డు ధోరణి అపోహలకు హేతువు
Tue, 11 May 2010, IST vv Share Buzz up!
టి. లకీëనారాయణ
బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా విస్తృత ప్రయోజనాలు ఇమిడి ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనడం సహజం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయని, కేవలం జల విద్యుదుత్పాదన అంశంపై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నుండి మాత్రమే అభిప్రాయం రావలసి ఉన్నదని చెబుతూవస్తున్నారు. జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి, 90% కేంద్ర ప్రభుత్వ నిధుల సహాయంతో నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయబోతున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటనలు చేశారు. కేంద్ర జలవనరుల శాఖా మాత్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించే రీతిలో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రకు ఫైల్ సిద్దమ య్యిందన్న వార్తలు వచ్చాయి. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ సంకల్పంతో, అవరోధాలను అధిగమిస్తూ నిర్మాణ పనులు చేబట్టి దాదాపు పదిహేను వందల కోట్ల రూపా యలు ఖర్చు పెట్టారు. ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరబోతున్నదని, సుదీర్ఘ పోరాటాల ఫలితం కళ్ళముందు ప్రత్యక్షం కాబోతున్నదన్న ఆశలు ప్రజల్లో బలపడ్డాయి. ఈ పూర్వరంగంలో కీ.శే. డా|| వై.యస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం అశనిపాతంలా తగిలింది. ప్రాణప్రదమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సజావుగా సాగుతుందా ! అన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. నిధుల మంజూరులో జాప్యం పర్యవసానంగా నిర్మాణ పనులు మందగించాయి. వార్షిక బడ్జెట్‌లో ఘనంగా నిధులను కేటాయించినా, రాష్ట్ర ఖజానాలో నిధుల లేమి కారణంగా సత్వర ప్రయోజనాలు వనగూడ్చే చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించబోతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి.
జలయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని, నిధుల సమస్య లేదని, పోలవరం ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి పునరుద్ఘాటిస్తున్నా, ఆచరణ తద్భిన్నంగా ఉన్నది. దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని అటకెక్కిస్తున్నారనే భావన రోజు రోజుకూ బలపడుతున్నది. ఇదే అదనుగా కొంత మంది నాయకులు పోలవరం ప్రాజెక్టును వివాదాస్పదం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేంద్ర జల సంఘం (సి.డబ్ల్యు.సి.) కూడా డిజైన్లను ఆమోదించి, అన్ని అనుమతులు వచ్చాక ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న వార్తలు గుప్పుమన్నాయి. మళ్ళీ మొదటికొచ్చిందనే గందరగోళాన్ని ప్రజల్లో సృష్టించారు. అలాంటి ఆలోచన లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చినా ప్రజల్లో నమ్మకం కుదరలేదు. రాష్ట్ర ంలో నెలకొన్న సున్నితమైన, సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దగ్గర కొందరు శల్య సారథ్యం చేస్తున్నారనే అపోహలు నెలకొన్నాయి. పోలవరం, ప్రాణిహిత-చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని ఒకేసారి జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని వాదించేవారూ ఉన్నారు. ఏ ప్రాజెక్టునూ మరొక ప్రాజెక్టుకు పోటీ పెట్టి మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. దేని ప్రాధాన్యత దానిదే. ప్రజా ప్రయోజనాలే గీటు రాయిగా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మించాలని కోరడంలో తప్పు లేదు. ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో వివాదం నడుస్తుంటే జాతీయ ప్రాజెక్టుగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించడం ద్వారా అడ్డుకాలు పెట్టడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం, రాజమండ్రి, కొవ్వూరు పట్టణాలు పూర్తిగా జలమయం అవుతాయని భయాందోళనలను సృష్టించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విపరిణామాల మూలంగా ప్రాజెక్టు నిర్మాణం పట్ల ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను పారద్రోలడానికి, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆందోళనాపదం పట్టడం సహజమే. ఈ పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. బహుళ ప్రయోజనకారి అయిన పోలవరం ప్రాజెక్టుపై నాన్చుడు ధోరణి ఈ ప్రాజెక్టును రాజకీయ చిక్కుముడుల్లోకి నెట్టడానికి దోహదపడుతుంది. అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ప్రాణహిత-చేవెళ్ళ ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేసి జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడం శుభపరిణామం. నీటికి రాజకీయ రంగు పులమకూడదు. ప్రాజెక్టులను సత్వరం నిర్మించుకోవడం ద్వారా వృధాగా సముద్రం పాలౌతున్న అత్యంత విలువైన నీటిని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాభివృద్ధికే కాదు, సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చు. ప్రాజెక్టులలో నిల్వ జేసిన నీరు రాజకీయ అనుబంధాలకు అతీతంగా ప్రజలందరి త్రాగు, సాగునీటి అవసరాలను తీర్చుతుంది. దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల్లో ఆహార భద్రత ప్రధానమైనది. ధాన్యాగారంగా పిలువబడే కృష్టా, గోదావరి డెల్టాలో తరచు సాగునీటి సరఫరాలో ఒడిదుడుకులొచ్చి భారీ నష్టం సంభవిస్తున్నది. గోదావరి డెల్టా ఆయకట్టు సాగుకు అవసరమైన నీటిని నిల్వ చేసి, సకాలంలో సరఫరా చేయడానికి వీలుగా రక్షణ కల్పించే రిజర్వాయరు లేదు. కేవలం నదీ ప్రవాహం, ఆనకట్టలమీద ఆధారపడి సాగు చేయబడుతున్నది. నదీ ప్రవాహం నిరంతరాయంగా ఉండడం లేదు. 30 రోజులకు మించి వరదనీరు ప్రవహించడం లేదు. వరదలప్పుడు ఉధృతంగా ప్రవహించడం, తరువాత కాలంలో నది ఎండిపోవడం లాంటి దుస్థితి నెలకొనడంతో నీటి సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. మొత్తం ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి, వేసిన పంటలను కూడా రక్షించలేని గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గడచిన ఏడాది అనుభవం దీన్ని ధృవపరుస్తున్నది. కాబట్టి వరదలు వచ్చినప్పుడు నీటిని నిల్వ చేసుకొని సాగు, త్రాగు నీటి అవసరాలకు వినియోగించు కోవాలంటే అనివార్యంగా భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణానికి యుద్ద ప్రాతిపదికపై పూనుకోవాలి. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు.
పోలవరం వల్ల కేవలం అభివృద్ధి చెందిన ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలకే ప్రయోజనం అన్న దుష్ప్రచారం జరుగుతున్నది. సంకుచిత ఆలోచనలతో ఈ ప్రాజెక్టు ద్వారా ఒనగూడే బహుళ ప్రయోజనాలను చూడ నిరాకరించడం భావ్యంకాదు. నిజమే ఆ నాలుగు జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాల సాగునీటి సదుపాయం, లక్షలాది మందికి త్రాగునీరు, గోదావరి ఆయకట్టు స్థిరీకరణ కల్పించబడుతుంది. అలాగే బచావత్ ట్రిబ్యునల్ పోలవరం నుండి 80 టి.యం.సి.లను కృష్ణా డెల్టా ఆయకట్టుకు అందించి, తద్వారా ఆదా అయ్యే కృష్ణానది నికర జలాలను కరువు పీడిత ప్రాంతాల నీటి అవసరాలను తీర్చుకోవడానికి వీలుగా సిఫారసు చేసింది. 80 టి.యం.సి.లలో కర్నాటక, మహారాష్ట్రలకు 35 టి.యం.సి. లను కేటాయించి, మిగిలిన 45 టి.యం.సి.లను మన రాష్ట్రానికి కేటాయించింది. కృష్ణా జలాల వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు గడువు ముగియడంతో ప్రస్తుతం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేసి, తీర్పు వెలువడించడానికి సిద్ధమవుతున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించి 80 టి.యం.సి.లలో కర్నాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వలేమని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్ళి సాధించాలి. ఆల్మట్టి రిజర్యాయరు నిర్మాణం, అనేక అక్రమ ఆనకట్టలు, చిన్నచిన్న రిజర్వాయర్ల నిర్మాణం పర్యవసానంగా మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నది. పర్యావరణ మార్పుల వల్ల వర్షాల రాకపోకలు అంచానాలకు అందడం లేదు. సాగునీరు అటుంచి, త్రాగునీటికే కటకటలాడే దుస్థితి ఏర్పడింది. మన రాష్ట్రం ఎదుర్కొంటున్న జల వనరుల సమస్యను వివరించడం ద్వారా ట్రిబ్యునల్ ఆమోదం పొందగలిగితే, కృష్ణా మిగులు జలాల ఆధారంగా తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టంపాడు (20 టి.యం.సి.), కల్వకుర్తి (25 టి.యం.సి.), కోయల్ సాగర్ (5 టి.యం.సి.లు), నల్గొండ జిల్లాలో శ్రీశైలం ఎడమ బ్రాంచి కాలువ (ఎస్.ఎల్.బి.సి., 30 టి.యం.సి.లు), రాయలసీమ ప్రాంతంలో తెలుగు గంగ (29 టి.యం.సి.లు), గాలేరు-నగరి (38 టి.యం.సి.లు), హంద్రీ-నీవా (40 టి.యం.సి.లు), ప్రకాశం జిల్లాలో వెలుగొండ (43.5 టి.యం.సి.లు) మొత్తం 230 టి.యం.సి.ల నీరు నిర్మించబడుతున్న ప్రాజెక్టులకు అవసరం. వీలయితే 80 లేదా 45 టి.యం.సి.ల నీటిని వాడుకునే మహత్తర అవకాశం లభిస్తుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాల దాహార్తిని తీర్చడానికి వీలు పడుతుంది.
రాష్ట్రం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటు న్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణా ప్రాంత నీటి అవసరాలు తీర్చడానికి పలు భారీ ఎత్తి పోతల పథకాలను అటు గోదావరి, ఇటు కృష్ణా నదులపై నిర్మించుకుంటున్నాము. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి విద్యుత్ చాలా అవసరం. పోలవరం వద్ద 960 మెగా వాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఒనగూడుతుంది. జాతి సంపద అయిన విశాఖ ఉక్కు కార్మాగారానికి, మహా నగరంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరానికి నీటి అవసరాలు తీర్చడానికి దోహద పడుతుంది. గోదావరి నదీ జలాల వివాదంపై తీర్పిచ్చిన బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 1480 టి.యం.సి.ల నీటిని కేటాయించగా, 800 టి.యం.సి.ల నీటిని మాత్రమే ఇప్పటి వరకు వినియోగించుకో గలుగుతున్నాము. మిగిలిన దాదాపు 700 టి.యం.సి.ల నికర జలాలు మరియు వరద నీరు సాగర గర్భంలో చేరుతున్నాయి. గోదావరి నదిపై చిట్ట చివరన నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏడాది వృథాగా సముద్ర గర్భంలో కలుస్తున్న వేలాది టి.యం.సి.ల నీటిని కొంత మేరకైనా జాతి ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చును. బహుళ ప్రయోజనాలు సమ్మిళితమై ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అన్ని రకాల జాతీయ ప్రాజెక్టు హోదాకు అర్హమైనది. కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ జాప్యం చేయకుండా వెంటనే ఆమోదించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇది జాతి ప్రయోజనాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే ప్రజానీకంలో, ప్రాంతాలలో ఉన్న తీవ్ర ఆవేదన, ఆందోళనను పరిగణలోనికి తీసుకొని సంతృప్తికరమైన పునరావాస పథకాన్ని ముందుగానే పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ప్రత్యేకించి అత్యంత వెనుకబడ్డ గిరిజనులు అత్యధికంగా నష్ట పోతున్న విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని మరింత మెరుగైన ప్యాకేజీని అమలు చేయాలి.
No comments:
Post a Comment