Wednesday, July 5, 2017

జలాశయాల్లో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉన్నాయ్!


1. కృష్ణా నదీకి 73% నీటి లభ్యత నైరుతీ రుతుపవనాల మీదే ఆధారపడి ఉన్నది. జూన్ మొదలు సెప్టంబరు వరకు నైరుతీ రుతుపవనాల ద్వారా లభించే వర్షపు నీటిని జలాశయాల్లో నిల్వ చేసుకొని వ్యవసాయానికి, త్రాగు నీటికి, జల విద్యుదుత్ఫాదనకు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించు కోవాలి. జూలై మొదటి వారంలో ఉన్నాం. జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన పది రోజుల కాలంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంత పరిథిలోని ముల్సీ డ్యాం, ఆల్మట్టి డ్యాం, తుంగభద్ర డ్యాం, ప్రకాశం బ్యారేజ్ లను సందర్శించే అవకాశం నాకు లభించింది.
2. కృష్ణా నదికి ఉపనది భీమా. భీమాకు ఉపనది ముల్సీ. పూనే సమీపంలోని 'ముల్సీ లేక్'ను జూన్ 25న సందర్శించాను. ఆ రోజు పూనేలో వర్షం లేదు. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ‘ముల్సీ లేక్’ వద్ద మాత్రం వర్షం కురిసింది. జలకళతో తొణికిసలాడుతున్న ‘ముల్సీ లేక్’ ను వర్షంలో తడుస్తూ తిలకించి, పులకించే సదవకాశం లభించింది.
3. అత్యంత కీలకమైన ఆల్మట్టి జలాశయాన్ని జూన్ 29న సందర్శించాను. బస్సు దిగి 'డ్యాం' వైపు నడకసాగిస్తూ, అక్కడ వందల ఎకరాలల్లో నిర్మించబడిన మొగల్ గార్డన్స్, ఇటాలియన్ గార్డన్స్, రాక్ గార్డన్స్ తదితర ఉద్యానవనాలు వెదజల్లుతున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదిస్తూ, ‘సెల్ ఫీ’ మరియు కొత్త మిత్రుల సహకారంతో ఫోటోలు దిగాను. ఆల్మట్టి డ్యాంపైకి సందర్శకులను అనుమతించడం లేదు. జలాశయం 'బ్యాక్ వాటర్'ను చూడడానికి మాత్రమే అనుమతించారు. ఆల్మట్టి నీటి నిల్వ గరిష్ట సామర్థం 130 టియంసిలు అయితే, నేను వెళ్ళిన రోజు కేవలం 12 టియంసిలు ఉన్నాయి. జలాశయంలోకి నీటి ప్రవాహం 9,387 క్యూసెక్కులు. ఆ దృశ్యం చూశాక కాస్తా నిరుత్సాహం కలిగింది. ఆల్మట్టి ఎప్పుడు నిండుతుంది, దాని దిగువన 38 టియంసిల సామర్థ్యం కలిగిన నారాయణపూర్ జలాశయం ఎప్పుడు నిండుతుంది, జూరాల జలాశయంలోకి, శ్రీశైలం జలాశయంలోకి, అటుపై నాగార్జునసాగర్ జలాశయంలోకి ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తాయన్న ఆలోచన మనసును కలచి వేసింది.
4. కృష్ణా నదికి అత్యంత ప్రధానమైన ఉపనది తుంగభద్ర. శ్రీకృష్ణదేవరాయుల సామ్రాజ్యానికి కేంద్ర స్థానంగా వెలుగొందిన హంపికి జూలై 1న వెళ్ళాను. ఆ ప్రక్కనే ప్రవహిస్తున్న తుంగభద్ర నది మధ్యలో ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్ళపై కూర్చొని ఫోటోలు దిగి, ఉల్లాస పడ్డాను. ఆ బండ రాళ్ళ మధ్య కొద్ది పాటి నీరు ప్రవహిస్తున్నది. అక్కడి నుండి తుంగభద్ర జలాశయం వద్దకు వెళ్ళాను. వర్షపు జల్లుల మధ్య డ్యాం సందర్శన సంతృప్తినిచ్చింది. కానీ, 101 టియంసిల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్నతుంగభద్ర జలాశయంలో 4 టియంసిలు మాత్రమే ఉన్నాయి. కరవు కాటకాల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ప్రధాన నీటి వనరు తుంగభద్రా నది. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకు, అలాగే కొంత మేరకు కె.సి.కెనాల్ కు నీళ్ళు తుంగభద్ర నుండే సరఫరా కావాలి. గడచిన కొన్నేళ్ళుగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు తుంగభద్ర డ్యాం నుండి నీళ్ళు విడుదల చేయడం లేదనే ఆవేదన రాయలసీమ ప్రాంత ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్నది. గత ఏడాది 50 టియంసిలకు అటు ఇటుగా తుంగభద్ర డ్యాంలోకి నీళ్ళు చేరాయి. జలాశయంలోని ప్రస్తుత నీటి నిల్వ ఆందోళన కలిగిస్తున్నది.
5. జూలై 3న విజయవాడకు చేరుకొని, ‘మార్నింగ్ వాక్’ వెళ్ళినప్పుడు నిండుగా ప్రవహిస్తున్న ఏలూరు కాలువను చూశాను. క్రిష్ణా డెల్టా ఆయకట్టు సాగుకు ప్రస్తుతానికి కృష్ణా నదీ జలాలు అందుబాటులో లేవు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 216కు గాను 20 టియంసిలు, నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312కు గాను 117 టియంసిలు, పులిచింతల జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 46కు గాను 2 టియంసిలు ఉన్నాయి. ఈ మూడు జలాశయాలలోకి వర్షపు నీటి ప్రవాహం నేడు లేదు.
శ్రీశైలం జలాశయం నుండి  రాయలసీమ ప్రాంతంలో పాక్షికంగా నిర్మాణం పూర్తి అయిన‌ ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సృజల స్రవంతి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలంటే 854 అడుగుల కనీస నీటి మట్టం ఉంటే తప్ప సాధ్యపడదు. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. 834 అడుగుల మట్టానికి నీరు పడిపోతే త్రాగు నీటికి తప్ప నీటిని వినియోగించడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుతం 779 అడుగులకు నీటి మట్టం చేరుకొన్నది.
నాగార్జునసాగర్ లో గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. నీటి మట్టం 510 అడుగులకుపైన ఉంటే తప్ప క్రిష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయరు. ప్రస్తుతం 501 అడుగుల నీటి మట్టం వరకే నీరుంది.
ఆల్మట్టి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 130కి గాను 31 టియంసిలు, జలాశయంలోకి నీటి ప్రవాహం 40,547 క్యూసెక్కులు. నారాయణపూర్ గరిష్ట నీటి నిల్వ 38కి గాను 15 టియంసిలు ఉన్నాయి. తుంగభద్రలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101కి గాను 8 టియంసిలు ఉన్నాయి. నేను తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్ళిన జూలై 1న‌ జలాశయంలోకి నీటి ప్రవాహం 14,573 క్యూసెక్కులుగా ఉంటే ఆ ప్రవాహం కాస్తా జూలై 5 నాటికి 9,256 క్యూసెక్కులకు తగ్గి పొయింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో జూలై 5 నాటి గణాంకాల మేరకు వివిధ జలాశయాలల్లోని నీటి నిల్వలను పరిగణలోకి తీసుకొంటే కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఉన్న జలాశయాలు నిండేదెప్పుడు, తెలుగు రాష్ట్రాలకు నీళ్ళొచ్చేదెప్పుడు అన్న ప్రశ్న అనివార్యంగా ఉద్భవిస్తుంది.
6. గోదావరి నదికి కూడా నైరుతీ రుతుపవనాల ద్వారానే అత్యధిక నీరు లభిస్తుంది. ధవళేశ్వరం ఆనకట్టకు పైభాగంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడి ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తక్కుగా ఉన్నాయి. అయినా, గోదావరి నది దిగువ ప్రాంతంలో వర్షపు నీరు పుష్కలంగా లభిస్తున్నది. ధవళేశ్వరం ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2.93 టియంసిలు.ఆ మేరకు నీటిని నిల్వ చేసి, గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా 88,265 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం ఆనకట్ట నుండి క్రిందికి వదిలేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో పొందు పరచిన గణాంకాలను బట్టి ఈ రోజు ప్రకాశం బ్యారేజీలోకి 7,668 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ఇందులో అత్యధిక భాగం పట్టిసీమ‌ ఎత్తి పోతల  ద్వారా తరలిస్తున్న గోదావరి నీరే.
7. జూలై మొదటి వారం గడచిపోతున్నా కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా ఉంటే, గోదావరి నది నీరు సముద్రం పాలౌతున్నది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోలేం. పోలవరంతో సరిసమానంగా ప్రాధాన్యతనిచ్చి రాయలసీమ ప్రాంతంలోను, ప్రకాశం జిల్లాలోను నిర్మాణంలో ఉన్న ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ‌ ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప కరవు సీమ దాహార్తి తీర్చడం సాధ్యం కాదు.

టి.లక్ష్మీనారాయణ‌

No comments:

Post a Comment