టర్కీలో 'సోషల్
మీడియా'
విజయ
పతాక
ఎగరేసింది!
1. టర్కీలో
సైన్యం(ఒక భాగం) తిరుగుబాటు
బావుటా ఎగరేసింది. దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ విహార యాత్రలో ఉన్నారు.
టెలివిజన్, రేడియో ప్రసార
మాధ్యమాలను సైన్యం స్వాధీనం చేసుకొన్నది. దేశాధ్యక్షుడు ఐ ఫోన్ ద్వారా
సాంఘిక మాధ్యమాన్ని( ఫేస్ బుక్, వాట్సాప్,
యూట్యూబ్ వగైరాలను) ఉపయోగించుకొని ప్రజలకు సైనిక తిరుగుబాటు సమాచారాన్ని
చేరవేసి, వీధుల్లోకొచ్చి సైన్యాన్ని అడ్డుకోమని ప్రజలకు పిలుపిచ్చారు. ప్రాణాలకు తెగించి జనం వీధుల్లోకొచ్చారు. ఆ
సంఘటిత శక్తికి పోలీసులు అండగా నిలిచారు. తిరుగుబాటు
చేసిన సైన్యం తోక ముడిచింది. ప్రజలు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొన్నారు. ఈ విజయం సాంఘిక
మాధ్యమానిదని కూడా అభివర్ణించవచ్చు. చరిత్రలో
ఇదొక అరుదైన ఘటన.
2. ఈ
విజయం టర్కీ
అధ్యక్షుడిదా! ప్రజాస్వామ్యం కోసం ప్రజలు సాగి౦చిన
సమరశీల పోరాటానిదా! అన్న చర్చకు ఇప్పుడు
తెరలేచింది.
3. టర్కీ
పరిణామాల నుండి అంతర్జాతీయ సమాజం
సరియైన గుణపాఠాలను నేర్చుకోవలసి ఉన్నది.
4. అంతర్జాతీయ
భౌగోళిక, రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకొంటే టర్కీ వ్యూహాత్మకంగా అత్యంత
కీలకమైన ప్రాంతంలో ఉన్నది. అందుకే అమెరికా కన్ను టర్కీ మీద
పడింది.
5. టర్కీ
ఆసియా, ఐరోపా ఖండాలకు వారధి
లాంటిది. మధ్య ఆసియా దేశంగా
ఉన్న టర్కీకి ఆర్థిక రాజధానిగా భావించబడే ఇస్తాంబుల్ మాత్రం ఐరోపా ఖండంలో ఉన్నది.
టర్కీ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉన్నది.
ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 13% వాటా
టర్కీదే. న్యూయార్క్, మాస్కో, లండన్, హాంకాంగ్ తరువాత బిలియనేర్స్ అత్యధికంగా ఉన్న నగరం ఇస్తాంబుల్.
6. సంపన్నులకు
నిలయమైన ఇస్తాంబుల్ నగరాన్ని అడ్డం పెట్టుకొని ఐరోపా
యూనియన్ లో సభ్యత్వానికి దరఖాస్తు
చేసుకొన్నది. కానీ, సభ్యత్వం ఇవ్వడానికి
ఐరోపా యూనియన్ లోని సభ్య దేశాలు
సుముఖంగా లేవు. కారణం, ఐరోపా
దేశాల ప్రజానీకంలో అత్యధికం క్రైస్తవ మతస్తులు. టర్కీ జనాభాలో 99% ముస్లిం
మతస్తులు. పైపెచ్చు టర్కీ జనాభా దాదాపు
10 కోట్లు. అనేక ఐరోపా దేశాలకంటే
పెద్ద దేశం. సంస్కృతి, మతపరమైన సమస్యలు తలెత్తే
అవకాశాలుంటాయన్న సంశయంతో సభ్యత్వాన్ని నిరాకరించాలని పలు ఐరోపా సభ్య
దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
7. సిరియా,
ఇరాక్ మరియు ఆసియా దేశాల
నుండి వలస ప్రజలు టర్కీ
మీదుగా సముద్ర జల మార్గంలో అక్రమంగా
గ్రీస్ లోకి ప్రవేశించి ఐరోపా
సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి
చేస్తున్నారు. ఈ వలసల సమస్య
ఐరోపా సమాజానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా తయారైయ్యింది. ఐరోపా యూనియన్ నుండి
వైదొలగాలన్న అంశంపై బ్రిటన్ లో జరిగిన ప్రజాభిప్రాయ
సేకరణ(రెఫరెండం)లో ఈ వలసల
సమస్య గణనీయంగా ప్రభావం చూపింది.
8. నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్)లో సభ్యత్వం ఉన్నముస్లిం
దేశం టర్కీ. సభ్యత్వం ఉండడమే కాదు, అమెరికా తరువాత
నాటో దళాల్లో ఐదు లక్షల సైనిక
బలంతో రెండవ అతి పెద్ద
దేశం కూడా టర్కీనే. సోవియట్
యూనియన్ నాయకత్వంలోని వార్సా కూటమికి, నాటో కూటమికి మధ్య
ప్రశ్చన్న యుద్ధం కొనసాగిన కాలంలో టర్కీ కీలకమైన పాత్ర
పోషించింది. టర్కీ భౌగోళిక సరిహద్దులను
పరిశీలిస్తే, ఆ దేశంపై అమెరికా
ఎందుకు కన్నేసిందో బోధపడుతుంది. ఒకనాటి సోవియట్ యూనియన్ (యు.యస్.యస్.ఆర్.)లో అంతర్భాగమైన
రష్యా, ఉక్రేనియన్, జార్జియా, అర్మీనియా, అజర్ బైజాన్ లకు
టర్కీ సరిహద్దు దేశం. వీటి మధ్య
నల్ల సముద్రం ఉన్నది.
9. తూర్పు
యూరప్ లోని ఒకనాటి సోషలిస్టు
దేశాలైన బల్గేరియా, రుమేనియాలకు సరిహద్దు దేశం. అలాగే గ్రీస్
ను, టర్కీని మెడిటేరియన్ సముద్రం కలుపుతున్నది.
10. ఇరాన్, ఇరాక్
కు సరిహద్దు దేశమైన టర్కీలో
85% పైగా సున్నీ జనాభా ఉంటే ఇరాన్,
ఇరాక్ లలో షియా జనాభా
అత్యధికం. ముస్లింలలోని ఈ రెండు తెగల
మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండుకొనే వాతావరణం నిరంతరాయంగా కొనసాగుతున్నది.
11 . సైప్రస్, సిరియా,
లెబనాన్, ఇజ్రాయిల్, ఈజిప్ట్, లిబియా దేశాలు టర్కీకి ఇరుగు పొరుగు దేశాలు.
పాలస్తీనా విముక్తి ఉద్యమానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ కు అమెరికా వెన్నుదన్నుగా
నిలిచిన ఉదంతాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి.
12. టర్కీలో కుర్దీస్
సమస్య రావణ కాష్టంలా(కేవలం
ఉపమానం) కాలుతూనే ఉన్నది.
13. టర్కీ భౌగోళిక
పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఆ దేశాన్ని నాటోలో
సభ్య దేశంగా చేర్చుకొని, అమెరికా, తన యుద్ధ నీతిలో
టర్కీని సంపూర్ణంగా భాగస్వామిని చేసి, చక్కగా ఉపయోగించుకొన్నది.
14. సోవియట్ యూనియన్,
తూర్పు యూరప్ దేశాల్లోని సోషలిస్టు
వ్యవస్థ అంతర్థానమైన పూర్వరంగంలో ప్రశ్చన్న యుద్ధ (నాటో, వార్సా కూటముల
మధ్య) వాతావరణం నేడు లేదు.
15. గడచిన రెండున్నర
దశాబ్ధాలుగా అమలులో ఉన్న ప్రపంచీకరణ విధానాల
దుష్పలితాలకు ప్రతిఘటనగా ప్రజలు తిరగబడుతున్నారు. 2008లో అమెరికాతో మొదలైన
ఆర్థిక సంక్షోభాల కొనసాగింపులో అంతర్భాగంగా నేడు ఐరోపా దేశాలు
కోలుకోలేని ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాల సుడిగుండంలోకి నెట్టబడి, గిలగిలా తన్నుకొంటున్నాయి. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగాలన్న
తీర్పుకు ప్రజల మద్ధతు లభించడానికి
ఇదే ప్రధాన కారణం.
16. గోరుచుట్టపై రోకటి
పోటన్నట్టు, ఉగ్రవాదం జడలు విప్పి నాట్యం
చేస్తున్నది. ప్రపంచ మానవాళికి పెనుసవాలుగా నిలిచింది. నాగరికత, అభివృద్ధికి పెద్ద అవరోధంగా పరిణమించింది.
తన, మన తేడా లేకుండా
మారణహోమాలకు ఆజ్యం పోస్తున్నది. ఉగ్రవాదానికి
పాలు పోసి, పెంచి పోషించింది
అమెరికానే అన్నది జగమెరిగిన సత్యం. ఒక నాటి కమ్యూనిస్టు
దేశమైన సోవియట్ యూనియన్, దాని తోడ్పాటుతో అధికారంలోకి
వచ్చిన ఆప్ఘనిస్తాన్ లోని సోషలిస్టు ప్రభుత్వాన్ని
కూల్చడానికి కరడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్ ను
ప్రోత్సహించి, ఆయుధంగా ప్రయోగించింది. ఆ ఉగ్రవాద భూతమే
ఎదురు తిరిగి అమెరికాపై దాడి చేసింది. ప్రపంచ
సామ్రాజ్యవాదానికి మకుటం లేని మహారాజుగా,
అత్యంత ఆధునికమైన సైనిక సంపత్తి కలిగిన
దేశమని విర్రవీగుతున్న అమెరికా అహంభావంపై ఉగ్రవాదం గొడ్డలి పెట్టు వేసింది. అప్పటికి గానీ ఉగ్రవాద ముప్పు
ఎంతటి భయంకరంగా ఉంటుందో అమెరికాకు బోధపడలేదు. భారత దేశానికి వ్యతిరేకంగా
ఉగ్రవాదులకు నెలవుగా మారిన పాకిస్తాన్ కు
అంటకాచిందీ, అమెరికానే. తన పెంపుడు దుష్టశక్తి
ఉగ్రవాదం, తనకు, ప్రపంచ మానవాళికే
పెనుసవాలు విసిరిన నేపథ్యంలో కళ్ళు తెరిచి, అందరం
కలిసి కట్టుగా నిలబడి ఉగ్రవాదం పీకనులమాలని అమెరికా ప్రపంచ దేశాలకు కీసగొంతుతో పిలుపిస్తున్నది.
17. ఉగ్రవాదం ఏ
రూపంలో, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో,
మారణహోమాన్ని స్రృష్టిస్తుందోనన్న భయాందోళనలు అంతర్జాతీయ సమాజాన్ని వెంటాడుతున్నాయి. నిఘావర్గాలు ఏ మాత్రం అలసత్వం
వహించినా ఉపద్రవం ముంచుకొస్తుంది. ప్రపంచ వ్యాపితంగా అనేక ఉగ్రవాద గ్రూపులు
ఉనికిలో ఉన్నాయి. వాటి మూలాలను కనుగొనడం
ప్రభుత్వ నిఘా వర్గాలకే కష్టసాధ్యమై
పోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడబలుక్కొని, ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఒకర్నొకరు అందజేసుకొని ఉమ్మడిగా ముప్పేటా దాడి చేస్తే తప్ప
ఉగ్రవాద పెనుముప్పు నుండి మానవాళికి రక్షణ
కల్పించడం సాధ్యం కాదు.
18. ఈ పూర్వరంగంలో
టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగింది.
దీని వెనకాల ఎవరున్నారనే దానిపై వూహాగాలు చేస్తున్నారు. ఏ ఉగ్రవాద సంస్థ
సైన్యాన్ని ప్రభావితం చేసిందో! కాలం గడిస్తే గానీ
తెలియదు. ఐ.యస్.ఐ.యస్., ఇస్లామిక్
స్టేట్, ఏ దుష్టశక్తి కుట్ర
వెనకాల దాగి ఉన్నదో నిగ్గు
తేలాల్చి ఉన్నది.
19. ఒకటి మాత్రం
తేలిపోయింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారు. ప్రాణాలకు తెగించి పోరుసల్పుతారు. అది ఉగ్రవాదుల రూపంలో
వచ్చినా, సైనిక తిరుగుబాటు రూపంలో
వచ్చినా, నియంతృత్వం రూపంలో వచ్చినా, సమయం వచ్చినప్పుడు మతాతీతంగా
గుండెల్ని ఎదురొడ్డి, సామాజిక స్పృహతో పోరాడుతారన్న నిప్పులాంటి నిజాన్ని టర్కీ ప్రజలు డంకా
బజాయించి, యుద్ధ భూమిలో రక్త
తర్పణతో ప్రకటించారు.
20. అధ్యక్ష తరహా
పాలన వైపు అడుగులు, అప్రజాస్వామిక
పాలన, ఇస్లామిక్ దేశంగా టర్కీని మలచాలనే ప్రయత్నాలు, ప్రతిపక్షాలు మరియు ప్రసారమాధ్యమాలపై నిర్బంధ
కాండ, మాజీ సైనికాధికారులు మరియు
ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి,
కఠిన శిక్షలను అమలు చేయడం లాంటి
నియంతృత్వ పోకడలతో పాలన చేస్తున్న ప్రస్తుత
దేశాధ్యక్షుడు, ఈ విజయం తన
విజయంగా భ్రమిస్తే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో! ఊహించడం
ఆ దేశస్తులకే కష్ట సాధ్యమైనది కావచ్చు.
నాటో కూటమి సభ్య దేశంగా
ఉన్న టర్కీ ప్రభుత్వానికి, అమెరికాకు
మధ్య సంబంధాలలో కూడా కొంత మేరకు
తేడాలు(ఉదా: కుర్దీలపై టర్కీ
ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ) పొడచూపాయన్న వార్తలు ఉన్నాయి. వాటి ప్రభావం కూడా
ఎలా ఉంటుందో! వేచి చూడాల్సిందే!
21. టర్కీ పరిణామాలు
అనివార్యంగా నేడు ఐరోపా ఎదుర్కొంటున్న
సంక్షోభాన్నిమరింత తీవ్రతరం చేస్తాయి. మధ్య ఆసియా, ప్రత్యేకించి
ముడి చమురు ధరలు క్షీణించడంతో
పీకల్లోతు ఆర్థిక ఒడిదుడుకుల్లోకి నెట్టబడిన గల్ఫ్ దేశాలు తీవ్ర
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాలపై దాడిని ఎక్కుపెట్టిన అమెరికా ముడి చమురు ధరల
పతనానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నదనే వాదనలు ఉన్నాయి.
22. టర్కీలో సంబవించే
దుష్పరిణామాల ప్రభావం అంతర్జాతీయ సమాజంపైన, మనలాంటి దేశాలపైన కూడా పెద్ద ఎత్తున
ఉంటుంది. ఇరాన్ తో కుదుర్చుకొన్న
చమురు ఒప్పందాల అమలుకు అవరోధాలు ఏర్పడతాయి.
23. టర్కీలో సైన్యం
తిరుగుబాటు, ప్రాన్స్ పై ఉగ్రవాదుల వరుస
దాడులు, ఐరోపా యూనియన్ నుండి
నిష్క్రమించాలని బ్రిటన్ ప్రజల తీర్పు, ఆర్థిక
సంక్షోభాల సుడిగుండంలో గ్రీస్ పూర్వరంగంలో నాటో కూటమిలోని బలమైన
సభ్య దేశాల్లో సంబవించిన, సంబవిస్తున్న పరిణామాలపై లోతైన అధ్యయనం జరగాలి.
24. సోవియట్ యూనియన్
పతనానంతరం వార్సా కూటమి అంతర్ధానమై పోయింది.
నాటి వార్సా కూటమిలోని కొన్ని సభ్యదేశాలు నాటో కూటమిలో చేరాయి.
నేడు ప్రశ్చన్న యుద్ధ ఛాయలే కనబడడం
లేదు. కానీ, మానవాళిపై ఉగ్రవాదం
యుద్ధం ప్రకటించింది. అణు బాంబుల యుగంలో
జీవిస్తున్నాం. ఉగ్రవాద శక్తుల చేతుల్లోకి అణు బాంబులు చేరితే
జరిగే ఉపద్రవాన్ని ఊహించడమే దుర్లభం.
25. ప్రపంచీకరణ ప్రక్రియను
వెనకపట్టు పట్టించాలనే భావజాలం ఊపందుకొంటున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరుగేలేదన్న ఆర్థిక వేత్తల నోట మాట పడిపోయింది.
మార్పు అనివార్యం. ఆ మార్పు ఎటు
వైపు అన్నదే మౌలికమైన ప్రశ్న. మానవాళి సాధించిన ప్రగతిని పరిరక్షించుకొంటూ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తూ, దోపిడీ రహిత సమాజ నిర్మాణం
వైపు అడుగులు పడకపోతే, ఉగ్రవాదం, జాతి దురహంకారం, ప్రాంతీయ
ఉన్మాదం, అస్థిత్వవాద భావజాలం మరింతగా పెచ్చరిల్లి పోతాయనడంలో నిస్సందేహం.
స్థూలంగా
ఈ అవగాహనతోనే ఈటీవి ప్రతిధ్వనిలో టర్కీ
సంక్షోభంపైన, టీవి5లో ప్రాన్స్
పట్టణం నీస్ లో ఉగ్రవాది
సాగించిన మారణహోమంపై శనివారం జరిగిన చర్చల్లో వివిధ అంశాలను ప్రస్తావించాను.
టి.లక్ష్మీనారాయణ
చాలా వివరణాత్మకంగా ఉంది ధన్యవాదాలు.
ReplyDelete