Monday, June 20, 2016

రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవి: డా.రఘురాం రాజన్


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డా. రఘురాం రాజన్ ను వదిలించుకోవాలన్ననిర్ణయానికి మోడీ ప్రభుత్వం వచ్చి, రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామిని ఉసిగొలిపి వదిలి పెట్టింది. ఆయన అమెరికా ఏజెంటని, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని, తక్షణం రాజీనామా చేయాలని స్వామి బహిరంగంగా దాడి చేశారు. డా.రాజన్ ను తొలగించాలని మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు. అల్లరి నుండి బయట పడడానికి డా. రఘురాం రాజన్ , తాను రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవిలో రెండవ 'టర్మ్' కొనసాగాలని కోరుకోవడం లేదని రిజర్వు బ్యాంకు సిబ్బందికి వ్రాసిన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నారు. తద్వారా ఊహాగానాలకు తెరదించారు
డా.రఘురాం రాజన్ నిష్క్రమణ వార్తపై వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్పందించాయి. పాలక పక్షం స్వాగతించింది. ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. 2013 సెప్టంబరులో బాధ్యతలు స్వీకరించిన డా.రాజన్ అంతర్జాతీయంగా అననుకూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదాల బారిన పడకుండా కాపాడారని ఆయనను పారిశ్రామిక, ద్రవ్య మార్కెట్ వర్గాలు కొనియాడాయి. ఆయన ప్రకటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వారి ప్రయోజనాలను పరిరక్షించే విధానాలకు రాజన్ అగ్రపీఠం వేశారు కాబట్టి వర్గాలు అలా స్పందించడంలో ఆశ్చర్యమేమీ లేదు. నోబుల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్ గారు డా.రాజన్ నిష్క్రమణ ఆహ్వానించతగ్గ పరిణామం కదన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడొకరు 'కాకుల్లో కోకిల యిమడదు' అని డా. రాజన్ ను కోకిలగా అభివర్ణించడం కాస్తా ఎబ్బెట్టుగానే అనిపించింది. శతృవు శతృవు మన మిత్రుడన్న నానుడి అన్ని సందర్భాలలోను పనికిరాదు. దాన్ని గుడ్డిగా అనుసరిస్తే ఒక్కోసారి పప్పులో కాలేసిన వారౌతారు.
డా.రఘురాం రాజన్ ఉదంతాన్ని తేలికగా తీసిపారేయలేం. అంత వరకు అంగీకరించాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భారత రిజర్వు బ్యాంకు గవర్నరుగా రాజ్యాంగ బద్ధమైన బాధ్యతల్లో ఉన్న డా.రఘురాం రాజన్ పట్ల మోడీ ప్రభుత్వం అమర్యాదకరంగా వ్యవహరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. డా.రఘురాం రాజన్ పదవీ కాలం సెప్టంబరుతో ముగియనున్న దశలో సుబ్రమణ్యస్వామి ద్వారా ఆయనను వివాదాస్పద వ్యక్తిగా చిత్రీకరించి, అల్లరి పెట్టాల్సిన అవసరం మోడీ ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన‌, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న డా.రఘురాం రాజన్ పై ఎక్కుపెట్టిన దాడి, వ్యవస్థపై దాడిగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు గవర్నరుకు రాజ్యాంగం దఖలు పరిచిన అధికారాలకు కత్తెర వేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నించింది. డా.రఘురాం రాజన్ వాటికి అడ్డుగా నిలిచారన్నవార్తలు బహిర్గతమయ్యాయి.
మోడీ అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేశారు. కొలీజియం స్థానంలో నేషనల్ జుడిషియల్ కమీషన్ ఏర్పాటు, అందులో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిథుల నియామకం అంశంపై ప్రభ్యుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య వివాదంగా మారి, కడకు రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించడంతో సమస్య పరిష్కారం అయిందనుకొంటే హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే దోరణిలో రిజర్వు బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచే దుష్ట ఆలోచనతో మోడీ ప్రభుత్వం ప్రయాణం చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం క్షేమం కాదు. అంశాలపై విస్తృత చర్చ జరగాలి.
అదే సందర్భంలో రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఘరాం రాజన్ అనుసరించిన ద్రవ్య విధానం, దాని పర్యవసానాలపై కూడా చర్చ జరగాలి. ఆయన ప్రగతిశీల లేదా ప్రజాతంత్ర భావాలున్న ఆర్థిక వేత్త అని ఎవరైనా భ్రమిస్తే చేయగలిగిందేమీ లేదు. రాజన్ బాధ్యతలు నిర్వహించిన మూడేళ్ళకాలంలో ఆర్థిక వ్యవస్థపై రిజర్వు బ్యాంకు అనుసరించిన విధానాల ప్రభావంపై నిశితంగా అధ్యయనం చేస్తే ఆయన ఆర్థిక భావజాలం వర్గానికి ప్రయోజనాలు వనగూడ్చి పెట్టిందో అర్థమవుతుంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరగడం ఆహ్వానించతగ్గ అంశమే. రాజన్ కృషి ఫలితంగా ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందని, ద్రవ్యోల్భణానికి కళ్ళెం వేసి, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టారని అతిశయోక్తులతో పొగిడేవారూ లేక పోలేదు.
ఒక్కసారి వాస్తవాలను పరిశీలిస్తే ఆయన విధానాల్లోని డొల్లతనం బయటపడుతుంది. హోల్ సేల్ మార్కెట్ ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడమే కాకుండా రీటేయిల్ మార్కెట్ ద్రవ్యోల్భణాన్ని కూడా తగ్గించారని కొందరు కితాబిస్తున్నారు. కళ్ళుండి చూడలేని కబోధుల్లా వ్యవహరించే వారిని ఏమనాలి? మార్కెటుకెళితే నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయో! తగ్గుతున్నాయో! బోధపడుతుంది.
అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయం. రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. రంగాన్ని గట్టెక్కించడానికి బ్యాంకింగ్ వ్యవస్థ చేపట్టిన చర్యలు గానీ, చొరవలు గానీ ఏమీలేకపోగా, రైతు రుణ మాఫీ పథకాల అమలులో భాగంగా రుణాల రీషెడ్యూల్ కు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వు బ్యాంకుకు విజ్ఞప్తి చేస్తే తిరస్కరించడం జరిగింది.
కార్పోరేట్ దిగ్గజాలు, బడా పారిశ్రామిక వేత్తలు వేలకు వేలు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి, ప్రభుత్వ రంగ బ్యాంకుల మనుగడకే ప్రమాదం తెచ్చిపెడుతున్నా, మొండి బాకీలను వసూలు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రాజన్ అమలు చేసిన కార్యాచరణ ఏమీలేదనే చెప్పాలి. పారుబాకీల అంశంపై దృష్టి సారించాలని, బ్యాంకు ఖాతాలను సక్రమంగా ఉండేలా చూసుకోవాలని హితబోధ చేయడం తప్ప నిర్ధిష్టంగా చేపట్టిన చర్యలేమీ లేవు. మొండి బాకీల జాబితాను బహిర్గతం చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ప్రజలు కోరినా డిమాండును నిర్ద్వందంగా తిరస్కరించారు. పైపెచ్చు ఉద్ధేశ పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టే వారు, వ్యాపారంలో నష్టం వచ్చి చెల్లించలేక పోయిన వారు అన్న వర్గీకరణ చేసుకొని, రుణగ్రహీతల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని, లేనియడల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు నిరుత్సాహపడతాయని, తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. విజయ మాల్యా లాంటి వారు కోవలోకి వస్తారో! డా. రాజన్ గారే చెప్పాలి. ప్రజల సొమ్మును కాజేసి, ప్రభుత్వబ్యాంకింగ్ వ్యవస్థనే భ్రష్టుపట్టించిన గరానా పెద్ద మనుషులు, సంస్థలను కఠినంగా శిక్షించడానికి అనుసరించిన విధానమేమి కనిపించడం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పరచవలసిన, విస్తరించ వలసిన, బలోపేతం చేయవలసిన, ప్రజల ధనానికి రక్షిణ కల్పించాల్సిన ప్రాధమిక బాధ్యత రిజర్వు బ్యాంకుపైన లేదా? దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మొండి బాకీలు(యన్.పి..లు) పేరుకపోవడంలో రిజర్వు బ్యాంకు వైఫల్యం లేదని భావించాలా?
వ్యవసాయ రంగం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్య తరగతి పారిశ్రామిక రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. వడ్డీ రేట్ల తగ్గింపులో రాజన్ అనుసరించిన వైఖరి పర్యవసానంగా రంగం కుదేలయ్యింది. అనేక వత్తిళ్ళ తరువాత రిజర్వు బ్యాంకు రెపో రేటును ఐదుసార్లు తగ్గించినా, నిష్పత్తిలో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించలేదు. దాని వల్లవినియోగదారులకు జరిగిన ప్రయోజనం పరిమితమే. ద్రవ్య మార్కెట్ కు, కార్పోరేట్ రంగానికి సేవలందించడంలో చూపెట్టిన శ్రద్ధ, వ్యవసాయ మరియు చిన్న,మధ్య తరగతి పారిశ్రామిక రంగం, గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై మాత్రం పెట్టలేదన్నది వాస్తవం.
డా.రఘురాం రాజన్ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆయన భావజాలం ఏమిటో బోధపడుతుంది. చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేస్తూ, "పెట్టుబడిదారుల నుండి పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవాలి" అన్న గ్రంథాన్ని మరొక ఆర్థిక వేత్తతో కలిసి వ్రాశారు. దానికి మెచ్చి అంతర్జాతీయ ద్రవ్య నిథి సంస్థ(ఐయంఎఫ్)లో ముఖ్య ఆర్థికవేత్తగా, ఒక విభాగానికి డైరెక్టర్ గా సంస్థబాధ్యతలను అప్పగించింది. .యం.ఎఫ్.లో సేవలందించిన మీదటరిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు గవర్నరుగా నియమించబడ్డారు.
డా.రఘురాం రాజన్ రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉంటారా! మరొకరొస్తారా! అన్నదాని కంటే కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా అడుగు ముందుకు వేయడానికి, ప్రగతి సాధించడానికి, దేశ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయడానికి రిజర్వు బ్యాంకు అనుసరించాల్సిన ద్రవ్య విధానం, ప్రభుత్వ రంగబ్యాంకింగ్ వ్యవస్థ పరిరక్షణ తదితర మౌలికాంశాలపై దేశ ప్రజలు స్పందించాలి, చర్చించాలి.


   

No comments:

Post a Comment