Wednesday, February 9, 2011

పోలవరానికి జాతీయ హోదా కల్పించాలి- సాక్షి లో వ్యాసం

జాతీయహోదా తప్పనిసరి!
రాష్ట్రంలో సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి, తాగునీటి కొరతను నివారించి, పారిశ్రామికాభివృద్ధిని సాధించడానికి పోల వరం ప్రాజెక్టు నిర్మాణం అవశ్యంగా మారింది. సముద్రం పాలవుతున్న దాదాపు 3 వేల టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకోవడానికి అనువుగా పోలవరాన్ని డిజైన్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుంచే పోలవరం ప్రతిపాదనలు రూపొందాయన్నది గమనార్హం. ఏడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాజెక్టును సాకారం చేసుకోవడానికి ప్రజలు అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ‘జలయజ్ఞం’లో భాగంగా పోలవరం నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం మండలం, రామయ్యపేట గ్రామం వద్ద ‘ఇందిరాసాగర్ ప్రాజెక్టు’ పేర నిర్మిస్తున్న పోలవరం బహుళప్రయోజనకారి. 150 అడుగుల ఎత్తులో ‘ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం’ను 194.6 టీఎంసీల సామర ్థ్యంతో నిర్మించి, 301.38 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ఉద్దేశించిన మహత్తర ప్రాజెక్టు ఇది.

ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల 58 వేల ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,49,872 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 62 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అలాగే, విశాఖ మహానగరంతో సహా 48 మండలాల్లో 540 గ్రామాలకు రక్షిత మంచి నీటి సదుపాయం కల్పించవచ్చు. సామాజికాభివృద్ధికి విద్యుత్తు ఇరుసు వంటిది. విద్యుత్ కొరత రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. తెలంగాణ మెట్ట ప్రాంతాలకు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం వగైరా ఎత్తిపోతల పథకాలకు పెద్ద ఎత్తున విద్యుత్తు కావాలి. ఈ నేపథ్యంలో 960 మెగావాట్ల జల విద్యుదుత్పాదనకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి, విశాఖ-కాకినాడ మధ్య నెలకొల్పే పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన 23.44 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యమవుతుంది. కృష్ణాడెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కల్పించే సదుద్దేశంతో, గోదావరి నదీజలాల వివాదాల పరిష్కారానికి నియమించిన బచావత్ ట్రిబ్యునల్ మూడు దశాబ్దాల క్రితమే పోలవరం నిర్మాణం ద్వారా 80 టీఎంసీల నీటి తరలింపునకు ఆమోదం తెలిపింది.

ఈ పూర్వరంగంలో గోదావరి, కృష్ణానదీ జలాల అనుసంధానం తక్షణావసరం. పోలవరం ప్రాజెక్టును సత్వరం నిర్మించి, కృష్టాడెల్టా ఆయకట్టుకు నీరందించడం ద్వారా, ఆమేరకు ఆదా అయ్యే కృష్టా నీటిని కరువు పీడిత ప్రాంతాలలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కొంతైనా నీటిని కేటాయించవచ్చు. 80 టీఎంసీలలో 35 టీఎంసీల నీటిని కర్ణాటక, మహారాష్టల్రకు ఇవ్వాలని గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఒప్పందంలో పేర్కొన్న అంశాన్ని రద్దు చేయాలని మన రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేయాలి. ఎందుకంటే, పోలవరాన్ని మన నిధులతో నిర్మించుకుంటున్నాం. పెపైచ్చు కృష్ణా జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్టల్రకు వారు ఆశించిన దానికంటే అధికంగా వాటాను పొందారు. దీనితో దిగువన ఉన్న మన రాష్ట్రానికి శాశ్వత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.

మెరుగైన పునరావాసం కల్పించాలి
పోలవరం నిర్మాణంలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యాలు ఇమిడి ఉన్నాయన్నది తెలిసిందే. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన దీని నిర్మాణానికి, రూ. 9,072 కోట్లు ఖర్చవుతుందని 2003-04 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసింది. ‘వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు’ అన్న చందంగా, ఈ ప్రాజెక్టును పలు రకాల జటిల సమస్యలు చుట్టుముట్టాయి. వాటిలో నిర్వాసితుల సమస్య అత్యంత ప్రధానమైనది. మన రాష్ట్రంలో 94,375 ఎకరాలతో 299 గ్రామాల్లోని 1,05,200 మంది నిర్వాసితులవుతారని అంచనా. ముంపునకు గురయ్యే ప్రాంతాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలోను, మరికొంత తూర్పుగోదావరి జిల్లాలోను ఉంది. వీరిలో 45 శాతం మంది గిరిజనులే.

వీరి సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల సహా వృత్తులు, ఉపాధి, భూమి, నివాస స్థలాలు, గిరిజనుల పరిరక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలతో సహా సర్వం కోల్పోతామన్న ఆవేదన వారిలో నెలకొన్నది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం నష్టపోతున్న గిరిజన, గిరిజనేతర నిర్వాసితులకు న్యాయబద్ధమైన, మెరుగైన పునరావాస ప్యాకేజిని ప్రకటించి, ముందుగానే నిధులు కేటాయించడం సముచితం. పునరావాస కార్యక్రమాలకు రూ. 2 వేల కోట్లు ఖర్చవుతాయన్నది అంచనా. ఇప్పటికే నష్ట పరిహారం కింద రూ. 350 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రజానీకంలో భయాందోళనలు రెచ్చగొట్టడానికి కొన్ని దుష్ట శక్తులు విష ప్రచారానికి పూనుకున్నాయి. ఇందిరాసాగర్ రిజర్వాయర్ ఏ కారణాలతోనైనా బద్దలైతే ఉపద్రవం సంభవిస్తుందనీ రాజమం డ్రి, కోవూరు సహా చుట్టు పక్కల ప్రాంతాలు జలసమాధి అవుతాయనీ ప్రచారం చేయడం రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నేరపూరితమైన చర్యగా పరిగణించాలి.

జాతీయ హోదా కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలి. త్వరితగతిన నిర్మాణానికి ఉపక్రమించాలి. కాలం గడిచే కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుందన్నది గమనంలో ఉంచుకోవాలి. ఆరేళ్ల క్రితం రూ. 9,072 కోట్లుగా ఉన్న అంచనా,ప్రస్తుతం రూ. 16 వేల కోట్లకు పెరగడం గమనార్హం. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను గమనిస్తుంటే, 2014 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. 25,713 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటికి 21 వేల ఎకరాలు మాత్రమే సేకరించినట్టు తెలుస్తోంది. కుడి, ఎడమల ప్రధాన కాల్వల నిర్మాణంపై 2010 జూలై నాటికి రూ. 3,229 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రూ. 1,035 కోట్లు కేటాయించినప్పటికీ, వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నది ప్రధాన విమర్శ.

గతంలో చేసిన నిర్ణయం మేరకు 36 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో అనుమతించి, మళ్లీ 50 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి పెంచాలని కేంద్ర జలసంఘం చేసిన సిఫార్సు మూలంగా డిజైన్‌ను మార్చాల్సి రావడంతో రిజర్వాయర్, స్పిల్‌వే నిర్మాణ పనులు ఇంకా చేపట్టలేదు. దాంతో మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపైనే నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆహార భద్రత కోసం చట్టాన్ని తెస్తామని వాగ్దానాలు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దానికి ఉపకరించే పోలవరం బహుళార్థకసాధక ప్రాజెక్టు నిర్మాణానికి ఇకనైనా అంకిత భావంతో ముందడుగు వేయాలి. వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేయడానికి మార్గాన్ని సుగమం చేయాలి. అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన గోదావరి- కృష్ణా డెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కల్పించాలి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పోలవరం నిర్మాణమే శాశ్వత పరిష్కారం అన్నది గుర్తించాలి.
టి.లక్ష్మీనారాయణ
సీపీఐ రాష్ట్ర నాయకులు

No comments:

Post a Comment