Tuesday, January 6, 2015

విధాన సమీక్ష లేకుండానే మళ్ళీ బొగ్గు క్షేత్రాల వేలమా?




బొగ్గు క్షేత్రాల ప్రయివేటీకరణకు మార్గాన్ని సుగమం చేస్తూ మోడీ సర్కార్ జారీ చేసిన అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్)ను ఉపసంహరించుకోవాలని రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు (ఎ.ఐ.టి.యు.సి.; సి.ఐ.టి.యు.; బి.యం.యస్.; ఐ.యన్.టి.యు.సి.; హెచ్.యం.యస్.) ఇచ్చిన ఐదు రోజుల దేశ వ్యాపిత సమ్మె పిలుపుకు స్పందించిన‌ బొగ్గు గని కార్మికులు నిన్నటి నుంచి ఉద్యమ బాట పట్టారు. బొగ్గు ఉత్పత్తిలో 80% వాటా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని క్షేత్రాల్లో ఉత్పత్తి స్తంభించింది. సింగరేణి కాలరీస్ కార్మికుల్లో అత్యధికులు సమ్మెలో పాల్గొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై నేను వ్రాసిన వ్యాసం ఈ రోజు సూర్యా దినపత్రికలో ప్రచురించబడింది.





విధాన సమీక్ష లేకుండానే మళ్ళీ బొగ్గు క్షేత్రాల వేలమా?



పారమెంటు ఔన్నత్యాన్ని మ‌సకబారుస్తూ అత్యవసర ఆదేశాలు(ఆర్డినెన్సులు) ద్వారా తమ రాజకీయ అజెండాలోని అంశాలను అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం శరవేగంతో అడుగులు వేస్తున్నది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన భాజపా నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ అధినేత మోహన్ భగ్వత్ మొదలుకొని పలువురు సంఘ్ పరివార్ కూటమి నేత‌లు లౌకిక వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పలు వివాదాస్పద అంశాలను తెరపైకి తేవడం ద్వారా పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను విజయవంతంగా ప్రక్క దారి పట్టించారు. పర్యవసానంగా ఉభయ సభల్లోను దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, కీలకమైన అంశాలకు సంబంధించిన‌ వివిధ బిల్లులపై చర్చించే సదవకాశం లేకుండా చేయశారు. ముఖ్యంగా రాజ్యసభలో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉండడంతో వివిధ బిల్లులకు సభ‌ ఆమోదం పొందడంలో ప్రభుత్వం విఫలమైనది.
రాజు తలచుకొంటే కొరడాదెబ్బలకు కొదవా అన్నట్లు కేంద్ర మంత్రి మండలి ఆమోదంతో ఆర్డినెన్సుల ద్వారా భీమా రంగంలోకి 49% విదేశీ పెట్టుబడులను అనుమ‌తించడానికి, బొగ్గు క్షేత్రాలను వేలం వేయడానికి పూనుకొన్నది. భూసేకరణ చట్టం - 2013కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కూడా సిఫార్సు చేసింది. బొగ్గు క్షేత్రాల వేలానికి మార్గాన్ని సుగమం చేస్తూ తిరిగి ఆర్డినెన్స్ జారీ చేసింది. తొలి దశలో ఉత్పత్తిలో ఉన్న‌24 గనుల వేలానికి 'ఎలక్ట్రానిక్ బిడ్డింగ్' కోసం ప్రత్యేక పోర్టల్ ను కేంద్ర ఇంధన శాఖామాత్యులు పియూష్ గోయల్ డిసెంబరు 25న‌ ప్రారంభించారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న 42 క్షేత్రాల వేలం ప్రక్రియను 2015 మార్చి 23 నాటికి పూర్తి చేసి బొగ్గు క్షేత్రాల అభివృద్ధి మరియు ఉత్పత్తి ఒప్పందాలను కుదుర్చుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రెండవ దశలో బొగ్గు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో 32 గనులను వేలం వేసే ప్రక్రియ మొదలవుతుందని కూడా ప్రకటించింది.
భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా 'కోల్గేట్ కుంభకోణం' రికార్డుల్లోకెక్కింది. సరళీకృత ఆర్థిక విధానాల జపం చేస్తూ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తూ దేశ సంపదైన సహజ వనరుల‌ను కార్పోరెట్ సంస్థలకు అడ్డగోలుగా దోచిపెట్టే విధానాలను గడచిన రెండు ద‌శాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఆ విధానాల దుష్పలితమే బొగ్గు క్షేత్రాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణం. ఈ కుంభకోణం మూలంగా ప్రభుత్వ‌ ఖజానాకు చేరవలసిన‌ లక్షా డేబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాలు దారి మళ్ళిపోయాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదికల ద్వారా కాగ్ బహిర్గతం చేసి సంచనలనం సృష్టించింది. నాటి దేశ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ చట్టబద్ధమైన కాగ్ సంస్థను తూలనాడుతూ అవి కాకిలెక్కలని, ఆ ఆరోపణ అర్థరహితమని కొట్టిపడేశారు. నాటి ప్రభుత్వం అనుసరించిన‌  వైఖరి వల్ల‌ అవినీతి కూపంలో కూరుకపోయిన దేశంగా ప్రపంచ దేశాల ముందు మన దేశం తలదించుకోవలసి వచ్చింది. భ్రష్టు పట్టిన ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సాక్ష్యంగా బొగ్గు కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ కుంభకోణాన్ని క్షేధించడంలో సుప్రీం కోర్టు క్రీయాశీలంగా వ్యవహరించి, నేరుగా రంగ ప్రవేశం చేసి, తన నియంత్రణలో సి.బి.ఐ. విచారణకు ఆదేశించి, ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతున్న‌ సి.బి.ఐ. డైరెక్టరుకు సహితం చివాట్లుపెడుతూ, కేసు విచారణను పరుగులు తీయించి, అత్యమంగా 1993 నుండి 2010 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవినీతి, అక్రమాలు జరిగాయని నిర్ధారించి 204 లైసెన్సులను రద్దు చేస్తూ సెప్టంబరు 24, 2014న‌ చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన‌ వాటిలో బొగ్గు ఉత్ఫత్తి చేస్తున్న 42 క్షేత్రాలు, ఉత్ఫత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న32 క్షేత్రాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్నిప్రయివేటు సంస్థలు ప్రభుత్వం నుండి గనుల‌ కేటాయింపు చేయించుకొని పని మొదలు పెట్టలేదు. వాటినీ కోర్టు రద్దు చేసింది.
మన్మోహన్ సరే మోడీ చేసిందేమిటి ?: డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యు.పి.ఎ.) 2014 మే లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోరపరాజయానికి గురై గద్దెదిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి(యన్.డి.ఎ.) అధికారంలోకి వచ్చింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేబట్టారు. నాడు ప్రధాన ప్రతిపక్షంగా బొగ్గు కుంభకోణంపై పదునైన విమర్శలు చేసిన భాజపా నేడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు విషయంలో పెద్దగా శ్రద్ధ‌ చూపెట్టిన దాఖలాలు లేవు. అధికారంలోకి రాగానే సహజ వనరులను కొలగొట్టిన, ఆర్థిక‌ కుంభకోణాలకు పాల్పడిన నేరస్తుల భరతం పడతామని దేశ ప్రజలకు వాగ్ధానం చేస్తూ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన అజెండాను భాజపా పక్కనబెట్టి అలాంటి అంశాలను న్యాయ స్థానాలకే వదిలిపెట్టి సోద్యం చూస్తున్నది. కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగానే వర్గ స్వభావంతో వ్యవహరిస్తున్నది.
సుప్రీం కోర్టు తీర్పు తరువాత తాజాగా బొగ్గు క్షేత్రాల వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టి, టెండర్లను ఆహ్వానించింది. గనుల‌ కేంటాయింపుకు సంబంధించి నూతన‌ విధి విధానాలను ప్రకటించి, వాటిపై డిసెంబరు 22 వ తేదీ లోపు సంబంధిత సంస్థలు, వ్యక్తులు(స్టేక్ హోల్డర్స్) తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ఆ విధి విధానాలను పరిశీలిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిని సంకించవలసి వస్తున్నది. 'కోల్ గేట్' కుంభకోణంలో భాగస్వాములైన సంస్థలను 'బ్లాక్ లిస్ట్'లో చేర్చి టెండర్ల ప్రక్రియలో పాల్గొనడానికి వీలులేకుండా నిషేధించక పోవడం అనుమానాలకు తావిస్తున్నది. న్యాయ స్థానాలు ఏ సంస్థకైనా మూడేళ్ళకు మించి శిక్ష విధించి ఉంటే ఆ సంస్థలు టెండర్లు దాఖలు చేయడానికి అనర్హులన్న ఒక నిబంధన పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేసినట్లు కనబడుతున్నది. ఇది దేశ‌ ప్రజానీకాన్ని వంచించడమే. సుప్రీం కోర్టులో ఇంకా విచారణ పూర్తి కాలేదు. నేరానికి పాల్పడిన సంస్థలకు శిక్షలు కరారు కాలేదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఈ కేసు విచారణలో అంతర్భాగంగా సుప్రీం కోర్టు వివిధ సందర్భాలలో చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదనిపిస్తోంది. అక్రమంగా బొగ్గును ఉత్పత్తి చేసినందుకు డిసెంబరు 31, 2014 లోపు జరిమానా చెల్లించాలని ఆయా సంస్థలకు సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ గడువును పెంచాలని జిందాల్ తో పాటు మరో రెండు సంస్థలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించడం కూడా జరిగింది.
ఈ పూర్వరంగంలో లోపభూయిష్టమైన విధానాలపై సమగ్రమైన సమీక్ష చేయకుండానే ఆర్డినెన్సు ద్వారా బొగ్గు ఉత్పత్తిని వాణిజ్యపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొన్నది. బొగ్గు క్షేత్రాల జాతీయకరణ చట్టం -1973కు సవరణ చేస్తూ బొగ్గు క్షేత్రాల (ప్రత్యేక నిబం ధనలు) ఆర్డినెన్సు-2014ను జారీ చేసింది. దాని ప్రకారం బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రయివేటు రంగ‌ సంస్థలు భాగస్వామ్యమవుతాయి. కాప్టివ్ మైన్స్ పేరిట సొంత పారిశ్రామిక అవసరాల కోసం గనుల కేటాయింపు చేసే లైసెన్సింగ్ విధానానికి భిన్నంగా సొంత వాడకంతో పాటు అమ్మకానికి కూడా అనుమతించడం జరిగింది. ఈ విధానం వల్ల దుష్పలితాలు సంబవిస్తాయి. బొగ్గు ధరలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన‌ కోల్ ఇండియా ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలోని ధరల కంటే 40% తక్కువ ధరకు బొగ్గును అమ్ముతున్నది.బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కోల్ ఇండియా చేసే ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువే. ధరల నియంత్రణా చట్టం రూపకల్పన చర్చల వరకే పరిమితమైనది. ప్రయివేటు సంస్థల రంగ ప్రవేశంతో ధరలు పెరగడంతో పాటు పెద్ద ఎత్తున‌ అవినీతి, అక్రమాలకు సరళీకృత ఆర్థిక విధానాలు వీలుకల్పించాయన్ననిప్పు లాంటి నిజం సుప్రీం కోర్టు తీర్పుతో బహిర్గతమయ్యింది.
 దేశ పురోగతికి ఇంధన వనరులు అత్యంత కీలకమైనవి. ఇంధన అవసరాలను తీర్చడంలో బొగ్గు ముఖ్యభూమిక పోషిస్తున్నది. అధిక లాభాపేక్షతో కార్పోరేట్ సంస్థలు దేశ‌ సంపదైన బొగ్గును కొల్లగొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. బొగ్గు క్షేత్రాలు అత్యధికంగా అటవీ ప్రాంతాలు, గిరిజన ఆవాసాల్లోనే ఉన్నాయి. అటవీ సంపద తరిగి పోవడం, సామాజికంగా వెనుకబడ్ద గిరిజనుల ఉనికే ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నది. థర్మల్ విద్యుదుత్పాదన పర్యవసానంగా పర్యావరణ సమస్యలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ పూర్వరంగంలో బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తూ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అన్వేషణపై తారా స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, అభివృద్ధి, వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విధానాన్నిరూపొందించి, అమలు చేయాలన్న డిమాండ్ పర్యావరణ వేతలు, ప్రజలు కోరుతున్నారు. వీటిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలే మొన్నగా భావిస్తున్న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
క్యాప్టివ్ మైనింగ్ విధానం మూలంగా వంద‌ శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించినా గతంలో పెద్దగా పెట్టుబడులు రాలేదని తాజాగా బొగ్గు ఉత్పత్తిని వాణిజ్యపరం చేశారు. తద్వారా పెట్టుబడులతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు బొగ్గు ఉత్పత్తి రంగంలోకి ప్రవేశ పెట్టబడి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి దేశ అవసరాల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడకుండా వెసులుబాటు వస్తుందని నమ్మబలుకుతున్నారు. కానీ, కోల్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థలు దేశ అవసరాలకు తగ్గట్టుగా బొగ్గును ఉత్పత్తి చేయలేక పోతున్నాయనే నెపం వేసి ప్రయివేటీకరణకు ప్రభుత్వం పూనుకొన్నది. న‌ల్లబంగారంగా భావించబడుతున్న‌ జాతి సంపదను కార్పోరేట్ శక్తులు అధిక లాభాపేక్షతో కొల్లగొట్టడానికి మళ్ళీ లైసెన్సులు ఇవ్వడానికి పూనుకోవడం దొంగ చేతికి తాళాలిచ్చినట్లుగా ఉన్నది.

No comments:

Post a Comment