు చేశామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకొంటున్నది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
అన్న నానుడిని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు అరుణ్ జెట్లీ తన వ్యాసంలో భూసేకరణ
చట్టం-2013కు సవరణ చేయాల్సిన అవసరమెందుకొచ్చింది, ఆ సవరణల ప్రభావం ఏలా ఉంటుంది అన్న ప్రశ్నలను సంధించి, వాటికి సమాధానం చెబుతున్నట్లు
వివరణ ఇస్తూ దేశం, రైతుల
ప్రయోజనార్థమే ఆర్డినెన్సును తీసుకొచ్చామని నమ్మించడానికి శతవిధాల
ప్రయత్నించారు.
సవరణల వెనుక వర్గ దృక్పథం: 1894 భూసేకరణ చట్టంలో నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి
పొందుపరచిన నిబంధనలు అత్యంత లోపభూయిష్టంగా ఉండేవి. నాటి బ్రిటీష్ పాలకులు వర్గ
దృక్పథంతోనే వాటిని రూపొందించారు. దాన్ని సమూలంగా మార్చాలని రైతాంగానికి అండగా ప్రగతిశీల శక్తులు
సాగించిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా భూసేకరణ చట్టం-2013 పురుడు పోసుకొన్నది. భూసేకరణ చట్టంలోని నాలుగవ షెడ్యూల్ 105 సెక్షన్ లో పొందుపరచిన పలు
రంగాలకు చెందిన 16 చట్టాలను మినహాయిస్తూ ఏడాది తరువాత వాటిని కూడా చట్ట
పరిథిలోకి తీసుకురావాలని షరతు విధించబడింది. ఆ గడువు 2014 డిసెంబరు 31 నాటికి ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధననే తడికగా ఉపయోగించుకొని
రాష్ట్రపతి చేత ఆర్డినెన్సుకు అమోద ముద్ర వేయించుకోవడం దుర్మార్గమైన చర్య. ఈ
అత్యవసర ఆదేశం ద్వారా చట్టంలో మినహాయించబడిన 13 చట్టాల పరిథిలోకొచ్చే రంగాల అవసరాల కోసం భూసేకరణ చేస్తే
రైతాంగం చట్టం ప్రకారం అధిక నష్టపరిహారాన్ని పొందే విధంగా మేలు చేశామని గొప్పలు
చెప్పుకొంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే భూసేకరణ చట్టంలోని షరతును
ఉల్లంఘించిన వారై ఉండేవారు. ఆ వాస్తవాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేశారు.
ఆర్డినెన్స్ లోని మిగిలిన సవరణలే అత్యంత కీలకమైనవి. 1) ప్రజాప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం పట్టాదారుల నుండి భూమిని
సేకరించాలంటే 70% మంది భూయజమానుల అంగీకారం అనివార్యమని భూసేకరణ చట్టం-2013లో పొందుపరచబడింది. 2) సేకరించిన భూముల్లో నెలకొల్పబోయే పరిశ్రమ పర్యవసానంగా సమాజంపై ఎలాంటి ప్రభావం
పడుతుందో ముందస్తుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడాలి. అత్యంత
ప్రజాస్వామ్యయుతమైన ఈ రెండు నిబంధనలను నిరంకుశంగా ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం
తొలగించింది. అంటే రైతాంగం యొక్క గొంతు నొక్కేసి బలవంతంగా భూములను లాగేసుకోవడానికి, భూసేకరణ దుష్పలితాలను చూడనిరాకరించడానికే చట్ట సవరణ చేశారు.
ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింప చేశాయని, సవరణకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించిన మీదట ఆమోదం
పొందడానికి వీలుపడలేదని,
కాబట్టే ఆర్డినెన్స్ జారీ చేయవలసి వచ్చిందని
చెప్పడం ద్వారా చట్ట సభల నిర్వహణలో మోడీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది.
దేశ రక్షణ మరియు రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలకు, పేదల గృహ సముదాయాల నిర్మాణానికి, టౌన్ షిప్స్ నిర్మాణo, పట్టణీకరణకు, పారిశ్రామికాభివృద్ధికి, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విద్యుత్ లైన్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తదితర అభివృద్ధి అవసరాలకు భూమిని సేకరించుకొనే సార్వభౌమాధికారం చారిత్రకంగా ప్రభుత్వానికి దఖలు పరచబడిందని దబాయిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలు మిన్నగా ఉంటాయని, 21వ శతాబ్దం అవసరాలకు అనుగుణంగా చట్టంలో మార్పులు అనివార్యమని హితభోద చేస్తున్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తున్న నేటి పాలక వర్గం సంపన్న వర్గాలకు అనుకూలంగా వివిధ చట్టాల మౌలిక స్వభావాన్నే మార్చివేస్తూ పథకం ప్రకారం సవరణలు చేస్తున్నది."బిజినెస్ ప్రెండ్లీ" పాలనను కొనసాగిస్తామని బహిరంగంగా ప్రకటించుకొన్న మోడీ ప్రభుత్వం ఆ వర్గ స్వభావంతోనే కార్పోరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనార్థమే భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు విషయాన్ని దాచిపెట్టి కల్లబొల్లి మాటలతో దేశ ప్రజానీకాన్ని బురిడీ కొట్టించాలని ప్రయత్నిస్తున్నారు.
మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం: రైతులకు
నష్టపరిహార చెల్లింపు నిబంధనను ముట్టుకోకుండా రాష్ట్ర మరియు జాతీయ రహదారులు, విద్యుత్తు, నీటి పారుదల పథకాలు, జాతీయ రహదారుల వెంబడి నెలకొల్పబోయే పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతుల
భూముల విలువ పెరగడానికి,
ఉపాథి కల్పన, గ్రామీణాభివృద్ధికి ఈ సవరణలు దోహదపడతాయని ప్రలోబపెట్టే ప్రయత్నం
చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి
పట్టణ ప్రాంతాలలో లభ్యమతున్న ఉపాథి అవకాశాల కోసం వలస వస్తున్న ప్రజలు పట్టణీకరణ, టౌన్ షిప్స్ నిర్మాణం వల్ల ప్రయోజనం పొందుతారని
చెబుతున్నారు. ఉదా: డిల్లీ - ముంబాయ్ పారిశ్రామిక కారిడార్ నిర్మాణం వల్ల ఆ జాతీయ
రహదారికి అటు ఇటు ఉన్న వేలాది గ్రామాలు ప్రయోజనం పొందుతాయని, వ్యవసాయ భూముల విలువ పెరిగి రైతాంగానికి లబ్ధి
చేకూరుతుందని, ఉపాథి అవకాశాలు కల్పించబడతాయని, సామాజిక మౌలిక సదుపాయాల పథకాలు, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పిపిపి) పథకాల వల్ల దేశం మొత్తానికి
మేలు జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఈ సవరణల ద్వారా అభివృద్ధిలో సమతుల్యత
సాధించబడుతుందని చెప్పుకొచ్చారు. భూసేకరణ చట్టం -2013 ను రూపొందించడంలో యాభైకిపైగా తప్పులు చోటు చేసుకొన్నాయని
వాటిలో కొన్నింటిని సరిదిద్దడానికే ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చామని ప్రభుత్వం
ప్రకటించింది. కానీ, భూసేకరణ ప్రక్రియలో
భూమిని కోల్పోయే భూయజమానుల అభిప్రాయాలకు ఉన్న చట్టబద్ధతను రద్దు చేసి రైతాంగం
యొక్క ప్రజాస్వామ్య గొంతుకను మాత్రం నులిమేసింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పి.పి.పి.)ల ముసుగులో కార్పోరేట్ సంస్థలకు భూములను
అప్పగించడానికే భూసేకరణ చట్టానికి సవరణలు చేశారన్నది దాచాలన్నా దాగని సత్యం. ఖనిజ
సంపద నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు
అత్యధికంగా గిరిజన ఆవాసాలే. ఈ సవరణల ద్వారా అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు
లభించిన హక్కులను కాలరాస్తున్నారు.
భూసేకరణ చేసిన ప్రాంతాలలో నెలకొల్ప తలపెట్టిన పరిశ్రమల వల్ల ఆ ప్రాంతాల ప్రజల
జీవనోపాథికి, ఆహార భద్రతకు, పర్యావరణానికి, అలాగే అక్కడి సమాజంపై పడే ప్రభావాన్ని ముందస్తుగా అధ్యయనం
చేసి రూపొందిచిన నివేదికను పరిగణలోకి తీసుకొన్న మీదటనే భూసేకరణ ప్రక్రియలో
ప్రభుత్వం అడుగు ముందుకేయాలని చట్టం చెబుతాఉంది. భూసేకరణ మూలంగా భూయాజమాన్య
హక్కులు లేక పోయినా ఆ భూములనే నమ్ముకొని జీవనోపాథి పొందుతున్న వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, ఆయా గ్రామాల్లో ఇతర స్వయం
పోషక వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం, ఉపాథి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన తదితర సమస్యల పరిష్కారానికి
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉన్నది. సాంఘిక అధ్యయనం చేయాలన్న నిబంధననే
తొలగించడమంటే భూసేకరణ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం గాలికి
వదిలేయదలుచుకొన్నదని స్పష్టమవుతున్నది.
చట్టంలోని విభాగం 10(ఎ)ని సవరించి ఐదు కొత్త రంగాలకు చెందిన
పథకాలకు భూయజమానుల అంగీకారం, అలాగే సామాజిక ప్రభావంపై
అధ్యయన నివేదిక అవసరం లేదని జారీ చేసిన ఆర్డినెన్స్ ను నిశితంగా పరిశీలిస్తే
మరికొన్ని ముఖ్యమైన నిబంధనలను కూడా ప్రభుత్వం తొలగించడం గానీ నిర్వీర్యం చేయడం
గానీ చేసింది. సెక్షన్ 101 ని సవరించడం
ద్వారా ఉపయోగించని భూమిని భూయజమానికి తిరిగి ఇచ్చివేయాలన్న నిబంధనకు చెల్లుచీటీ
ఇచ్చేశారు. నిర్ధేశిత అవసరాల నిమిత్తం సంస్థలకు కేటాయించిన భూములను ఐదు సంవత్సరాల
లోపు వినియోగించుకోని యడల ఆ భూమిని సంబంధిత భూయజమానికి తిరిగి ఇచ్చివేయాలని
చట్టంలో ఉన్న నిబంధన అర్థరహితమైనదని తొలగించారు. స్మార్ట్ సిటీస్, టౌన్ షిప్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, వాణిజ్య సముదాయాలు, రక్షణ పథకాలు, కంటోన్మెంట్స్, ఓడ రేవులు, అణు విద్యుత్ కేంద్రాలు, జాతీయ రహదారులు,
నీటి పారుదల ప్రాజెక్టులు, జలాశయాలు తదితర పథకాల నిర్మాణానికి దీర్ఘకాలం పడుతుందని
అందు వల్ల ఐదు సంవత్సరాల నిబంధన పెద్ద అవరోధంగా తయారయ్యిందని పేర్కొంటూ ఆయా
పరిశ్రమలు లేదా ప్రాజెక్టుల నిర్మాణానికి పట్టే సమయం లేదా ఐదేళ్ళలో ఏది ఎక్కువైతే
దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ సవరణ చేశారు.
దానితో పాటు భూమి కేటాయింపులో ఏదైనా ప్రభుత్వ శాఖ లేదా అధికారి అక్రమాలకు
పాల్పడి ఉంటే న్యాయస్థానాలు కఠినంగా శిక్షంచే అధికారానికి సంబంధించిన అంశాన్ని
బలహీనపరిచారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపు అంశంపై న్యాయస్థానాల్లో
వ్యాజ్యం నడుస్తూ 'స్టే' విధించిన సందర్భాలలో అoత్యమంగా భూయజమానులకు అనుకూలంగా తీర్పువస్తే నష్టపరిహారం
చెల్లింపును లెక్కగట్టడానికి చట్టం రాకముందు నుంచీ వ్యాజ్యం జరుగుతున్న కేసులకు
సంబందించి 'రిట్రాస్పెక్టివ్ క్లాజ్'ను అమలు చేయాలని చట్టంలో పేర్కొనబడింది. ఆ నిబంధనను ప్రభుత్వం తొలగించింది.
జాప్యానికి సంస్థ బాధ్యతలేదని ఉద్ఘాటిస్తూ సెక్షన్ 24(2)ను సవరించి వ్యాజ్యం
జరిగిన కాలాన్ని లెక్కలోకి తీసుకోబడదని ప్రకటించింది. ప్రయివేట్ కంపెనీ అన్న పదం
స్థానంలో ప్రయివేట్ సంస్థ అన్న పదాన్ని చేర్చడం ద్వారా కంపెనీల చట్టం మేరకు
రిజిస్ట్రేషన్ చేసుకొన్న కంపెనీలకే భూసేకరణను పరిమితం చేయకుండా విస్తృత పరిచారు. ప్రభుత్వం భూయజమానుల నుండి సేకరించిన భూములను
ప్రయివేటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్ళు, తదితర ప్రయివేటు సంస్థలకు
కేటాయించ కూడదని చట్టంలో ఉన్న నిబంధనను కూడా తొలగించారు. సమతుల్య అభివృద్ధి
జరగాలంటే ప్రయివేటు రంగానికి ప్రభుత్వం సేకరించిన భూములను కేటాయించాల్సిందేనని ప్రభుత్వం
ప్రకటించింది. బహుళ పంటలు పండే భూములను సేకరించ కూడదన్న షరతు గాలిలో కలిసి
పోయింది.
భూసేకరణ(గనులు) చట్టం-1885, బొగ్గు క్షేత్రాల సేకరణ, అభివృద్ధి చట్టం -1957, విద్యుత్ చట్టం -2003, జాతీయ రహదారుల చట్టం -1956, భారత రైల్వేల చట్టం-1989, మెట్రో రైల్స్
(నిర్మాణ పనులు) చట్టం-1978, ఇండియన్ ట్రామ్ వేస్
యాక్ట్-1886, అణు ఇంధన పథకాల
చట్టం-1962, ది ఏన్సియెంట్
మానుమెంట్స్ అండ్ ఆర్కియాలిజికల్ సైట్స్ అండ్ రిమేన్స్ యాక్ట్ -1958, పెట్రోలియం అడ్ మినరల్స్ పైప్ లైన్స్ యాక్ట్-1962, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చట్టం -1948, పునరావాస చట్టం, మొత్తం 13 చట్టాలను భూసేకరణ
చట్టం పరిథిలోకి తీసుకొచ్చారు. ఇది రైతాంగానికి మేలు చేసే చర్యే. కానీ అదే
సందర్భంలో అత్యంత వివాదాస్పదమైన ప్రత్యేక ఆర్థిక మండళ్ళ చట్టాన్ని మాత్రం భూసేకరణ
చట్టం పరిథిలోకి తీసుకరాక పోవడాన్ని కూడా గమనించాలి.
భూసేకరణ చట్టంలోని నిబంధనల మూలంగా భూమిని సేకరించడం సాధ్యం కాకపోవడంతో 60% పి.పి.పి. పథకాలు
అర్థంతరంగా ఆగిపోవడంతో 18
లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదని మొసలికన్నీరు
కారుస్తున్నారు. భూసేకరణ చట్టం - 2013 అమలులోకి
వచ్చిన నాటి నుంచే ఆ చట్టాన్ని మార్చాలంటూ పారిశ్రామిక వర్గాలు గగ్గోలు పెడుతూనే
ఉన్నాయి. కార్పోరేట్ సంస్థలకు
అనుకూలమైన విధానాలను శరవేగంగా అమలు చేస్తున్న మోడీ, అందులో భాగంగానే
భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ జారీ కాగానే
నిర్మాణ రంగం, స్థిరాస్థి వ్యాపారంలో ఉన్న కార్పోరేట్ సంస్థల షేర్ల
విలువలు పెరిగిపోయాయి.