Monday, August 26, 2024

మంగంపేట బెరైటీస్ అవినీతి కుంభకోణంపై ముఖ్యమంత్రికి లేఖ

 శ్రీ నారా చంద్రబాబునాయుడు

ముఖ్యమంత్రి,
అమరావతి, ఆంధ్రప్రదేశ్

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారికి,

విషయం: మంగంపేట బెరైటీస్ అవినీతి కుంభకోణంపై విచారణను సత్వరం పూర్తి చేసి - అవినీతి తిమింగలాలను కఠినంగా శిక్షించండి. "బెరైటీస్" ఖనిజాధార పరిశ్రమలను నెలకొల్పి - స్థానికులకు ఉపాధికల్పించమని విజ్ఞప్తి.

1. ఈనెల 23వ తేదీన నేను రైల్వే కోడూరుకు వెళ్ళిన సందర్భంగా మంగంపేట గనులకు చెందిన కార్మికులు మరియు లారీ యజమానుల ప్రతినిధులు కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మీ దృష్టికి తీసుకొచ్చి, సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనికోరడం నా బాధ్యతగా భావించి, ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

2. మంగంపేట బెరైటీస్ అవినీతి కుంభకోణంపై విచారణను వేగవంతం చేసి, సత్వరం పూర్తి చేసి, "ముగ్గురాయి మాఫియా గ్యాంగ్" అవినీతిని బట్టబయలు చేసి, అవినీతిపరులను కఠినంగా శిక్షించి, వారు అక్రమార్జన ద్వారా పోగేసుకున్న వందల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు చేర్చాలని, మంగంపేట గనులను రక్షించి - దోపిడిని అరికట్టాలని, ఖనిజ రవాణాను త్వరితగతిన పునరుద్ధించి, ఉపాధి కోల్పోయిన వేలాది మంది అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

3. 1961లో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీయండిసి)ను ఏర్పాటు చేశారు. 1974 నుండి మంగంపేట "గ్రే బెరైటిస్" ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ముడిసరుకుగా "గ్రే బెరైటిస్" రాయిని లేదా పౌడర్ చేసి 30 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది "పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్" పరిశ్రమల్లో వినియోగించే కీలకమైన ఖనిజం. ప్రపంచంలోనే నాణ్యమైన ఖనిజం. అంతర్జాతీయంగా 25% అవసరాలను మన మంగంపేట గనులు తీరుస్తున్నాయి. 74 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటికి దాదాపు 40 మిలియన్ టన్నుల ఖనిజాన్ని వెలికి తీశారు. బెరైటీస్ ను ఏ, బి, సి, గ్రేడ్స్ గా వర్గీకరించారు. ఏడాదికి దాదాపు 3 మిలియన్ టన్నుల ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 2022 - 23లో రూ.1,000 కోట్ల ఆదాయం వనగూడిందని అధికారికంగానే వెల్లడించారు.

4. అంతర్జాతీయ మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న, అత్యంత విలువైన, ప్రతిష్టాత్మకమైన బెరైటీస్ ఖనిజ సంపదను ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు కొల్లగొట్టి, సంపన్నులై, ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలను డబ్బుమయం చేసి, తమగుప్పెట్లో బంధించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రశాంతంగా ఉన్న రైల్వే కోడూరు ప్రాంతంలో హత్యారాజకీయాలను ప్రవేశపెట్టి, సర్వనాశనం చేశారు. మంగంపేట బెరైటీస్ గనుల వల్ల ఆ ప్రాంతానికి జరగవలసిన ప్రయోజనాలు మాత్రం వనగూడలేదు. అవినీతి, అక్రమంగా సబ్ - లీజులు, తవ్వకాలు, రవాణా, విదేశాలకు ఎగుమతి ద్వారా ప్రయివేటు యజమానులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సిన సంపదను కొల్లగొట్టారు.

5. వై. యస్. రాజారెడ్డితో మొదలైన గరానా దోపిడి నేటి వరకు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నది. గత ప్రభుత్వ కాలంలో "ఏ గ్రేడ్" ఖనిజాన్ని బి గ్రేడ్, సి గ్రేడ్ గా నమోదు చేయడం, ఖనిజం రవాణా చేసే సందర్భంలో తూకం వేయడంలోను మరియు వాహనాల సంఖ్య నమోదులోను పెద్ద ఎత్తున అక్రమాలకు పాలడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏపీయండిసి సంస్థలో తాత్కాలిక ఉద్యోగులుగా వందల మందిని అక్రమ పద్ధతుల్లో నియమించి, వారి ద్వారా అవినీతి పనులను యధేచ్చగా సాగించారన్న ఆరోపణలు ఉన్నాయి.

6. ఆ ప్రాంత వాసిగా, మంగంపేట గనుల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్రకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్నది. మంగంపేట గనుల నుండి ముగ్గురాయిని కోడూరు రైల్వే స్టేషన్ దగ్గరలోని గోడౌన్స్ కు రవాణా చేసే గనుల యాజమానుల వాహనాలను వేగంగా, అడ్డదిడ్డంగా నడిపి విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనలకు వ్యతిరేకంగా 1978లోనే విద్యార్థులకు నాయకత్వం వహించి ఆందోళన చేయడంతో మొదలుపెట్టి మంగంపేట మైన్స్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడుగా ఉండి ప్రభుత్వ రంగంలో మంగంపేట గనుల పరిరక్షణ, ప్రయివేటు యాజమాన్యాల దోపిడీకి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేసిన అనుభవం కూడా నాకు ఉన్నది. మంగంపేట బెరైటీస్ గనుల్లో మాఫియా దోపిడీకి అంతం పలకాలని, "బెరైటీస్" ఖనిజాధార పరిశ్రమలను నెలకొల్పి - స్థానికులకు ఉపాధికల్పించమని విజ్ఞప్తి చేస్తున్నా.

7. మీరు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే, 2024 జూలై మొదటి వారంలో విజయవాడలోని గనుల శాఖ కార్యాలయంలో "పైల్స్, హార్డ్ డిస్క్"లను తగలబెట్టారు. ఇసుక, మంగంపేట బెరైటీస్, చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చిన పూర్వరంగంలో "పైల్స్, హార్డ్ డిస్క్"లను తగలబెట్టడం ద్వారా అవినీతి ఆరోపణలకు బలం చేకూరింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, కఠినంగా వ్యవహరించి, అవినీతి కుంభకోణాన్ని వెలికితీసే చర్యలకు పూనుకోవడం హర్షణీయం.

8. ప్రభుత్వం మారబోతున్న సమయంలోనే మంగంపేట గనుల నుండి చెన్నయ్ మరియు కృష్ణపట్నం ఓడ రేవులకు ఖనిజ రవాణా ఆపేశారు. దాదాపు 250 వరకు ఉన్న పల్వరైజింగ్ మిల్స్ మూతపడ్డాయి. నెలకు దాదాపు రెండు లక్షల టన్నులు రవాణా చేసే టిప్పర్లు, 300కుపైగా ఉన్న 18 టైర్ల లారీలు రొడ్డెక్కడం లేదు. వాటి యజమానులు కొందరు బ్యాంకులకు కంతులు చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రంగంపైన ఆధారపడిన డ్రైవర్స్, క్లీనర్స్, మెకానిక్స్, తదితర అసంఘటిత కార్మికులు వేలాది మంది ఉపాధి కోల్పోయి, వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. అవినీతి కుంభకోణంలో పాత్రధారులుకాని లారీల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేల కోట్లు దోచుకున్న అవినీతి రాబంధులను కాపాడడానికి ప్రభుత్వ కార్యాలయాల్లోని "పైల్స్, హార్డ్ డిస్క్"లను తగలబెట్టే దుశ్చర్యలకు బరితెగించి పూనుకున్నారని స్పష్టమవుతున్నది.

9. గత ప్రభుత్వ కాలంలో అవినీతి - అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలని, ఇప్పటి వరకు తగలబెట్టిన ఘటనలపై తక్షణం సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పైల్స్ తగలబడితే ఆ ఆఫీసు ఉన్నతాధికారిని బాధ్యుడుగా చేసి, శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
విజయవాడ
తేది: ఆగస్టు 27, 2024

No comments:

Post a Comment