Monday, August 18, 2014

సర్వేనా! అఫిడవిట్ల సేకరణా!




సమగ్ర కుటుంబ‌ సర్వే అంటే శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలను సేకరించుకోవడం. దానిపై అభ్యంతరం ఎందుకుండాలని కొందరు అమాయకంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. నేను జి.హె.యం.సి. వెబ్ సైట్ లో పెట్టిన సర్వే నమూనా పత్రాలను పరిశీలించిన మీదట నాలో జనించిన ఆలోచనలను మిత్రులతో పంచుకొంటున్నాను.  రాజకీయాలకు, ప్రాంతీయ దురభిమానాలకు అతీతంగా, ప్రజాస్వామ్యయుతంగా, హేతుబద్ధంగా ఈ అంశాలపై దృష్టి సారించి, ఆలోచించి, ఒక నిర్ధారణకు రావాలని మనవి. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరుతో పౌరుల నుండి డిక్లరేషన్ పేరుతో అఫిడవిట్ లను తీసుకొంటున్నది. సర్వే ఐచ్ఛికమని హైకోర్టుకు తెలియజేసింది. భారత ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో పౌరుల నుండి సమాచారాన్ని సేకరించుకొంటుందే గానీ "అఫిడవిట్స్"ను కోరదు. భారత జననగణన‌ చట్టం మేరకు ఈ సర్వే నిర్వహించడ‍ం లేదని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్టబద్ధంకాని సర్వేలో పౌరుల నుండి "నాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు" అని అఫిడవిట్స్ కోరడంలోని లోగుట్టేంటో ముందు బహిర్గతం చేయాలి. ప్రభుత్వమన్నాక పారదర్శకంగా, జవాబుదారితనంతో వ్యవహరించాలి. అందులోనూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం.
పౌరుల జనన ధృవీకరణ పత్రం నకలును సర్వేలో భాగంగా సేకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడంలోని ఆంతర్యమేమిటి? స్థానికులు, స్థానికేతరులు అన్న వర్గీకరణ చేసుకొని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న‌ సంక్షేమ పథకాల అమలులో తెలుగు ప్రజల మధ్య‌ వివక్షత ప్రదర్శించాలనే దుర్భుద్ధి ఉందనే అనుమానాలు బలంగా వేళ్ళూనుకొన్న పూర్వరంగంలో సర్వే నిర్వహించబడుతున్నది. గోరుచుట్టపై రోకటి పోటన్నట్లు రాష్ట్ర విభజనతో కుదేలై ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ హైదరాబాదీయులను లక్ష్యంగా చేసుకొని 1956 సంవత్సరాన్ని ప్రాతిపథికగా స్థానికతను నిర్ధారిస్తామని పదేపదే తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. ఆ మాటలు భారత రాజ్యాంగం, చట్టం ముందు చెల్లుబాటు కావని కొంత మంది మాహా మేధావులు తేలికగా కొట్టిపారేయవచ్చు. కానీ, రాష్ట్ర విభజన తరువాత‌ అభద్రతకులోనౌతున్న పామరులు, అసంఘటిత కార్మికులు, పేద జనం, ఉద్యోగ వర్గాలనే లక్ష్యంగా చేసుకొని బలవంతపు వలసల వైపు ఆ తరగతి ప్రజలను నెట్టి, తద్వారా లబ్ధి పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయంగా టి.ఆర్.యస్. పార్టీ ఆలోచన చేస్తున్నట్లు కనబడుతున్నది. నిజంగా అలాంటి కుట్ర దాగివున్నదేమో! కాస్త విజ్ఞతతో అందరూ ఆలోచించాలి. పైపెచ్చు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతూ  ప్రసారమాధ్యమాలలో ఆధారాలతో సహా వార్తలు ప్రసారమవుతున్నాయి.
పౌరుల స్థిర/ చరాస్థుల వివరాలు, దస్తావేజుల నకళ్ళను సర్వే సిబ్బందికి ఎందుకివ్వాలి? పౌరుల‌ ఆస్థులకు రక్షణ మాటేమిటి? లాండ్ మాఫియాలు పట్టా భూములను కూడా ఆక్రమించుకొని అవినీతి కూపంలో కూరుకపోయిన రిజిస్ట్రేషన్ అధికార యంత్రాంగం సహకారంతో ఏకంగా ఆస్తుల రిజిస్ట్రేషన్స్ య‌దేచ్ఛగా చేసేస్తున్నారు. అదేంటంటే ఆస్తుల అసలు హక్కుదారుడెవరో విచారించే పని మాది కాదని తప్పించుకొనడానికి, రిజిస్ట్రేషన్ చట్టాన్ని తడికెగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూములు, భవనాలు, అపార్ట్ మెంట్స్ ఆక్రమణలకు గురై అసలు హక్కుదారులు లబోదిబో మంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో ఆస్తుల దస్తావేజుల నకళ్ళను సర్వే నిమిత్తం ఇంటింటికి పంపబడుతున్న ప్రభుత్వ సిబ్బంది లేదా కార్యకర్తలకు అప్పగించాలని ప్రభుత్వం కోరడం తీవ్ర అభ్యంతరకరమే కాదు, చట్ట విరుద్ధం, బాధ్యతారాహిత్యం, అత్యంత ప్రమాదకరం. పౌరులను ఇబ్బందుల పాలు చేసే ప్రమాదకర చర్య. స్థిరాస్తుల దస్తావేజుల నకళ్ళను సర్వే సిబ్బంది నాలుగు డబ్బులకు అమ్ముడుపోయి లాండ్ మాఫియాలకు, దందాలు చేసి అక్రమార్జనకు పాల్పడే రౌడీలు, గూండాలకు అందజేయరని, ఒకవేళ అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చట్టబద్ధమైన "అఫిడవిట్"ను పౌరులకు ఇస్తుందా?
పౌరులందరి నుండి పాన్ కార్డు నంబర్లను, బ్యాంకు/ పోస్టాఫీసు ఖాతాల నంబర్లు, ఏఏ బ్రాంచీలలో ఉన్నాయో! అలాగే ఆ వివరాలున్న పాస్ బుక్ లోని మొదటి పేజీ జిరాక్స్ కాపీలను ఎందుకివ్వాలి? నగదు బదిలీ పథకాన్ని అమలు చేసినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించే సందర్భంలో బ్యాంక్ అకౌంట్ నంబరు అడిగి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. కానీ పౌరులందరి వ్యక్తిగత ఖాతాల వివరాల సేకరణ ఎందుకోసం? ఖాతా నంబర్లను ఎవ్వరికీ తెలియజేయవద్దని బ్యాంకుల నుండి తరచూ ఖాతాదారులకు యస్.ఎం.యస్.లు వస్తుంటాయి. అంటే ఖాతాలోని డబ్బును ఎవరు తస్కరించకుండా ఖాతాదారుల రక్షణార్థం బ్యాంకులు ఈ తరహా సమాచారాన్ని చేరవేస్తున్నాయి.
సర్వేని జవాబుదారితనంతో, పారదర్శకంగా, అపార్థాలకు తావివ్వని రీతిలో ఏ ప్రభుత్వమైనా చేయవచ్చు. అందులో భాగంగా పౌరుల నుండి సొంత ఇల్లు ఉన్నదా? ఉంటే ఏ తరహా ఇల్లు? ఫోన్/మొబైల్ ఉన్నదా? గ్యాస్ కనెక్షన్ ఉన్నదా? రెండు చక్రాలు/మూడు చక్రాలు/నాలుగు చక్రాల వాహనాలున్నాయా? ఆస్తి పన్ను కడుతున్నారా? ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి‍పొందుతున్నారా? సాగు భూమి లేదా ఇంటి స్థలం ఉన్నదా? వగైరా సాధారణ‌ సమాచారాన్ని పౌరుల నుండి శాస్త్రీయ పద్ధతులలో సేకరించుకొని దారిద్ర్యారేఖకు దిగువనున్న జనాభా గణాంకాలను వర్గీకరించుకొని సంక్షేమ పథకాల అమలులో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ కార్యాచరణను రూపొంది‍చుకోవడం ప్రభుత్వ బాధ్యత. అలా చేస్తే పౌరులు కూడా అభ్య‍తరం చెప్పరు. పైపెచ్చు అలాంటి ప్రక్రియలో భాగస్వాములు కావడ‍ం పౌరుల బాధ్యత కూడా.
ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే హేతుబద్ధతపై తెలంగాణా సమాజం కూడా స్పందించాలి. 



Saturday, August 16, 2014

"ప్రజాసేవకూ దేవస్థానాలు" సూర్య దినపత్రిక, ఆగస్టు 16, 2014

సామాజిక కార్యాలకు టిటిడి ఆదాయం?
చంద్రబాబు సూచనపై విమర్శలేల?
ప్రతి అంశంలో రాజకీయ కోణమేనా?
మిగిలిన ఆలయాలకూ బాధ్యత
మానవ సేవే మాధవ సేవ కాదా?
విద్యావ్యాప్తిలో టిటిడి కృషి అమోఘం
క్రైస్తవ మిషనరీల సేవలు సర్వ విదితం


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ- దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు తిరుమ వెంకటేశ్వరుడేనని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కొందరు వ్యక్తులు అసందర్భమైన విమర్శలు చేశారు. ప్రతి అంశాన్ని సంకుచిత రాజకీయ కోణం నుంచి చూడడం సమాజానికి మేలు చేకూర్చదు. దేవస్థానాల పవిత్రతను కాపాడుతూ, నిర్దేశిత ఆధ్యాత్మిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూ, తమ ఆదాయ వనరులు అనుమతించిన మేరకు సామాజికాభివృద్ధిలో దేవస్థానాలు భాగస్వాములైతే తప్పేమిటో విజ్ఞతతో ఆలోచించాలి.

విభజనానంతరం తీవ్ర ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో దేవస్థానాలు కూడా తమ వంతు పాత్ర పోషించాలనే ప్రతిపాదన సముచితమైనది. ఆంధ్ర నాట ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక కార్యకలాపాలకు వెచ్చిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానమంత సంపన్నమైనవి కాకపోయినా శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కనకదుర్గ, అన్నవరం, సింహాచలం తదితర దేవస్థానాలూ భక్తుల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా సంక్షేమంకోసం వ్యయంచేస్తే సామాజిక ప్రగతిలో పాలుపంచుకొన్నట్లవుతుంది. తరతరాలుగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న మానవ సేవే మాధవ సేవ అన్న లోకోక్తి ఉండనే ఉన్నది.

మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే రంగాలలో దేవస్థానాలు కేంద్రీకరించి కొన్ని సంస్థలను నెలకొల్పి, నిర్వహిస్తే భక్తులకు సంతృప్తి కలుగుతుంది, సమాజమూ హర్షిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 1850 దశకంలోనే మొట్టమొదట వెల్లూరులో, అటు తరువాత కొంత కాలానికి తిరుపతిలో హిందూ ఉన్నత పాఠశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి శ్రీకారం చుట్టింది. కాలక్రమేణ వాటి పేర్లు శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలుగా మారాయి. తిరుపతి కేంద్రంగా శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంలో టిటిడి ముఖ్యభూమిక పోషించింది. యస్‌.వి. ఆర్ట్స కళాశాల, యస్‌.జి.యస్‌. ఆర్ట్‌‌స కళాశాల, పద్మావతి మహిళా కళాశాల, యస్‌.వి. జూనియర్‌ కళాశాల, ఓరియంటల్‌ కళాశాల, సంగీత - నృత్య కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల, అంగవికలులకు పాఠశా, తదితర విద్యాసంస్థలను నెలకొల్పి విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేస్తున్నది.

భారతీయ విద్యా భవన్‌ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుకు వెన్నుదన్నుగా నిలిచింది. వైద్య ఆరోగ్య రంగంలో శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల స్థాపనకు, స్విమ్స్‌ ఆసుపత్రి, బర్డ్‌‌స ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రలను నెలకొల్పి విశేష కృషి చేస్తున్నది. కాకపోతే ఈ సంస్థలన్నీ తిరుపతి కేంద్రంలోనే ఉన్నాయి. దేశరాజథాని డిల్లీ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్టర్రాజధానిగా విలసిల్లిన హైదరాబాద్‌లో ఒకటి రెండు విద్యా సంస్థలను స్థాపించి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నది.
వైద్య రంగంపై దృష్టి: నిత్య కరవు కాటకాలతో వెనుకబడ్డ రాయలసీమ, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా ఈ తరహా సామాజిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం విస్తరించి ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రజలు కోరుకొంటున్నారు.

ప్రత్యేకించి ప్రయివేటీకరణ పుణ్యమాఅని వైద్యవిద్య, వైద్యం సామాన్యులకు, మరీ ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలవారికి అందని ద్రాక్షలా తయారయ్యాయి. వైద్య విద్యను అత్యంత లాభసాటి వ్యాపార సరుకుగా మార్చి యం.బి.బి.యస్‌. సీటును డెబ్బయ్‌ ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు, యం.డి., లేదా యస్‌.యస్‌. సీటును రెండు కోట్ల రూపాయల వరకు వేలం వేసి అమ్ముకొని పెద్ద ఎత్తున్‌ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పేరుకు ట్రస్టులు, సొసైటీలుగా నెలకొల్పినా 90 శాతం సంస్థలు వ్యక్తుల వ్యాపార సంస్థలుగానే నడుస్తున్నాయి. పర్యవసానంగా వైద్య విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఫలితంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం జరుగుతోంది. ఈ రంగంపై దేవస్థానాలు కేంద్రీకరించి వైద్య విద్యాసంస్థలను, ఆసుపత్రులను నెలకొల్పి నిర్వహిస్తే సమాజానికి అమూల్యమైన సేవలందించినట్లవుతుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మిగిలిన దేవస్థానాలు కూడా వాటికున్న ఆదాయ వనరుల పరిథికి లోబడి ఆథ్యాత్మిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే, ఈ అంశంపై దృష్టి సారిస్తే సభ్యసమాజం హర్షిస్తుంది.విద్య, వైద్య రంగాలలో క్రైస్తవ మిషనరీలు అనేక దశాబ్దాలుగా అపారమైన సేవలందిస్తూ భారతీయ సమాజంలోకి చొచ్చుక పోవడంతోపాటు సామాన్య ప్రజల మన్ననలు చూరగొన్నాయి. అంతర్జాతీయ సమాజానికి ఈ తరహా అనుభవాలే ఉన్నాయి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ 1989 లో పోలెండ్‌ దేశ రాజధానీ నగరం వార్సా వెళ్ళిన సందర్భంలో ప్రఖ్యాతిగాంచిన చర్చిలను సందర్శించాను. పోలెండ్‌ స్వాతంత్య్రోద్యమంలో చర్చిలు పోషించిన పాత్రపై నిర్వాహకులు ఘనంగా కీర్తిస్తూ వివరించారు. మన పూర్వీకుల కాలంలో విద్యా వ్యాప్తి, వైద్య సేవలూ గురుకులాల నుంచే ప్రారంభమయ్యాయన్న సంగతి మనమెన్నటికీ మరచిపోకూడదు.

అన్ని దానాల కంటే అన్న దానం గొప్పదని నానుడి. అన్ని దానముల కంటే విద్యా దానం శ్రేష్టమైనదని నాగరిక సమాజంలో మరొక లోకోక్తి కూడా ప్రాచుర్యంలో ఉన్నది. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఆయురారోగ్యాలను, సిరిసంపదలను సమకూర్చాలని, కష్టాల భారి నుండి విముక్తి చేయాలని భక్తులు ఆయా దేవస్థానాల కెళ్ళి మొక్కుకొంటారు. ఆ మొక్కుల్లో భాగంగానే కానుకలు ముట్టజెప్పుకొంటారు. అలా సమకూరిన ఆదాయాన్ని దేవాలయాల నిర్వహణ కోసం, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం, ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాల నిమిత్తం సద్వినియోగం చేస్తూనే మానవ వనరుల అభివృద్ధికి, స్థూలంగా సామాజికాభివృద్ధికి కొంతమొత్తాన్ని వెచ్చిస్తే భక్తుల మొక్కులను నిజజీవితంలో తీర్చడానికి కూడా దోహదపడతాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే 1800 కె.జి.ల బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో దాచిపెట్టింది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన మొత్తం బంగారం 4,335 కె.జి. లున్నదని వెల్లడించారు. దానిపై టిటిడి వడ్డీ కూడా పొందుతున్నది. నగదు నిల్వలపైనా రాబడి వస్తున్నది. తిరుచునాపల్లిలోని అనంత పద్మనాభస్వామి దేవస్థానం అపారమైన సంపదను నిరుపయోగంగా దాచిపెట్టిన ఘటన వెలుగు చూడడంతో ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురైనారు. ఈ తరహా సంపదను, ఆదాయాన్ని ఉత్ఫాదక రంగాలలో వెచ్చిస్తే సమాజానికి మేలు జరుగుతుంది కదా! కర్ణాటక రాష్ట్రంలో పలు మఠాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నడుస్తున్నాయి. కర్ణాటక దేవాలయాలు: సామాజిక, ఆర్థిక జనజీవనంలో వాటి పాత్ర- అన్నశీర్షికతో ఒక పుస్తకాన్నే ప్రచురించారు.

పుట్టపర్తిలో ఆధ్యాత్మిక చింతనకు నిలయంగా భాసిల్లిన సత్యసాయి నిలయం ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, విద్యా సంస్థలు స్థాపించి, సమర్థవంతంగా నిర్వహింస్తున్నారు. శ్రీకంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో కాంచీపురం కేంద్రంగా వేద పాఠశాల, శిల్ప పాఠశాల, శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ, శ్రీ శంకర ఆర్ట్‌‌స, సైన్స్‌ కళాశాల, శ్రీదండపాణి ఓరియెంటల్‌ ఉన్నత పాఠశాల తదితర సస్థలను నెలకొల్పారు.
చరిత్ర పుటలను తిరగేస్తే మధ్య యుగాల(కీ.శ.14-17 శతాబ్ధాల మధ్య) కాలంలో విజయనగర రాజుల పాలనా కాలంలో దక్షిణాది హిందూ దేవాలయాలు ఆర్థిక కేంద్రాలుగా ఉండేవి. ఉదా: తిరుమల, శ్రీకాళహస్తి, తంజావూరులోని శ్రీరంగం దేవాలయాలు ఆర్థిక కేంద్రాలుగా ఉండేవి. ప్రాంతీయ అభివృద్ధిలో పాలుపంచుకొనేవి. విజయనగర రాజులు వ్యవసాయాన్ని అత్యంత కీలకమైన రంగంగా పరిగణించారు.

చిన్ననీటిపారుదల సౌకర్యాలైన చెరువులు, కుంటలు, బావులు, నదులపై వ్యవసాయం ఆధారపడి ఉండేది. చెరువులు, బావులు, కాలువ త్రవ్వకానికి తిరుపతి దేవస్థానం నిథులను సమకూర్చేది. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడంద్వారా తిరుపతి దేవస్థానం గ్రామీణులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడానికి అండగా నిలిచింది. బంజరు భూముల అభివృద్ధికి నిధులను సమకూర్చేది. భూముల అభివృద్ధి, నీటి సదుపాయం, సాగు కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ఆర్థిక కార్యక్రమంగా నిర్వహించేది. వ్యవసాయాభివృద్ధి ద్వారా గ్రామీణులకు ఉపాధి కల్పించడం, ఆహార ధాన్యాల ఉత్ఫత్తిని ప్రోత్సహిచడం- తద్వారా దేవస్థానాల ఆదాయాన్ని పెంచుకొనే విధంగా కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించేదని చరిత్ర చెబుతున్నది. నాడు ఒక్కొక్క దేవాలయం ఒక ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా ఉండేది. దేవస్థానాలు భూ యజమాన్యాలుగా ఉండడం, రైతులకు భూములను అప్పగించి, సాగు చేయడానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించడం, వ్యవసాయ ఉత్ఫత్తులను సేకరించుకోవడం,

దేవస్థానాల్లో వందలాది మందికి ఉపాథి కల్పించి, వారి సేవలను వినియోగించుకోవడంతో పాటు ఆథ్యాత్మిక కేంద్రాలుగా ఉండేవి. దాన్నిబట్టి హిందూ దేవాలయాలు ఆథ్యాత్మిక కార్యకలాపాలతో పాటు ఉత్ఫత్తి రంగాలలో నిధులు వెచ్చించి సామాజికాభివృద్ధిలో పాలుపంచుకొన్నాయని స్పష్టమవుతున్నది. తిరుచినాపల్లిలోని శ్రీరంగం దేవాలయం వంటి కొన్ని దేవస్థానాలు వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే వారికి రుణాలు ఇచ్చిన ఉదంతాలనుకూడా చరిత్రకారులు ప్రస్తావించారు.ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొన్నప్పుడు దేవస్థానాలు ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఖర్చు చేయడం హిందూ దేవాలయాల పవిత్రతకు, భక్తుల తాత్త్విక చింతనకు, మనోభావాలకు, ఆలోచనలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదు. ఒకప్పుడు భక్తులు పంచాంగాల ఆధారంగా శుభప్రదమైన రోజులను ఎంపిక చేసుకొని దేవాలయాలకు వెళ్ళేవారు. కాలం మారింది. సెలవు దినాలలో పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిట లాడిపోతున్నాయి.

సౌలభ్యాన్ని బట్టి ప్రయాణాలను పెట్టుకోవడంతో పాటు దేవస్థానాలున్న ప్రాంతాలన్నీ పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందాయి. దేవాలయాల్లో అత్యధికం అడవులు, కొండ ప్రాంతాలు, పెద్దపెద్ద గుట్టలున్న ప్రాంతాలలోనే ఉండడం మూలంగా అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పిల్లలు మొదలుకొని పెద్దలవరకు ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారు. భక్తికి తోడు మానసిక ఉల్లాసాన్నిచ్చే ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరగడంతో కొన్ని దేవస్థానాల ఆదాయం బాగా పెరిగింది. ఆ ఆదాయంలో కొంత భాగాన్ని సామాజికాభివృద్ధికి ఉపకరించే కార్యక్రమాలకు వినియోగించడం ఏ మాత్రం తప్పు కాదు.

రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానాల నిధులను రాష్ట్ర ఖజానాకు తరలించుకొనే ప్రయత్నం చేసినా లేదా దేవస్థానాల ట్రస్టులపై పెత్తనం చేసినా సమర్థనీయం కాదు. స్వతంత్ర ప్రతిపత్తితో దేవస్థానాల ట్రస్టుల ఆధ్వర్యంలోనే సామాజిక కార్యక్రమాలేవైనా నిర్వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవస్థానాల బోర్డులను పునర్వవస్థీకరించే హక్కు మాత్రమే ప్రజలద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, దేవస్థానాల బోర్డులు తమ తమ పరిధులు దాటకుండా దేవస్థానాల ఆదాయంతో సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి.

Wednesday, August 13, 2014

ప్రజల‌ అస్థిత్వాన్నే ప్రశ్నిస్తున్న రాచక్రీడ‌



"మా ఉద్యమం సీమాంధ్ర‌ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మాత్రమే ఎక్కుపెట్టబడిందని, పొట్ట కూటి కోసం వచ్చిన వారిని కడుపులో పెట్టుకొని చూసుకొంటామని పదేపదే వల్లె వేసిన తెలంగాణ ఉద్యమకారులు వారి కల సాకారమై, అధికార పగ్గాలు చేతికందగానే నాలుక మడతబెట్టి, మాట మార్చారు. తెలంగాణలోని పాలక పార్టీ అంబుల పొదలో నుంచి ఒక్కొక్క ఆయుధాన్ని తీసి ఎక్కుపెడుతున్నారు. స్థానికత అంశ‍ంపై వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినమైన 1956 నవంబరు 1ని ప్రాతిపథికగా పరిగణించి స్థానికులెవరో! స్థానికేతరులెవరో! నిర్ధారించి ధృవపత్రాలను జారీ చేసే ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా బోధపడుతున్నది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ రాజథానీ నగరమైన హైదరాబాదు, తెలంగాణలోని ఇతర జిల్లాలలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి అనేక దశాబ్దాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న సామాన్య‌ ప్రజలు, వారి పిల్లల‌ ప్రాథమిక హక్కులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. తద్వారా వారి అస్థిత్వాన్నే ప్రమాదపుటంచులకు నెట్టే కుటిల‌ ప్రయత్నాలు జరుగుతున్నట్లున్నది.
స్థానికతతో ముడిబడి ఉన్న‌ఉద్యోగుల విభజనాంశం ఒక కొలిక్కి రాక రెండు రాష్ట్రాల‌ పాలనా యంత్రాంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే వృత్తి విద్యా కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన అంశాన్ని స్థానికతతో ముడిపెట్టి వాయిదా వేయించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్న‍ం సుప్రీం కోర్టులో బెడిసికొట్టింది. రాష్ట్ర విభజన చట్టం, అలాగే అమలులో ఉన్న ఆర్టికల్ 371డి కి అనుగుణంగా అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 31 నాటికి విధిగా పూర్తి చేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాస్తా ఊపిరి పీల్చుకొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్ద విద్యార్థులకు బోధనా రుసుములు, ఉపకార వేతనాల‌ చెల్లింపు అంశాన్నిస్థానికతతో ముడిపెట్టి  ఈ అంశాన్నిఇంకా తెగలాగాలని ప్రభుత్వం చూస్తున్నది. సామాజిక, ఆర్థికాంశాలపై సమగ్ర అధ్యయనం పేరిట ఈనెల 19వ తేదీన ఒక్క రోజులో యుద్ధ ప్రాతిపథికపైన‌ నూతన‌ గణాంకాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవడ‍ం వెనక దాగి ఉన్న చిదంబర‌ రహస్యం ఏమిటి? అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్దంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లేదా రాష్ట్ర రాజథానికి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న వారి గణాంకాలను వర్గీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాల నుండి స్థానికేతరుల పేరిట‌ వారిని తొలగించే కుట్రలో అంతర్భాగంగానే ఇదంతా జరుగుతున్నదనే అనుమానాలు సర్వత్రావినిపిస్తున్నాయి.
ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు? ఎవరివి చట్టబద్దమైన వలసలు? ఎవరివి చట్ట వ్యతిరేక వలసలు? రాజ్యాంగం ఏం చెబుతున్నది? చట్టంలో ఏముంది? చారిత్రక వాస్తవాలేమిటో నిగ్గుదేలాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటా సంపాదించుకోవడానికి, ప్రణాళికా సంఘం నుండి నిథులను పొందడానికి మొత్తం రాష్ట్ర‌ జనాభాను ప్రాతిపథికగా చూపెట్టి లబ్ధిపొందుతారు. విభజన చట్ట ప్రకారం జనాభా ప్రాతిపథికగా ఆస్తులు పొందారు. వారు చెల్లించే పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. కానీ సంక్షేమ పథకాల‌ లబ్ధిదారుల ఎంపిక‌ వచ్చేసరికి స్థానికత సమస్యను లేవనెత్తి ఉమ్మడి రాష్ట్ర కాలంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న వారు అన‌ర్హులంటారు. స్థానికేతరులగా ముద్రవేసి ద్వితీయ పౌరులుగా జీవించాలనడం సమంజసమా? ఆంధ్ర పునాదులున్న‌ వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వనగూడ్చితే తెలుగేతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారు కూడా వాటిని డిమాండ్ చేస్తారని వక్రబుద్ధితో సమాధానాలు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. 1956కు పూర్వం స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న వారే తెలంగాణా వారని, అటుపై ఈ ప్రాంతానికి వలస వచ్చిన వారంతా తెలంగాణాయేతరులని సూత్రికరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయ‍ం తీసుకొంటే, అది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా? రాష్ట్ర‌ విభజన‌ చట్టానికి లోబడి ఉన్నదా? లేదా? అన్న అంశాలు న్యాయ స్థానాలే తేల్చవలసిన దుస్థితి నెలకొంటున్నది.
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న ప్రజలే కాదు తెలంగాణలోని ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వలసొచ్చిన ప్రజలు కూడా 1956కు పూర్వం స్థానికతను రుజువు చేసుకోవడానికి మూడు తరాల మూలాలకు సంబంధించిన ధృవపత్రాలను ఆధారాలుగా చూపెట్టాల్సి ఉంటుంది. భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొత్తం 1959 సంవత్సరానికి పూర్వం ఆంధ్ర ప్రాంతంలో అంతర్భాగంగా ఉండింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉన్న మునగాల ప్రాంతం  కృష్ణా జిల్లాలో ఉండేది, అలాగే నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్, అలంపూర్ ప్రాంతాలు కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉండేవి. ఈ ప్రాంతాల‌ ప్రజలు స్థానికులు అవునో కాదో తేల్చాల్సి వస్తుంది. ఈ సమస్య ఒక విషవలయంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయలబ్ధి కోసం అమాయక‌ ప్రజల జీవితాలతో చెలగాటమాడడం, విద్వేషాన్ని రెచ్చగొట్టి, వివక్షతను ప్రదర్శించడం, తెలుగు ప్రజల అభ్యున్నతికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుంది. రెవెన్యూ అధికారుల నుండి ధృవపత్రాలను పొందడంలో అవినీతి పై చేయి సాధించి తెలంగాణ సమాజం తీవ్రమైన‌ గందరగోళంలోకి నెట్టబడుతుంది. ఈ అంశంపై తెలంగాణ మేథావి వర్గ‍ం, మరీ ప్రత్యేకించి వామపక్ష మేథావులుగా చెప్పుకోబడేవారు ఎందుకని స్పందించడంలేదు?
స్థానిక, స్థానికేతరుల అంశాన్ని తేల్చడానికి 1956కు ఉన్న హేతుబద్ధత, రాజ్యాంగబద్ధత‌ ఏమిటి? రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన‌ 2014 జూన్ 2కు లేని హేతుబద్ధత ఏమిటో కూడా ఆలోచించాలి. తమ సొంత‌ రాష్ట్ర‍ రాజథానీ నగరమైన‌ హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్న ప్రజానీకం యొక్క ప్రాథమిక‌ హక్కులను కాలరాస్తూ వలసవాదులుగా చిత్రీకరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కాదా? స్థానికత సమస్య పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు మరియు కాంట్రాక్టర్లు, ఇతర‌ సంపన్నుల జీవితాలను ప్రభావితం చేసే సమస్య కాకపోవచ్చు. కానీ, పేదసాదలు, మధ్యతరగతి ప్రజానీకం యొక్క ఉనికి, అస్థిత్వంతో ముడిపడిన జీవన్మరణ సమస్య. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో 1969,72 లలో జరిగిన విభజనోద్యమాల‌ నేపథ్యంలో తెలుగు జాతి అభ్యున్నతిలో సమతుల్యతను సాధించాలనే లక్ష్యంతో రాజ్యాంగానికి సవరణ చేసి ఆర్టికల్ 371డి ని పొందుపరిచారు. తదనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ఆర్టికల్ 371డి అమలులో ఉన్నతెలంగాణ‌ రాష్ట్రంలో జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ 370ని అమలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు చెల్లుబాటు అవుతాయా? ఈ రెండు ఆర్టికల్స్ భిన్నదృక్పథాలతో రాజ్యాంగానికి సవరణ చేయడం ద్వారా అమలులోకి తేబడ్డాయి. ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాల పరిరక్షణా ధ్యేయంగా దేశ విభజన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని రూపొందిస్తే, ఆర్టికల్ 371డి ని తెలుగు ప్రజల ఐక్యతా పరిరక్షణా లక్ష్యంగా రూపొందించబడింది. ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.
మన దేశంలో, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వలసల అంశాన్ని కాసేపు ప్రక్కనపెట్టి ఒక దేశం నుండి మరొక దేశానికి మానవ వనరుల‌ వలసల అంశంపైన, కాందిశీకుల సమస్యపైన‌ ఐక్యరాజ్య సమితి ఆమోదించిన నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో కూడా ఆలోచించాలి. ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్నాము. ఇరవై మరియు ఇరవై ఒకటవ శతాబ్దాలలో వలసలు ఒక అనివార్య సామాజిక‌ పరిణామంగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తున్నది. ద్రవ్య పెట్టుబడి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న‌ మానవ వనరులకు దేశ సరిహద్దులను బార్లా తెరిచి ప్రభుత్వాలు ఘనస్వాగతం పలుకుతున్నాయి. అలాగే ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి వలసలు వెళ్ళడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నది. ఉన్నచోట జీవితావసరాలను, కోర్కెలను తీర్చుకోలేని దుర్భర పరిస్థితులు, కరవు కాటకాలు, వ్యవసాయ‍ రంగం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ‌ బలహీనపడడం, భవిష్యత్తుకు బరోసా లేకపోవడం వల్ల ఉపాథి, మెరుగైన  మౌలిక సదుపాయాలు మరియు జీవనం కోసం నూతన‌ అవకాశాలను వెతుక్కొంటూ ప్రజలు వలసలు వెళ్ళడమనేది అనాదిగా జరుగుతున్న ప్రక్రియే. బ్రిటీష్ పాలకులు మొదలు నైజాం నవాబు వరకు పాలనా యంత్రాంగంలోను, అభివృద్ధి కార్యకలాపాల అవసరార్థం వలసలను ప్రోత్సహించి నైపుణ్యం ఉన్న మానవ వనరులను సమకూర్చుకొన్నారు. స్వాతంత్ర్యానంతరం క్రమేపీ పట్టణీకరణ, నగరీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడంతో గ్రామసీమల నుండి పెట్టుబడులతో పాటు నైపుణ్యం ఉన్న మరియు లేని మానవ వనరులూ పట్టణాల బాట పట్టాయి. ఆకలికి, పేదరికానికి, జీవనోపాథికి, సామాజిక భద్రతకు సరిహద్దులు లేవు. సమస్యల్లా! అవి చట్టబద్దమైన వలసలా? చట్ట వ్యతిరేకమైన వలసలా? అన్నదే. ఈ అంశాన్ని విసక్షణతో రాగ ద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగం మరియు అమలులో ఉన్న‌ చట్టాల పరిథిలో ఆలోచించాలి.
దేశ విభజన నేర్పిన పాఠం: భారత దేశ విభజన జరిగి 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించిన నాటి నుండే తూర్పు పాకిస్తాన్, తరువాత బాంగ్లాదేశ్ గా విముక్తి పొందిన మీదట కూడా మన దేశానికి పదుల లక్షల సంఖ్యలో హిందూ, ముస్లిం ప్రజానీకం వలస వచ్చారు. వారిలో చట్టబద్ధమైన ధృవపత్రాలు ఉన్నవారు, లేనివారు ఉన్నారు. భారత్- బాంగ్లాదేశ్ ల మధ్య దౌత్యసంబంధాలకు ఇది కంటిలో నలుచులాగా చికాకుపెడుతూనే ఉన్నది. ఇంతటి సున్నితమైన, సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించుకోవడానికి 1971 మార్చి 25 వ తేదీని ప్రాతిపథిక సంవత్సరంగా పరిగణించాలని, అటుపై వలస వచ్చిన వారికి పౌరసత్వ హక్కులు కల్పించకూడదన్న అంశంపై స్థూలమైన‌ ఏకాభిప్రాయం రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వంలో వెల్లడవుతున్నది. ఈ తేదీని పరిగణలోకి తీసుకోవడానికి ఒక చారిత్రక ఘట్టం ప్రాతిపథికగా నిలిచింది. తూర్పు పాకిస్తాన్ లో నాడు జరిగిన ఎన్నికల్లో షేక్ ముజిబుర్ రహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘనవిజయం సాధించిన మీదట బాంగ్లాదేశ్ పేరిట‌ స్వతంత్ర దేశంగా ప్రకటించుకొన్నది. ఈ పరిణామంపై కన్నెర్రజేసిన పశ్చిమ‌ పాకిస్తాన్ 1971 మార్చి 26న యుద్ధానికి తెరలేపింది. ఆ యుద్ధ కాలంలో పది లక్షల మంది శరణార్థులుగా మన దేశానికి వలస వచ్చారని చెప్పబడుతున్నది. అనేక మంది చట్ట వ్యతిరేకంగానే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్నారు. జఠిలంగా తయారైన ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే ప్రక్రియలో భాగంగా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రోజును ప్రాతిపథిక‌ తేదీగా తీసుకోవాలన్న భావన బలంగా వ్యక్తమయింది. ఈ సంక్లిష్టమైన‌ సమస్య పరిష్కారానికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15వ తేదీని ప్రాతిపథిక‌ తేదీగా నిర్ధారించాలని ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కోరలేదు. సహజంగా దేశాల మధ్య ఉత్ఫన్నమవుతున్న ఇలాంటి సమస్యల వల్ల‌ సార్వభౌమత్యానికి, ఉనికికి ప్రమాదం వాటిల్లే అవకాశాలుంటాయి. కానీ, ఈ పరిణామం ప్రత్యేకమైనది. వలస వచ్చిన వారంతా వారసత్వంగా సంక్రమించిన విలువైన‌ ఆస్తులనన్నింటినీ ఉన్నపళంగా వదులుకొని భారత దేశానికి పారిపోయి వచ్చి, ఇక్కడ‌ స్థిరపడ్డారు. అలాంటి వారిలో కొందరు పాకిస్తాన్ నుండి వలస వచ్చి స్థిరపడి చట్టసభలకు ఎన్నికై ఉన్నత పదవులను అధిరోహించి రాజ్యాధికారంలో భాగస్వాములైనారు. చరిత్ర నుండి మంచిని గ్రహించడానికి ఇక్కడ మరొక ముఖ్యమైన ఘటనను ప్రస్తావించుకోవడం ఎంతైనా అవసరం. భారత దేశ విభజనానంతరం పాకిస్తాన్ రాజ్యాంగ సభలో ప్రప్రథమంగా ప్రసంగించిన‌ మహమ్మదాలీ జిన్నాముస్లింలకు, హిందువులకు మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదని, అందరూ సరిసమానమైన పాకిస్తాన్ పౌరులని విస్పష్టంగా ప్రకటించారు. జిన్నా మరణానంతరం మతచాందసవాదులు 1950లో మతఘర్షణలను, అల్లర్లను రెచ్చగొట్టి బలవంతపు వలసల ద్వారా మన దేశానికి వచ్చి స్థిరపడాల్సిన విధిలేని పరిస్థితులను కల్పించారు. పర్యవసానంగా జరిగిందేమిటి? పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలహీనపడి, సైన్యం పెత్తనం సాగిస్తున్నది. ఉగ్రవాదానికి, పేదరికానికి నిలయంగా మారింది. ప్రప‍ంచ దేశాల పరిణామాలను పరిశీలిస్తే ఇలాంటి చేదు అనుభావాలు అనేక‍ం కనబడతాయి. చారిత్ర నుండి సరియైన పాఠాలు నేర్చుకొనే సంస్కారం నేటితరం రాజకీయ నాయకత్వానికి ఉండాలి. రెండు దేశాల మధ్య నలుగుతున్న వలసల సమస్య పరిష్కార తీరుతెన్నులను ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు 1956 నవంబరు 1న ఆవిర్భవించిన ప్రప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రం దురదృష్టవశాత్తు 2014 జూన్ 2 న‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విభజింపబడింది. పర్యవసానంగా ఒక‌ విచిత్ర పరిస్థితి సృష్టించబడింది. ఆర్టికల్ 371డి ని రాజ్యాంగం నుండి తొలగించలేదు, దాన్ని సవరించనూ లేదు. అంటే అది యథాతదంగా అమలులో ఉన్నది. జన్మస్థలాన్ని బట్టే కాదు, పదవ తరగతికి ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యనార్జిస్తే అక్కడ స్థానికులుగా గుర్తించబడాలని ఆర్టికల్ 371డి లో పేర్కొనబడింది. భారతీయ సమాజంలో వివాహిత స్త్రీలు కాన్పు సమయంలో పుట్టింటికెళ్ళి పురుడుపోసుకోవడ‍ం సహజసిద్ధమైన విషయ‍ం. హైదరాబాదులో దశాబ్దాలుగా స్థిరనివాసం ఉన్నా కాన్పు సమయంలో పుట్టింటికెళ్ళి పిల్లలకు జన్మనిస్తే వారిని స్థానికేతరులుగా పరిగణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల జన్మస్థలం ప్రాతిపథికగా పిల్లల స్థానికతను నిర్ణయించబడాలనే మరొక వితండవాదాన్ని కూడా వినిపిస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని అధ్యాయం-2 క్రింద పొందుపరచిన‌ ఆర్టికల్స్ 5 నుండి 11 వరకు పౌరుల హక్కులు, అస్థిత్వానికి సంబంధించి విస్పష్టంగా పేర్కొనబడింది. భారత స‌రిహద్దుల్లో జన్మించిన లేదా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా భారత సరిహద్దుల్లో జన్మించినా లేదా  నిర్ధేశిత తేదీకి ముందు ఐదు సంవత్సరాలకు పైగా భారత దేశంలో స్థిరనివాసం ఉన్న వారందరినీ పౌరులుగా రాజ్యాంగం గుర్తిస్తున్నది. పాకిస్తాన్ నుండి మన‌ దేశానికి వలస వచ్చిన వారికి కూడా ఆర్టికల్ 6 ప్రకారం పౌర హక్కులు సంక్రమింప జేయడ‍ం జరిగింది. ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులు దేశ మంతటా స్వేచ్ఛగా సంచరించవచ్చు, ఏ ప్రాంతంలోనైనా(జమ్మూ కాశ్మీర్ మినహా) స్థిర‌నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దేశ జనాభాలో 32.6 (28.5%)కోట్ల మంది (2007-08 యన్.యస్.యస్.ఒ. అధ్యయన నివేదిక‌) అంతర్రాష్ట్ర మరియు అంతర్ జిల్లాలకు వలసలు వెళ్ళి స్థిరనివాసం  ఏర్పాటు చేసుకొన్న వారున్నారని తేల్చింది. వలసలకు వివాహ సంబంధాలు, ఉద్యోగ, ఉపాథి వగైరా కారణాలు ప్రధానమైనవని నివేదిక పేర్కొన్నది. విద్య, ఉపాథి, ఆహార సబ్సీడీ, గృహ సదుపాయం, రక్షిత త్రాగు నీరు, పారిశుధ్యం మరియు ఆరోగ్య వసతులు, సామాజిక భద్రత, చట్టభద్రత వగైరా విషయాలలో వలస ప్రజానీకానికి ఉన్న హక్కులను కాలరాయడానికి ఏ ప్రభుత్వమైన పూనుకొంటే అది రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుంది. ఒకే జాతి, ఒకే రాష్ట్రంగా దాదాపు ఆరు దశాబ్దాల పాటు కలిసి జీవిస్తూ అభివృద్ధిలో భాగస్వాములైన‌ ప్రజలను రాజకీయ కారణాలతో వివక్షతకు గురిచేసి, బలవంతపు వలసల వైపు నెట్టాలని చేసే కుట్రలపై ప్రజాస్వామ్య శక్తులు, చైతన్యయుతమైన తెలంగాణ సమాజం కూడా స్పందించాలి.

Monday, August 11, 2014

సాక్షి టి.వి.లో "ఏంసెట్ కౌన్సిలింగ్, ఇంటింటి సర్వే" అన్న అంశాలపై నేను పాల్గొన్న‌చర్చకు సంబంధించిన వీడియోలు


1. 31లోగా ముగించాలి
http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-supreme-court-puts-eamcet-back-on-track-18718

2. ఇంటింటి సర్వే
http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-household-survey-triggers-panic-in-telangana-18719?vod-related

Saturday, August 2, 2014

సాక్షి టీవిలో ఆగస్టు 3, 2014వ తేదీ ఉదయం జరిగిన చర్చలో "బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబు, కెసిఆర్ కలయిక, రైతు రుణమాఫీ, వృత్తి విద్యాకోర్సుల ప్రవేశం" అన్న అంశాలపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన వీడియోలు.



Part-1: ఎంత వరకు ? ఎంత మేలుకు ?

http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-babu-kcrs-friendship-18372

Part-2: కొత్త రుణాలివ్వమంటే ఎలా?
http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-loans-18374

Part-3: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు! 

http://www.sakshi.com/video/daily-programmes/the-headline-show-discussion-on-counselling-issues-18373