యన్.టి.ఆర్. మానస
పుత్రిక అయిన గాలేరు - నగరి
సృజల స్రవంతి నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, రేణిగుంట, పుత్తూరు, నగరి వరకు సాగు
నీరు, త్రాగు నీరు అందించాల్సిన రెండవ
దశ నిర్మాణ పనులను అటకెక్కించి, రాజకీయంగా పాత మిత్రుడు, ప్రత్యర్థి
అయిన డా.వై.యస్.ఆర్. కలను చంద్రబాబు
యుద్ధ ప్రాతిపదికపై నెరవేర్చినందుకు అభినందించాలా! ప్రాజెక్టు అసలు లక్ష్యాన్ని విస్మరించినందుకు
విమర్శించాలా! అన్న సందిగ్ధంలో పడ్డాను.
గాలేరు
- నగరి ప్రాజెక్టు ద్వారా గండికోట జలాశయం నుండి చిత్తూరు జిల్లా
నగరి వరకు సాగు నీరు
అందుతుందా! అన్న అనుమానాలు ప్రజల్లో
మొదటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి.
వాటికి బలం చేకూర్చే విధంగా
గండికోట జలాశయం నుండి ఎత్తిపోతల పథకాల
ద్వారా ప్రాజెక్టు పరిథిలో లేని పులివెందుల ప్రాంతానికి
నీటిని తరలించుకొని పోవడానికి వై.యస్. వ్యూహ
రచన చేశారు. గండికోట ఎత్తిపోతల పథకం, గండికోట - చిత్రావతి
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం, గాలేరు
- నగరి (రెండవ దశ) పరిథిలోని
ప్రాంతాల ప్రయోజనాలకు నిస్సందేహంగా హానికరం. గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణానికి
ముందే అసలు లక్ష్యాలకు వై.యస్. ఆ విధంగా
గండి కొట్టారు. వై.యస్. చేపట్టిన
ఆ పథకాలను చంద్రబాబు పూర్తి చేసి వై.యస్.
కన్న కలను నెరవేర్చారు. ప్రాజెక్టు
నిర్ధేశిత ఆయకట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని ఎవరైనా
ఎలా సమర్థించుకోగలరు!
గాలేరు - నగరి
అసలు
లక్ష్యానికి
ఎసరు!
గాలేరు
- నగరి ప్రాజెక్టుకు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర
ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసి
1988 సెప్టంబరు 22న జీ.ఒ.యం.యస్. నెం.236ను జారీ చేసింది.
నాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు
గారు కడప జిల్లా బాక్రాపేట
సమీపంలో ఉద్దిమడుగు సాగరంకు, చిత్తూరు జిల్లా కరకంబాడి వద్ద శ్రీనివాస సాగరంకు
శంకుస్థాపన చేశారు. అటుపై అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వామికొండ సాగరంకు ఉప
ముఖ్యమంత్రి హోదాలో కోనేరు రంగారావు గారు 1994 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. 1996లో చంద్రబాబునాయుడు గారు
ముఖ్యమంత్రిగా మరొకసారి గండికోట వద్ద శంకుస్థాపన చేశారు.
మూడు శంకుస్థాపనలు జరిగాయి. దాదాపు ముప్పయ్ ఏళ్ళు గడిచి పోయాయి.
ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల
చేసి, ప్రజలకు స్పష్టత కల్పించాలి.
ప్రాజెక్టు
నిర్మాణానికి రు.1,500 కోట్లు వ్యయం అవుతుందని 1993-94 ఆర్థిక
సం.లో ప్రభుత్వం అంచనా
వేసింది. అది కాస్తా, 1999-2000 నాటికి రు.3,310
కోట్లుకు పెరిగింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశలుగా విడగొట్టారు.
మొదటి దశ క్రింద రు.4,940
కోట్ల అంచనా వ్యయంతో పోతిరెడ్డిపాడు
హెడ్ రెగ్యులేటర్ నుండి గండికోట జలాశయం వరకు నీటిని
తరలించే నిర్మాణ పనులు(సొరంగం నిర్మాణంతో
సహా), గండికోట జలాశయం, వామికొండ మరియు సర్వరాజ సాగరం,
వాటి వరకు ప్రధాన కాలువ,
ఆ జలాశయాల క్రింద 35,000 ఎకరాలకు సాగు నీటి సరఫరాకు
వీలుగా పంట కాల్వల నిర్మాణ
పనులు పేర్కొనబడ్డాయి. మొదటి దశ నిర్మాణాన్ని
పూర్తి చేయడానికి దాదాపు మూడు దశాబ్ధాల కాలం
పట్టింది. ప్రాజెక్టుకు తలమానికమైన గండికోట జలాశయాన్ని 26.84 టి.యం.సి.ల సామర్థ్యంతో నిర్మించారు.
దానికి నీటిని తరలించడానికి వీలుగా సొరంగ మార్గ నిర్మాణం
పూర్తయ్యింది. కరవు సీమ ప్రజల
మూడు దశాబ్ధాల కల పాక్షికంగానైనా సాకారం
అయినందుకు సంతోషం. గాలేరు - నగరి ప్రాజెక్టుకు తలమానికమైన
గండికోట జలాశయం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో వై.యస్. శ్రద్ధ
వహించారు. ఆ ఖ్యాతి ఆయనకు
తప్పని సరిగా దక్కుతుంది.
కానీ,
ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణానికి
సంబంధించిన పనులను ప్రభుత్వం అటకెక్కించింది. ప్రాజెక్టు లక్ష్యంగా నిర్ధేశించుకొన్న 2.60 లక్షల ఎకరాల ఆయకట్టులో
కడప, ఒంటిమిట్ట, రాజంపేట, కోడూరు, చిత్తూరు జిల్లాలోని నగరి వరకు విస్తరించి
ఉన్న 2.25 లక్షల ఎకరాలకు నీటిని
సరఫరా చేయాల్సిన ప్రధాన కాలువ, రిజర్వాయర్ల నిర్మాణంపై ఏ మాత్రం దృష్టి
సారించకనే గాలేరు-నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని
పూర్తి చేసేశామన్న భ్రమలను ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కల్పించడం గర్హనీయం. గాలేరు - నగరి (రెండవ దశ)
నిర్మాణానికి రు.2,526 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసి, నేటికి
కేవలం రు.333 కోట్లు ఖర్చు చేశారు.
గాలేరు
- నగరి సృజల స్రవంతి పథకంలో
గండికోట ఎత్తిపోతల పథకం(పైడిపాళెం జలాశయం),
గండికోట - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాలు అంతర్భాగం కాదు. ఇవి వై.యస్. మానస పుత్రికలుగా
2006లో రూపొందించబడ్డాయి. గండికోట ఎత్తిపోతల పథకాన్ని రు.837 కోట్లతోను, గండికోట - చిత్రావతి
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(సిబిఆర్) ఎత్తిపోతల పథకాన్ని రు.1461 కోట్ల అంచనా వ్యయంతో
నిర్మాణాన్ని చేపట్టి, శర వేగంతో నిర్మించారు.
అదే సందర్భంలో గాలేరు _ నగరి ప్రాజెక్టు రెండవ
దశ నిర్మాణ పనులపై ఏ మాత్రం శ్రద్ధ
పెట్ట లేదు. దాని పరిథిలోకి
వచ్చే ప్రాంతాల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించినట్లు కనబడుతున్నది.
ప్రాజెక్టు పరిథిలో
లేని
ప్రాంతాలకే
ముందస్తుగా
నీళ్ళా!
కాస్త,
పూర్వరంగాన్ని పరిశీలిద్ధాం! పులివెందుల బ్రాంచి కాల్వకు తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్.ఎల్.సి.) ద్వారా
4.4, పెన్నా నది నుండి 2 టియంసిల
నికర జలాల కేటాయింపు ఉన్నది.
దీని క్రింద కడప జిల్లా పులివెందుల
ప్రాంతంలో 55,000, అనంతపురం జిల్లాలో 5,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. తుంగభద్ర జలాలు సక్రమంగా అందక,
పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందడం లేదు. ఇది ముమ్మాటికీ
నిజం.
చిత్రావతి
నదిపై పార్నపల్లి వద్ద చిత్రావతి బ్యాలెన్సింగ్
రిజర్వాయరు10 టియంసిల సామర్థ్యంతో నిర్మించబడింది. పెన్నా నదికి ఉప నది
చిత్రావతి. చిత్రావతిలో నీటి లభ్యత పెద్దగా
లేదు కాబట్టి గండికోట నుండి ఎత్తిపోతల పథకం
ద్వారా నీటిని అందించాలన్న డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఉన్నది.
పులివెందుల
బ్రాంచి కాల్వ, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు, పనిలో పనిగా మరికొన్ని
వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు
గండికోట జలాశయం నుండి కృష్ణా నది
మిగులు జలాలను తరలించడానికి వై.యస్. పథకాన్ని
రచించారు. అందులో భాగంగా 6 టియంసిల సామర్థ్యంతో పైడిపాళెం జలాశయాన్ని నిర్మించి, దానికి నీటి సరఫరా కోసం
గండికోట ఎత్తిపోతల పథకాన్ని రు. 983 కోట్లతో నిర్మించ తలపెట్టారు. దీని ద్వారా ప్రత్యక్షంగా
41,000 ఎకరాల ఆయకట్టు, మరో 47,500 ఎకరాల పులివెందుల బ్యాంచి
కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సాగు నీరు అందించే
లక్ష్యాన్ని నిర్ధేశించుకొన్నారు. అలాగే గండికోట - చిత్రావతి
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాన్ని రు. 627 కోట్లతో నిర్మించి, ప్రత్యక్షంగా 20,750 ఎకరాల ఆయకట్టు తోపాటు
చిత్రావతి కుడి కాలువ క్రింద
59,400 ఎకరాలకు నీటి సరఫరాను లక్ష్యంగా
పెట్టుకొన్నారు.
"చేతిలో కర్ర
ఉన్న వాడిదే బర్రె" అన్న నానుడి గుర్తుకొస్తున్నది.
గాలేరు - నగరి
సృజల స్రవంతి ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న అసలు లక్ష్యాన్ని వమ్ము
చేస్తూ గండికోట జలాశయానికి కృష్ణా నది నుండి తరలించబడే
38 టియంసిల మిగులు జలాల్లో 14.3 టియంసిలను రెండు ఎత్తిపోతల పథకాల
ద్వారా ప్రాజెక్టు పరిథిలో లేని ప్రాంతాలకు తరలించడం
అన్యాయం.
చివరిలో ఒక్క
మాట:
రాయలసీమకు
కృష్ణా నదీ జలాలను తరలించాలని
కమ్యూనిస్టులు అలుపెరగని ఉద్యమాలు నిర్వహించారు. ఇతర రాజకీయ పార్టీలు,
సంస్థలు, అనేక మంది వ్యక్తులుగా
వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణాన్ని
సత్వరం చేపట్టాలన్న డిమాండుతో సిపిఐ, కడప జిల్లా అగ్రనేతలు
కా.యన్.శివరామిరెడ్డి, జె.వెంకట్రామిరెడ్డి, కె.సుబ్బన్న, అబ్దుల్
ఖాదర్ లను నిరవధిక నిరాహార
దీక్షకు కూర్చోబెట్టాలని 1996లో నిర్ణయించాం. ఆ
వత్తిడి వల్ల నాడు ముఖ్యమంత్రిగా
ఉన్న చంద్రబాబునాయుడు గారు, అప్పుడు సిపిఐ,
శాసన సభాపక్ష నాయకుడుగా ఉండిన కా.సి.హెచ్.రాజేశ్వరరావును వెంట
బెట్టుకొచ్చి గండికోట వద్ద శంకుస్థాపన చేశారు.
రాయలసీమ
ప్రాంత దాహార్తిని తీర్చడానికి కృష్ణా జలాల మళ్ళింపే ఏకైక
మార్గమని దశాబ్ధాల పాటు పోరు సల్పిన
వారిలో అగ్రగన్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ
ప్రముఖ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు
అమరజీవి కా.ఎద్దుల ఈశ్వరరెడ్డి
గారి పేరును గండికోట జలాశయానికి పెట్టమని ఒక బృందంగా వెళ్ళి
నాటి ముఖ్యమంత్రి డా. వై.యస్.రాజశేఖరరెడ్డి గారికి విజ్ఞప్తి చేశాం. ఆయన వెంటనే స్పందించి,
ఉత్తర్వు జారీ చేయించారు. సైద్ధాంతిక,
రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఆయన స్పందించిన తీరు
మరువలేనిది. ఈ మాట ఇక్కడ
ప్రస్తావించడానికి కారణం పైడిపాళెం జలాశయానికి
యన్.టి.ఆర్. పేరు
పెట్టినట్లుగా ప్రసారమాధ్యమాల్లో చూశాను. గాలేరు - నగరి సృజల స్రవంతి
పథకం యన్.టి.ఆర్.
మానస పుత్రిక అయితే గండికోట ఎత్తిపోతల(పైడిపాళెం జలాశయంతో సహా) పథకం వై.యస్. మానస పుత్రిక
అని చెప్పక తప్పదు. అందు వల్ల, గండికోట
ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించబడిన పైడిపాళెం జలాశయానికి యన్.టి.ఆర్.
పేరుకు బదులు వై.యస్.
పేరు పెట్టి ఉంటే సముచితంగా ఉండేది.
టి.లక్ష్మీనారాయణ
No comments:
Post a Comment