Sunday, July 17, 2016

ప్రజలు తెగిస్తే సైన్యమైనా తోక ముడుస్తుంది!


టర్కీలో 'సోషల్ మీడియా' విజయ పతాక ఎగరేసింది!

1. టర్కీలో సైన్యం(ఒక భాగం) తిరుగుబాటు బావుటా ఎగరేసింది. దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ విహార యాత్రలో ఉన్నారు. టెలివిజన్, రేడియో  ప్రసార మాధ్యమాలను సైన్యం స్వాధీనం చేసుకొన్నది. దేశాధ్యక్షుడు ఫోన్ ద్వారా సాంఘిక మాధ్యమాన్ని( ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ వగైరాలను) ఉపయోగించుకొని ప్రజలకు సైనిక తిరుగుబాటు సమాచారాన్ని చేరవేసి, వీధుల్లోకొచ్చి సైన్యాన్ని అడ్డుకోమని ప్రజలకు పిలుపిచ్చారు. ప్రాణాలకు తెగించి జనం వీధుల్లోకొచ్చారు. సంఘటిత శక్తికి పోలీసులు అండగా నిలిచారు. తిరుగుబాటు చేసినసైన్యం తోక ముడిచింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొన్నారు. విజయం సాంఘిక మాధ్యమానిదని కూడా అభివర్ణించవచ్చు. చరిత్రలో ఇదొక అరుదైన ఘటన.
2. విజయం  టర్కీ అధ్యక్షుడిదా! ప్రజాస్వామ్యం కోసం ప్రజలు సాగి౦చిన సమరశీల పోరాటానిదా! అన్న చర్చకు ఇప్పుడు తెరలేచింది.
3. టర్కీ పరిణామాల నుండి అంతర్జాతీయ సమాజం సరియైన గుణపాఠాలను నేర్చుకోవలసి ఉన్నది.
4. అంతర్జాతీయభౌగోళిక, రాజకీయపరిస్థితులను పరిగణలోకి తీసుకొంటే టర్కీ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్నది. అందుకే అమెరికా కన్ను టర్కీ మీద పడింది.
5. టర్కీ ఆసియా, ఐరోపా ఖండాలకు వారధి లాంటిది. మధ్యఆసియా దేశంగా ఉన్న టర్కీకి ఆర్థిక రాజధానిగా భావించబడే ఇస్తాంబుల్ మాత్రం ఐరోపా ఖండంలో ఉన్నది. టర్కీ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉన్నది. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 13% వాటా టర్కీదే. న్యూయార్క్, మాస్కో, లండన్, హాంకాంగ్ తరువాత బిలియనేర్స్ అత్యధికంగా ఉన్న నగరం ఇస్తాంబుల్.
6. సంపన్నులకు నిలయమైన ఇస్తాంబుల్ నగరాన్ని అడ్డం పెట్టుకొని ఐరోపా యూనియన్ లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకొన్నది. కానీ, సభ్యత్వం ఇవ్వడానికి ఐరోపా యూనియన్ లోని సభ్య దేశాలు సుముఖంగా లేవు. కారణం, ఐరోపా దేశాల ప్రజానీకంలో అత్యధికం క్రైస్తవ మతస్తులు. టర్కీ జనాభాలో 99% ముస్లిం మతస్తులు. పైపెచ్చు టర్కీ జనాభా దాదాపు 10 కోట్లు. అనేక ఐరోపా దేశాలకంటే పెద్ద దేశం. సంస్కృతి, మతపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయన్న సంశయంతో సభ్యత్వాన్ని నిరాకరించాలని పలు ఐరోపా సభ్య దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
7. సిరియా, ఇరాక్ మరియు ఆసియా దేశాల నుండి వలస ప్రజలు టర్కీ మీదుగా సముద్ర జల మార్గంలో అక్రమంగా గ్రీస్ లోకి ప్రవేశించి ఐరోపా సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. వలసల సమస్య ఐరోపా సమాజానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా తయారైయ్యింది. ఐరోపా యూనియన్ నుండి వైదొలగాలన్న అంశంపై బ్రిటన్ లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ(రెఫరెండం)లో వలసల సమస్యగణనీయంగా ప్రభావం చూపింది.
8. నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్)లో సభ్యత్వం ఉన్నముస్లిం దేశం టర్కీ. సభ్యత్వం ఉండడమే కాదు, అమెరికా తరువాత నాటో దళాల్లో ఐదు లక్షల సైనిక బలంతో రెండవ అతి పెద్ద దేశం కూడా టర్కీనే. సోవియట్ యూనియన్ నాయకత్వంలోని వార్సా కూటమికి, నాటో కూటమికి మధ్య ప్రశ్చన్న యుద్ధం కొనసాగిన కాలంలో టర్కీ కీలకమైన పాత్ర పోషించింది. టర్కీ భౌగోళిక సరిహద్దులను పరిశీలిస్తే, దేశంపై అమెరికా ఎందుకు కన్నేసిందో బోధపడుతుంది. ఒకనాటి సోవియట్ యూనియన్ (యు.యస్.యస్.ఆర్.)లో అంతర్భాగమైన రష్యా, ఉక్రేనియన్, జార్జియా, అర్మీనియా, అజర్ బైజాన్ లకు టర్కీ సరిహద్దు దేశం. వీటి మధ్యనల్ల సముద్రం ఉన్నది.
9. తూర్పు యూరప్ లోని ఒకనాటి సోషలిస్టు దేశాలైన బల్గేరియా, రుమేనియాలకు సరిహద్దు దేశం. అలాగే గ్రీస్ ను, టర్కీని మెడిటేరియన్ సముద్రం కలుపుతున్నది.
10. ఇరాన్, ఇరాక్ కు సరిహద్దు దేశమైన  టర్కీలో 85% పైగా సున్నీ జనాభా ఉంటే ఇరాన్, ఇరాక్ లలో షియా జనాభా అత్యధికం. ముస్లింలలోని రెండు తెగల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండుకొనే వాతావరణం నిరంతరాయంగా కొనసాగుతున్నది.
11 . సైప్రస్, సిరియా, లెబనాన్, ఇజ్రాయిల్, ఈజిప్ట్, లిబియా దేశాలు టర్కీకి ఇరుగు పొరుగు దేశాలు. పాలస్తీనా విముక్తి ఉద్యమానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ కు అమెరికా వెన్నుదన్నుగా నిలిచిన ఉదంతాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి.
12. టర్కీలో కుర్దీస్ సమస్య రావణ కాష్టంలా(కేవలం ఉపమానం) కాలుతూనే ఉన్నది.
13. టర్కీ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని నాటోలో సభ్య దేశంగా చేర్చుకొని, అమెరికా, తనయుద్ధ నీతిలో టర్కీని సంపూర్ణంగా భాగస్వామిని చేసి‍, చక్కగా ఉపయోగించుకొన్నది.
14. సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లోని సోషలిస్టు వ్యవస్థఅంతర్థానమైన పూర్వరంగంలో ప్రశ్చన్న యుద్ధ (నాటో, వార్సా కూటముల మధ్య) వాతావరణం నేడు లేదు.
15. గడచిన రెండున్నర దశాబ్ధాలుగా అమలులో ఉన్న ప్రపంచీకరణ విధానాల దుష్పలితాలకు ప్రతిఘటనగా ప్రజలు తిరగబడుతున్నారు. 2008లో అమెరికాతో మొదలైన ఆర్థిక సంక్షోభాల కొనసాగింపులో అంతర్భాగంగా నేడు ఐరోపా దేశాలు కోలుకోలేని ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాల సుడిగుండంలోకి నెట్టబడి, గిలగిలా తన్నుకొంటున్నాయి. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగాలన్న తీర్పుకు ప్రజల మద్ధతు లభించడానికి ఇదే ప్రధాన కారణం.
16. గోరుచుట్టపై రోకటి పోటన్నట్టు, ఉగ్రవాదం జడలు విప్పి నాట్యం చేస్తున్నది. ప్రపంచ మానవాళికి పెనుసవాలుగా నిలిచింది. నాగరికత, అభివృద్ధికి పెద్ద అవరోధంగా పరిణమించింది. తన, మన తేడా లేకుండా మారణహోమాలకు ఆజ్యం పోస్తున్నది. ఉగ్రవాదానికి పాలు పోసి, పెంచి పోషించింది అమెరికానే అన్నది జగమెరిగిన సత్యం. ఒక నాటి కమ్యూనిస్టు దేశమైన సోవియట్ యూనియన్, దాని తోడ్పాటుతో అధికారంలోకి వచ్చిన ఆప్ఘనిస్తాన్ లోని సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల్చడానికి కరడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్ ను ప్రోత్సహించి, ఆయుధంగా ప్రయోగించింది. ఉగ్రవాద భూతమే ఎదురు తిరిగి అమెరికాపై దాడి చేసింది. ప్రపంచ సామ్రాజ్యవాదానికి మకుటం లేని మహారాజుగా, అత్యంత ఆధునికమైన సైనిక సంపత్తి కలిగిన దేశమని విర్రవీగుతున్న అమెరికా అహంభావంపై ఉగ్రవాదం గొడ్డలి పెట్టు వేసింది. అప్పటికి గానీ ఉగ్రవాద ముప్పు ఎంతటి భయంకరంగా ఉంటుందో అమెరికాకు బోధపడలేదు. భారత దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు నెలవుగా మారిన పాకిస్తాన్ కు అంటకాచిందీ, అమెరికానే. తన పెంపుడు దుష్టశక్తి ఉగ్రవాదం, తనకు, ప్రపంచ మానవాళికే పెనుసవాలు విసిరిన నేపథ్యంలో కళ్ళు తెరిచి, అందరం కలిసి కట్టుగా నిలబడి ఉగ్రవాదం పీకనులమాలని అమెరికా ప్రపంచ దేశాలకు కీసగొంతుతో పిలుపిస్తున్నది.
17. ఉగ్రవాదం రూపంలో, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో, మారణహోమాన్ని స్రృష్టిస్తుందోనన్న భయాందోళనలు అంతర్జాతీయ సమాజాన్ని వెంటాడుతున్నాయి. నిఘావర్గాలు మాత్రం అలసత్వం వహించినా ఉపద్రవం ముంచుకొస్తుంది. ప్రపంచ వ్యాపితంగా అనేక ఉగ్రవాద గ్రూపులు ఉనికిలో ఉన్నాయి. వాటి మూలాలను కనుగొనడం ప్రభుత్వ నిఘా వర్గాలకే కష్టసాధ్యమై పోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడబలుక్కొని, ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఒకర్నొకరు అందజేసుకొని ఉమ్మడిగా ముప్పేటా దాడి చేస్తే తప్ప ఉగ్రవాద పెనుముప్పు నుండి మానవాళికి రక్షణ కల్పించడం సాధ్యం కాదు.
18. పూర్వరంగంలో టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగింది. దీని వెనకాల ఎవరున్నారనే దానిపై వూహాగాలు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ సైన్యాన్ని ప్రభావితం చేసిందో! కాలం గడిస్తే గానీ తెలియదు. .యస్..స్., ఇస్లామిక్ స్టేట్, దుష్టశక్తి కుట్ర వెనకాల దాగి ఉన్నదో నిగ్గు తేలాల్చి ఉన్నది.
19. ఒకటి మాత్రం తేలిపోయింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారు. ప్రాణాలకు తెగించి పోరుసల్పుతారు. అది ఉగ్రవాదుల రూపంలో వచ్చినా, సైనిక తిరుగుబాటు రూపంలో వచ్చినా, నియంతృత్వం రూపంలో వచ్చినా, సమయం వచ్చినప్పుడు మతాతీతంగా గుండెల్ని ఎదురొడ్డి, సామాజిక స్పృహతో పోరాడుతారన్న నిప్పులాంటి నిజాన్ని టర్కీ ప్రజలు డంకా బజాయించి, యుద్ధ భూమిలో రక్త తర్పణతో ప్రకటించారు.
20. అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు, అప్రజాస్వామిక పాలన, ఇస్లామిక్ దేశంగా టర్కీని మలచాలనే ప్రయత్నాలు, ప్రతిపక్షాలు మరియు ప్రసారమాధ్యమాలపై నిర్బంధ కాండ, మాజీ సైనికాధికారులు మరియు ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి, కఠిన శిక్షలను అమలు చేయడం లాంటి నియంతృత్వ పోకడలతో పాలన చేస్తున్న ప్రస్తుత దేశాధ్యక్షుడు, విజయం తన విజయంగా భ్రమిస్తే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో! ఊహించడం దేశస్తులకే కష్ట సాధ్యమైనది కావచ్చు. నాటో కూటమి సభ్య దేశంగా ఉన్న టర్కీ ప్రభుత్వానికి, అమెరికాకు మధ్య సంబంధాలలో కూడా కొంత మేరకు తేడాలు(ఉదా: కుర్దీలపై టర్కీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ) పొడచూపాయన్న వార్తలు ఉన్నాయి. వాటి ప్రభావం కూడా ఎలా ఉంటుందో! వేచి చూడాల్సిందే!
21. టర్కీ పరిణామాలు అనివార్యంగా నేడు ఐరోపా ఎదుర్కొంటున్నసంక్షోభాన్నిమరింత తీవ్రతరం చేస్తాయి. మధ్య ఆసియా, ప్రత్యేకించి ముడి చమురు ధరలు క్షీణించడంతో పీకల్లోతు ఆర్థిక ఒడిదుడుకుల్లోకి నెట్టబడినగల్ఫ్ దేశాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాలపై దాడిని ఎక్కుపెట్టిన అమెరికా ముడి చమురు ధరల పతనానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నదనే వాదనలు ఉన్నాయి.
22. టర్కీలో సంబవించే దుష్పరిణామాల ప్రభావం అంతర్జాతీయ సమాజంపైన, మనలాంటి దేశాలపైన కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇరాన్ తో కుదుర్చుకొన్న చమురు ఒప్పందాల అమలుకు అవరోధాలు ఏర్పడతాయి.
23. టర్కీలో సైన్యం తిరుగుబాటు, ప్రాన్స్ పై ఉగ్రవాదుల వరుస దాడులు, ఐరోపా యూనియన్ నుండి నిష్క్రమించాలని బ్రిటన్ ప్రజల తీర్పు, ఆర్థిక సంక్షోభాల సుడిగుండంలో గ్రీస్ పూర్వరంగంలో నాటో కూటమిలోని బలమైన సభ్య దేశాల్లో సంబవించిన, సంబవిస్తున్నపరిణామాలపై లోతైన అధ్యయనం జరగాలి.
24. సోవియట్ యూనియన్ పతనానంతరం వార్సా కూటమి అంతర్ధానమై పోయింది. నాటి వార్సా కూటమిలోని కొన్ని సభ్యదేశాలు నాటో కూటమిలో చేరాయి. నేడు ప్రశ్చన్న యుద్ధ ఛాయలే కనబడడం లేదు. కానీ, మానవాళిపై ఉగ్రవాదం యుద్ధం ప్రకటించింది. అణు బాంబుల యుగంలో జీవిస్తున్నాం. ఉగ్రవాద శక్తుల చేతుల్లోకి అణు బాంబులు చేరితే జరిగే ఉపద్రవాన్ని ఊహించడమే దుర్లభం.
25. ప్రపంచీకరణ ప్రక్రియను వెనకపట్టు పట్టించాలనే భావజాలం ఊపందుకొంటున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరుగేలేదన్న ఆర్థిక వేత్తల నోట మాట పడిపోయింది. మార్పు అనివార్యం. మార్పు ఎటు వైపు అన్నదే మౌలికమైన ప్రశ్న. మానవాళి సాధించిన ప్రగతిని పరిరక్షించుకొంటూ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తూ, దోపిడీ రహిత సమాజ నిర్మాణం వైపు అడుగులు పడకపోతే, ఉగ్రవాదం, జాతి దురహంకారం, ప్రాంతీయ ఉన్మాదం, అస్థిత్వవాద భావజాలం మరింతగా పెచ్చరిల్లి పోతాయనడంలో నిస్సందేహం.
స్థూలంగా అవగాహనతోనే ఈటీవి ప్రతిధ్వనిలో టర్కీ సంక్షోభంపైన, టీవి5లో ప్రాన్స్ పట్టణం నీస్ లో ఉగ్రవాది సాగించిన మారణహోమంపై శనివారం జరిగిన చర్చల్లో వివిధ అంశాలను ప్రస్తావించాను.
టి.లక్ష్మీనారాయణ

  

Sunday, July 10, 2016

'ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం: రాజకీయ శూన్యత', 'బందర్ పోర్టు: భూ సమీకరణ - సేకరణ‌'

'ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం: రాజకీయ శూన్యత', 'బందర్ పోర్టు: భూ సమీకరణ - సేకరణ‌' అన్న అంశాలపై టీవి5లో చర్చ నిర్వహించారు. ఆ చర్చలో స్థూలంగా నేను వ్యక్తం చేసిన అంశాలు:

1. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పడింది. నీతివంతమైన, సుపరిపాలన కావాలన్నఆకాంక్ష రోజు రోజుకు ప్రజల్లో బలపడుతున్నది. రాజకీయ రంగంలో అస్పష్టత, గందరగోళ పరిస్థితులు ఉన్నట్లు గోచరిస్తున్నా, రాజకీయ శూన్యత ఉన్నట్లుగా ప్రస్తుతానికి భావించలేం.
2. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ప్రజల ఛీత్కారానికి గురయ్యింది. తిరిగి కోలుకొనే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు.
3. గడచిన శాసనసభ ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పార్టీగా ఉన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నైతికంగా బలహీనమైన స్థితిలో ఉండడంతో పాలక పార్టీ అనుసరిస్తున్నఅప్రజాస్వామిక, అవినీతి చర్యలను సమర్థవంతంగా నిలవరించే రీతిలో ప్రజలను సమీకరించడంలో వైఫల్యం చెందుతున్నది. పైపెచ్చు 19 మంది శాసనసభ్యులు పార్టీని వీడి, పాలక పార్టీలో చేరి పోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సహజంగానే ఒక రకమైన నైరాశ్యం, గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ పార్టీకి బలం, బలహీనత ఆ పార్టీ అధినాయకుడే.
4. వామపక్షాలు కొన్ని సమస్యలపై ఆందోళనలు చేస్తున్నాపెద్దగా ప్రజల మద్ధతు పొంద లేక పోతున్నాయి. తమకు తాముగా ప్రత్యామ్నాయంగా ఎదగ గలిగిన శక్తి సామర్థ్యాలు వాటికి లేవు.
5. ఈ పూర్వరంగంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నదని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, బిజెపి అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర నాయకత్వానికి తాజాగా దిశా నిర్ధేశం చేసినట్లు వార్తలొచ్చాయి. రాష్ట్ర‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని, ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్నఅనిశ్చిత రాజకీయ వాతావరణాన్నిఅనుకూలంగా మలచుకొని, బలపడాలని బిజెపి వ్యూహం రచించుకొన్నట్లు ఆ వార్తల్లోని సారాంశం. బిజెపి నాయకత్వం కంటున్న పగటి కలలకు, ఆంధ్రప్రదేశ్ లో భౌతిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడం నిస్సందేహం. విభజనకు సహకరించడమే కాకుండా విభజన‌ చట్టంలోని అంశాలను అమలు చేయడంలోను, ప్రత్యేక తరగతి హోదా కల్పించడంలోను బాధ్యతారాహిత్యంతో, అలసత్వంతో, దగాకోరుగా వ్యవహరిస్తున్న బిజెపి పట్ల ప్రజల్లో ఏహ్య‌భావం, తీవ్ర వ్యతిరేకత‌ నెలకొని ఉన్నది. ఈ పరిస్తితుల్లో ఆ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకోవడమే విడ్డూరంగా కనబడుతున్నది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం మాట అటుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహ‌ జ్వాలల్లో బిజెపి ఉనికే ప్రమాదంలో పడిందని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొన్నవారికి స్పష్టంగా బోధపడుతున్నది.

బందరు ఓడ రేవు:

1. ఈ ఓడ రేవు నిర్మాణం కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న‌ మాట వాస్తవం. దాని కోసం ప్రజలు వివిధ రూపాలలో ఆందోళనలు కూడా చేశారు. కానీ, భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధంగా వ్యవహరించక పోతే ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. ఓడ రేవు నిర్మాణానికి ఎంత భూమి అవసరమో! వాస్తవిక దృష్టితో నిర్ణయం తీసుకోవాలేగానీ, లక్ష ఎకరాలకుపైగా అవసరం ఉంటుందని, ఆ మేరకు భూ సమీకరణ చేయడానికి మంత్రి మండలిలో నిర్ణయం తీసుకొన్నామని ప్రసార మాధ్యమాలకు తెలియజేసి, నాలుక కరుచుకొని, కాదు కాదు ఇర‌య్ వేల ఎకరాల వరకే భూమిని సమీకరిస్తామని మళ్ళీ ప్రకటించడంతో ప్రభుత్వ విశ్వసనీయత ఈ విషయంలో దెబ్బతిన్నది.
2. అభివృద్ధి పేరిట ఎక్కడ రైతుల నుండి భూమి సేకరించినా, ఆ అభివృద్ధిలో మొదటి లబ్ధిదారుడుగా భూమి కోల్పోయిన‌ రైతు ఉండాలి.
3. ఉపాథి కోల్పోయిన‌ వ్యవసాయ కార్మికులకు, చేతి వృత్తుల వారికి, స్వయం ఉపాథిపై అధారపడిన తరగతుల ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించే రీతిలో పునరావాస పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వంపై ఉన్నది.
3. భూ సేకరణ చేసే సందర్భంలో ఆహార భద్రతా సమస్య, పర్యావరణ పరిరక్షణ వగైరా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది.
4. రాజధాని అమరావతి నిర్మాణానికి అనుసరించిన భూ సమీకరణ(పూలింగ్) విధానం తరహాలోనే బందరు ఓడ రేవు నిర్మాణానికి కూడా భూ సమీకరణ విధానాన్ని అవలంబిస్తామనడం అసంబద్ధంగా ఉన్నది. నూతన రాజధాని ప్రాంతంలోభూముల విలువ పెరిగింది. తద్వారా భూములిచ్చిన రైతులకు ప్రయోజనం జరుగుతుందన్న నమ్మకంతో వారున్నారు. ఓడ రేవు నిర్మాణ ప్రాంతంలో మక్కీకి మక్కీగా అదే రీతిలో భూములిచ్చిన రైతులకు ప్రయోజనం వనకూడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అంశాన్ని గమనించాలి.

ఈ చర్చలో నాతో పాటు సీనియర్ జర్నలిస్టులు శ్రీ ప్రసాద్ రెడ్డి, శ్రీ తెలకపల్లి రవి, ఆంధ్రా మేధావుల సంఘం, అధ్యక్షులు శ్రీ చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ చర్చకు సంబంధించిన యూట్యూబ్ లి‍ంక్:
 Part 1: https://www.youtube.com/watch?v=BTcBNEhjYiQ
Part 2: https://www.youtube.com/watch?v=720RquQJvoI

Tuesday, July 5, 2016

విజయవాడలో రోడ్డెక్కిన స్వామీజీలు


గడచిన రెండేళ్ళ చరిత్రను పరిశీలిస్తే ప్రజల్లో దైవ భక్తి, విశ్వాసాలు, మూడనమ్మకాలను పెంచి పోషించడంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారన్న విషయం స్పష్టంగా కనబడుతున్నది. ఆర్భాటంగా పుష్కరాల నిర్వహణ, చీటికీ మాటికీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున‌ పూజలు పునష్కారాలు నిర్వహిస్తున్నారు. వాస్తు పేరిట మార్పులు, చేర్పులు, కూల్చి వేతలు, నిర్మాణాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ప్రజలలో శాస్త్రీయ భావాలను పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేసి, రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలను నిర్వహిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా అభద్రతా భావంతో మోతాదుకుమించి భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తున్నారు. లౌకిక భావాలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే, ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ మత విశ్వాసాలకు అనుగుణంగానే నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకడుగు ముందుకేసి యజ్ఞయాగాలు కూడా అట్టహాసంగా నిర్వహించారు.

ఈ పరిణామం హిందుత్వవాద శక్తులకు, బిజెపికి సహజంగానే మిగుడుపడలేదు. కారణం, హిందూ మత విశ్వాసాలకు తామొక్కరమే 'పేటెంట్' తీసుకొని, ఓటు బ్యాంకుగా మార్చుకొంటుంటే, మధ్యలో కెసిఆర్, చంద్రబాబులు కూడా పోటీదారులుగా తయారైనట్లు భయం పట్టుకొన్నట్లుంది. అందుకే ఎక్కడ కాస్త అవకాశం వస్తే, అక్కడ ప్రజల మనోభావాలను, విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే ప్రయత్నాల్లో ఉన్నారనే విషయం విజయవాడ ఘటనలతో బోధపడుతున్నది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ మొదట బిజెపి రోడ్డెక్కింది. అటుపై కాషాయ వస్త్రధారణలో ఉన్న స్వామీజీలు రోడ్డెక్కి, ఆందోళనకు పూనుకొన్నారు.

రహదారుల విస్తరణను అసంబద్ధంగా, ప్రజా వ్యతిరేకంగా కొనసాగిస్తున్నా, లేదా పాలక టిడిపి నాయకుల ఆస్తులను రక్షించడం కోసమే ప్రార్థనా మందిరాలున్న వైపు విస్తరణకు మాత్రమే అధికారులు పూనుకొన్నారనే ఆరోపణలు వాస్తవమైనా, నిజంగా ప్రార్థనా స్థలాలను విసక్షణారహితంగా కూల్చివేసి ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకొనే అవకాశం మిత్రపక్షమైన బిజెపికి ఉన్నది కదా! ప్రజల్లో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు? రాజకీయ లబ్ధి కోసం కాకపోతే మరి దేని కోసం? బహిరంగ సభలో ఒక స్వామీజీ మాట్లాడుతూ తానొక స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబానికి చెందిన వాడిని, నాకు ఆస్తి పాస్తులు లేవు, కేవలం రు.3,000/‍ మాత్రమే బ్యాంకులో నిల్వ ఉన్నది, నాపైనా ఆరోపణల‍ంటూ స్థానిక పార్లమెంటు సభ్యుడిపై విరుచుకు పడ్డారు. శాంతి వచనాలు పలకాల్సిన స్వామీజీలు శాపనార్థాల పరంపర కొనసాగించారు. అభివృద్ధి పేరిట మా మనోభావాల(ఉపాథి)పై దెబ్బకొడతారా! ఒకవేళ గుడులను తొలగించాలంటే మాతో సంప్రదించి, మా అనుమతితో ఆ పని చేయాలే కానీ, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఎలా చేస్తుందని నిగ్గదీశారు. అ‍ంటే, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం స్వామీజీల కనుసన్నల్లో పని చేయాలే తప్ప స్వతంత్రంగా వ్యవహరించకూడదు. గుడుల తొలగింపు స్వామీజీల అనుమతితో చేస్తే అప్పుడు అపవిత్ర చర్య కాదు, భక్తుల విశ్వాసాలు గాయపడవన్న మాట. మమ్మల్ని అడిగి చేయలేదు కాబట్టి మా అహం దెబ్బ తీన్న‌దనే నూనతా భావం వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. మా ఉపాథి సంగతేంటి అన్న బాధ కూడా కనబడుతున్నది. రహదారి విస్తరణలో భాగంగా నష్టపోయిన పేద, మధ్య తరగతి ప్రజల గోడు వినిపించుకొన్న వారే కరువైనారు.

రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడిన కొన్ని కట్టడాల సమస్య ప్రజల మనోభావాలను ఎంతగా గాయపరచిందో! లేదో! తెలియదు కానీ, వామపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా ఈ సమస్యపై గొంతులు చించుకోవడం ఆశ్చర్యంగానే ఉన్నది. దీన్ని చైతన్యరాహిత్యమనాలో లేదా మత విశ్వాసాలను మనం కూడా కాస్తో కూస్తో ఉపయోగించుకొందామనే సంకుచిత భావాలకు లోనైనారో తెలియదు. కోస్తాంధ్రకు నడిబొడ్డుగా ఉన్న విజయవాడ, కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా గణతికెక్కింది. అశాస్త్రీయమైన మత విశ్వాసాలు, మూడనమ్మకాలపై రాజీలేని భావజాల పోరాటాన్ని కొనసాగించాల్సిన తరుణంలో మత విశ్వాసాల పునాదులను పటిష్టపరిచే దోరణిలో  వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?