Saturday, January 28, 2017

విశాఖ సిఐఐ సదస్సు వల్ల వనగూడే ఫలితాలేంటి!

ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని, సిఐఐ సదస్సు నిర్వహణను వేరు వేరుగా చూడాలి.

1. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బిజెపి రెండు భాగస్వాములే. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తామని రాజ్యసభ వేదికగా వాగ్ధానం చేసింది. నేడు అధికారంలో ఉన్నబిజెపి ఆ వాగ్ధానాన్ని అమలు చేయకుండా మోసం చేసిందన్న బలమైన భావన ప్రజానీకంలో ఉన్నది. దాన్ని చూడ నిరాకరించడం గర్హనీయం. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం, ప్రణాళిక మరియు ప్రణాళికేతర పద్దులను కలిపి వార్షిక బడ్జెటును రూపొందించడానికి నిర్ణయించడం, కేంద్ర ప్రయోజిక పథకాల సంఖ్యను కుదించడంతో పాటు నిథుల కేటాయింపుకు సంబంధించి 70:30 నిష్పత్తి స్థానంలో 60:40 చేసి భారాన్ని రాష్ట్రాల మీదికి నెట్టడం వగైరా చర్యలతో ప్రత్యేక తరగతి హోదా వల్ల వనగూడే ప్రయోజనాలను నిర్వీర్యం చేసింది. ప్రత్యేక తరగతి హోదా వల్ల వనగూడే ప్రయోజనాలేంటి అన్న అప్రజాస్వామికమైన, అడ్డగోలు వాదనను ప్రక్కన బెట్టి చట్టసభలో ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధి ప్రదర్శించాలి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాపితంగా 'హై అలర్ట్' ప్రకటించి ఉన్నందున మరియు సిఐఐ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో  ఆందోళనకు అనుమతించ లేక పోతున్నామన్నదాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, శాసనసభ ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం 'రన్ వే' పైనే అరెస్టు చేయడం దుర్మార్గం. ఇది దుస్సాంప్రదాయానికి దారి దీస్తుంది.

2. సిఐఐ సదస్సు నిర్వహణను సానుకూల దృక్పథంతో చూడాలి. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధారత రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. ఉపాథి అవకాశాలు లేవు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం హుద్ హుద్ తుఫాన్ దెబ్బతో విలవిల్లాడి పోయింది. తీవ్రమైన నష్టం వాటిల్లింది. విశాఖ ఆర్థికాభివృద్ధి మందగిస్తుందేమోనని రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందారు. విశాఖపట్నానికి భౌగోళికంగా ఉన్న సానుకూలాంశాల వల్ల కావచ్చు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణం కావడం వల్ల కావచ్చు, రాజకీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించి చేపట్టిన చర్యల వల్ల కావచ్చు ఏదో ఒక మేరకు సత్ఫలితాలు వస్తున్నాయన్న వాస్తవాన్ని తృణీకార భావంతో తిరస్కరించడం వల్ల ప్రయోజనం లేదు.

ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హైదరాబాదును విభజనతో కోల్పోయిన చేదు అనుభవంతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది ప్రజల బలమైన ఆకాంక్ష. మొదటి సిఐఐ సదస్సులో జరిగిన భాగస్వామ్య ఒప్పందాలను పరిశీలించిన, తాజా సదస్సు ఒప్పందాలను పరిశీలించినా ఆ అంశం కొరవడినట్లు స్పష్టంగా కనబడుతున్నది.

మొదటి సదస్సులో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కల్పించే భాగస్వామ్య ఒప్పందాలు జరిగాయని, వాటిలో 40% వరకు కార్యరూపం దాల్చాయని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో అంతా వాస్తవం కాకపోవచ్చు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో కనబడుతున్న దానికి పొంతన లేని మాట వాస్తవమే కావచ్చు. అయితే, కార్యరూపం దాల్చుతున్న యం.ఓ.యు.లు వివిధ దశల్లో ఉండవచ్చు, అవి పూర్తి స్థాయిలో అమలు కావడానికి, ఫలితాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కూడా! అయితే, మొదటి సదస్సు వల్ల కానీ, రెండవ సదస్సు వల్ల కానీ, పారిశ్రామిక రంగంలో ఒక విధమైన కదలిక, సానుకూలమైన వాతావరణం సృష్టించబడ్డాయనడంలో సందేహం లేదు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఏ చిన్న ప్రయత్నం చేసినా సానుకూల దృక్పథంతో పరిశీలించడం రాష్ట్రానికి మేలు చేకూర్చుతుంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నపారిశ్రామిక విధానంలోని లోపభూయిష్టమైన అంశాలను నిర్మాణాత్మక దృష్టితో నిశితంగా పరిశీలించాలి, ఎత్తి చూపాలి, ఎండగట్టాలి, వాటికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.

పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ప్రభుత్వ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులను రెండు వేరు వేరు కోణాల్లో పరిశీలించాలి. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, మానవ వనరులకు సంబంధించిన సమాచారాన్ని పారిశ్రామిక వేత్తలకు వివరించడం ద్వారా పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం భాగస్వామ్య సదస్సుల ద్వారా చేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా చేసుకొంటున్న భాగస్వామ్య ఒప్పందాలు అమలుకు నోచుకొని రాష్ట్రానికి మేలు జరిగితే మంచిదే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధానత్య లోపించినట్లు స్పష్టంగా కనబడుతున్నది. విశాఖపట్నం, అమరావతి, కోస్తా తీరంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే ఒప్పందాలే అత్యధికంగా ఉన్నట్లు బహిరంగ పరచిన ఒప్పందాలఇవరాలను బట్టి అర్థమవుతున్నది. సముద్ర తీరంతో పాటు నీటి వనరులు, భౌగోళిక పరిస్థితుల మూలంగా ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కోస్తా ప్రాంతానికి అదనపు సానుకూలతలు ఉండవచ్చు. కానీ, మానవ వనరులు, భూములు, ఖనిజ సంపద, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు వగైరా మౌలిక సదుపాయాలు ఉన్న వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి నీటి సదుపాయాన్ని కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలను చేపట్టాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పక తప్పదు.

రాష్త్ర విభజన చట్టంలో పొందుపరచిన కడప ఉక్కు పరిశ్రమ సంగతేంటి? బి.హెచ్.సి.యల్._యన్.టి.పి.సి. సంయుక్తంగా నిర్మాణాన్ని చేపట్టిన మన్నవరం పరిశ్రమను ఎందుకు అటకెక్కించారు? కర్నూలు సమీపంలో యుపిఏ ప్రభుత్వ కాలంలో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ తయారీ పరిశ్రమ ఏమయ్యింది? రేణిగుంట వ్యాగన్ రిపేర్ వర్క షాప్ దశాబ్ధాలు గడచి పోతున్నా విస్తరణకు ఎందుకు నోచుకోవడం లేదు? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులతో నెలకొల్పబడాల్సిన పరిశ్రమలు. వాటిపైన ఏ మాత్రం ద్యాస పెట్టడం లేదు.

నిజమే, కోస్తా తీరం లేదా ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి జరిగినా రాష్ట్ర స్థూల ఉత్ఫత్తి పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. దాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించవచ్చు. కానీ, వెనుకబడిన, కరవు పీడిత ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ది, ఉపాథి అవకాశాల కల్పన, ఆర్థికాభివృద్ధిలో ఆ ప్రాంతాల ప్రజలను భాగస్వాములను చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి కదా! విభజన చట్టంలో పేర్కొన్న వాటినీ అమలు చేయడం లేదు. పెట్టుబడులపై 15%, యంత్రాల తరుగుదలపై 15% రాయితీలు ప్రకటించారు. వాటి వల్ల ఒక్క పరిశ్రమైనా వెనుకబడిన ప్రాంతాల్లో వచ్చిందా? సిఐఐ సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ఈ వాస్తవాన్ని గుర్తించి రాయితీలను పెంచే అంశాన్ని మాట వరసకు కూడా ప్రస్తావించ లేదు. సోలార్ ప్లాట్లను నెలకొల్పుతున్నామనో లేదా చిన్న చితక పరిశ్రమల స్థాపనకు ప్రయత్నిస్తున్నామనో! నమ్మబలికే ప్రయత్నం చేయడం వృదా ప్రయాసగానే మిగిలి పోతుంది.

టీవి5లో జరిగిన చర్చలో నాతో పాటు సీనియర్ పాత్రికేయులు శ్రీ ప్రసాద్ రెడ్డి, స్వచ్ఛా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ డా. వెంకట్రావు, ఆర్థికాంశాల విశ్లేషకులు శ్రీ దిలీప్ పాల్గొన్నారు

టి.లక్ష్మీనారాయణ

Part 1: https://www.youtube.com/watch?v=H_oWMIxFj1E

Part 2: https://www.youtube.com/watch?v=sNMKGpTx7FE

Monday, January 23, 2017

ఒక్క ప్రత్యేక తరగతి హోదా కోసమే కాదు ఉద్యమం చేయాల్సింది, విభజన చట్టంలో పొందుపరచిన అన్ని అంశాల అమలు కోసం ఉద్యమించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ప్రణాళిక అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిగ్గదీయాలి. భారత్ టుడే 'న్యూస్ ట్రాక్' చర్చలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాల సారాంశం అది.

ఇరుగు పొరుగు ప్రాంతాల్లో జరిగే ఆందోళనల ప్రభావం ఎంతో కొంత మేరకు మనపై కూడా ఉంటుంది. జల్లికట్టు సమస్యపై తమిళనాడులో జరుగుతున్న ఆందోళన హేతుబద్ధతపై వేరుగా చర్చించుకోవాలి. ఆ క్రీడలో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. జంతు ప్రేమికులేమో, జంతువులు హింసకు గురౌతున్నాయి కాబట్టి దాన్ని నిషేధించమంటున్నారు. సంస్కృతిలో భాగమంటూ ఆ రాష్ట్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా వీథుల్లోకి వచ్చారు. ఆ ఆందోళనను స్ఫూర్తిగా తీసుకోని ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించాలనడంలో ఔచిత్యం లేదు. ప్రత్యేక తరగతి హోదా అంశం యొక్క స్వభావం వేరు.

రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక తరగతి హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. దాని వల్ల వనగూడే ప్రయోజనాలేంటి అన్న చర్చను ప్రభుత్వంలోని పెద్దలు లేవదీయడం అసంబద్ధం. చట్ట సభల విశ్వసనీయతతో కూడా ఈ అంశం ముడిపడి ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానీకాన్ని దగా చేయడమే కాదు, విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన పలు అంశాల అమలులోనూ బాధ్యతారహిత్యంగా, అలసత్వంతో వ్యవహరిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అభివృద్ధి ప్యాకేజీని అమలు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రు.24,000 కోట్లతో ఒక పథకాన్ని రూపొందించి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందన్న వార్తలు వచ్చాయి. కానీ, జిల్లాకు, ఏడాదికి రు.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రు.350, అలా ఐదేళ్ళకు మొత్తం రు.1750 కోట్లు మాత్రమే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని, ఆ మేరకే నిథులిస్తున్నది. ఇది వెనుకబడిన జిల్లాల ప్రజానీకాన్ని అమమానించడం కాదా?

వెనుకబడ్డ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని చట్టంలో పేర్కొన్నారు. 'ఫీజిబిలిటీ' లేదంటూ దాన్ని అటకెక్కించారు. రైల్వే జోన్ అంశాన్ని నాన్చుతూనే ఉన్నారు. కొత్త‌ ఓడ‌ రేవు నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని పట్టించుకోలేదు. రెవెన్యూ లోటు భర్తీపై ఇంకా లెక్కలే తేలలేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారో అంతు చిక్కని సమస్యగానే కొనసాగుతున్నది.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కానీ, 2010 -11 అంచనా వ్యయాన్ని అంటే రు.16,000 కోట్లను మాత్రమే కొలబద్ధగా తీసుకొని, అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన వ్యయం, జల విద్యుత్ ప్లాంటును నెలకొల్పడానికయ్యే వ్యయాన్ని, విశాఖపట్నం త్రాగు నీటి పథకానికయ్యే వ్యయాన్ని మినహాయించి, దాదాపు రు.8,000 కోట్లు ఇవ్వడానికి ఆమోదించి, నాబార్డు నుండి రుణం తీసుకొని సర్దుబాటు చేస్తున్నారు. ఈ తరహా ఆర్థిక తోడ్పాటుతో ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 లేదా 19 నాటికి పూర్తి చేయగలరా?

విభజన చట్టంలో పొందుపరచిన అంశాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు, విడుదల చేసిన నిథుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేత పత్రాలు విడుదల చేయాలి.

టి.లక్ష్మీనారాయణ‌

Part 1: https://www.youtube.com/watch?v=WBV00IbLhnk
Part 2: https://www.youtube.com/watch?v=MnjXz2qqpqM

Saturday, January 14, 2017

వైయస్ కలను సాకారం చేసిన చంద్రబాబు!

యన్.టి.ఆర్. మానస పుత్రిక అయినగాలేరు - నగరి సృజల స్రవంతి నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, రేణిగుంట, పుత్తూరు, నగరి వరకు సాగు నీరు, త్రాగు నీరు అందించాల్సిన రెండవ దశ నిర్మాణ పనులను అటకెక్కించి, రాజకీయంగా పాత మిత్రుడు, ప్రత్యర్థి అయిన డా.వై.యస్.ఆర్. కలను చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికపై నెరవేర్చినందుకు అభినందించాలా! ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని విస్మరించినందుకు విమర్శించాలా! అన్న సందిగ్ధంలో పడ్డాను.
గాలేరు - నగరి ప్రాజెక్టు ద్వారా గండికోట జలాశయం నుండి చిత్తూరు జిల్లా నగరి వరకు సాగు నీరు అందుతుందా! అన్న అనుమానాలు ప్రజల్లో మొదటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా గండికోట జలాశయం నుండి ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాజెక్టు పరిథిలో లేని పులివెందుల ప్రాంతానికి నీటిని తరలించుకొని పోవడానికి వై.యస్. వ్యూహ రచన చేశారు. గండికోట ఎత్తిపోతల పథకం, గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం, గాలేరు - నగరి (రెండవ దశ) పరిథిలోని ప్రాంతాల ప్రయోజనాలకు నిస్సందేహంగా హానికరం. గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అసలు లక్ష్యాలకు వై.యస్. విధంగా గండి కొట్టారు. వై.యస్. చేపట్టిన పథకాలను చంద్రబాబు పూర్తి చేసి వై.యస్. కన్న కలను నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్ధేశిత ఆయకట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని ఎవరైనా ఎలా సమర్థించుకోగలరు!
గాలేరు - నగరి అసలు లక్ష్యానికి ఎసరు!
గాలేరు - నగరి ప్రాజెక్టుకు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసి 1988 సెప్టంబరు 22 జీ..యం.యస్. నెం.236ను జారీ చేసింది. నాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు గారు కడప జిల్లా బాక్రాపేట సమీపంలో ఉద్దిమడుగు సాగరంకు, చిత్తూరు జిల్లా కరకంబాడి వద్ద శ్రీనివాస సాగరంకు శంకుస్థాపన చేశారు. అటుపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వామికొండ సాగరంకు  ఉప ముఖ్యమంత్రి హోదాలో కోనేరు రంగారావు గారు 1994 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. 1996లో చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా మరొకసారి గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. మూడు శంకుస్థాపనలు జరిగాయి. దాదాపు ముప్పయ్ ఏళ్ళు గడిచి పోయాయి. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి, ప్రజలకు స్పష్టత కల్పించాలి.
 కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 38 టి.యం.సి. కృష్ణా నది మిగులు జలాలను గండికోట ప్రధాన జలాశయానికి తరలించి, గండికోట జలాశయానికి దిగువన 8 చిన్న చిన్న జలాశయాలను(వామికొండ సాగరం, సర్వరాజ సాగరం, ఉద్ధిమడుగు సాగరం, వెలిగొండ సాగరం, కృష్ణ సాగరం, శ్రీ బాలాజీ జలాశయం, పద్మ సాగరం, శ్రీనివాస సాగరం) నిర్మించి, వాటి ద్వారా కడప జిల్లాలోని 15 మండలాల్లో 1,30,000, చిత్తూరు జిల్లాలోని 13 మండలాల్లో 1,60,000, నెల్లూరు జిల్లాలోని 4 మండలాల్లో 35,000, మొత్తం 3.25 లక్షల ఎకరాలకు  సాగు నీటిని, మార్గమధ్యంలో పలు పట్టణాలకు, గ్రామాలకు త్రాగు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు. తరువాత కాలంలో సాగుదల లక్ష్యాన్ని 3,25,000 నుండి 2,60,000 ఎకరాలకు(కడప జిల్లాలో 1,55,000, చిత్తూరు జిల్లాలో 1,03,500, నెల్లూరు జిల్లాలో 1,500) ప్రభుత్వం కుదించి వేసింది.
 ప్రాజెక్టు నిర్మాణానికి రు.1,500 కోట్లు వ్యయం అవుతుందని 1993-94 ఆర్థిక సం.లో ప్రభుత్వం అంచనా వేసింది. అది కాస్తా, 1999-2000 నాటికి  రు.3,310 కోట్లుకు పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశలుగా విడగొట్టారు. మొదటి దశ క్రింద రు.4,940 కోట్ల అంచనా వ్యయంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి గండికోట జలాశయ వరకు నీటిని తరలించే నిర్మాణ పనులు(సొరంగం నిర్మాణంతో సహా), గండికోట జలాశయం, వామికొండ మరియు సర్వరాజ సాగరం, వాటి వరకు ప్రధాన కాలువ, జలాశయాల క్రింద 35,000 ఎకరాలకు సాగు నీటి సరఫరాకు వీలుగా పంట కాల్వలనిర్మాణ పనులు పేర్కొనబడ్డాయి. మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు మూడు దశాబ్ధాల కాలం పట్టింది. ప్రాజెక్టుకు తలమానికమైన గండికోట జలాశయాన్ని 26.84 టి.యం.సి. సామర్థ్యంతో నిర్మించారు. దానికి నీటిని తరలించడానికి వీలుగా సొరంగ మార్గ నిర్మాణం పూర్తయ్యింది. కరవు సీమ ప్రజల మూడు దశాబ్ధాల కల పాక్షికంగానైనా సాకారం అయినందుకు సంతోషం. గాలేరు - నగరి ప్రాజెక్టుకు తలమానికమైన గండికోట జలాశయం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో వై.యస్. శ్రద్ధ వహించారు. ఖ్యాతి ఆయనకు తప్పని సరిగా దక్కుతుంది.
కానీ, ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు లక్ష్యంగా నిర్ధేశించుకొన్న 2.60 లక్షల ఎకరాల ఆయకట్టులో కడప, ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, చిత్తూరు జిల్లాలోని నగరి వరకు విస్తరించి ఉన్న 2.25 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయాల్సిన ప్రధాన కాలువ, రిజర్వాయర్ల నిర్మాణంపై మాత్రం దృష్టి సారించకనే గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేశామన్న భ్రమలను ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కల్పించడం గర్హనీయం. గాలేరు - నగరి (రెండవ దశ) నిర్మాణానికి రు.2,526 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసి, నేటికి కేవలం రు.333 కోట్లు ఖర్చు చేశారు

గాలేరు - నగరి సృజల స్రవంతి పథకంలో గండికోట ఎత్తిపోతల పథకం(పైడిపాళెం జలాశయం), గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాలు అంతర్భాగం కాదు. ఇవి వై.యస్. మానస పుత్రికలుగా 2006లో రూపొందించబడ్డాయి. గండికోట ఎత్తిపోతల పథకాన్ని రు.837 కోట్లతోను, గండికోటచిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సిబిఆర్) ఎత్తిపోతల పథకాన్ని రు.1461 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాన్ని చేపట్టి, శర వేగంతో నిర్మించారు. అదే సందర్భంలో గాలేరు _ నగరి ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణ పనులపై మాత్రం శ్రద్ధ పెట్ట లేదు. దాని పరిథిలోకి వచ్చే ప్రాంతాల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లు కనబడుతున్నది.
ప్రాజెక్టు పరిథిలో లేని ప్రాంతాలకే ముందస్తుగా నీళ్ళా!
కాస్త, పూర్వరంగాన్ని పరిశీలిద్ధాం! పులివెందుల బ్రాంచి కాల్వకు తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్.ఎల్.సి.) ద్వారా 4.4, పెన్నా నది నుండి 2 టియంసిల నికర జలాల కేటాయింపు ఉన్నది. దీని క్రింద కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో 55,000, అనంతపురం జిల్లాలో 5,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. తుంగభద్ర జలాలు సక్రమంగా అందక, పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఇది ముమ్మాటికీ నిజం.
చిత్రావతి నదిపై పార్నపల్లి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు10 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడింది. పెన్నా నదికి ఉప నది చిత్రావతి. చిత్రావతిలో నీటి లభ్యత పెద్దగా లేదు కాబట్టి గండికోట నుండి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందించాలన్న డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఉన్నది.
పులివెందుల బ్రాంచి కాల్వ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, పనిలో పనిగా మరికొన్ని వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు గండికోట జలాశయం నుండి కృష్ణా నది మిగులు జలాలను తరలించడానికి వై.యస్. పథకాన్ని రచించారు. అందులో భాగంగా 6 టియంసిల సామర్థ్యంతో పైడిపాళెం జలాశయాన్ని నిర్మించి, దానికి నీటి సరఫరా కోసం గండికోట ఎత్తిపోతల పథకాన్ని రు. 983 కోట్లతో నిర్మించ తలపెట్టారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 41,000 ఎకరాల ఆయకట్టు, మరో 47,500 ఎకరాల పులివెందుల బ్యాంచి కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సాగు నీరు అందించే లక్ష్యాన్ని నిర్ధేశించుకొన్నారు. అలాగే గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాన్ని రు. 627 కోట్లతో నిర్మించి, ప్రత్యక్షంగా 20,750 ఎకరాల ఆయకట్టు తోపాటు చిత్రావతి కుడి కాలువ క్రింద 59,400 ఎకరాలకు నీటి సరఫరాను లక్ష్యంగా పెట్టుకొన్నారు.

"చేతిలో కర్ర ఉన్న వాడిదే బర్రె" అన్న నానుడి గుర్తుకొస్తున్నది. గాలేరు -  నగరి సృజల స్రవంతి ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న అసలు లక్ష్యాన్ని వమ్ము చేస్తూ గండికోట జలాశయానికి కృష్ణా నది నుండి తరలించబడే 38 టియంసిల మిగులు జలాల్లో 14.3 టియంసిలను రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాజెక్టు పరిథిలో లేని ప్రాంతాలకు తరలించడం అన్యాయం.
చివరిలో ఒక్క మాట:
రాయలసీమకు కృష్ణా నదీ జలాలను తరలించాలని కమ్యూనిస్టులు అలుపెరగని ఉద్యమాలు నిర్వహించారు. ఇతర రాజకీయ పార్టీలు, సంస్థలు, అనేక మంది వ్యక్తులుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలన్న డిమాండుతో సిపిఐ, కడప జిల్లా అగ్రనేతలు కా.యన్.శివరామిరెడ్డి, జె.వెంకట్రామిరెడ్డి, కె.సుబ్బన్న, అబ్దుల్ ఖాదర్ లను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోబెట్టాలని 1996లో నిర్ణయించాం. వత్తిడి వల్ల నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు గారు, అప్పుడు సిపిఐ, శాసన సభాపక్ష నాయకుడుగా ఉండిన కా.సి.హెచ్.రాజేశ్వరరావును వెంట బెట్టుకొచ్చి గండికోట వద్ద శంకుస్థాపన చేశారు
రాయలసీమ ప్రాంత దాహార్తిని తీర్చడానికి కృష్ణా జలాల మళ్ళింపే ఏకైక మార్గమని దశాబ్ధాల పాటు పోరు సల్పినవారిలో అగ్రగన్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు అమరజీవి కా.ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి పేరును గండికోట జలాశయానికి పెట్టమని ఒకబృందంగా వెళ్ళి నాటి ముఖ్యమంత్రి డా. వై.యస్.రాజశేఖరరెడ్డి గారికి విజ్ఞప్తి చేశాం. ఆయనవెంటనే స్పందించి, ఉత్తర్వు జారీ చేయించారు. సైద్ధాంతిక, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఆయన స్పందించిన తీరు మరువలేనిది. మాట ఇక్కడప్రస్తావించడానికి కారణం పైడిపాళెం జలాశయానికి యన్.టి.ఆర్. పేరు పెట్టినట్లుగా ప్రసారమాధ్యమాల్లో చూశాను. గాలేరు - నగరి సృజల స్రవంతి పథకం యన్.టి.ఆర్. మానస పుత్రిక అయితే గండికోట ఎత్తిపోతల(పైడిపాళెం జలాశయంతో సహా) పథకం వై.యస్. మానస పుత్రిక అని చెప్పక తప్పదు. అందు వల్ల, గండికోట ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించబడిన పైడిపాళెం జలాశయానికి యన్.టి.ఆర్. పేరుకు బదులు వై.యస్. పేరు పెట్టి ఉంటే సముచితంగా ఉండేది.

టి.లక్ష్మీనారాయణ