Wednesday, July 5, 2017

జలాశయాల్లో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయ్!


1. కృష్ణా నదీకి 73% నీటి లభ్యత నైరుతీ రుతుపవనాల మీదే ఆధారపడి ఉన్నది. జూన్ మొదలు సెప్టంబరు వరకు నైరుతీ రుతుపవనాల ద్వారా లభించే వర్షపు నీటిని జలాశయాల్లో నిల్వ చేసుకొని వ్యవసాయానికి, త్రాగు నీటికి, జల విద్యుదుత్ఫాదనకు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించు కోవాలి. జూలై మొదటి వారంలో ఉన్నాం. జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన పది రోజుల కాలంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంత పరిథిలోని ముల్సీ డ్యాం, ఆల్మట్టి డ్యాం, తుంగభద్ర డ్యాం, ప్రకాశం బ్యారేజ్ లను సందర్శించే అవకాశం నాకు లభించింది.
2. కృష్ణా నదికి ఉపనది భీమా. భీమాకు ఉపనది ముల్సీ. పూనే సమీపంలోని 'ముల్సీ లేక్'ను జూన్ 25న సందర్శించాను. ఆ రోజు పూనేలో వర్షం లేదు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ‘ముల్సీ లేక్’ వద్ద మాత్రం వర్షం కురిసింది. జలకళతో తొణికిసలాడుతున్న ‘ముల్సీ లేక్’ ను వర్షంలో తడుస్తూ తిలకించి, పులకించే సదవకాశం లభించింది.
3. అత్యంత కీలకమైన ఆల్మట్టి జలాశయాన్ని జూన్ 29న సందర్శించాను. బస్సు దిగి 'డ్యాం' వైపు నడకసాగిస్తూ, అక్కడ వందల ఎకరాలల్లో నిర్మించబడిన మొగల్ గార్డన్స్, ఇటాలియన్ గార్డన్స్, రాక్ గార్డన్స్ తదితర ఉద్యానవనాలు వెదజల్లుతున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదిస్తూ, ‘సెల్ ఫీ’ మరియు కొత్త మిత్రుల సహకారంతో ఫోటోలు దిగాను. ఆల్మట్టి డ్యాంపైకి సందర్శకులను అనుమతించడం లేదు. జలాశయం 'బ్యాక్ వాటర్'ను చూడడానికి మాత్రమే అనుమతించారు. ఆల్మట్టి నీటి నిల్వ గరిష్ట సామర్థం 130 టియంసిలు అయితే, నేను వెళ్ళిన రోజు కేవలం 12 టియంసిలు ఉన్నాయి. జలాశయంలోకి నీటి ప్రవాహం 9,387 క్యూసెక్కులు. ఆ దృశ్యం చూశాక కాస్తా నిరుత్సాహం కలిగింది. ఆల్మట్టి ఎప్పుడు నిండుతుంది, దాని దిగువన 38 టియంసిల సామర్థ్యం కలిగిన నారాయణపూర్ జలాశయం ఎప్పుడు నిండుతుంది, జూరాల జలాశయంలోకి, శ్రీశైలం జలాశయంలోకి, అటుపై నాగార్జునసాగర్ జలాశయంలోకి ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తాయన్న ఆలోచన మనసును కలచి వేసింది.
4. కృష్ణా నదికి అత్యంత ప్రధానమైన ఉపనది తుంగభద్ర. శ్రీకృష్ణదేవరాయుల సామ్రాజ్యానికి కేంద్ర స్థానంగా వెలుగొందిన హంపికి జూలై 1న వెళ్ళాను. ఆ ప్రక్కనే ప్రవహిస్తున్న తుంగభద్ర నది మధ్యలో ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్ళపై కూర్చొని ఫోటోలు దిగి, ఉల్లాస పడ్డాను. ఆ బండ రాళ్ళ మధ్య కొద్ది పాటి నీరు ప్రవహిస్తున్నది. అక్కడి నుండి తుంగభద్ర జలాశయం వద్దకు వెళ్ళాను. వర్షపు జల్లుల మధ్య డ్యాం సందర్శన సంతృప్తినిచ్చింది. కానీ, 101 టియంసిల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్నతుంగభద్ర జలాశయంలో 4 టియంసిలు మాత్రమే ఉన్నాయి. కరవు కాటకాల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ప్రధాన నీటి వనరు తుంగభద్రా నది. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకు, అలాగే కొంత మేరకు కె.సి.కెనాల్ కు నీళ్ళు తుంగభద్ర నుండే సరఫరా కావాలి. గడచిన కొన్నేళ్ళుగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు తుంగభద్ర డ్యాం నుండి నీళ్ళు విడుదల చేయడం లేదనే ఆవేదన రాయలసీమ ప్రాంత ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్నది. గత ఏడాది 50 టియంసిలకు అటు ఇటుగా తుంగభద్ర డ్యాంలోకి నీళ్ళు చేరాయి. జలాశయంలోని ప్రస్తుత నీటి నిల్వ ఆందోళన కలిగిస్తున్నది.
5. జూలై 3న విజయవాడకు చేరుకొని, ‘మార్నింగ్ వాక్’ వెళ్ళినప్పుడు నిండుగా ప్రవహిస్తున్న ఏలూరు కాలువను చూశాను. క్రిష్ణా డెల్టా ఆయకట్టు సాగుకు ప్రస్తుతానికి కృష్ణా నదీ జలాలు అందుబాటులో లేవు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 216కు గాను 20 టియంసిలు, నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312కు గాను 117 టియంసిలు, పులిచింతల జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 46కు గాను 2 టియంసిలు ఉన్నాయి. ఈ మూడు జలాశయాలలోకి వర్షపు నీటి ప్రవాహం నేడు లేదు.
శ్రీశైలం జలాశయం నుండి  రాయలసీమ ప్రాంతంలో పాక్షికంగా నిర్మాణం పూర్తి అయిన‌ ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సృజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలంటే 854 అడుగుల కనీస నీటి మట్టం ఉంటే తప్ప సాధ్యపడదు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. 834 అడుగుల మట్టానికి నీరు పడిపోతే త్రాగు నీటికి తప్ప నీటిని వినియోగించడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుతం 779 అడుగులకు నీటి మట్టం చేరుకొన్నది.
నాగార్జునసాగర్ లో గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. నీటి మట్టం 510 అడుగులకుపైన ఉంటే తప్ప క్రిష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయరు. ప్రస్తుతం 501 అడుగుల నీటి మట్టం వరకే నీరుంది.
ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 130కి గాను 31 టియంసిలు, జలాశయంలోకి నీటి ప్రవాహం 40,547 క్యూసెక్కులు. నారాయణపూర్ గరిష్ట నీటి నిల్వ 38కి గాను 15 టియంసిలు ఉన్నాయి. తుంగభద్రలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101కి గాను 8 టియంసిలు ఉన్నాయి. నేను తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్ళిన జూలై 1న‌ జలాశయంలోకి నీటి ప్రవాహం 14,573 క్యూసెక్కులుగా ఉంటే ఆ ప్రవాహం కాస్తా జూలై 5 నాటికి 9,256 క్యూసెక్కులకు తగ్గి పొయింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో జూలై 5 నాటి గణాంకాల మేరకు వివిధ జలాశయాలల్లోని నీటి నిల్వలను పరిగణలోకి తీసుకొంటే కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఉన్న జలాశయాలు నిండేదెప్పుడు, తెలుగు రాష్ట్రాలకు నీళ్ళొచ్చేదెప్పుడు అన్న ప్రశ్న అనివార్యంగా ఉద్భవిస్తుంది.
6. గోదావరి నదికి కూడా నైరుతీ రుతుపవనాల ద్వారానే అత్యధిక నీరు లభిస్తుంది. ధవళేశ్వరం ఆనకట్టకు పైభాగంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడి ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తక్కుగా ఉన్నాయి. అయినా, గోదావరి నది దిగువ ప్రాంతంలో వర్షపు నీరు పుష్కలంగా లభిస్తున్నది. ధవళేశ్వరం ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2.93 టియంసిలు.ఆ మేరకు నీటిని నిల్వ చేసి, గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా 88,265 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం ఆనకట్ట నుండి క్రిందికి వదిలేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో పొందు పరచిన గణాంకాలను బట్టి ఈ రోజు ప్రకాశం బ్యారేజీలోకి 7,668 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ఇందులో అత్యధిక భాగం పట్టిసీమ‌ ఎత్తి పోతల  ద్వారా తరలిస్తున్న గోదావరి నీరే.
7. జూలై మొదటి వారం గడచిపోతున్నా కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా ఉంటే, గోదావరి నది నీరు సముద్రం పాలౌతున్నది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోలేం. పోలవరంతో సరిసమానంగా ప్రాధాన్యతనిచ్చి రాయలసీమ ప్రాంతంలోను, ప్రకాశం జిల్లాలోను నిర్మాణంలో ఉన్న ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ‌ ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప కరవు సీమ దాహార్తి తీర్చడం సాధ్యం కాదు.

టి.లక్ష్మీనారాయణ‌

Saturday, July 1, 2017

పరోక్ష పన్నుల వ్యవస్థ - మౌలిక మార్పులు: జి.ఎస్.టి



1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 17 రకాల పరోక్ష పన్నులను ప్రజలపై మోపి అడ్డగోలుగా దోపిడీ చేసేవి. పర్యవసానంగా బహుళ పన్నుల వ్యవస్థ పట్ల దేశ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో “ఒకే దేశం - ‍ ఒకే మార్కెట్ - ఒకే పన్నుల వ్యవస్థ” నినాదంతో వస్తు సేవల పన్ను(GST) చట్టం పట్టాలెక్కింది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తూ వచ్చిన‌ వాట్ వగైరా పన్నులన్నింటి స్థానంలో వస్తువుల ఉత్ఫత్తి, అమ్మకం, వినియోగం మరియు సేవలపై ఒకే పన్ను విధించే సమగ్ర జాతీయ విధానమే ఈ "గూడ్స్ & సర్వీసెస్ టాక్స్ (జి.ఎస్.టి.)". ఈ విధానాన్ని150 దేశాలకుపైగా అమలు చేస్తున్నాయని చెబుతున్నారు. మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ పునాదులపై నిర్మితమై ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి రాజ్యాంగం అనుమతించింది. రాజ్యాంగానికి 122వ సవరణ చేసి, నూతనంగా అమలులోకి తెచ్చిన జి.ఎస్.టి. విధానం కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను రాబడి పంపిణీలో హేతుబద్ధత,
సమతుల్యత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ పట్ల రాజ్యాంగబద్ధంగా వ్యవహరించక పోతే భారతీయ సమాజానికి తలనొప్పులు తప్పవు. కేంద్రం మీద ఆధారపడే దుస్థితి రాష్ట్రాలకు ఏర్పడితే, కేంద్ర - రాష్ట్ర సంబంధాలు దెబ్బతిని, దేశ సమైక్యతకే ముప్పు వాటిల్లుతుంది.

2. ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టిన 1990 దశకానికి ముందే 1986-87 ఆర్థిక సం.లో నాటి ఆర్థిక మంత్రి వి.పి.సింగ్ 'వ్యాట్' ను ప్రవేశ పెట్టడం ద్వారా జి.ఎస్.టి. విధానం వైపు మొదటి అడుగు వేశారు. అటుపై 1991 తరువాత నాటి ఆర్థిక మంత్రి డా. మన్మోహన్ సింగ్ 'సర్వీస్ టాక్స్' ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక సంస్కరణల యుగంలో జి.ఎస్.టి. విధానం అమలుపై దృష్టి మళ్ళింది. 2000 సం.లో అతల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని భావించి జి.ఎస్.టి.పై చర్చకు తెరలేపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. పాలన కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆనాడు జి.ఎస్.టి. పై భిన్నవైఖరి ప్రదర్శించినప్పటికీ నేడు ప్రధాన మంత్రిగా 'ఒకే దేశం - ఒకే మార్కెట్ - ఒకే పన్ను వ్యవస్థ' నినాదంతో అమలుకు పట్టుదలతో వ్యవహరించారు. పదిహేడు సంవత్సరాల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి, ఎట్టకేలకు స్థూల ఏకాభిప్రాయంతో వస్తు, సేవల పన్ను చట్టానికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. 2017 జూలై 1 నుండి అమలులోకి వచ్చింది.

3. దేశ ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేసే జి.ఎస్.టి. అమలు పర్యవసానాలు ఎలా ఉండబోతాయన్న అంశంపైనే ప్రజలు తర్జన భర్జన పడుతున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంలో పలు సందేహాలు, అనుమానాలు, ఆందోళనలు నెలకొని ఉన్నాయి. తొలి దశలో కొంత మేరకు ప్రతికూల ఫలితాలను చవి చూడక తప్పదని, అయితే, దేశానికి దీర్ఘకాలిక ఫలితాలు వనగూడుతాయన్న నిశ్చితాభిప్రాయాలను పలువురు ఆర్థిక నిపుణులు బలంగా వ్యక్తం చేస్తున్నారు.
నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదానికి అక్రమ మార్గంలో అందుతున్నకరెన్సీకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, రెండు, మూడు నెలలు ప్రజలు ఓపికతో సహకరిస్తే ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన చేయబడుతుందని దేశ ప్రజలకు నాడు మోడీ గారు గట్టి వాగ్ధానం చేశారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర సానుకుల, ప్రతికూల ఫలితాల అనుభవాలు అందరికీ విధితమే.
ఒకటి,రెండేళ్ళు క‌ష్ట నష్టాలను బరించడానికి సిద్ధమై ప్రజలు తోడ్పాటును అందిస్తే జి.ఎస్.టి. అమలుతో దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ గారు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన‌ వ్యాఖ్యల ద్వారా సమీప భవిష్యత్తులో ప్రజలపై పరోక్ష పన్నుల‌ భారం తగ్గదన్న సంకేతాన్ని విస్పష్టంగానే సెలవిచ్చినట్లుగా భావించవచ్చు.

4. ఆర్థిక సంవత్సరాన్ని కూడా జనవరి - డిసెంబరుగా మార్చబోతున్నారు. కాబట్టి కనీసం ఏడాదిన్నర(ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతో పాటు మరొక ఆర్థిక సంవత్సరం) కాలం వేచి చూస్తే తప్ప జి.ఎస్.టి. అమలు వల్ల దేశానికి, సామాన్య ప్రజలకు వనగూడిన ఆర్థిక ప్రయోజనాలను అంచనా వేయడం ఇప్పుడు కష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరోక్ష పన్నుల రాబడి పెరిగిందా? తగ్గిందా?, కార్పోరేట్ రంగం, పారిశ్రామిక, వాణిజ్య మరియు వ్యాపార వర్గాలకు లాభాలను పెంచిందా? తగ్గించిందా?, సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గిందా? పెరిగిందా? అన్నప్రశ్నలకు సమాధానం లభించాలంటే వేచి చూడాల్సిందే! తప్పదు.

5. జి.ఎస్.టి. అమలుతో స్థూల జాతీయోత్ఫత్తి(జిడిపి) ముందుకు ఉరకలు వేస్తుందని, ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని, వాణిజ్య మరియు వ్యాపార కార్యకలాపాలను సులభతరంగా నిర్వహించుకోవడానికి సానుకూల వాతావరణం నెలకొంటుందని, పర్యవసానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తాయని, పన్నులు ఎగవేసే వారి ఆటలు ఇహ! సాగవని, పన్నులు చెల్లించే వారి సంఖ్య అధికమై ప్రభుత్వాలకు పరోక్ష‌ పన్ను రాబడి బాగా పెరుగుతుందని, డిజిటలైజేషన్ విధానం అమలు వల్ల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, ద్రవ్యోల్భణానికి కళ్ళెంపడుతుందని, నిత్యావసర వస్తువుల‌ ధరలు తగ్గుతాయన్న భావనను ప్రభుత్వం ప్రజలకు కల్పించింది. ఆ లక్ష్యాలు నెరవేరుతాయా! లేదా! అన్నది ప్రభుత్వాలు అనుసరించే కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది.

6. సామాన్య, మధ్యతరగతి ప్రజలపైన సమీప భవిష్యత్తులో జి.ఎస్.టి. ప్రభావం ఎలా ఉండబోతుందన్న దానిపై మార్కెట్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న కొందరు నిపుణులు ఆచితూచి వ్యాఖ్యలు చేయడాన్ని గమనిస్తూనే ఉన్నాం. జి.ఎస్.టి. నూతన విధానం సామాన్య ప్రజలపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గిస్తుందన్న గ‌ట్టి బరోసా లభించడం లేదు. వినియోగదారుల ధరల సూచిక పరిథిలోకి వచ్చే 50% వస్తువుల ధరలపై పెద్దగా ప్రభావం ఉండక పోవచ్చని, 30% వస్తువుల ధరలు కొంత మేరకు పెరుగుతాయ‌ని, 20% వస్తువుల ధరలు బాగా పెరుగుతాయన్న అంచనాలు వేస్తున్నారు. పన్ను మినహాయింపు ఇచ్చిన ఆహార ధాన్యాలు, కొన్ని నిత్యావసర‌ వస్తువులను మినహాయించి, ప్రజలు వినియోగించుకొంటున్న 1200లకు పైగా వస్తువులు మరియు సేవలపై నాలుగు స్లాబుల్లో 5%, 12%, 18%, 28% మేరకు పన్నులు విధిస్తారు. ఈ జాబితాలోని 81% వస్తువులపై 18% లోపు పన్ను విధిస్తున్నారు. ఉదాహరణకు గతంలో 15% ఉన్న సేవా పన్నును 18%కి పెంచారు. అలాగే కొన్నింటి మీద తగ్గించారు.

7. దేశ ఆర్థిక వ్యవస్థకు ఒకనాడు వెన్నుముఖగాను, చాలా రాష్ట్రాలకు నేటికీ వెన్నెముఖగాను, దాదాపు 60% ఉపాథి కల్పనా రంగంగా ఉన్న వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. వ్యవసాయ ఉత్ఫత్తులపై పన్ను విధించలేదని గొప్పలు చెప్పుకొంటూ, వ్యవసాయ ఉత్ఫత్తులను ముడిసరుకుగా వినియోగించుకొని అదనపు విలువను జోడించి  ఉత్ఫత్తి చేసే వస్తువులపై(వ్యాల్యూ యాడెడ్ అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్) పన్ను విధిస్తున్నారు. ఉదా: చెరకు నుండి బెల్లం, పసుపు నుండి పసుపు పొడి, మిర్చి నుండి మిరప పొడి, పండ్ల నుండి పండ్ల రసాలు, ధాన్యం మరియు తృణ ధాన్యాలను సుభ్రం చేసి బ్యాండెడ్ ప్యాకెట్స్ గా తయారు చేస్తే పన్ను విధిస్తారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయట పడేయాలంటే వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. పన్ను రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన రంగాలపై పన్ను విధిస్తే ఆశించిన ఫలితాలు లభించవు.

గ్రామీణ చేతి వృత్తులైన చేనేత రంగం వంటి రంగాలు కూడా తీవ్ర సంక్షోభంలో జీవన్మరణ పోరు సాగిస్తున్నాయి. ఈ రంగాల్లోని అసంఘటిత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చేనేత‌ రంగానికి కావలసిన యార్న్, రంగులు, పనిముట్లపై పన్ను భారం మోపారు. చీమకుర్తి గ్రానైట్, తదితర క్వారీ పరిశ్రమపై కూడా భారం వేశారు. అత్యధికంగా ఉపాథి కల్పనా రంగాలుగా ఉంటూ సంక్షోభంలో ఉన్న  అసంఘటిత రంగాల పట్ల‌ ప్రత్యేక దృష్టి సారించడానికి బదులు పన్ను రాబడే ముఖ్యమనుకొంటే దుష్పలితాలను చవిచూడాల్సి వస్తుంది.

8. వస్తు సేవల పన్ను(GST), రాష్ట్రాల వస్తు సేవల పన్ను(SGST), విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వస్తువులు మరియు సేవలకు సంబధించిన పన్ను(Integrated GST) ఇలా వర్గీకరించబడిన GST పన్నుల వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఒకే దేశం - ఒకే మార్కెట్ - ఒకే పన్ను వ్యవస్థ అన్న నినాదం పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి సంక్లిష్టమైన వ్యవస్థగానే జి.ఎస్.టి. చట్టాన్ని రూపొందించారు. ద్రవ్యోల్బణానికి హేతువు పెట్రోల్ ఉత్ఫత్తులు. రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఆర్థిక వనరు కాబట్టి, వాటిపై పన్ను విధించే హక్కును వదులు కోవడానికి రాష్టాలు ఒప్పుకోలేదన్న సాకుతో జి.ఎస్.టి. పరిథి నుండి పెట్రోల్ ఉత్ఫత్తులను మినహాయించారు. అలాగే మద్యాన్ని, స్థిరాస్థి వ్యాపారాన్ని కూడా పక్కన బెట్టారు. ప్రజలపై పన్నులు, సెస్ ల రూపంలో ఆర్థిక భారాలు మోపి ప్రభుత్వ ఖజానాలను నింపు కోవడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నైజంగా నడచిన చరిత్రకు అంత సులభంగా ముగింపు పలుకుతారా! అన్న సందేహం లేక పోలేదు.

9. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా స్వదేశీ చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించు కోవడానికి ఆ రంగాల విదేశీ ఉత్ఫత్తుల దిగుమతులపై దిగుమతి సుంకం విధించడం ద్వారా నిర్ధిష్టమైన చర్యలను ప్రభుత్వం గతంలో తీసుకొనేది. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా ఆ రెగ్యులేషన్స్ ను ఎత్తి వేశారు. పర్యవసానంగా ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా విదేశీ వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మన దేశ మార్కెట్ లోకి వచ్చి పడుతున్నాయి. పర్యవసానంగా దుష్పలితాలను అనుభవిస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. ద్వారా నియంత్రణ చేస్తామంటున్నహామీ అమలు తీరు తెన్నులపై ఈ అంశం ఆధారపడి ఉన్నది.

10. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులో విస్పష్టంగా కేంద్రం జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అంశాలను పేర్కొన్నారు. కొన్ని రకాల పన్నులను కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని రకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు విధించే హక్కు కలిగి ఉండేవి. జి.ఎస్.టి. అమలులోకి వచ్చాక జి.ఎస్.టి. కౌన్సిల్ నిర్ణయాల మేరకే పన్నులు విధించాల్సి ఉంటుంది. జి.ఎస్.టి. కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా సభ్యుల పొందిక ఉండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈవాళ యన్.డి.ఎ. ప్రభుత్వం ఉండవచ్చు, భవిష్యత్తులో మరొక ప్రభుత్వం రావచ్చు, ఎవరున్నా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి అవకాశం కల్పించేలా జి.ఎస్.టి. కౌన్సిల్ సభ్యుల పొందిక ఉండడం సమర్థనీయం కాదు. జి.ఎస్.టి. సభ్యుల పొందిక విషయంలో సమతుల్యత సాధించాలి.

11.కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, అలాగే రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య భవిష్యత్తులో సమస్యలు ఉద్భవించవచ్చు. పన్నుల ఆదాయం వృద్ధిని 14% ను ప్రామాణికంగా పరిగణించి ఆపైన వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించదని, 14% లోపు ఉండే రాష్ట్రాలకు మాత్రమే ఏ మేరకు తగ్గితే ఆ మేరకు ఆదుకొంటుందని చెబుతున్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల ఆదాయం వృద్ధి రేటు 22%గా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే జి.ఎస్.టి. అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్నికేంద్రం భరించదన్న మాట. ఈ తరహా సమస్యలు అనేకం ఆచరణలో ఎదురు కాబోతున్నాయి. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జి.ఎస్.టి. కౌన్సిల్ వేదికగా చర్చల ద్వారా పరిష్కరించుకోవలసి ఉంటుంది.

12. కేంద్ర ప్రభుత్వం జి.ఎస్.టి. కౌన్సిల్ ను సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్యయుతంగా, ఏకాభిప్రాయ సాధనతో, సమిష్టి నిర్ణయాలతో, జవాబుదారితనంతో పని చేయించక పోతే కేంద్రం, రాష్ట్రాల మధ్య తగవులు మొదలౌతాయి. ప్రారంభం నుంచే నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలను సమర్థవంతంగా సమన్వయంతో కలుపుకు పోయినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. జి.ఎస్.టి. ద్వారా సమకూరే ఆదాయాన్ని ఏ నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసుకోవాలో స్పష్టత వచ్చినట్లు కనబడటం లేదు.

13. జి.ఎస్.టి. వ్యవస్థ పూర్తిగా సమాచార, సాంకేతిక వ్యవస్థ(ఐటి నెట్ వర్క్)పై ఆధారపడి నిర్మితమై ఉన్నది. మన దేశం ఐటి రంగంలో ముందడుగు వేస్తున్నా, ఇంకా బలమైన, పటిష్టమైన వ్యవస్థగా ఆవిర్భవించ లేదు. పెద్ద నోట్ల రద్దు తదనంతరం 'డిజిటలైజేషన్' వైపు ప్రయాణించాలని ప్రజలను ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఎలాంటి సమస్యలు ఎదురౌతున్నాయో గమనిస్తూనే ఉన్నాం. మౌలిక వసతులను విస్తరించుకొని, పటిష్టమైన భద్రతా వ్యవస్థను నెలకొల్పుకొంటే తప్ప జి.ఎస్.టి. విధానాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

14. వాణిజ్య, వ్యాపార రంగాల్లో, ప్రత్యేకించి చిల్లర వర్తక రంగంలో 'ఇ _ కామర్స్ బిజినెస్' సరవేగంగా పెరుగుతున్నది, ఇన్ టర్ నెట్ వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఏమేరకు ఉన్నదో కూడా పరిగణలోకి తీసుకోవాలి. పన్ను ఎగవేతకు అలవాటుపడ్డ అక్రమార్కులు 'ఇ_కామర్స్' విధానాన్నివాడుకొనే అవకాశమూ లేక పోలేదు. ‍ఇ_కామర్స్ విధానంలో ఏది వస్తువో! ఏది సేవో! నిర్వచించడంలోను, వ్యాపారస్తునికి - వ్యాపారస్తునికి మధ్య, వ్యాపారస్తునికి - వినియోగదారునికి మధ్య, వినియోగదారునికి - వినియోగదారునికి మధ్య సంబంధాలను నిర్వచించడంలోను కూడా సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.

15. బహుళ‌ పన్నుల వ్యవస్థ నుండి విముక్తి లభించడం స్థూలంగా సానుకూలాంశం. జి.ఎస్.టి. అమలులో ఎదురయ్యే సమస్యలను రాజ్యాంగం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా,  ప్రజానుకూల దృకథంతో పరిష్కరించుకొంటూ అడుగు ముందుకేస్తే సత్ఫ‌లితాలు వనగూడతాయి. సరళీకృత ఆర్థిక విధానాల నీతికి బానిసలై కార్పోరేట్ రంగం సేవలో నిమగ్నమై ఉన్న పాలకులు అదే బాటలో జి.ఎస్.టి. విధానం అమలులో కూడా నడక సాగిస్తే సామాన్యుల ఆశలు అడి ఆశలుగానే మిగిలి పోతాయి.

టి.లక్ష్మీనారాయణ‌