May 27th 2014 Surya Daily
నరేంద్ర మోడీ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. ప్రజల తీర్పుతో
రెట్టించిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, కార్పోరేట్ రంగం మద్దతు, అన్నింటికీమించి హిందుత్వ భావజాల బలంతో మోడీ పాలనా బాధ్యతలు
స్వీకరించారు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించే ప్రగతిశీల శక్తులకు, మోడి చరిత్రను విమర్శనా దృష్టితో చూసే లౌకికవాద శక్తులకు ఆయన దేశ పాలనా పగ్గాలను చేజిక్కించుకోవడం ఏ మాత్రం
రుచించని రాజకీయ పరిణామం. ప్రస్తుతానికి ఆ శక్తులు నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడి, తామనుసరించిన లోపభూయిష్టమైన రాజకీయ విధానాల
పర్యవసానాలపై ఆత్మపరిశోధనా పనిలో మునిగిఉన్నాయి.
అందరూ ప్రజా తీర్పును గౌరవించి, శిరసావహించవలసిందే కదా! అత్యంత అవమానకరమైన ఎన్నికల ఫలితాలతో కృంగిపోయి
మథనపడుతున్న కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు, వామపక్షాలు తదితర
లౌకిక ప్రజాతంత్ర శక్తులు తేరుకొని తిరిగి క్రియాశీల పాత్రదారులుగా రంగ ప్రవేశం
చేయడానికి కొంత సమయం పడుతుంది.
ఇప్పుడు 120 కోట్ల మంది భారతీయులకు జవాబుదారీతనంతో, రాజ్యాంగానికి బద్దుడై, సుపరిపాలనను అందించే బాధ్యత మోడీపై ఉన్నది. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు
నిర్వహిచడానికి, వైవిధ్యభరితమైన భారత దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిండానికి మధ్య మౌలికమైన
తేడా ఉన్నది. స్వదేశీ, విదేశీ విధానాల రూపకల్పన, వాటి అమలు కత్తి మీద సాములాంటిది. దేశ ప్రజల తీర్పు
కూడా వైవిద్యభరితంగానే ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు, ప్రయోజనాలకు భిన్నంగా పాలన సాగించే పాలకుల భరతం
పడతామన్న ఓటర్ల మనోభావాన్ని ఈ ఎన్నికల ఫలితాలు నిర్ధ్వందంగా ప్రకటించాయి. మోడీ అది
గమనించే అభివృద్ధి నివేదికను ప్రజల ముందుంచి 2019లో జరిగే ఎన్నికలలో ఓటడుగుతానని భాజపా
పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన సందర్భంగా మాట్లాడుతూ ప్రతిన చేశారు. తద్భిన్నంగా పాలనసాగిస్తే వేనోళ్ళ పొగిడిన జనమే తిరగబడతారు.
చరిత్ర నేర్పిన పాఠమిది. మారిన మోడీ అని కొందరంటున్నారు. ఆయన కరడుగట్టిన
హిందుత్వవాదేనని మరికొందరంటున్నారు. ఎవరేమన్నా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉంటూ
ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను పరిరక్షించుకొంటూ దేశాభివృద్ధికి
దోహదపడే సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాల అమలు కోసం పోరు చేయక తప్పదు. మోడీ చేతుల్లో దేశాన్ని పెట్టాం ఇక సురక్షితంగా ఉంటుందని, ప్రజా సమస్యలు
పరిష్కరించబడతాయని, కష్టాలు తీరిపోతాయని భ్రమపడితే పప్పులో కాలేసినట్లే!
మోడీని ప్రధాన మంత్రి గద్దెపై కూర్చోపెట్టాలన్న బలమైన ఆకాంక్షను వెల్లడించిన
వారిలో ప్రధానంగా మూడు స్రవంతులు ఉన్నాయి. ఒకటి: హిందుత్వ భావజాలాన్ని
సమర్థవంతంగా అమలు చేయగల సమర్థుడు మోడీనేనని సంఘ్ పరివార కూటమి విశ్వసించి, సర్వశక్తులు ఒడ్డి
గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసింది. రెండు: నయా ఉదారవాద ఆర్థిక విధానాల
అమలు ప్రక్రియను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి, ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను పటిష్టవంతం
చేయగల సమర్థుడు మోడీనేనన్న నిర్ధారణకు కార్పోరేట్ రంగం దిగ్గజాలు వచ్చారు. అందుకే
ఆయన్ను కార్పోరేట్ రంగం తమ విశ్వసనీయమైన ప్రతినిథిగా ఎంపిక చేసుకొని
వెన్నుదన్నుగా నిలిచింది. మోడీ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసి, అధికారంలోకి
రావడానికి అవసరమైన సరంజామాను సమకూర్చి సంపూర్ణ సహాయ సహకారాలను అందించింది. మూడు: నూతనంగా ఓటు హక్కు
పొందిన విద్యావంతులైన యువత, పట్టణ మధ్యతరగతి ప్రజానీకం,
సామాజికంగా వెనుకబడ్ద కులాల
ప్రజలు, కాంగ్రెస్ దుష్టపాలనకు అంతం పలకాలని కృతనిశ్చయంతో ఉన్న వివిధ వర్గాల ప్రజానీకం, నయా ఉదారవాద ఆర్థిక
విధానాల దుష్పలితాల నుండి విముక్తి కోరుకొంటున్న సామాన్య జనం భవిష్యత్తుపై కొండంత
ఆశతో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారత దేశ ప్రజానీకం బ్రహ్మరథం పట్టి మోడీని విజయపథాన నడిపించారు. సహజంగానే వీరందరూ వారు పెట్టుకొన్న నమ్మకాలకు
అనుగుణంగా మోడీ పాలన సాగాలని ఆకాంక్షిస్తున్నారు. మోడీ వెంట నడిచిన ఈ మూడు
స్రవంతుల ప్రయోజనాలు పరస్పర విరుద్ధమైనవి, వైరుధ్యాలతో
కూడుకొన్నవి. ఒకరి ప్రయోజనాలు, మరొకరి ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమైనవి. మోడీ
ఎవరి పక్షం నిలుస్తాడో కాలమే చెబుతుంది.
మోడీ నిజంగా స్వతంత్రుడేనా!: యు.పి.ఏ. పాలనా కాలంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు
మరియు యు.పి.ఏ. ఛేర్ పర్సన్ హోదాలో సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ తో ప్రధాన మంత్రి
మన్మోహన్ సింగ్ ను నడిపించేవారన్న విషయం నిర్వివాదాంశం. ఇప్పుడు మోడీ
సర్వస్వతంత్రుడని భ్రమించే వారు లేక పోలేదు. కానీ ఒక్క విషయాన్ని గమనంలో
ఉంచుకోవాలి. నేటి వరకు దేశ ఆర్థిక విధానానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వాన్ని నడిపించింది, ఇక మీదట నడిపించబోయేది కార్పోరేట్ దిగ్గజాలే అన్న
నిప్పులాంటి నిజాన్ని మరచిపోకూడదు. సామాజిక, రాజకీయ తాత్విక చింతనకు సంబంధించి మరొక అదృశ్య
శక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మోడీకి మార్గనిర్దేశం చేస్తూ తన అజెండాను చాపకింద నీరులా అమలు చేయించడానికి పథకం ప్రకారం పూనుకొంటుంది. ఈ
రెండు శక్తుల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే శక్తి గానీ,
ఆలోచన గానీ మోడీకి ఏ మాత్రం
లేదన్నది కూడా జగమెరిగిన సత్యం. వారి అజెండాలను అప్పుడే ప్రసార మాధ్యమాల ద్వారా
చర్చనీయాంశాలుగా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పెద్దగా ప్రస్తావించని కాషాయదళం
రహస్య అజెండాలోని అత్యంత వివాదాస్పదమైన అంశాలు ఒక్కొక్కటే మళ్ళీ చర్చనీయాంశాలవుతున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (యన్.సి.ఆర్.టి.) రూపొందించే చరిత్ర పాఠ్యాంశాల్లో వాజపాయ్ పాలనా కాలంలో చేయతలపెట్టిన
మార్పులు చేర్పుల ప్రక్రియను ముందుకు తీసుకొస్తున్నారు. జమ్మూ కాశ్మీర్
రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 పై దేశ
వ్యాపిత చర్చకు తెరలేపే సూచనలు కనబడుతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి, రామ మందిర నిర్మాణం, గోవద నిషేధం లాంటి అంశాలను విశ్వహిందూ పరిషత్
అప్పుడే లేవదీసింది. బెంగాలీ భాషను మాట్లాడని వారందరూ
బాంగ్లాదేశీయులేనన్న వాదాన్ని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో స్వయంగా మోడీనే
లేవదీశారు. కాబట్టి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, కార్పోరేట్ దిగ్గజాల
కనుసన్నల్లోనే మోడీ పాలన సాగుతుందనడంలో ఎవరికీ అనుమానం ఉండాల్సిన పని లేదు. సామాన్యుడి అజెండా ఆర్.యస్.యస్. మరియు కార్పోరేట్ రంగం అజెండాలకు పూర్తి భిన్నమైనది.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి అనుసరించిన నయా ఉదారవాద ఆర్థిక విధానాల దుష్పలితాలకు ప్రజలు బలైపోయారు. సరళీకరణ విధానాల
పుణ్యమాని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రజల కొనుగోలు శక్తి
దారుణంగా పతనమయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థను అవినీతి భ్రష్టుపట్టించింది.
పెరుగుతున్న నిరుద్యోగుల, అర్థనిరుద్యోగుల, పేదల గణాంకాలపై అంకెల గారడి చేసి యు.పి.ఎ.
ప్రభుత్వం అబాసుపాలయ్యింది. ప్రయివేటీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
లాంటి ప్రభుత్వ రంగం ధ్వంసమైపోయింది. వర్ణనాతీతమైన సమస్యల వలయంలో చిక్కి బతుకు పోరుచేస్తున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు
కాంగ్రెస్ దుష్టపాలన నుండి విముక్తి కోరుకొన్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను
వ్యతిరేకిస్తున్న శ్రామిక వర్గ పక్షపాతులైన వామపక్షాలు ప్రత్యామ్నాయ ఆర్థిక
విధానాలతో మెరుగైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందాయి. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ మార్పు కోసం పరితపిస్తున్న
ప్రజలకు విశ్వాసం కల్పించే మరొక రాజకీయ వేదిక కనుచూపుమేరలో కనబడలేదు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా
పార్టీకి మధ్య ఇసుమంత తేడా లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేకతను మోడీ చాకచక్యంగా తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. లోపభూయిష్టమైన ఆర్థిక విధానాలపైన, దేశ సంపదైన
సహజవనరులను కార్పోరేట్ రంగం లూటీ చేస్తున్న అంశంపైన, లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలకు మూలమైన నయా
ఉదారవాద విధానాలపైన మోడీ విమర్శనా పూర్వకంగా ఒక్క మాట మాట్లాడలేదన్న విషయాన్ని
గుర్తుంచుకోవాలి. కేవలం గుజరాత్ అభివృద్ధి నమూనాను చక్కగా మార్కెటింగ్
చేసుకొన్నారు. కార్పోరేట్ రంగం గుత్తాధిపత్యంలోని ప్రసారమాధ్యమాలు గోరంతలు
కొండంతలు చేసి ప్రజలను భ్రమల్లోకి నెట్టి, వారి చూపును మోడి వైపుకు మళ్ళించగలిగాయి. మేడి పండు లాంటి గుజరాత్ అభివృద్ధిపై సాగించిన ఉధృత ప్రచారంతో దూరపు కొండలు నునుపన్న నానుడిగా జనం, ప్రత్యేకించి
విద్యాధిక యువత, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజానీకం భ్రమల్లో తేలిపోయారు. సమస్యల నుండి
ఊరట కలిగించే అభివృద్ధిని, సుపరిపాలనను అందిస్తానన్న మోడీ మాటలు మాత్రమే ప్రజల
చెవుల్లో బలంగా నాటుకపోయాయి. భవిష్యత్తుపై కొండంత ఆశతో మోడీ సమర్థవంతమైన నాయకుడని భావించి, ఆయన వెంట నడిచారు. సమస్యల బారి నుండి త్వరితగతిన మోడీ ప్రభుత్వం బయటపడవేస్తుందన్న
సహజమైన కోరికతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఉపాథి అవకాశాలు పెరుగుతాయని యువత ఎదురు చూస్తున్నది. ఈ సమస్యల పుట్టుక, పెరుగుదల, వాటి పరిష్కారం నయాఉదారవాద ఆర్థిక విధానాలతోనే
ముడిపడి ఉన్నది. మరి ఆ విధానాల్లో మార్పులు చేసే ఆలోచన మోడీకి ఉన్నదా? ఒకవైపున ఎన్నికల
ఫలితాలు మోడీకి అనుకూలంగా వెల్లడవుతుంటే, మరొక వైపున స్టాక్
మార్కెట్ లో షేర్ల విలువ పైపైకి ఎగబాకింది. డీజిల్ ధరలపై ఇప్పుడున్న నియంత్రణ కూడా పూర్తిగా తొలగిపోతుందన్న
ప్రచారం ఊపందుకొన్నది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడానికి ఈ ఘటనలు
దారితీస్తాయా! తనను భుజాల మీదికెక్కించుకొని మోసిన కార్పోరేట్ రంగం ఆకాంక్ష అయిన
నయాఉదారవాద ఆర్థిక
విధానాల అమలును మరింత వేగవంతం చేయాలన్న కోరిక, మోడీ సంకల్పం ఒకటే అన్నది సుస్పష్టం.
ప్రజా తీర్పులోని ఆంతర్యమేంటి?: దేశంలోని మొత్తం
ఓట్లు 71,69,85,101. పోలైన ఓట్లు 41,71,58,469(58.18%).
పోలైన ఓట్లలో భాజపాకు వచ్చిన
ఓట్లు 12,93,19,125(31%). అంటే మొత్తం ఓట్లలో 18.04% మాత్రమే. ఈ ఓట్లతోనే లోక్ సభలోని మొత్తం 543 గాను 282 స్థానాలను
సంపాదించుకొని, అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసు పార్టీకి పోలైన ఓట్లలో 19.3% వచ్చినా 44 స్థానాలకే పరిమితం చేయబడింది. ఎఐఎడియంకె 3.3%తో 37, తృణమూల్
కాంగ్రెస్ 3.8%తో 34, బిజెడి 1.7%తో 20, శివసేన 1.9%తో 18, టిడిపి 2.5%తో 16, టి.ఆర్.యస్. 1.2%తో 11, సిపిఐ(యం) 3.2%తో 9, వై.యస్.ఆర్.కాంగ్రెస్ 2.5%తో 9, యన్.సి.పి 1.6%తో 6, సమాజ్ వాది పార్టీ 3.4%తో 5, ఆప్ 2%తో 4 స్థానాలను సంపాదించుకొన్నాయి. బి.యస్.పి. కి 4.1%, డియంకె కు 1.7% ఓట్లు వచ్చినా ఒక్క
స్థానం కూడా దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల విధానం ఎంతటి లోపభూయిష్టంగా ఉన్నదో ఈ
గణాంకాలను బట్టి బోధపడుతుంది. పార్టీలకు వచ్చిన ఓట్లకు, సీట్లకు ఏ మాత్రం పొంతన లేదు. ఎన్నికల సంస్కరణలు
తీసుకొచ్చి దామాషా ఎన్నికల విధానాన్ని అమలు చేస్తే తప్ప ప్రజా ప్రాతినిథ్య సభ అయిన
లోక్ సభలో పార్టీల వాస్తవిక బలాబలాలు, ప్రజాభిప్రాయం
ప్రతిబింబించే అవకాశం లేదు. మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుత
ఎన్నికల ఫలితాల్లో దేశ వ్యాపితంగా ఒకే తీరులో ప్రజాభిప్రాయం వెల్లడికాలేదు.
దేశ ప్రజల మనోభావాల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. ఉత్తర, పశ్చిమ భారత దేశంలో
స్థూలంగా కాంగ్రెస్ వ్యతిరేక, మోడీ అనుకూల పవనాలు బలంగా వీచాయి. దేశానికి
సమర్థుడైన, బలమైన నాయకుడు కావాలనే కోరిక యువతను, మధ్యతరగతి ప్రజానీకాన్ని మోడీ వైపుకు నెట్టింది. అంత
మాత్రాన మోడీ సృష్టించిన సునామీలో కాంగ్రెస్
కొట్టుకుపోయిందని భావించడం పొరపాటు అవుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ తనకు తానుగా త్రవ్వుకొన్న
గోతిలోపడింది. ప్రజా వ్యతిరేక సునామీలో తునాతునకలై పోయింది. ప్రజాస్వామ్య
వ్యవస్థకు ఆధునిక దేవాలయం లాంటి పార్లమెంటు స్థాయిని భష్టు పట్టించింది. సి.బి.ఐ.
లాంటి నేర పరిశోధక సంస్థలను దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్ మెయిల్
చేసి తన మద్దతుదారులుగా మార్చుకొని అడ్డగోలుగా వ్యవహరించింది. ప్రజాకంఠక పాలనతో
దేశ ప్రజల ఆగ్రహజ్వాలల్లో కాంగ్రెసు మాడిమసైపోయింది. ప్రతిపక్ష పార్టీ స్థానానికి
కూడా అర్హతలేని పార్టీగా అత్యంత అవమానకరమైన స్థాయికి నెట్టివేయబడింది. కాంగ్రెసుతో అంటకాగి ప్రజావ్యతిరేక పాలనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వాములైన నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ(6), సమాజ్ వాది పార్టీ(5), రాష్ట్రీయ జనతా దళ్(4) కు పరిమితం చేసి, డియంకె(0), నేషనల్ కాన్ఫరెన్స్(0), రాష్ట్రీయ లోక్ దళ్(0), బహుజన్ సమాజ్ పార్టీ(0) లాంటి పార్టీలకు లోక్ సభలో ప్రాతినిథ్యమే లేకుండా చేశారు. కాంగ్రెసు, దాని మిత్రపక్షాల మీద పెల్లుబికిన ఆగ్రహం భారతీయ జనతా పార్టీకి, దాని ప్రధాన మంత్రి
అభ్యర్థి నరేంద్ర మోడీకి వరంగా పరిణమించింది. కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని
కాషాయదళం సంపూర్ణ విజయం సాధించింది.
దేశ ప్రజల తీర్పులోని మరొక కోణాన్ని కూడా నిశితంగా పరిశీలించాలి. దక్షిణాదిలో కర్నాటక మినహాయించి మిగిలిన రాష్ట్రాలలో మోడీ ప్రభావం పెద్దగా
ప్రతిబింబించలేదనే చెప్పుకోవాలి. కర్నాటకలో కూడా 2009లో భాజపా గెలిచిన 19 స్థానాలకు గాను ఈ ఎన్నికల్లో 17 మాత్రమే నిలబెట్టుకోవడానికి ఉపయోగపడింది. తెలుగునాట కాంగ్రెస్
భూస్థాపితం కావడానికి మోడీ గాలి కాదన్న విషయం సుష్పస్టమే. తెలుగు దేశంతో ఒప్పందం
లేకపోతే ఆ మూడు లోక్ సభ స్థానాలు కూడా భాజపాకు దక్కెవి కాదు. కష్ట కాలాలన్నింటిలో అండగా నిలబడిన తెలుగు జాతి గుండెను చీల్చి విశ్వాస
ఘాతుకానికి పాల్పడిన కాంగ్రెసు తెలుగునాట సమాధి అయ్యింది.
ఎమర్జన్సీ తరువాత 1977లో 6వ లోక్ సభకు జరిగిన
సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాపితంగా ప్రజలు కాంగ్రెసును చిత్తుచిత్తుగా ఓడించారు.
కానీ తెలుగు జాతి మాత్రం అక్కున చేర్చుకొని భారతీయ లోక్ దళ్ తరుపున నంద్యాలలో పోటీ
చేసిన ఒక్క నీలం సంజీవరెడ్డి గారిని మినహాయించి మిగిలిన 41 స్థానాలలో కాంగ్రెసును గెలిపించి ఊపిరి
పోసింది. 2004 ఎన్నికల్లో 29, 2009లో 33 స్థానాల్లో గెలిపించి డిల్లీ పీఠం కాంగ్రెసు కైవసం
కావడానికి కొండంత అండగా నిలబడింది. అలాంటి తెలుగు జాతి భవిష్యత్తును ప్రశ్నార్థకం
చేసిన కాంగ్రెసు ఫలితాన్ని అనుభవించింది. తమిళనాట భాజపా కూటమి ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టలేకపోయింది.
కేవలం ఒక్క కన్యాకుమారి స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. కేరళలో ఖాతాను
తెరవలేకపోయింది. తూర్పు భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ లో మతం కార్డును వాడుకొని, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించి సీట్లపరంగా ఒకటి నుండి రెండుకు మాత్రమే పెరిగినా ఓట్ల శాతాన్ని 6.14% నుండి
16.8% పెంచుకొని ఆ రాష్ట్రంలో మాత్రం తృణమూల్, ప్రత్యేకించి
వామపక్షాలకు పెద్ద సవాలు విసిరింది. ఒడిస్సాలో ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. దీన్నిబట్టి
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భాజపాకు బ్రహ్మరథంపడితే, మరికొన్ని
ప్రాంతాల్లో అంతగా ఆదరించ లేదని తేటతెల్లమయ్యింది.
మొత్తం మీద యు.పి.ఎ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలిచ్చిన
తీర్పును తనకున్న నాయకత్వ లక్షణాలతో మోడీ వడిసి పట్టుకోగలిగాడు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సాధారణ మెజారిటీ (272+) సంఖ్యకు చేరుకోగలమా! లేదా! అన్న అనుమానాల మధ్య ఎన్నికల సమరంలో సర్వశక్తులు
ఒడ్డి చమటోడ్చిన భాజపా నేతలను కూడా ఆశ్చర్య చకితులను చేస్తూ ఫలితాలు వెలువడ్డాయి.
సంఘ్ పరివార్ కూటమి, కార్పొరేట్ దిగ్గజాల పథకాలు నూటికి నూరుపాళ్ళు
సత్ఫలితాలనిచ్చాయి. భాజపా అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీష్ ఘర్ లాంటి రాష్ట్రాలలో విజయావకాశాలను
సుస్థిరం చేసుకొంటూనే హిందీ భాష మాట్లాడే ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని సంపాదించుకోవడం
ద్వారానే అధికారానికి రాగలమని భావించి తదనుగుణంగా ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా
రూపొందించుకొని అమలు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని 80 స్థానాలు, బీహార్ లోని 40 స్థానాలపై కేంద్రీకరించి గడచిన ఏడాదిగా క్షేత్ర
స్థాయి యంత్రాంగాన్ని సృష్టించుకొని చాప క్రింద నీరులా విస్తరించి, ప్రజలతో మమేకమై పని
చేశారన్న వార్తలు భాజపా విజయానికి ఏ విధంగా దోహదపడిందో బోధపడుతుంది. ప్రతి ఎన్నికల
బూతు స్థాయిలో ముప్పయ్ మందితో భాజపా కమిటి, దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ మరియు
విశ్వ హిందూ పరిషత్ లు సంయుక్తంగా మరొక కమిటీ, వాటిని సమన్వయం చేయడానికి,
అవసరమైన సమాచారాన్ని
చేరవేయడానికి "బ్లూ బ్రిగేడ్" అన్న పేరుతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న
వృత్తి నిపుణుల దళాలను రాష్ట్ర, జిల్లా, డివిజనల్ స్థాయిల్లో ఏర్పాటు చేసి, కంప్యూటర్లు, లాప్ టాప్స్, సెల్ ఫోన్స్ తదితర అత్యాధునిక సమాచార యంత్ర సామగ్రిని
సమర్థవంతంగా వినియోగించుకొన్నారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ కాలంలోనే వందలాది ఆర్.యస్.యస్. శాఖలు నూతనంగా నెలకొల్పబడ్డాయన్నవార్తలూ
వచ్చాయి.
ముస్లింల పట్ల భాజాపా వైఖరి ఏంటన్నది చెప్పకనే చెబుతున్న గణాంకాలను
పరిశీలించాలి. ఆ పార్టీ గెలుపొందిన 282 మందిలో ఒక్కరు కూడా ముస్లిం సభ్యుడు లేడు. ఎనభై
స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ లో దాదాపు ఇరవై శాతం జనాభా ఉన్న ముస్లింల నుండి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా భాజాపా తరుపున బరిలోకి
దింపలేదు. జాతీయ ప్రజాతంత్ర కూటమికి చెందిన మొత్తం 336 మంది పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు మాత్రమే భాజపా
మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ తరుపున బీహార్ రాష్ట్రం నుండి ఎన్నికైన చౌదరి
మహబూబ్ ఆలీ ఖ్వాయిసర్ ఉన్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాల దశ
కొనసాగుతున్నది. ఏకపార్టీ పాలనకు కాలం చెల్లిపోయిందన్న భావన బలపడుతున్న దశలో
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీని సాధించుకోవడం ద్వారా స్థిరమైన
పాలనకు ఇతరులపై ఆధారపడవలసిన అవసరం భాజపాకు లేకుండా పోయింది. సొంతంగా ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేయగల సాధారణ మెజారిటీ స్థానాలు రావడం వల్ల భాజపాకు కొత్త చిక్కులు వచ్చే
అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాషాయదళం అజెండాను అమలు చేయాలనే
వత్తిడి మోడీపై రోజు రోజుకు పెరుగుతుంది. అది యన్.డి.ఎ. కూటమి భాగస్వాములకు
ఇబ్బందికరంగా మారక తప్పదు.
తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానిస్తూ మోడీ తీసుకొన్న
చొరవ స్వాగతించతగ్గది. కానీ, శ్రీలంక దేశాధ్యక్షుడ్ని ఆహ్వానించడంపై తమిళనాడులోని భాజపా మిత్రపక్షాలతో పాటు అధికార పార్టీ అయిన
ఎఐఎడియంకె తో సహా
మరికొన్ని పార్టీలు నిరసన గళం వినిపించాయి. పాకిస్తాన్ ప్రధాన మంత్రిని
ఆహ్వానించడంపై యన్.డి.ఎ. కూటమిలో రెండవ పెద్ద పార్టీ అయిన శివసేన వ్యతిరేకించింది.
మోడీ రాకతో ముస్లిం దేశాలైన పాకిస్తాన్ మరియు బాంగ్లాదేశ్ లతో దౌత్యసంబంధాలెలా
ఉంటాయోనని ఆందోళన చెందుతున్న పూర్వరంగంలో ఇరుగుపొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను
పెంపొందించడానికి ఉపకరించే ప్రతి చిన్న ప్రయత్నం దేశానికి మేలు చేస్తుంది. వత్తిళ్ళకు లొంగకుండా దేశ విస్తృత ప్రయోజనాలకు, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు మోడీ ప్రభుత్వం
స్వదేశీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి విధానాలను అమలు చేస్తుందో వేచి చూద్దాం !
No comments:
Post a Comment