Surya Daily May 13, 2014
పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొంటున్నది. ఎనిమిది దశల్లో 502 లోక్ సభ స్థానాలకు
పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిగిలిన 42 స్థానాలకు ఈనెల 12న పోలింగ్
జరుగనున్నది. ఆఖరి దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల జాబితాలోనే నరేంద్ర మోడీ పోటీ
చేస్తున్న వారణాసి కూడా ఉన్నది. అక్కడ మోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్
కేజ్రివల్ బలమైన ప్రత్యర్థిగా ఆవిర్భవించాడు. దేశ నలుమూలల నుండి వారణాసి కెళ్ళిన
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారంతో నియోజకవర్గం ఓటర్లలో నూతన
ఆలోచనలకు తెరలేపినట్లుంది. కేజ్రీవాల్ తనదైన శైలిలో ప్రజల్లోకి చొచ్చుకపోవడంతో
కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తేలిపోయి మోడీకి గట్టి పోటీదారుగా కేజ్రీవాల్
ముందుకొచ్చాడని ప్రసారమాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. నామమాత్రంగా పోటీ ఉంటుందని
భావించిన భాజపాకు ఈ పరిణామం మింగుడుపడడం లేదు.
తాజాగా భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల సంఘంపై అసంబద్ధమైన
ఆరోపణలు చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన ఆ
సంస్థపై దాడికి పూనుకొన్నారు. ఎన్నికల అధికారులు అనుమతి నిరాకరించినా నిబంధనావళిని
ఉల్లంఘించి మోడీ ఆధ్వర్యంలో కాషాయ దళం వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించడాన్ని
బట్టి చట్టాన్ని గౌరవించే మనస్తత్వం వారిది కాదని మరొకసారి బుజువు చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించి బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కాషాయ దళానికి ఇది ఒక లెక్కా.
తన ఓటును వినియోగించుకొన్నసంందర్భంలో కూడా నిబంధనలను ఉల్లంఘించి ప్రసారమాధ్యమాల
ప్రతినిథులతో మాట్లాడుతూ భాజపా ఎన్నికల గుర్తును ప్రదర్శించారు. అయోద్యలో మే 5న మోడీ పాల్గొన్న
ఎన్నికల బహిరంగసభలో రాముని నిలువెత్తు చిత్రపటాన్ని బ్యానర్ పై ముద్రించి వేదికపై
అలంకరించారు.
గంగా జల పూజకు ఎన్నికల సంఘం తనకు అనుమతి నిరాకరించడంపై కన్నెర్రజేశారు. పూజలు
పునస్కారాలకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడంలోని మతలబేంటి? అనుమతి ఎలాగూ ఇవ్వరు
కాబట్టి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే దుర్భుద్ధి అందులో
దాగి ఉన్నదని ఎవరికైనా అర్థమవుతుంది. చూడ్డానికి ఇవి చాలా చిన్న విషయాలుగానే
కనబడవచ్చు కానీ లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత పదవిని
అధిరోహించాలని ఆశిస్తున్న వ్యక్తి చట్టాన్ని, నిబంధనలను తృణీకార భావంతో దిక్కరించడం, మత విశ్వాసాలను
ఎన్నికల అంశంంగా వాడుకోవడాన్ని తేలికగా కొట్టిపారేయలేం. ఈ ఘటనలు యాదృశ్చికమైనవి
కావు. ఉద్ధేశ్యపూర్వకంగా చేసినవే. అందులోనూ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ
మొట్టమొదట 2001లో బాధ్యతలు స్వీకరిచిన ఐదు మాసాలకే 2002లో జరిగిన గోద్రా ఘటనకు ప్రతీకారంగా గుజరాత్ లో
జరిగిన మారణహోమంలో ఆయన హస్తముందని అపఖ్యాతిని మూటకట్టుకొన్న మోడీ ఆలోచనలను, చర్యలను ప్రజలు
నిశితంగానే పరిశీలిస్తున్నారు.
డిల్లీ అధికార పీఠంపై కన్నేసిన నరేంద్ర మోడీ కల నెరవేరుతుందా! లేదా! అన్న
విషయంపై స్పష్టత రావాలంటే 16వ తేదీ వరకు ఆగాల్సిందే. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర
ప్రదేశ్ పై ఆయన భారీ ఆశలు పెట్టుకొన్నట్లు కనబడుతున్నది. ఆ రాష్ట్రంలో 80 లోక్ సభ
స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు కనికరించక పోతే మోడీకి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు
చేతికందడం దుర్లభం. అందుకే యు.పి.పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏరికోరి వారణాసి
నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని పోటీ చేస్తున్నారు. ఆ స్థానం నుండి భాజపా పూర్వ
అధ్యక్షులు మురళీ మనోహర్ జోషి 2009 ఎన్నికల్లో కేవలం పదిహేడు వేల ఓట్ల ఆధికతతో
గెలుపొందారు. ఇప్పుడాయనకు స్థానభ్రంశం కల్పించి మోడీ పోటీ చేయడం ద్వారా ఉత్తర
ప్రదేశ్ ప్రజానీకాన్ని ప్రభావితం చేసి అత్యధిక స్థానాలలో విజయబావుటా ఎగరేయాలని
ఉవ్విళ్ళూరుతున్నారు. అస్తిత్వ రాజకీయాలకు, మతోన్మాద రాజకీయాలకు ఆటపట్టుగా ఉన్నఉత్తర ప్రదేశ్
లో అన్ని రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు. రామ జన్మభూమి విముక్తి పేరిట
వివాదాన్ని రెచ్చగొట్టి, బాబ్రీ మసీదును నేలమట్టంచేసి నాడు అధికారానికి
ఎగబాకారు. రామ మందిర నిర్మాణం తమ అజెండాలో పదిలంగా ఉన్నదని చెప్పుకోవడానికే రాముని
చిత్రాన్ని ఉపయోగించుకొంటున్నారు. తద్వారా హిందువుల మనోభావాలను మరొకసారి తమవైపుకు
మళ్ళించుకోవాలని విఫలప్రయత్నం చేస్తున్నారు.
గతాన్ని పరిశీలిస్తే 1991 ఎన్నికల్లో ఆనాడు ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మొత్తం 85 లోక్ సభ స్థానాల్లో
51 స్థానాలను భాజపా సొంతం చేసుకొన్నది. అటుపై 1996లో 52, 1998లో 57కు ఆ సంఖ్యను పెంచుకొన్నది. అతల్ బిహారీ వాజపాయి
నాయకత్వంలో యన్.డి.ఎ. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర్ ప్రదేశ్
రాష్ట్రాన్ని విడగొట్టి ఉత్తరాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా తదనంతర కాలంలో ఆ
పార్టీ పతనం మొదలై 1999లో 29, 2004లో 10, 2009లో 10 స్థానాలకు దిగజారిపోయింది. ఓట్ల శాతం కూడా 17.5 కు పడిపోయింది.
మతోన్మాద రాజకీయాలతో అనూహ్యమైన పెరుగుదలను సాధించిన భాజపా అంతే వేగంగా
చతికిలపడింది. ప్రథమ స్థానం నుండి నాలుగవ
స్థానానికి నెట్టివేయబడింది. మళ్ళీ పూర్వవైభవాన్ని సంపాదించుకోవడానికి ఇప్పుడు
చమటోడుస్తున్నది. హిందుత్వ రాజకీయాలను, కుల అస్థిత్వ రాజకీయాలతో కలగలిపి ప్రయోగించారు.
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి 2007లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అగ్రకులాలు, దళిత కులాల మధ్య
ఐక్యతా నినాదంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికారాన్ని చేజిక్కించుకొన్నారు.
వెనుకబడిన కులాలు, ముస్లింలపై ఆధారపడి సమాజ్ వాది పార్టీ అధినేత
ములాయం సింగ్ రాజకీయం నడిపి 2012లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తన కుమారుడు
అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. హిందుత్వ భావజాలానికి
దళితులు, ఇతర వెనుకబడిన కులాల ప్రజానీకం వ్యతిరేకమైనప్పటికీ తాను వెనుకబడిన కులానికి
చెందిన వాడినని మోడీ పదేపదే చెప్పుకొంటూ రాజకీయ ప్రయోజనం పొందడానికి
ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న దళితుల్లో అత్యధిక భాగం జటావ్/చమర్
కులానికి చెందిన వారే. వారంతా సహజంగానే తమ కులానికే చెందిన మాయావతికి ఓటు
బ్యాంకుగా తయారయ్యారు. మిగిలిన దళిత కులాలకు చెందిన ప్రజల్లో కొంత మంది భాజాపా
వైపు మొగ్గుచూపారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో 21 స్థానాల్లో
గెలుపొందిన కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు అనుసరించడంతో భ్రష్టుపట్టి మరింత
బలహీనపడింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పనిచేయడం లేదని, పైపెచ్చు ముజఫర్
నగర్ మత ఘర్షణలతో అభాసుపాలైయ్యిందని అంటున్నారు. ఆ రాష్ట్రంలో నెలకొని ఉన్న
పరిస్థితులను అందిపుచ్చుకొని అత్యధిక స్థానాలను తన ఖాతాలో జమ చేసుకోవాలని మోడీ
ఆరాటపడుతున్నట్లుంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 20% ముస్లిం జనాభా ఉన్నది. పది జిల్లాలకుపైగా 30% నుండి 49% వరకు ముస్లిం జనాభా
ఉన్నది. కానీ ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని భాజపా నిలబెట్టకపోవడాన్ని
యాదృశ్చికమైన చర్యగా భావించలేం కదా! లౌకిక వ్యవస్థ పట్ల ఆ పార్టీ దృక్పథమేంటో
భోదపడుతుంది. ముజఫర్ నగర్ మత ఘర్షణల పూర్వరంగంలో టెర్రరిజాన్ని అణచగలిగిన, పాకిస్తాన్ ను
కట్టడి చేయగలిగిన బలమైన, సమర్థుడైన నాయకుడు మోడీ అన్న ప్రచారాన్ని యు.పి.లో
పెద్ద ఎత్తున నిర్వహిచడాన్ని బట్టి హిందూ, ముస్లిం మతస్తుల మధ్య మరింత అగాధాన్ని పెంచి లబ్ధి
పొందాలని పథకం ప్రకారం పని చేసినట్లున్నది. ఈ చర్యలేవీ దేశ లౌకిక వ్యవస్థను
బలోపేతం చేయడానికి దోహదపడవు.
మోడీ స్వభావంలోని మరొక కోణాన్ని కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి
నాయకత్వానికి స్థానం లేకుండా చేసి అన్నీ తానై ఆధిపత్యం చెలాయించే స్థితికి
చేరుకొన్నారన్న విమర్శలూ వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో గుజరాత్
అభివృద్ధి నమూనాను విస్తృతంగా మార్కెటింగ్ చేసుకొన్న మోడీ కార్పోరేట్ రంగంలోని
దిగ్గజాలకు విశ్వసనీయమైన ప్రతినిథి అన్న విషయమూ పాచుర్యంలోకి వచ్చింది. మోడీ
ఎన్నికల ప్రచారానికి పది వేల కోట్లకుపైగా కార్పోరేట్ సంస్థలు ఖర్చు చేశాయన్న
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ మాత్రం తాను చాయ్ వాలా నుండి ప్రధాన మంత్రి
అభ్యర్థి స్థాయికి ఎదిగానని దేశ వ్యాపితంగా చెప్పుకొంటూ బడుగు బలహీన వర్గాల ఓట్లను
కొల్లగొట్టడానికి పూనుకొన్నారు. తాను అభివృద్ధి కామకుడనని,
సుపరిపాలనే తన ధ్యేయమని
గుజరాత్ అభివృద్ధి నమూనాలో దేశాన్ని ముందుకు నడిపిస్తానని వాగాడంబర నినాదాలతో
ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. దేశ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో, ప్రత్యేకించి మోడీ
ఆశలపై ఉత్తర ప్రదేశ్ ప్రజలు నీళ్ళు చల్లుతారా! లేదా! వెన్నుదన్నుగా నిలుస్తారా!
అన్నది వేచి చూడాలి.
No comments:
Post a Comment