సరళీకృత ఆర్థిక విధానాల అమలులో భాగంగా చమురు ఉత్ఫత్తులను మార్కెట్ శక్తులకు అప్పజెప్పారు. మొదట పెట్రోల్, తరువాత డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తదనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం నమ్మబలికింది. నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయిన తరువాత 2014 జూన్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 108 డాలర్లు, క్రమేపీ తగ్గుతూ తగ్గుతూ నేటికి 30 డాలర్లలకు పడిపోయింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు. కారణం, కేంద్ర ప్రభుత్వ మాట తప్పింది. సెంట్రల్ ఎక్సజ్ డ్యూటీని 8 సార్లు పెంచింది. పర్యవసానంగా వినియోగదారుల జోబులు కోట్టుడుతున్నది. సెంట్రల్ ఎక్సజ్ డ్యూటీని పెంచకపోతే లీటరు పెట్రోల్ పై రు.10.77 పై.డీజిల్ పై రు.11.97 పై.తగ్గేది. ఎక్సజ్ డ్యూటిని పెంచడం ద్వారా పెట్రోల్, డీజిల్ పై 2014-15 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రు.38,578 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యిందని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నుండి నాలుగు సార్లు పెంచారు. తాజాగా ఈ నెల 15న మళ్ళీ పెంచారు. తద్వారా అదనంగా మరో రు.13,700 కోట్లు ప్రభుత్వ ఖజానాకు పోగేసుకోబోతున్నారని అంచనా. ఇలా వినియోగదారులకు లభించాల్సిన ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకొంటుంటే, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో పిండుకొంటున్నాయి. పెట్రోల్ పై 35.2%, డీజిల్ పై 27% అమ్మకపు పన్ను భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. డీజల్ ధర తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్భణానికి కళ్ళెం వేస్తామని ప్రగల్బాలు పలికిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయి.
No comments:
Post a Comment