సూర్య దినపత్రిక నవంబరు 8,2011
- సంస్కరణల ఫలితమే అధిక ధరలు
- పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి
- క్షీణించిన జీవన ప్రమాణాలు
- పన్నుల్ని సైతం అరికట్టలేరా?
- సబ్సిడీలకు చెక్ పెట్టే యోచన
- ప్రైవేట్ విమానయాన సంస్థలకు రాయితీలు
అభివృద్ధి జపంతో సరళీకృత ఆర్ధిక విధానాలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత గడచిన 20 సంవత్సరాలలో పెట్రోల్ ధరలు సామాన్యుడి ఆర్ధిక పరిస్థితులను తలకిందులు చేస్తూ ఆకాశంవైపు దూసుకు వెడుతున్నాయి. 1989 ఏప్రిల్ 1న పెట్రోల్ ధర లీటర్ రూ. 8.50, కిరోసిన్ రూ. 2.25, డీజిల్ రూ. 3.50, 14.2 కె.జి. సిలిండర్ వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధర రూ. 57.60 ఉండేవి. దేశంలో సరళీకృత ఆర్ధిక విధానాల ప్రక్రియ 1991లో మొదలయ్యింది. 1994 మొదటి త్రైమాసికానికే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రెండింతలై రూ. 16.70, రూ. 6.98కి పెరిగాయి. 2000 నాటికి ఒక్కసారిగా 14.2 కె.జి. సిలిండర్ వంట గ్యాసు ధర రూ. 146 నుంచి రూ.196.55కి పెరిగి, నేటికి రూ. 430కి చేరుకుంది. 2010 జూన్‌లో పెట్రోల్ ధరలపై ప్రభుత్వం తన నియంత్రణను తొలగించుకుని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో 13 సార్లు, మొత్తం 33. 5 శాతం అదనంగా ధరలు పెరిగాయి.
ఆర్ధిక ద్రవ్యోల్బణాన్ని అరికట్టడమే ధ్యేయంగా సంస్థాగత సంస్కరణలను, కఠినతరమైన ద్రవ్య విధానాన్ని అమలు చేస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని కబుర్లు చెబుతున్నా ద్రవ్యోల్బణం కొరకరాని కొయ్యిగా తయారై పైపైకి ఎగబాకుతున్నదే గాని అదుపులోకి రావడం లేదు. కానీ చమురు ఉత్పత్తులు, నిత్యావసర సరకుల ధరలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు, రవాణా చార్జీలు పెరిగిపోతూ పేద, మధ్య తరగతి ప్రజానీకంపై పిడి గుద్దులు గుద్దుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం కాస్త తగ్గినట్టు తగ్గి, మళ్ళీ విజృంభించి 12.21 శాతానికి చేరకుంది. శ్రామిక ప్రజల నిజ వేతనాలు, ఆదాయాలు కుంచించుకు పోతూ కొనుగోలు శక్తి తగ్గిపోయింది. జీవన ప్రమాణాలు గణనీయంగా తగ్గిపోయాయి.
మే మాసంలో పెట్రోల్ ధరను రెండున్నర రూపాయలకు పైగా పెంచిన ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు ఇప్పుడు మళ్ళీ పెంచి చావు దెబ్బ కొట్టాయి. చమురు ధరలపై నియంత్రణను తొలగించిన చర్యను ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదు. కడకు యూపీఏ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా ప్రభుత్వం నుంచే వైదొలగుతామని హెచ్చరించినా, అది ఒక బెదిరింపేనని కొట్టి పారవేస్తూ ప్రభుత్వ పెద్దలు ధరల పెంపుదలను సమర్ధించుకుంటున్నారు. మార్కెట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరించక తప్పదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. అయితే, కనీసం చమురు ఉత్పత్తుల ధరలతో బాటు వాటి అమమ్మకాలపై ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్ని సైతం అదే స్థాయిలో పెంచకుండా అరికట్టేందుకు సైతం పాలకులు ఆలోచన చేయడం లేదు. అంటే సామాన్యుల వెత ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు.
పెట్రోల్ ధరపై నియంత్రణను తొలగించిన విధంగానే డీజిల్ ధరలపై కూడా నియంత్రణ ఎత్తివేసి, స్వేచ్ఛా మార్కెట్‌కు అనుమతించాలని ప్రధాని ఆర్ధిక మండలి ఛైర్మన్ సి. రంగరాజన్, కేంద్ర ఆర్ధిక శాఖ సలహాదారు కౌసిక్ బసు సూచించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గితే, ధరల పెరుగుదలతో ఇప్పటికే నలిగిపోతున్న పేద, మధ్యతరగతి ప్రజానీకం బతుకు మరింత దుర్భరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనా సరళి గమనిస్తే, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనిపిస్తున్నది. చమురు కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి సంక్షోభంలో ఉన్నాయని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సర్దుబాటు చేసుకోక తప్పదని ప్రభుత్వం నమ్మబలుకుతున్నది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయని పెట్రోల్ ధరలను గతంలో పెంచిన చమురు రంగ సంస్థలు ఇప్పుడు మన రూపాయి మరించ చిక్కిపోయి అమెరికన్ డాలర్‌తో మారకం ధర రూ. 49.25కు అటు ఇటు ఉన్నదని కారణం చెప్పి మరోసారి వినియోగదారులకు కర్రు కాల్చి వాత పెట్టాయి. ఇందులో ఉన్న వాస్తవమెంత? కొన్ని రోజుల క్రితమే డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ ధరలను పెంచి, మళ్ళీ పెట్రోల్ ధరలను పెంచడం నిజంగా చమురు సంస్థల నష్టాలను పూడ్చడానికా, లేక అధిక లాభాలను ఆర్జించి పెట్టడానికా? ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వమే నిజాయితీతో, పారదర్శకంగా, జవాబుదారీ తనంతో వివరణ ఇవ్వాలి. చమురు కంపెనీల ఆదాయ- వ్యయాలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు పెట్రోలియం రంగంనుంచి వివిధ పన్నులు, రాయల్టీల రూపంలో సమకూరుతున్న ఆదాయం గురించి సమగ్ర వివరాలు వెల్లడిస్తే, ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుంది. అప్పుడు అంకెల గారడీ, కనికట్టు మాయాజాలంతో వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్నారో లేదో బయటపడుతుంది.
దేశ ముడి చమురు అవసరాల్లో 84 శాతాన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 108.4 డాలర్లు. అంటే రూ. 5, 339. బ్యారెల్ అంటే దాదాపు 160 లీటర్లు. ఆ ప్రకారం లీటర్‌కు (రూ. 5,339/ 160= 33.40) రూ. 33 అవుతుంది. చమురు శుద్ధి, రవాణా, పరిపాలనా పరమైన ఖర్చుల పద్దు కింద రూ. 7 కలిపినా, మొత్తం రూ. 40 అవుతుంది. చమురు కంపెనీలు దానిని అమ్ముతున్న ధర రూ. 76. 40 పైసలు. దీనిని బట్టి రూ. 36 (47 శాతానికి పైగా) అదనంగా వినియోగ దారుడిపై భారం మోపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు రంగాన్ని అత్యంత ప్రధానమైన ఆదాయవనరుగా భావిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఎకై్సజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, చమురు అభివృద్ధి పన్ను, రహదారుల అభివృద్ధి పన్ను, విద్యాపన్ను, చమురు సంస్థలు ఆర్జించిన లాభాలపై పన్ను తోడవుతున్నాయి. అలాగే రాయల్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2009-10లో రూ. 71, 767 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకపు పన్ను (వ్యాట్) విధించి ఖజానాలను నింపుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం చమురు ఉత్పత్తుల ధరలను పెంచినప్పుడల్లా మన రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండుతుంది. కారణం- పెట్రోల్‌పై దేశంలో కెల్లా అత్యధికంగా మన రాష్ట్రంలో 33 శాతం అమ్మకం పన్ను విధించడం ద్వారా ఖజానా నింపుకుంటున్నారు.
విలాసవంతమైన కార్లు కొనే సంపన్నులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆటోమొబైల్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు.
తద్వారా కార్ల వినియోగాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నారు. తద్వారా డీజిల్, పెట్రోల్ వినియోగం పెరిగిపోతోంది. సంపన్నులైన డీజిల్ కార్ల వినియోగదారులకు సబ్సిడీపై డీజిల్‌ను ఎందుకు సరఫరా చేయాలి? అవసరం లేనివారు కూడా సబ్సిడీ సౌలభ్యాన్ని అందుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అర్హులైన సామాన్య ప్రజానీకానికి మాత్రం ధరల పెరుగుదల శరాఘాతంగా పరిణమిస్తున్నది. మరో వైపు ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో 41 శాతానికి పైగా వినియోగించే ఇంధనం డీజెల్. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు తదితర రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలలో విస్తారంగా ఉపయోగించేది డీజిలే. కేంద్ర ప్రభుత్వంపై ఇంకా సబ్సిడీల భారం- డీజిల్‌పై లీటరుకు రూ. 8.58, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 260. 50, చౌకదుకాణాల ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌పై లీటర్‌కు రూ. 25.66 పడుతున్నదని చెబుతున్నారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి కొంత మొత్తాన్ని సబ్సిడీగా నగదు బదిలీ పథకం ద్వారా అందించి, పెట్రోల్ వలె వంట గ్యాస్‌పైన ఉన్న నియంత్రణను కూడా తొలగించి రూ. 750కి పెంచాలనే దురాలోచనతో ప్రభుత్వం ఉన్నది. చమురు రంగంలో సబ్సిడీలకు పూర్తిగా చరమగీతం పాడాలని ప్రభుత్వం భావిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం 2009-10లో రూ. 71, 767 కోట్లు వివిధ పన్నుల ద్వారా ఆర్జించి కేవలం రూ. 14, 954 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. ఎలాంటి పన్నులు విధించకుండా లీటర్ పెట్రోల్‌ను కేవలం రూ. 28కే ప్రైవేట్ విమానయాన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రజలతో వ్యాపారం, కార్పొరేట్లకు రాయితీలు- ఇదీ ప్రభుత్వ ఆర్ధిక నీతి!
రూ. 1,14 వేల కోట్లు చమురు కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్రం చెబుతున్నది. ఇది పచ్చి అబద్ధం. ఇవి నష్టాలు కావు. చమురు కంపెనీల ఆదాయాల్లో తరుగుదల. ఈ తరహా అండర్ రికవరీ మొత్తం 2009-10లో రూ. 34, 391 కోట్లుగా కిరోసిన్, వంటగ్యాస్ పద్దు కింద ఉన్నాయని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. 2006-07 నుంచి 2009-10 మధ్య నాలుగు సంవత్సరాలలో చమురు కంపెనీలు రూ. 1, 26 వేల కోట్లు లాభాలు ఆర్జించినట్టు చెప్పారు. 2009-10లో ఆదాయపు పన్ను చెల్లింపు తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 37, 319 కోట్లు నికర లాభాను ఆర్జించినట్టు చమురు- సహజవాయువు మంత్రిత్వశాఖ నివేదికలద్వారా వెల్లడవుతున్నది. అయినా, కంపెనీలు నష్టాలపాలవుతున్నామంటూ నిలువు దోపిడీకి పూనుకున్నాయి.
మన వినియోగావసరాలలో 25-30 శాతం వరకూ చమురు ఉత్పత్తి మన దేశంలోనే జరుగుతున్నది. దానిని కూడా అంతర్జాతీయ చమురు ధరలతో సమానంగానే కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. దేశీయంగా చమురు అవసరాలు పెరుగుతున్న సందర్భంలోనే 2009-10లో రూ. 1,44, 037 కోట్ల విలువ చేసే 50, 974 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి జరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ను చెప్పుచేతల్లో ఉంచుకుని అమెరికా ఘరానా దోపిడీకి పాల్పడుతున్నది. విదేశీ మారక ద్రవ్యంగా చెలామణీ అవుతున్న డాలర్‌ను అడ్డుపెట్టుకుని తన ఆర్ధిక సంక్షోభంనుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నది.
2009-10లో 15.93 కోట్ల టన్నుల ముడి చమురు, 1.47 కోట్ల టన్నుల చమురు ఉత్పత్తులు, ఎల్‌ఎస్‌జి దిగుమతుల కోసం రూ. 4, 18, 457 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాము. జూదంగా మారిన అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్లే మన ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. సరళీకృత విధానాలే ఈ దుష్పరిణామాలకు మూలం. ఈ విధానాలు సమూలంగా మారాలి.
No comments:
Post a Comment