వి.కె. అన్న రెండక్షరాలు
చెవుల్లో ధ్వనించగానే అనిర్వచనీయమైన గాఢానుబంధంతో కూడిన అనుభూతులు మెదడులో కదలాడుతాయి.
వాటన్నింటినీ క్రోడీకరించి, అక్షర బద్దం చేయడం సాధ్యం కాని పని. నా స్మృతి పథంలోని
కొన్నింటిని ప్రస్తావించే ప్రయత్నమే ఇది. కమ్యూనిస్టు నైతికత, నిబద్ధత, నమ్రత, నడతకు
నిలువుటద్దం మా వి.కె. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాయకుడన్న దర్పాన్ని ప్రదర్శించడం,
కార్యకర్తలు మరియు క్రింది స్థాయి నాయకత్వంపై పెత్తనం చేసే మనస్తత్వం, పార్టీని స్వప్రయోజనాలకు
వినియోగించుకోవాలన్న ఆలోచన ఆయన దరికి చేరలేదు. వేదికలెక్కి ఉపన్యాసాలు దంచాలనే ఆసక్తి
కనబరచలేదు. తన ప్రసంగాల ద్వారా శ్రోతలను విసిగించనూ లేదు. కమ్యూనిస్టు శ్రేణులే ఆయన
కుటుంబం. అత్యంత వెనుకబడ్డ, నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంత ప్రజల గొంతు. శ్రామిక
ప్రజల నికార్సైన నేత. రాయలసీమ నాలుగు జిల్లాల కమ్యూనిస్టు శ్రేణుల అప్యాయతానురాగాలతో
పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కమ్యూనిస్టులు, మరీ ప్రత్యేకించి ఎ.ఐ.ఎస్.ఎఫ్. శ్రేణుల అభిమానాన్ని చూరగొన్న విలక్షణమైన వ్యక్తిత్వం ఆయనది.
కమ్యూనిస్టుగా సాదా సీదా జీవితాన్ని గడిపిన ధన్యజీవి. భావితరాలకు ఆదర్శప్రాయుడు.
కడప జిల్లా, చిట్వేలి ఉన్నత
పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.)లో
చేరి, కార్యకర్తగా ఎదిగాను. రాజంపేటలో ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకొని, 1975 జూన్ లో
తిరుపతి ఎస్.వి.ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులో చేరాను. అమరజీవి కామ్రేడ్. వి.కె.
గారు భారత కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్ర బాధ్యులుగా చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాన్ని'గైడ్'
చేయడానికి తిరుపతికి వస్తుండే వారు. మృదు స్వభావి. కార్యకర్తలు, నాయకులు అన్నతారతమ్యం
లేకుండా అందరితో కలిసి పోయే వారు. విద్యార్థి రంగం నుండి నేను జిల్లా కమ్యూనిస్టు సమితి
సమావేశాలకు హాజరయ్యే వాడిని. ప్రపంచ పరిణామాలపై సోవియట్ యూనియన్ మరియు ఇతర సోషలిస్టు
దేశాల ప్రభావం గణనీయంగా ఉండే రోజులు. దేశ రాజకీయాలపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉండేది.
రాష్ట్ర పార్టీ బాధ్యులుగా సమావేశాలకు హాజరయ్యే నాయకులు మొదట అంతర్జాతీయ పరిణామాలతో
మొదలు పెట్టి, జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాలపై 'రిపోర్టు' ఇచ్చేవారు. రాజకీయ రిపోర్టు
విని, నూతన విశేషాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస సభ్యుల్లో ఉండేది. అంకిత భావంతో దశాబ్ధాలుగా
పార్టీలో పని చేస్తున్న పలువురు పెద్దలు జిల్లా సమితిలో సభ్యులుగా ఉండేవారు. వారిలో
దాదాపు అరడజను మంది వరకు ఏళ్ళ తరబడి గ్రామ సర్పంచ్ లుగా ఉంటూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్న
సీనియర్ కామ్రేడ్స్ కూడా ఉండే వారు. కామ్రేడ్స్ మధ్య ఉండాల్సిన ఆప్యాయతానురాగాలు వారి
మధ్య నిండుగా ఉండేవి. వారంతా అత్యంత ఆసక్తితో సమావేశాలకు హాజరయ్యే వారు.
జిల్లా కమ్యూనిస్టు సమితి
కార్యదర్శిగా అమరజీవి కా. గంధమనేని శివయ్య గారు బాధ్యతలు నిర్వహిస్తుండే వారు. ఆయన
సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉపోద్ఘాతం మొదలు పెట్టి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై
సుదీర్ఘంగా మాట్లాడే వారు. అధికార పార్టీలోని ఆంతరంగికుల ద్వారా డిల్లీ నుండి మద్రాసు
మీదుగా తన చెవికి నేరుగా చేరిన సమాచారం అంటూ చెప్పుకొచ్చే వారు. వి.కె.గారితో సహా అందరూ
ఆసక్తిగా వినేవాళ్ళు. ఇంతలో మధ్యాహ్న భోజనానికి సమయం సమీపించేది. ఏంటి శివయ్యా! భోజనం
'టైం' అయ్యిందే! వి.కె. గారు రాజకీయ రిపోర్టు ఎప్పుడిచ్చేది? అని కొందరు సీనియర్ కామ్రేడ్స్
గుర్తు చేసే వారు. హైదరాబాదు విశేషాలు తప్ప ఆయనకేం తెలుసప్పా! అని శివయ్య గారు 'జోక్'
చేసే వారు. శివయ్య గారు మాజీ శాసన సభ్యులు. పాలక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా
ప్రముఖ నాయకుల్లో కొందరు శివయ్య గారికి మంచి మిత్రులుండే వారు. వారి ద్వారా డిల్లీలో
జరిగే రాజకీయ పరిణామాలు(గాసిప్స్) ఆయన చెవికి చేరేవి. వాటిని గుదిగుచ్చి రాజకీయ నివేదికగా
వినిపించే వారు. శివయ్య చెప్పింది నిజమేనప్పా! ఆయనకున్నంత ఆంతరంగికమైన సమాచారం నాకు
లేదని వి.కె. గారు సరదాగా వ్యాఖ్యానించే వారు. దాంతో అందరూ భోజనాలకు లేచి వెళ్ళేవాళ్ళు.
భోజనానంతరం ఎవరి దారిన వాళ్ళు వూళ్ళకు వెళ్ళి పోయేవారు. పెద్ద వాళ్ళు, బస్సులు పట్టుకొని,
చీకటి పడక ముందే వాళ్ళ గ్రామాలకు చేరుకోవాలి కదా! ప్రతిసారి ఇలానే జరిగేది. అయినా కా.వి.కె.
గారు కానీ, సమితి సభ్యులు కానీ విసుగు చెందే వారు కాదు, సరదాగా 'కామెంట్' చేస్తూ సమావేశానికి
హాజరయ్యామన్న సంతృప్తితో వెళ్ళి పోయే వారు. నేను ఇంత దూరం నుంచి శ్రమపడి వచ్చానే, హాజరైన
సభ్యులందరూ ఉండగా రాజకీయ రిపోర్టు ఇవ్వలేక పోయానన్న కొద్ది పాటి చిరాకు కూడా వి.కె.గారి
ముఖకవళికల్లో నేను ఏనాడు గమనించ లేదు. అంతే! అలా జరిగి పోయేది.
నదీ జలాల సమస్యలపై అధ్యయనం
చేయాలన్నఆసక్తి నాకు కలగడానికి వి.కె.గారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రాయలసీమ కరవు
నివారణకు కృష్ణా జలాల మళ్ళింపే శాశ్వత పరిష్కారమన్న నినాదంతో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన
ఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో కూడా పలు ఆందోళనా కార్యక్రమాలను
నిర్వహించాం. 1977 నవంబరు 20న "రాయలసీమ సమగ్రాభివృద్ధికి యువజన - విద్యార్థి
సదస్సు"ను తిరుపతిలో నిర్వహించాం. దానికి కా.నీలం రాజశేఖరరెడ్డి గారు ముఖ్యఅతిథిగా
హాజరైనారు. రాయలసీమకు కృష్ణా నదీ జలాలను మళ్ళించాలన్న ప్రధానమైన డిమాండుతో 1980 ఆగస్టు
25న హైదరాబాదులో వేలాది మందితో ప్రదర్శన నిర్వహించాం.
1981 డిసెంబరులో ఎ.ఐ.ఎస్.ఎఫ్.
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోబడి హైదరాబాదుకు మకాం మార్చాను. పార్టీ రాష్ట్ర కార్యదర్శి
కా. గిరిప్రసాద్ గారిని కలవడానికి ఆయన గదిలోకి వెళ్ళాను. నన్ను చూడగానే రండి లక్ష్మీనారాయణ
గారు అని సంబోధించారు. ఆ మాట వినగానే వెంటనే వెనుదిరిగాను. ఏంటి వెళ్ళిపోతున్నారు,
రండి, కూర్చోండని పిలిచారు. గిరిప్రసాద్ గారి వైపు తిరిగి మీరు పెద్ద వారు, నన్ను బహువచనంతో
సంబోధించడం నాకు నచ్చలేదు, మా వి.కె. గారి లాగా ఏకవచనంతో పిలవండి అన్నాను. ఏరా, రా,
ఎలా ఉన్నావ్, ఎప్పుడొచ్చావ్, అన్న పలకరింపుల్లో ఉన్న ఆప్యాయత, అనురాగం, సాన్నిహిత్యం
యొక్క మాధుర్యాన్ని వి.కె. గారి నుండి ఆస్వాధించాను.
విద్యార్థి రంగానికి రాష్ట్ర పార్టీ బాధ్యులుగా కా.వి.కె.
గారు ఉండే వారు. ఆయన పార్టీ 'ఇన్ ఛార్జ్'గా ఉండడంతో నాకు కొండంత ధైర్యంగా ఉండేది. కార్యక్రమాల
రూపకల్పనలో సలహాలు ఇవ్వడం తప్ప, అవసరానికి మించి జోక్యం చేసుకొనే వారు కాదు. ఎ.ఐ.ఎస్.ఎఫ్.
రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ, ప్రోత్సాహం వి.కె. గారి నుండి లభించేది. విద్యార్థి
ఉద్యమ విస్తరణ, పటిష్టత, సైద్ధాంతిక శిక్షణ, నాణ్యమైన కార్యకర్తల తయారీ, పని విభజన,
బాధ్యతల అప్పగింత, నియంత్రణ, జవాబుదారీతనం, విద్యార్థుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి
కేంద్రీకరించి, సలహాలిస్తూ వెన్నంటి ఉండేవారు. ముఖ్యమైన జిల్లాలలో, వివిధ ప్రాంతాలలో
నిర్వహించబడిన సమావేశాలు, వర్క్ షాప్స్, సదస్సులకు మాతో పాటు హాజరయ్యే వారు. ఉపన్యాసాలు
ఇవ్వడానికి కాదు సుమా! జిల్లాల పార్టీ నాయకత్వాల సహకారాన్ని విద్యార్థి ఉద్యమానికి
అందేలా చూడడానికి, పూర్తి కాలం లేదా పాక్షికంగా సమయాన్ని వెచ్చించి పని చేస్తున్న కార్యకర్తల
ఎంపిక, నియామకం, వారికి అవసరమైన ఆర్థిక సహకారంపై పార్టీ నాయకత్వాలతో చేసే సమాలోచనల్లో
క్రియాశీలంగా తోడ్పాటునందించడాని మా వెన్నంటి ఉండే వారు.
ఇక్కడొక ఘటనను ప్రస్తావించడం
సముచితంగా ఉంటుందను కొంటున్నాను. పదవ తరగతి పరీక్షా ఫలితాల జాప్యాన్ని, కంపూటర్ల అవకతవకలను
నిరసిస్తూ సచివాలయం ముందు పికెటింగ్ చేయాలని ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర సమితిలో చర్చించిన
మీదట నిర్ణయించాo. 1984 జూన్ 22న ఎవరికి వారు విడివిడిగా వెళ్ళి సచివాలయంకు ఎదురుగా
ఉన్న బ్రిటీష్ లైబ్రరీలోను, ప్రక్కనున్న టీ హోటల్, వాటి పరిసరాలకు చేరుకొని, ఒక్కసారిగా
'మెయిన్ గేట్' ముందుకు దూసుకు పోయి పికెటింగ్ చేయాలని వ్యూహాన్ని రచించుకొని, ఆ మేరకు
అమలు చేశాం. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమితి సభ్యులందరూ పాల్గొన్నారు. పోలీసుల కన్నుకప్పి
సచివాలయం ముందు పికెటింగ్ చేయడంతో కంగుతిన్న పోలీసులు కసికొద్దీ లాఠీలకు పని చెప్పారు.
కొంత మందికి తలలపై గాయాలై, రక్తంతో తడిసి పోయారు. లాఠీ చార్జీలో నాతో పాటు పలువురు
తీవ్రంగా గాయపడ్డారు. అందర్నీ అరెస్టు చేసి అసెంబ్లీకి ఎదురుగా ఉన్న పోలీస్ కంట్రోల్
రూమ్ కు తరలించి, నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, లోపల పెట్టారు. విశాలాంధ్ర విలేకరి
కా.నర్సింగ్ ఈ సమాచారాన్నిరాష్ట్ర పార్టీ కార్యదర్శి కా.గిరిప్రసాద్ గారికి చేరవేసి,
మీరు జోక్యం చేసుకొంటే గానీ పోలీసులు విడుదల చేయరని చెప్పారట. ఆయన మొదట కాస్త అసహనం
వ్యక్తం చేసినా అటుపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఫలితంగా మేము విడుదలై, మగ్ధూం భవన్
కు ఆ రోజు రాత్రి పొద్దుపోయాక చేరుకొన్నాం.
మరుసటి రోజు ఉదయాన్నే గిరిప్రసాద్
గారు నన్ను పిలిచి, ఎందుకు అలా చేశారని అడిగారు. రాష్ట్ర సమితి చేసిన సమిష్టి నిర్ణయం
మేరకే పికెటింగ్ చేశామని చెప్పా. కా.వై.బాబురావు(ఆనాటి రాష్ట్ర అధ్యక్షులు)ను కూడా
అడిగి తెలుసుకోమని, ఆయన్ను కూడా పిలిచా. కా. వి.కె. గారి సమక్షంలోనే చర్చించి తీసుకొన్న
నిర్ణయమని చెప్పా. వి.కె. గారి మద్ధతు కూడా ఉందన్న మాట. ఈ తరహా ఆందోళనల వల్ల జరిగే
ప్రయోజనమేంటి? అని అడిగితే, జరిగిన లాఠీ చార్జీపై రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు
స్పందించి పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకొంటారని చెప్పా. అలాగే, రాష్ట్ర వ్యాపితంగా తీవ్ర
స్థాయిలో సమ్మె జరిగింది. పదుల వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వి.కె. గారు
మాకు మద్ధతుగా నిలిచారు. ఆందోళన వల్ల వచ్చిన సత్ఫలితాలను గమనించాక గిరిప్రసాద్ గారు
అభినందించారు. అలాంటి పరీక్షా సమయాల్లోనే నాయకులు నికార్సుగా కార్యకర్తలకు వెన్నుదన్నుగా
నిలవాలి, ప్రోత్సహించాలి. వి.కె. గారు ఆచరణలో అలాగే చేసే వారు. ఇది ఒక నిర్ధిష్టమైన
ఉదాహరణ మాత్రమే.
రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా
కార్యక్రమాలను జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పాఠశాలలను ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో
నిర్వహించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాం. ఒకసారి అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్
రిజర్వాయర్(పిఎబిఆర్) వద్ద రాయలసీమ ప్రాంతీయ శిక్షణా శిబిరాన్ని నిర్వహించాం. ఒక పూట
పొట్టేలు మాంసం వడ్డించారు. మాంసం కూరలో నూనె, ఎర్రటి కారం బాగా దట్టించి వేసి చేశారు.
చిత్తూరు జిల్లా నుండి వచ్చిన విద్యార్థి కార్యకర్తలకు ఆ మాంసం తింటుంటే నాలుకలు మండి
పోయాయి. కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి నీళ్ళు కారి పోతున్నాయి. దాంతో మాంసం ముక్కలను
గ్లాసుల్లోని నీళ్ళతో కడుక్కొని తిన్నారు. ఆ దృశ్యాన్ని గమనించి, ఆ మాత్రం కారం తినలేని
మీరేం రాయలసీమోళ్ళురా! పౌరుషం ఎలా వస్తుందని వి.కె. గారు వ్యాఖ్యానిస్తే, వాళ్ళు ముసిముసి
నవ్వులతో పంటి బిగువున ఆ కూరను తిన్నారు.
సమావేశాల్లో చర్చల సందర్భంగాను,
పిచ్చాపాటిగా మాట్లాడే సందర్భాలలోను కార్యకర్తలను ఏరా! అప్పెంతుంది? అని అడిగే వారు.
అప్పు లేదంటే, ఎంత అప్పు ఉంటే అంత బాగా కార్యక్రమాలు చేస్తున్నట్లు లెక్కని సరదాగా
వ్యాఖ్యానించే వారు. ఒకసారి నా విద్యార్థి ఉద్యమ సహచరుని పెళ్ళికి ఇద్దరం వరంగల్ వెళ్ళాం.
ఆశీర్వదించడానికి ఆయనతో పాటు వేదికెక్కుతుంటే, రేయ్! నీకు పెళ్ళి కాలేదు, ఆశీర్వదించే
అర్హత నీకు లేదన్నారు. అలా సరదాగా జోకులు వేస్తూ మాలో ఒకరుగా కలిసి పోయే వారు.
1985 డిసెంబరులో ఎ.ఐ.ఎస్.ఎఫ్.
జాతీయ మహాసభను గుంటూరులో నిర్వహించాం. జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతను స్వీకరించాలన్న
ప్రతిపాదనను పార్టీ నాయకత్వం నా దృష్టికి తీసుకొచ్చింది. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.
ఆ విషయాన్ని వి.కె. గారికి ఫోన్ ద్వారా తెలియజేశాను. జాతీయ స్థాయిలో విద్యార్థి ఉద్యమానికి
నాయకత్వం వహించే సామర్థ్యం లేదని, తెలుగులో తప్ప ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో మాట్లాడడం
రాదని, నన్ను రక్షించండని మొరపెట్టు కొన్నాను. అంతా విని, ఆయన ఒక్కటే మాట అన్నారు.
అది పార్టీ నిర్ణయం. నీవు పార్టీలో ఉండదలుచుకొంటే అంగీకరించక తప్పదు. ఒకసారి గిరి గారితో
కూడా మాట్లాడు అన్న సలహా ఇచ్చారు. అటుపై గిరి గారితో మాట్లాడాను. కేంద్ర పార్టీ నిర్ణయాన్నిమార్పించ
లేనని కరాకండిగా చెప్పేశారు. దాంతో విధిలేక అంగీకరించి, డిల్లీకి వెళ్ళాను. జాతీయ పార్టీ
నుండి విద్యార్థి రంగ బాధ్యులుగా కా.ఎ.బి.బర్ధన్, పార్టీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్
బాధ్యులుగా కా. నీలం రాజశేఖరరెడ్డి గారు ఉండే వారు. వారిరువురి సహాయ సహకారాలు, రాష్ట్రంలో
వి.కె. గారి తోడాటుతో నెట్టుకొచ్చేశాను. విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో నాకు వెన్నుదన్నుగా
కా.వి.కె. గారు నిలిచారు.
విద్యార్థి ఉద్యమం నుంచి
సెలవు పుచ్చుకొన్నాక కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాలుపంచు కోవాలన్నతలంపుతో
1991లో కడపకు చేరుకొన్నాను. రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద దిక్కుగా వి.కె.
గారు కడప జిల్లా సమావేశాల్లో పాల్గొనే వారు. చిత్తూరు జిల్లాకు భిన్నమైన వాతావరణంలో
కడప జిల్లా సమావేశాలు జరిగేవి. రాష్ట్ర బాధ్యులుగా హాజరైన కా.వి.కె. గారి రాజకీయ రిపోర్టును
సమావేశం ప్రారంభంలోనే చాలా శ్రద్ధగా వినేవారు. రాజకీయ నివేదిక ఇవ్వడంతో
నా పని అయిపోయిందనుకోకుండా సభ్యులు వ్యక్తం చేసే అభిప్రాయాలను అత్యంత శ్రద్ధగా ఆలకించి,
స్పందించే గుణం ఆయనది.
ఎ.ఐ.ఎస్.ఎఫ్. మరియు కమ్యూనిస్టు
ఉద్యమాల ద్వారా వి.కె.గారితోను, ఆయన కుటుంబ సభ్యులతోను ఏర్పడిన అనుబంధం అమూల్యమైనది.
వి.కె. గారి సతీమణి శ్రీమతి పార్వతమ్మ పలకరింపు, ఆతిథ్యంలో తల్లి వాత్సల్యం తొణికిసలాడుతుంది.
ఆయన సోదరి అమరజీవి పార్వతమ్మ గారు మహిళా ఉద్యమ నేతగా రాణించారు. ఆయన ఆయన సోదరుల కుమారులు
వి.కె.వెంకట్రామిరెడ్డి గారు తాడిపత్రి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో క్రియాశీల
పాత్ర పోషించడమే కాకుండా విద్యార్థి దశలో కా.కొల్లి నాగేశ్వరరావు సహచరుడుగా ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో
పని చేశారు. స్వగ్రామానికే పరిమితమై పని చేసినా విశ్వనాథరెడ్డి గారి కృషిని విస్మరించలేం.
వి.కె.రంగారెడ్డి గారు ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఉద్యమ నిర్మాణంలో నాకు సహచరుడు. 1978 డిసెంబరులో
నాటి జనతా ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బంద్ నిర్వహిస్తే,
అందులో బి.టి.కళాశాల విద్యార్థులు పాల్గొనక పోవడంపై ఆగ్రహించిన స్థానిక శాసనసభ్యుడు
విద్యార్థులపై కాల్పులు చేసిన ఘటనలో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడి, చెయ్యి కోల్పోయాడు.
ఆ కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా 45 రోజుల పాటు ఉధృతమైన పోరాటాన్ని నిర్వహించాం. ఆ ఉద్యమానికి
నాయకత్వం వహించిన కార్యాచరణ కమిటీకి నేను కన్వీనర్ గా వ్యవహరించాను. వి.కె.రంగారెడ్డి
గారు మదనపల్లి సబ్ జైల్ లో 15 రోజులు నిర్భందించబడ్డారు. నేను రెండు రోజులు ఆ జైల్
లో నిర్భందించబడ్డాను. నేను ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన
కాలంలో వెంకట్రామిరెడ్డి గారి కుమార్తె రాధమ్మ, కుమారుడు ప్రదీప్ ఎ.ఐ.ఎస్.ఎఫ్.లో క్రియాశీలంగా
పని చేశారు. అలా కా.వి.కె.గారి కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై పని చేసింది.
వి.కె.గారి కుటుంబానికి చెందిన మూడు తరాల సభ్యులతో ఉద్యమ రీత్యా, వ్యక్తిగతంగా నాకు
ఏర్పడిన అనుబంధం కమ్యూనిస్టు ఉద్యమం నాకిచ్చిన ఒక అపురూపమైన కానుక. అమరజీవి కా.వి.కె.
గారు నేడు భౌతికంగా లేక పోయినా నాలాంటి వారికి నేటికీ మార్గదర్శే.
టి.లక్ష్మీనారాయణ
No comments:
Post a Comment