సంక్షోభంలో సంక్షేమం!
విశ్లేషణ
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపందాలుస్తున్న కొద్దీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని నేటి బడ్జెట్ పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో పెనవేసుకున్న బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు, పేదలకు నీడ కల్పించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాల్సిన బకాయిలూ... వగైరా తక్షణం చెల్లించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
విశ్వసనీయతకు, జవాబుదారీ తనానికి ఆమడ దూరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రాజకీయ అభద్రతాభా వానికి అద్దంపడుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్నకొద్దీ, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతు న్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని నేటి బడ్జెట్ పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టు పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో పెనవేసుకున్న బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు, పేదలకు నీడ కల్పించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చెల్లించాల్సిన బకాయిలూ... వగైరా తక్షణం చెల్లించాలని పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థలు, విశ్వ విద్యాలయాలకు నిధులు విడుదలకాక ఆర్థిక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపుకే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ధైర్యంతో రూ. 1,28,770 కోట్ల భారీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించిందో అర్థంకాదు. వాస్తవాల ఆధారంగా, నిజాయితీతో ఆదాయ వ్యయాలను, గత అనుభవాల ప్రాతిపదికగా శాస్ర్తీయ దృక్పథంతో అంచనా వేసి బడ్జెట్‌ను తయారు చేయలేద న్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రానికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థికశాఖా మాత్యులు కె.రోశయ్య రూ. 1,13,660 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం పొందారు. దాన్ని రూ. 1,11,057 కోట్లుగా తరువాత సవరించారు. అందులో ఖర్చు చేసిన గణాంకాలు మరో ఏడాదికిగానీ బహిర్గతం కావు.
కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను వంచించడానికి బరితెగించిందని చెప్పక తప్పదు. కేటాయింపులు చేసినట్లు కాగితాలపై చూపి, ఆచరణలో ఎగనామం పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ రూపొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జలయజ్ఞానికి రూ. 15,021 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌లో దాన్ని రూ. 11 వేల కోట్లకు కుదించారు. ఇప్పటికి కేవలం రూ. 5,500 కోట్లు విడుదల చేశారు. మరో రూ. 3,800 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలున్నాయి. గత బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 10 వేల కోట్లు కూడా వ్యయం చేయలేదని స్పష్టమవుతున్నది. కానీ రానున్న ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రూ. 15,010 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయించడం మంచిదే కానీ, ముగుస్తున్న సంవత్స రంలో రూ. 700 కోట్లు కేటాయించి రూ. 43 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు రూ. 700 కోట్లు కేటాయించి రూ. 34 కోట్లు విడుదల చేశారు. మళ్లీ రూ. 608 కోట్లు కేటాయించారు. గాలేరు-నగరికి రూ. 660 కోట్లు కేటాయించి రూ. 160 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు రూ. 540 కోట్లు కేటాయించారు. చిన్న నీటి పారుదలకు రూ. 1,680 కోట్లు కేటాయించి రూ. 503 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం రూ. 2,092 కోట్లు కేటాయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ రాజకీయంగా సంతృప్తి పరచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయిగానీ, చిత్తశుద్ధితో వ్యయం చేసే ఉద్దేశంతో కాదన్నది స్పష్టం.
సన్నగిల్లుతున్న విశ్వాసం
ప్రతి ఏడాది పండుగలు, జాతీయ సెలవు దినాలు వచ్చి పోతున్నట్లే వార్షిక బడ్జెట్‌ను కూడా సాదాసీదా వ్యవహారంగా పాలకులు తీసుకుంటున్నట్లు కనబడుతున్నది. రాజ్యాంగబద్దమైన కర్తవ్యాన్ని బాధ్య తగా నిర్వహించాలనే రాజకీయ సంకల్పంగానీ, చట్టసభ ఆమోదం తరువాత బడ్జెట్ కేటాయింపులకు అను గుణంగా నిధులు విడుదల చేసి, జవాబుదారీతనంతో వ్యవహరించాలనే బాధ్యతనుగానీ గుర్తించడం లేదు. పైరవీకారులు, దళారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిళ్లు, అవినీతి, అధికార దుర్వినియోగం, పాలక పార్టీ రాజకీయ అవసరాల మీద ఆధారపడి నిధుల విడుదల, మళ్లింపులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఈ మార్చి 31తో ముగిసే బడ్జెట్‌లో రూ. 1,800 కోట్లు కేటాయించి, వెయ్యి కోట్లు ఖర్చు చేశారు.
ఇప్పుడు రూ. 2,300 కోట్లు కేటాయించారు. రెండు రూపాయలకు కేజీ బియ్యం పథకానికి రూ. 3 వేల కోట్ల నుండి రూ. 2,500 కోట్లకు కుదించారు. ఒకవైపున రేషన్‌కార్డుల సంఖ్య పెరుగుతున్నది, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన నెలకు 30 కేజీల హామీ ఉండనే ఉన్నది. కానీ బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కోతపెట్టారు. బోధనా ఫీజులకు, స్కాలర్‌షిప్‌లకు రూ. 1,742 కోట్ల కేటాయింపుల్లో నిధులను విడుదల చేయలేదు. దాదాపు రూ. 3,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసి, బకాయిల చెల్లింపుపై నిర్దిష్ట గడువు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న పూర్వరంగంలో కూడా నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించింది. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల కోసం గతంలో లాగే రూ. 1,932 కోట్లు కేటాయించి, పెరుగుతున్న అవసరాలను గుర్తించ నిరాకరించింది. మహిళా సాధికారతపై గొప్పలు చెప్పే ప్రభుత్వం స్వయం సహాయ బృందాలకు వడ్డీ రాయితీ నిమిత్తం ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి రూ. 400 కోట్లు కేటాయించారు.
పావలా వడ్డీ రుణాలు ప్రభుత్వం నుండి లభించకనే పేద మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలతో అప్పులు చేసి, తీర్చలేక పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న నేపధ్యాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లిపోతున్న గ్రామీణ పేదల కోసం చట్టబద్ధంగా ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కోసం చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని రూ. 300 నుండి రూ. 600 కోట్లకు పెంచారు. కానీ, ఇది ఏ మూలకు సరిపోతుంది? ఇందులోని అవినీతిని పక్కనపెడితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజులకు మరో 25 రోజుల పనిని అదనంగా రాష్ట్రంలో కల్పిస్తామని రచ్చబండలో హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలంటే నిధులు ఎలా సరిపోతాయి. అలాగే ఈ తరహా పథకాన్ని పట్టణ ప్రాంత పేదలకు కూడా అమలు చేస్తామన్నారు. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. వైఎస్ అభయహస్తం పెన్షన్ పథకం పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తుకు కేటాయింపులు పెంచలేదు.
ఉపాధి కల్పనా రంగాలకు మొండిచెయ్యి
వ్యవసాయ రంగమే నేటికీ గ్రామీణ జనాభాలో అత్యధికులకు జీవనాధారం. సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ఈ రంగానికి ప్రణాళికా పద్దు కింద కేవలం రూ.2,814 కోట్లు కేటాయించారు. అలాగే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి పారిశ్రామిక రంగానికి ప్రణాళిక వ్యయంలో రూ. 775 కోట్లు కేటాయించారు. యువత భవిష్యత్తుపై కబుర్లు చెప్పే ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంపొందించ కుండా రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందిస్తారు? పోనీ సేవా రంగం అభివృద్ధికి, విస్తరణకు దోహదపడే విధంగా ఆ రంగానికి నిధులను కేటాయించారంటే అదీ లేదు.
కీలకమైన విద్యుత్ రంగా నికి నామమాత్రంగా రూ. 625 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా హామీ నెరవేరదు. ఇంతటి కీలక రంగంలో దూరదృష్టితో ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టకుండా ప్రైవేట్ రంగంపై ఆధారపడే విధానాన్ని అమలుచేస్తే పర్యవసా నాలు తీవ్రంగా ఉంటాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక భద్రత, ఉపాధికల్పన, వస్తూత్పత్తి రంగాలపై కేంద్రీకరణ లోపించింది. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను వెచ్చించే దృష్టితో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి పేరిట రూ. 400 కోట్లు కేటాయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటంగానే భావించాలి.
మోయలేని రుణభారం
రాష్ట్ర ప్రజలపై రుణభారం ఏటేటా పెరిగిపోతోంది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,651 కోట్లు ఉన్న అప్పులు, 2010-11లో సవరించిన బడ్జెట్ గణాంకాల మేరకు రూ. 1,23,227 కోట్లకు చేరుకుంటుంది. 2011-12 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం రుణభారం రూ. 1,41,151 కోట్లకు పెరగబోతున్నది. దీనికి అదనంగా రూ. 40 వేల కోట్లకు పైగా స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్స్ చేసిన అప్పుల భారం ఉండనే ఉంది. అంటే మొత్తం రూ. 1,80,000 కోట్లకు పైగా ప్రజల నెత్తిన ఉన్నది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ. 17,602 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడిం చారు. ఆ మేరకు అప్పులు చేయనున్నారని చెప్పకనే చెప్పారు. బడ్జెట్ స్థితిగతులపై పొందుపరచిన గణాంకా లలో ఆదాయం పద్దుకింద రూ. 1,00,995 కోట్లుగా, రుణాల సేకరణ ద్వారా రూ. 26,475 కోట్లుగా పేర్కొన్నారు.
ప్రజలపై భారం
రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 46,999 కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే ఏడాది 20 శాతం అదనంగా 56,438 కోట్లు రాబట్టుకోవాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు. ఒక వైపు అప్పుల భారాన్ని పెంచుతూ, మరో వైపు ప్రజలపై భారాలు మోపై ప్రజావ్యతిరేక బడ్జెట్ ఇది.
టి.లక్ష్మీనారాయణ
సీపీఐ నాయకులు
No comments:
Post a Comment