సూర్య దినపత్రిక నవంబరు ౩ ,2011
- నీటి వనరులు పరిమితం
- పెరుగుతున్న అవసరాలు
- నదీజలాల పంపకంలో అన్యాయాలు
- పోలవరంపై రాజకీయ నిప్పు హానికరం
- సముద్రం పాలవుతున్న నికరజలాలు
- పోలవరంతో బహుళార్ధ ప్రయోజనాలు
భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. కరవు కాటకాలు, వరదలు, తుఫాన్‌లు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించడానికి, భూ ఉపరితలంలో లభిస్తున్న నీటి వనరుల అభివృద్ధి, వినియోగం, నిర్వహణపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ‘జాతీయ జల విధానం- 2002’ నిర్దేశించింది. దాని వెలుగులో జాతి ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిశీలించి పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది.
మన దేశానికి ప్రకృతి అనేక నదులను ప్రసాదించింది. వాటిలో పన్నెండు నదులు పెద్దవి. వాటి మొత్తం పరీవాహక ప్రాంతం 25, 28, 084 చదరపు కి.మీ.లు. అందులో 10, 97, 588 చ.కి.మీ. పరీవాహక ప్రాంతం ఉన్న గంగ- బ్రహ్మపుత్ర- మేఘన సరణి తర్వాత 3, 21, 289 చ.కి.మీ. విస్తరించి ఉన్న ఇందూస్, 3, 12, 812 చ.కి.మీ. విస్తరించిన గోదావరి, 2, 58, 948 చ.కి.మీ.పరీవాహక ప్రాంతం ఉన్న కృష్ణ నదులే పెద్దవి. పెన్నార్ నీటి లభ్యత తక్కువైనాపరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని పెద్దనదుల్లో ఒకటిగా పేర్కొన్నారు. గోదావరి, కృష్ణ, పెన్నార్‌లతో పాటు రాష్ట్రంలో వంశధార, నాగావళి వంటి దాదాపు 40 చిన్న, పెద్ద నదులున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నార్ నదులనుంచి రాష్ట్రానికి మొత్తం 2, 746 టి.ఎం.సి.ల నికర జలాలను ట్రిబ్యునళ్ళు కేటాయించాయి.
అందులో 1480 టి.ఎం.సి.లు (54 శాతం) గోదావరి జలాలే. కృష్ణలో 800 టీఎంసి, పెన్నార్‌లో 98 టీఎంసిలు కేటాయించారు. రాష్ట్రంలో పెన్నార్ నదీపరీవాహక ప్రాంతంలో వర్షపాతం చాల తక్కువ. కృష్ణా నదీ జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పూర్తిగా వినియోగించుకుంటున్నాం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాలు అత్యధికంగా కృష్ణ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మనకు జల వివాదాలు అపరిష్కృతంగా కొనసాగుతున్నాయి. కృష్ణ నదీ జలాల పంపకంపై బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఇచ్చిన తీర్పు 2000 మే 31న ముగియడంతో, నదీ పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ వ్యవహారం తెరపైకి వచ్చింది. వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను 2004 ఏప్రిల్ 2 న ఏర్పాటు చేసింది.
ఆరు సంవత్సరాలు విచారణ చేసిన మీదట 2010 డిసెంబర్ 30న ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మన రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతంగా పరిణమించింది. ఆ తీర్పును పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ట్రిబ్యునల్ తీర్పుతో ప్రయోజనం పొందిన కర్ణాటక మిగులు జలాల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ పేచీ కొనసాగిస్తున్నది. మహారాష్ట్ర కూడా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి చేసి అధిక నీటి కేటాయింపును సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ వివాదంలో పై రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్టల్రు విజయం సాధిస్తే, తెలుగునాట నీటికోసం కష్టాలు వర్ణనాతీతం. కృష్ణ నది మిగులు జలాలపై ఆధారపడి వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకుంటున్న అత్యంత వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు, నల్లగొండ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం) ప్రాజెక్టు, నిత్య కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న హంద్రీ- నీవా ఎత్తిపోతల పథకం, గాలేరు- నగరి, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులు మూలన పడడం ఖాయమనిపిస్తున్నది.
ఈ ప్రమాదంనుంచి బయట పడాలంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రస్తుతం జరుగుతున్న పునః సమీక్షలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రాతిపదికన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి రాజకీయ సంకల్పంతో పోరాడాలి. అందుబాటులో ఉన్న వంద సంవత్సరాల నదీ ప్రవాహాన్ని ప్రాతిపదికగా తీసుకుని నికర జలాల నిర్ధారణకు 75 శాతాన్ని ప్రామాణికంగా తీసుకునేలా ఒప్పించాలి. మిగులు జలాల లభ్యతపై నిర్ధారణ, పంపిణీ అశాస్ర్తీయమైనది. వర్షాభావం వల్ల కొన్ని సంవత్సరాలలో దిగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలను వినియోగించుకునే హక్కును మనకు దఖలు పరచింది.
ఆ హక్కును పరిరక్షించుకోవాలి. అల్మట్టి ఎత్తును సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి 519.6 మీటర్లకే పరిమితం చేసేలా పట్టుపట్టాలి. ఒకవైపు కృష్ణ నదీ జలాల పంపకంలో మన రాష్ట్ర్రానికి అన్యాయం జరగకుండా వ్యవహరించాల్సిన తరుణంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాజకీయ నిప్పు చెలరేగడం అత్యంత హానికరం. గోదావరి పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. 73, 201 చ.కి.మీ. మన రాష్ట్రంలో ఉంటే, అందులో 57, 960 చ.కి.మీ. తెలంగాణ, 15, 241 చ.కి.మీ. కోస్త ఆంధ్రలో ఉన్నది. నదీ ప్రవాహానికి మాత్రం 456 టిఎంసీలు తెలంగాణ, 120 టిఎంసీలు కోస్తా ప్రాంతంనుంచి సమకూరుతున్నప్పటికీ గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ మూడు వేల టిఎంసీల నికరజలాలు లభిస్తాయని అంచనా కట్టి మన రాష్ట్రానికి 1480 టిఎంసీలను కేటాయిస్తూ 1980లో ప్రకటించింది.
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో అత్యధిక భాగం అటవీప్రాంతం కావడంతో నీటిని వినియోగించుకునే అవకాశం వారికి లేకపోవడంతో మనకు లబ్ధి చేకూరింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో 812 టిఎంసీలు తెలంగాణలో, 668 టిఎంసీలు కోస్తా ఆంధ్రలో వాడుకోవడానికి వీలు కల్పించినా, ఇప్పటి వరకు మనం దాదాపు 800 టిఎంసీలను మాత్రమే ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకుంటున్నాం. ఇంకా 700 టిఎంసీల నికర జలాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఫలితంగా ప్రతి ఏడాదీ వరద నీటితో కలిపి సగటున 3 వేల టిఎంసీలు సముద్ర గర్భంలో వృథాగా కలిసిపోతున్నది. లక్షలాది ఎకరాలలో పంటలు నీటిపాలైపోతున్నాయి. ప్రాణనష్టం జరుగుతోంది. సమగ్ర జల విధానాన్ని రూపొందించడం ద్వారా వరదల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చు. సంవృద్ధిగా నీరున్న ప్రాంతాలనుంచి నీటిని కరవు పీడిత ప్రాంతాలకు సరఫరా చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది. ఆహార భద్రతకు దోహదపడుతుంది.
ఈ లక్ష్యానికి అనుగుణంగా నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్ (పోలవరం) బహుళార్ధ సాధక ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం అంటే జాతి ప్రయోజనాలకు విఘాతం కల్గించడమే. ప్రజల ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ పోలవరం. ఇది అభివృద్ధి చెందిన జిల్లాలకే ప్రయోజనకారి అన్న దుష్ర్పచారం వాస్తవాలను మరగుపరచడమే. ఈ ప్రాజెక్టు ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరుతాయి. ధాన్యాగారమైన కృష్ణ, గోదావరి డెల్టాకు సాగునీటి సరఫరాలో తరచు ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ధవళేశ్వరం, విజ్ఞేశ్వరం ఆనకట్టలు 10.50 లక్షల ఎకరాలున్న గోదావరి ఆయకట్టకు పంట కాలం మొత్తానికి నీరందించలేని దుస్థితి నెలకొన్నది. పోలవరం వంటి పెద్ద రిజర్వాయరు నిర్మాణం ద్వారా మాత్రమే ఆయకట్టకు రక్షణ కల్పించవచ్చు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, కృష్ణ, విశాఖపట్నం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలలో 7. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. కృష్ణ డెల్టా ఆయకట్టకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 80 టిఎంసీల నీటిని సరఫరా చేసి, కర్ణాటక, మహారాష్టల్ర వాటా 35 టిఎంసీలు పోను మిగిలిన 45 టిఎంసీలను నీటి ఎద్దడితో సతమతమవుతున్న తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో, రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలలో మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవచ్చు. 960 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని పోలవరం ప్రాజెక్టుకు పై భాగంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల, యల్లంపల్లి, దుమ్మగూడెం, ప్రాణహిత- చేవెళ్ళ ఎత్తిపోతల పథకాల విద్యుత్ అవసరాలకు వినియోగించుకోవచ్చు.
విశాఖపట్నానికి మంచినీరు, ఉక్కు పరిశ్రమ అవసరాలకోసం 23. 44 టిఎంసీలను సరఫరా చేయాలని నిర్దేశించుకోవడం జరిగింది. వీటిని ప్రాంతీయ కోణంనుంచి పాక్షిక దృష్టితో చూడరాదు. పైగా అన్ని అనుమతులు పొంది, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రప్రభుత్వం గుర్తించి 90 శాతం నిధులు అందించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డడం జాతి ప్రయోజనాలకు హాని కల్పించడమే. ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, రిజర్వాయర్ ఎత్తును తగ్గించాలని, పోలవరానికి ప్రత్యామ్నాయంగా రెండు మూడు పథకాలను అమలు చేయాలనీ పలు డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన యం. వెంకట్రావు కమిటీ ప్రస్తుత ప్రాజెక్టు డిజైనే అత్యుత్తమమైనదని సూచించిందని గమనించాలి. సుప్రీం కోర్టు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగానే ఉన్నదని చెప్పింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల మన రాష్ట్రంలో 38, 186 హెక్టార్లు, చత్తీస్‌గఢ్‌లో 1,637 హెక్టార్లు, ఒడిశాలో 1, 182 హెక్టార్ల భూములు, వాటిలో భాగంగా 3, 267 హెక్టార్ల అటవీప్రాంతం ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు, 34, 143 కుటుంబాలకు చెందిన 1, 40, 275 మంది జనాభా, ప.గో. జిల్లాలో 42 గ్రామాలు, 6,959 కుటుంబాలు, 25, 026 మంది జనాభా, తూ.గో. జిల్లాలో 29 గ్రామాలు, 3, 472 కుటుంబాలు, 11, 874 మంది జనాభా నిర్వాసితులవుతారని అంచనా వేశారు. వీరిలో 45 శాతానికి పైగా గిరిజనులే కావడం గమనార్హం.అందువల్ల ప్రత్యేక దృష్టితో పునరావాస పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ద్వారా నిర్వాసితులే మొదటి లబ్ధిదారులు కావాలి. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి. కాలం గడిచేకొద్దీ నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని గుర్తించి తక్షణమే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి.
No comments:
Post a Comment