కార్మికులకు అండ కార్మిక సంఘాలే !
Sat, 19 Jun 2010, IST vv Share Buzz up!
టి. లక్ష్మీనారాయణ
సరళీకృత ఆర్ధిక విధానాల అమలుతో కార్మిక సంఘాలు ఉనికి కోల్పోతున్నాయని, కార్మికుల మన స్తత్వంలో మౌలికమైన మార్పులు సంభవించాయని, అసలు కార్మిక సంఘాల అవసరాన్ని కార్మికులు గుర్తించ డంలేదని, శ్రామిక జనాభాలో అత్యధికంగా ఉన్న అసంఘటిత కార్మికులను సంఘటిత పరిచే కర్తవ్యాన్ని కేంద్ర కార్మిక సంఘాలు విస్మరించిన ఫలితంగా అల్పసంఖ్యాకులైన సంఘటిత కార్మికులకు మాత్రమే వాటి కార్యకలాపాలు పరిమితమైపోయాయని, కార్మిక సంఘాల సభ్యత్వం కుచించుకుపోతున్నదని, కార్మికుల్లో పెటీబూర్జువా, బూర్జువా లక్షణాలు ప్రబలుతున్నాయని, కార్మికసంఘాలు వర్గపోరాటాలకు వ్యతిరేకంగా మసలు కొంటున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారు. కార్మిక వర్గమే అంతరించిపోతున్నదనే సిద్ధాంతాన్ని పెట్టుబడి దారీ ఆర్ధిక వేత్తలు ఉద్దేశ్యపూర్వకంగానే కార్మికోద్యమాన్ని నిర్వీర్యం చేయాలనే ధ్యేయంతో జాతీయంగా, అంతర్జాతీయంగా విషప్రచారం చేస్తున్నారు. పెట్టుబడి దారీవర్గం పెద్దఎత్తున దూకుడుగా సాగిస్తున్న దాడితో నిరాశ, నిస్ప్రహల్లో పడిపోయిన కొంతమంది కార్మికవర్గ శ్రేయోభిలాషులు కూడా తెలిసిగానీ, తెలియక గానీ ఈ దుష్ప్రచారానికి కాస్త బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యా నాలు చేస్తున్నారు. మేడే సందర్భంగా ఒక దిన పత్రికలో గొట్టిపాటి సుజాత వ్రాసిన వ్యాసంలో ఈ తరహా అభిప్రాయాలు కొన్నింటిని వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల భవిష్యత్తు ప్రశ్నార్ధకమయ్యిందని పేర్కొనడం అసంబద్దం. కార్మికవర్గ హక్కుల కోసం, పెట్టుబడిదారి వర్గ దోపిడీకి వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో రాజీలేని సమరశీల పోరాటాలను సాగిస్తున్న ఘనమైన చరిత్ర వామపక్ష కార్మిక సంఘాలకున్నది. అలా అని విమర్శల్లో పూర్తిగా హేతుబద్దత లోపించిందని అనలేం. కార్మిక సంఘాల తీరుతెన్నులపై కొన్ని సద్విమర్శలు ఉన్నాయి. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, నిర్బంధకాండ. రెండోవైపు పెట్టు బడిదారీ వర్గం ఒక్కటై ఎక్కుపెట్టిన దాడి. పర్యవసానంగా యావత్తు కార్మిక వర్గం,దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు ఒడుదుడుకులను, పెనుసవాళ్ళను ఎదుర్కొంటున్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఉద్యమాలే ఆలంబన : పారిశ్రామిక విప్లవంతోపాటు కార్మికోద్యమం ఆవిర్భవించింది. బానిస వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ అవలక్షణాలను పునికిపుచ్చుకొని పురుడు పోసుకొన్న పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రమ దోపిడీలో నూతన పుంతలు తొక్కింది. శ్రమ దోపిడీని అరికట్టడం, సృష్టించిన సంపదలో న్యాయబద్ధమైన వాటా కోసం, ఎనిమిది గంటల పని దినం కోసం, పని భద్రత, మెరు గైన వేతనాలు, సామాజిక న్యాయం, జీవన ప్రమాణాల పెరుగుదల, అంతిమంగా సోషలిస్టు సమాజ నిర్మాణమే లక్ష్యంగా కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభమయ్యింది. అంతర్జాతీయ కార్మికోద్యమంలో అంతర్భాగంగా '' ఆలిం డియా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి.)'' 1920 అక్టోబరు 31న బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నికృష్టమైన వలస పాలన సాగుతున్న కాలంలో ఉద్భ వించింది. కార్మిక శక్తిని సంఘటితపరచి స్వాతంత్రో ద్యమంలో క్రియాశీల పాత్ర పోషించింది. కార్మికుల హక్కుల కోసం నాటి నుండి నేటి వరకూ వివిధ రూపా లలో అలుపెరగని ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్క్‌మన్స్ కాంపెన్‌సేషన్ చట్టం-1923 మొదలు ట్రేడ్ యూనియన్ చట్టం-1926, పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం - 1936, పారిశ్రామిక వివాదాల చట్టం - 1947, ఫ్యాక్టరీల చట్టం - 1948, కనీస వేతనాల చట్టం - 1948, ఇ.యస్.ఐ. చట్టం - 1948, ఇ.పి.ఎఫ్. చట్టం - 1952, మెటర్నిటీ బెనిఫిట్ చట్టం - 1961, బోనస్ చట్టం - 1965, కాంట్రాక్ట్ కార్మికుల (క్రమబద్ధీకరణ మరియు నిషేధం) చట్టం - 1970, గ్యాట్యుటీ చట్టం - 1972, సమానపనికి సమాన వేతన చట్టం - 1976 వగైరా అనేక కార్మిక చట్టాలను సాధించుకొన్న ఘనమైన చరిత్ర భారత కార్మికోద్యమానికి ఉన్నది. ఇవన్నీ పాలకుల దయాదాక్షిణ్యాలతో రాలేదు, సమరశీల పోరాటాలతో వచ్చాయి. కార్మిక వర్గం తన స్వప్రయోజనాల కోసం పోరాడుతూనే సామాజిక మార్పు కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యం ఉన్నది. ''మార్క్సిజం- లెనినిజం'' సైద్దాంతిక అధ్యయనం, ఆచరణ కార్మికవర్గానికి వంటబట్టాలి. కారల్ మార్క్స్ ''అదనపు విలువ సిద్ధాంతం'', ''పెట్టుబడి, శ్రమ, వేతనం'', ''వర్గాలు-వర్గపోరాటానికి'' సంబంధించిన చైతన్యాన్ని కార్మికవర్గం పొందాలి.
చీలిక ప్రభావం :
దేశంలో భావ జాల సంఘర్షణ కార్మికోద్యమంలో చీలికకు దారితీసింది. ఆర్ధిక పోరాటాలకే కార్మిక సంఘాలు పరిమితం కావాలని, రాజకీయ సిద్ధాంత కార్యకలాపాలకు దూరంగా ఉండాలనే వాదనలతో చీలిపోయి కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. వామపక్ష భావజాలానికి అంకితమైన కార్మిక వర్గం కూడా దుర దృష్టవశాత్తు చీలిపోయి వివిధ సంఘాలు ఏర్పడ్డాయి. మౌలికంగా దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాల్సిన చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన కార్మికవర్గం చీలికలు పేలికలుగా విభజింపబడటం పెట్టుబడిదారీ వర్గానికి మహాదానందం కల్గించే పరిణామం. నేడు దేశంలోని జాతీయ, ప్రాంతీయ రాజకీయపార్టీలు దాదాపు అందరూ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొని, రాజకీయ లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మిక ప్రయోజనాల కంటే సంకుచిత రాజకీయ ప్రయోజనాలే మిన్నగా ఆలోచిస్తున్నారు. రాజకీయ పార్టీలే కాదు వ్యక్తులు సహితం స్వప్రయోజ నాల కోసం తమకున్న ఛరిస్మాతో, వాగాడంబర నినాదాలతో రెచ్చగొడుతూ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. ఇందుకు ముంబయికి చెందిన దత్తా సామంత్ ఒక ప్రబల నిదర్శనం. ఆ స్థాయిలో కాక పోయినా వ్యక్తుల చుట్టూ పరిభ్రమించే కార్మిక సంఘాలు మన రాష్ట్రంలో కూడా దర్శనమిస్తాయి. కులం, మతం ప్రాతిపదికన సంఘాలు పుట్టుకొస్తున్నాయి. మధ్యతరగతి ఉద్యోగులు స్వతంత్య్ర సంఘాలను ఏర్పాటుచేసు కున్నారు. పర్యవసానంగా కార్మిక వర్గంలో వర్గసంకర రాజకీయాలు, మితవాద భావజాలం బలంగా వేళ్ళూను కొనడానికి అవకాశం కలిగింది. ''పెట్టుబడి'' దాష్టీకాలకు వ్యతిరేకంగా శక్తివంతమైన ఆయుధంగా పనిచేయాల్సిన సమిష్ఠి ఉద్యమ బలాన్ని కార్మికులు ప్రదర్శించ లేక పోతున్నారు. ఈ బలహీనత దోపిడీదారులకు వరంగా పరిణమించింది. కార్మిక వర్గంపై ముప్పేటదాడికి పూను కొన్నారు. సరళీకృత ఆర్ధిక విధానాలతో ప్రభుత్వాలు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు బహిరంగ వత్తాసు ఇచ్చాయి. బహుళజాతి సంస్ధలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్యమండలి వత్తిడికి లొంగి కార్మిక చట్టాలను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించి పూనుకొన్నది.
రాజ్యాంగ పరిధిలో బడుగు బలహీన వర్గాలకు అండగానిలిచి, సామాజిక, ఆర్ధిక, రాజకీయ హక్కులను పరిరక్ష్షించాల్సిన న్యాయవ్యవస్ధ సహితం సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ భావజాల ప్రభావానికి గురై కార్మిక వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నది. కార్మికుల ఆఖరిపోరాట ఆయుధమైన సమ్మెహక్కు అనైతికమని, చట్టవ్యతిరేకమని, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకమని సంచాలనాత్మక తీర్పులను వెలవడించడం మొదలు పెట్టాయి. ప్రభుత్వాల అండ, న్యాయస్థానాల కార్మిక వ్యతిరేక తీర్పులను ఆసరాగా చేసుకొని స్వదేశీ, విదేశీ కార్పోరేట్ సంస్థలు, చిన్న పెద్ద పెట్టుబడిదారులు లాభాల శాతాన్ని పెంచుకోవడానికి మరింత రెచ్చిపోయి తీవ్ర దోపిడీకి, నిర్బంధకాండకు పూనుకొన్నాయి. ''హైర్ అండ్ ఫైర్'' విధానాన్ని అమలుచేస్తున్నారు. పని భద్రతలేదు. ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి వేతనాల్లో కోత విధిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులను, ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని పెంచేస్తున్నారు. కొత్తగా ఉద్యోగ కల్పనలేదు. వృద్ధాప్య ఫించను లాంటి సామాజిక భద్రతా సదుపాయాల అమలు లేదు, '' కంచే చేను మేసినట్లు'' రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇదే తరహా విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో, కార్పోరేషన్లలో కాంట్రాక్టు కార్మికులు, క్యాజువల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగుల నియామకం ద్వారా శాశ్వత స్వభావం కలిగిన పనులను చేయించుకొంటున్నారు. పర్యవసానంగా కార్మి కులు, ఉద్యోగులు అభద్రతా భావంలో కొట్టుమిట్టాడు తున్నారు. కార్మిక చట్టాల అమలు కోసం, మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత, హక్కుల సాధనకోసం ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొనా లంటేనే భయపడే భయానక పరిస్థితులు కల్పించారు. దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న అసంఘటిత కార్మికులను సంఘటితపరచి, సంఘాలు పెట్టి, యాజ మాన్యాలతో బేరసారాలాడే ఉమ్మడి శక్తిని కూడగట్టు కోవడానికి కార్మిక సంఘాలు చేస్తున్న కృషిని మొగ్గలోనే తుంచేస్తున్నారు. సంఘం పెట్టుకోవాలనే ఆలోచన ప్రారంభ దశలో ఉండగానే పని నుండి తొలగించి, మెడబట్టి గెంటేస్తున్నారు. ప్రభుత్వం, కార్మికశాఖ, న్యాయస్థానాలు ఎవర్ని ఆశ్రయించినా ఫలితాలు శూన్యం. అసంఘటిత కార్మిక వర్గానికే కాదు, సంఘటిత కార్మిక వర్గం ఇలాంటి చేదు అనుభవాలనే చవి చూస్తున్నది. ఫలితంగా కార్మికుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొనడం సహజం. సంఘటిత రంగంలోని కార్మి కులు, ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలు, సమ్మె లాంటి పోరాటాలలో భాగస్వాములు కావాలంటే వెనకడుగువేస్తున్న మాట నిజం. ఒకరోజు సమ్మెకు మూడు నుండి వారం రోజుల వేతనాన్ని ప్రభుత్వ సంస్థల్లో కోత పెడుతున్నారు. ప్రయివేటు సంస్థల్లో ఏకంగా ఉపాధి నుండి తొలగిస్తున్నారు. ఈ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడు తున్నా ఫలితాలను రాబట్టలేని అననుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరొక వైపున అవినీతిపరులు, దళారులు కార్మికోద్యమంలో ప్రవేశించారు. యాజ మాన్యాలే తమ తొత్తు సంఘాలను ఏర్పాటుచేసి వ్యవహారాలను నడిపిస్తున్నాయి. స్వార్ధం, వ్యాపార నీతి, కండబలం, పైరవీలు, లంచాలిచ్చి పనులు చేయించు కోవడం లాంటి పెడధోరణులు, అన్యవర్గధోరణులు ప్రబలుతున్నాయి. యాజమాన్యం, స్వార్ధపరులైన కార్మిక నేతల అపవిత్ర కూటములు పరిశ్రమల్లో, సంస్థల్లో ఏర్పడుతున్నాయి. ఇలాంటి దుష్టశక్తుల వల్ల కార్మికవర్గానికి తీరని నష్టం సంభవిస్తున్నది. కార్మిక పక్షపాతంతో నిస్వార్ధంగా కార్మికవర్గ శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగాలకైనా వెరవకుండా సైద్ధాంతిక కట్టుబాటుతో పని చేస్తున్న సంఘాలు ఈ సవాళ్ళన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఉద్యమబాటలో అగ్రభాగాన నడక సాగిస్తూనే ఉన్నాయి. యావత్తు కార్మిక వర్గాన్నీ సంఘటిత పరచడంలో ఆటు పోట్లను ఎదు ర్కొంటున్నాయి. అవరోధాలను అధిగమించడానికి, నిర్మాణ బలహీనతల నుండి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఉనికిపై కొంతమంది దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా చర్చకు తెరలేపారు. ''పెట్టుబడి''కి దాసోహం పలికి ఉద్దేశ్యపూర్వకంగానే కార్మికోద్యమాన్ని దెబ్బతీయాలని పథకం ప్రకారం విషప్రచారం చేస్తున్నవారు కొందరైతే, అవగాహనారాహిత్యంతో కార్మికోద్యమం ఎదుర్కొంటున్న పెను సవాళ్ళ తీవ్రతను అర్ధం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నవారు కొందరు ఉన్నారు. దోపిడీకి అవకాశం ఉన్నంత కాలం దానికి వ్యతిరేకంగా ఉద్యమించే కార్మికోద్యమం అనివార్యంగా ఉండి తీరుతుంది. కార్మిక సంఘాల ఆవశ్యకత, మనుగడ కార్మికుల చైతన్యంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల మూలంగా ఉపాధికల్పన లేని అభివృద్ధి జరుగుతున్నది. డా|| అర్జున్ సేన్ గుప్తా నివేదిక ప్రకారం కేవలం 2% ఉపాధికల్పన, అది కూడా కేవలం అసంఘటిత రంగంలోనే ఉన్నదని వెల్లడయ్యింది. ఈ రంగంలో ఉపాధికి, వేతనాలకు, సామాజిక భద్రతకు ఏమాత్రం రక్షణ లేదని, పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. దేశంలోని దాదాపు 45 కోట్ల శ్రామిక జనాభాలో 93% కార్మికులు అసంఘటిత రంగంలోనే పని చేస్తున్నారు. 7% గా ఉన్న సంఘటిత కార్మికుల్లో అత్యధికులు కేంద్ర కార్మిక సంఘాలలోనో లేదా పారిశ్రామిక, ఆయా సంస్థల కార్మిక సమాఖ్యలలోనో సభ్యులుగా చేరి సంఘటితంగా ఉన్నారు. కానీ అసంఘటితరంగ కార్మికుల్లో అత్యధికులు నిర్మాయుతంకాకుండా కార్మిక సంఘాల వెలుపల చెల్లా చెదురుగా విస్తరించి ఉన్నారు. అందుకే ఎ.ఐ.టి.యు.సి. '' ఆర్గనైజ్ అనార్గనైజ్డ్ '' (అసంఫటితులను సంఘటిత పరచండి) అన్న నినాదంతో పట్టుదలతో కృషి చేస్తున్నది. దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటి సభ్యత్వం కలిపినా మొత్తం కార్మికుల్లో 15% కి మించిలేదు. అలాగే సంఘాల సభ్యత్వంలో యాభై శాతానికి పైగా అసంఘ టిత కార్మికులే. కానీ మొత్తం అసంఘటిత కార్మికుల సంఖ్యతో పోల్చితే కేవలం 5%మంది సంఘాల్లో వున్నారు. ఈ వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకొని, నిజంగా సంఘాల అండ కావలసిన అసంఘటిత కార్మికులను కూడగట్టి, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం పాటుపడాల్సిన ప్రాథమిక బాధ్యత కార్మిక సంఘాలపై ఉన్నది. నేడు కార్మిక సంఘాలకున్న నిర్మాణ పరిమి తులను, సామర్ధ్యాన్ని, అవకాశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
సంఘటిత రంగంలో సమస్యలు లేవనుకొంటే పొరపాటే. సామాజిక మార్పుకు చోదక శక్తిగా ఉండి కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన సంఘటిత కార్మికవర్గంలో రాజకీయ, సైద్ధాంతిక అవగాహన బాగా కొరవడింది. అవకాశవాదం, క్యారియరిజం పెరుగుతున్నది. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని చూస్తే సాధారణ ఎన్నికలను తలపించేలా జరుగుతున్నాయి. కార్మికవర్గ సంస్కృతి దెబ్బతింటున్నది. మధ్యతరగతి ఊగిసలాట మనస్థత్వం పెరుగుతున్నది. ఆర్థిక సమస్యల పరిష్కారానికి, కార్మిక చట్టాల అమలు, హక్కుల సాధనకు మాత్రమే కార్మికసంఘాలను వేదికలుగా పరిగణించే భావన చోటుచేసుకొన్నది. సభ్యత్వం, చందా చెల్లించడం పనులు చేయించుకోవడం అన్న అలోచనను వామ పక్షేతర కార్మిక సంఘాలు ప్రేరేపిస్తున్నాయి. మారుతున్న ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రభావంతో మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్న కార్మికులూ మారుతున్నారు. కార్మికవర్గ పోరాట పదును తగ్గకుండా చైతన్యాన్ని నేటితరం కార్మికులకు అందించాల్సిన గురుతర బాధ్యత వామపక్ష కార్మిక సంఘాలపై ఉన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థలో రెండు వర్గాలు, రెండు రకాల వర్గ ప్రయోజనాలు, రెండు దృక్పధాలు పర్యవసానంగా నిరంతర సంఘర్షణ ఉంటుందన్న వాస్తవాన్ని తెలియ జెప్పి వర్గ పోరాటాల వైపు సంఘటిత, అసంఘటిత కార్మికులందరినీ నడిపించాల్సి ఉంది.
Share Buzz up! Share Email Print
«మునపటి ఆర్టికల్
No comments:
Post a Comment